క‌రోనాకు కొమ్ములొచ్చాయి! రూపు మార్చుకొని బ‌ల‌హీన‌ప‌డింది!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ భారత్‌కు వచ్చేసరికి దాని రూపు మార్చుకుని బలహీనపడి తోక మూడిచిందని ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజిస్ట్‌ డా.డి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌.. అక్కడ బలపడి యూరప్‌ దేశాలకు విస్తరించిందని, అప్పటికే మ్యుటేషన్‌ (రూపాంతరం) చెంది ఇటలీలో బీభత్సం సృష్టించిందని ఆయ‌న తెలిపారు. ఆ తర్వాత మెల్లగా స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాల్లో విస్తరించాక, ఇండియాకు చేరిందన్నారు. అయితే ఆసియా దేశాలకు వచ్చేసరికి మరోసారి మ్యుటేషన్‌ చెంది వైరస్‌ బలహీన పడిందని చెప్పారు. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రొ ఎంటరాలజీ అధినేత డా.డి.నాగేశ్వరరెడ్డి వైరస్‌ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెల్ల‌డించారు. వుహాన్‌ నుంచి ఇటలీకి వైరస్‌ చాలా ప్రాథమిక దశలోనే వెళ్లింది. మొత్తం మూడు మ్యుటేషన్‌లు జరిగినట్టు మనకు పరిశోధనల్లో తేలింది. ఇటలీకి వెళ్లిన సమయంలో జరిగిన మ్యుటేషన్‌ బలంగా ఉంది. అందుకే ఎక్కువ ప్రభావం చూపించింది. ఈ మ్యుటేషన్లలో 3 అమైన్‌ యాసిడ్స్‌ మారాయి. మన దేశానికి వచ్చిన వైరస్‌కూ.. వుహాన్‌లో మొదలైన వైరస్‌కు తేడా వుందని ఆయ‌న చెప్పారు.     మన దేశంలో వచ్చిన వైరస్‌ మ్యుటేషన్‌కూ, ఇటలీ వైరస్‌ మ్యుటేషన్‌కూ తేడా ఉంది. మన దేశంలోకి వచ్చే సరికి సైక్‌ మ్యుటేషన్‌ అంటే కొమ్ములు పెరిగిన వైరస్‌ వచ్చింది. దీన్ని బట్టి మన దగ్గరున్న వైరస్‌ ఇటలీలో ఉన్న వైరస్‌ కంటే బాగా బలహీన పడింది. ఈ కొమ్ములు బాగా ఉన్న వైరస్‌ మన శరీరంలోని కణాలతో అల్లుకుపోవడం (ఇంటరాక్షన్‌) చాలా తక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ వల్ల మనకు జరిగే నష్టం చాలా తక్కువని డా.డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు.

లాక్‌డౌన్ ఫ‌లితం.. క‌రోనా త‌గ్గుతోంది!

పంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు దాదాపు 60 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండేవి. అయితే ఆదివారం మాత్రం ఆ సంఖ్య 55 వేలకు పడిపోయింది.   మనదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.  మార్చి 21వ తేదీ నుంచి కేసుల్ని ప‌రిశీలిచిన‌ట్లైతే మార్చి 21వ తేదీ 22వ తేదీ మ‌ధ్య పాజిటివ్ కేసుల పెరుగుద‌ల 39.92 కాగా, 1. March 21st (283 cases) -  March 22nd (396 cases) Increase by 39.92 % 2. March 22nd (396 cases) -  March 23rd (468 cases) Increase by 18.18 % మార్చి 23వ తేదీ వ‌చ్చే స‌రికి 18 శాతానికి త‌గ్గింది.  3. March 23rd (468 cases) -  March 24th (566 cases) Increase by  23.43 % మార్చి 24వ తేదీ నాటికి 23 శాతానికి పెరిగింది. 4. March 24th (566 cases) -  March 25th (645 cases) Increase by  13.95 % మార్చి 25వ తేదీ నాటికి 13 శాతానికి త‌గ్గింది. 5. March 25th (645 cases) -  March 26th (720 cases) Increase by just 11.62 % మార్చి 26వ తేదీ నాటికి 11 శాతానికి త‌గ్గింది. 6.March 26th (720 cases) March 27th (854 cases) increased by 12.97% మార్చి 27వ తేదీ నాటికి 13 శాతానికి పెరిగింది. 7. March 27th (854 cases) March 28th (939 cases) Increased by 9% only మార్చి 28వ తేదీ నాటికి 9 శాతానికి త‌గ్గింది. 8.March 28th  (939 cases) March 29th (1,1024 cases) మార్చి 29వ తేదీ నాటికి 9 శాతం వ‌ద్దే నిల‌క‌డ‌గా వుంది. పెరుగుదల రేటు 36.92% నుండి 9% కి తగ్గింది (8 రోజుల్లో గ్రాఫ్ ఇలా క‌నిపిస్తోంది. పరిస్థితి స్థిరంగా ఉంది.

కేసీఆర్ సర్కార్... సామాన్యుడి బాధలపై స్పందించండి!

