తోట త్రిముర్తుల‌పై దాడి చేస్తావా? అంటూ వేట‌కొడ‌వ‌ళ్ళ‌తో న‌రికారు!

రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్సార్సీపీ నేత తోట త్రిమూర్తులు పై గతంలో చెప్పుతో దాడి చేసిన వ్యక్తి మేడి శెట్టి ఇజ్రాయిల్ పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. రామచంద్రపురం మండలం మసకపల్లి గ్రామంలో ఇజ్రాయిల్ పై దుండగులు కత్తులతో దాడి చేసి హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న ఇజ్రాయిల్ ను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. త‌న‌పై దాడి జ‌రిగిన తీరును మేడిశెట్టి ఇశ్రాయేల్ వివ‌రించాడు. రాడ్‌తో నెత్తి మీద కొట్టారు. వాళ్ళ‌ను తోసి ప‌రుగెడుతుంటే వెన‌క త‌రిమి త‌రిమి వేడ‌కొడ‌వ‌ళ్ళ‌తో న‌రికారు. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ప‌రుగెత్తుతూ కాలువ‌లో ప‌డిపోయాను. వాళ్ళు కూడా కాలువ‌లోకి దూకి న‌న్ను అంతం చేయాల‌ని చూశారు. తోట త్రిముర్తుల‌పై దాడి చేస్తావా? ఈ రోజుతో నీవు స‌చ్చావు. అంటూ బూతులు తిట్టార‌ని బాధితుడు రోదిస్తూ చెప్పాడు. పామ‌ర్రు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇశ్రాయేల్ స్నేహితుడు రాజు ఫోన్ చేసి పిలిస్తే తాను వ‌చ్చిన‌ట్లు చెబుతున్నాడు. అప్ప‌ట్టికే దాడి చేయ‌డానికి కాచుకుని కూర్చున్న ర‌వ్వా నాగ‌భూష‌ణ, అత‌ని అనుచ‌రులు వేట కొడ‌వ‌ళ్ళ‌తో విచ‌క్ష‌ణార‌హితంగా నరికిన‌ట్లు బాధితుడు చెబుతున్నారు. మేడిశెట్టి ఇశ్రాయేల్ గతంలో తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడిచేసిన ఘటనలో ముఖ్యుడు. కాకినాడ ఆసుప‌త్రికి త‌ర‌లించాం. భుజాంపై, త‌ల‌పై పెద్ద గాయాలున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు. తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు వెళ్తుండగా కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయెల్‌ అనే వ్యక్తి త్రిమూర్తులపై చెప్పుతో దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. గతంలో తోట త్రిమూర్తులను వైసీపీలోకి చేరే సమయంలో దళితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే తోట త్రిమూర్తులుపై ఇజ్రాయేలు దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో అప్ప‌ట్లో వైరల్ అయింది. ప్రశాంతమైన తూ.గో.జిల్లా K.గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో మేడిశెట్టి ఇశ్రాయేల్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి భౌతికదాడులు సమాజానికి చాలా ప్రమాదం.. సత్వర విచారణ జరిపి నిందితులని అరెస్ట్ చేయాలి.

అటవీ ఉత్పత్తుల భారీ డంప్, నాటు సారా స్వాధీనం!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కారేపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల జాయింట్ ఆపరేషన్ చేశారు. అధికారులు పెద్ద ఎత్తున నిల్వచేసిన టేకు కలపతో పాటు అక్రమంగా నిల్వ చేసిన నాటు సారా ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన అటవీ సిబ్బందిని అడ్డుకుని స్థానికులు కొందరు దాడి చేశారు. వారిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని అటవీ ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్లాన్ తో మెరుపుదాడి చేశారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయన్, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ హెరామత్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర పర్యవేక్షణలో ఉమ్మడి ఆపరేషన్ జరిగింది. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో మూడు శాఖలకు చెందిన 100 మంది సిబ్బందితో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కారేపల్లి పరిధిలోని భూక్య తండా, హనుమాన్ తండా పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ద్వారా సోదాలు నిర్వహించిన సిబ్బంది నాలుగు ట్రాక్టర్లు టేకు దుంగలతోపాటు, ట్రాక్టర్లు, కార్పెంటర్ మెషిన్, ఐదు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేసిన అధికారులు. అడవుల్లో చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణా పై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు.

వెయ్యి రూపాయ‌ల‌కే కరోనా వ్యాక్సిన్ !

మ‌న దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను కేవ‌లం 1000 రూపాయ‌ల‌కే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రముఖ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో చాలా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను ఇతర మందుల తయారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. మే నెలలోనే మనుషులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ట్రయల్స్ కోసం తాము వేచి చూడబోమన్నారు. మొదటి దశలో నెలకు 10 మిలియన్ల డోసులను సిద్ధం చేస్తామన్నారు. తరువాత నెలకు 20 నుంచి 40 మిలియన్ల డోసులను తయారు చేస్తామన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి 2-4 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ధీమా వ్య‌క్తం చేశారు. మందులేని ఈ డెడ్లీ వైర‌స్ మహమ్మారిని అంతంచేసేందుకు ప్రపంచ దేశాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ను ఎవ‌రు ముందుగా తీసుకువ‌స్తార‌ని ప్ర‌పంచం ఎదురుచూస్తోంది.  

టాప్ డిఫాల్టర్ల 68,600 కోట్ల రూపాయ‌ల రుణాలు రద్దు!

