తెలంగాణాలో 229 పాజిటివ్ కేసులు, ఈ రోజు ఇద్ద‌రు మృతి!

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఆందోళ‌న‌క‌రంగా పెరుగుతూనే వుంది. ఈ రోజు ఇద్ద‌రు మృతి చెందారు. ఒక‌రు షాద్‌న‌గ‌ర్‌కు చెందిన వారు కాగా మ‌రొక‌రు సికింద్రాబాద్‌కు చెందిన‌వారు. కొత్త‌గా 75 మందికి ఈ రోజు పాజిటివ్ వ‌చ్చింది. దీంతో తెలంగాణాలో పాజిటివ్ వ‌చ్చిన వారి సంఖ్య 229కి పెరిగింది. ఢిల్లీ మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన వారంద‌రినీ గుర్తించారు. వారిలో ల‌క్ష‌ణాలు వున్న వారి కుటుంబ స‌భ్యుల‌ను ఐసోలేష‌న్ సెంట‌ర్స్‌కి త‌ర‌లించి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌మ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఆరు ల్యాబ్‌ల‌లో 24 గంట‌లు మూడు షిఫ్టుల్లో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

2301కు చేరిన కరోనా కేసులు! తబ్లీగి జమాత్‌తో సంబంధం ఉన్నవి 647!

దేశంలో గత 24 గంటల్లో 336 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో  మొత్తం కేసుల సంఖ్య 2301కి చేరగా  వీటిలో 647 కేసులకు తబ్లీగి జమాత్‌తో సంబంధం వున్న వారివి. అయితే ఇప్పటి వరకూ 56మంది కరోనా కారణంగా చనిపోయారని  ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.   ఇప్పటి వరకూ 157 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆయ‌న  చెప్పారు. కరోనా కేసుల్లో 647 కేసులకు తబ్లీగి జమాత్‌తో సంబంధం ఉందని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి అడ్డంకులు సృష్టించవద్దని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. వైద్య సిబ్బంది మీద దాడులను ఖండించింది. ఎవ్వరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరింది. ఒకవేళ ఎవరైనా వైద్యుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

క్వారంటైన్ కు రావాలని 'పాజిటివ్' లకు డీజీపీ పిలుపు

ఢిల్లీలో జరిగిన సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్‌ కేసులునమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా క్వారంటైన్‌కు రావాలిన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆ సమావేశానికి సంబంధించిన జాబితా ఆధారంగా చాలా మందిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఏపీ నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నట్లు అధికారికంగా తేలిందన్నారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఆలస్యం అయ్యే కొద్ది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని డీజీపీ మరోసారి గుర్తుచేశారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో పర్యటించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కేసుల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌లో ఏపీకి చెందిన విద్యార్థులను తీసుకవచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పదిరోజులు లాక్‌డౌన్‌ పాటించారని.. మరో పదిరోజులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో కరోనా రూపంలో వచ్చిన కొత్త చాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, చాలా శ్రమపడుతున్నారని పేర్కొన్నారు. ‘మీ కోసం వారంతా త్యాగం చేస్తున్నారు.. మీరు ఇళ్లు వదలి రాకండి’అంటూ రాష్ట్ర ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు.  విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల తొలుత వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చెక్‌ పోస్ట్‌ల వద్ద పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించామని తెలిపారు. జిల్లాల ఎస్సీలు, డీఎస్సీల ద్వారా అక్కడి పరిస్థితి తెలసుకున్నామని తెలిపారు. షిఫ్ట్‌ల వారీగా పోలీస్‌ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపారు.  బాపట్లలో వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో విచారణ జరుగుతుందన్నారు. ఈ ఘటన బాదకరమని, సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. పోలీస్‌ సిబ్బంది కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజల పట్ల హ్యూమన్‌ అప్రోచ్‌తో ఉండాలని సూచించారు. ప్రజల క్షేమం కోసం పోలీసులు కుటుంబ సభ్యులను వదిలి మరీ విధులు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు.

క‌రోనా సోకినా 80% మందికి ప్రాణ‌హాని వుండ‌దట‌!

ప్రతి  ఒక్కరూ సామాజిక దూరం పాటించడం ద్వారా  కరొనా వైరస్ ను నిర్మూలించవచ్చని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ వినయ్ శేఖర్, అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ డాక్టర్ విష్ణు రావులు ప్రజలకు సూచించారు. శుక్రవారం సమాచార   పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ 19  పై ప్రజలకు అవగాహన కల్పించెందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ శేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ అన్ని వైరస్ లాంటదేనని, వైరస్ సోకిన ప్రతి వందమందిలో ఎనభై ఐదు శాతం మంది కి ప్రమాదం ఏమి ఉండదని స్పష్టం చేశారు. వృద్ధులు కు వైరస్ సోకిన ప్పుడు మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుందనీ, వీరు డాక్టర్ల సూచనలు, సలహాలు పాటించాలని తెలిపారు. ఈ వైరస్ ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చుఅని అన్నారు. ఈ లక్షణాలకు ఉన్నప్పుడు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం వంటివి చేయాలని అన్నారు. మనం ఈ వైరస్ ను శ్వాస లోకి పీల్చినపుడు లేదా ఈ వైరస్తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు కళ్ళు , ముక్కు , నోటి ద్వారా ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. తరుచుగా చేతులను సబ్బు నీటితో గానీ, శానిటైజర్లుతోగాని శుభ్రంగా కడుక్కొవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో నే ఉండాలని, స్వీయనిర్బందంలో ఉండాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. కరొనా సోకిన వారికి   ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా చాలా మంది రికవరీ అయ్యారని వివరించారు. డాక్టర్ విష్ణు రావు మాట్లాడుతూ వయసు ఎక్కువ ఉన్న వారు ముఖ్యంగా కిడ్నీ, గుండె , లివర్ వంటి వ్యాధులు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.సాధారణ ప్రజలు ఎన్ - 95 మాస్క్ లు వేసుకోవాలిసిన అవసరం లేదన్నారు. కరోనా సోకిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు వేసుకోవాలి. ఎవరికైనా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నాయో వారికి మాస్క్ వేసుకోవాలి. గుంపులలో తిరిగెటప్పుడు కూడా మాస్క్ వేసుకోవలన్నారు. మాస్క్ కేవలం ఒకేసారి వినియోగించాలని సూచించారు. క్లోరోక్విన్ లాంటి మందులను డాక్టర్ సలహా లేకుండా వేసుకోకూడదాని తెలిపారు. మాంసాహారం ద్వారా కరోనా వైరస్ సోకదాని ఆయన స్పష్టం చేశారు. ఆహారాన్ని పూర్తిగా శుభ్రం చేసి సరిగా వండి స్వీకరిస్తే ఎటువంటి అపాయం లేదు అన్నారు.

ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చారు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ చేశారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని తెచ్చారు. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి చేర్చింది. మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వేస్ట్‌ను ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తెచ్చింది.

​తెలంగాణాలో బయో మెట్రిక్ లేకుండానే రేషన్!

రేషన్ కోసం ఎవరూ కంగారు పడొద్దు. ఏప్రిల్ నెల మొత్తం రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తామని  పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రేషన్ షాపులు నిరంతరాయంగా తెరిచే ఉంటాయని అధికారులు వెల్లడించారు. గతంలో ఉన్న 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే నిబంధనను ఎత్తివేస్తున్న‌ట్లు ప్రకటించారు.  తెలంగాణాలోని 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని అందిస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని పౌరసరఫరాల శాఖ భ‌రోసా ఇచ్చింది.  వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకున్న వారు వేలిముద్ర వేయకుండానే అంటే బయో మెట్రిక్ లేకుండానే రేషన్ తీసుకునే సదుపాయాన్ని తెలంగాణా ప్ర‌భుత్వం క‌ల్పించింది. రేషన్ బియ్యం తీసుకుంటేనే 1500 రూపాయల నగదు ఇస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దని లబ్ధిదారులకు అధికారులు చెబుతున్నారు. బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు, మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా 1500 నగదును వారి ఖాతాల్లో జమ చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిచేసింది. రేషన్ పంపిణీపై శుక్రవారం నాడు ముఖ్య‌మంత్రి  కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

మనిషి మారకపోతే ప్రకృతి కలగజేసుకుంటుందా?

ఉప్పెనలు, భూకంపాలు, కార్చిచ్చులు, ఇవన్ని ఊరికే రావు. తినడానికైనా.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. ఓ పద్దతి పాడు ఉంటుంది. అబార్షన్ లో బైటపడిన పిండాలను సైతం వ‌ద‌ల కుండా హోటల్లో సూప్ చేసి పెడితే.. ఎగబడే జనం... ఆరునెలల పసి గుడ్డు శవానికి , ఫుడ్డుగా ఆర్డరేసే జనం.  బ్రతికున్న పురుగులను స్టిక్స్ తో అలవోకగా పట్టి బిడ్డలకు బలవంతంగా తినిపించే జనం. ఛీ... ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఎవ‌రికి వారు రెచ్చిపోతుంటే... ఎక్కడ ఏది బ్యాలన్స్ తప్పినా.... మనిషి మారకపోతే  ప్రకృతి ఇలాగే కలగజేసుకుంటుంది.  ఏదిఏమైనా లెక్క సరిజేయడంలో తన మనా ఉండదు. ఆ దేశం ఈ దేశం అని ఉండదు.. బంధువు, స్నేహితులు తేడాలేమీ లేవు. ప్ర‌కృతి త‌న‌కు తాను అప్డేడ్ చేసుకుంటుంది.  మ‌నం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఏ విపత్తు ఊరికేరాదు.. అది మనిషి మేధస్సు కి అందలేదంటే , కచ్చితంగా అది మనిషి మంచి కోసం జరగడానికని అర్థం చేసుకోవాలి. ఉపద్రవాలని అనుకుంటాం అంతే. ఎయిడ్స్ వ్యాది రాకపోయి ఉంటే పులిరాజాలు కంట్రోల్‌లో వుండేవారే కాదు.  కరోనా రాకపోయుంటే సిస్టమ్ ఇంతగా కంట్రోల్ అయేదికాదు..!  ఇపుడు ఆకాశం నిర్మలంగా ఉంది. కాలుష్యం లేని గాలి ప్రపంచమంతా వీస్తుంది.  మనిషిని మనిషి తాకకుండా గౌరవించుకుంటున్నారు. కుటుంబాలు ఒకే చోట ఉండి ప్రేమలు పంచుకుంటున్నాయి. చచ్చినోళ్ళు చావగా, బ్రతికున్నవారు సిస్టమ్ కి అలవాటు ప‌డ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్ని వేల మూగజీవాలు ప్రాణాలతో బ్రతికిపోయాయి. ఇప్ప‌ట్టికైనా మ‌నమంతా మార‌క‌పోతే భూమి మీదు చోటు కాపాడుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని క‌రోనా హెచ్చ‌రిస్తోంది.

అమెరికాలో ఉద్యోగాలు పోయే స్థితిలో భారతీయులు!

