ఆస్ట్రేలియా బడుల్లో తెలుగు
posted on Jul 17, 2020 @ 5:16PM
మన తెలుగు భాషకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి పాఠశాలల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా చేరుస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు ఇకపై తెలుగు భాషను నేర్చుకునే అవకాశం కలగనుంది. తాజా ఆదేశాలతో తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో ఐదు పాయింట్లు అదనంగా వస్తాయి.
ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ, తమిళ భాషలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు లభించింది. తాజాగా ఆ జాబితాలో తెలుగు చేరింది. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొన్నారు. నేషనల్ అక్రిడిటేషన్ అథారిటీ ఫర్ ట్రాన్సిలేటర్స్ అండ్ ఇంటర్‌ప్రెటర్స్ నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు ఐదు పాయింట్లు అదనంగా కలుస్తాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన పట్ల స్థానిక తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.