బ్యాంకులకు వేల కోట్లు రూపాయ‌లు కుచ్చు టోపీ పెట్టి, ఉద్దేశ్యపూర్వకంగా ఎగ‌వేసిన 68,000 కోట్ల రుణాలను రద్దు చేసిన‌ట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద సాకేత్ గోఖలే అడిగిన ప్ర‌శ్న ద్వారా ఈ స‌మాచారం వెల్ల‌డైంది. సాకేత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. తనకు 50 మంది టాప్ విల్‌ఫుల్ డిఫాల్టర్లు, వారి కరెంట్ లోన్ స్టేటస్ కావాలని ఫిబ్రవరి 16న దరఖాస్తు చేసుకోగా, ఏప్రిల్ 24న ఆర్‌బిఐ సమాధానం ఇచ్చింద‌ని సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. ఆర్బీఐ 30 సెప్టెంబర్ 2019 నాటికి విల్ ఫుల్ డిఫాల్టర్లు, రుణాల రద్దు వివరాలను అందించింది. విల్ ఫుల్ డిఫాల్టర్స్ జాబితాలో మొద‌టి స్థానంలో విదేశాలకు పారిపోయిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ ఓనర్ మెహుల్ చోక్సీ ఉన్నారు. చోక్సీ కంపెనీలకు చెందిన రూ.5,492 కోట్ల రుణాలను ఆర్బీఐ రద్దు చేసింది. రెండు మూడో స్థానాల్లో FMCG కంపెనీ REI ఆగ్రో లిమిటెడ్, జతిన్ మెహతా విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ లిమిటెడ్ ఉన్నాయి. REI ఆగ్రోకు చెందిన రూ.4,314 కోట్లు, విన్‌సమ్ డైమండ్స్‌కు చెందిన రూ.4,076 కోట్లు. రోటోమా గ్లోబల్ ప్రయివేటు లిమిటెడ్‌కు చెందిన రూ.2,850 కోట్లు. ఖుదోస్ కెమి లిమిటెడ్‌కు చెందిన రూ.2,326 కోట్లు. బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలకు చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రూ.2,212 కోట్ల రుణాలు రద్దు చేశారు. జూమ్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.2,012 కోట్ల రుణాలు రద్దయ్యాయి. లండన్‌లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా కంపెనీలకు సంబంధించి రూ.1,943 కోట్ల రుణాలు రద్దు చేశారు. ఫరెవర్ ప్రీసియస్ జ్యువెల్లర్స్ అండ్ డైమండ్స్ ప్రయివేటు లిమిటెడ్ రూ.1,962 కోట్లు. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.1,915 కోట్లు. చోక్సీకి చెందిన ఇతర కంపెనీలు గిలి ఇంండియా లిమిటెడ్ రూ.1,447 కోట్లు. నక్షత్ర బ్రాండ్స్ లిమిటెడ్ రూ.1,109 కోట్లు రద్దు చేశారు. 50 మంది వివిధ బ్యాంకులకు ఎగవేసిన రుణాల విలువ రూ.68,607 కోట్లు అని ఆర్బీఐ తెలిపింది. జయంతిలాల్ ఎన్ మిస్త్రీ కేసులో 2015 డిసెంబర్ 16 సుప్రీంకోర్టు తీర్పులోని 77 వ పేరా ప్ర‌కారం ఆర్టీఐ చట్టం 2005 లోని సెక్షన్ 8 (1) (ఎ) ప్రకారం, విదేశీ రుణగ్రహీతల సమాచారం బహిరంగ బహిర్గతం నుండి మినహాయించబడిందని ఆర్బిఐ తెలిపింది.

జగన్ కున్న నేర్పు పేదలకు లేదు : అచ్చెన్నాయుడు

‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందడంలోనూ ఏపీ నెంబర్ వ‌న్ గా నిలిచిందని, విశాఖ‌లో ‘కరోనా’ కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్య‌పెడుతున్నారని, ‘పాజిటివ్’ వస్తే డిశ్చార్జి.. ‘నెగెటివ్’ అయితే వైద్యం చేస్తారా అని, సీనియర్ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘కరోనా‘కు భయపడాల్సిన పని లేదని, జ్వరం లాంటిదే కనుక త‌గ్గిపోతుందంటున్న జగన్, తాడేప‌ల్లిలోని తన నివాసం దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదెందుకు? అని కూడా ఆయన నిలదీశారు.  వైరస్‌తో కూడా స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల నేర్పు వైఎస్ వార‌సుడిగా జగన్ కు ఉందేమో కానీ, లాక్‌డౌన్‌తో తిన‌డానికి తిండిలేక‌, చేయ‌డానికి ప‌నిలేక అల్లాడిపోతున్న పేద‌ల‌కు లేదని అన్నారు. దేశంలోనే కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌డంలో ఏపీ నెంబ‌ర్‌వ‌న్ అని జగన్ ప్రకటించడంపైనా ఆయన విమర్శలు చేశారు. ‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందడంలోనూ, ఎక్కువ మ‌ర‌ణాల్లోనూ, త‌క్కువ రిక‌వ‌రీలోనూ ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఏపీయే నెంబ‌ర్‌వ‌న్ అని అన్నారు. విశాఖ‌ప‌ట్నంలో ‘కరోనా’ కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్య‌పెడుతున్నారని, 1,600కి పైగా పెండింగ్ లో ఉన్న టెస్టుల ఫలితాలు వెల్లడిస్తే లెక్క తేలిపోతుందని అన్నారు. ‘పాజిటివ్’ వస్తే డిశ్చార్జి చేసి, ‘నెగెటివ్’ అయితే వైద్యం చేస్తున్నప్పుడే జగన్ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమైందని ఘాటు విమర్శలు చేశారు. రోజూ చంద్రబాబుపై పడి ఏడవడం ఆపి ‘కరోనా’ కట్టడి కోసం పనిచేయండంటూ జగన్ కు సూచించారు.

