స్వీట్ సమోసా సృష్టికర్త నివాళి ఫ్లెక్సీ కి 'కరోనా నెగటివ్ సర్టిఫికెట్ '!

చీరాల స్వీట్ సమోసా సృష్టికర్త ఇకలేరనేది ఒక వార్త కావచ్చు సాధారణంగా చదివితే. షేక్ మునీర్ భాయ్ చేసిన ఈ విశ్వామిత్ర సృష్టి -తీపి సమోసా గురించి కోస్తా జిల్లాల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది.  తిన్నాక తెలిసింది అది ఎంత అద్భుతమైన సృష్టో. ఆ సృష్టికర్త షేక్ మునీర్ భాయ్ ఏప్రిల్ 3న కాలం చేశారు. ఎటువంటి రిఫ్రిజిరేషన్ లేకుండానే.. ఆరుబయటి వాతావరణంలో రెండు రోజులపాటు చెక్కుచెదరకుండా, రుచి చెదరకుండా వుంటాయి మునీర్ గారి తీపి సమోసాలు. వారి మృతి తెలుగువారి ఆహార వైవిధ్యంలో ఒక లోటని ఫుడ్ ఎక్స్ పర్ట్, రోటి పచ్చడి నిపుణులు అయిన వాసిరెడ్డి వేణుగోపాల్ నివాళులు అర్పించారు. " ఎక్కువ బాధ కలిగించిన అంశం.. మునీర్ భాయ్ కరోనా వైరస్ కారణంగా మరణించలేదని, కరోనా నెగెటివ్ సర్టిఫికెట్టును ఫ్లెక్సీకి జతపరచవలసిన పరిస్థితి ఎక్కువ విచారం కలిగించింది.అంతే మునీర్ భయ్యా.. మేము తోలుమందం వాళ్లం.ముస్లింలందరూ జిహాదీలని, దేశద్రోహులని.. హిందువులందరూ అసలు సిసలైన దేశభక్తులని, జాతీయవాదులని గుడ్డెద్దులాగా, గొర్రెల మందలాగా గుడ్డిగా నమ్మేవాళ్లం.," అంటూ వాసిరెడ్డి వేణుగోపాల్ గుండెలను కదిలించే పోస్ట్ పెట్టారు.  

భారత దేశ తూర్పు తీరాన్ని కరోనా కబళిస్తుందంటున్న బుడత జ్యోతిష్యుడు

* 14 ఏళ్ల అభిగ్య ఆనంద్ జ్యోతిష్య ప్రజ్ఞ అబ్బురపరుస్తోంది * వైమానిక రంగం ఇబ్బందులెదుర్కుంటుందని ముందే చెప్పిన అభిగ్య * ఈస్ట్ కోస్ట్ ప్రమాదాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎదుర్కోబోతోంది: అభిగ్య * ధనిక దేశాలు చిల్లర ఎదుర్కునే పరిస్థితి : అభిగ్య ఆనంద్  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కుర్రాడి పేరు అభిగ్య. ఏడు నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిష్యం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. పదేళ్ల ప్రాయంలోనే భగవద్గీతలోని 700 శ్లోకాలను అనర్ఘళంగా వల్లెవేయడం, జ్యోతిషం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పడం మామూలు విషయం కాదు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అతనిది మైసూర్. తండ్రి పేరు ఆనంద్ రామసుబ్రమణియన్, తల్లి అన్నుఆనంద్. అతి చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టడం అభిగ్య ఆనంద్ ప్రత్యేకత. ఇప్పుడతని వయసు 14 ఏళ్లు. గుజరాత్ లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేదవిశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఇంత చిన్నవయసులో నియమితుడవడం మామూలు విషయం కాదు. అతని సోదరి అభిదేయకు కూడా ఇలాంటి ప్రతిభాపాటవాలు ఉన్నాయి. అభిగ్య, అతి చిన్న వయసులో గ్లోబల్ చైల్ పాడిజీ అవార్డును అందుకున్నాడు. ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ చేశాడు. జ్యోతిషంలోని వివిధ విధానాల మీద అనేక పరిశోధనలు చేశాడు. వాస్తు లోనూ నైపుణ్యం సాధించాడు. విశ్వమ్ వాస్తుమయం అనే పోర్టల్ కూడా నిర్వహిస్తున్నాడు. అతను చెప్పిందేంటి? గ్రహస్థితిగతులను అనుసరించి ముప్పు ముంచుకొస్తోందని అతను ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పాడు.  దీనిపై 7 నెలల క్రితమే అతను చేసిన వీడియో కూడా చేశాడు. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని కూడా అతను ప్రకటించాడు. చైనా యుద్ద సమస్యను ఎదుర్కొంటుందని అతను ప్రకటించాడు.  ధనిక దేశాలన్నీ అతలాకుతలం అవుతాయని చెప్పాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రకటించాడు. అతని జ్యోతిష విధానం చాలా లాజికల్ గా ఉంది. కొందరు జ్యోతిష పండితులు అతన్ని ఇంటర్వ్యూ చేసినపుడు అతను చెప్పిన సమాధానాలు చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న వయసులో ఈ శాస్త్రం మీద ఇలా  ఎలా చెప్పగలుగుతున్నాడని అనిపించింది. ముఖ్యంగా ప్రశ్న శాస్త్రం మీద కూడా అతనికి మంచి పట్టుంది. అతను చేసిన వీడియో చుస్తే, ఈజీ గా అర్ధమవుతుంది. అలాగే ఫైనాన్షియల్ అస్ట్రాలజీలోనూ అతను దిట్ట. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని  కూడా అతను చక్కటి విశ్లేషణ చేశాడు. గత జన్మలను నమ్మనివారు కూడా అతని వీడియోలు చూస్తే తమ అభిప్రాయాలను మార్చుకుంటారేమో. ఇక ఇప్పుడున్న పరిస్థితుల గురించి అతను  చాలావరకు చెప్పాడు. కరోనా గురించి అతను చెప్పిందాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. అభిగ్య చెప్పిన ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, కరోనా కారణంగా ఈస్ట్ కోస్ట్ చాలా ఇబ్బందులెదుర్కుంటుంది అని.

