ఏపీ మంత్రి నాని అనుచరుడి దారుణ హత్య

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత హత్య కలకలం రేపింది. మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యాడు. మునిసిపల్ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కరరావుని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. గాయపడిన భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కత్తి పోటు ఛాతీలో బలంగా దిగడంతో భాస్కర్ రావు గుండెకు బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. కత్తికి సైనేడ్ పూసి పొడిచినట్టు వైద్యులు భావిస్తున్నారు.  భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్‌గా పని చేశాడు. పాతకక్షల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  మరోవైపు, భాస్కరరావు మరణవార్త తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.

అచ్చెన్నాయుడు ఆరోగ్యం పై కమిటీ వేసిన ప్రభుత్వం

ఈఎస్‌ఐ అవినీతి వ్యవహారంలో అరెస్టైన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఆయనకు విధించిన మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో ఈరోజు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జూన్ 30 వరకు కోర్టు మూసి ఉంచిన కారణంగా విచారణను జూలై ఒకటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఇది ఇలా ఉండగా అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక వైద్యుల కమిటీని నియమించింది. ఏసీబీ అదుపులోకి తీసుకున్న తరువాత అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై అటు పార్టీ నేతలు, ఇటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐదుగురు వైద్యులతో కూడిన ఒక కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి, అలాగే ఆయనకు వైద్యం చేసిన సిబ్బందిని విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వనుంది.

పోలీసులపైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత

వైసీపీ నేత,  సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులపై కుక్కలను వదిలారు. ఇటీవల హైదరాబాద్‌లో పీవీపీ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ విల్లాకు సంబంధించి విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి ఇంటికి దాదాపు 20 మందిని వెంటబెట్టుకుని వెళ్లి.. తాను అమ్మిన వీళ్ళను ఆధునీకరించడానికి వీల్లేదంటూ.. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేసి, చంపేస్తానని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పీవీపీపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. విధులకు ఆటంకం కల్గించారని పీవీపీపై కేసు నమోదు చేశారు.  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం.

ఇంట్లోనే ఉండమంటే ఊరంతా తిరిగేసాడు.. దీంతో కొన్ని వందలమందికి టెన్షన్ 

ప్రస్తుతం మనమంతా కరోనా కాలం లో బతుకుతున్నాం. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని ప్రస్థితి. ఐతే కొంత మంది మాత్రం మాకేంటి మేము ఆరోగ్యంగా బాగానే ఉన్నాము. మాకు కరోనా సోకదు అని కనీసం మాస్క్ కూడా లేకుండా తిరిగేస్తున్నారు. అదేమంటే మీ సంగతి మీరు చూసుకోండి అనే జవాబు. ఐతే ఇటువంటి వారి కోసమే ఈ వార్త. అసోంలో ఒక కూరగాయల వ్యాపారికి కొద్ది రోజుల క్రితం దగ్గు రావడం మొదలైంది. దాంతో ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు చెప్పగా అబ్బే కొద్దిగా వేడి చేసింది అందుకే దగ్గు స్టార్ట్ ఐంది అని తన మానాన తాను కూరగాయలు అమ్మడానికి వెళ్ళాడు. అతను కూరగాయలు అమ్ముతూ తిరుగుతుండగా అటు వచ్చిన పోలీసులు గమనించి ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే వేడి చేసి దగ్గు వస్తోందని చెప్పాడు. అతని పరిస్థితి గమనించిన పోలీసులు కరోనా పరీక్ష చేయించుకోమని చెప్పగా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు. ఐతే పోలీసులు మాత్రం ఎందుకైనా మంచిది అని ఒక టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించారు. అంతే కాకుండా మూడ్రోజులు కూరగాయలు అమ్మ వద్దని కరోనా టెస్టు రిజల్ట్ వచ్చే వరకూ ఇంట్లోనే ఉండమని పోలీస్ లు చెప్పి పంపించారు. ఐతే ఇంటికి తిరిగి వస్తూ దారిలో కూడా వెజిటబుల్స్ అమ్ముకుంటూ వెళ్ళాడు. అంతే కాకుండా ఆ వ్యాపారి తన వద్ద ఉన్న కూరగాయలు పాడై పోతున్నాయని చెప్పి వాటిని ఎపుడు అమ్మే ఏరియా లో కాకుండా వేరే ఏరియాలో కూరగాయలు అమ్ముతూ చాల కాలనీలు చుట్టేశాడు. ఇంతలో కరోనా టెస్ట్ రిజల్ట్స్ రావడం తో పాలీసులు అతన్ని వెదుక్కుంటూ అతని ఇంటికి చేరే సరికి ఆ వ్యాపారి ఇంటి దగ్గర లేకపోవడం తో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఫోన్ చేసి అతనిని ఇంటికి రప్పించి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి చెప్పారు. ఐతే పోలీసులకు మాత్రం కొత్త టెన్షన్ స్టార్ ఐంది. టెస్ట్ రిజల్ట్ వచ్చేవరకు ఇల్లు కదలొద్దని చెప్పినా వినిపించుకోకుండా తిరిగేసిన కారణంగా ఎన్ని వందల మందికి కరోనా అంటించేసాడో అని అటు పోలీసులు ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనకేం కాదన్న నిర్లక్ష్యమే మన కొంపముంచుతుంది. మన నిర్లక్ష్యం కారణంగా ఎందరో బలవుతున్నారు. కాబట్టి, మనం జాగ్రత్తగా ఉంటూ.. మనల్ని, మన వాళ్ళని కాపాడుకుందాం.