13 జిల్లాలలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు

గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు స్పెషల్ సీఎస్  జవహర్ రెడ్డి చెప్పారు. మొత్తం రాష్ట్రంలో  1259 నమోదు  కాగా వారిలో 970 మంది క్రియాశీలకంగా ఉన్నారని,  258 మందిని విడుదల చేశామని, రాష్ట్రంలోమొత్తం ఇప్పటి వరకు 31 మంది మరణించారని తెలిపారు. గత 24 గంటల్లో మొత్తం 5783 కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 82 మందికి కరోనా పోసిటివ్ గా నిర్ధారించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80,344  మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది జనాభాకు 1504 సగటు పరీక్షలు నిర్వహించడం ద్వారా దేశంలోనే పరీక్షల నిర్వహణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానం లో నిలిచిందన్నారు.పరీక్షలు చేసిన వాటిలో 1.57 శాతం  పోసిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదు అవుతున్నాయి. దేశంలో 7,16,733 మందికి పరీక్షలు చెయ్యగా 29,572 మందికి నిర్ధారణ అయినది, ఇది 4.13 శాతమని కూడా జవహర్ రెడ్డి చెప్పారు.

హోమ్ ఐసొలేషన్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ 

కరోనా పేషంట్స్ తో క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలని, అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నియమావళి జారీ చేసింది. వైద్య పరీక్షల్లో తక్కువ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలిన వారిని లేదా ప్రీ-సింప్టమ్స్ కనిపిస్తున్న వారిని తొలుత హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. హోమ్ ఐసొలేషన్ ఎవరికి అవసరం? వైద్య పరీక్షల్లో తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయిన వ్యక్తులు. లేదా ఏదైనా డాక్టర్ పరిశీలనలో కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానించబడ్డ వ్యక్తులు. వీరంతా హోమ్ ఐసొలేషన్ లో ఉండాలి. వీరి కుటుంబ సభ్యులు కూడా ఐసొలేషన్ లో ఉండాలి. వీరి మంచిచెడ్డలు చూసేందుకు అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలి. హోమ్ ఐసొలేషన్ సమయంలో హాస్పిటల్ కు, సహాయకుడికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు పాటించాల్సినవి: ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యుడి సలహా మేరకు సహాయకుడితో పాటు క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలి. మొబైల్ లో ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అన్ని సమయాల్లో ఈ యాప్ యాక్టివ్ గా ఉండాలి. ప్రతి పేషెంట్ తన ఆరోగ్యాన్ని చెక్ చేసేందుకు, తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా సర్వైలెన్స్ అధికారికి అందించేందుకు అంగీకరించాలి.సెల్ఫ్ ఐసొలేషన్ కు సంబంధించిన ఫామ్ ను పూర్తి చేయాలి. హోమ్ క్వారంటైన్ గైడ్ లైన్స్ ను పాటించాలి.

లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం: ఏపీ మంత్రి సురేశ్

లాక్ డౌన్ అనంతరం టెన్త్ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశం ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తాం సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తాం లాక్ డౌన్ అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని, నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పారు. కాగా, రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సురేశ్ పాల్గొన్నారు. డిజిటల్, ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను విస్తృతంగా వాడుకోవాలని కేంద్ర మంత్రి సూచించినట్టు సమాచారం.

మన రైతుల్ని కాపాడుకోలేమా?

చెరుకు రసం, బత్తాయి రసం,  కొబ్బరి నీళ్లు త్రాగండి  అని టీవీ, పేపర్  లలో ఒక్క హీరో / హీరోయిన్ అయినా చెప్పరు. ఎందుకంటే వాళ్లకు కోట్లలో ఇచ్చే అంత డబ్బు ఆ రైతుల దగ్గర ఉండదు. అదే దిక్కుమాలిన మన శరీరాలను సర్వ నాశనం చేసే కూల్ డ్రింక్స్ ను మాత్రము త్రాగండి అని పదే పదే చెప్తారు.  ఎందుకంటే ఆ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు హీరోలకు  కోట్లల్లో డబ్బులు ఇస్తారు. కనుక  వాళ్ళు ఏదైనా చెప్తారు. ఎందుకంటే ఆ హీరోలకు డబ్బు ముఖ్యం.  మనుష్యుల ప్రాణాలతో వాళ్లకు అవసరం ఉండదు. కానీ మనం... హీరోలకు వాళ్ళ సినిమాలు వస్తే ఎగబడి చూస్తాము. వాళ్ళకోసం ఏమైనా చేస్తాము. మన రైతుల కోసం మనం ఏంచేస్తున్నామో ఆలోచిస్తున్నారా? రైతులకు మనం ప్రత్యేక సహాయం చేయకపోయినా పరోక్షంగా అయినా వాళ్ళు పండించిన ఆ పంట రైతుకు మనం సహాయం చేయచ్చు.  ఎలానో చెప్పాలా?  మనం ఆ దిక్కుమాలిన కూల్ డ్రింక్స్ మానేసి ఈ బత్తాయి, కొబ్బరి, చెరుకు రసాలు తాగండి, మనం రైతులకు సహాయం చేసినట్లే.  పాపం రైతు మన మధ్య ఉన్నా మనం పట్టించుకోము, కానీ ఎక్కడి నుండో వచ్చిన కూల్ డ్రింక్స్ కంపెనీలను మాత్రం బ్రతికిస్తాం. ఇదెక్కడి న్యాయం చెప్పండి?  రసాల వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మన రైతూ బాగుంటాడు.   కానీ కూల్ డ్రింక్స్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి. అయినా మనం చెడు వైపే ఆలోచిస్తాము కానీ.. మంచివైపు ఆలోచిస్తామా..?  కరోనా లాక్ డౌన్ వల్ల ఆ హీరో ఊడ్చాడు, ఈ హీరో ఇంట్లో ఆ పని చేసాడు, ఆ హీరోయిన్ వంట చేస్తుంది అని పనికి రాని మెస్సేజ్ లు వాట్సాప్ ఫేస్బుక్ లలో పెడుతున్నారు.  మొన్న వర్షానికి రైతులకు చాలా పంటలు దెబ్బతిన్నాయి,  మామిడి కాయలు రాలిపోయాయి, అక్కడక్కడ కోతకు వచ్చిన వరి తడిసి ముద్ద అయింది. మరి ఇలాంటి పోస్టులు పెట్టడం రాదా జనాలకు..? చెప్పండి? కరోనా వల్ల అన్ని కంపెనీలు మూతపడినా, వ్యాపారాలు ఆగిపోయినా,  ఒక్క రైతు పనులు మాత్రం ఎక్కడా ఆగిపోలేదు..!! రైతులు అలా ఆగిపోతే కరోనా మృతుల కంటే చాలా రెట్లు ఆకలి  మరణాలు చూడాల్సి వస్తుంది.