జగన్ కష్టాలు జగన్ వి... వలంటీర్ల కష్టాలు వాలంటీర్లవి

* వాలంటీర్లకు, వార్డు సెక్రెటరీలకు నిమిషానికో ఫోను.. * కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం లా ఉంది వారి పరిస్థితి జగన్ కష్టాలు జగన్ వి... వలంటీర్ల కష్టాలు వాలంటీర్లవి ..... సి ఎం ఏమి చెపుతాడో మంత్రులకు తెలియదు.... మంత్రులు ఏమి చెపుతారో ఐ ఏ ఎస్ లకు తెలియదు.. వారు ఏమి ఆదేశాలిస్తారో కింది స్థాయి అధికార్లకు, సిబ్బంది కి తెలియదు. వెరసి గందరగోళం... అయోమయం..భారం మాత్రం వలంటీర్ల మీదే . అంభంలో కుంభం ఆదివారం లో సోమవారం అనే సామెత అచ్చు గుద్దినట్టు వార్డు సెక్రెటరీలు,వాలంటీర్లకూ సరిపోతుంది.. రేషన్‌షాపుల దగ్గర లబ్ధిదారులకు బదులుగా వేలిముద్ర వేసే పనిని వార్డు సెక్రెటీరీలకు అప్పగించారు.  వారు ఆ పని లో ఉండగానే, పోలీసు శాఖ నుంచి ఫోన్‌. ఫలానా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేయండి, అక్కడ పని ఉంది అని. ఆ కాసేపట్లోనే మరో ఫోన్‌. ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయలు పంచాలి, ఫలానా చోటకు వెళ్లండని. ‘‘అది కాదు సార్‌! నాకు రేషన్‌ డ్యూటీ వేశారు. ఉదయం లేచేసరికే రేషన్‌ దుకాణాల ముందు పదుల సంఖ్యలో జనం ఉంటున్నారు. అక్కడికెళ్లకుంటే  ఇబ్బందిపడతారు’’ అని సదరు వార్డు కార్యదర్శి చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘అవేమీ మాకు తెలీదు. మేం చెప్పినట్లు చేయాల్సిందే’’.. ఫోన్లు చేసిన ప్రతి శాఖ అధికారిదీ ఇదే హకుం. ఏం చేయాలి, ఎవరి ఆదేశాలు పాటించాలి, ఏ పనికి హాజరవ్వాలనేది గ్రామ కార్యదర్శులు, వార్డు కార్యదర్శులకు ఎదురవుతున్న ప్రశ్న! పై స్థాయిలో సమన్వయం లేకుండా...వాళ్లు ఒకరికొకరు మాట్లాడకుండా కింద ఉన్న వారికి ఆదేశిస్తుండటమే దీనికి కారణం. అలాగే, గ్రామ కార్యదర్శులు, వార్డు కార్యదర్శుల్లో ఏ విధుల్లో ఉన్నవారు ఏ విభాగం నియంత్రణలోకి వస్తారన్న విషయంలో స్పష్టత లేకపోవడమూ వారి కష్టాలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరి ఆదేశాలే పాటిస్తే...మరొకరి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని సిబ్బంది వణికిపోతున్నారు. సచివాలయాల్లో పోలీసు బాధ్యతల్లో నియమితులైన మహిళలకు హఠాత్తుగా ఫోన్లు చేసి... ఎక్కడో 25 కిలోమీటర్ల అవతల ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లండంటూ ఆదేశాలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ వాహనం లేని మహిళలు అక్కడికెళ్లేందుకు నానా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తోందని సమాచారం. ‘‘రవాణా సదుపాయం లేదు. సొంత బైక్‌ లేదు. ఎలా అంటే...అవన్నీ తెలియదు...తక్షణం రావాల్సిందే అంటున్నారు’’ అని వారిలో కొందరు వాపోతున్నారు. పై స్థాయి నుంచి ఒకేసారి వస్తున్న విభిన్న శాఖల ఆదేశాలు, ఎలా చేయాలని అడిగితే...చేయాల్సిందే అంటూ ఎదురవుతున్న కరకు సమాధానాలతో దిక్కుతోచని పరిస్థితుల్లో కార్యదర్శులు పడిపోతున్నారు. తమ శాఖ పని అయిపోతే చాలుననే ఉద్దేశంతో...ఏ శాఖకు చెందినవారు ఆ శాఖ పనులను చెప్పేస్తున్నారు. అయితే ఈ చెప్పిన పనులు చేయాల్సిన వాళ్లు మాత్రం అసలే పని చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్నారు. ఉన్నతస్థాయిలో దీనిపై చర్చించి వీరిపై నియంత్రణ, పర్యవేక్షణ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటిస్తే తప్ప ఈ గందరగోళానికి ముగింపు ఉండదని గ్రామ సచివాలయ వర్గాలే అంటున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీరికి శానిటైజర్లు, మాస్క్‌లు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. నిత్యం వందలమందితో కలవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్న తమకు ఆరోగ్య రక్షణ లేదనే భయాందోళనలు కూడా వారిలో వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉంటె, ఏ క్షణంలో ఎవరు పిలుస్తారో అర్ధం కాని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుంటే, మధ్యలో అధికారుల అనవసరపు ఆగ్రహాలకు గురికావటం వారి లో ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో పాజిటివ్‌ల సంఖ్య 272కు పెరిగింది!