లాక్ డౌన్ కారణంగా డయాలసిస్ కు వెళ్లలేని ఒక సామాన్యుడి కథ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ ఔట్ గేట్ దగ్గర అరటి పండ్లు అమ్ముకునే ఒక చిరు వ్యాపారి అయిన 55 ఏళ్ల మొహమ్మద్ వాజిద్ కిడ్నీ పేషంట్. వారం వారం డయాలసిస్ కు వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా మహావీర్ హాస్పిటల్ కు. ఓ యూ ఔట్ గేట్ నుంచి ఏ సి గార్డ్స్ లో ఉన్న మహావీర్ హాస్పిటల్ కు వెళ్లాలంటే, ఈ లాక్ డౌన్ పీరియడ్ లో వాజీద్ లాంటి వారికి సాధ్యమయ్యే పని కాదు. అయితే, తెలంగాణా ప్రభుత్వం ట్విట్టర్ లో చేస్తున్న హడావుడి, ఇలాంటి బడుగు జీవుల విషయం లో మాత్రం కనపడటం లేదనేది వాస్తవం. 21 రోజుల లాక్ డౌన్ దేశంలో ప్రజా జీవితాన్ని పూర్తిగా స్థంభింపచేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తాజా ఆదేశాల అమలు అత్యంత అనివార్యమని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించారు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి కంటే తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. అయితే.. ప్రాణాంతకమైన కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే ఇంత కంటే వేరే మార్గం లేదని ప్రతీ ఒక్కరు అంగీకరించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాలకు చేసిన సూచనలు అత్యంత కీలకంగా మారాయి. ప్రభుత్వాల పిలుపులో తీవ్రతను ప్రజలు అర్థం చేసుకున్నా.. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఈ లాక్ డౌన్ అత్యంత దారుణమైన పరిస్థితులను సృష్టించింది. ముఖ్యంగా ఉపాధి కోసం దేశంలో ఎక్కడి నుంచి మరెక్కడికో వలస వెళ్ళి దినసరి కూలీ మీద జీవితాలను వెల్లదీస్తున్న వారికి లాక్ డౌన్ తినడానికి తిండి లేకుండా చేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. దాంతో ఎలాగైనా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తున్నారు వలస కార్మికులు, వలస జీవులు. కొందరైతే వందల కిలోమీటర్లు కాలినడకన తమ సొంత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. మరికొందరు అక్రమ మార్గాల్లో సొంత ప్రాంతాలకు చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇందులో భాగమే.. తాజాగా మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి గూడ్స్ వెహికిల్ వచ్చేందుకు విఫలయత్నం చేసినవారే ఉదాహరణ. ఇలాంటి వారికోసమే తాజాగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తమతమ రాష్ట్రాలలో వలస కార్మికులుగా జీవనం వెల్లదీస్తున్న వారికి అక్కడే ఏదో రకంగా షెల్టర్ కల్పించాలన్నది కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాల సారాంశం. వలస జీవులకు తాత్కాలిక షెల్టర్లు నిర్మించి ఆశ్రయం కల్పించాలని, కేంద్రం ఇస్తున్న బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలను వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దేశంలోని 18 మంది ముఖ్యమంత్రులకు లేఖ రాస్తూ.. వారి వారి రాష్ట్రాలలో వున్న బెంగాలీలకు ఆశ్రయం, ఆహార సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదే విధంగా తెలంగాణలో వున్న ఆంధ్రా కార్మికులకు, విద్యార్థులకు, తాత్కాలిక ఉద్యోగులకు ఆశ్రయం కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కేసీఆర్‌ను కోరారు. ఈ క్రమంలో కేంద్రం వలస జీవుల కష్టాలపై స్పందిస్తూ… వారికి ఆశ్రయ, ఆహార సౌకర్యాలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఇదే క్రమం లో దీర్ఘ కాలిక రోగాలకు చికిత్స పొందే దిగువ మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల వారికి ప్రత్యామ్నాయ రవాణా  సౌకర్యం,తక్షణ వైద్య సౌకర్యం అందే ఏర్పాటు చేయాలనేది ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్.

విందే జ‌ర‌గ‌లేదు! మేం ఎలా వెళ్తాం?

జ‌ర‌గ‌ని విందుకు ఎమ్మెల్యేలు వెళ్ళారంటూ కొంత మంది రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ప‌నిగ‌ట్టుకొని విష‌ప్ర‌చారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా వైరస్‌ను రాజకీయాలకు వాడుకోవడం నీచమైన చర్య అని ఆయ‌న‌ మండిపడ్డారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. గుర్తు పెట్టుకుంటాం. భ‌విష్య‌త్‌లో రాజ‌కీయంగా చూసుకుందామ‌ని అంబ‌టి హెచ్చ‌రించారు. అసలు విందే జరగలేదని.. జరగని విందుకు తామేలా వెళ్తామని ప్రశ్నించారు. తాన‌తో పాటు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు వెళ్లిన‌ట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  తామంతా క్వారంటైన్‌కు వెళ్లాలని ట్రోల్ చేస్తూ రాక్ష‌స ఆనందాన్ని పొందుతున్నార‌ని, నిజంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే.. సామాజిక బాధ్యతగా తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

యాచకులకు శరణార్థ శిబిరం!