వాక్సిన్ ఇచ్చిన కోతులు ఉల్లాసంగా..ఉత్సాహంగా

covid వాక్సిన్ దిశగా వడివడి అడుగులు వేస్తున్న Oxford మరో చల్లని కబురు అందించింది..గత మార్చి నెలలో కోతులపై చేసిన ప్రయోగం అద్భుతమైన ఫలితం ఇచ్చిందని Oxford శాస్త్రవేత్తల బృందం తెలిపింది.మొత్తం ఆరు కోతులకు ఈ వాక్సిన్ ఇవ్వగా 28 రోజుల తర్వాత కూడా అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. విశేషమేమిటంటే ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ కోతులు మానవ కణజాలాలకు బాగా సారూప్యత కలిగినవే..వీటితో పాటు ఉండి వాక్సిన్ ఇవ్వని కోతులు అస్వస్థతకు గురయ్యాయి..వాటి మధ్య ఉన్నా కూడా ఈ ఆరింటికి లక్షణాలు కనిపించకపోవడం మంచి పరిణామం. ఇప్పటికే elisaa grenato పై వాక్సిన్ ప్రయోగించిన ఆక్స్ఫర్డ్ మే నెలాఖరు నాటికి 6000 మంది మనుషులపై ప్రయోగించడానికి  సన్నాహాలు చేస్తోంది.అన్నీ సత్ఫలితాలు ఇస్తే సెప్టెంబర్ నాటికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఆసరికే ఇండియాలో మూడు కోట్ల వాక్సిన్లు సిద్ధంగా ఉంటాయి. ఈ వాక్సిన్ ప్రక్రియలో oxford గణనీయమైన పురోగతి సాధించినట్టే.వాస్తవానికి కొన్ని వాక్సిన్ల తయారీకి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది.covid హడావిడి మొదలైన తర్వాత కూడా తక్కువలో తక్కువగా 12-18 నెలలు పడుతుందని ఇప్పటికీ అంటున్నారు.అలాంటి వాదనల నేపథ్యంలో అప్పుడే మానవుల మీద ప్రయోగించే దశ రావడం మెరుపు  వేగమేనని చెప్పాలి. ఇదిలా ఉండగా Oxford మాత్రమే గాక అమెరికాకు చెందిన MODERNA,INOVIA సంస్థలు కూడా చకచకా పనిచేస్తున్నాయని అంటున్నారు.ఎక్కువ వాక్సిన్లు వస్తే త్వరితగతిన అధిక శాతం మందికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.Oxford ఉపయోగిస్తున్న పద్ధతిలోనే చైనాలో కూడా జరుగుతున్న పరిశోధనలు మంచి పురోగతినే సాధిస్తున్నాయి.

చేతులెత్తేసిన జగన్‌ సర్కార్‌!

'జ్వరం వస్తుంది. అంతే. మందులేసుకుంటే పోతుంది!... అంటూ కరోనా వైరస్‌ గురించి ముఖ్యమంత్రి జ‌గ‌న్ చాలా లైట్‌గా చెబుతున్నారు. కరోనా వైరస్‌ని అరికట్టలేం.. ఓ ఏడాదిపాటు ఆ కరోనా వైరస్‌ మనతోనే వుంటుంది తప్పదు.. అని ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే తెలంగాణను దాటేసింది. తమిళనాడుని దాటేయడానికి శరవేగంగా పరుగులు పెడ్తోంది. దేశంలో ప్రస్తుతానికి కరోనా పాజిటివ్‌ కేసుల పరంగా నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో మహారాష్ట్ర వుంది. రికార్డుల కోసం ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రతో పోటీ పడాలనుకుంటోందా.? అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.  ఈ డెడ్లీ వైరస్‌ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు చూస్తోంటే, పూర్తిగా ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కన్పిస్తోంది. ఓ పక్క మేం సాధించేశాం.. మేం సమర్థవంతంగా పనిచేస్తున్నాం.. మేం వైర‌స్‌‌ని ఎదుర్కొంటున్నాం అని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడికి కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఆ యువకుడి కుటుంబ సభ్యులకి కరోనా వైరస్‌ సోకింది.. అదీ ఆ యువకుడి ద్వారానే. మరి, కరోనా వైరస్‌ పరీక్షలతో నూటికి నూరు శాతం 'వాస్తవాలు' బయటకు వస్తున్నాయని ఎలా అనుకోగలం.?  సాధారణ జ్వరం పెద్ద సమస్య కానే కాదు.. మరి అలాంటప్పుడు, రోజూ వేల కొద్దీ కరోనా వైరస్‌ పరీక్షలు ఎందుకు చేయిస్తున్నట్లు.? కరోనా వైరస్‌ పరీక్షల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటూ 'సెల్ఫ్ డబ్బా' కొట్టుకోవడమెందుకు.? పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నందుకు సంతోషించాల్సిందే. కానీ, 'ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం.. ఆ పరీక్షలతో పోల్చితే నమోదువుతన్న కేసుల సంఖ్య తక్కువే..' అని ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా చెబుతారు.? కరోనా వైరస్‌ సాధారణ జ్వరం కాదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ అన్న విష‌యం ముఖ్య‌మంత్రికి మాత్రం అర్థం కావ‌టం లేదు. ముఖ్య‌మంత్రి ఇలా మాట్లాడ‌డం ఇది మొదటి సారి కాదు. మొదటి నుంచీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, కరోనా వైరస్‌ విషయంలో ఒకే మాట మీద వున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు ఇచ్చే సూచనల్ని స్వీకరిస్తే క‌నీసం త‌న‌ 'అనుభవ రాహిత్యం' కొంత మేర మరుగున పడ్తుందన్న విజ్ఞత కూడా జ‌గ‌న్‌కు లేకపోవడం ఆశ్చర్యకరం. విపక్షాల్ని విమర్శించేందుకే అధిక ప్రాధాన్యత ఇవ్వ‌కుండా కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు వెచ్చిస్తే కొంతైనా రాష్ట్ర ప్రజలకూ మేలు జరుగుతుంది.

