జన్‌ధన్‌ ఖాతాల్లో రెండో విడత నగదు జమ

ఈ నెల 4 నుంచి ఉపసంహరణకు అవకాశం న్యూదిల్లీ: రెండో విడతగా మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో మే నెలకు సంబంధించి రూ.500 చొప్పున ఆర్థిక సాయం జమ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 4వ తేదీ నుంచి నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ‘అకౌంట్‌ నంబర్ల చివరి అంకె ఆధారంగా ఖాతాదారులకు నిర్ణీత రోజు నగదు తీసుకునేందుకు అవకాశం ఇస్తాం. తద్వారా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గి.. భౌతిక దూరం పాటించేందుకు వీలు కలుగుతుంది. 11వ తేదీ అనంతరం ఏ రోజైనా తీసుకోవచ్చు’అని ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్‌ పాండా శనివారం తెలిపారు. వీలైనంత వరకు ఏటీఎం కార్డులు, బ్యాంకు మిత్ర సేవలను వినియోగించుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో ఏప్రిల్‌ నుంచి మూడు నెలలపాటు రూ.500 చొప్పున జమ చేస్తామని కేంద్రం ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో 20.05 కోట్ల ఖాతాల్లో రూ.10,025 కోట్లు జమ చేసింది.

వైద్యులకు వందనం.. ఆస్పత్రులపై పూలవర్షం

కరోనా యుద్ధవీరులకు అరుదైన గౌరవం లభించింది. కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి యావత్‌ దేశం జయహో అంటూ సలాం కొడుతోంది.  నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ  వైద్యులే భేష్‌ అంటూ కితాబిస్తున్నాయి.  కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా  త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి. విశాఖ నగరంలోని ఛాతి, అంటువ్యాధుల ఆసుపత్రి, గీతం ఆసుపత్రులపై వాయుసేన సిబ్బంది హెలీకాప్టర్‌తో ఆదివారం ఉదయం పూలజల్లు కురిపించారు. రక్షణ దళాల అధికారులు ఈ సందర్భంగా వైద్యులను సంత్కరించారు. దిల్లీలోని పోలీస్‌ యుద్ధస్మారకం వద్ద వైమానిక హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. పోలీసుల గౌరవార్థం వైమానిక అధికారులు యుద్ధ స్మారకానికి దండలు వేశారు. విశాఖ, ముంబయి, చెన్నై, కొచ్చిలోని నౌకలకు ఈరోజు రాత్రి 7.30గంటల నుంచి 11.59 వరకు దీపాలంకరణ చేయనున్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిపై.. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి అన్నీ తామై వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలకు కృతజ్ఞతగా గాంధీ ఆసుపత్రిపై భారత వాయుసేన ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం వద్ద హకీంపేట నుంచి వచ్చిన హెలికాప్టర్‌ గులాబీ పూల వర్షం కురిపించింది. వైద్య సిబ్బంది అంకితభావానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. గాంధీ ఆసుపత్రి వద్ద పలువురు నేతలు వైద్యులకు సంఘీభావం తెలుపుతూ జాతీయజెండాలను ప్రదర్శించారు.

తేడా రెడ్డి దొంగ ఏడుపులు.. బుద్దా ట్వీట్

విజయవాడ: టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ బుద్దా చేసిన ట్వీట్ నెట్టింట టీడీపీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. ‘‘తేడా రెడ్డికి ఆప్షన్ అంటే ఏంటో తెలియదు పాపం. విద్యార్థులకు, తల్లితండ్రులకు ఆప్షన్ ఇవ్వండని అడిగితే ఇంగ్లీష్ వద్దంటారా అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుని చంపేస్తారా అంటూ బ్లూ మీడియా హడావిడి చేసింది. వైకాపా నాయకులు తెలుగు పరిరక్షణ కోసం పుట్టిన వీరుల్లా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు అవేవీ ఎరగనట్టు, ఈ రోజే జైలు నుంచి విడుదలైనట్టు, ఇంగ్లీష్ మీడియం కనిపెట్టినట్టు గన్నేరుపప్పు, తేడా రెడ్డి కట్టింగ్ ఇస్తున్నారు’’ అంటూ బుద్దా ట్వీట్ చేశారు.