హెచ్‌-1బీ వీసాతో  పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు క‌రోనా వైర‌స్ శాపంగా మారింది. దీంతో కరోనా దెబ్బకు అమెరికాలోవున్న భార‌తీయులు ఆందోళ‌న ప‌డుతున్నారు. ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72 శాతం భారతీయులే ఉన్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి.  ఈ ప్రతికూల ప్రభావం హెచ్‌1బీ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిపై పడనుంది. ప్రస్తుత ఫెడరల్‌ నిబంధన ప్రకారం, ఒకవేళ వీరిలో ఎవరు ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో కేవలం 60 రోజులు మాత్రమే ఉండగలరు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో సహా స్వదేశానికి తిరిగి రావాల్సిందే. అయితే ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని అక్కడి విదేశీ ఐటీ నిపుణులు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గడువును 60 నుంచి 180కి పెంచాలని కోరుతున్నారు.  యూఎస్‌లో  దాదాపు 35 లక్షల మంది ఇప్పటివరకు జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక అంచనా ప్రకారం 67 మిలియన్ల అమెరికన్ల ఉద్యోగాలు హై రిస్క్‌లో ఉన్నాయని, దాదాపు 47 మిలియన్ల (4.7కోట్లు) మంది నిరుద్యోగులుగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.   కరోనా వైరస్‌ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ముందు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి.  నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం, హెచ్‌1బీ వీసా కల్గిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తామని ప్రకటించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

ఏ పీ లోని 140 కరోనా పాజిటివ్ కేసులు, తబ్లీగ్ జమాత్ పుణ్యమే: అధికారులు

* విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిద్ధమవుతున్న టెస్టింగ్ ల్యాబ్స్ * బాపట్ల లో యువకుడి ఆత్మహత్యపై విచారణకు సి.ఎం. ఆదేశం ఢిల్లీ సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్టు అయిన వారికి పరీక్షలు నిర్వహించామని, ఢిల్లీలో జమాత్‌కు 1085 మంది హాజరయ్యారని, వీరిలో మన రాష్ట్రంలో ఉన్నవాళ్లు 946 మందిని గుర్తించామని అధికారులు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి  వివరించారు. కోవిడ్‌ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్లనాని, మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ 946 మందిలో 881 మంది ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వచ్చాయని, వీరిలో 108 మంది పాజిటివ్‌గా కేసులుగా నిర్ధారణ అయ్యాయని అధికారులు సి ఎం కు వివరించారు. ఇంకా 65 మందికి సంబంధించి ల్యాబ్‌ నుంచి ఫలితాలు రావాలన్న అధికారులు. పైన పేర్కొన్న 946 మందితో కాంటాక్ట్‌ అయినవారిలో 616 మంది పరీక్షలు నిర్వహించగా ఇందులో 32 మంది పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యాయని వెల్లడి. కాంటాక్ట్‌ అయిన మరో 335 మంది ల్యాబ్‌ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందన్నఅధికారులు. రాష్ట్రంలోని మొత్తం 161 పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారిలో టాక్ట్‌ అయినవారేనని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని తెలిపిన అధికారులు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వారీగా వైద్యుల మ్యాపింగ్‌ చేసినట్టు ముఖ్యమంత్రికి వివరించారు. ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం సూచించారు. పోలీసుల డేటాను, వైద్య సిబ్బంది డేటాను, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే డేటాను వీటన్నింటిని విశ్లేషించుకుని ఆ మేరకు వైద్య పరీక్షల విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని సి ఎం ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌లు, వాటిని సామర్థ్యంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. గుంటూరు, కడప ల్యాబ్‌ల్లో టెస్టింగ్‌ ప్రారంభమైందని వివరించిన అధికారులు. వచ్చే సోమవారం నుంచి విశాఖపట్నంలో ల్యాబ్‌ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపిన అధికారులు. ఒకరోజులో కనీసం 700 మందికి పరీక్షలు చేయించే అవకాశం ఉందన్న అధికారులు అలాగే ప్రయివేటు ల్యాబ్‌ల సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్న అధికారులు. వారంరోజుల్లో విజయవాడలో ఈ ప్రయివేటు ల్యాబ్‌ సిద్ధమవుతుందని, మొత్తంగా రోజుకు 900 మందికి పరీక్షలు వరకూ చేయగలిగే సామర్థ్యానికి చేరుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రం వెలుపల ఉన్న తెలుగువారి పరిస్థితులపై ఆరాతీసిన సీఎం. ముంబై, గిర్, వారణాశి, గోవా, అజ్మీర్, తమిళనాడు ప్రాంతాల్లో చిక్కుకున్నారని తెలిపిన అధికారులు. వీరికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలన్న సీఎం పెద్ద సంఖ్యలో తెలుగువారు ఉన్నచోట ఒక అధికారిని పంపి వారి బాగోగులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్న సీఎం. అలాగే క్వారంటైన్, ఐసోలేషన్లలో ఎస్‌ఓపీ పాటించాలన్న సీఎం. కనీస వసతులు, సదుపాయాలు పాటించేలా ఎస్‌ఓపీ ఉండాలన్న సీఎం. అలాగే, బాపట్ల యువకుడు ఆత్మహత్య కేసు విషయలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.