ఏపీని దేవుడే రక్షించాలి.. చంద్రబాబు ట్వీట్! 

క‌రోనా వైరస్ ను కేవలం జ్వరమంటూ నిర్ల‌క్ష్యంగా మాట్లాడ‌తారా అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.  ముఖ్య‌మంత్రి వ్యాఖ్యలు అయన నిర్లక్ష్యానికి నిదర్శనం అని బాబు అన్నారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన వీడియోను చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కేవలం జ్వరమేనని ప్రతిసారి చెప్పే వ్యక్తుల గురించి ఏం మాట్లాడాలని చంద్రబాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.   ఈ డెడ్లీ వైరస్ బాధితుల్లో సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రాన్ని దేవుడు రక్షించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఎం జగన్ మీడియాతో మాట్లాడిన తీరు ఆయ‌న నిర్లక్ష్యానికి నిదర్శమని బాబు అన్నారు.  కరోనా బాధితులను అంటరానివారిగా చూడొద్దని సీఎం జగన్ అన్నారు. కరోనా నాతో సహా ఎవరికైనా రావచ్చుని, రాబోయే కాలంలో ప్రజలు కరోనా కలిసి జీవించాల్సి ఉంటుంది. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనాపై అనవసర భయాలు పెట్టుకోవద్దు అన్నారు. కరోనా ఒక జ్వరం లాంటిది అన్నారు. ఎవరికి వస్తుందో తెలియడం కష్టమన్నారు. సామాజిక దూరం పాటించడం అవసరం. రాష్ట్రంలోని గ్రీన్ జోన్స్ ప్రాంతాలలో కరోనా రాకుండా జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అయితే సీఎం అన్న ఈ వ్యాఖ్యలను జోడిస్తూ ముఖ్య‌మంత్రి తీరును చంద్రబాబు తప్పుబట్టారు.

ప్రవాసీలను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు!

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మే 3 అనంతరం లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తోంది. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కుటుంబసభ్యలు తమ వారిని వారిని స్వదేశానికి తీసుకురావాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవాసీలను తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలు పంపాలని కేంద్రం నిర్ణ‌యించింది. ఇందుకు గాను చ‌ర్య‌లు చేప‌ట్టింది.  ఎంత మంది విదేశాల్లో చిక్కుకున్నారు, ఎంత మందిని తిరిగి దేశానికి రానున్నారు అన్నవివరాలను సేకరించాలని భారత రాయబార కార్యాలయాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల్లో చిక్కుకుని ఉన్నవారి పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది.  ఆయా దేశాల భారత రాయభార కార్యాలయ సిబ్బంధి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం, అలాగే ఖతర్‌లోని రాయబార కార్యాలయం కూడా ఆన్‌లైన్‌లో వివరాలను సేకరిస్తున్నారు.  కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తచెందుతుండడంతో కేంద్రం ప్రభుత్వం గత నెల 22వ తేదీన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. విద్య, ఉద్యోగ, ఉపాధి, పర్యాటకానికి వివిధ దేశాలకు వెళ్లిన ఎంతో మంది భారతీయులు విదేశాల్లో  చిక్కుకుపోయారు. వారంతా తిరిగి భారత దేశానికి చేరుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారందరినీ స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది.