శ‌నివారంనాడు కొత్త‌గా 43 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది.  ఇప్ప‌ట్టి వ‌ర‌కు 11 మంది చ‌నిపోయారు. అయితే చికిత్స పొంది,  క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డి 33 మంది ఇళ్ల‌కు వెళ్లారు. ఇంకా వివిధ ఆసుప‌త్రుల్లో 228 మంది చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం పాజిటివ్‌గా న‌మోద‌వుతున్న కేసుల‌న్నీ మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన వారు లేదా వారితో క‌లిసిన వారు మాత్ర‌మే. షాద్‌న‌గ‌ర్‌లో, సికింద్రాబాద్‌లో చ‌నిపోయిన వారు కూడా ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారితో క‌లిసిన‌వారేన‌ని తెలంగాణా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.  ఢిల్లీ మ‌ర్క‌జ్ నుంచి 1090 మంది తెలంగాణాకు వ‌చ్చారు. వారంద‌రినీ కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాం. 6 ల్యాబ్‌లు 24 గంట‌ల పాటు ప‌నిచేస్తున్నాయి. ఎంత మందికి పాజిటివ్ వ‌చ్చినా చికిత్స అందించ‌డానికి అన్నీఏర్పాట్ల‌తో సిద్దంగా వున్నాం. ఐదు ల‌క్ష‌ల ఎన్‌-95 మాస్కులు, ఐదు ల‌క్ష‌ల పిపిఇ కిట్లు, ఐదు ల‌క్ష‌ల వైర‌ల్ ట్రాన్మ్సిష‌న్ కిట్లు, 500 వెంటిలేట‌ర్లు, నాలుగు ల‌క్ష‌ల క‌రోన టెస్టింగ్ కిట్లు, 20 ల‌క్ష‌ల స‌ర్జిక‌ల్ మాస్కులు, 25 ల‌క్ష‌ల హ్యాండ్ గ్లౌసెస్ కొనుగోలు చేశాం. గ‌చ్చిబౌలీలో 1500 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి మ‌రో రెడు రోజుల్లో అందుబాటులోకి వ‌స్తుందని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద్ర తెలిపారు.

బాబా రామ్ దేవ్ ట్వీట్ వెనుక మర్మమేమిటి ?

అంతర్జాతీయ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా చైనాను బహిష్కరించాలని బాబా రాందేవ్ పిలుపునివ్వడం వెనుక ఆంతర్యమేమిటని దౌత్యవేత్తలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ, యోగా వరకే పరిమితమైన బాబా రాందేవ్ , ఈ రోజు హఠాత్తుగా దౌత్య వ్యవహారాలను ప్రభావితం చేసే విధంగా, చైనా మీద మాటల దాడికి దిగటం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.  " దీనికోసం భారత దేశం దౌత్యపరంగా చొరవ తీసుకోవాల," ని రాందేవ్ డిమాండ్ చేయటం అంతర్జాతీయ సమాజాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయ పరంగా, లేదా దౌత్య పరంగా...దేశ ప్రధాని తరఫున విదేశాంగ మంత్రి కానీ, లేదా దేశ రాయబారులు, దౌత్యవేత్తలు కానీ మాట్లాడాల్సిన అంశాలు, ఒక యోగా గురువు మాట్లాడటమేమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాబా రామ్ దేవ్ శనివారం చేసిన  ట్వీట్‌లో, ‘‘చైనా వాస్తవంగా అమానవీయ, అనైతిక చర్యకు పాల్పడింది, యావత్తు ప్రపంచాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టింది. ఇందుకు రాజకీయంగా, ఆర్థికంగా బహిష్కరించడం ద్వారా చైనాను అంతర్జాతీయ సమాజం శిక్షించాలి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం దౌత్యపరమైన చొరవను తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు. కరోనా వైరస్ మొట్టమొదటిసారి గత ఏడాది నవంబరులో చైనాలోని వూహన్ సిటీలో కనిపించింది. అమెరికా వంటి దేశాలు ఈ వైరస్ ప్రపంచానికి విస్తరించడానికి చైనాయే కారణమని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ క్లిష్ట సమయం లో బాబారాందేవ్ ట్వీట్ దేనికి సంకేతం, ఆధ్యాత్మిక, యోగా రంగాలలో పేరున్న అందరినీ కేంద్ర ప్రభుత్వం దశల వారీగా రంగం లోకి దించటం ద్వారా, చైనా మీద భారత్ దౌత్య పరమైన ఒత్తిడి క్రమేపీ తీసుకు వస్తోందా, అనేది ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న.

ఫ్లోర్‌ లీడర్లతో 8న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ఉదయం 11 గంటలకు ప్రారంభం కరోనా విజృంభణ నేపథ్యంలో మాట్లాడనున్న మోదీ ప్రకటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి దేశంలో కరోనా కేసులు పెరిగిపోతోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పలు పార్టీల  ఫ్లోర్‌ లీడర్లతో ఆయన ఈ నెల 8న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. 'పార్లమెంటులో 5 కన్నా ఎక్కువ సీట్లున్న పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో ప్రధాని మోదీ ఏప్రిల్‌ 8న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు' అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఓ ప్రకటనలో తెలిపారు.కాగా, కరోనాపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనుండడం గమనార్హం.

హలో...నేను కె సి ఆర్ మాట్లాడుతున్నాను....

' ఢిల్లీ వాపసీ ' లకు కరోనా జాగ్రత్తలు చెపుతున్న తెలంగాణా సి ఎం దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంతో ముడిపడినవే ఉన్నాయి. ఢిల్లీ నుంచి తమ రాష్ట్రాలకు చేరుకున్న మర్కజ్ యాత్రికుల ద్వారా కరోనా వ్యాప్తి విస్తృతమైంది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు. ఓ మోస్తరు కేసులతో బయటపడొచ్చని భావించిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకట్రెండు రోజుల వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు రావడంతో వెంటనే అప్రమత్తం అయ్యాయి. అయితే, కరోనా పరీక్షలు చేయించుకోవడానికి మర్కజ్ యాత్రికులు నిరాకరిస్తున్న నేపథ్యంలో, సీఎం కేసీఆర్ స్పందించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన మర్కజ్ యాత్రికులను ఒప్పించే బాధ్యతను మతపెద్దలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మతపెద్దలతో ఫోన్ లో మాట్లాడారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. 85 శాతం కొత్త కేసులు ఢిల్లీ మర్కజ్ తో సంబంధమున్నవే కావడంతో తెలంగాణ అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే యుద్ధప్రాతిపదికన మర్కజ్ యాత్రికుల కోసం 6 కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు మూడు షిఫ్ట్ లు పనిచేసి మర్కజ్ యాత్రికుల్లో ఎవరు కరోనా పాజిటివ్, ఎవరు నెగెటివ్ అనేది తేల్చాలని సర్కారు కృతనిశ్చయంతో వుంది.

