వైకాపా క్రూర రాజకీయానికి కోడెల బలయ్యారుః చంద్ర‌బాబు

నేడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ 74వ జయంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆయన చేసిన సేవలను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు.  ‘‘ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాద్ గారి సొంతం. ఈ లక్షణాలే రూపాయి డాక్టరుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న కోడెలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయి. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయి. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైసీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారు. మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసారు. వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ. ఈరోజు కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవలను మననం చేసుకుందాం’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, అపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాదరావు సొంతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. కోడెల జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. రూపాయి డాక్టరుగా పేదలకు అందించిన వైద్యసేవలే... కోడెలను ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయన్నారు.  ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయన్నారు. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైకాపా నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారని మండిపడ్డారు. మానసికంగా కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని దుయ్యబట్టారు. వైకాపా క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈరోజు కోడెల శివప్రసాద్‌ జయంతి సందర్భంగా ఆయన ప్రజా సేవలను మననం చేసుకుందామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

భారత్‌లో లాక్‌డౌన్‌ సడలింపులపై డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు!

లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయి. భారత్‌, అమెరికా‌ లాంటి దేశాలు ఆంక్షలు సడలిస్తే తీవ్ర పరిణామాలు వుంటాయి. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు సడలించొద్దని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. పలు దేశాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తోన్న విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆయా దేశాలకు పలు హెచ్చరికలు చేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం, లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. భారత్‌తో పాటు అమెరికా‌ లాంటి దేశాలు ఒకవేళ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని చెప్పారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించవద్దని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్‌ను‌ కట్టడి చేయడానికి ప్రస్తుతం పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని తెలిపారు. ఇటువంటి సమయంలో వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో నిబంధనలు ఎత్తివేయడం వల్ల మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. ఆయా దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే విషయంపై బాగా ఆలోచించుకోవాలని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో అధికంగా ఉన్నాయన్నారు.

హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం!ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి

హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియమకం!ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి  నేడు ప్రమాణ స్వీకారం.  21కి చేరనున్న జడ్జీల సంఖ్య  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న బొప్పూడి కృష్ణమోహన్‌, కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి వారితో శనివారం ప్రమాణం చేయించనున్నారు. వాస్తవానికి ఈ ముగ్గురితో సహా మొత్తం ఆరుగురి పేర్లను న్యాయమూర్తుల పదవికి సిఫారసు చేస్తూ హైకోర్టు కొలీజియం గత ఏడాది సుప్రీంకోర్టుకు జాబితా పంపింది. అయితే సుప్రీంకోర్టు కొలీజియం బి.కృష్ణమోహన్‌, కె.సురేశ్‌రెడ్డి, కె.లలితకుమారిలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వారి పేర్లను గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ జాబితాను పరిశీలించిన కేంద్రం.. రాష్ట్రపతికి సిఫారసు చేయగా, ఆయన ఆమోదముద్ర వేశారని కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి రాజేందర్‌ కశ్యప్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ముగ్గురి చేరికతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరినట్లయింది.

గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం వైయస్.జగన్

విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీచేస్తూ గుండెపోటుతో మరణించిన గబ్బాడ అనూరాధ (26) కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రకటించారు. దినపత్రికల్లో ఈ వార్తను చూసిన వెంటనే సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగితెలుసుకున్నారు. విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అనూరాధ కుటుంబానికి ఈ సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్‌ను ఆదేశించారు.

అరాచక కుల ఉన్మాదంపై పోరాడిన పల్నాటి పులి డాక్ట‌ర్ కోడెల‌!