ప్రిన్స్ చార్లెస్ కు కరోనా నుంచి విముక్తి

* బెంగళూరు డాక్టర్ ప్రయత్నం సఫలం * వెల్లడించిన కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ * ప్రత్యామ్నాయ వైద్య విధానం తో కరోనా ను దారిలో పెట్టొచ్చు * డాక్టర్ మతాయ్ ఫార్ములాపై అధ్యయనానికి ఆయుష్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎవరన్నారు, ఆయుర్వేదం, హోమియోపతిలతో కరోనా క్యూర్ కాదని!! బేజానుగా క్యూర్ చేయొచ్చునని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ చెపుతున్నారు. బ్రిటన్ రాజవంశీకుడు ప్రిన్స్ చార్లెస్ కు బెంగళూరు కు చెందిన ఒక ప్రకృతి ఆశ్రమ నిర్వాహకుడు డాక్టర్ మతాయ్ కరోనా ను నయం చేసి చూపించాడని, ఇది ప్రత్యామ్నాయ వైద్య విధానం ద్వారానే సాధ్యమైందని శ్రీపాద నాయక్ వివరించారు. నెలకు పైగా కరోనా బారిన పది చికిత్స పొందుతున్న ప్రిన్స్ చార్లెస్, డాక్టర్ మతాయ్ సూచించిన ప్రత్యామ్నాయ వైద్య విధానం ద్వారా, ఆయుర్వేదం, హోమియోపతి సాయంతో ప్రస్తుతం కరోనా నుంచి ఉపశమనం పొందారని శ్రీపాద నాయక్ సువివరించారు. డాక్టర్ మతాయ్ బెంగళూరు లో 30 ఎకరాల ఆర్గానిక్ ఫార్మ్ లో నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమం ప్రత్యామ్నాయ వైద్య విధానం మీద విస్తారం గా పరిశోధన చేస్తోందని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న ప్రిన్స్ చార్లెస్ కు ఈ వైద్య విధానం ద్వారా డాక్టర్ మతాయ్ కరోనా నుంచి విముక్తం చేశారని శ్రీపాద నాయక్ చెప్పారు. కరోనా ను క్యూర్ చేయటానికి డాక్టర్ మతాయ్ రూపొందించిన ఈ ఫార్ములా ను అధ్యయనం చేయటానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని  కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్ చెప్పారు.  

చంద్రబాబు ఆరోగ్యశ్రీ కి 650 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్లారు: సజ్జల

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు కోటి 28 లక్షల ఇళ్లలో సర్వే చేయించినట్టు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జ్వరం,దగ్గు, గొంతు నెప్పి ఉన్నవారిని గుర్తిస్తున్నామన్నారు. వెంటనే డాక్టర్లు వెళ్లి వైద్యపరీక్షలు చేస్తున్నారు.డాక్టర్ల సలహా మేరకు క్వారంటైన్లకు, ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు. జమాత్ కు వెళ్లివచ్చినవారినిగుర్తించాం. వారందరికి వైద్యపరీక్షలు పూర్తిఅయ్యాయని సజ్జల చెప్పారు. వైరస్ సోకిన వాళ్లు స్వఛ్చందంగా వైద్యపరీక్షలకు ముందుకు రావాలని ఆయన సూచించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమనీ, కరోనా వల్ల రాష్ట్రానికి అదనపు ఆర్దిక భారం పడిందని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని సైతం రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కరోనా వంటి విపత్తు నేపధ్యంలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. దరిద్రపు గొట్టు, దిక్కుమాలిన వ్యవహారాలు టిడిపి నడుపుతోందన్నారు. చంద్రబాబు ఏ స్దితిలో ఖజానాను జగన్ మోహన్ రెడ్డిగారికి అప్పచెప్పారనేది ప్రపంచానికంతటికి తెలుసుననీ, ఎన్నికలకు ముందు అందరికి పంచేసి ఖాళీ ఖజానాను నూతన ప్రభుత్వానికి అప్పగించారనీ సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు చేయని పనులకు కూడా బిల్లులు ఇస్తామని కమీషన్లు తీసుకుని వాటిని పెండింగ్ లో పెట్టారని సజ్జల ఆరోపించారు. "చంద్రబాబు అధికారంనుంచి వెళ్తూ అప్పుల భారమే కాకుండా పెండింగ్ బిల్లుల భారం మీద పడేసి వెళ్లారు.ప్రభుత్వాన్ని ఆర్దికంగా దివాళా తీసి వెళ్లారు ,"అని సజ్జల ఆరోపించాఋ. ఇవన్నీ ఇలా ఉంటే  ప్రభుత్వానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిందని టిడిపినేతలు,చంద్రబాబు ప్రకటిస్తున్నారు. ఇలా మాట్లాడటానికి వీరికి ధైర్యం ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు.ఇలా వ్యాఖ్యలు చేయడానికి వారిది నాలుకా తాటిమట్టా, అని ప్రశ్నించారు. చంద్రబాబు,యనమల లాంటి వారితో కాకుండా ధూళిపాళ్ల నరేంద్ర వంటివారితో ఖజానాకు సంబంధించి ప్రకటన ఇప్పించారు.ఆదాయం బాగున్నా కూడా ఉద్యోగుల వేతనాలు ఆపుతున్నారంటూ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు.వారికి ఇష్టం వచ్చినవారికి,కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు.దీనికి తోడు, వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు.వాటిని వారికి ఉన్న ఎల్లోమీడియా ద్వారా తాటికాయంతఅక్షరాలతో వేసి దుష్ప్రచారం చేస్తున్నారు. " చంద్రబాబు ఆరోగ్యశ్రీ కి 650 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్లారు.పవర్ బిల్లులకు 18 వేల కోట్లు పెండింగ్ పెడితే మేం వచ్చాక చెల్లింపులు చేశాం," అని సజ్జల చెప్పుకొచ్చారు. ఉద్యోగసంఘాల నేతలతో చర్చించారు.వారికి పరిస్దితిని వివరించడం జరిగింది.జీతాలు రెండు విడతల గా చెల్లిస్తామని చెప్పారు.వారు సానుకూలంగా స్పందించారు.అది ఉద్యోగుల గొప్పతనం.ఔదార్యం చూపారు.కోతలు పెట్టేఆలోచన  జగన్ కు లేదు.కోతలు, వడపోతలు చంద్రబాబుకే చెల్లిందని సజ్జల అన్నారు.  