రోజుకి 100 టెస్టులు చేస్తే ఎలా రాజేంద్రా?

రోజుకీ 100 టెస్టులు చేస్తే అమెరికా,రష్యా కూడా కరోనా ఫ్రీ అవుద్ది రాజేంద్ర. సెకండరీ కాంటాక్ట్ కేసులకి ...ఢిల్లీ వెళ్ళని వాళ్ళకి...విదేశాల నుండి రాని వాళ్ళకి తెలంగాణలో కరోనా టెస్టులు చేయరంట.(ఇది తెలంగాణ ప్రభుత్వం ఆఫీసియల్ గా ప్రకటించింది) గుంటూరు సిటీలో 140 కేసుల్లో 110 కేసులు సెకండరీ కాంటాక్ట్ కేసులే...కానీ తెలంగాణా రాష్ట్రంలో సెకండరీ కాంటాక్ట్స్ కి కరోనా పరీక్షలు చేయరు( వాళ్ళకి కరోనా లక్షణాలు ఉన్నా చేయట్లేదు ). తెలంగాణ రాష్ట్రంలో కరోనా లక్షణాలు లేని వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోరు అంట (ఈ లెక్కన మన దేశంలో 100 లో 80 మందికి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.) ఓక పక్కన సరిగ్గా టెస్టులు చేయకుండా...కరోనా వచ్చినా వ్యాధి తీవ్రత లేదని హాస్పిటల్ లో చేర్చుకోకుండా అబద్దాలు చెప్పుకుంటూ సక్సెస్ఫుల్ గా మీడియాని మ్యానేజీ చేస్తున్నారు ...మీ రాష్ట్రం మీ ఇష్టం ఏమైనా చేసుకోండి కాదనం. ఇంత‌కీ 7 రోజులుగా కేంద్ర బృందాలు తెలంగాణ లో ఎందుకు పర్యటిస్తున్నాయో చెప్తావా?? తెలంగాణలో చివరిగా మరణించిన 3 మరణాల్లో ...ఒకరు హాస్పిటల్ లో చేరిన 6 గంటల్లో... మరొకరు 12 గంటల్లో ...మూడో వాళ్ళు 24 గంటల్లో ఎందుకు చనిపోయారో చెప్తావా ?? ముందే వాళ్ళని గుర్తించి హాస్పిటల్ లో చేర్పిస్తే బ్రతికేవాళ్ళు కదా !! ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజుల్లో ఒక్క కరోనా మరణం కూడా లేదు. ఈ విష‌యమే ప్ర‌శ్నిస్తే మీ ముఖ్య‌మంత్రి ఏమో ప్ర‌శ్నించిన‌వాడికే క‌రోనా రావాలంటూ శాప‌నార్ధాలు పెడ‌తారు!

కరోనా కట్టడి కంటే దోపిడీ గురించే సీఎం ఆలోచనంతా: బుచ్చయ్య చౌదరి

ముఖ్యమంత్రి కరోనా కట్టడి కంటే దోపిడీ ఎలా చేయవచ్చుననే ఆలోచన ఎక్కువగా చేస్తున్నారన్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పేదల ఇళ్ల కోసం సేకరించే భూముల కొనుగోళ్లలో కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కుంభకోణం జరుగుతోందని గోరంట్ల విమర్శించారు. కాకినాడలో మడ అడవులు, కోరుకొండలో బురద కాలువలకు సంబంధించి ముంపునకు గురయ్యే భూములను సేకరిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని విమర్శించారు. ట్రిబ్యునల్‌కు వ్యతిరేకంగా మడ అడవులు, భూములను నరికివేశారన్నారు. భూ సేకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని, పంపకాలు తెగక రోడ్డు ఎక్కుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రజోపయోగకరమైన భూముల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు.

తిరుమలలో ఒకేసారి వేలు, లక్షల మంది దర్శనాలు ఇక ఉండవు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

*లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాతే తిరిగి దర్శనాలు  * కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంది  * క్యూలైన్లలో పలు మార్పులు *మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు కల్పిస్తాం లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన విషయంపై ఆ దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆయా ప్రభుత్వాల సూచన మేరకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు. అయితే, గతంలోలా వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవని సుబ్బారెడ్డి తెలిపారు. కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు. క్యూలైన్లలో పలు మార్పులు ఉంటాయని చెప్పారు. ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతి దూరాన్ని పాటించేలా చూస్తామని వివరించారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

సంఘటిత ఆచరణతో కరోనాపై పోరు సాగిద్దాం!