పల్నాడు ప్రాంతంలో ఈ రోజు కనిపిస్తున్న ఒక కుల ఉన్మాదం, నీచత్వం, తక్కిన్న కులాల మీద దాష్టీకం చేసి ఆధిపత్యం సాధించి గత కాలపు అరాచకాన్ని వెట్టి ని ఆ చీకటి రోజులని గుర్తు చేస్తూ ఆ చీకటి ని మళ్లీ తీసుకు రావాలని చెలరేగి పోతున్న వున్మాధులని చూస్తే కోడెల ఎంత పోరాటం చేశారో, ఆయన పై ఎందుకు ఆ స్థాయి లో దాడి జరిగిందో అర్థం అవుతుంది.  గమనించి చూస్తే 3 రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఒక కుల ఉన్మాదం ఈ పల్నాడు ప్రాంతం లో ఒక పెత్తందారీ కులం లో కనబడుతుంది. ఎంతలా అంటే 30 యేళ్లు రాష్ట్రాన్ని ఏలిన రాయలసీమ, తెలంగాణ ప్రాంత సాటి కులస్తులని కూడా 8 యేళ్లు మాత్రం ఈ ప్రాంత కులస్తులు డైరెక్షన్ చేసి నడిపించే అంత. వీళ్ళ మసి వాళ్ళకి పూసే తెలివి తేటలు పుష్కలం వీరిలో.   40 యేళ్లు ఒక బక్క పల్చటి ఐదున్నర అడుగుల డాక్టర్ సింహ స్వప్నం లా నిల్చున్నాడు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి టీడీపీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.   తిరుగులేని సర్జన్ గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలపై అనాడు ఎన్టీఆర్ దృష్టి పడింది. దీంతో ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్‌టిఆర్‌ పిలుపుమేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. డాక్టర్ కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల. 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశాడు. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి డాక్టర్ కోడెల విజయం సాదించారు.      రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేశారు. శాసనసభాపతిగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా, వివిధ మంత్రుత్వ శాఖల పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు. కోడెల రాజకీయంగానే కాక, అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ, సమాజానికి తనదైన సేవలు అందించారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఎదో ఒక సామాజిక సేవ చేసే వారు.

ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశాం: జవహర్‌రెడ్డి

ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఏపీలో కరోనా కేసుల పాజిటివ్‌ రేటు 1.43శాతం ఉందని చెప్పారు. ఏపీలో 1,463 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయని 403 మంది డిశ్చార్జ్‌ చేశామని ప్రకటించారు. ఏపీలో రికవరీ రేటు 27.55శాతం ఉందని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 9 ల్యాబ్‌లలో కరోనా టెస్టులు చేస్తున్నామని, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మరో రెండు ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చామని తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశంలో ట్రయల్ టెస్టులు మొదలయ్యాయని, నెల్లూరులో ల్యాబ్‌ ఏర్పాటు పూర్తయిందని జవహర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, ఒక్కో ల్యాబ్‌లో 250 కరోనా పరీక్షలు చేయొచ్చని జవహర్‌రెడ్డి వివరించారు.

దేశవ్యాప్తంగా మే 17వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌

గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపు విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌ హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు వారంకు ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు గ్రీన్‌, ఆరేంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి ఆరేంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఆరేంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి ఆరేంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి ఆరేంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు

చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసలు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు రాజీవ్‌ కుమార్‌ లేఖ రాశారు. జీఎస్‌ఎఫ్‌టీ తరపున విలువైన సూచనలతో నివేదిక అందించారని లేఖలో చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏప్రిల్ 19న ప్రధాని మోదీకి చంద్రబాబు రాసిన లేఖపై రాజీవ్‌ కుమార్ స్పందించారు. నీతి ఆయోగ్ బృందం మీ రీసెర్చ్ బృందాన్ని త్వరలోనే సంప్రదిస్తుందని చెప్పారు. లాక్‌డౌన్ సమర్థ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబును కొనియాడారు. విశ్లేషణలతో డేటా ఆధారిత విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కరోనా సంక్రమణ, వ్యాప్తిని గుర్తించడం కోసం సాంకేతిక పరిష్కారాలు ఏర్పాటు చేస్తోందని లేఖలో రాజీవ్‌ కుమార్ పేర్కొన్నారు.

రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల, గొల్లపూడిలో ఉమా దీక్ష!