భిక్షాటన తో పొట్టపోసుకునే యాచకుల కు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి డాక్టర్ వీ.శ్రీనివాస్ గౌడ్ సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని, స్వీయ నిర్భంధమే శ్రీరామరక్ష అన్న మంత్రి ఈ సంద‌ర్భంగా అన్నారు.     జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో తాత్కాలిక శరణార్థ శిబిరం ఏర్పాటు చేసి యాచకులను అక్కడికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన వసతులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.  యాచకులు అందరినీ ఆత్మీయంగా పలకరించి ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకుంటామని అందరి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.  ఈ సందర్భంగా వారికి కొత్త దుస్తులతో పాటు గా భోజనాన్ని అందజేశారు.   ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారికి కూడా సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశం ఎప్పుడు లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ప్రతి ఒక్కరు ఇళ్ల కే పరిమితమై కరోణ మహమ్మారిని నియంత్రించాలని పిలుపునిచ్చారు. జడ్చర్ల కావేరమ్మ పేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోణ సోకిందని కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు వచ్చే వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. 

కనిక ఆరోగ్యం ఎలా ఉంది?

కనికా కపూర్ ప్రస్తుతం ఇండియాలో పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా అందరితో కలిసి తిరిగిన బాలివుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా సోకిందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్న కనికా కపూర్ కు నాలుగో సారి కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ నెల 9వ తేదీన లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్ పెద్ద పార్టీ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద వారిని విందుకు పిలిచింది.  దాదాపు 200 మందిని కలిసింది. ఆమె కలిసిన వారిలో బిజెపి ఎంపి దుష్యంత్ సింగ్, వసుంధరా రాజే సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఆమెను కలిసిన తర్వాత దుష్యంత్ సింగ్ రాష్ట్రపతిని కలిశారు. మరికొంత మంది ఎంపిలను కూడా ఆయన కలిశారు. తర్వాత ఆమెకు కరోనా లక్షణాలు బయట పడటంతో ఈ నెల 20న ఆమెను క్వారంటైన్ చేశారు. అప్పటి నుంచి చికిత్స జరుగుతున్నా ఆమె పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూనే ఉందట. అంతే కాదు కనిక బ్రిటన్ యువ రాజు ప్రిన్స్ చార్లెస్ ను కూడా కలిసినట్లు ఆమె తాజా ఫొటోలను చూస్తే తెలుస్తోంది. ఆయనక్కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. కనికా కపూర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ఆమెను వేరే చోటుకు తీసుకెళ్లేందుకు కూడా వీలు కలగడం లేదని ఆమె కుటుంబ సభ్యుడు ఒకరు చెప్పారు. భగవంతుడిని ప్రార్థించడం మినహా మరేం చేయలేకపోతున్నామని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు శాంపిళ్ళు పాజిటివ్ వచ్చిన కనిక కు నాలుగవ శాంపిల్ కూడా పాజిటివ్ వచ్చిందని,  వైద్యానికి ఆమె శరీరం కూడా సరిగా ప్రతిస్పందించడం లేదని, దేవుడిని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేక పోతున్నామని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

జర్మనీ మంత్రి ఆత్మహత్య

 కరోనా వైరస్ కల్లోలంతో కలత చెందిన జర్మనీ హెస్సేల్ స్టేట్ ఆర్ధిక మంత్రి థామస్ షెఫర్ ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ విషయంన్ని స్టేట్ ప్రీమియర్ వోల్కర్ బోఫీర్ ధృవీకరించారు. థామస్ షెఫర్ ఈ కరోనా వైరస్ కారణంగా బాగా ఆందోళనాకు లోనయ్యారని బొఫీర్ పేర్కొన్నారు. 54 సంవత్సరాల థామస్ బొఫీర్ శనివారం నాడు రైల్వే ట్రాక్ దగ్గర విగతజీవిగా పడి  ఉండటాన్ని గుర్తించినట్టు వేస్ బ్యాడెన్ ప్రాసిక్యూషన్ కార్యాలయం వెల్లడించింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది.  స్టేట్ ప్రీమియర్ బొఫీర్ ఈ విషయం మీద స్పందిస్తూ, థామస్ షెఫర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని నమ్మలేకపోతున్నామని, ఈ తరుణంలో ఇది తామందరికీ అత్యంత బాధ కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగాఉత్పన్నమైన ఆర్ధిక పరమైన సమస్యలను ఎలా అధిగమించగలమనే ఆందోళన వల్లనే థామస్ షెఫర్ ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చునని ఆయన భావించారు.  హెస్సే వాస్తవానికి ప్రముఖ వాణిజ్య సంస్థలైన డ్యూషే బ్యాంక్, కామర్స్ బ్యాంక్ ల ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతం. గడిచిన పదేళ్లుగా హెస్సే స్టేట్ కు థామస్ బొఫీర్ ఆర్ధిక మంత్రి గావ్యవహరిస్తున్నారు. ఈ కరోనా వైరస్ బారిన పడిన కంపెనీలను, ఉద్యోగులను, కార్మికులను ఆర్ధికంగా ఆదుకునే దిశగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన థామస్ షెఫర్  ఆత్మహత్యకు పాల్పడ్డారు.

