ఇక సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు!

హైదరాబాద్ నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీలో మంగళవారం నుంచే క‌రోనాపరీక్షలు నిర్వహించ‌నున్నారు. కేంద్ర మెడికల్ రీసెర్చ్ నుంచి సోమవారం సీసీఎంబీకి ఆదేశాలు జారీ కావ‌డంతో మంగళవారం నుంచి కరోనా టెస్టులు చేయడానికి సీసీఎంబీ సిద్ధమవుతోంది. గాంధీ ఆసుపత్రి నుంచి సీసీఎంబీకి శాంపిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ 800 నుంచి 1000 కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో సీసీఎంబీ వుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా పరీక్షల కిట్లను అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఇటీవ‌ల వెల్లడించింది. కచ్చితమైన ఫలితాలు ఇచ్చే ఈ కిట్లను చౌక ధరకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కిట్‌ ధర వెయ్యి రూపాయ‌ల‌లోపే ఉండేలా కిట్లు రూపొందించ‌డానికి పరిశీలిస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ కుమార్‌ మిశ్రా అన్నారు.

మ‌ద్యం దుకాణాలు తెర‌వం! వ్య‌స‌న‌ప‌రుల‌కు PHC సెంటర్లలో చికిత్స!

ఎవరైనా మద్యానికి వ్యసనమైన వ్యక్తులు మరీ ఎక్కువగా ఆందోళనకు గురైతే రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎక్సైజ్ CI లు మరియు SI లు ఇలాంటి వ్యక్తులను గుర్తించి వారికి మానసిక వేదనకు గురికాకుండా సరైన అవగాహన కల్పించి అవసరమైతే వారికి దగ్గర్లో ఉన్న  PHC సెంటర్లకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లి వారికి చికిత్స జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. మద్యం వ్యసనంగా వున్న వ్యక్తుల కుటుంబాలకు ఆ వ్యక్తులపై ఎక్కువ దృష్టి పెట్టి మనసు మరల్చడానికి యోగ వంటి ఆసనాలు, ద్యానం, వ్యాయామం, ఆద్యాత్మిక చింతన, కుటుంబ సభ్యులతో ఇతరత్రా ఆటలు చెస్, క్యారమ్స్ వంటి ఆటలను ఆడటం వలన మంచి మానసిక శక్తి నిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం వారితో గడపాలని సూచించారు.   ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేతపై కృతనిశ్చయంతో వున్నందున సంబందిత అధికారులు తగు చర్యలు తీసుకొని, మద్యం దుకాణాల బంద్ ను అమలుచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కరోన నిర్మూలించడానికి ఇచ్చిన ఆదేశాలను సమార్దవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు  వి. శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ కమిషనర్, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్లు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సోమ‌వారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమీక్ష సమావేశంలో కరోన కారణంగా లాక్ డౌన్ సమయంలో అన్ని మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యానికి వ్యసనంగా మారిన కొందరు వ్యక్తులు మానసికంగా ఆందోళనకు గురైతు వింతగా ప్రవర్తించడం వంటి విషయాలపై చర్చించారు.

ఏపీ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 7,060 మందిపై కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన  7,060 మందిపై కేసులను నమోదు చేసినట్టు రాష్ట్ర డి జి పి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. బెజవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డి జి పీ గౌతమ్ సవాంగ్ లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. " ప్రజలకు చాలా వరకు అవగాహనవచ్చింది.ఇప్పటికే ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు.ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం.విదేశాలు నుండి తిరిగి వచ్చే వారిపై నిఘా చేపట్టాం," అని డి జి పీ ఇచ్చారు.  ఇప్పటి వరకు 22 వేలమందిని గుర్తించామని చెప్పిన డి జి పీ, నిత్యావసరవస్తువులు రవాణా చేసే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇచ్చినట్టు, పోలీసు ఫ్యామిలీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.  హోమ్ డెలివరీ సిస్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ లో 55 సం.లు పైబడినవారికి హై రిస్క్ డ్యూటీలు లేకుండా ఆఫీసులో ఉండేలా చూడాలని సూచించామన్నారు గౌతమ్ సవాంగ్.