పేద కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. కరోనాను అరికట్టే విషయంలో కొన్ని అంశాల్లో ప్రభుత్వం విపలమవుతోందన్నారు. లక్షలాది మంది అసంఘటిత కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఐసోలేషన్ వార్డుల్లోను, క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి కనీసం ఆహారం అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇసుక, ల్యాండ్ మాఫియాలతో కాలక్షేపం చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పేదలకు తిండి పెట్టే అన్నా క్యాంటీన్‌లను మూసివేశారన్నారు. రైతులకు మార్కెట్ సదుపాయాలు కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులుపాలై.. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. పారిశుద్య కార్మికులకు సకాలంలో జీతాలు విడుదల చేయటం లేదని విమర్శించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తోందని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి  నిరసనగా గొల్లపూడి లో దేవినేని ఉమా 12 గంటలు నిరాహార దీక్ష చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.5వేల పరిహారం ఇవ్వాలని ఉమా డిమాండ్ చేశారు. మే ఒకటో తేదీ కార్మిక పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీకని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి  నిరసనగా గొల్లపూడి తన నివాసంలో మాజీ మంత్రి దేవినేని ఉమా 12 గంటల నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో జీవనభృతి కోల్పోయి ఉపాధి లేక  వలస కూలీలు, కార్మికులు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాల మధ్య నడుస్తున్నారని, రాష్ట్రంలో సుమారుగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వాలు వద్ద  భవన నిర్మాణ కార్మికుల నిధి క్రింద సెస్ రూపంలో నిధులును వాటిని వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి  నిరసనగా ఆయన దీక్షకు దిగారు. శుక్రవారం ఉదయం గొల్లపూడి తన నివాసంలో దేవినేని ఉమ ఒకరోజు దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ★ ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలని  ★ మూసేసిన 'అన్నా క్యాంటీన్ల' ను వెంటనే తెరవాలని ★ చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ★ దాన్యం మామిడి పత్తి మిర్చి  మల్లె టమాటా పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి - వ్యవసాయ ఉద్యానవన  సెరికల్చర్ ఆక్వా పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని ★ కరోనా పై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది పోలీసులు  ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందించాలని ★ ప్రజా రాజధానిగా అమరావతి కొనసాగించాలని....  పేదలను, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే ఆరు ప్రధాన డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోండి: బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర కార్మికులందరికి మే డే శుభాకాంక్షలు తెలిపారు.  అనునిత్యం అన్ని రంగాల్లో తమ శ్రమను దారపోస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కమిషనర్ తీర్మానం ప్రకారం వెంటనే భవన నిర్మాణ కార్మికులందరికి 1500 రూపాయలను అందించాలి. కార్మికుల సహాయ నిధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తి ఆదేశాలు ఇచ్చిన రాష్ట్రం అదుకోకపోవడం దురదృష్టకరం.  మే డే సందర్భంగానైనా సీఎం కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు 1500 విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇచ్చిన 1500 పేరుతో కార్మికులను మోసం చేయడం తగదు. వారికి తక్షణమే అదనంగా కమిషన్ ఆదేశాల మేరకు 1500 అందించాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

