ఏపీలో బీజేపీ ఆట మొదలైంది.. వైసీపీకి అధికారం దూరం కానుందా?
posted on Jun 17, 2020 @ 1:54PM
'పెరుగుట విరుగుట కొరకే' అనే సామెత ప్రస్తుతం ఏపీ అధికార పార్టీకి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీలో ఒక్క ఏడాదిలోనే అలజడి మొదలైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రూపంలో ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే జగన్ సర్కార్ తీరుని పలుసార్లు తప్పుబట్టిన ఆయన.. తాజాగా ఆయన స్వరాన్ని మరింత పెంచారు. నరసాపురంలో జగన్ బొమ్మ చెల్లకే తనని పార్టీలోకి రమ్మన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా అదే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పై అయితే.. ఓ టీవీ డిబేట్ లో బూతులతోనే విరుచుకుపడ్డారు. ఏకంగా పార్టీ అధినేత, సీఎం పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. రాష్ట్రంలో బలమైన పార్టీని ఢీ కొట్టడానికి సిద్దమవ్వడం.. అసలు ఓ ఎంపీకి ధైర్యం ఇంత ఎక్కడిది?. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలతోనే, ఎంపీ రఘురామకృష్ణంరాజు రెచ్చిపోతున్నారని, బలమైన వైసీపీని ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.
వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దక్షిణ భారత దేశంలో మాత్రం ఆశించిన స్థాయిలో బలపడలేదనే చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ కన్ను దక్షిణ భారతదేశంపై ఉంది. ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టి దక్షిణంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తోంది. అందులో భాగంగానే ముందుగా ఏపీలో పావులు కదపడం మొదలు పెట్టింది అంటున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ద్వారా వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టించి ఏపీ రాజకీయాల్లో ఊహించని మలుపు తీసుకురాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్ కే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం కష్టమవుతుంటే.. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి తేలికగా అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆయనికి బీజేపీతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో. ఆ బంధమే ఇప్పుడు వైసీపీ పాలిట గుదిబండలా మారిందని అంటున్నారు.
టీడీపీ నేతలు పది పదిహేను మంది తమ పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటారు. నిజానికి అసలు వైసీపీ నేతలే పదుల సంఖ్యలో బీజేపీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఏ క్షణంలోనైనా ఇది జరగొచ్చని తెలుస్తోంది. పైకి జగన్ సర్కార్ పై వ్యతిరేక స్వరం వినిపిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు కనిపిస్తున్నా.. ఆయన వెనక మాత్రం ప్రస్తుత రాజకీయ పార్టీలలో బాహుబలి అయిన బీజేపీ ఉందని తెలుస్తోంది. ఇదంతా తెర ముందు ఎంపీ రఘురామకృష్ణంరాజుని పెట్టి తెర వెనుక బీజేపీ ఆడిస్తోన్న ఆటట. బీజేపీ ఒక్క చిటిక వేస్తే చాలు.. ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే ఏలూరు, నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు నేతలు వైసీపీకి అందుబాటులో లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఓ సందర్భంలో సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. 50 శాతానికి పైగా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పారు. ఎక్కువ సీట్లు గెలిచి సీఎం అయిన నాయకులు.. సొంత పార్టీ నుంచే తిరుగుబాటు ఎదుర్కొన్నట్టు చరిత్ర చెబుతుందని ఉండవల్లి అన్నారు. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఉండవల్లి మాటలు నిజమవుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ఎంపీ రఘురామకృష్ణంరాజు తిరుగుబాటుతో మొదలైన ఈ అలజడి ఏ స్థాయికి చేరుతుందో ఏంటో?. ఏపీలో జెండా పాతాలని చూస్తోన్న బీజేపీ.. వైసీపీకి ఊహించని షాకిచ్చి జెండా పాతుతుందేమో చూడాలి.