బాపట్లలో దారుణం: విచారణకు డి జీ పీ ఆదేశం

* కాలినడకన వస్తున్న కృష్ణా జిల్లా వాసిని వేధించిన బాపట్ల పోలీసులు * సమగ్ర విచారణ చేయాల్సిందిగా గుంటూరు రేంజ్ ఐ జీ కి ఆదేశాలు కృష్ణా జిల్లా, కైకలూరు కు చెందిన శ్రీనివాస్ తిరుపతి లో ఉద్యోగం చేస్తున్నాడు, లౌక్ డౌన్ కారణంగా తిరుపతి నుంచి కాలినడకన సోంత ఊరుకు వస్తున్న నెపధ్యంలో బాపట్ల పోలీసులు అరెస్టు చేసి, కోట్టడంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ స్టేషన్లో చెట్టు కు ఉరి వేసుకుని చనిపోయాడు, చనిపోయే ముందు సెల్ఫీవిడియో వాట్సాప్ లో స్నెహితులకు పంపించటం విషయం వెలుగులోకి వచ్చింది. బాపట్ల లో జరిగిన యువకుడి అత్మహత్య ఘటన పై సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తలపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. తక్షణమే సంఘటన  పై విచారణ కి ఆదేశించిన డీజీపీ. పూర్తి వివరాలతో  నివేదిక సమర్పించాలని గుంటూరు ఐ.జీ ని డి జీ పీ ఆదేశించారు.

స్వీయ నిర్భందమే శ్రీ రామ రక్ష

దేశంలో గత 12 రోజులుగా ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణమే. కరోనా వైరస్ సామాన్య ప్రజలను కబళిస్తుంటే ప్రభుత్వాలు అప్రమత్తమై దేశంలో ఎన్నడూ లేని విధంగా లాక్ డౌన్ విధించింది. మరికొన్ని రోజులు ఇలాంటి కర్ఫ్యూ వాతావరణం కొనసాగనుండటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోవడం ఒక్కటే కరోనా నియంత్రణకు మనముందున్న మార్గం. ఏ నోట విన్నా కరోనా మాట తప్ప మరే మాట వినపడటం లేదు. రోడ్లపైకి వస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాలు, వైద్యులు పదే పదే ప్రకటిస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడం మానేశారు. నిత్యం జనాల రద్దీతో దర్శనమిచ్చే అనేక పట్టణాలు, నగరాలు మూగబోయాయి. మందుల షాపులు నిత్యావసరాల దుకాణాలు తప్ప మరే ఇతర షాపులు తెరుచుకోవడం లేదు. కరోనా వైరస్ ప్రభావం అలయాలపైనా పడింది. భక్తులు నిత్యం ఆరాధించే భగవంతునికీ కరోనా కష్టాలు తప్పడం లేదు. 12 రోజులుగా కనీవినీ ఎరుగని రీతిలో ఆలయాలు మూసివేయబడి ఉన్నాయి. చివరికి నేడు సీతారాముల కల్యాణం సైతం ఆలయాలకు మాత్రమే పరిమితమై కేవలం పూజారుల సమక్షంలోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది.  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజా రవాణా నిలిచిపోయింది. నిత్యం వేలాది మంది ప్రయాణించే రైలు కూతలు వినపడటం లేదు. బస్సులు డిపోనలకే పరిమితమయ్యాయి. అంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ముగబోయాయి. షూటింగులు సైతం నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అడ్డాలుగా ఉన్న ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. పోలీసు స్టేషన్లలో వివిధ కేసులను ఛేదిస్తూ బిజీగా ఉండే పోలీసులు నేడు ప్రజలకు రక్షణగా రాత్రనక పగలనక రోడ్లపై జాగారం చేయాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయే పరిస్థితి ఎదురైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విదిస్తే.. కొందరు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చీటికీ మాటికి బయటకు వచ్చి కరోనా విజృంభించేలా చేస్తున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా వీరికి చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. మాకోసమే ప్రభుత్వం పని చేస్తుందన్న కనీస ఇంగితం లేకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. మే చివరి వరకు సరిపడా సరుకులు నిల్వ ఉంచామనీ, ప్రజలు ప్రతిదానికి రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని ప్రభుత్వం, అధికారులు మొత్తుకుంటున్నా వినడం లేదు. ఇకనైనా ప్రజలు ఆలోచించాలని తెలుగు వన్ న్యూస్ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2 వేలు దాటిపోయాయి. మరిన్ని కేసులు నమోదు కాకుండా ఉండాలంటే  స్వీయ నిర్బంధమే మనకు శ్రీ రామ రక్ష. మన ప్రాణాలను మనమే రక్షించుకుందాం.. కరోనాను తరిమి కొడదామని మరోసారి చేతులు జోడించి మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.

మన యువత భద్రమేనా?