PM-CARES సహాయ నిధికి విరాళ‌మివ్వండి! 

కరోనా మహమ్మరిని తరిమేద్దాం... దేశాన్ని గెలిపిద్దాం అనే నినాదం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎం.పి. బండి సంజయ్ కోరారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశం మొత్తం లాక్ డౌన్ చేపట్టి ప్రపంచ దేశాలకు ఒక దిక్సుచిగా నిలిచాం అన్నారు.  దేశంలోని 130 కోట్ల భారతీయులను కాపాడటానికి నరేంద్ర మోదీ తీసుకున్న సహోసోపేత నిర్ణయం శ్రీరామ రక్ష అన్నారు.  లాక్ డౌన్ వల్ల దేశంలో ఏర్పడే ఆర్థిక సంక్షోభం తట్టుకోవడానికి 1 లక్ష 70 వేళా కోట్ల ప్రత్యేక బడ్జెట్ పెట్టి దేశాన్ని ఆదుకోవడం కోసం బలమైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం చర్యకు తెలంగాణ ప్రజానీకం తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నెలకొన్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన PM-CARES సహాయ నిధికి తెలంగాణలోని ప్రతి బీజేపీ కార్యకర్త సహాయం చెయ్యాలి అని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రేపు శుక్రవారం ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు నుండి మధ్యాహ్నం 1 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త 100 రూపాయలకు తగ్గకుండా విరాళం ఇచ్చి ప్రతి కార్యకర్త మరో పదిమందితో  సహాయ నిధికి విరాళం ఇప్పివ్వాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం 11 గం.. నుండి మధ్యాహ్నం 1 గం..ల మధ్య PM-CARES నిధికి విరాళమిచ్చి , స్క్రిన్ షార్ట్ తీసి #TSDonates2PMCARESతో సోషల్ మీడియాలో షేర్ చెయ్యాలి కోరారు.  PM-CARES సహాయ నిధికి తన ఎంపీ ల్యాండ్స్ నుండి 1 కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను విరాళం ఇస్తున్న‌ట్లు కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్ర‌క‌టించారు.

అన్నార్తుల ఆక‌లి తీరుస్తున్న అన్న‌పూర్ణ భోజ‌నం!

మ‌ధ్యాహ్నం 45వేల మందికి, రాత్రిపూట 15వేల మందికి అన్న‌పూర్ణ ఉచిత భోజ‌నాన్ని జిహెచ్‌ఎంసి అందిస్తోంది. ఆరు సంవ‌త్స‌రాల క్రితం జిహెచ్‌ఎంసి ద్వారా 8 కేంద్రాల‌తో ప్రారంభ‌మైన అన్న‌పూర్ణ భోజ‌న ప‌థ‌కం నేడు 150 కేంద్రాల‌కు విస్త‌రించింది. ప్ర‌ధాన‌మైన ఆసుప‌త్రులు, బ‌స్టాండ్‌లు, రైల్వే స్టేష‌న్లు, కూలీల అడ్డాలు, విద్యాసంస్థ‌లు, కోచింగ్ సెంట‌ర్లు ఉన్న ప్ర‌దేశాల్లో న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల‌లో అన్న‌పూర్ణ కేంద్రాలు న‌డుస్తున్నాయి. ప్ర‌తి భోజ‌నంలో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల ప‌ప్పు, సాంబార్‌, ప‌చ్చ‌డి త‌ప్ప‌నిస‌రిగా ఉండేవిధంగా మెనును అమ‌లు చేస్తున్నారు.   క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టుట‌కు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ర‌వాణా వ్య‌వ‌స్థ నిలిచిపోయింది. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు అక్క‌డే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ‌ర్త‌క వ్యాపార సంస్థ‌లు, విద్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు మూసివేయ‌డంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. నిర్మాణ ప‌నులు ఆగిపోయాయి. దీంతో ఇబ్బంది ప‌డుతున్న వ‌ల‌స కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్ర‌యులు, వ‌స‌తి గృహాల‌లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగుల‌ను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. అటువంటివారంద‌రీ ఆక‌లి తీర్చేందుకు రూ. 5/-ల‌కే పెడుతున్ అన్న‌పూర్ణ భోజ‌నాన్ని పూర్తిగా ప్ర‌భుత్వం ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తుంది.  లాక్‌డౌన్ నేప‌థ్యంలో వ‌స‌తి గృహాలు, షెల్ట‌ర్ హోమ్స్‌, అక్క‌డ‌క్క‌డ హోట‌ల్స్, రెస్టారెంట్ల‌లో చిక్కుకుపోయిన‌వారికి కూడా అన్న‌పూర్ణ భోజ‌నాన్ని అందిస్తున్నారు. ఏ ఒక్క‌రు ఆక‌లితో ఉండ‌రాద‌నే ఉద్దేశంతో ప్ర‌జాప్ర‌తినిధులు, జిహెచ్‌ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు కోరిన విధంగా ఫంక్ష‌న్‌హాళ్లు, క‌మ్యునిటీహాల్స్‌, దేవాల‌యాల ప్రాంగ‌ణాలు, స్టేడియంలు ఇత‌ర ప్ర‌దేశాల్లో ఆశ్ర‌యం క‌ల్పించి వారికి కూడా అన్న‌పూర్ణ కేంద్రాల ద్వారా ఉచితంగా భోజ‌నాన్ని అందిస్తున్నారు.