త‌ప్పుడు ప్ర‌చారం చేసేవారికే క‌రోనా రావాలి!

క‌రోనా విస్త‌రిస్తోందంటూ ర‌క‌ర‌కాల విష‌ప్ర‌చారాలు చేస్తున్నారు. కొంత మంది దుర్మార్గంగా ప‌నిక‌ట్టుకొని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. వారికి ఎలాంటి శిక్ష‌లుంటాయో చూపిస్తా! దిక్కుమాలిన చిల్ల‌ర ప్ర‌చారం చేసే వారికి క‌రోనా సోకాల‌ని సి.ఎం. శాప‌నార్ధాలు పెట్టారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకోవ‌డమా? అది మంచిది కాదు. త‌ప్పుడు అభిప్రాయాలు ప్ర‌చారం చేయ‌వ‌ద్దు. అలాంటి వారి తాట తీస్తాన‌ని సి.ఎం. హెచ్చ‌రించారు.  ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వ‌ల‌స‌కార్మికుల్ని ఆదుకోవాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర పున‌ర్ నిర్మాణ ప్ర‌క్రియ‌లో ఈ కార్మికులు తెలంగాణాకు పార్ట‌న‌ర్స్‌. వారిని క‌డుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఆహార వ‌స‌తితో పాటు మెడిక‌ల్ కేర్ తీసుకోవాలి. అవ‌స‌ర‌మైతే ఫంక్ష‌న్ హాల్‌లో నైనా వంట చేసి భోజ‌నం పెట్టండి. ఎవ‌రూ ఆక‌లితో బాధ‌ప‌డ‌వ‌ద్దు. వ‌ల‌స కార్మికులు ఏ స్టేట్‌కు చెందిన వారైనా ఆదుకుంటాం. క‌రోనా విస్పోట‌నం ఎలా వుంటుందో తెలియ‌దు. కాబ‌ట్టి అప్ర‌మ‌త్తంగా వుందామ‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.  వ‌ల‌స కార్మికులు ఏ స్టేట్‌కు చెందిన‌వారైనా మీరంతా మా స‌హోద‌రులు. మీకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పిస్తాం. ధైర్యంగా వుండండ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు.  మీ రాష్ట్రాల‌కు వెళ్లిపోవాల‌ని అనుకోవ‌ద్దు. మా కుటుంబ‌స‌భ్యుల్లా మిమ్మ‌ల్ని కాపాడుకుంటా. 12 కిలోల రేష‌న్ ఇస్తాం. ఒక్కో మ‌నిషికి 500 రూపాయ‌ల ఆర్థిక స‌హాయం ఇస్తాం. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలి. అప్ర‌మ‌త్తంగా వుంటేనే క‌రోనా కాటునుంచి కాపాడుకోగ‌లుగుతాం. ఇండోనేషియా ద‌రిద్రుల కార‌ణంగా 10 మందికి వ‌చ్చింది. నిన్న ఖైర‌తాబాద్‌లో స‌చ్చిన వాడు కూడా మ‌న కంట్రోల్‌లో చ‌నిపోలేదు. బ్ర‌తికి వున్న‌ప్పుడు వ‌స్తే బ్ర‌తికించే వాళ్ళాం. చ‌నిపోయిన త‌రువాత టెస్ట్ చేస్తే ఆ వృధ్దుడికి పాజిటివ్ వ‌చ్చింది.   గుంపులుగా జ‌మా కాకుండా రైతులు కొనుగోలు కేంద్రాల వ‌ద్ద త‌మ పంట‌ను అమ్ముకోవాల‌ని సూచించారు.  చిల్ల‌ర దందాల‌కు పాల్ప‌డిన వారికి క‌రోనా సోకాల‌ని సి.ఎం. శాపం ఇచ్చారు. కాబ‌ట్టి ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అంద‌రూ న్యాయ‌బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సి.ఎం సూచించారు.

మార్కెట్ యార్డుల‌న్నీ మూసివేశాం! గ్రామాల్లోనే పంట కొంటాం!

మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు చేయం! రైతుల వ‌ద్ద‌కే వెళ్ళి పంట మొత్తం, ప్ర‌తి గింజ‌, ప్ర‌తి కిలో ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తోంది. కాబ‌ట్టి రైతులు ఎవ‌రూ తొంద‌ర ప‌డ‌వ‌ద్దు. అంద‌రికీ కూప‌న్‌లు ఇస్తాం. వంతుల వారీగా వెళ్ళి రైతులు  త‌మ పంటను అమ్ముకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. రైతుల శ్రేయ‌స్సు కోసం రాజీ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. ప్ర‌త్యేక మైన ప‌రిస్థితుల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సి.ఎం తెలిపారు. డ‌బ్బులు ఆన్‌లైన్‌లో రైతుల‌కు చేరుతాయి. కాబ‌ట్టి రైతుల ధాన్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మ‌ద్ద‌తుధ‌ర ఇచ్చి కొనుగోలుచేస్తామ‌ని మ‌రోసారి సి.ఎం. భ‌రోసా ఇచ్చారు.  మార్కెట్ యార్డుల‌న్నీ మూసివేశాం. మొత్తం ధాన్యం గ్రామాల్లోనే కొనుగోలు చేస్తాం. నియంత్రిత కొనుగోళ్ళు కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తాం. కాబ‌ట్టి అన‌వ‌స‌రంగా రైతులు కొనుగోలు కేంద్రాల‌మీద ఎగ‌బ‌డ‌వ‌ద్దు. కూప‌న్ ప్ర‌కార‌మే వ‌చ్చి పంట అమ్ముకోవాలి. 40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంట తెలంగాణాలో పండింది. ప‌ద్నాల్గున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల్లో మొక్క‌జొన్న పంట పండింది.  రైతుల పంట కొనుగోలు చేయ‌డానికి 25 వేల కోట్ల రూపాయ‌లు సివిల్ స‌ప్లాయిస్ కార్పొరేష‌న్‌కు ప్ర‌భుత్వం స‌మ‌కూర్చిందని ముఖ్య‌మంత్రి తెలిపారు. మార్కెఫెడ్‌కు మ‌రో మూడు వేల కోట్ల రూపాయ‌లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.   ఒక వేళ రైస్ మిల్ల‌ర్లు, వ్యాపార‌స్థులు పంట కొంటామ‌ని వ‌స్తే వారికి కూడా అమ్ముకోండి. అయితే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తేనే పంట అమ్ముకోండ‌ని సి.ఎం. రైతుల‌కు స‌ల‌హా ఇచ్చారు. గ్రామాల్లోకి ఎవ‌రినీ రానివ్వ‌మంటూ మొండిగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. అయితే పంట కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చే వారిని అడ్డుకోవ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. కంచె పెట్టిన చోటే నీళ్ళు అందుబాటులో పెట్టి కాళ్ళు చేతులు క‌డిగిన త‌రువాత ఊర్లోకి రానివ్వండ‌ని సూచించారు.  500 సెంట‌ర్‌ల‌లో హైద‌రాబాద్‌లో అన్నిర‌కాల పండ్లు అమ్మే ఏర్పాట్లు చేశామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.

ఏప్రిల్ 7 నాటికి   క‌రోనా ఫ్రీగా తెలంగాణా రాష్ట్రం!

తెలంగాణలో ఇప్పటివరకు 70 మంది కరోనా బారిన పడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 11మందికి కరోనా నయమైంది. మార్చి 29 ఆదివారం నాడు  చేసిన పరీక్షల్లో 11మందికి నెగిటివ్ వచ్చింది. రేపు వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నార‌ని తెలంగాణా ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు వెల్ల‌డించారు. తెలంగాణలో తొలి కరోనా బాధితుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  నిన్న 76 ఏళ్ళ వృధ్దుడు క‌రోనాతో చ‌నిపోయారు. ఈ రోజు క‌లెక్ట‌ర్‌లతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ విడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి మాట్లాడారు. క‌రోనా క‌ట్ట‌డికి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాం సి.ఎం. చెప్పారు.

బ్రిటీష్ ప్ర‌ధానిగా రిషి సునక్‌కు అవ‌కాశం ద‌క్క‌నుందా?

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం ద‌క్కుతుందా? ప‌్ర‌స్తుతం ఆర్థిక‌శాఖా మంత్రిగా రిషి సునక్ వున్నారు.   భారత సంతతికి చెందిన రిషి సునక్‌... బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో జన్మించారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి... 2015 ఎన్నికల్లో యార్క్‌షైర్ రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అచ‌లంచ‌లుగా ఎదుగుతూ  బ్రిటన్ ఆర్ధికమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు ప్ర‌ధాన‌మంత్రి అయ్యే అవ‌కాశం వుంది.   39ఏళ్ల రిషి సునక్... ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్‌ పట్టాలు అందుకున్నారు. ఆ తర్వాత స్టాన్ ఫర్డ్‌ వర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత పరిచయం కావడంతో... ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారడంతో 2009లో వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. అయితే, రిషి సునక్ రాజకీయాల్లోకి రాకముందు పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. ఇక, ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లోనూ రిషి సునక్ డైరెక్టర్ గా ఉన్నారు. బ్రిటీషుకు కరోనాదెబ్బ త‌గ‌ల‌డంతో ఆ దేశ‌ప‌గ్గాలు ఇండియ‌న్స్ చేతికి వ‌చ్చాయి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు ఇండియా ని పాలించారు.. అని విన్నాం. 200ఏళ్ల తర్వాత ఇండియన్ బ్రిటిష్ ని పాలించ బోవడం చూడబోతున్నాం. రాణి, రాజు, ప్రధాని, ఆరోగ్య మంత్రి అందరూ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు బ్రిటన్ పగ్గాలు, ఫైనాన్స్ మినిస్టర్ రిషి సునక్, హోమ్ మినిస్టర్ ప్రీతి పటేల్, బిజినెస్ మినిస్టర్ అలోక్ శర్మ గారి చేతుల్లో పడ్డాయి..   ఇప్పుడు బ్రిటన్‌లో భార‌తీయుల‌దే పెత్త‌నం. పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది మరి. దాదాపు 200 సంవత్సరాల పాటు భారత్‌ను తమ చేతుల్లో పెట్టుకొని.. మన దేశ సంపదనంతా దోచుకోవడంతో పాటు ఎంతోమంది అమాయకపు ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్‌ వారిని ఇప్పుడు భారతీయులే దిక్కయ్యారు. కరోనాతో ఆ దేశ రాణి (కోవిడ్ వచ్చినట్లు వార్తలు వచ్చినా.. అధికారికంగా ప్రకటించక లేదు), యువరాజు, ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక ఇలాంటి సమయాల్లో సాధారణంగా గ్రేట్ బ్రిటన్‌ను ఇంఛార్జ్ చేసే అవకాశం ఛాన్సలర్ ఆఫ్ ఎక్సెక్వర్‌ గానీ.. హోమ్ సెక్రటరీగానీ తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న ఇద్దరు(రిషి సునక్‌, ప్రీతి పటేల్‌) భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఓ మెసేజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. 300 సంవత్సరాల తరువాత సూర్యుడు అస్తమించని దేశాన్ని భారతీయులు పరిపాలిస్తున్నారు అని. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో రాబర్ట్ క్లైవ్‌, క్వీన్ విక్టోరియా, విన్‌స్టన్‌ చర్చిల్ ఆత్మలు సమాధుల్లో తిరుగుతూ ఉంటాయని కామెంట్ పెడుతున్నారు.