పీఎం మోడీ నుండి సీఎం జగన్ వరకు.. అందరూ అదే బాపతు

​సినీ సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు.. కాస్ట్ లీ కారులు కొనడం, ఖరీదైన బట్టలు, వాచ్ లు ధరించడం కామన్. ఆ సెలబ్రిటీ కొన్న కారు ఇంత!! ఆ సెలబ్రిటీ పెట్టుకున్న వాచ్ ఇంత!! అని కామన్ పీపుల్ కూడా వాటి గురించి ఆశ్చర్యంగా చర్చింకుంటారు. కానీ రాజకీయ నాయకులు ఇలాంటి ఆడంబరాలకు పోతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. రాజకీయ నాయకులు చాలా నిరాడంబరంగా జీవించాలి. వారు చేసే ప్రతి ఖర్చు ప్రజాసేవకే ఉపయోగించాలి. అయితే ఈ జనరేషన్ లో అలాంటి నాయకులు చాలా అరుదనే చెప్పాలి. నాయకులు కూడా దాదాపు సెలబ్రిటీల లాగానే జీవిస్తున్నారు. చూసి చూసి ప్రజలకు కూడా అలవాటు అయిపోతోంది. అయితే కొందరు నాయకులు మాత్రం.. సినీ సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు కంటే విలువైనవి ధరించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో పీఎం మోడీ నుండి ఏపీ సీఎం జగన్ వరకు చాలా మంది ఉన్నారు. మోడీ పేరు వింటే మనకి ముందుగా గుర్తొచ్చేది చాయ్ వాలా. ఓ చాయ్ అమ్మిన కుర్రాడు ప్రధాని స్థాయికి ఎదగడం గర్వకారణం. అయితే మోడీ సాధారణ స్థాయి నుండి వచ్చినా ఆయన జీవశైలి మాత్రం విలాసవంతంగా ఉంటుందని పలువురు విమర్శిస్తుంటారు. దానికి కారణం ఆయన ధరించే ఖరీదైన బట్టలు. మోడీ చాలా ఖరీదైన బట్టలు ధరిస్తాడని, అది కూడా ఒకసారి వేసిన డ్రెస్ మరోసారి వేయడని విపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఓ సారి ఆయన సూట్ పై కాంట్రవర్సీ కూడా అయింది. మోడీ ధరించిన సూట్ పది లక్షలు అని, ఆయనకు సూట్ల మీదున్న శ్రద్ద సొసైటీ మీద లేదని, ఆ డబ్బుని పేదవారి కోసం ఖర్చు చేస్తే బాగుండేదని విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయినా మోడీ డ్రెస్సింగ్ స్టైల్ లో మాత్రం మార్పు రాలేదనే చెప్పాలి. ఇక 2016 సమయంలో కర్ణాటకలో అయితే ఖరీదైన వాచ్ ల చుట్టూ రాజకీయం తిరిగింది. అప్పటి సీఎం సిద్దరామయ్య చేతి వాచ్ రూ.70 లక్షలు అని విపక్షాలు ఆరోపించాయి. అప్పట్లో ఇది బాగా కాంట్రవర్సీ అయింది. ఇక మాజీ సీఎం కుమారస్వామి వద్దనైతే చాలా ఖరీదైన వాచ్ లు ఉన్నాయని ప్రచారం జరిగింది. వజ్రాలు పొదిగిన 50 లక్షల నుంచి కోటి విలువైన వాచ్ లు ఉన్నాయని వార్తలొచ్చాయి. అదేవిధంగా, సిద్దరామయ్య ఖరీదైన పెన్ను గురించి కూడా అప్పట్లో బాగా కాంట్రవర్సీ అయింది.  ఇలా లక్షల విలువైన వస్తువులు వాడుతూ చాలా మంది నాయకులు విమర్శలు ఎదుర్కొన్నారు. వారిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఆయన కాస్ట్ లీ వాచ్ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. జగన్ చేతికున్న వాచ్ ఖరీదు రూ.13 లక్షల 31 వేలు. కాస్ట్ లీ సీఎం అంటూ ఇప్పటికీ ఆయనపై పలువురు ట్రోల్ల్స్ చేస్తుంటారు. అంతేకాదు, జగన్ ధరించే చొక్కాలపై కూడా కాంట్రవర్సీ జరిగింది. ఆయన ధరించే చొక్కా ధర చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ క్లాత్ ని ప్రత్యేకంగా తెప్పిస్తారని అంటుంటారు. మొత్తానికి పీఎం మోడీ నుండి సీఎం జగన్ వరకు పలువురు నాయకులు ఆడంబరాలకు పోయి విమర్శలు ఎదుర్కొన్నారు.

నిమ్మగడ్డ తొలగింపుపై కొనసాగుతున్న తుది వాదనలు

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నిమ్మగడ్డ తరఫున న్యాయవాది ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం వివరణ, నిమ్మగడ్డ పిటిషన్లపై విచారణ సాగుతోంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ దాఖలు చేసిన రిట్‌పై రాతపూర్వక వాదనలను న్యాయవాది కోర్టుకు సమర్పించారు.  స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత రహస్యమైనదని, న్యాయ సలహా మేరకే తాను నడచుకున్నానని రమేశ్‌కుమార్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో కమిషనర్‌కు విచక్షణాధికారం ఉంటుందని, దాని మేరకే తాను వ్యవహరించానని పేర్కొన్నారు. వాయిదా నిర్ణయంపై ప్రభుత్వాధికారులనో, ఎన్నికల సంఘ కార్యదర్శినో సంప్రదించాల్సిన అవసరం లేదని, ఆ మేరకు నిబంధనలేవీ లేవన్నారు.

తెలంగాణాలో తప్పుదోవ పట్టిస్తున్న కరోనా లెక్కలు!

* దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో-5221, * తెలంగాణలో 1003.   ఈ లెక్కలు చూసి తెలంగాణలో మొత్తం పరిస్తితి పూర్తిగా కంట్రోల్ లో ఉందని పప్పులో కాలేసేరు. కరోనా కేసులు చేసే పరీక్షల మీద ఆధారపడి ఉంటాయి. పరీక్షలు ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే తక్కువ, అసలు చేయకుంటే అసలు ఒక్క కేసూ ఉండదు. ఒక్కొక్క ఇంట్లో పదుల సంఖ్యలో కేసులు బయటబడుతుంటే ఇంకా తెలంగాణలో త‌క్కువ కేసులెందుకు వున్నాయి. ఈ  అనుమానం చాలామందికి రావచ్చు.  ఒకసారి లెక్కలను మరింత లోతుగా విశ్లేషిద్దాం...?  తెలంగాణలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు : 13200.  అయితే బ‌యటపడిన కేసులు: 943 మాత్ర‌మే. ప్రతీ 100 పరీక్షలకు తెలంగాణలో బయటపడుతున్న కేసులు: (100/13200)x1003 = 7.59 మహారాష్ట్రలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు: 75838. అయితే బయటపడిన కేసులు: 5221 ప్రతీ 100 పరీక్షలకు మహారాష్ట్రలో బయటపడుతున్న కేసులు: (100/75838)x5221 =6.88 అంటే, తెలంగాణలో ప్రతీ 100 కేసులకూ 7.59 పాజిటివ్ వస్తే, మహారాష్ట్రలో ఈ సంఖ్య మనకన్నా తక్కువగా (6.88) ఉంది. అంటే కేసుల శాతం తెలంగాణలో మహారాష్ట్ర కన్నా ఎక్కువగా ఉంది.   తెలంగాణలో కూడా మహారాష్ట్ర మాదిరిగా పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణలో బయటపడదానికి అవకాశం ఉన్న కేసుల సంఖ్య: (75838/13200) x 1003 = 5762. ఇది మహారాష్ట్ర కన్నా 541 ఎక్కువ. అసలు రోగులే లేకుంటే, పరీక్షలు చేసినా  పాజిటివ్ కేసులేలా బయటపడతాయ్? అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరిగినప్పుడల్లా కేసుల సంఖ్య పెరగడం. ఉదాహరణకు మొన్న 450 పరీక్షలు చేస్తే, అందులో 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే పది శాతం కన్నా ఎక్కువ. పరీక్షలు చేసిన చోటల్లా పుట్టల్లా కేసులు బయటపడుతుంటే అసలు రోగులే లేరనడం అమాయకత్వం.  మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల్లో మరణించిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మరణించిన వారికి అంత్యక్రియలు కరోనా రోగులకు నిర్వహించినట్లుగానే నిర్వహించాలి కానీ, వారికి కరోనా పరీక్షలు చేయవద్దని చెప్పడానికి కారణం ప్రభుత్వం వివరించలేదు. దీంతో కరోనా మరణాల లెక్కలు తెలంగాణలో చాలా తక్కువగా నమోదైతాయి.  అలాగే, కరోనా రోగుల సెకండరీ కాంటాక్ట్ లకు కరోనా పరీక్షలు చేయవద్దని నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో చూపించే కరోనా కేసుల సంఖ్య వాస్తవ సంఖ్య కన్నా గణనీయంగా తక్కువ ఉంటుంది.  అసలు వేల సంఖ్యలో కరోనా పరీక్షలతో సాధించేదెముంది?  ‘వేల సంఖ్యలో కరోనా పరీక్షలతో సాధించేదెముంది? ఖర్చు తప్ప...” అనే అనుమానం చాలా మందికి రావచ్చు. తెలంగాణలో కోటి మందికి పరీక్షలు చేసినా 600 కోట్ల రూపాయల ఖర్చుకాదు. తెలంగాణలో రెండు రోజులు లాక్ డౌన్ తో ప్రభుత్వం కోల్పోయే ఆదాయం (సుమారు రూ800కోట్లు) కన్నాఈ ఖర్చు తక్కువ. కాబట్టి పరీక్షలకు ఖర్చుకు సంబంధం లేదు.  మరి పరీక్షలతో లాభం ఏంటి? దీనికన్నా ముందు, అసలు లాక్ డౌన్ తో లాభమెంటోతెలుసుకోవాలి. లాక్ డౌన్ తో వైరస్ సమాజం నుండి తొలగిపోదు. లాక్ డౌన్ కరోనా వ్యాప్తికి తాత్కాలికంగా కట్టడి వేస్తుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ మీద ఒకే సారి తీవ్రభారం పడకుండా ఆపుతుంది.  ఈ లోగా ప్రభుత్వం కరోనాను నిర్మూలించాలంటే లాక్ డౌన్ తో పాటు పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడం, గుర్తించిన రోగులను ఇతరుల నుండి వేరు పరచడం, చికిత్సనందించడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణ పరీక్షల సంఖ్యను అనేక రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. మన కన్నా తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలు మనకు ఆదర్శం కాకూడదు. ఇలా కాకుండా కేవలం లాక్ డౌన్ ఒక్కటే మార్గమనుకుంటే, కరోనా వ్యాప్తిని అరికట్టలేం సరికదా దీర్ఘకాలిక లాక్ డౌన్ లతో ప్రజల జీవితాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నమవుతుంది.  మరోవైపు కేసులు తక్కువగా ఉన్నాయని లాక్ డౌన్ ఎత్తివేస్తే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్తితి భిన్నంగా ఉండి, కరోనా మరింతగా విజృంభించే చేతులు దాటిపోయే  ప్రమాదం ఉంది.  ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచి కరోనా కట్టడికి యుద్ద ప్రాతిపదిక పై చర్యలు చేపట్టాలి. పరిస్తితి నియంత్రణలోకి రాగానే లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేయాలి.

యండమూరి చెప్పిన ఉగాండా కథ!

