ప్రధాని వద్దకు వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా: సీఎం కేసీఆర్
posted on Jun 24, 2020 @ 10:01AM
బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె. కేశవరావు, మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించారు.
పీవీ జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
రాష్ట్ర అసెంబ్లీలో పీవీ చిత్ర పటాన్ని పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. అలాగే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పీవీ విగ్రహాలు నెలకొల్పాలని, విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారత పార్లమెంటులో కూడా పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామన్నారు.
‘పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా.’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.