శారీరకంగా దృఢంగా ఉండే యువతను కరోనా ఏమీ చేయలేదని ఇన్నాళ్లుగా ప్రపంచం భావిచింది. ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ కూడా అదే నమ్మింది. ఆ నమ్మకానికి కూడా ఇప్పుడు గండిపడినట్లే అని తెలుస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులే కరోనా బారిన అధికంగా పడుతుంటారని, నడివయసు లోపు ఉన్నవారిని ఆ వైరస్ ఏమీ చేయలేదని ఇన్నాళ్లు నమ్మేవాళ్లం. కానీ ఆ నమ్మకం కూడా ఇప్పుడు వమ్మయిపోయిన సూచనలు కనబడుతున్నాయి. యువతీయువకులపైన కరోనా తన ప్రతాపం చూపుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలో యువకులపై కరోనా పంజా విసురుతోంది. ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల వయసు వారిపైనే తన ప్రతాపం చూపుతోంది. దేశంలో కరోనా కేసులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటి వివరాలు ట్రాక్‌ చేస్తున్న ‘కరోనా ట్రాకర్‌’అనే వెబ్‌సైట్‌ పాజిటివ్‌ కేసుల వివరాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,751 కేసులు నమోదు కాగా.. 614 కేసులను విశ్లేషించింది. మిగిలిన కేసులకు సంబంధించిన వయసు, తదితర వివరాలు సమగ్రంగా లేకపోవడంతో 614 కేసులనే విశ్లేషించగలిగింది.  ఈ కేసుల్లో 20 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు 157 మంది ఉన్నారని తేల్చింది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు 129 మంది ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు 97, 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారు 96 మంది ఉన్నారు. 60 నుంచి 70 మధ్య వయసు వారు 72 మంది ఉన్నారని వెబ్‌సైట్‌ విశ్లేషించింది. అత్యంత తక్కువగా 80 నుంచి 100 ఏళ్ల మధ్య వయసు వారు ఏడుగురు కాగా, 10 ఏళ్లలోపు వారు 15 మంది ఉన్నారు. 70 నుంచి 80 ఏళ్ల వయసు వారు 18 మంది ఉన్నారు. 10 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారు 23 మంది ఉన్నారు.  అంటే అత్యంత ఎక్కువగా యుక్త వయస్కులకే కరోనా వ్యాపించిందని వెబ్‌సైట్‌ తెలిపింది. అయితే మరణాలు ఏ వయసు వారిలో ఎక్కువ ఉన్నాయన్న దానిపై విశ్లేషించలేదు. అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం 70 ఏళ్లు దాటినవారే అధికంగా మరణిస్తున్నారని తెలిపింది.  కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య నెల రోజుల్లో అనేక రెట్లు పెరిగాయని వెబ్‌సైట్‌ విశ్లేషించింది. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 1 నాటికి ఎన్ని కేసులు పెరిగాయో తెలిపింది. మార్చి 1 నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5 మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఆ సంఖ్య మార్చి 10వ తేదీ నాటికి ఏకంగా 48కు చేరాయి. మార్చి 20 నాటికి 199కి చేరాయి. మార్చి 31 నాటికి 1,619 కాగా, బుధవారం సాయంత్రానికి (ఏప్రిల్‌ 1 సాయంత్రం 6 గంటల వరకు) ఆ సంఖ్య 1,751కు, నేటికి 2065 కు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.  ఏప్రిల్ 1 వరకూ దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,751 కాగా, వారిలో 53 మంది చనిపోయారని వెబ్‌సైట్‌ తెలిపింది. అంటే దేశంలో మరణాల రేటు 3.03 శాతంగా ఉన్నట్లు తేల్చింది. తెలంగాణలో 100 మందికి కరోనా సోకగా, వారిలో ఇప్పటివరకు పదిమిందికి పైగా చనిపోయారు. అంటే దేశవ్యాప్త కరోనా మరణాల రేటు కంటే రాష్ట్రంలో దాదాపు రెట్టింపు.. అంటే ఆరు శాతం కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. ఇక కరోనా పాజిటివ్‌ వచ్చి కోలుకున్నవారు దేశంలో 155 మంది ఉన్నారు. అంటే రికవరీ రేటు 8.85 శాతం ఉన్నట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది.