మాజీ సర్పంచ్ దంపతుల ఔదార్యం!

కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో ఓ సర్పంచ్ ల జంట ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలబడాలని ప్రతిన బునింది.అందుకు అనుగుణంగా తమ గ్రామంలో వైరస్ ను కట్టడి చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ధాన్యాన్ని దానంగా ఇవ్వాలని సంకల్పించారు. సూర్యపేట జిల్లా హుజుర్నగర్ మండలంలోని బురుగడ్డ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ దేశముఖ్, రాధిక అరుణ్ కుమార్ దేశముఖ్ ల దంపతులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఊరు వాడ స్వాగతిస్తుంది. వరుసగా 10 సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు భర్త అరుణ్ కుమార్ దేశముఖ్ ఆ తరువాత ఐదు సంవత్సరాలు భార్య రాధిక అరుణ్ కుమార్ దేశముఖ్ లు సర్పంచ్ లు గా వ్యవరించిన ఆ గ్రామంలో పారిష్యుద్య కార్మికులు పడుతున్న శ్రమ ను గుర్తించి ఒక్కొక్కరికి బస్తా ధాన్యం దానం చెయ్యాలని నిర్ణయించారు.  అనుకుందే తడవుగా తమ కల్లాల వద్దనే ఆ ధాన్యాన్ని పారిష్యుద్య కార్మికులకు అందించే విదంగా వారిని అక్కడికే పిలిపించి ధాన్యాన్ని అంద జేశారు.అరుణ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతించడం తో పాటు విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండడం తో పాటు ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు.

బాధ్యతగా చేయూతనిద్దాం! ఇంటి వద్దకే ఆహారం అందిద్దాం!

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న సందర్భంలో లాక్ డౌన్ సమర్థంగా అమలయ్యేలా చూసేందుకు సామాజిక బాధ్యతగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఐదుగురు ఆహారం అందించే ప్రణాళికలో ముందుకు సాగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జీ లతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న  కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని, కట్టడి చేసేందుకు పేద, బడుగు, సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహార సమస్య తలెత్తకుండా చూసుకోవాల్సిన సామాజిక బాధ్యత బిజెపి కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. అందుకు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, నగరాలు, పట్టణాల, మండలాల వారీగా ప్రణాళికాబద్ధంగా నిరుపేదలకు వలస కూలీలకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలను అందించే బాధ్యతను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రపదాధికారులకు, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  బిజెపి జాతీయ అధినాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశానుసారం  కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, నిర్మూలించేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వ్యక్తిగతంగా ఫోన్లో సంభాషించి కార్యక్రమాల అమలు తీరుపై దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల అమలు తీరుపై ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి నివేదికలు సమర్పించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