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. మూడో విడత లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మే 4 నుంచి మరో 2 వారాల పాటు 3వ విడత లాక్ డౌన్ (3.O) ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించడం కోవిడ్ -19తో సాగుతున్న సమిష్టిపోరాటంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాను. నా దృష్టిలో ఈ నిర్ణయం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత ఏజెన్సీలు, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలతో సహా వ్యాపారుల సహకారంతో వైరస్ వ్యతిరేక పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. ప్రజల జీవితాల పై దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి యుద్ధ వ్యూహాన్ని రూపొందించి చాలా వరకూ విజయం సాధించింది. ఈ ప్రయత్నం అందించిన సానుకూల ఫలితాలను సమాజం హర్షిస్తోంది. లాక్ డౌన్ 3.O విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు భరోసాను అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు మరియు జీననోపాధిని ఏక కాలంలో సమతుల్యం చేయవలసిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం మొదలు కానుంది. గ్రీన్ జోన్స్ లో చాలా భాగం, ఆరెంజ్ జోన్స్ లో కొంత భాగం ఆవసరమైన ఆర్థిక పునరుజ్జీవనానికి పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత మార్గంలో అడుగు ముందుకు వేయాలి. ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమౌతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ఇలాంటి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. మొదటి, రెండవ లాక్ డౌన్ సమయాల్లో తీసుకువచ్చిన గొప్ప మార్పులు, రాబోయే కాలంలో వైరస్ పూర్తిగా అంతమొందే వరకూ అన్ని చోట్ల కొనసాగుతూనే ఉండాలి. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, సమావేశాలు నిర్వహించకపోవడం లాంటి వాటి ద్వారా ఇప్పటి వరకూ ఎంతో లబ్ధి పొందాం. ఇక మీదట కూడా ఇదే మార్గంలో పయనించాలి. ఎందు కంటే కనిపించని ఈ శత్రువు మనం ఆలసత్వం వహిస్తే మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉంది. సమర్థవంతమైన నిర్ణయాల ద్వారా కోవిడ్ -19 వ్యతిరేకపోరాటంలో భారతదేశంలో ముందంజలో ఉంది. దీన్ని నేను కోవిడ్ – కామనాలిటి ఆఫ్ విజన్, ఇంటెంట్ అండ్ డిటర్మినేషన్ (‘COVID’ – Commonality of Vision, Intent and Determination) గా భావిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో విభిన్న భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో నివసిస్తున్న 130 కోట్ల మంది భారతీయులు అనుసరించిన ఇలాంటి సాధన ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు వంటి ముందు వరుస యోధులతో పాటు రైతులు, ప్రజలు కూడా ప్రశంసలకు అర్హులే. కానీ ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు, సాధించాల్సిన విజయం చాలా ఉంది. కోవిడ్ వైరస్ అన్ని వర్గాలతో కలిసి ఎక్కువ కాలం జీవించగలదని అంచనా వేసిన నేపథ్యంలో, మనం ఈ మహమ్మారి నిజాన్ని అంగీకరిస్తూనే దూరం చేసే ప్రయత్నాలు కొనసాగించాలి. లాక్ డౌన్ 3.Oలో మనమంతా ప్రవర్తించే విధానం మీద ఆధారపడే కరోనా తర్వాత సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఉద్దేశించిన తదుపరి చర్యలు ఉంటాయి. రెండు వారాల పరిమితి, భవిష్యత్ కార్యాచరణ కాలపరిమితిని నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక పరీక్ష. ఒక దేశంగా, మనమంతా ఇందులో కచ్చితంగా ఉత్తీర్ణులం కావడం అత్యం కీలకం. ఇందులో మనం ఏ విధంగానూ విఫలం కామని నా గట్టి నమ్మకం. ఇంతకు ముందు నేను చెప్పినట్లు తదుపరి పొడిగింపు, సడలింపు, ముగింపు నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. ఈ దిశలో పౌరులందరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానంటూ త‌న ప్ర‌సంగం ముగించారు.