కరోనా పట్టని జగన్ సర్కార్- సంక్షోభంలోనూ వరుస జీవోలతో హంగామా..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న పరిస్ధితుల్లో ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణ చర్యలకు ఉపక్రమిస్తుంది. ప్రజలను ప్రాణాంతక వైరస్ బారి నుంచి కాపాడేందుకు తగిన కార్యాచరణ సిద్దం చేసుకుంటుంది. దాన్ని క్షేత్రస్దాయిలో ఎలా అమలు చేయాలా అని నిరంతరం తపిస్తుంటుంది. కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఓవైపు కరోనా వైరస్ పట్టి పీడిస్తున్నా, కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా, రెండు మూడు జిల్లాల్లో కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అనధికారిక నివేదికలు చెబుతున్నా దీనిపై సీరియస్ గా దృష్టిపెడుతున్నట్లు కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా రోజురోజుకీ రాష్ట్రంలో బాధితులు పెరిగిపోతున్నారు. తొలుత విదేశీ ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని అంతా భావించినా, ఆ తర్వాత ఢిల్లీలో మత సమ్మేళనానికి వెళ్లిన వారి కారణంగా అది మరిన్ని రెట్లు ఎక్కువగా విస్తరించింది. ప్రస్తుతం రాష్ఠ్రంలో కరోనా బారిన వారి సంఖ్య అక్షరాలా 143, ఈ సంఖ్య ఎక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్ధితి. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి జగన్ తో పాటు అధికార యంత్రాంగం కూడా కరోనా చర్యలపై తప్ప మరో విషయంపై దృష్టిసారించలేని పరిస్దితి ఉండాలి. కానీ ఏపీలో మాత్రం అలా జరగడం లేదు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల కోసం అధికారులను నియమించిన ప్రభుత్వాధినేత జగన్, ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లు, అధికారులతో రెండు, మూడురోజులుకోసారి సమీక్షలతో కాలం వెళ్ల దీస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్రంలో పలు కీలక రాజకీయ అంశాలపై నిర్ణయాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. దీంతో ఇప్పుడు రాష్టంలో ఏం జరుగుతుదో తెలియక సామాన్యుడు కూడా గందరగోళంలో మునిగిపోవాల్సిన పరిస్దితి నెలకొంది. తాజాగా రాష్ట్ర్ర ప్రభుత్వం అమరావతిలో భూములపై ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ వేయడంతో పాటు తాజాగా ఇళ్ల స్ధలాల కోసం కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసే వరకూ గమనిస్తే ప్రభుత్వానికి కరోనాపై కంటే మిగతా అంశాలపై ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుంది. ఇదే కోవలో నిన్న విశాఖలో గతంలో టీడీపీ అకార్డ్ సంస్ధకు కేటాయించిన 120 ఎకరాల భూముల రద్దు జీవో జారీ వెనుక కూడా ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద ఏంటో తెలుస్తూనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా చర్యలపై సీరియస్ గా దృష్టిపెట్టాలని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కోరుతున్నారు.