కోవిడ్ 19 అత్యవసర పాస్ మంజూరుకు ప్రభుత్వం సన్నాహాలు

* అత్యవసర సేవలలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల కోసం ఏర్పాటు * మొబైల్ ఫోన్లో క్యూర్ కోడ్, చెక్ పోస్టుల వద్ద స్కానింగ్ : హిమాన్హు శుక్లా కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ అమలవుతుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రైవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్ ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన అదేశాలు చేయగా, అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా కోవిడ్ -19 అత్యవసర పాస్ ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసం జారీ చేస్తారు.  వ్యవసాయ, సహకార (MKTG II) జారీ చేసిన జిఓ ఆర్ టి నెంబర్ 289 లో జాబితా చేర్చబడిన వస్తు సేవల ఉత్పత్తి,  సరఫరాలో నిమగ్నమై ఉన్న వారందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులే.  పాస్ కోసం సంస్థ యజమాని తనతో సహా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంస్థ సిబ్బందిలో ఇరవై శాతం మాత్రమే పని చేయడానికి అర్హులు అయినందున కనిష్టంగా 5, గరిష్టంగా ఇ-పాస్ జారీ నిబంధనలు,  షరతులకు లోబడి మంజూరు చేస్తారు.  ఈ పాస్ ల కోసం కరోనా వ్యాధి నివారణ సేవలలో ఉన్న వారంతా దరఖాస్తు చేయనవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, నిర్ణీత సమయంలో (ఉదయం 6 నుండి 11 వరకు) అవసరమైన వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి వెళుతున్న సాధారణ ప్రజలు, తదనుగుణ వస్తు రవాణా వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసే రైతులకు ఈ పాస్ తో పని లేదు. మరోవైపు పాస్ పొందేందుకు సైతం ఎవ్వరూ కార్యాలయాలకు రానవసరం లేదని దీనిని పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి , చేనేత, జౌళి శాఖ సంచాలకులు హిమాన్హు శుక్లా తెలిపారు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తి చేయవఛ్చని, https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్పందన పోర్టల్ వెబ్‌లింక్ (https://www.spandana.ap.gov.in/) ద్వారా  కూడా పాస్ పొందగలుగుతారన్నారు. జిల్లా కంట్రోల్ సెంటర్ ఛైర్మన్,  సంయిక్త కలెక్టర్ దరఖాస్తును పరిశీలించి ఆమోదము, తిరస్కరించే అధికారం కలిగి ఉంటారన్నారు. నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్ ను ప్రత్యేక  QR కోడ్‌తో SMS ద్వారా ఉద్యోగి మొబైల్ నంబర్ కు పంపుతామని, వెబ్-లింక్ క్లిక్ చేసినప్పుడు QR కోడ్‌తో సహా పాస్ కనిపిస్తుందని వివరించారు.  చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్ రీడర్ అందిస్తామని, తద్వారా పోలీసు అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. భధ్రతా ప్రమాణాల పరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్న హిమాన్హు శుక్లా ఈ పాస్ కు పాస్లో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉందని,  చెక్ పోస్టులలోని పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటమే కాక,  అత్యవసర పాస్ యొక్క నిజాయితీని ధృవీకరించడానికి మొబైల్ అనువర్తనానికి అనుగుణమైన మెకానిజం ఉందని హిమాన్హు శుక్లా వివరించారు.  ఎలాంటి ఫోర్జరీ, దుర్వినియోగంకు అవకాశం లేదన్నారు. పాస్ కోసం దరఖాస్తు చేసిన వారు  తమ ఇబ్బందులను నమోదు చేసుకోవడానికి 1902కు పిర్యాధు చేస్తే అవి జాయింట్ కలెక్టర్‌కు దృష్టికి వెళతాయన్నారు.

వ‌ల‌స‌కూలీల‌పై  స్ప్రే చేసి శుద్ది చేశార‌ట‌!

నిరుపేద‌ల‌పై నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించారు. యూపీలో ఈ దారుణం జ‌రిగింది. ఇత‌ర రాష్ట్రాల్లో ఇరుక్కుని వున్న వ‌ల‌సకూలీల‌ను బ‌స్సులు పెట్టి పిలిపించుకున్నారు. అంత వ‌ర‌కు బాగానే వుంది. అయితే వ‌చ్చిన వారిని రోడ్డు మీదే కూర్చోబెట్టి మ‌నుషుల‌పైనే క‌రోనా ఇన్ఫెక్ష‌న్ రాకుండా చ‌ల్లే స్ప్రే చ‌ల్లారు. మీ కళ్ళను మూసుకోండి.. మీ పిల్లల కళ్ళను కూడా మూసేయండి అంటూ వారందరిపై ఈ రసాయనాన్ని చల్లారు. పిల్లలతో సహా ఆ బడుగు జీవులంతా కళ్ళు మండి విలవిలలాడిపోయిన దృశ్యాలు వైర‌ల్ అయి చూసే వారిని కంట‌త‌డిపెట్టిస్తున్నాయి. అధికారుల అతి చేష్ట‌ల‌కు అభాగ్యులు విల‌విల‌లాడారు. వీరంతా కూలీ నాలీ చేసుకునే కార్మికులు. వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో చిక్కుబడిపోయిన వీరు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బరేలీ జిల్లాకు చేరుకున్నారు. వీరిలోని ఓ బ్యాచ్ బస్సు దిగగానే బిలబిలమంటూ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు మాస్కులతో సహా ప్రొటెక్టివ్ సూట్లు ధరించి అక్కడికి చేరుకున్నారు. వలస కార్మికులను ఒక చోట కూర్చోబెట్టి.. వారిపై ఈ స్ప్రేను చల్లారు. 'అప్ నే ఆంఖో బంద్ కర్ లో! బచ్చొంకీ ఆంఖ్ భీ బంద్ కర్ లే..  అంటూ వారందరిపై ఈ రసాయనాన్ని చల్లారు. ఈ అమానుషం పట్ల అధికారులను, పోలీసులు త‌మ‌ను తాము స‌మ‌ర్థించుకోవ‌డం విశేషం. క్లోరిన్, నీటితో నింపిన ద్రవాన్నే చల్లాలని ఆదేశించామని, అంతే తప్ప ఎలాంటి కెమికల్ నీ ఇందులో కలపలేదని యుపి అధికారులు సమర్థించుకున్నారు.  భారీ సంఖ్యలో వేర్వేరు చోట్ల నుంచి వఛ్చిన వీరిని కరోనా పాజిటివ్ సోకకుండా, వీరి వల్ల మరెవరికీ ఎలాంటి 'ప్రమాదం' లేకుండా చూసేందుకు 'శుద్ది' చేసామంటూ చెబుతున్నారు అధికారులు త‌మ‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నార‌ట మ‌రి.... అది విష‌యం.

గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోవ‌డంతో పెరిగిన మ‌ట‌న్ ధ‌ర‌!

లాక్ డౌన్ నేపద్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యతపై మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో చేవెళ్ళ పార్ల‌మెంట్ స‌భ్యులు రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, శాస‌న‌స‌భ్యులు ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, జి.హెచ్‌.ఎం.సి. చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకిల్ పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ , మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖ అధికారులతో జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారిని నియమించాల‌ని ఈ స‌మావేశం నిర్ణ‌యించింది. లాక్ డౌన్ కారణంగా జిల్లాల నుండి గొర్రెలు, మేకల సరఫరా నిలిచినా కారణంగానే మటన్ ధరలు పెరిగాయి. మాంసం విక్రయించే దుకాణాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోనున్నారు.  కూరగాయలు, పాలు, పండ్లు, కోళ్ళు, గ్రుడ్లు తదితర నిత్యావసర వస్తువుల సరఫరా కు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. గొర్రెలు, మేకలు పెంపకం దారులు తమ జీవాలను ఆయా జిల్లాలలో, జంట నగరాలకు తీసుకొచ్చి విక్రయించుకునే విధంగా అనుమతుల కోసం  అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు చేపలను  రవాణా చేసుకొనేందుకు, విక్రయించు కునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న‌ట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుండి జిల్లాల కు వెళ్ళి చేపలు తీసుకొచ్చే వాహనాలకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. సైజుకు వచ్చిన చేపలను పట్టుకొని విక్రయించు కునేలా మత్స్యకారులకు అనుమతులు ఇవ్వ‌నున్నారు. రవాణా చేసే వస్తువులను తెలిపేలా వాహనాలకు తప్పని సరిగా పోస్టర్లను ఏర్పాటు చేయాలి.  చికెన్ దుకాణాలలోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించేలా జిఎచ్ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.

అమర్ రాజా గ్రూప్ విరాళం; ఆంధ్రకు 5కోట్లు! తెలంగాణకు కోటి!

ప్రస్తుతం భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 1100 మార్కును దాటేశాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు ఆర్థిక సాయం చేయ‌డానికి దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు తమ వంతుగా 6 కోట్ల విరాళం అందజేస్తున్నట్లు  అమ‌ర్ రాజా సంస్థ ప్రకటించింది.   ‘దేశం అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇటువంటి సమయంలో కరోనాపై పోరాడే బాధ్యతను అందరూ పంచుకోవడమే ముఖ్యం. అందుకే ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న ఆరోగ్యసిబ్బందికి అన్నిరకాల సహాయమూ అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో పేషెంట్లకు చికిత్స అందించగలిగే ఆస్పత్రులకు సాధ్యమైనంత సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరాళం ప్రకటించాం’  అని అమర్ రాజా గ్రూప్ త‌ర‌ఫున ఎంపీ గల్లా జయదేవ్ ఓ ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక పోరాటానికి అమర్ రాజా గ్రూప్స్ తమ వంతు విరాళాన్ని అందజేసింది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం నకు రూ.1 కోటి విరాళం  ప్రకటించారు.  ‘కరోనా’ కట్టడికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి  అమర్ రాజా గ్రూప్ మద్దతుగా నిలుస్తూ రూ.5 కోట్ల చెక్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఈ గ్రూప్ సీఈఓ అందజేశారని తన పోస్ట్ లో పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించిన చెక్కులను అమర రాజా గ్రూప్ చైర్మన్ డా.రామచంద్ర ఎన్ గల్లా, వారి కుమార్తె రమాదేవి  జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా గారికి సోమవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ నందు అందజేశారు.