లింగంపల్లి నుంచి బయలుదేరిన రైలు

1200 మందిని హాతియాకు తరలించిన అధికారులు. సామాజిక దూరం పాటించేలా బోగీలో 54 మందికి అనుమతి. రైళ్లను నడిపించాలని పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతి మార్చిలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత తొలి ప్రయాణికుల రైలు, ఈ ఉదయం హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి జార్ఖండ్ లోని హాతియాకు బయలుదేరింది. దాదాపు 1,200 మంది వలస కార్మికులు, తెలంగాణలో చిక్కుకుపోయిన జార్ఖండ్ కూలీలు ఈ రైలులో వెళ్లారు. 24 బోగీలను ఏర్పాటు చేసిన అధికారులు, ఒక్కో బోగీలో 72 బెర్త్ లు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరి మధ్యా సామాజిక దూరం ఉండేలా చూస్తూ, 54 మంది చొప్పున మాత్రమే అనుమతించారు. కాగా, వలస కార్మికులను రోడ్డు ద్వారా మాత్రమే అనుమతించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకించి, రైళ్ల ద్వారా పంపేందుకు సహకరించాలని కోరిన వేళ, కేంద్రం నిబంధనలను సడలించగా, ఆ వెంటనే దక్షిణ మధ్య రైల్వే ఈ రైలును ఏర్పాటు చేసింది. మరోవైపు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సైతం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరిందని ట్వీట్ చేశారు. కేంద్రం తమ డిమాండ్ కు సానుకూలంగా స్పందించిందని అన్నారు. జార్ఖండ్ వచ్చిన వారిని స్వస్థలాలకు తరలిస్తామని, అంతకన్నా ముందే ఆరోగ్య పరీక్షలు జరిపుతామని, వారంతా క్వారంటైన్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక, జార్ఖండ్ కూలీలు దాదాపు 500 మంది హైదరాబాద్ ఐఐటీలో తలదాచుకుని ఉండగా, వారిని 57 బస్సుల్లో శుక్రవారం తెల్లవారుజామున లింగంపల్లి స్టేషన్ కు అధికారులు తరలించారు. ఆపై వారిని రైలులోకి అనుమతించారు. ఇదిలావుండగా, పంజాబ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలు కూడా తమ రాష్ట్రాలకు చెంది, ఇతర ప్రాంతాల్లో చిక్కుబడిన వారిని రప్పించేందుకు రైళ్లు నడపాలని కోరాయి.

వచ్చే రోజుల్లో అయినా కార్మికులకు మంచి జరగాలి : లోకేష్ ట్వీట్

అమరావతి : మే డే సందర్భంగా కార్మికులకు, శ్రామికులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘తమ కష్టంతో జాతిసంపదను పెంచే కార్మికులు, శ్రామికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రపంచంలో ఏ సమాజమూ ముందుకు పోలేదు. అందుకే మే డే అన్నది విశ్వవ్యాప్త వేడుక అయ్యింది. గతంలో నేను మంత్రిగా నా మొదటి సంతకాన్ని ఉపాధి హామీ చట్టం కింద 30లక్షల శ్రామిక కుటుంబాలకు లబ్దిచేకూర్చే ఫైలుపైనే చేశాను. భవన నిర్మాణ సంక్షేమ మండలిలో ఉపాధి హామీ కార్మికులకు చోటు కల్పించాను. గడచిన ఏడాది రాష్ట్రంలో కార్మికులకు ఏమాత్రం మంచి జరగలేదు. ఇసుక కొరత, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పరిశ్రమలు మూతపడటం, ఆ తర్వాత లాక్‌డౌన్‌తో కార్మికులు చాలా నష్టపోయారు. అష్టకష్టాలు పడ్డారు. వచ్చే రోజుల్లో అయినా కార్మికులకు, శ్రామికులకు మంచి జరగాలని కోరుకుంటూ, వారందరికి మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

కర్ణాటకలో వ్యాపార సంస్థలకు అనుమతి

మే 4వ తేదీ నుంచి వ్యాపార సంస్థలు, మద్యం దుకాణాలు ప్రారంభిస్తున్న‌ట్లు క‌ర్నాట‌క ప్రభుత్వం ప్రక‌టించింది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా వాటిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలకు అనుమతి ల‌భించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ప్రారంభమైన కార్యకలాపాలు మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ గడువు ముగియనుండడంతో కర్ణాటక సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాతి రోజు నుంచే షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సంస్థలను తెరవాలని నిర్ణయించింది. అయితే, కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలతోపాటు 15 ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించడం కోసం, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా, కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో పరిశ్రమలు సహా వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. అలాగే, 15వ తేదీ వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపరాదని కూడా నిర్ణయించినట్టు చెప్పారు. రెడ్ జోన్లయిన బెంగళూరు అర్బన్ తోపాటు 24 కంటైన్‌మెంట్లలో మాత్రం వ్యాపార సంస్థలకు, మాల్స్, సినిమా హాళ్లకు అనుమతి ఉండదని సీఎం స్పష్టం చేశారు.