హైకోర్టులో నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు

*ప్రమాణస్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి *నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు హైకోర్టులోని ఒకటవ నెంబర్ హాల్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) జితేంద్ర కుమార్ మహేశ్వరి నూతనంగా నియమితులైన న్యాయమూర్తులచే శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత హైకోర్టు ఇన్ చార్జ్ రిజిస్ట్రార్‌ జనరల్‌ బి. రాజశేఖర్ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. నూతన న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత దస్త్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్లు, జడ్జిలు, ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా: చంద్రబాబు ట్వీట్

మీడియాపై వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. సొంతమీడియాలో ఎవరి మీదైనా, ఎంత అసత్య ప్రచారమైనా చేస్తుంటారని, వైసీపీ నేతల అక్రమాలను కట్టుకథలల్లి కప్పిపుచ్చుకుంటారని విమర్శించారు. కానీ ప్రజలకు ఏ మీడియా వాళ్ళైనా నిజాన్ని చెబితే వైసీపీ వాళ్ళు కుతకుతలాడిపోతుంటారన్నారు. ఆ మీడియా ప్రతినిధులపై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తారని విమర్శించారు. మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం, వారి బంధువులు, మీడియాతో ఏమాత్రం సంబంధం లేని వెంకట కృష్ణ, విద్యార్ధి సవితా వరేణ్య, వారి డ్రైవర్ శ్రీనివాసరావులను పోలీసులతో కిడ్నాప్ చేయించడమేంటని ప్రశ్నించారు. ‘‘ఏమిటీ అరాచకం? దీన్ని తెలుగుదేశం ఖండిస్తోంది. ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించాలి. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటానికి సిద్ధం అవుతుంది. అవసరమైతే మానవహక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయిస్తాం. ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు’’ అని ఘాటుగా ట్వీట్ చేశారు.

ఏపీలో వలసకూలీల అనుమతికి మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు 1902కి ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రీన్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. రిలీఫ్‌ క్యాంప్‌లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలని అనుకునే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కొవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే వారిని బస్సులో 50 శాతం మించకుండా తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్‌, అనంతరం మరో 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొంది. ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే ఆ గ్రూప్‌ మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చిన వారికి స్క్రీనింగ్‌ సహా పూల్‌ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో రెడ్‌జోన్‌, కంటైన్‌మెట్‌ జోన్‌ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటైన్‌కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

లాక్ డౌన్ సమయంలో జరిమానాలా? హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ!

ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన అంశంపై కోర్టు మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారులకు దాదాపు రూ. 2,500 కోట్ల అపరాధ రుసుము విధిస్తూ గనులు, భూగర్భశాఖ గతంలో ఇచ్చిన నోటీసులను హైకోర్టు ఇంతకు ముందే కొట్టేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో, క్వారీ యజమానులు బెంబేలెత్తిపోయారు. ఓ క్వారీ యజమాని మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు... ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గతంలోనే ఒక తీర్పును వెలువరించామని... ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా గ్రానైట్ పరిశ్రమ మూతపడిన తరుణంలో జరిమానాలు విధించడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడే ప్రభుత్వ నోటీసులకు క్వారీల నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత, గ్రానైట్ పరిశ్రమ గాడిలో పడిన తర్వాత ఆలోచిద్దామని చెప్పింది.

లక్ష బెడ్లు సిద్ధం చేయండి: సీఎం జ‌గ‌న్

ఏపీలో మొత్తం కోవిడ్‌–19 పరీక్షలు 1,08,403 నిన్న 5,943 పరీక్షలు ప్రతి పదిలక్షలకు 2030 మందికి పరీక్షలు పాజిటివిటీ కేసుల రేటు 1.41శాతం.. దేశవ్యాప్తంగా 3.82శాతం రాష్ట్రంలో మరణాల శాతం 2.16శాతం, దేశవ్యాప్తంగా 3.28శాతం కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్‌–19 పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించి వారిక్కావాల్సిన భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కనీసం ఒక లక్ష బెడ్లు సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ ఈ మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్‌ –19 క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలని సూచించారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం చెప్పారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు,పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేస్తున్నారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాలకోసం ఒక వ్యక్తికే పాసు ఇస్తున్నారు. సీఎం ఆదేశాల మేర‌కు డాక్టరు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, మందులు కూడా మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉంటారు. కేంద్రహోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండాలి అన్నదాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలను సీఎం ఆదేశం మేర‌కు అధికారులు తయారుచేస్తున్నారు.

ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ పొడిగించాం: కిషన్‌ రెడ్డి

రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ ను పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్నాం. అయితే ప్రజలు ఎవ్వరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో రైల్వే టిక్కెట్లు అమ్మబోరని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎవ్వరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దని ఆయన సూచించారు. విద్యార్థులు, యాత్రికులు, కూలీలు వంటి వారికి ప్రత్యేకంగా అధికారులు ప్రయాణం చేసే అవకాశాలు కల్పిస్తున్నారని కిషన్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సంబంధిత కూలీలు పనిచేస్తోన్న సంస్థలు రైల్వే టిక్కెట్లు ముందుగానే కొనాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలోని 80 జిల్లాల్లో గత వారం రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కిషన్‌ రెడ్డి తెలిపారు. అలాగే, 26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదని అన్నారు. 40 జిల్లాల్లో గత 21 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలు, ఆయా ప్రాంతాల్లోని కరోనా కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించినట్లు చెప్పారు. పలు రాష్ట్రాలతో చర్చించి, ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ ను పొడిగించామని చెప్పారు. రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం కరోనాపై పోరాడుతుందని తెలిపారు. కట్టడి ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలని చెప్పారు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు తయారు చేశామని చెప్పారు.

కరోనాతో జీవించాల్సిన కాలం! భ‌యంతో దాక్కుంటారా? ఎమ్మెల్సీ ఇక్బాల్

సామాజిక దూరం అంటే సమాజానికి దూరం కావడం కాదు అని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాల‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత,ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు క్లౌడ్ ..జూమ్.. అంటూ మేఘాలలో జీవించడం కాదు.. భూమి మీదకు రండిని ఆయ‌న అన్నారు. కరోనా కట్టడిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని , ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించాల్సింది పోయి ... ప్రజల్లో లేనిపోని అపోహలు ,భయాలు ,ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం మీకు తగునా ? ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారూ అంటూ త‌న‌దైన స్టైల్ ఇక్బాల్ చుర‌క‌లంటించారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు నాయుడు కనీసం సామాజిక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. కరోనాతో జీవించాల్సిన కాలం ఇది అని ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడితే మీకేందుకు తప్పుగా కనిపిస్తుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. కరోనా విపత్కర సమయంలో కోవిడ్ వారియర్స్ గా పనిచేస్తోన్న వాలంటీర్లను ఇదే చంద్రబాబు నాయుడు హేలన చేస్తూ మాట్లాడ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.  మనం ఎప్పుడైతే సోషల్ రెస్పాన్స్ బులిటీ మరిచిపోతామో.. అప్పుడే సోషల్ క్రైసిస్ పుట్టుకొస్తాయి. ఇప్పటికైనా రాజకీయాలు మాట్లాడకుండా బాధ్యతగా మాట్లాడండని ప్ర‌తిప‌క్ష నేత‌ను ఎమ్మెల్సీ ఇక్బాల్ సూచించారు.

కోడెలకు టీడీపీ నేతల ఘ‌న‌నివాళి!

