లాక్ డౌన్ తో 'రెక్కలు' విరిగిన ఎయిర్ లైన్స్
posted on Apr 2, 2020 @ 10:58AM
ముందు చూస్తే నుయ్యి..వెనుక చూస్తే గొయ్యి లావుంది భారతీయ ఎయిర్ లైన్స్ ఆపరేటర్ల పరిస్థితి. కరోనా మహమ్మారి ప్రభావంతో దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, వెంటనే ఆదుకోకుంటే ఎన్నో సంస్థలు దివాలా తీయక తప్పదని హెచ్చరిస్తూ, ఫిక్కీ కేంద్ర మంత్రులను ఉద్దేశించి లేఖ రాసింది. ఇప్పటికే దాదాపు 10 రోజులకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోగా, టికెట్ల క్యాన్సిలేషన్ డబ్బులను ఎయిర్ లైన్స్ సంస్థలు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఇండిగో, స్పైస్ జెట్ లాంటి ఎయిర్ లైన్స్ అయితే, లాక్ డౌన్ పీరియడ్ వరకూ- తమ టికెట్లు బుక్ చేసుకున్న వారందరికీ, సొమ్ము వాపసు చేయకుండా-తర్వాత, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి లోగా తిరిగి తమ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించే సౌకర్యాన్ని ,లేదా వెసులుబాటును కల్పించాయి.
ఈ కారణంతో ఎయిర్ లైన్స్ సంస్థలు దివాలా దిశగా నడుస్తున్నాయని ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే విమానయాన సంస్థలకు ఉద్దీపన ప్రకటించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి, ఏవియేషన్ కమిటీ చైర్మన్ ఆనంద్ స్టాన్లీ తదితరులకు ఫిక్కీ లేఖ రాసింది. ఎయిర్ లైన్స్ సంస్థలు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి తీసుకున్న రుణాలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు జప్తు చేసుకోకుండా మూడు నెలల మారటోరియం విధించాలని ఫిక్కీ ప్రతినిధులు కోరారు.
ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు విధించే వడ్డీలు,పెనాల్టీలు తదితరాల భారం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. విమాన సర్వీసులు ఆగిపోవడంతో సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వలు తగ్గిపోతున్నాయని, ఇది ఓ పెను సమస్యని ఫిక్కీ హెచ్చరించింది. ఈ క్రమం లో ప్రయివేట్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులైన జి ఎం ఆర్ లాంటి కార్పొరేట్ గ్రూపులు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తాయోనని, అన్ని ఎయిర్ లైన్స్ ఆపరేటర్లు ఎదురు చూస్తున్నారు.