కార్మికులకు, శ్రామికులకు మేడే శుభాకాంక్షలుః చంద్రబాబు ట్వీట్

కార్మికులకు, శ్రామికులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేడే శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘కార్మికులు సంక్షేమంతో వర్ధిల్లినప్పుడే  సమాజ ప్రగతి సాధ్యం. టీడీపీ హయాంలో కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో చేశాం. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాం.హోం గార్డుల నుంచి కాంట్రాక్ట్‌ కార్మికుల వరకు అందరికీవేతనాలు పెంచాం. రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం కార్మిక సంక్షేమంలో ఓ విప్లవం. అలాంటిది ఈ ఏడాదంతా కార్మికులకు కష్టాలు, కన్నీళ్లనే మిగిల్చింది. వైసీపీ నేతల స్వార్థం కారణంగా ఇసుక కొరతతో 60 మంది కార్మికుల ఆత్మహత్యలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రమాద బీమా పథకం ఆగిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా కార్మికుల కుటుంబాలు మరింత చితికిపోయాయి. ఇక నుంచైనా ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవాలి. వచ్చే మేడే నాటికి కార్మిక కుటుంబాలన్నీ ఆర్థికంగా పుంజుకోవాలని ఆశిస్తున్నా. టీడీపీ మీకెప్పుడూ అండగా ఉంటుంది. కార్మికులు, శ్రామికులకు మేడే శుభాకాంక్షలు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

అనంతకు వైద్య విద్యార్థుల మృతదేహాలు

ఫిలిప్పిన్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వంశీకృష్ణ, రేవంత్‌కుమార్‌ మృతదేహాలు అనంతపురం జిల్లాకు చేరాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఇద్దరు వైద్య విద్యార్థుల మృతదేహాలు ఇండియాకు తీసుకొచ్చారు. ఏప్రిల్‌ 6న ఫిలిప్పిన్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వంశీకృష్ణ, రేవంత్‌కుమార్‌ మృతిచెందారు. ఎంబోజింగ్‌ సిస్టం ద్వారా మృతదేహాలు కుళ్లిపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఫిలిప్పిన్స్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.70 లక్షల రూపాయలు వెచ్చించి వైద్య విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి రప్పించారు.  తమ పిల్లల మృతదేహాలు అప్పగించేందుకు కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు, కేంద్రప్రభుత్వ పెద్దలకు మృతుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కదిరిలో రేవంత్‌ కుమార్‌, యాడికి మండలం నిట్టూరులో వంశీకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు విద్యార్థుల మృతదేహాలకు నివాళులు అర్పించారు. అసలేం జరిగిందంటే? : కదిరి పట్టణంలోని మెయిన్‌ రోడ్‌లో ఉంటున్న ఎల్‌ఎల్‌వీ క్లాత్‌ సెంటర్‌ నిర్వాహకుడు కటికెల మల్లికార్జున రెండో కుమారుడు రేవంత్‌కుమార్‌(21), అనంతపురానికి చెందిన దండోరా నాయకుడు కేపీ నారాయణ స్వామి కుమారుడు వంశీకృష్ణ(18) ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న ఎంహెచ్‌ఏఎం కళాశాలలో ఒకరు ఎంబీబీఎస్‌ నాల్గవ సంవత్సరం కాగా, మరొకరు మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిరువురూ అక్కడ ఒకే రూంలో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంతో నిత్యావసరాల కోసం బయలు దేరారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌తో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేయగా వారి మృతదేహాలు భారత్‌కు రావడం కష్టంగా మారింది. విద్యార్థుల మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన  ఖర్చుకు వెనకాడవద్దని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  విదేశాంగశాఖ మంత్రికి సీఎం లేఖ రాసి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు.

కరోనాతో సహజీవనం తప్పదు: ఏపీ మంత్రి బుగ్గన

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పింది ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని మోదీ కూడా అన్నారు దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయి ఇప్పటివరకు 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం కరోనాతో సహజీవనం తప్పదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పిందని, మరోవైపు ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారని ఆయన చెప్పారు. కరోనాపై సీఎం చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని వ్యాఖ్యానించారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని జగన్ ఆలోచిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయని చెప్పారు. ఏపీలో కరోనా పరీక్షల కోసం ఇప్పటివరకు 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేగాక, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఏపీలో అధికంగా పరీక్షలు చేయడం వల్లే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 1,02,460 మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఏపీలో 10 లక్షల‌ జనాభాకు 1919 చొప్పున పరీక్షలు చేసినట్లు చెప్పారు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు టీడీపీ నేతలెవరూ సాయం చేయలేదని విమర్శించారు. మరోవైపు, తమ ప్రభుత్వం గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యధాప్రకారమే నిత్యకైంకర్యాలు ఏకాంత సేవ!