రేణిగుంట నుండి ఢిల్లీకి దూద్ దురంతో స్పెష‌ల్ ట్రైన్‌!

రేణి గుంట నుండి హ‌జ‌ర‌త్ నిజాముద్దీన్‌కి 2 పార్స‌ల్ వ్యాన్ల‌తో కూడిన దూధ్ దురంతో స్పెష‌ల్ రైలుని ఈ రోజు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే న‌డిపింది. విజ‌య‌వంతంగా 2.4 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు, 23 ట‌న్నుల మామిడిపండ్లు, మ‌రియు 23 ట‌న్నుల పుచ్చ‌కాయ‌ల‌ను ఈ రైలు ద్వారా ర‌వాణా చేశారు. కోవిడ్ 19ని అరిక‌ట్టే దిశ‌లో దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో నిత్యావ‌స‌ర స‌రుకుల ర‌వాణాకి ఏ మాత్రం ఆటంకం క‌ల‌గ‌కుండా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ర‌వాణా మ‌రియు పార్స‌ల్ రైళ్ల‌ను దేశంలోని అన్ని ప్రాంతాల‌కు నిరంత‌రంగా న‌డుపుతోంది.  ఇందులో భాగంగా దూద్ దురంతో స్పెష‌ల్ రైల్‌ను   మిల్క్ ట్యాంక‌ర్ ల‌ను తీసుకొని ఏప్రిల్ 4 ఉద‌యం 8 గంట‌ల‌కు రేణి గుంట నుండి దేశ రాజ‌ధాని ఢిల్లీకి బ‌య‌లుదేరింది. ఈ రైలులో 40 వేల లీట‌ర్ల సామ‌ర్థం గ‌ల 6 పాల ట్యాంక‌ర్లు, 2.40 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు రేణిగుంట,  సింకింద్రాబాద్‌ల‌లో 23 ట‌న్నుల మామిడిప‌ళ్ళ లోడింగ్‌తో ఒక పార్స‌ల్ వ్యాను, మ‌రియు గుంత‌క‌ల్లు నుండి 23 ట‌న్నుల పుచ్చ‌కాయ లోడింగ్‌ల‌తో మ‌రొక పార్స‌ల్ వ్యాన్‌ల‌ను  ఢిల్లీకి రైలు లో ర‌వాణా చేశారు.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌రుకు ర‌వాణా, పార్స‌ల్ ర‌వాణా రైళ్ల‌ను మాత్ర‌మే న‌డిపిస్తున్నారు. రైలు బ‌య‌లుదేరే ముందు శానిటైజేష‌న్ మ‌రియు సిబ్బంది చేత సామాజిక దూరం పాటింప‌జేయ‌డం వంటి ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకున్నారు.

జగన్, మీ బిల్డప్స్ ఆపండిక : నారా లోకేష్ ట్విట్టర్ హెచ్చరిక 

వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు, మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు,మా ఇంటికొస్తే ఎం తెస్తారు అనే రకమంటూ టీ డీ పీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. " ఆయనకు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు,రైతులు, డాక్టర్లు,ఉద్యోగస్తులు పై లేకపోవడం బాధాకరం. గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం  ఉన్నా డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారు. మరి కాంట్రాక్టర్ల పై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా," అంటూ లోకేష్ ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదని అభిప్రాయపడ్డారు లోకేష్.  కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ  కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చారు. సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్ని రాష్ట్రాల్లో ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.

ఇదే జగ్గీ వాసుదేవ్ సదస్సులో జరిగితే, ఇలాగే మాట్లాడుతారా?  