సీఎం జగన్ కు రఘురామకృష‌్ణంరాజు లేఖ.. యాంటీ క్రిస్టియన్‌గా చిత్రీకరించారు!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష‌్ణంరాజు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల వెల్లడైన సీ-ఓటర్ ఫలితాల్లో ఉత్తమ సీఎంగా నాలుగో స్థానం సాధించినందుకు గాను జగన్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మొదటి స్థానం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి నుంచి ఇటీవల తనకు షోకాజ్‌ నోటీసు అందిందని, దానిపై స్పందిస్తూ ఈ లేఖ రాస్తున్నట్లు రఘురామ కృష‌్ణంరాజు తెలిపారు. రిజిస్టరయిన పార్టీ కాకుండా తనకు మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు వచ్చిందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవద్దని ఎన్నికల సంఘం చెప్పిందని తెలిపారు. ఏ సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ చెప్పిందని పేర్కొన్నారు.  తాను వెంకటేశ్వరస్వామికి భక్తుడినినని చెప్పిన ఆయన.. స్వామివారి ఆస్తుల అమ్మకం విషయంలో భక్తుల మనోభావాలను మాత్రమే తాను వివరించి చెప్పానని తెలిపారు. అంతేగానీ, తాను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తనను కొందరు యాంటీ క్రిస్టియన్‌గా చిత్రీకరించారని ఆరోపించారు. అలాగే ఇంగ్లీష్ మీడియంపై గతంలో తాను చెప్పిన అభిప్రాయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్‌లో మాట్లాడానని.. సీఎం కూడా చాలా సంతృప్తి చెందారని రఘురామ కృష‌్ణంరాజు పేర్కొన్నారు. తనపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని, పార్టీ ఆదేశాలను తాను ఏనాడు థిక్కరించలేదని పేర్కొన్నారు. మీ నాయకత్వాన్ని సమర్థిస్తానని అన్నారు. తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, మీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష‌్ణంరాజు ఆరోపించారు.

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. దాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై హైకోర్టు వాదనలు విన్నది.  సచివాలయం కూల్చివేతపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. సచివాలయ నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయమని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం అన్ని అవసరాలకు సరిపోవట్లేదని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు.  వాదనలను విన్న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని చెప్పింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

కరోనా పై విజయం సాధించిన 99 ఏళ్ల మహిళ

కరోనా తీవ్రతకు యువకుల నుండి వృద్దుల వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో కూడా వైరస్ పురుషులకు ఎక్కువగా సోకుతోందని.. ఐతే మృతులలో మాత్రం మహిళలే ఎక్కువగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 99 ఏళ్ల వయసున్న బెంగుళూరుకి చెందిన మహిళ కరోనా బారి నుండి బయటపడ్డారు. ఈ భయంకర వైరస్ ఆమెకు ఆమె మనుమడి ద్వారా సోకింది. దీంతో ఆమెను, 70 ఏళ్ల ఆమె కుమారుడు, కోడలు, మనుమడి తో సహా విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 18 న చేర్చారు. ఐతే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే కుటుంబం లోని ముగ్గురికి జలుబు దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి కానీ ఆ వృద్ధ మహిళకు మాత్రం ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. హాస్పిటల్ లో చేరిన మొదట్లో ఆమె చికిత్సకు సరిగా సహకరించలేదని ఐతే తరువాత మెల్లమెల్లగా డాక్టర్లు, నర్సులు ధైర్యం చెప్పడంతో ఆమె త్వరగా కోలుకున్నారని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ తెలిపారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుండి ఆ వృద్ధ మహిళ మనుమడు తప్పించి మిగిలిన వారు ఎవరు బయటకు వెళ్లకపోయినా వారికి ఈ వైరస్ ఎలా సోకిందో అని వారు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి 9 రోజుల ట్రీట్ మెంట్ తరువాత 99 ఏళ్ల ఆ మహిళ తన కుటుంబం తో కలిసి వైరస్ పై విజయం సాధించి క్షేమంగా ఇంటికి చేరారు. కర్ణాటక లోనే కరోనా కోరల నుండి బయట పడిన అత్యంత వృద్ధురాలుగా కూడా ఆమె రికార్డులకు ఎక్కారు.