టీటీడీ కీలక నిర్ణయం 

ఏప్రిల్ 14 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం అనుమతి లేదు. నిత్య కైంకర్యలు యథాతథంగా నిర్వహిస్తున్న అర్చకులు. ఇప్పటికే రెండు ఘట్ రోడ్డులు మూసివేత. టిటిడి సిబ్బందికి తిరుమలలో వారం రోజుల పాటు విధులను కేటాయింపు. తిరుపతిలో 50 వేల మందికి  ఉదయం ఉప్మా, మధ్యాహ్నం (సాంబారు) పులిహోర, పెరుగు అన్నం,  రాత్రి కిచిడి  ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న టీటీడీ. ఏప్రిల్ 2వ తేది శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే హనుమంత వాహన సేవ రద్దు, ఏకాంతగా శ్రీరామనవమి ఆస్థానం. ఏప్రిల్ నెలలో  మూడు రోజులపాటు నిర్వహించే వార్షిక వసంతోత్సవాలను శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏకాంతగా నిర్వహించాలని నిర్ణయం.

ఆపన్న హస్తం చాచుదాం..! కరోనాను త‌రిమేద్దాం!

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నిరుపేద‌ల్ని ఆదుకోవ‌డానికి ఆర్థిక‌స‌హాయం చేయాల‌ని తెలంగాణా రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.  కరోనా ప్రభావంతో నిరుపేదల జీవనమే కష్టతరంగా మారింద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ పరిస్థితులలో మీకు మీమున్నామంటూ పలువురు మానవతా మూర్తుల చేస్తున్న సాయం సర్వత్రా ప్రశంశలు పొందుతున్నదని ఆయ‌న అన్నారు. ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.  కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారని., ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్ధిపేటకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త దుండిగల బాల్ రాజేశం రూ.5లక్షలు, జువ్వన మల్లేశం రూ.1లక్ష రూపాయలు, మాధవనేని రామారావు రూ.1లక్ష రూపాయలు, మాజీ ఏఏంసీ చైర్మన్ వేముల వెంకట్ రెడ్డి రూ.1లక్ష రూపాయలు, చిన్నకోడూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ తరపున రూ.10వేలు విరాళాలు ప్రకటించారు.

100 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి

లాక్ డౌన్ మూలంగా వలస కూలీలు రోజువారీ పని లేక.. తినడానికి, ఉండటానికి వసతులు లేక.. వందల కిలోమీటర్లు నడిచి స్వగ్రామాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కొందరు నడుస్తూ మృత్యువాత పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఓ నిండు గర్భిణి భర్తతో కలిసి వంద కిలోమీటర్లు నడిచిందనే వార్త చలించిపోయేలా చేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్పూర్‌లో ఓ యజమాని ఉన్నట్టుండి పనిలో నుంచి తీసేయడంతో.. 8 నెలల గర్భిణి యస్మీన్, ఆమె భర్త వకిల్‌ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతిలో డబ్బుల్లేవు, యజమాని తమకు రావాల్సిన జీతం కూడా ఇవ్వకపోవడంతో.. దంపతులిద్దరూ కాలినడకన స్వగ్రామానికి(బులంద్షహర్ జిల్లా అమర్‌గఢ్‌కు) బయల్దేరారు. రెండు రోజుల పాటు దాదాపు 100 కిలోమీటర్లు నడిచి మీరట్‌కు చేరుకున్నాక యస్మీన్ తీవ్రంగా నీరసించిపోయింది. నడిచేపరిస్థితి లేకపోవడంతో వకిల్ ఆమెను తీసుకుని సోహ్రాబ్‌ బస్టాండ్ వద్దకు వెళ్లాడు. వీరిని గమనించిన స్థానికులు నవీన్ కుమార్, రవీంద్ర.. వారికి ఆహారం అందించడంతో పాటు.. వెంటనే నౌచండి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఓ అంబులెన్స్ ఏర్పాటు చేసి వారిని క్షేమంగా గ్రామానికి తరలించారు.