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి నేడు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ప్రముఖ నేతలంతా ఆయనను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు.  అచ్చెన్నాయుడు : మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో కీలకశాఖలకు మంత్రిగా చేసినా, విపక్షంలో వున్నా, స్పీకర్ గా పనిచేసినా, ఓడిపోయినా ఏనాడూ ప్ర‌జ‌ల‌కు దూరం కాని ప్ర‌జ‌ల మ‌నిషి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గారి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు స్మ‌రించుకుందాం. అయ్యన్నపాత్రుడు : రాజ‌కీయాలు ఎలా చేశారో, రాజీప‌డ‌కుండా ప్ర‌త్య‌ర్థుల‌పై అలాగే పోరాటం చేశారు డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. ప‌ల్నాడులో అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేసిన డాక్ట‌ర్, స్పీక‌ర్ స్థానానికి వ‌న్నె తెచ్చారు. జ‌యంతి సంద‌ర్భంగా కోడెల శివ‌ప్ర‌సాద‌రావుకు నివాళుల‌ర్పిస్తున్నాను. బీటీ నాయుడు : ఓ గుట్టపై  వుండే  కోటప్పకొండ త్రికోటేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేసిన ఘ‌న‌త డాక్ట‌ర్  కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గారిదే. ఈ రోజు కోట‌ప్ప‌కొండ ప్రాంతం ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైందంటే అది డాక్ట‌ర్ గారి చ‌ల‌వే.  జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న కృషిని మ‌న‌నం చేసుకుందాం. కిడారి శ్రవణ్ : తాగునీటి స‌మ‌స్య ఎదుర్కొంటున్న పల్నాడు ప్రాంత దాహార్తిని తీర్చిన శాశ్వ‌త ప‌థ‌కాలు తెచ్చిన ఘ‌న‌త డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావుగారికే ద‌క్కుతుంది.ప‌ల్నాడు ప్ర‌జ‌ల కోసం,ప్ర‌గ‌తి కోసం పాటుప‌డిన కోడెల శివప్రసాదరావు గారు ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు గద్దె రామ్మోహన్ : వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, మ‌రుగుదొడ్డి వాడ‌కం ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ ఇంటి నుంచి ప్రారంభించాల‌నే నినాదంతో ఒక ఉద్య‌మంలా మ‌రుగుదొడ్ల నిర్మాణం చేప‌ట్టి దేశంలోనే ఎవ‌రికీ సాధ్యంకాని రికార్డు నెల‌కొల్పిన మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు సేవలు చిరస్మరణీయం. బండారు సత్యనారాయణమూర్తి : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు ప‌ట్టుకున్న ప‌సుపుజెండాని మ‌ర‌ణించేవ‌ర‌కూ వీడ‌ని సైనికుడు, నాయ‌కుడు ప‌ల్నాటి పులి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తున్నాను. ఎన్ అమర్‌నాథ్ రెడ్డి : రూపాయి డాక్ట‌ర్ అణ‌గారిన వ‌ర్గాల స్వ‌ర‌మైన లీడ‌ర్ అయ్యారు. మినిస్ట‌ర్ అయినా, స్పీక‌ర్ అయినా ఆ ప‌ద‌వికే వ‌న్నెతెచ్చిన మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు జ‌యంతి సంద‌ర్భంగా  నివాళుల‌ర్పిస్తున్నాను ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ : మ‌ర‌ణంలేని మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గారు. అవ‌య‌వ‌దానంపై ప్ర‌చారం చేయ‌డ‌మే కాకుండా, తానే అంద‌రికంటే ముందుగా వ‌చ్చి అవ‌య‌వ‌దానం చేసిన మ‌న‌సున్న మ‌నిషి . ఆయ‌న ఆశ‌య‌సాధ‌నే మ‌న‌మిచ్చే ఘ‌న‌నివాళి.

ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం! 33 మంది మృతి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  24 గంటల్లో 5,943 శాంపిళ్ల పరీక్ష చేయ‌గా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525 న‌మోదైంది. ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ కాగా 33 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,943 శాంపిళ్లను పరీక్షించగా 62 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, కడపలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

20 రోజుల తర్వాత కనిపించిన కిమ్‌

ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం పూర్తయిన కార్యక్రమంలో కిమ్‌ జోంగ్‌ ఉన్ పాల్గొన్నారు. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ 20రోజుల తర్వాత కనిపించారు. కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్‌ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటూ అతని సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్‌ 15 నుంచి కిమ్‌ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది.

ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు జూన్ 11 వరకు సెలవులు

ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు జూన్ 11 వరకు సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవులు జూన్ 11 వరకు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి పాఠశాలలు ఎప్పుడు తెరవాలనే అంశంపై ప్రభుత్వం తరఫున మరోసారి అధికారికంగా తెలియజేస్తామని తెలిపింది. ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన తర్వాత మరోసారి దీనిపై స్పష్టతనిస్తామని ప్రకటించింది. విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, జూనియర్ కాలేజీలు అన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలిని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ కాంతారావు కీలక ఆదేశాలు జారీ చేశారు.