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడురోజుల క్రితమే మహమూద్‌ అలీ కరోనా టెస్టులు చేయించుకున్నారు. అస్తమా ఉండటంతో ముందుగానే కుటుంసభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచే ఆయనను అపోలోకు తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు మంత్రులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.  మరోవైపు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల హోంమంత్రిని కలిసిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు.

‘పీఎం కేర్స్‌’కు చైనా సంస్థల నుంచి భారీగా విరాళాలు!

భారత్-చైనా సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. భారత్ లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య చైనా పేరుతో మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి భారీగా నిధులు వచ్చాయని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన ‘పీఎం కేర్స్‌’ నిధికి చైనా సంస్థల నుంచి భారీగా నిధులు వచ్చాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.  ఎన్నో ప్రముఖ చైనా కంపెనీలు పీఎం కేర్స్ కు భారీగా నిధులు ఇచ్చాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. ఓవైపు చైనా కారణంగా జాతి భద్రతకు ప్రమాదం వాటిల్లుతున్న వేళ.. చైనా సంస్థల నుంచి విరాళాలను ఎందుకు అంగీకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పీఎం కేర్స్ కు పేటీఎం నుంచి రూ.100 కోట్లు, టిక్ ‌టాక్‌ నుంచి రూ.30 కోట్లు, షావోమీ నుంచి రూ.15 కోట్లు, హువావే నుంచి రూ. 7 కోట్లు, ఒప్పో నుంచి రూ.1 కోటి పీఎం కేర్స్ కు విరాళంగా వచ్చాయని తెలిపారు. గత నెల 20 నాటికి, పీఎం కేర్స్ నిధికి దాదాపు 9,678 కోట్లు వచ్చాయని, ఈ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ నిధులు దారి మళ్లుతున్నాయని, అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదని ఆరోపించారు. పీఎం కేర్స్ మోదీ సొంత నిధి అయిపోయిందని విమర్శలు గుప్పించారు. 2007 నుంచి బీజేపీకి చైనా కమ్యూనిస్టు పార్టీతో(సీపీసీ) సంబంధాలున్నాయని అభిషేక్ ఆరోపించారు. గత 13ఏళ్లలో ఆ పార్టీ అధ్యక్షులు చైనాతో సంబంధాలు నెరపినంతగా, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు నెరపలేదని విమర్శిచారు. 2007, 2008 లలో రాజ్‌నాథ్‌ సింగ్‌, 2011 లో గడ్కరీ, 2014లో అమిత్‌ షా సీపీసీతో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. బీజేపీ దేశ భద్రత గురించి లెక్కలేదు.. అయితే తమ గురించి లేదా రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారని అభిషేక్ విమర్శించారు.