ఏపీలో కరోనా లెక్కల వాస్తవాలేంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి లెక్క పక్కాగా తెలుసుకున్నాం. రాష్ట్రంలో జలుబు, జ్వరం వచ్చిన వారి వివరాలు కూడా చిటెకలో తెలుసుకునేలా వ్యవస్థ పనిచేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రచారం కోరుకోని వ్యక్తి..ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ఇందుకు నిదర్శనమే దేశంలోనే అత్యల్ప కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదు కావడమేనని.. ఏపీ అమాత్యులు మీడియా ముందుకొస్తే మాట్లాడే మాటలు. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్దంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకు నిదర్శనంగా విదేశాలనుంచి వచ్చిన వారి సంఖ్య విషయంలో ఎంత గందరగోళం నెలకొందో అందరికీ తెలుసు. రాష్ట్రంలో కరోనా నిర్థారణ ల్యాబ్‌ల సామర్థ్యంపై ఆందోళనకర పరిస్తితులు ఉన్నాయి. తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురంలలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లలో మాత్రమే ఇప్పటి వరకూ కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. నాలుగు ల్యాబ్‌లలో 240కి మించి శాంపిల్స్‌ పరీక్షించే స్థాయి లేదు. రోజుకు రెండు షిఫ్ట్‌లలో శాంపిల్స్‌ పరీక్షించవచ్చు. ప్రతి షిఫ్ట్‌కు 30 చొప్పున రోజుకు ఒక్కో ల్యాబ్‌లో 60 శాంపిల్స్‌ మాత్రమే పరీక్ష చేసే సామర్థ్యం ఉంది. కాగా, విశాఖపట్నం, గుంటూరు, కడపల్లోనూ ల్యాబ్‌లు పెట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవి కూడా అందుబాటులోకి వస్తే 420 శాంపిల్స్‌ పరీక్ష చేయగల సామర్థ్యం మాత్రమే రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఏ మేరకు సరిపోతుందో ఆరోగ్యశాఖ అధికారులు ఆలోచన చేయాలని ఆరోగ్య రంగ నిపుణులు అంటున్నారు. ఒకేసారి రెండు వేల మందికి పరీక్షలు చేయగల సామర్థ్యం లేకపోతే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొవడం కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటి వరకూ విదేశాల నుంచి 28 వేల మంది రాష్ట్రంలోకి వచ్చారని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. వీరిలో ఎంత మందికి కరోనా ప్రభావం ఉందో చెప్పలేని పరిస్థితి. ఉన్న వారిలో ఎంత మంది వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటున్నారో అంచనా వేయలేని పరిస్థితుల్లో ఆరోగ్యశాఖ అధికారులున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అయినా రాష్ట్రంలో ల్యాబ్‌ల సామర్థ్యం పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, 17 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిని కరోనా నిర్థారణ ల్యాబ్‌లుగా మా ర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వే యాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్‌లను కూడా కరోనా నిర్థారణ పరీక్షలకు ఉపయోగించాలని సూచనలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఒకేసారి 2 వేలకు పైగా శాం పిల్స్‌ను పరీక్ష చేయగలిగే సామర్థ్యం పెంచుకుంటే తప్ప ఏప్రిల్‌లో ఎదురయ్యే పరిస్థితిని తట్టుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నారు.  నిపుణుల హెచ్చరికలు చూస్తే రాష్ట్రంలో తగినన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం వల్లనే పాజిటివ్ కేసుల సంఖ్య తెలడంలేదన్న సంగతి తెలుస్తోంది. మరో వైపు సాక్షాత్తు ప్రజా ప్రతినిధి బంధువు వల్లనే గుంటూరులో కరోనా వచ్చింది. ఈ విషయం ఆలోచిస్తేనే ప్రజలు వణికి పోతున్నారు. కనీసం వ్యాధి సోకినా నిర్ధారణ అయ్యే పరిస్తితులు ఉన్నాయా? లేవా అని భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పాలని వేడుకుంటున్నారు. కేవలం లాక్ డౌన్ ప్రకటిస్తే సరిపోదని, ప్రజారోగ్యం ప్రధమ ప్రాధామ్యంగా కరోనా నిర్ధారణ ల్యాబులను, కిట్లను సాద్యమైనంత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

జాతీయ రాజకీయాల గతినే మార్చివేసిన రోజది!