ఇంట్లోనే వుండండి! బ‌య‌టికివెళ్తే క‌రోనాకాటు త‌ప్ప‌దు!

లాక్ డౌన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని హెచ్చ‌రిస్తూ రాజ్యసభ సభ్యులు సంతోష్  పెట్టిన ట్విట్టర్ వీడియో ఆలోచింపచేస్తోంది.  లాక్ డౌన్ నిబంధన ఉన్నప్పటికీ కూడా తన తల్లి మాటను లెక్కచేయకుండా తనకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందని చెప్పి నిర్లక్ష్యంతో బయటకు వెళ్లి కరోన వైరస్ ను తన వెంట తీసుకొని వచ్చి తన కుటుంబ సభ్యులకు దానిని అంటించటం వల్ల  తన తల్లి ప్రాణాలు కోల్పోయే ఒక సందేశాత్మకమైన వీడియోను రాజ్యసభ సభ్యులు సంతోష్  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎం.పి. సంతోష్ ఎంతో సందేశాత్మకమైన పోస్ట్ పెట్టారని అభినందిస్తున్నారు.   ఇంక కొంత కాలం ఓపిక అవ‌స‌రం. నిర్లక్ష్యంగా వ్యవహరించి కుండా, ఇంటి వద్దనే ఉండటమే కాకుండా తన కుటుంబసభ్యులు కూడా మంచిగా ఉండే విధంగా వ్యవహరించాలని ఎం.పి.కోరారు. కరోనా వైరస్ ప్రబలకుండా వుండేందుకు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ ను ప్రజలు స‌హ‌క‌రిస్తున్నారని మ‌రి కొంత కాలం ఓపిక‌గా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ఆయ‌న కోరారు.

గ‌వ‌ర్న‌ర్‌ల‌తో రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి వీడియో కాన్ఫరెన్స్!

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కలిసి కరోనా కట్టడి విషయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలపై ఆరా తీశారు.  ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు పాల్గొన్నారు.  లాక్‌డౌన్‌తో పాటు సామాజిక దూరం పాటిస్తూ దేశ‌ప్ర‌జ‌లు స‌మిష్టిగా క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డానికి కృషి చేస్తున్నార‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు.  ఈ డెడ్లీ వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురికాకుండా వారిలో ధైర్యం నింపేలా చ‌ర్య‌లు తీసుకోండని సూచించారు. వైర‌స్ బారిన ప‌డిన బాధితుల‌కు సేవ‌లందించ‌డానికి ముందువ‌రుస‌లో ఉండి డాక్ట‌ర్లు, మెడిక‌ల్ సిబ్బంది, పారిశుద్ధ‌కార్మికులు, పోలీసులు  పోరాడుతున్నారు. వారిపై ఎలాంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం వుందని ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు సూచించారు.     ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఉన్న ప‌రిస్థితులు, క‌రోనా ప్ర‌భావం, ప్ర‌త్యేకంగా కేంద్రం ఇచ్చిన ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌ల‌తో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు స‌మీక్షించారు.  లాక్‌డౌన్ సంద‌ర్భంగా కేంద్రం ప్ర‌క‌టించిన ప‌థ‌కాలతో పాటు, ప్ర‌త్యేకించి వ‌ల‌స కూలీల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హిరించారు,  రాజ్‌భ‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను గ‌వ‌ర్న‌ర్‌లు ఉప‌రాష్ట్ర‌ప‌తికి  ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

ఎస్.ఆర్.నగర్ రోడ్లపై ఉమ్మేస్తూ పాతబస్తీ యువకుడు హల్‌చల్!

మనకి చెడు జరిగింది కాబట్టి ఇతరులకు కూడా చెడు తలపెట్టాలనుకునే మనస్తత్వం కొందరికి ఉంటుంది. ఈ కరోనా కష్టకాలంలో అలాంటివారు చాలామంది వెలుగులోకి వచ్చారు. కరోనా లక్షణాలు ఉన్నవారు.. కావాలనే మాస్క్ తీసేసి పబ్లిక్ ప్లేసుల్లో దగ్గడం, నోటిలోని తేమని తీసి లిఫ్ట్ ల్లో, మెట్రోల్లో పూయడం.. ఇలా పలు సంఘటనలు కెమెరా కంటికి చిక్కాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ లో చోటుచేసుకుంది. ఒక యువకుడు బైక్ పై వచ్చి ఎస్.ఆర్. నగర్ కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఉమ్మేస్తూ తిరుగుతుండంటంతో.. అక్కడి స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువకుడు పాతబస్తీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతను ఎవరు? ఎందుకు ఇలా చేసాడు? కరోనా లక్షణాలు ఉన్నాయా? తనకి కరోనా ఉందేమోనన్న అనుమానంతో ఇతరులకు కూడా సోకాలనే ఉద్దేశంతో ఇలా చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు యువకుడి తీరుతో స్థానికుల్లో ఆందోళన నెలకొనడంతో.. జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగి.. ఆ యువకుడు తిరిగిన రోడ్లను శానిటైజ్ చేసారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తూ అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, ఒకవేళ బయటకు రావాల్సిన పరిస్థితి వస్తే.. తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని కోరుతున్నారు.

వీరు రోగులు కాదు... మ‌ద‌ర‌సాలో ఆక‌లితో అలా చేస్తున్నార‌ట‌!