* సభ్య సమాజానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూటి ప్రశ్న * ఒక రవిశంకర్‌ గారి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గాని, జగ్గీవాసుదేవ్‌ గారి ఈషా పౌండేషన్‌లో గాని, మాతా అమృతానందమయి సభల్లో గానీ, లేదా ఒక పాల్‌ దినకరన్‌ గారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ ఈ పరిస్థితి రావచ్చు, అందువల్ల ప్రత్యేకించి ఒక మతానికి దీనిని ఆపాదించవద్దు : జగన్  * ఎక్కడ జరిగినా అదొక ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా కాకుండా దురదృష్టకర సంఘటనగానే చూడాలి: ముఖ్యమంత్రి  మనుషులుగా వేరుగా ఉంటూ, మనసులు ఒక్కటిగా ఈ కరోనా మీద పోరాడాల్సిన సమయమిది.భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్‌కు, ఒక కాంగ్రిగేషన్‌కు అనేక ప్రాంతాల నుంచి, కొన్ని దేశాల నుంచి ఆధ్యాత్మిక ప్రతినిధులు  హాజరయ్యారు. ఆ ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో ప్రత్యేకించి విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం, ఆ మీటింగ్‌కు వెళ్లిన మన దేశస్తులు, మన రాష్ట్రం వారికి కూడా కరోనా సోకడం దురదృష్ణకరమైన పరిణామం. ఇదే సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలోనైనా జరగవచ్చు. మన దేశంలో అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేలు, లక్షల భక్తులున్న అనేకమంది ,అన్ని మతాల్లోనూ పెద్దలున్నారు.  ఒక రవిశంకర్‌ గారి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గాని, జగ్గీవాసుదేవ్‌ గారి ఈషా పౌండేషన్‌లో గాని, మాతా అమృతానందమయి సభల్లో గానీ, లేదా ఒక పాల్‌ దినకరన్‌ గారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ, లేదా జాన్‌ వెస్లీ గారు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరికైనా ఈ పరిస్దితి రావచ్చు.  కాబట్టి ఇది ఎక్కడైన జరగవచ్చు. ఎక్కడ జరిగినా అదొక ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా కాకుండా దురదృష్టకర సంఘటనగానే చూడాలే తప్ప, ఓ మతానికో, ఒక కులానికో దాన్ని ఆపాదించి వారేదో తప్పుచేసినట్టుగా, నేరం చేసినట్లుగా, కావాలని చేసినట్లుగా చూపడం, చూపే ప్రయత్నం  ఎవ్వరూ కూడా చేయకూడదు. అలాంటి ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం, ఇలాంటి ప్రయత్నాలు మనమంతా ఒక్కటిగానే ఉన్నామని చెప్పేదానికి మంచి చేయవు.  కరోనా బాధితులు మీద మనం ఈ సమయంలో చూపాల్సినది ఆప్యాయత.  మనవాళ్లను మనం వేరుగా చూడకూడదు. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ సంఘటనకు ఫలానా మతం వారి మీద, మన వారి మీద ఒక ముద్రవేయటానికి ఎవరూ వాడుకోవద్దు. ఇది ఎవరికైనా జరిగే అవకాశమున్న సంఘటనగానే భావించాలి. ఈ సమయంలో భారతీయలుమంతా ఒక్కటిగానే కనపడాలి, ఒక్కటిగానే ఉండాలి. కరోనా కాటుకు మందు లేదు. కరోనా కాటుకు మతాల్లేవు.  కరోనా కాటుకు ధనిక, పేద అనే తేడా లేదు. కరోనా కాటుకు దేశాల కూడా డిఫరెన్సియేషన్‌ కూడా లేదు. యుద్ధంలో మన ప్రత్యర్ధి మన కంటికి కనిపించని కరోనా అనే ఒక వైరస్‌. దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం.అందరం ఐక్యంగా ప్రపంచానికి, దేశానికి చాటిచెబుతాం. దేశ ప్రధాని కూడా ప్రధాని హోదాలో ఈ  మేరకే పిలుపునిచ్చారు.  5వ తేదీన తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్నిస్తూ వెలగాలి.చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లు, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్ధం తేవాలి. ఈ మెసేజ్‌ ఏ  పరిస్ధితులో ఇస్తున్నాం అన్నది ఇవాళ ఏ మీడియా ఛానెల్, టీవీ ఛానల్‌  చూసినా సోషల్‌ మీడియాలో పరిస్ధితులు చూసినా అందరికీ కూడా అర్ధమవుతుంది. ఇక్కడ కావాల్సింది  ప్రతీ ఒక్కరు ఒకరికొకరు తోడుగా ఉండటం.  మనలో మనం ఢిపరెన్షస్‌ తీసుకొని వచ్చి, మనమంతా మనలో మనం ఒక కరోనా లాంటి వైరస్‌ వచ్చి మనని డిఫరెన్షయేట్‌ చేసే పరిస్ధితుల్లోనికి తీసుకుపోకుండా ఉండటం.  కాబట్టి అందరూ కూడా సహృదయంతో నేను చెప్పే ఈ విజ్ఞప్తిని తీసుకుంటారని, మనమివ్వబోయే  మెసేజ్‌ 5వ తారీఖున గొప్పగా దేశానికే ఆదర్శవంతంగా ఇవ్వగలుగుతామని చెప్పి చెపుతాఉన్నాం. ఇక ఈ విషయమే కాకుండా ఈ కరోనా వైరస్‌ మీద ఫ్రంట్‌లైన్‌లో ఉంటూ  యుద్దం చేస్తా ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంటు, పోలీసు డిపార్ట్‌మెంటు, శానిటేషన్‌ వర్కర్స్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పంచాయితీరాజ్ డిపార్ట్‌మెంటులో ఉన్న శానిటేషన్ వర్కర్స్‌, ఫ్రంట్‌ లైన్‌లో ఉండి పోరాటం చేస్తా ఉన్న వీళ్లకు మోటివేషన్‌గా ఉండటం కోసం ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం. మిగతా స్టాప్‌లో ఉన్నవారందరికీ కూడా జీతాలు కాస్తా వాయిదా వేసే కార్యక్రమం అందరితో మాట్లాడిన తర్వాత వాళ్లని కూడా ఒప్పించి వాయిదా వేసుకునేదానికోసం వాళ్లను ఒప్పంచిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది.  కానీ ఈ కరోనా టైంలో వీళ్లకి మాత్రం అంటే మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంటు, శానిటేషన్, పోలీసుశాఖ మాత్రం మోరల్‌గా ఫ్రంట్‌ లైన్‌లో ఉన్నారు. వాళ్లని మనం ఏదన్నా మోటివేట్‌ చేసే దానిలో భాగంగా వీళ్లకు మాత్రం పూర్తి జీతాలు కష్టమనిపించినా కూడా... ఈ నెలది, ఈ నెలకు సంబంధించినంత వరకు ఎలాంటి పోస్ట్‌ పోన్‌ మెంటు లేకుండా జీతాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

క‌రోనా వైరస్ మీద యుద్ధం చేద్దాం...