కరోనా వైరస్ కు విరుగుడు ఆ జంతువుల నుండి.. మానవాళికి మరో తీపి కబురు

కరోనా తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా మనుషుల్లో ఉండే యాంటీ బాడీస్ ఈ వైరస్ ను అడ్డుకుని ప్రాణహాని లేకుండా చేయగలవు. ఐతే మనలోని యాంటీ బాడీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎఫెక్టివ్ గా వైరస్ ను ఎదుర్కోగలవు. ఐతే చాలామందిలో ఈ యాంటీ బాడీస్ చాలా తక్కువగా ఉండడం తో పరిస్థితి విషమిస్తోంది. తాజాగా దీనికి విరుగుడు గా అల్పక అనే జంతువు నుండి సేకరించిన నానో బాడీస్ ను మనుషులలో ప్రవేశ పెడితే అవి కరోనా వైరస్ ను అడ్డుకుంటాయనే వార్త వైరల్ అవుతోంది. తాజాగా దీని పైన రీసెర్చ్ చేసిన దక్షిణ ఆఫ్రికా, స్వీడన్‌ పరిశోధకుల దీనిని ధృవీకరిస్తున్నారు. అసలు కరోనా వైరస్ ను ల్యాబ్ లో తయారు చేసారా లేక జంతువుల నుండి మనుషులకు సోకిందా అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. కానీ తాజాగా పరిశోధన ప్రకారం మనుషులను కాపాడేది మాత్రం అల్పక అనే జంతువు అనే తెలుస్తోంది. అల్పకాలు గా పిలిచే ఈ జంతువులు చూడడానికి మన దగ్గర ఉండే మేకలు, ఒంటెలకు దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం ఇవే మనని కాపాడతాయని దక్షిణ ఆఫ్రికా, స్వీడన్‌ సైంటిస్టుల రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. వాటిలోని నానో బాడీస్ మనుషుల్లో ప్రవేశపెట్టగా అవి కరోనా వైరస్ ను అడ్డుకున్నాయని ఆ శాస్త్రవేత్తలు తెలిపారు. ఐతే ఇప్పుడు వీటిలోని యాంటీబాడీస్ సేకరించి మనుషులకు ఇవ్వడానికి మరో రెండు మూడు వారాల వరకు సమయం పట్టవచ్చని వారు తెలియ చేస్తున్నారు. అసలు ఈ యాంటీ బాడీస్ ఎలా పనిచేస్తాయంటే కరోనా వైరస్ కు చుట్టూ ఉన్న ముళ్లలాంటి కొవ్వును ఇవి చుట్టుముట్టి వాటిని కరిగేలా చేస్తాయి. దానితో కరోనా వైరస్ చచ్చిపోతుంది. దానితో కరోనా వైరస్ పీడ కూడా విరగడ అవుతుంది. ఈ దిశగా జర్మనీలో మొదటిసారి ఒక 12 ఏళ్ల వయసున్న అల్పక నుంచి నానోబాడీస్ తీసి ప్రయోగించగా ఫలితం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. అంతా సవ్యంగా జరిగితే కరోనా వైరస్‌కు ఈ యాంటీబాడీస్ అసలైన వ్యాక్సిన్ అవుతాయని ఆ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఏదేమైనా ఆ దేవుడి దయవల్ల, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే మనకు ఇంకా కావాల్సిందేముంది.

ఆక్సిజన్‌ తొలగించారు.. బై డాడీ.. అదే చివరి మాట

'ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ బంద్‌ చేశారు. సార్‌ సార్‌ అని బతిమిలాడినా పట్టించుకోలేదు.' అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించిన కాసేపటికే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన 35 ఏళ్ల రవికుమార్ కరోనా లక్షణాలతో ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే తనపట్ల వైద్యులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపిస్తూ.. రవికుమార్ ఓ సెల్ఫీ వీడియో తీసి తండ్రికి పంపాడు. ‘ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ తొలగించారు. సార్‌ సార్‌ అని బతిమిలాడినా పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు గంటలైంది. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటోంది. బై డాడీ’ అంటూ వాట్సాప్ లో వీడియో పంపాడు. వీడియోలో కొడుకు దయనీయ స్థితిని చూసిన తండ్రి.. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే కుమారుడు మరణించాడని సమాచారం వచ్చింది. రవికుమార్ అతని తండ్రికి పంపిన వీడియోని బట్టి చూస్తే.. అతను దాదాపు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించి మరణించాడని అర్థమవుతోంది. కాగా, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రవికుమార్ మరణించాడని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అసలు పెట్టిన ఆక్సిజన్‌ ఎందుకు తీసేశారో చెప్పాలని రవికుమార్ తండ్రి ప్రశ్నించారు. నా కుమారుడికి జరిగిన అన్యాయం మరొకరికి జరగవద్దని కోరుకుంటున్నాను అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన కరోనా బాధితుడి పట్ల ప్రభుత్వ బాధ్యతా రాహిత్య వైఖరికి పరాకాష్ట అని విమర్శిచారు. కాగా, ఈ ఘటనపై ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్ స్పందించారు. వైద్యుల నిర్లక్ష్యంతో రవికుమార్ చనిపోయాడనడం సరికాదని అన్నారు. కరోనా వైరస్ యువకుల్లో ఎక్కువగా గుండెపై ప్రభావం చూపిస్తుందని, గుండె దెబ్బతిన్న తర్వాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని తెలిపారు. రవికుమార్ విషయంలోనూ అదే జరిగిందని సూపరింటిండెంట్ పేర్కొన్నారు.

తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌!!

తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకి దాదాపు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 3,227 శాంపిల్స్ ను పరీక్ష చేయగా 983 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో 816 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వాళ్లే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు సంఖ్య 14,419 కి చేరింది. కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 247కి చేరింది. ఇప్పటివరకు 5,172 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 9 వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. దీంతో, గ్రేటర్‌‌ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారు. హైదరాబాద్‌లో 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని సీఎం చెప్పారు. కరోనా‌ నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేస్తామని, అలాగే హైదరాబాద్‌లో కొద్దిరోజులు తిరిగి లాక్‌డౌన్‌ విధించాలనే ప్రతిపాదనలపైనా తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం సర్కార్ మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం కనిపిస్తోంది.

మీరెన్ని తప్పుడు వార్తలు రాయించినా.. నేను పార్టీ విధేయుడినే

కొద్ది రోజులుగా వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం పై తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటిస్ కు జవాబుగా పార్టీ పేరుతో సహా అనేక అంశాల పై ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా రఘురామ రాజు తాను పార్టీకి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌న‌ని, సీఎం కనుక సమయం ఇస్తే ఆయనను కలిసి అన్ని విషయాలు చెపుతానని అన్నారు. తాను వైసీపీ పార్టీని కానీ, సీఎంను కానీ వ్య‌తిరేకించ‌లేద‌ని, ఐతే తన గురించి మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని విజయ్ సాయి రెడ్డి పై మండి పడ్డారు. తనకు, పార్టీ అధ్య‌క్షునికి మ‌ధ్య గొడ‌వ పెట్టొద్ద‌ని… వీలైతే త‌న‌కు ఇచ్చిన నోటీసు వెన‌క్కి తీసుకోవాల‌ని అయన విజ‌య‌సాయి రెడ్డి ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే త‌న‌కు వ‌చ్చిన షోకాజ్ నోటీసుల‌పై లీగ‌ల్ ఓపీనియ‌న్ కూడా తీసుకున్నాన‌ని అన్నారు. కేంద్ర‌మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిష‌న్ రెడ్డిల‌ను క‌లిసిన తరువాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

మరో వివాదంలో కూన రవి.. లేపేస్తానంటూ వైసీపీ నేతకు ఫోన్ లో వార్నింగ్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తేడా వస్తే లేపేస్తా అంటూ వైసీపీ నేతను ఆయన ఫోన్ లో బెదిరించిన ఆడియో క్లిప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత స్థానిక నేత గుడ్ల మోహన్ రావు వైసీపీ లో చేరారు. అయితే, ఆయ‌న బిల్డింగ్‌లోనే పొందూరు టీడీపీ కార్యాలయం ఉంది. టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని గుడ్ల మోహన్‌కు వైసీపీ నుంచి ఒత్తిళ్లు ఉండ‌డంతో.. ఖాళీ చేయాల్సిందిగా కూన రవి కుమార్ ను కోరారు. దీంతో.. నేను ఖాళీ చేయను ఏం చేసుకుంటావో చేస్కోమ‌ని కూన స‌మాధానం చెప్పారు. అయితే.. తన గురించి ఆలోచించాలని కోరిన మోహ‌న్.. నా బిల్డింగ్ మాత్రం ఖాళీ చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో, ఆగ్ర‌హంతో ఊగిపోయిన కూన.. నీగురించి ఆలోచించేది ఏంటి? తేడా వస్తే లేపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే, త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను కూన ర‌వికుమార్ ఖండించారు. పొందూరులో ఉన్న‌ది జాయింట్ ప్రాప‌ర్టీ అని వివ‌ర‌ణ ఇచ్చిన కూన.. టీడీపీ ఆఫీసు బిల్డింగ్‌పై ఇద్ద‌రికీ హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. నాకు చెప్ప‌కుండా ఆఫీసు రంగుల‌ను ఎలా మారుస్తారు? అని ప్రశ్నించిన ఆయన.. మ‌ర్యాద‌త‌క్కువ ప‌నులు చేయొద్ద‌ని మాత్ర‌మే చెప్పానని అన్నారు. కాగా, ఇటీవల కూన రవి కుమార్ ఓ ఎమ్మార్వోను ఫోన్ లో దూషించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇలా వరుసగా ఆయన ఫోన్ లో వార్నింగ్ లు ఇస్తున్న ఆడియో క్లిప్ లు బయటకు రావడం చర్చనీయాంశమైంది.