సూర్యుని మేష సంక్రమణంతో, ఈ నెల 13 తర్వాత కరోనా తీవ్రత తగ్గుముఖం 

కరోన వైరస్ కి మూలకారణము కేతు గ్రహమనీ, సూర్యుని మేష సంక్రమణంతో, ఈ నెల 13 తర్వాత కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుందనీ జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. వాస్తవానికి -సూర్యుడు తులారాశినుండి వృశ్చిక రాశికి ప్రవేశించే కాలములో  ఈవైరెస్ జన్మించింది.అంటే, నిరుడు సెప్టేంబర్ అక్టోబర్ కాలములో జన్మించింది.కాని దానియొక్క తీవ్రత ఎవరికి తెలియలేదు. ఈ వైరస్ యొక్క తీవ్రత డిసెంబర్ 26 వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఆనగా ఆరు గ్రహాలు గురువు , శని, కేతువు, సూర్యుడు,చంద్రుడు, బుధుడు తో కూడుకున్నటువంటి ఆరుగ్రహాల కూటమి ధనుర్ రాశిలో ఏర్పడటము జరిగింది.ఈ షష్ఠగ్రహ కూటమి చాలా సాధారణముగా ఎప్పుడు జరగదు.ఈ షష్ఠగ్రహ కూటమి  ప్రపంచ వినాశనాన్ని సూచిస్తుంది.కాని ఒక వైరెస్ ద్వార ప్రపంచ వినాశనము జరుగుతుందని ఎవరు ఊహించలేక పోయారు.ఈ షష్ఠగ్రహ కూటమి ద్వార ఏర్పడిన వైరస్ క్రమముగా పెరుగుతూవచ్చింది. ఈ షష్ఠగ్రహ కూటమి నుండి చంద్రుడు త్వరగా  బయటకు వెల్లడము వలన పంచగ్రహ కూటమి ఏర్పడింది. నిరుడు డిసెంబర్ 31 వ తేదీన చైన కరోన వైరెస్ మాదేశానికి వ్యాపించిందని మొట్టమొదటి సారి ప్రపంచానికి తెలియచెప్పింది. ఆరోజు గ్రహస్థితి రాహువు ఆర్ద్రా నక్షత్రము మిథునములో ఉన్నారు. చంద్రుడు కుంభంలో ఉన్నారు శుక్రుడు మకరం లో ఉన్నారు.. ధనస్సురాశిలో గురువు శని కేతువు సూర్యుడు బుధుడు ఐదు గ్రహాలు కలసి వున్నాయి.ఈపంచగ్రహ కూటమి డిసెంబర్ లో జరిగింది. జనవరి 11 వ తేదీన చైనా తన దేశములో కరోన వైరెస్ తో మరణము సంభవించిందని తెలియజేసింది. జనవరి 23 వ తేదీన చంద్రుడు బుధుడు, శని సూర్యుడు ధనస్సురాశి నుండి మకరరాశి లోకి ప్రవేశించాయి.  గురువు కేతువు ధనస్సు రాశిలో మిగిలి పోయాఋ. . ఈ గురువు కేతువు కలయిక వలన  ఈ వైరస్ ప్రపంచవ్యాప్తమయిపోయింది. గురువు మంచి గ్రహము అయినప్పటికి, కేతువు కలయిక వలన ఈవైరెస్ ప్రపంచమంతా తెలిసింది.దీనితో పాటు శని సూర్య కలయిక వలన మృత్యుప్రళయము మొదలయింది.దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవిడ్ 19 అనే పేరుని సూచించింది. శని సూర్యులు వైర గ్రహాలు. ఫిబ్రవరి 8 వ తేదీన కుజ కేతు గురు కలయిక వలన ఈ వైరెస్ ప్రపంచమంత పెనుదుమారముగా మారింది.గురువు కేతువులతో కుజుడు కలవడము వలన కుజగ్రహ కలయిక ప్రభావముతో ప్రపంచమంతా భీభత్సముగా మారింది. ఫిబ్రవరి 18 వ తేది నుండి మార్చి 5 వ తేది మద్యలో రాహువు కేతువు మధ్యలో సప్తమ గ్రహాలు చేరి  కాలసర్ప దోషం ఏర్పడింది.మండుతున్న నిప్పులో ఆజ్యం పోసినట్టుఅయింది.కాలసర్పస్థితి ప్రపంచమంతా ఏర్పడింది.ఈ మధ్య కాలములో మానవాళికి ఉపయోగపడే శుభగ్రహాలు వాటి ప్రభావాన్ని కోల్పోవడము జరిగింది. మంచి చేసే గ్రహాస్థితులు కాలసర్ప దోషం వలన వాటి ప్రభావాన్ని కోల్పోవడము జరిగింది.దీని ప్రభావము వలన ప్రపంచమంతా లాక్ డౌన్ ప్రకటించింది.జనజీవనము స్తంభించడమూ జరిగింది .భారతదేశము ఆధ్యాత్మిక దేశమయినందున,  భగవద్ ఆనుగ్రహము వలన దీనిప్రభావము తక్కువగా ఉంది. ఈ యొక్క కరోన వైరెస్ జ్యోతీష్య శాస్త్ర ప్రకారము తగ్గుముఖం పట్టేది ఎప్పుడంటే, మార్చి 24 నాడు ఉగాది ఈ ఉగాది గ్రహస్థితులు గురువు కేతువు ధనస్సురాశిలోనే వున్నారు. కుజుడు గురువుకేతువులను వదిలిపెట్టి మఖరరాశిలోకి ప్రవేశిస్తున్నారు.సూర్యుడు కూడ మారడము వలన మృత్యువు అనేది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది.కుజుడు గురుకేతువులను వదిలిపెట్టడము వలన దీని ప్రభావము కొంత తగ్గుముఖం పడుతుంది.కాని పూర్తిగా తగ్గదు.కాని కొంత ప్రశాంతతను ఇస్తుంది. మార్చి 30 వ తేదీన కేతువుని గురువు కూడ వదిలిపెట్టడము వలన  కేతువు ఒంటరివాడు అవుతాడు. దీనివలన గ్రహ స్థితులు అన్ని అనుకూలముగా మారుతాయి.దీనివలన జనాలలో అవగాహన పెరగడము, కొద్దికొద్దిగా ఈ వైరెస్ తగ్గడము, భయాందోళనలు తగ్గుముఖం పడతాయి. కాని పూర్తిగా నిర్మూలన కాదు. ఈ వైరెస్ గురించి పూర్తిగా భయాందోళనలు తగ్గాలంటే ఏప్రిల్  13వ తేదీ వరకూ ఆగవలసిందే. దీని వల్ల సూర్యగ్రహం మీనరాశి నుండి మేషసంక్రమణము చెందుతుంది. ఫలితంగా సూర్యగ్రహం బలపడి వ్యాధులన్నీ  దూరమయి ఆ సమయానికల్లా  మందులు అందుబాటులోకి వచ్చి ఈ వైరెస్ తగ్గుముఖం పడుతుంది. మామూలు పరిస్థితులు వస్తాయని జ్యోతిష్యుల లెక్క. ఆ శుభ  సమయం కోసం వేచి చూద్దాం.

జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు విత్‌డ్రాపై కేంద్రం ఆంక్షలు

జన్‌ధన్‌ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీగా గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు. ఖాతా చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 3న నగదు ఉపంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. అలాగే, ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవాళ్లయితే ఈ నెల 4న , ఖాతా చివరన 4 లేక 5 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 7న,   అలాగే, ఖాతా చివరన 6లేక 7 సంఖ్య ఉన్నవాళ్లయితే ఈ నెల 8న ,ఎనిమిది లేదా 9 అంకె ఉన్నవాళ్లు అయితే ఈ నెల 9న నగదును ఉపసంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 9 లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తర్వాతైనా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.  కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఖాతాల్లో 3 నెలల పాటు రూ.500 చొప్పున  జమచేస్తున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో జన్‌ధన్‌ఖాతాదారుల సంఖ్య 1,18,55,366 ఉండగా, తెలంగాణలో 52,23,218 మంది ఖాతాదారులు ఉన్నారు.

రేపటి నుంచి విశాఖలో కఠిన ఆంక్షలు

రేపటి నుండి జిల్లాలో కఠిన ఆంక్షలు ఉంటాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఉదయం  6 నుండి 9 వరకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి ఉంటుందనీ, పచారి షాపులు,  పళ్లుమార్కెట్, రైతు బజార్లు,   మార్కెట్ కి మాత్రమే సాయం 6 నుండి 9 వరకే తెరిచి ఉంటాయని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి. ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి. ఉదయం 7 నుండి సాయంత్రం 7  వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి, ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ ,  వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ చెప్పారు.  ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు,  ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి ఉంటుందనీ, జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్,  ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్,  రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్,  ఫుడ్ కోర్ట్స్,  ఐరన్ & స్టీల్ షాప్స్,  గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్,  పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ,  ఓపెన్ కు అనుమతి లేదని, పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దని,  నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

ఊరిపేరు సిద్ధాంతం..జరిగిందేమో రాద్ధాంతం!

కరోనా టైం లో  కోడల్ని గెంటేసిన అత్తింటి వారు! పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో దారుణం జరిగింది. కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటివేసి తాళాలు వేసుకున్న అత్తింటి వారి వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. దీంతో అత్తింటి వారి ఎదుట కోడలు ఆందోళన మొదలెట్టింది.  నెల క్రితం భర్త గోడి రవికుమార్ చనిపోవడంతో అత్తింటి వద్దే ఉంటున్న కోడలు గోడి వెంకటలక్ష్మి. చనిపోయి నెలరోజులయ్యింది కాబట్టి గుమ్మం దాటి వెళ్లి రమ్మని చెప్పి తీరా వెళ్లిరాగా ఇంటికి తాళాలు వేసి బయటికి పొమ్మన వైనం. తనను ఇంట్లోకి తీసుకువెళ్ళేవరకూ ఇక్కడే ఉంటానని చెప్పి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న వెంకటలక్ష్మి. గ్రామసచివాలయంలోనూ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన కోడలు వెంకటలక్ష్మి. కరోనా కారణంగా లాక్డౌన్ ఉండటంతో ఎటుళ్ళాలో తెలియని దయనీయ స్థితిలో ఉన్న వెంకటలక్ష్మి. అయితే, ఇంతవరకూ పోలీసులు స్పందించలేదు.

ఉద్రిక్తంగా మారిన పెన్షన్ పంపిణీ...

విజ‌య‌న‌గ‌రంలో పెన్ష‌న్ పంపిణీ లో వాలంటీర్‌లు చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. ఇదేమిట‌ని అడిగితే చావుదెబ్బ‌లు త‌ప్ప‌టం లేదంటున్నారు వృద్ధులు. వేలు ముద్రలు వేయించుకొని డ‌బ్బులివ్వ‌లేద‌ని ఓ వృద్ధురాలు ఆరోపించింది. విజయనగరం జిల్లా జామి మండలం పావాడలో పెంక్షన్ పంపిణీలో అవకతవకలు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వేలుముద్రలు వేయించుకొని డబ్బులివ్వలేదని వృద్ధురాలు ఆరోపించి అడిగినందుకు వృద్దులపై  వాలంటీర్ దౌర్జన్యం చేయ‌డంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ఈ సంద‌ర్భంగా కొట్లాట జ‌రిగింది. పెన్ష‌న్ కోసం మహిళలు  వాలెంటీర్ల మ‌ధ్య గొడ‌వ రోడ్డు కెక్కింది.

క‌రోనా సంగ‌తేమో, పోలీసు దెబ్బే చుక్క‌ల్ని చూపిస్తుంది!