‘1982 మార్చి 29వ తేదీ'కి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ స్థానం ఉంది. ఆ మాటకు వస్తే జాతీయ రాజకీయాల గతినే మార్చివేసిన రోజది. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఆ రోజుల్లో ‘తెలుగు ఆత్మగౌరవం' పేరిట ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ'ని స్థాపించారు. స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర లిఖించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏపీలో సాగుతూ వచ్చిన ఏకపార్టీ పాలనకు చరమగీతం పాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చంద్రగిరిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఆ త‌రువాత చంద్రబాబు టీడీపీలో చేరి పార్టీలో పట్టు సాధించారు. అమెరికాలో ఎన్టీఆర్.. తెర వెనుక నాదెండ్ల సరిగ్గా ఏడాది కాలానికే 1984లో గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్.. ఆయన అక్కడ ఉండగానే తెర వెనుక సాగిన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నాదేండ్ల భాస్కర్ రావు సారథ్యంలో ‘ఫిరాయింపుల' పర్వానికి తెర తీశారు. కానీ కొందరు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు పరిస్థితి సంగతి బయట పెట్టారు. వెంటనే చంద్రబాబు తదితరులు అప్రమత్తమయ్యారు. అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఆఘమేఘాల మీద బయలుదేరి వచ్చేశారు. ప్రమాణం చేయించిన గవర్నర్ రాంలాల్ 1984 ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కానీ ఆ వెంటనే నాదేండ్ల భాస్కర్ రావుతో నాటి రాష్ట్ర గవర్నర్ రామ్ లాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఉవ్వెత్తున ఎగసి పడింది. ఇటు నాదేండ్ల భాస్కర్‌రావు, అటు ఎన్టీఆర్ తన మద్దతుదారులతో వేర్వేరు క్యాంపులు నెరిపారు. జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు కూడా దండిగానే లభించింది. రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలతో నాటి రాష్ట్రపతి ముందు ఎన్టీఆర్ పరేడ్ నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో గవర్నర్‌గా రాంలాల్‌కు ఉద్వాసన పలికిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. ఆ స్థానే శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా నియమించారు. ఆ తర్వాత సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం జరిగిపోయాయి. కానీ మళ్లీ ప్రజాతీర్పు పొందాలని భావించారు. 1985లో అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

ఆయన శకుని... ఈయన శ్రీకృష్ణుడు...అయినా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్....

ఇది ఇద్దరు మిత్రుల కథ. . స్నేహానికి విలువిచ్చే రెండు ఉన్నత వ్యక్తిత్వాల ఆవిష్కరణ. ఎన్ఠీఆర్ లోని ఆత్మీయ కోణాన్ని, ఎన్ఠీఆర్ పట్ల  ధూళిపాళ కున్న భ్రాతృ ప్రేమను ఒకే సారి చూసిన ఆయన సన్నిహితుల మాటల్లో.. మీరే చదవండి.. ధూళిపాళ సీతారామ శాస్త్రి. పరిచయం అక్కర్లేని ఈ పేరు గురించి కానీ, ఈయన వ్యక్తిత్వం గురించి కానీ, ఈ రోజు మాత్రమే ప్రస్తావించటానికి ప్రధానమైన కారణం అయితే ఒకటి ఉంది. దివంగత ఎన్ టీ ఆర్ కు ఆత్మీయుడైన ధూళిపాళ తెలుగుదేశం ఆవిర్భావానికి పూర్వం చేసిన కృషి గురించి నందమూరి తారక రాముడి తో సన్నిహిత సంబంధం ఉన్న అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. పార్టీ రాజ్యాంగం రాసే ముందు, ఎన్నో సందర్భాల్లో ఎన్ టీ ఆర్, ధూళిపాళ తో చాలా కీలకమైన అంశాల మీద చర్చించి, ఆయన సలహాలు తీసుకునే వారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పధకానికి తుది రూపు తీసుకొచ్చింది ధూళిపాళే అనే విషయం తామిద్దరి మధ్యనే ఉండాలని ఆయన, ఎన్ టీ ఆర్ దగ్గర మాట తీసుకున్నారు. శిఖర సమాన వ్యక్తిత్వమున్న ధూళిపాళ అంటే అందుకే, ఎన్ టీ ఆర్ కు విపరీతమైన అభిమానం, అలాగే స్నేహానికి ప్రాణమిచ్చి, నటుడిగా తనకు నలుదిక్కులా పేరు ప్రఖ్యాతులు తీసుకురావటానికి ఎన్ టీ ఆర్ చూపిన విశేషమైన ప్రేమాభిమానాలను ధూళిపాళ తరచూ గుర్తుచేసుకునే వారు.  వీరిద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, ఎన్ టీ ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తొలిసారి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నప్పుడు, అయన అందరికన్నా ముందర వాకబు చేసింది...ధూళిపాళ గారు ఎక్కడ అని.. బిత్తరపోయిన ఎన్ టీ ఆర్ అభిమానులు ధూళిపాళ కోసం ఎయిర్ పోర్ట్ లో వెతుకుతుంటే, ఎన్ టీ ఆరె నేరుగా ఎయిర్పోర్టు విజిటర్స్ గ్యాలరీ లో కూర్చుని ఉన్న ధూళిపాళ వద్దకు వెళ్లి , ఆయనకు పాద నమస్కారం చేసి, హృదయానికి హత్తుకున్నారు. అదీ ఆ ఇద్దరి మిత్రుల కథ. ఎన్ఠీఆర్ పదవీ చ్యుతుడై, తెలుగుదేశం పార్టీ సంక్షోభం లోకి వెళ్లిన సమయం లో -ఆయనకు మోరల్ సపోర్ట్ గా నిలబడ్డారు ధూళిపాళ. ఆ సమయం లో ఎన్ఠీఆర్ కు, ఆయనకు మధ్య నడిచిన సంభాషణలను దగ్గర నుంచి పరిశీలించిన అత్యంత సన్నిహితులు, ధూళిపాళకు, ఎన్ఠీఆర్ కు ఉన్న బంధం ..ఏకోదరుల బంధంకన్నా ఎక్కువే అని చెప్పుకునే వారు. ఎన్ఠీఆర్ మరణం తో తాను ఏకాకినయ్యానని చెప్పుకున్న ధూళిపాళ తర్వాతి రోజుల్లో సన్యాసాశ్రమం తీసుకుని, పూర్తిగా హనుమంతుడి సేవకు అంకితమైపోయారు.  ఇహ, ధూళిపాళ సీతారామ శాస్త్రి సినీ రంగ ప్రవేశం ముందు సంగతికి వస్తే, గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించాడు. పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు గారు భీష్మ (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా యన్‌.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయంలో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. దానవీరశూరకర్ణ, కథానాయకుడు, ఆత్మ గౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. చూడాలని ఉంది, శ్రీ ఆంజనేయం, మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు. దివికేగిన ఆ ఇద్దరి మిత్రుల మధుర స్మృతికి తెలుగు వన్ వినమ్రపూర్వక నివాళులు.  