మ‌న ఆహారపు అల‌వాట్లే మ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌!

మ‌న భార‌తీయ సంస్కృతీ, సంప్ర‌దాయాలే ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలిచాయి. మ‌న ఆహారపు అల‌వాట్లే మ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్ష అంటున్నారు తెలంగాణా రాష్ట్ర పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. కరోనా దెబ్బకు అత్యాధునిక సంపన్న దేశాలే సతమతమవుతున్నాయి. ప్రపంచాని కంటే ముందే మనం మేల్కొన్నాం. ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ లు ముందే చేప‌ట్టిన ముందు జాగ్రత్త చర్యలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని మంత్రి తెలిపారు.  ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు లాక్ డౌన్ కి సహకరించాలి. స్వీయ, కుటుంబ, సమాజ, దేశ రక్షణకే స్వయం నియంత్రణ పాటిస్తున్నాం... అని  ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్ మిన‌హా, అదృష్ట‌వ‌శాత్తు మిగ‌తా ప్రాంతాల్లో క‌రోనా కేసుల్లేవు... అని మంత్రి చెప్పారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌, వ‌ల‌స కూలీల స్థితిగ‌తులు, ధాన్యం, మ‌క్క జొన్న, మిర్చి పంట‌లు-కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి పలు కీల‌క‌ అంశాల‌పై జిల్లా కలెక్ట‌ర్ స‌మావేశ మందిరంలో మంత్రి ఎర్ర‌బెల్లి సోమ‌వారం స‌మీక్షించారు.

చికెన్‌కు ఇప్పుడు మ‌ళ్ళీ డిమాండ్!

చికెన్‌, ఎగ్స్ బాగా తినండి. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోండి! మేమంతా చికెన్ తింటున్నాం. మీరు కూడా చికెన్ తినండంటూ ఎమ్మెల్యే రోజా త‌న ఇంటి కిచెన్‌లో హ‌డావిడి చేశారు. చికెన్ లెగ్ రోస్ట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఇంట్లోనే వున్న ఆమె చికెన్ వండి కుటుంబ‌స‌భ్యుల‌కు తినిపించారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనేది తప్పుడు ప్రచారమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా చెప్పారు. దీంతో చికెన్ షాపుల వ‌ద్ద సోమ‌వారం నాడు కూడా కొంత సంద‌డి క‌నిపించింది. ఎలాగూ క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్నారుక‌దా అనుకున్నారేమో చికెన్‌షాపు నిర్వాహ‌కులు కిలో 300 రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. వారం రోజుల క్రితం ఫ్రీగా ఇస్తే తీసుకోలేదు. ఈ రోజు 300 రూపాయ‌లు పెట్టి కిలో చికెన్ కొన్నాను. అంతా క‌రోనా ఎఫెక్ట్‌. ఏం చేస్తాం అంటున్నారు జ‌నం. గ‌త నెల రోజుల నుంచి అమాంతం తగ్గుతూ వస్తున్న చికెన్ ధ‌ర‌ ఇప్పుడు ఒక్క‌సారిగా కిలో 300 రూపాయ‌ల‌కు పెరిగింది. సరిగ్గా నెల రోజుల క్రితం కిలో చికెన్ 2 వందల రూపాయలు ఉండేది. మొన్న‌టి శ‌నివారం వ‌ర‌కు ఉచితంగా ఇచ్చినా చికెన్ తీసుకువెళ్ళ‌డానికి, తిన‌డానికి జ‌నం భ‌య‌ప‌డిపోయారు.చికెన్ తింటే కరోనా వస్తుందనే భయమే జనాన్ని వెంటాడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు గ‌త కొంత కాలంగా నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా చికెన్‌కు డిమాండ్ అమాంతం పడిపోయి ఇప్పుడు చికెన్ ధ‌ర చుక్క‌ల్ని చూపిస్తోంది.