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోకు సంబంధించిన అస‌లు వాస్త‌వాలు ఏమిటి?  నిజంగా ప్లేట్‌లు, చెంచాలు నాకుతున్న వీరికి క‌రోనా పాజిటివ్ వుందా? ఎందుకు వీరు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు?  మ‌నం ఇప్పుడు ఒక మ‌ద‌ర‌సాను చూద్దాం. ఎంత దారుణంగా ఇక్క‌డ పిల్ల‌లు వుంటున్నారో చూడండి. చందా డ‌బ్బుల‌తో మ‌ద‌ర‌సా నిర్మాణం అయితే చేశాడు కానీ లోప‌ల క‌నీస వ‌స‌తులు లేవు. ఇలాంటి దృశ్యాలు చూపించి ఎన్ని సార్లు ఎంత మంది ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బు వ‌సూలు చేసుకున్నాడో మ‌ద‌ర‌సా నిర్వాహ‌కుడు ఆ దేవుడికే తెలుసు.  కానీ పిల్ల‌లు దుర్భ‌ర‌మైన బ్ర‌తుకు బ‌తుకుతున్నారిక్క‌డ‌. క‌నీసం నేల‌పై ప‌రుచుకోవ‌డానికి ఎలాంటి దుప్ప‌టి లేదు. ఇక్క‌డ క‌నిపిస్తున్న‌ పిల్ల‌లే వారి వారి ఇళ్ల నుంచి తెచ్చుకున్న దుప్ప‌ట్లు అవి. పిల్ల‌లే ఊడ్చుకోవాలి. పిల్ల‌లే క‌డిగి శుభ్రం చేసుకోవాలి. కానీ ఎంత మంది పిల్ల‌లు చేస్తారు. అందుకే అక్క‌డ వ‌స్తున్న దుర్వాస భ‌రించ‌లేకుండా వుంద‌ని, ఈ పిల్ల‌లు ఎలా వుంటున్నార‌ని అనిపిస్తోంది క‌దూ! అవును వారి పేద‌రిక‌మే ఇక్క‌డ‌కు చేర్చింది. అంతే. వేరే క‌థే లేదు. ముస్లింల‌లో వున్న క‌టిక దారిద్ర‌మే. డ‌బ్బున్న ముస్లింలు జ‌కాత్ రూపంలో చందా ఇచ్చినా ఈ పేద పిల్ల‌ల‌కు ఎంత వ‌ర‌కు చేరుతుందో దేవుడికే తెలియాలి. కానీ మ‌ద‌ర‌సా నిర్వాహ‌కులు మాత్ర‌మే స‌మాజంలో పెద్ద‌మ‌నుషులే. వారికి మంచి హోదా, గౌర‌వం కూడా వుంటుంది. వాళ్ళు నిర్వ‌హించే మ‌ద‌ర‌సా ఎలా వుంటుందంటే మ‌నం చూస్తున్న వీడియోనే  అద్దం ప‌డుతుంది. ఈ వీడియోలో క‌నిపిస్తున్న దృశ్యాలు మ‌ద‌ర‌సాకు సంబంధించిన‌వి! అయితే మ‌ద‌ర‌సాలో ఈ పిల్ల‌లు ఎందుకు ప్లేట్లు నాకుతున్నారు? దారుణ‌మైన విష‌యం ఏమిటంటే ఆక‌లి వీరితో ఆలా చేయించింది. అవును. నిజ‌మే. అస‌లు మ‌ద‌ర‌సాలో ఎందుకు చేరుతున్నారు?  కేవ‌లం ఆక‌లి తీర్చుకోవ‌డానికే అనేది క‌ఠిన‌మైన వాస్త‌వం.  క‌టిక ద‌రిద్రంలో వున్న కుటుంబాల వారి వ‌ద్ద‌కి కొంత మంది మ‌ద‌ర‌సా నిర్వాహ‌కులు వెళ్ళి వారి కుటుంబాల‌కు సంవ‌త్స‌రానికి ప‌ది వేల రూపాయ‌లు ఇచ్చి ఆ పిల్ల‌ల్ని మ‌ద‌రాసాకు తీసుకువ‌స్తారు. ఈ పిల్ల‌ల్నిచూపించి చందాలు వ‌సూలు చేస్తారు. ఒక పిల్ల‌వాడి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు కోసం ఎంత మంది దాత‌లు దొరికితే అంత మంది ద‌గ్గ‌ర డ‌బ్బులు చందా రూపంలో తీసుకొని ఆ మ‌ద‌ర‌సా నిర్వాహ‌కుడి సొమ్ములు చేసుకుంటాడు. క‌నీసం ఈ పేద పిల్ల‌ల‌కు క‌డుపునిండా అన్నం పెట్ట‌డు. శుభ్ర‌త కోసం అవ‌స‌ర‌మైన నీళ్ళు ఇవ్వడు. అంతా పొదుపు పాటించేలా నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తాడు మ‌ద‌ర‌సాలో. ఆ ప్లేట్లు క‌డ‌గ‌కుండా మొత్తం నాకీ పెట్టుకుంటారు. మ‌ళ్లీ అదే ప్లేటు వాడే స‌న్నివేశాలు కొన్ని మ‌ద‌ర‌సాల్లో క‌నిపిస్తాయి. ఇక్క‌డ జ‌రిగిందేమిటంటే ఆ రోజు మ‌ద‌ర‌సా నిర్వాహ‌కులు కొంత మంది దాత‌ల్ని పిలిచి విందు ఇచ్చాడ‌ట‌. మంచి భోజ‌నం, స్వీట్లు తిన్న‌ దాత‌లు భారీ ఎత్తునే చందా ఇచ్చార‌ట‌. అయితే మ‌ద‌ర‌సాలో ఆక‌లితో వున్న పిల్ల‌ల‌కు ఆ రోజు స‌రిప‌డ భోజ‌నం దొర‌క‌లేద‌ట‌. ఏం చేస్తారు. స్వీట్‌కు సంబంధించిన పంచ‌దార‌ పాకం ఆ ప్లేట్‌ల‌కు చెంచాల‌కు అంటి వుండ‌టంతో ఆ పిల్ల‌లు అలా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు తేలింది. నిరుపేద ముస్లింల అక్ష‌రాస్య‌త‌కు, ఆకలి తీర్చుకోవ‌డానికి మ‌ద‌ర‌సాలు కొంత ఉప‌యోగ‌ప‌డుతున్నా కేవ‌లం ఇక్క‌డ  మతపరమైన బోధనా కొనసాగుతోంది. మదరసా విద్య లో ఆధునిక విద్యా ప్రణాళిక  లేకపోవడంతో, ముస్లింలు ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో పోటీ చేయలేక మ‌ద‌ర‌సా నుంచి బ‌య‌టికి వ‌చ్చిన వ్య‌క్తి తాను మ‌రో మ‌ద‌ర‌సా స్థాపించి చందాల‌పైనే ఆధార‌ప‌డే వ్య‌వ‌స్థ త‌యారైంది. ముస్లింలు ఖ‌ర్చుపెడుతున్న జ‌కాత్ ఇలా మ‌ద‌ర‌సా నిర్వాహ‌కుల జేబుల్లోకి వెళ్తుంద‌నే విమ‌ర్శులున్నాయి.

ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాలు కేటాయించండి!

క‌రోనా వైర‌స్‌ను త‌రిమివేయ‌డానికి ఈ ఆదివారం ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంట‌ల‌కు మీ అంద‌రి 9 నిమిషాలు అడుగుతున్నాను. ప్ర‌తి ఒక్క‌రూ ఇంటిలోని లైట్ల‌ను ఆపివేసి బాల్కానీలో నిల‌బ‌డి క్యాండిల్ వెలిగించండి. లేక‌పోతే మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించండి. దేశ‌మంతా నాలుగువైపుల వెలుగు నింపుదాం. ఆ వెలుగులో మ‌న‌మంతా సంక‌ల్పం చేసుకుందాం. మ‌నం ఒంట‌రిగా లేం. 130 కోట్ల దేశ‌ప్ర‌జ‌లంతా క‌లిసి వున్నాం.  రోడ్ల మీద‌కు, గ‌ల్లీలోకి వెళ్ల‌వ‌ద్దు. స‌మాజిక దూరం పాటిస్తూ వెలుగు వెలిగించాలి. క‌రోనా చైన్‌ను విర‌గ‌గొట్ట‌డానికి రామ‌బాణం లాంటిది స‌మాజిక దూరం. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌నోధైర్యం విజ‌యాన్ని క‌లిగిస్తోంది. ఉత్సాహం, స్పూర్తి కంటే పెద్ద శ‌క్తి  ప్ర‌పంచంలో మ‌రేదీ లేదు. మ‌నోధైర్యానికి మంచిన శ‌క్తి లేదు. అంద‌రం క‌లిసి క‌ట్టుగా క‌రోనాను ఓడించుదాం. అంటూ ప్ర‌ధాన‌మంత్రి మోదీ వీడియో సందేశం ఇచ్చారు.   క‌రోనా డెడ్లీ వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ 9 రోజులైంది. ప్ర‌జ‌లు, అధికారులు అంద‌రూ స‌మిష్టిగా స‌హ‌క‌రించారు. అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. ఈ రోజు ఎన్నో దేశాలు మ‌నం అనుస‌రించిన విధానాన్ని అనుస‌రిస్తున్నారు. జ‌న‌తా క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్‌, చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం ఇవ‌న్నీ ఇత‌ర దేశాలు అనుస‌రిస్తున్నాయి.  దేశమంతా క‌లిసి క‌ట్టుగా క‌రోనాపై యుద్ధంచేస్తున్నాం. ఇదొక చారిత్మ‌క‌ఘ‌ట్టంగా పి.ఎం. అభివ‌ర్ణించారు.  ఇంత పెద్ద యుద్ధం ఎన్ని రోజులు చేయాలి? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. లాక్‌డౌన్ స‌మ‌యం ఇది. మ‌నం మ‌న ఇండ్ల‌లో వున్నాం. అంత మాత్రాన మ‌నం ఒంట‌రివారం కాదు. మొత్తం 130 కోట్ల మంది స‌మిష్టిగా వున్నాం. స‌మిష్టిగా క‌రోనాపై యుద్ధం చేస్తున్నాం. ప్ర‌జ‌లు భ‌గ‌వంతుని స్వ‌రూపం అంటారు. ఆత్మ‌స్థైర్యం, మ‌నోబ‌లంతో క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోందాం.  పేద‌లపై క‌రోనా దుష్‌ప్ర‌భావం తీవ్రంగా వుంది. వారిలో ఆత్మ‌స్థైర్యం నింప‌వ‌ల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క‌రోనా వైర‌స్‌ను త‌రిమివేయ‌డానికి ఈ ఆదివారం ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంట‌ల‌కు మీ అంద‌రి 9 నిమిషాలు అడుగుతున్నాను. ప్ర‌తి ఒక్క‌రూ ఇంటిలోని లైట్ల‌ను ఆపివేసి బాల్కానీలో నిల‌బ‌డి క్యాండిల్ వెలిగించండి. లేక‌పోతే మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించండి. వెలుగు నింపుదాం. ఆ వెలుగులో మ‌న‌మంతా సంక‌ల్పం చేసుకుందాం.  అంద‌రం క‌లిసి క‌ట్టుగా క‌రోనాను ఓడించుదాం.