రేడియో న్యూస్ రీడర్ దుగ్గిరాల పూర్ణయ్య కన్నుమూత

ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివినవారిలో ప్రసిద్ధులు దుగ్గిరాల పూర్ణయ్య ఆరోజుల్లో రేడియో కళాకారులకు, న్యూస్ రీడర్లకు సినీ రంగంతో పాటు దీటైన ఆకర్షణ వుండేది. వారిని సాంస్కృతిక కార్యక్రమాలకు, వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సత్కరించేవారు. అయితే స్వతహాగా నిరాడంబర జీవితం గడిపే పూర్ణయ్య వీటన్నిటికీ దూరంగా వుండేవారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంపొందించుకోగల అవకాశాలు వృత్తిపరంగా ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన పనేదో తనేమో అన్నట్టు జీవితం సాగించారు. సినిమా రంగంలో ఒక మాట వినబడుతూ వుంటుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినాడని. దుగ్గిరాల వారిది కూడా ఓ మోస్తరుగా ఇదే కధ. కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వెళ్ళిన పూర్ణయ్య గారికి ఒక చిన్న కొలువు దొరికింది. బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కే.అద్వాని (అప్పుడు జనసంఘం) నడిపే ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు పూర్ణయ్య గారి పనితీరు వారికి నచ్చింది. వారిరువురి నడుమ సాన్నిహిత్యం పెరిగింది. అద్వానీ గారి మాట సాయంతో ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆయన న్యూస్ రీడర్ కాగలిగారు. రేడియో ఉద్యోగం కొత్త. అయినా ఆయన త్వరగానే ఆ కొత్త కొలువులో ఒదిగిపోయారు. ఇంగ్లీష్ నుంచి వార్తల్ని తెలుగులోకి తర్జూమా చేసి, స్టూడియోలో లైవ్ చదవడంపై పట్టు సాధించారు. మనిషి పీలగా కనిపించినా వారిది కంచు కంఠం. వేరే ధ్యాసలు లేకుండా కేవలం వృత్తి ధర్మాన్ని నిర్వహించే స్వభావం కావడం వల్ల దుగ్గిరాల పూర్ణయ్య గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని బాధ పడే అభిమానులు కూడా వున్నారు.నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఢిల్లీలో పూర్ణయ్య గారిని కలుసుకున్నాను. మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం ఆయనకే ముందు వచ్చినా ఆయన కాదనుకుని ఢిల్లీలోనే వుండిపోయారు.ఎనిమిది పదులు దాటిన పూర్ణయ్య , అనేక దశాబ్దాల క్రితం వదిలి వెళ్ళిన స్వగ్రామం, గుడివాడ దగ్గర అంగలూరులో భార్య శ్రీమతి లక్ష్మితో కలిసి ఇప్పుడు శేష జీవితం గడుపుతూ ఈరోజు ఆదివారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు, సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాస రావు చెప్పారు.