సి.ఎం.గారు డోర్‌ డెలివరీ ఎక్క‌డ‌?

వలంటీర్ల వల్లే కరోనా కేసులు గుర్తించామని, ఇంటింటికీ తిరిగి వెంటనే గుర్తించడం వల్లే వైరస్‌ వ్యాప్తిని నివారించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. అయితే ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హుల ఇళ్లకే చేరవేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, వాస్త‌వానికి వలంటీర్ల వ్యవస్థ ఆచరణలో చేష్టలుడిగింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ్రామ వాలెంటీర్లు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నారా? లేక రాజ‌కీయ‌నేత‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నారా? ప్రజలకు, ప్రభుత్వానికి వారదిలా ఉండేలా వలం టీర్ల వ్యవస్థ ప‌ని చేస్తుంద‌న్నారు. పేదలకు అండగా ఉన్నామన్న భరోసా అయితే ప్రభుత్వం ఇచ్చింది కానీ రేష‌న్ తీసుకోవ‌డానికి జ‌నం ఇళ్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చి రోడ్డు మీద నిల‌బ‌డే దుస్థితి ఎందుకు వ‌చ్చింది? క‌నీసం ఈ ఆప‌ద స‌మ‌యంలో ప్రజల మనసులు గెలిచే విధంగా గ్రామ వాలెంటీర్లు ఎందుకు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. వలంటీర్లు ప‌త్తాలేక‌పోవ‌డంతో రేష‌న్ షాపుల ఎదుట జ‌నం భారీగా క్యూ క‌ట్టారు. ఎండ‌లో నిల‌బ‌డాల్సిన దుస్థితి. గంటల కొద్దీ క్యూలలో అగచాట్లు ప‌డి ఇంటికి సరుకులు తీసుకువెళ్తున్న దృశ్యాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌నిపిస్తున్నాయి. రేషన్‌ డోర్‌ డెలివరీ లేక పోవ‌డంతో కార్డుదారులే షాపులకు వచ్చి తీసుకెళ్ళుతున్నారు. ఉదయం నుంచే షాపుల ఎదుట క్యూ కట్టారు. డీలర్లు గీసిన మార్కింగ్‌లు కూడా దాటి బారులు తీరుతున్నారు.     రేషన్‌ కోసం కార్డుదారులు బారులు తీరడాన్ని చూస్తే వలంటీర్లు ఏమయ్యారనే ప్రశ్న వినవస్తోంది. అసలు వారి జాబ్‌చార్ట్‌లోని కీలక అంశమే రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ. కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఇళ్లకు వచ్చి సరుకులు ఇస్తారనుకుంటే ఇప్పుడు కూడా ఆ ఊసే లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వ‌న్‌ మిలియన్‌ మెడికల్‌ మాస్క్‌ల స్వాధీనం!

కరోనా కట్టడికి సౌదీ అరేబియా ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని మరికొద్ది రోజులు పొడగించింది. అన్ని అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను రద్దు కాలాన్ని పొడగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసింది. సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌, 1,168,000 మెడికల్‌ మాస్క్‌లను సీజ్ చేసింది. వీటిని అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, హెయిల్‌ సిటీ నుంచి వాటిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అధికారులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్‌ల వినియోగం పెరిగింది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. అథారిటీస్‌ ఎప్పటికప్పుడు ఇలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈ ఏడాది తొలి మాసం నుంచే సౌదీ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వస్తోంది. వాటికి కొనసాగింపుగానే ప్రస్తుత నిర్ణయం తీసుకుంది. ఇంతటి కఠిన నిర్ణయాల కారణంగా కరోనా మృతుల సంఖ్యను అదుపు చేయగలుగుతోంది. సౌదీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయారు.

లోకేష్ బాబు పద ప్రయోగానికి 'శృంగేరి' జగద్గురు పీఠం మద్దతు....