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి నందు అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నియూ ఏకాంత సేవలుగా యధాప్రకారము ఆలయ అర్చకులు నిర్వహించడము జరుగుచున్నదని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు తెలిపారు.   దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానము నందు జరుగు  నిత్య ఆర్జిత సేవలయందు భక్తులు ప్రత్యక్షముగా పాల్గొను అవకాశము లేనందు వలన అన్ని సేవలు ఆలయ అర్చకులుచే  ఏకాంత  సేవలుగా  నిర్వహించబడుచున్నవి. భక్తుల సౌకర్యార్థము  దేవస్థానము నందు జరుగు రుద్ర హోమము నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షముగా భక్తుల గోత్ర నామముల తో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినది. కావున ఈ పరోక్ష  చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షముగా  జరిపించుకోనదలచిన  భక్తులు టిక్కెట్లు  online నందు www.kanakadurgamma.org – website ద్వారా పొందవచ్చునని  ఆలయ కార్యనిర్వహణాధికారి వారు తెలిపారు.  దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యములో విజయవాడ నగరంలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న రోడ్లపై నివసిస్తున్న యాచకులు, పేద వారు మరియు ఇతరులకు ఆహారం అందించాలన్న ఉద్దేశముతో గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు,    గౌరవ ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు   గారు మరియు  శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారి ఆదేశాలానుసారం దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్ విభాగము ద్వారా ప్రతి రోజు కదంబం మరియు దద్దోజనం(పెరుగన్నం) ప్యాకెట్లు సురక్షిత వాతావరణంలో తయారు చేసిన అనంతరం ప్యాకింగ్ చేయబడి VMC వారి ద్వారా పంపిణీ చేయుట  జరుగుచున్నదని  తెలిపారు.   దేవస్థానం వారు జరుపు అన్నదాన కార్యక్రమమునకు విరాళాలు ఇవ్వదలచిన భక్తులు దేవస్థానం వారి వెబ్సైటు www.kanakadurgamma.org ద్వారా,  లేదా eosdmsd@sbi అను BHIM UPI ద్వారా QR code ను స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా విరాళములు పంపవచ్చని కార్యనిర్వహణ అధికారి వారు తెలిపారు.

ఏపీ తెలంగాణలో రెడ్‌ జోన్లు ఇవే..!

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం, జోన్లు, చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌ లేఖ రాశారు. గతంలో నమోదైన కేసులు, వైరస్‌ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో మార్పులు చేసినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చసినట్లు ప్రీతి సూడాన్‌ వెల్లడించారు. కొత్త జాబితా ప్రకారం రెడ్‌ జోన్లలో 130 జిల్లాలు, అరెంజ్‌ జోన్‌లో 284, గ్రీన్‌ జోన్‌లో 319 జిల్లాలు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 19 జిల్లాలు, మహారాష్ట్ర లో 14, తమిళనాడు లో 12, ఢిల్లీ 11, పశ్చిమ బెంగాల్ 10 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో జోన్ల వివరాలు.. ఆంధ్రప్రదేశ్ లో ఐదు జిల్లాలు రెడ్ జోన్ లో, 7 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో, 1 జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.  రెడ్‌జోన్‌ జిల్లాలు : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు : తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ గ్రీన్‌ జోన్‌ జిల్లా: విజయనగరం. తెలంగాణలో.. ఆరు జిల్లాలు రెడ్ జోన్ లో, 18 ఆరెంజ్ జోన్ లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. రెడ్ జోన్ జిల్లాలు: హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్  ఆరెంజ్ జోన్ జిల్లాలు: నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల. గ్రీన్ జోన్ జిల్లాలు: పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి.