రంజాన్ నెల ఇంట్లోనే! సౌదీ గ్రాండ్ ముఫ్తీ అదే చెప్పారు!
posted on Apr 18, 2020 @ 4:08PM
వచ్చే వారం ప్రారంభం కానున్న రమదాన్ ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్ ప్రార్థనలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద, గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దులాజీజ్ అల్ షేక్ ప్రపంచంలో వున్న ముస్లింలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులకు వెళ్లే పరిస్థితులు లేవని ముఫ్తీ గుర్తుచేశారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రమదాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్, తారావీహ్ కార్యక్రమాలను అందరూ ఇంట్లోనే నిర్వహించుకోవాలని సూచించారు. రమదాన్ పర్వదినంలో మక్కా, మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను (ప్రత్యేక ఇఫ్తార్ పార్టీలను) సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచే సౌదీ అరేబియా నమాజ్ విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించింది. ప్రపంచంలో వున్న ముస్లింలందరూ ఇంట్లోనే నమాజ్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవాలని గ్రాండ్ ముఫ్తీ ఆదేశాలు జారీచేశారు.
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఉమ్రా యాత్రలను కూడా సౌదీ ప్రభుత్వం రద్దు చేసింది. మే 31వ తేదీ వరకు అన్ని ఎయిర్ లైన్స్ ఆపరేషన్‌పై నిషేధం విధించింది.