తెలంగాణా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఇది డిపార్ట్‌మెంట్ నినాదం. ఆచ‌ర‌ణ‌లోనూ అలానే వున్నారా? రూల్స్ అతిక్ర‌మిస్తే ఫైన్ వేయండి. ఇంటికి నోటీస్ పంపండి. అంతే కానీ ఈ కొట్టుడు ఏంటి?  నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో పోలీసులు అమానుషంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కన్న కొడుకు ముందు  లాఠీలతో బాదుతున్న దృశ్యం హ్రుదయ విదారకంగ ఉంది. వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో ఓ వ్యక్తిని కన్న కొడుకు ముందే చితక బాధారు. లాఠీలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ పరుష పదజాలం వాడారు. ఐదారుగురు పోలీసులు ఒక వ్యక్తిని చుట్టుముట్టి కింద పడేసి మరీ దారుణంగా హింసించారు. ఆ వ్యక్తి కొడుకు వదలండి అంకుల్ ఫ్లీజ్ అంటున్నా ఏ మాత్రం కనికరించలేదు.  ఆ వ్యక్తితోపాటు ఆ పిల్లాన్ని కూడా పోలీసు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు.  దురుసుగా ప్రవర్తిస్తూ.. నోటికి వచ్చిన బూతులు తిడుతూ.. ఆ పిల్లాడితో సహా ఇద్దరిని అరెస్టు చేసి కారులోకి నెట్టి తీసుకెళ్లారు. ఈ  ఆక్రందనలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  కొంతమంది పోలీసుల‌ ప్రవర్తనతో మిగ‌తా పోలీసులంతా బ‌ద‌నాం అవుతున్నారు. అమాయ‌క ప్ర‌జ‌ల‌పై జులుం చేసే వారికి గుణ‌పాఠం నేర్పేలా ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారా? పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ నిర్ణ‌యం ఏమిటో?

గొడుగుతో క‌రోనాను క‌ట్ట‌డిచేయ‌వ‌చ్చ‌ట‌!

కరోనా బారిన పడకుండా ఉండేందుకు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు మరో చిట్కా చెబుతున్నారు. సోషల్ డిస్టెంన్స్ పాటించమంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. అయితే ఆ సూచన మేరకు దాన్ని అమలు పరచాలంటే ప్రతి ఒక్కరు గొడుగు ఉప‌యోగిస్తే ఒకరికొకరు కనీసం మీటరు దూరం పాటించినట్లవుతుందని ఆయన సలహా ఇస్తున్నారు.  ఎదుటి వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము వంటి వాటి నుంచి వచ్చే తుంపర్ల బారిన పడకుండా గొడుగు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. వ‌ర్షం, ఎండ నుంచే కాదు వైర‌స్ బారిన ప‌డ‌కుండా గొడుగు ర‌క్షిస్తుంద‌ట‌. అయితే గొడుగు వేసుకుని బయటకు వెళ్లి వచ్చిన వెంటనే దాన్ని ఎండలోనే కొద్ది సేపు ఉంచి లోపల పెడితే మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు. చేతులు కడుకున్నాం, మాస్క్ పెట్టుకున్నాం, ఇదేదో గొడుకు కూడా వాడుదాం. టైం అలా వుంది. ఏం చేస్తాం మ‌రి! డెడ్లీ వైర‌స్‌....

ఒంటిమిట్టలో నిరాడంబరంగా బ్రహ్మోత్సవాలు 

కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో భక్తులకు అనుమతి నిరాకరించగా, అర్చకుల సమక్షంలో గురువారం నాడు ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. ఆపై ఆగమశాస్త్ర ప్రకారం, పుట్టమన్నును తీసుకుని వచ్చి, బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఉదయం 9 గంటల సమయంలో ధ్వజారోహణం నిర్వహించిన అర్చకులు, రాత్రి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహించారు.  7వ తేదీ రాత్రి, పున్నమి వెన్నెల కాంతుల్లో స్వామివారి కల్యాణాన్ని కూడా పరిమిత సంఖ్యలో హాజరయ్యే పూజారులు, అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని ఆలయ డిప్యూటీ ఈఓ వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు కిక్కిరిసిపోయే ఒంటిమిట్ట, ఇప్పుడు భక్తులు కనిపించక బోసిపోయింది. 

ఆంధ్రలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల తబ్లీగ్ జమాతే పుణ్యమే: జగన్ మోహన్ రెడ్డి 

*వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ *వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు *ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌ కోవిడ్‌ –19ను ఎదర్కోవడంలో రాష్ట్రంలో సమగ్ర విధానానలు అనుసరిస్తోందని ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో 2012 నాన్‌ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులను నెలకొల్పా మన్నారు.13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కోవిడ్‌ –19 వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించా మన్నారు. 10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్‌ ఈ ఆస్పత్రుల్లో సిద్ధం చేశామని సి ఎం చెప్పారు. మొత్తంగా 1000 ఐసీయూ బెడ్లను సిద్ధంచేశామాన్నారు. దీనికి తోడుగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్‌ కోసం మరో 20వేల బెడ్లను రెడీగా ఉంచామని చెప్పారు. అంతేకాక క్షేత్రస్థాయిలో నిరంతరం గట్టి పర్యవేక్షణ చేస్తున్నామాన్నారు.  ఫిబ్రవరి 10 నుంచి ఇప్పటివరకూ 27,876 మందికిపైగా విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చారని,  వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మందికాగా  17,336 మంది రూరల్‌ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని సి ఎం చెప్పారు. వీరిని తరచుగా కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగిన వారు, వీరి కుటుంబ సభ్యులు... అంటే మొత్తంగా ప్రైమరీ కాంటాక్ట్స్‌ 80,896 మంది ఉన్నారని సి ఎం చెప్పారు. వీరందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఉన్నారన్నారు. కోవిడ్‌ –19 లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే చేసినట్టు సి ఎం చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికి రెండు సర్వే చేశాం: ఢిల్లీలో తబ్లీగీ సమాతే సదస్సుకు హాజరైన వారిని గుర్తించి వారి క్వారంటైన్‌కు తరలించామాన్నారు. వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించండం, మంచి వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామాన్నారు: తబ్లిగీ జమాతేకు హాజరైన 1085 మంది ఇలా గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయిస్తున్నామని సి ఎం చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 132 మందికి కోవిడ్‌ –19 సోకిందని, ఇందులో 111 మంది తబ్లీగ్‌ జమాతేకు వెళ్లిన వారేనని, 91 మంది తబ్లీగ్‌జమాతేకు వెళ్తే, మరో 20 మందికి కాంటాక్ట్‌ కావడంద్వారా ఈ వైరస్‌ సోకిందని వివరించారు.

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

కడప జిల్లా ఒంటిమిట్టలో ప్రసిద్ద శ్రీ కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా మొదటి రోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఏకాంతంగా బుధవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమం టీటీడీ అధికారులు నిర్వహించారు. చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అంకురార్పణ తో పుట్టమన్ను సేకరణ తో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం కార్యక్రమం తో బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 6నుంచి 6.30 లోపు ఏకాంతగా పూజలు జరుపనున్నారు. ఏడవ తేదీ సాయంత్రం స్వామి వారి కళ్యాణం  వేడుకగా నిర్వహించనున్నారు. ఈ పది రోజుల పాటు ఆలయం లోపల వాహన సేవలు,కల్యాణం భక్తులకు ప్రవేశం లేకుండా కేవలం టీటీడీ అధికారులు, అర్చకులు, మంగళ వాయిద్యాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

నిజాముద్దీన్ లెక్క తేల్చిన ఢిల్లీ పోలీసులు!

ఢిల్లీ మర్కజ్‌ మసీదులో జ‌రిగిన మూడు రోజుల కార్య‌క్ర‌మంలో మొత్తం 1,830 మంది హాజరు కాగా వీరిలో 16 దేశాలకు చెందిన 281 మంది విదేశీయులని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఇండోనేషియా 72, శ్రీలంక 32, మయన్మార్‌ 33, కిర్గిస్థాన్‌ 28, మలేసియా 20, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల నుంచి తొమ్మిది మంది చొప్పున, థారులాండ్‌ 7, ఫిజీ 4, ఇంగ్లాండ్‌ 3, ఆప్ఘనిస్థాన్‌, అల్జీరియా, జైబూటీ, సింగపూర్‌, ఫ్రాన్స్‌, కువైట్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 711 మంది, తమిళనాడు నుంచి 501, అసోం 216, ఉత్తర ప్రదేశ్‌ 156, మహారాష్ట్ర 109, మధ్యప్రదేశ్‌ 107, బీహార్‌ 86, పశ్చిమ బెంగాల్‌ 73, తెలంగాణ 55, జార్ఖండ్‌ 46, కర్ణాటక 45, ఉత్తరాఖండ్‌ 34, హర్యానా 22, అండమాన్‌ నికోబార్‌ దీవులు 21, రాజస్థాన్‌ 19, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఒడిశాల నుంచి 15 మంది చొప్పున, పంజాబ్‌ 9, మేఘాలయ నుంచి ఐదుగురు ఈ ఇస్త‌మాలో పాల్గొన్నట్లు గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదులో ప్రార్థనలకు హాజరైన తమ రాష్ట్ర వ్యక్తులను గుర్తించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్‌ తోపే అధికారులను ఆదేశించారు. ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన పర్యటనను రద్దు చేసుకొని మంగళవారం రాష్ట్ర రాజధాని చేరుకున్నారు. నిజాముద్దీన్‌ పాజిటివ్‌ కేసుల కలకలం నేపథ్యంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

కార్పోరేట్ సేవ‌లో క‌రోనా ప్యాకేజ్! ట్రంప్ నిర్ల‌క్ష్యానికి పారాకాష్ట‌!