ఇది ప్రముఖ రచయితా యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన ఉగాండా కథ. “భవిష్యత్తులో అసెంబ్లీలు, ఆఫీసులూ, సినిమా హల్సూ ఉండవు. పెట్రోల్ రేషన్ అవటంతో సూపర్ మర్కెట్‌లూ, మాల్సూ పోయి ఆన్‌-లైన్ అమ్మకాలే ఉంటాయి” అని పాతిక సంవత్సరాల క్రితం వ్రాసినప్పుడు అవన్నీ అభూత కల్పనలని కొంతమంది కొట్టివేశారు. నా నవల పేరేదో నాకు గుర్తులేదు గానీ రెండు రోజుల క్రితం... ఉగాండా దేశపు ప్రెసిడెంట్ ఇచ్చిన ఉపన్యాసం ఇది. పండగ పేరు చెప్పి వీధుల్లో రికామీగా తిరుగుతున్న తన మనుషులని ఉద్దేశించి దేశాధ్యక్షుడు  ‘ముసెవెనీ’ ఇచ్చిన ఉపన్యాసపు సారాంశానికి స్వేచ్ఛానువాదాన్ని యండమూరి వీరేంద్రనాథ్ ఇలా అందించారు.  "భగవంతుడికి చాలా పనులున్నాయి. ప్రపంచాన్నంతా ఆయనే చూసుకోవాలి. మీలాంటి రెక్-లెస్ ఉగాండా ఇడియట్స్ కోసం స్పెండ్ చేసేటంత టైమ్ ఆయనకి లేదు. మెడకి తాడు వేసి ‘నాతో ఉందూ గానీ రా’ అని తీసుకుపోతాడు. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారా?  బతుకుంటే చాలు అనుకుంటారా?... మీ ఇష్టం. యుద్ధకాలంలో ఎవరూ ఎవరినీ ఇళ్ళల్లో ఉండమని అడగరు. మీరే రోజుల తరబడి ఫ్లాట్స్‌ క్రింద బేస్‌మెంట్లో బిక్కుబిక్కుమంటూ దాక్కుంటారు. పిజ్జాల కోసం, సుగంధ ద్రవ్యాల కోసం రోడ్ల మీద పడరు. రొట్టె దొరికితే చాలనుకుంటారు. అర్ధరాత్రి దూరంగా వినిపించే బాంబుల శబ్దాన్ని వింటూ నిద్రకి దూరమైన మీరు, మరుసటి రోజు సూర్యోదయాన్ని చూసి, ఆ రాత్రి బ్రతికున్నందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటారు తప్ప, నిద్ర లేదని కంప్లయింట్ చెయ్యరు. పిల్లలకి కాలేజీ పోతోందని బాధపడరు. సైన్యంలో చేర్పించటానికి ప్రభుత్వం మీ పిల్బల్ని  బలవంతంగా తీసుకెళ్ళలేదని సంతోషిస్తారు.  కాళ్ళు చేతులు తెగిన జనం అర్ధరాత్రి ఆర్తనాదాల మధ్య... భూకంపానికి కూలిపోయిన మీ భవంతి ముందు... ఎముకలు కొరికే చలిలో పిల్లల్ని వేసుకుని రాత్రంతా కూర్చునే స్థితి రానందుకు సంతోషించండి. చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉదృతంగా వస్తూన్న నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చే పాములు కాళ్ళకి చుట్టుకుంటాయేమోనని భయపడేటంత భయంకరమైన స్థితి కాదిది. రెండు రోజులుగా ఆహారం లేక ఏడ్చే పసిపిల్లలతో ఇంటి పైకప్పు మీద నిలబడిె, హేలికాప్టర్ విసిరే అన్నం పొట్లం మీ ఇంటి మీద పడాలని, ఆకాశం వైపు ఆశగా చూసేటంత దురవస్థ లేదు. అందుకు సంతోషించండి.  ‘మేము దీనికి అతీతులం’ అని తిరుగుతున్న కొందరు నా దేశపు ప్రజలారా..మీరు తప్ప, ప్రపంచం మొత్తం శత్రువుతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో బాంబులు లేవు. సైనికులు లేరు. సరిహద్దులు లేవు. శాంతి ఒప్పందాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. మతం, దేశం, ఆడ. మగ, పసిపిల్లలు, వృద్ధులు తేడా లేదు. శత్రువు గమ్యం ఒకటే. మానవాళిని నాశనంచేసి ప్రపంచాన్ని స్మశానం చేయటం..! దాని పేరే కోవిడ్ - 19.  అయితే మన శత్రువు మనం అనుకునేటంత బలమైనది కాదు. ఒక బలహీనత ఉంది. ఎదుర్కొంటే విజృంభిస్తుంది. దూరంగా ఉంటే కరిగిపోతుంది. చాలా సులభంగా ఓడించవచ్చు. కావలసింది క్రమశిక్షణ.  వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మరో సంవత్సరం వరకూ వ్యాక్సిన్ కనుక్కోబడదు. వ్యాక్సిన్ కనుక్కునేవరకూ ఏ దేశం కూడా పరాయి దేశస్థుడిని తన దేశం రావటానికి ఒప్పుకోదు. ఒకసారి విదేశాలలో ఉన్నవారు మన దేశం వస్తే తిరిగి వెళ్ళటం కూడా కష్టమే. 2021 జూన్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఓడలూ, విమాన యానాలూ సాధ్యం కావు. పక్క సీటు ఖాళీ పెడితే తప్ప విమానయానం కుదరదు. అలా చేస్తే కమర్షియల్‌గా సక్సెస్ అవదు. కాబట్టి దాని గురించి మర్చిపోండి. విదేశాలలో ఉన్న మీ పిల్లలూ, బంధువులూ చాలా కాలంపాటూ మీకు కనపడక పోవచ్చు. లాక్‌-డవున్ తీసేయగానే ఆల్ఫ్స్ మంచు కొండల మీద స్కేటింగ్ గురించి మొన్న నా స్నేహితుడు మాట్లాడాడు. నవ్వొచ్చింది. హొటల్స్, మాల్స్, సినిమాలు వీటన్నిటి గురించి మర్చిపోండి. పుష్కర స్నానాలు, పుణ్య క్షేత్ర దర్శనాలు ఉండవు. భగవంతుడిని ఎక్కడి నుంచి ప్రార్ధించినా ఒకటే అని తెలుసుకోండి. ఒక గొప్ప పరిణామానికి ఈ సమస్యని ఆధారభూతంగా చేసుకుందాం. ఆల్ ది బెస్ట్...”