ఊరంతా నిశ్శబ్దం, రోడ్లన్నీ నిర్మానుష్యం. ఇళ్లల్లో తలుపులు బిగించి ఊసుపోక, ఊరికే ఉండలేక అసహనం తో అల్లాడుతుంటే.....ఉన్నపళంగా ఉప్పెనలా ఒక అలజడి. ఢిల్లీ త‌బ్లీగ్ జ‌మాత్ స‌మావేశాలు. అక్క‌డి నుంచి వ‌చ్చిన వారికి పాజిటివ్‌. చ‌నిపోతున్న వారు కూడా స‌మావేశాల‌కు వెళ్లి వ‌చ్చిన‌వారే. అంతే.... ఈ వార్త విన్న త‌రువాత‌... మన జీవితంతో పెనవేసుకున్న కొన్ని పేర్లు చేదుగా వినిపిస్తున్నాయి.  క‌ళ్ళ ముందు పెరిగిన కరీమా కసాయి లా అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి ఎత్తుకు ఆడించిన బషీర్ తాత బూచోడు అయ్యాడు. 10ఏళ్ళు కలిసి పనిచేసిన బేగం భయపెట్టే వ్యక్తి అయింది.  పసి వాడుగా ఉన్నప్పుడు నుండి మన పాలేరుగా పనిచేసిన ఇర్ఫాన్ ఇప్పుడు ఇబ్బంది పెట్టే వాడు అయ్యాడు.  ఉన్నపళంగా అన్ని మారిపోయాయి. ఏదో జరిగింది.  అది తెలుసుకునే లోగా పాత వీడియోలు కొత్త పేర్లతో ఫోన్ లోకి వచ్చేసాయి. ఇపుడు టోపి ఉన్నవాడు గడ్డం ఉన్నవాడు తుమ్మితే! కావాలనే తుమ్మాడు. తాకితే! అంటించాలనే తాకాడు. చూస్తే! చంపెయ్యాలనే చూస్తున్నాడు అంటున్నారు.   ఎవరో ఏదో చెప్తే మన విచక్షణ ఏమైంది. ఇన్నాళ్లు కలిసి మెలసి ఉన్న మన వాళ్ళమీద నిందలు వేస్తూ 4 వీడియోలు రాగానే వాళ్ళని శత్రువులుగా చూడటం సరైనదేనా?  నిజాలు ప్రభుత్వము తేలుస్తుంది. ఈలోగానే మన పక్క వాడిని పగ వాడిలాగా చూస్తున్నాము.  దేశంలో రోగం వచ్చింది అంటే ఒక వర్గం వారివల్ల వచ్చింది అనటం ఎంత హాస్యాస్పదంగా ఉంది.  విదేశాలనుండి విమానాల్లో తోలుకొచ్చిన వారి వల్ల కూడా వచ్చి ఉండవచ్చుగా. అక్రమ చొరబాటు దారులవల్ల కూడా రావచ్చుగదా.  చదువుకున్న వారు కూడా అసత్య ప్రచారాలు నమ్ముతూ వాటిని అందరికి పంచుతున్నారు.  వారి ప్రమేయం లేకుండా ముద్దాయిలుగా నిలబడిన మన సోదరులపట్ల ఇంత నిర్దయగా ప్రవర్తించకూడదు.  ఒక వర్గం మొత్తాన్ని  దేశద్రోహులు గా మాట్లాడటం వారి కుటుంబాలని తూలనాడటం సరికాదు.  ఇప్పుడు మనం చేయాల్సింది వారు కోలుకోవాలని ప్రార్ధిస్తూ, భౌతికదూరం పాటిస్తూ , సాటి మనిషికి సాయం చేయటం.  ఎందుకంటే.....  మనం సమస్త మానవాళిని సోదరులు గా భావించే భారతీయులం కాబట్టి.

ప్రెస్ రిలీజుల్లో మాత్రమే నిప్పులు చెరిగే యనమలపై టీడీపీ లో చర్చ!

* క్వారంటైన్ ను ఎప్పటి నుంచో జీవన విధానంగా మలుచుకున్న యనమల కన్నా, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలే బెటరని నేతల్లో అభిప్రాయం  * చంద్రబాబు నాయుడు 24X 7 ప్రజా క్షేత్రంలో ఉన్నా, యనమల మాత్రం పత్రికా ప్రకటనలకే  పరిమితం కావటం పై ఆక్షేపణ  ఎసెట్స్, లయబిలిటీస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆ మాట కొస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కి లయబిలిటీ గా మారిన చాలామంది నేతల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు అనే భావన చాల మంది నాయకుల్లో బలంగా ఉంది.  పలుకే బంగారమాయెరా పద్ధతిలో ఆయన తనను తాను  ప్రెస్ నోట్స్ కు మాత్రమే పరిమితం చేసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవటం ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నించీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ కావటం వల్లనూ, పార్టీ లో ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రయారిటీ ఇవ్వటం కారణం గానూ, ఎన్ఠీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయం లో ఆయన అద్భుతమైన 'శ్రమదానం' చేసినందువల్లనూ --ఇప్పటికీ తెలుగు దేశం నాయకులు ఆయన్ను అరమోడ్పు కన్నులతో, ఆరాధ్య పూరిత దృక్కులతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా, తనదైన శైలిలో- పార్టీ లో 'సరిలేరు నాకెవ్వరు' టైటిల్ పెట్టుకుని మహరాజులా వెలిగిపోతున్న యనమల రామకృష్ణుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రెస్ రిలీజ్ లో చెడా మడా నిప్పులు చెరిగేశారు. అలా చెరిగిన నిప్పులలో-కొన్ని నిప్పురవ్వలను మీ కోసం ప్రత్యేకంగా అందచేస్తున్నాం.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, ఉపశమన చర్యలు శరవేగంగా చేపట్టాలని, ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. "విపత్తుల్లో ప్రజలను కాపాడేవాడే పాలకుడు. ఆపదల్లో అండగా ఉండటం నాయకత్వ లక్షణం. అలాంటిది ప్రజలను కష్టాల్లో వదిలేయడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.  రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతం. పాలకుల ఉదాసీనత వల్లే  రాష్ట్రంలో కరోనా విస్తృతం. వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన రూ 11,399కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు..? రూ 11,399కోట్ల బడ్జెట్ పెట్టి, కరోనా మాస్క్ లకు రూ 30కోట్లే ఇస్తారా," అంటూ ఆవేశంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను నిలదీశారు.  ఇదేనా మీరు చెప్పిన ‘‘నాడు-నేడు’’..? నాడు సీఎంగా చంద్రబాబు ఇలాగే చేశారా..? నేడు సీఎంగా మీరెలా చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను కడిగి పారేశారు. విపత్తుల్లో చంద్రబాబు పనితీరుకు, మీ పనితీరుకు ప్రజలే బేరీజు వేస్తున్నారంటూ కూడా హెచ్చరించారు. " టిడిపి ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? డాక్లర్లు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఉండేవేనా..? మెడ్ టెక్ జోన్ పై చేసిన ఆరోపణలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత ఏడాది రూ 2,27,975కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు. తొలి 6నెలల్లో 35%కూడా ఖర్చు చేయలేదు. రెవిన్యూ వ్యయమే తప్ప కేపిటల్ వ్యయం శూన్యం. 65% నిధులు మీవద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకు," అంటూ యనమల ఆ పత్రికాప్రకటనలోనే ఆగ్రహం తో ఊగిపోయారు.  కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు..? డాక్టర్లు, సిబ్బందికి మాస్క్ లు, రక్షణ ఉపకరణాలు ఎందుకు కొనరు..?పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. అమరావతి సహా అభివృద్ది పనులన్నీ నిలిపేశారు.  విపత్తు నిర్వహణకు, నరేగా కు, 14వ ఆర్ధిక సంఘ నిధులు, డివల్యూషన్ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు..? 11నెలల్లో అభివృద్ది శూన్యం, పేదల సంక్షేమం నిల్.. కరోనా ఉపశమన చర్యలు కూడా మొక్కుబడిగానే.. డిసెంబర్ లోనే విదేశాల్లో కరోనా ప్రభావం ప్రారంభం. జనవరి 3వ వారంలో మనదేశంపై కరోనా ప్రభావం. నాలుగో క్వార్టర్ పై కరోనా ప్రభావం చూపింది. మరి మొదటి 3క్వార్టర్లలో మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏమిటి..? కరోనా రాకముందు ఏం చేయలేదు, కరోనా వచ్చాక చేసిందేమీ లేదని కూడా జగన్ మోహన్ రెడ్డి లెక్క తేల్చేశారు.  కరోనాపై కేంద్ర మార్గదర్శకాలు గాలికొదిలేశారు. లాక్ డౌన్ కు వైసిపి నేతలే తూట్లు పొడుస్తున్నారు. కరోనా వ్యాప్తి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహమా..? ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా..?కరోనాలోనూ మీ అవినీతి,అక్రమాలు మానుకోరా, అంటూ నిప్పులు చెరిగారు. లోడింగ్ కార్మికులకు కరోనా సోకితే బాధ్యత ఎవరిది..? లాక్ డౌన్ పీరియడ్ లో వందల లారీల్లో ఇసుక తరలింపులా..? ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..? మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తారా, అని కూడా తన ప్రెస్ రిలీజ్ లో ఆయన ప్రశ్నించారు.  ఏడాది గడుస్తున్నా పరిపాలనపై సీఎంకు అవగాహన లేదు. సంబంధిత శాఖలపై ఏ ఒక్కమంత్రికి పట్టు దొరకలేదు. స్వప్రయోజనాలే తప్ప ప్రజారోగ్యంపై వైసిపి నేతలకు శ్రద్ద లేదు. టిడిపి హయాంలో ఏ అభివృద్ది పని ఆగలేదు. ఏ సంక్షేమ పథకం రద్దు చేయలేదు. పైగా అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించాం. అనేక అభివృద్ది ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. విపత్తుల్లో బాధిత ప్రజానీకాన్ని ఆదుకున్నాం. హుద్ హుద్ లో, తిత్లి తుపాన్ లో ఎలా ఆదుకున్నామో ప్రజలకు తెలుసునని కూడా యనమల గుర్తు చేశారు.  విపత్తులంటే సీఎం జగన్ కు భయం. ఎప్పుడు విపత్తులు వచ్చినా పత్తా ఉండరు. తిత్లి తుపాన్ లో, మొన్న గోదావరి, కృష్ణా వరదల్లో ఎక్కడ ఉన్నారో ప్రజలు మరిచిపోలేదు. పాలకుల నిర్లక్ష్యం  ప్రజలకు శాపం కారాదు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్లకు రక్షణ ఉపకరణాలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు విడుదల చేయాలి. రైతుల వద్ద పంట ఉత్పత్తులు వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆయన ప్రెస్ రిలీజ్ సాంతం ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కడిగేసి, నిప్పులు చెరిగి చంద్రబాబు నాయకత్వం పట్ల తన విధేయతను ను ఎప్పటిలాగానే-కాగితం రూపేణా తీర్చుకున్నారు. "జగన్ మోహన్ రెడ్డి ఈ ఎనిమిది నెలల నుంచే క్వారంటైన్ లో ఉన్నారు. మా యనమల వారు రాజ్యం చేసినంత కాలం ఎక్కువ సమయం క్వారంటైన్ లో గడిపిన సన్నివేశాలను, సందర్భాలను ఇప్పుడో సరి మేము గుర్తు చేసుకుంటున్నాం, ఎలాగూ కరోనా కారణంగా కాస్తంత వీలు చిక్కింది," అంటూ టీ డీ పీ నాయకులు నిట్టూరుస్తున్నారు.

మందుబాబుల‌ తెగింపు!  మద్యం దుకాణం లూటీ!