గాంధీ ఆసుప్ర‌తిలో రోగి బంధువులు డాక్ట‌ర్ ను కొడితే, అమెరికాలో వైద్య సిబ్బందిని దొంగ‌లంటూ అధ్య‌క్షుడు ట్రంప్‌యే ఆడిపోసుకుంటున్నాడట‌. మాస్కులను ఆసుపత్రులు, వైద్య సిబ్బంది దొంగిలించడం వల్లే వీటికి కొరత ఏర్పడిందని ట్రంప్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. యుద్ధ రంగంలో ముందుండి పోరాడుతున్న సైనికులను కమాండర్‌ నిందించి కూర్చొన్నట్లుగా ఉంది ట్రంప్‌ తీరు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్‌ వర్కర్లకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, గౌనులు, టెస్టింగ్‌ కిట్లు, రెస్పిరేటర్లు, శానిటైజర్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచేందుకు నిర్దిష్ట చర్యలేవీ తీసుకోవ‌డం లేదు. పైగా వారిని దొంగలుగా చిత్రించే ప్రయత్నం చేశాడు.  కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో చైనా అనుభవం నేర్పిస్తోంది. అలాగే ఎలా ఎదుర్కోకూడదో అమెరికా అనుభవం గుణ‌పాఠం నేర్పుతోంది.  ట్రంప్  నిర్లక్ష్యానికి అమెరికాలో 2,13,003 కేసులు నమోదు కాగా 5 వేలకు పైగా మృత్యు వాత పడ్డారు.  అమెరికాలో క‌రోనా కాటుకు జ‌నం బ‌లి అవుతుంటే ట్రంప్ ఏమో కార్పోరేట్ కంపెనీల సేవ‌లో త‌రిస్తున్నాడ‌ట‌. క‌రోనా ప్యాకేజ్ కూడా వారికే అర్పిస్తున్నాడ‌ట‌. కరోనా ప్రమాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ), ఆరోగ్య రంగ నిపుణులు చేసిన హెచ్చరికల్ని ట్రంప్ ప‌ట్టించుకోలేదు. కరోనా మహమ్మారి అంతమయ్యేలోపు అమెరికాలో 2 లక్షల మందిని అది బలిగొంటుందని ప్రముఖ వైద్య నిపుణులు, అమెరికాలోని అలర్జీ, అంటువ్యాధుల జాతీయ పరిశోధనా సంస్థ డైరక్టర్‌ అంథొనీ ఫౌసి చేసిన హెచ్చరికను ట్రంప్ నిర్ల‌క్ష్యం చేశారు. నిరుద్యోగం కనివిని ఎరుగని రీతిలో 32.7 శాతానికి చేరుకోనున్నదని ఆర్థిక వేత్తల అంచనా.  చరిత్రలో ఇదొక అసాధారణ పరిస్థితి. ట్రంప్‌ ప్రభుత్వం మొదట ఇదంతా మీడియా సృష్టి అని, గోరంతలు కొండంతలు చేసి చూపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందంటూ సమస్య తీవ్రతను గుర్తించేందుకు నిరాకరించారు. ఫలితంగా కరోనా అమెరికాలోని యాభై రాష్ట్రాలకు విస్తరించింది. అమెరికా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌ సిటీ కరోనాకు కేంద్ర స్థానంగా మారింది.  కరోనాపై పోరు పేరుతో 2.2 లక్షల కోట్ల డాలర్లతో తీసుకొచ్చిన ప్యాకేజీలో సింహభాగం ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌, స్పేస్‌, హోటల్‌ పరిశ్రమకే దక్కనుంది. కార్పొరేట్లు, కుబేరుల డబ్బుతో అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్‌ పార్టీ కి,  ఈ సంక్షోభాన్ని తన కార్పొరేట్‌ మిత్రులకు వరంగా మార్చడమెలా అన్నదే  ధ్యేయమైపోయింది.

కుక్క, పిల్లి మాంసం తినడంపై నిషేధం!

చైనావాళ్ళ‌కు ఇప్పుడు బుద్ధి వ‌చ్చిన‌ట్లుంది. అందుకే కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో త‌మ అల‌వాట్లు మార్చ‌కోవ‌డంపై దృష్టిపెట్టారు.  అందులో భాగంగా చైనా దేశంలోని షెన్‌జెన్ నగరం మొట్టమొదటిసారి కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం పిల్లులు, కుక్కలతో పాటు పాములు, బల్లులు, రక్షిత వన్యప్రాణులను తినడాన్ని నిషేధించారు. పాములు, బల్లులు, కుక్కలు, పిల్లులతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగాన్ని షెన్‌జెన్ నగరంలో నిషేధించారు. చైనాలోని వూహాన్ నగరంలో జంతువధశాల కేంద్రంగా కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో షెన్‌జెన్ నగరం కుక్కలు, పిల్లుల మాంసం తినడాన్ని నిషేధించింది.  తైవాన్, హాంకాంగ్ దేశాల్లో కూడా కుక్కలు, పిల్లులను తినడాన్ని నిషేధించారు.  అయితే ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్దలను ఈ నిషేధం నుంచి మినహాయించారు.