* తెలిసో, తెలియకో లోకేష్ వాడిన 'వర్ధంతి' పద ప్రయోగం కరెక్టే అని తేల్చిన పంచాంగ కర్తలు  * నారా లోకేష్ కు కలిసొచ్చిన శార్వరి నామ సంవత్సరం  నారా లోకేష్ బాబూ.... మీరిక రిలాక్స్ అవ్వొచ్చు. మీ రాజకీయ ప్రత్యర్ధులు తరచూ మీ తెలుగు పద ప్రయోగంపై విరుచుకు పడుతూ, మిమ్మల్ని ఆట పట్టిస్తుంటే, మీకు తీవ్రమైన మనో ఖేదం కలుగుతోంది గదా. ఇప్పుడు మీకింకా బెంగ అక్కర్లేదు. 23 వ పులకేశి లాగా మీరు కూడా మీ ప్రత్యర్థులపై విచ్చలవిడిగా చెలరేగిపోండి. సాక్షాత్తూ ఆదిశంకరుల ప్రధమ పీఠం శృంగేరి జగద్గురు మహాసంస్థానమే మీ పద ప్రయోగానికి -బాసటగా నిలబడింది. తెలిసో, తెలియకో మీరు చేసిన వర్ధంతి ప్రయోగానికి అసలైన అర్ధాన్ని -శ్రీ శృంగేరి జగద్గురు సంస్థానం వారి ఈ ఏడాది పంచాంగం లో పంచాంగ కర్తలు సమగ్రంగా వివరించారు.  వర్ధంతి అనే శబ్దం 'వృధు-వృద్దౌ ' అనే ధాతువు నుంచి వచ్చిందనీ, అది వృద్ధి అనే అర్ధం చెపుతోందనీ శృంగేరి పంచాంగ కర్తలు చెప్పుకొచ్చారు. కాబట్టి వర్ధంతి అనే శబ్దం, పుట్టినరోజు పండుగ అనే అర్ధం లో ప్రయోగించటానికి యోగ్యంగా ఉందని వారు వివరించారు. కానీ, ఆంధ్ర దేశం లో ఆ శబ్దం విపరీతార్థం లో వాడబడుతోందనీ, కానీ అది పూర్తిగా అసంగతమనీ శృంగేరి పంచాంగ కర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు శృంగేరి జగద్గురు మహా సంస్థానం లో జగద్గురువుల జన్మదినోత్సవం, ఇంకా మైసూరు మహారాజ సంస్థానం లో మహారాజ వారి జన్మ దినోత్సవం వందల ఏళ్ల నుంచీ వ్యవహరింపబడుతోందని పంచాంగ కర్తలు సోదాహరణం గా వివరించారు.     తదనుసారంగా మా పంచాంగం లో జగద్గురువుల జన్మదినోత్సవాన్ని 'వర్ధంతి' అని నిర్దేశిస్తున్నామని, సహృదయులు ఆ పదానికి విపరీతార్ధాన్ని పరిత్యజించి పైన చెప్పిన సరైన అర్ధాన్ని గ్రహించాలని పంచాంగ కర్తలు విజ్ఞప్తి చేశారు. అంచేత, నారా లోకేష్ గారి భాషా ప్రయోగాన్ని ఎత్తిచూపే వారికీ, వెటకరించే వారికీ ఒక హెచ్చరిక. సాక్షాత్తూ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం పంచాంగ కర్తలు 'వర్ధంతి' అనే పద ప్రయోగంపై ఇచ్చిన క్లారిటీ కారణంగా, నారా లోకేష్ గారి పద ప్రయోగంపై మాట్లాడే ముందు, ఒకటికి రెండు సార్లు శృంగేరి పంచాంగం చూసి మరీ మాట్లాడండి. లోకేష్ బాబూ..మీరిక పండగ చేసుకోండి.. మీ 'వర్ధంతి' పద ప్రయోగానికి పంచాంగ కర్తల ఆమోద ముద్ర లభించింది. మొత్తానికి లోకేష్ బాబుకు, శార్వరి నామ సంవత్సరం ఈ రకంగా కలిసొచ్చిందన్న మాట.