మ‌ద్యం దొర‌క్క‌పోవ‌డంతో ఎలాగైనా తాగాల‌నే త‌ప‌న మందుబాబులను ఎంత‌టికైనా తెగించేలా చేస్తోంది. కొంతమంది వ్యక్తులు మానసికంగా వింతగా ప్రవర్తిస్తున్నారు. మ‌రికొంత మంది ఆత్మహత్యలకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దొరికితే  బ్లాక్‌లోనైనా కొని తాగేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో హైద‌రాబాద్‌లోని మద్యం షాపుల‌న్నీ బంద్ వున్నాయి. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర వైన్స్ షాప్‌లో మద్యం లూటీ జరగ‌డం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. షాప్ పైభాగం రేకులు కట్ చేసి లోపలికి ప్రవేశించి మందు బాటిల్స్‌ను ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తించారు. ఈ దృశ్యాల‌న్నీ సీసీటీవీలో రికార్డ్ అయాయి. వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  అంతే కాదు హైద‌రాబాద్  ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి వ‌చ్చే మందుబాబుల సంఖ్య కూడా ఎక్కువైతోంద‌ట‌. ఈ వారం రోజుల్లోనే  1000కి పైగా మందుబాబులు ఎర్రగడ్డ ఆస్పత్రి వ‌చ్చిన‌ట్లు సూపరింటెండెంట్‌ ఉమాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

సామాజిక‌దూరం పాటించ‌మంటూ సి.ఆర్‌.పి.ఎఫ్‌. వీడియో!

క‌రోనా డెడ్లీ వైర‌స్‌పై సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ సందేశాత్మ‌క వీడియో రూపొందించింది. సామాన్య ప్ర‌జ‌ల్ని కూడా ఆక‌ట్టుకునేలా ఈ వీడియో వుంది.  దేశానికి శ‌క్తి అయిన సిఆర్‌పిఎఫ్  ఈ సందేశాన్ని వినిపిస్తోందంటూ సి.ఆర్‌.పి.ఎఫ్‌.జ‌వాన్లు త‌మ‌దైన స్టైల్‌లో బ్యాండ్ వాయిస్తూ హిందీలో పాడిన వీడియో సాంగ్ సందేశంతో పాటు  స్పూర్తినిస్తోంది. సామాజిక దూరం పాటించ‌డం క‌రోనాను ఓడించాల్సి వుంది, చేతుల‌ను స‌బ్బుతో మ‌ళ్లీ మ‌ళ్లీ క‌డుగుతూ వుండండి, లేదా శానిటైజ‌ర్‌తో తుడుస్తూ వుండండి.  షేక్‌హ్యాండ్ ఎవ్వ‌రికీ ఇవ్వ‌వ‌ద్దు. చేతులు జోడించి న‌మ‌స్కారం పెట్టండి అప్ప‌డే మీరు క‌రానా కాటుకు గురికారు.  దేశ ప్ర‌జ‌ల‌కు సిఆర్‌పి ఎఫ్ ఇచ్చే సందేశం ఇదే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తూ, మాన‌వాళిని భ‌యంకంపితుల్ని చేస్తున్న‌ ఈ వైర‌స్‌ను ఎలా నిర్మూలించాలో ఆలోచించండి. ప్ర‌ధాన మంత్రి చెప్పిన‌ట్లు లాక్‌డౌన్ సంద‌ర్భంగా 21 రోజుల పాటు ప్ర‌తిఒక్క‌రూ ఇంట్లోనే వుండిండి. ఈ నియ‌మం పాటించ‌డంలోనే విజ్ఞ‌తతో పాటు మీ భ‌ద్ర‌త వుంది.  ఇంట్లోనే వుంటే సుర‌క్షితంగా ఉంటారు. లేక పోతే ప్ర‌మాదంలో ప‌డ‌తారు. ముందు వ‌రుస‌లో వుండి క‌రోనాతో పోరాడుతున్న డాక్ట‌ర్లు, పోలీసుల‌కు ప్ర‌ణామాలంటూ సి.ఆర్‌.పి.ఎఫ్‌. పాట కొన‌సాగుతోంది.

వదంతులు, ఊహాగానాలు నమ్మకండి.

“దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నాట్ట” ఈ సామెత ఇప్పుడు మన దేశంలో అక్షరాలా నిజమవుతోంది. ఒక వైపు కరోనా రోజు రోజుకూ జడలు విప్పుతుంటే, అదే స్థాయిలో వదంతులు, ఊహాగానాలు కూడా పురి విప్పుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఏం చెయ్యాలి అన్న సూచనల కంటే పనికిరాని అంశాలు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. అలాంటి మెసేజ్ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరిట ఒక సందేశం సామాజిక మాద్యమాల్లో విపరీతంగా  తిరుగుతోంది. లాక్ డౌన్ ను నాలుగు దశలుగా విభాజించారని.. మొదటి దశలో ఒక రోజు, రెండో దశలో 21 రోజులు లాక్ డౌన్..5 రోజుల విరామం ఇచ్చి, మూడో దశలో మళ్ళీ 28 రోజుల లాక్ డౌన్ ఉంటుందని..మరలా 5 రోజుల విరామం ఇస్తారనీ, నాలుగో దశలో తిరిగి 15 రోజుల లాక్ డౌన్ ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ క్రమాన్ని తేదీలతో సహా ఉదహరిస్తున్నారు. ప్రజలకు తెలుగు వన్ న్యూస్ ఒక్క విన్నపం..ఇలాంటి ప్రచారాలను నమ్మకండి. ఎందుకంటే అసలు లాక్ డౌన్ అమలు చేస్తున్నదే ప్రజలు సామాజిక, భౌతిక దూరం పాటించి కరోనా చైన్ తెగ కొడదామని. ఈ సందేశంలో చెప్పిన విధంగా మద్యలో 5 రోజుల విరామం ఇచ్చి దశల వారిగా లాక్ డౌన్ అమలు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇలాంటి ఊహాగానాలు వ్యాప్తి చేసేవారికే తెలియాలి.   లాక్ డౌన్ అమలు గురించి విధి విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటిస్తాయి. ప్రజలెవరూ ఇలాంటి ఊహా గానాల ఉచ్చులో పడి ఆవేదన చెందకండి.