మనీలాండరింగ్ కేసు.. అహ్మ‌ద్ ప‌టేల్ ఇంటికి ఈడీ అధికారులు

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. స్టెర్లింగ్ బ‌యోటెక్ లిమిటెడ్ సంస్థ‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో ఇంటరాగేట్ చేస్తున్న సమయంలో అహ్మద్ పటేల్ పేరు వెలుగు చూసింది. కేసుకు సంబంధించి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఒకరని ఈడీ ప్రశ్నించనప్పుడు అహ్మద్ పటేల్ పేరు వెల్లడించారు. అహ్మద్ పటేల్ తో పాటు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆ సాక్ష్యం ఆధారంగా ఈడీ అధికారులు అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించారు. వాస్తవానికి జూన్ మొదటి వారంలో విచారణకు హాజరుకావాలంటూ అహ్మద్ పటేల్ కు ఈడీ నటీసులు ఇచ్చింది. అయితే, 65 ఏళ్ల వయోభారంతో పాటు, కరోనా వైరస్ ముప్పు కూడా ఉన్నందున విచారణకు హాజరుకాలేనని పటేల్ చెప్పారు. దీంతో, ఈడీ అధికారులే ఆయన నివాసానికి వెళ్లి ప్రశ్నించారు. కాగా, ఆంధ్రాబ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్ రూ. 5 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ‌వేసింది. ఆ సంస్థ వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మొత్తం రూ. 8,100 కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు. మరోవైపు, ఆ సంస్థ యజమానులైన నితిన్, చేతన్ సోదరులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వారు నైజీరియాలో దాక్కున్నారని సమాచారం. దీంతో, వారిని భారత్ కు రప్పించేందుకు ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

పవన్ కు ఎందుకంత కడుపుమంట.. ఏపీ మంత్రి

కాపు నేస్తం పేరుతొ వైసిపి ప్రభుత్వం అంకెల గారడీ చేసి కాపులను మోసం చేస్తోందని జనసేన అధినేత పవన కళ్యాణ్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి కన్నబాబు తాజాగా పవన్ వ్యాఖ్యల పై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో కాపులకు తొలి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు కేవలం వంద కోట్లు ఇచ్చినపుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబు గొప్ప సంస్కర్తగా కన్పిస్తారని కన్నబాబు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్ అంటే నచ్చదని అందుకే ఆయనపై నిరంతరం విమర్శలు చేస్తుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పట్ల ఉన్న ప్రేమను పవన్‌ కళ్యాణ్ దాచుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కాపు నేస్తం అద్భుతమైన పథకమని ఈ సందర్బంగా మంత్రి అన్నారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15వేలు అందిస్తున్నామని దీని కోసం ఏడాదిలో రూ.4,769 కోట్లు ఖర్చు చేస్తున్నామని అయన తెలిపారు. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాపు నేస్తం పథకం పై దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన అన్నారు.

చిల్లర కేసులకిచ్చిన ప్రాధాన్యత వివేక హత్య కేసుకు ఇవ్వడం లేదు

ఏపీలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్ జగన్ సహా పలువురు వైసీపీ నేతలు అప్పుడు డిమాండ్ చేశారు. తీరా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక మాత్రం సైలెంట్ అయిపోయారు. కాగా, తాజాగా ఈ ఘటనపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. జగన్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. వివేకా హత్యకేసు సీబీఐ దర్యాప్తుకివ్వాలని అడిగింది మీరు కాదా? గవర్నర్‌ని కలిసి మా బాబాయి హత్య కేసును సీబీఐకి ఇవ్వండని కోరింది మీరు కాదా? హైకోర్టులో పిటిషన్ వేసి వివేకా హత్య కేసు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించమని కోరింది మీరు కాదా? అంటూ వర్ల రామయ్య సీఎం జగన్‌ను ప్రశ్నించారు. సీఎం అయిన తర్వాత పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అని నిలదీశారు. వివేకా హత్య కేసులో పురోగతి ఏమిటని?, హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత మీ ప్రభుత్వం దర్యాప్తును ఎంతవరకు పరిశీలించింది? అని ప్రశ్నించారు. హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించి 100 రోజులు దాటింది. ఇంతవరకు సీబీఐ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. సీబీఐ వర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి లేఖ రాయాలి. వివేకా కూతురు సునీత కూడా దర్యాప్తు పురోగతి వెల్లడించాలని సీబీఐకి లేఖ రాయాలి. సోషల్ మీడియా లాంటి చిల్లర కేసులకిచ్చిన ప్రాధాన్యత వివేక హత్య కేసుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.