ఊచలు లెక్కపెడతావ్ ఉమా.. కాదు నువ్వే బెయిల్ మీదున్నావు సాయి రెడ్డి

నిత్యం చంద్రబాబు, లోకేష్ ల పై స్ట్రాంగ్ కామెంట్లతో విరుచుకుపడే వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పై రెచ్చిపోయారు. తాజాగా టీడీపీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై విజయ్ సాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందించారు. "వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందంటున్నారు. దీంతో ఉమకి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడేది తెలియడంలేదు. నీటిపారుదల ప్రాజెక్టుల కుంభకోణాలు బయటికి వస్తే నువ్వు కూడా ఊచలు లెక్కపెట్టాల్సిందే ఉమా.. మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు, పంచుకోవడాలు అన్నీ మీతోనే పోయాయి" అంటూ వ్యాఖ్యానించారు. దీని పై మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "తమ ప్రభుత్వ హయాంలో ఏపీ నీటిపారుదల రంగాన్ని దేశంలోనే 2వ స్థానంలో నిలిపామని ఆయన స్పష్టం చేసారు. అంతే కాకుండా "కారు దింపిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో పడినట్టున్నావు. 108 అంబులెన్సుల్లో రూ.307 కోట్లు కొట్టేశావు. 12 సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలల ఊచలు లెక్కపెట్టావు. మీ తప్పుడు కేసులకు భయపడం. జైలు నుంచి బెయిల్ పై వచ్చావ్.. ఒళ్ళు సోయిలో పెట్టుకో, బెదిరింపులు ఆపు జరబద్రం" అంటూ ఎంపీ విజయ్ సాయి రెడ్డిని ఉమ హెచ్చరించారు.

బాధితుల ఇంటికి ఉచితంగా కరోనా కిట్

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా.. వారికి కావాల్సినవాటిని ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టాయి.  కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగులను హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే.. వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్' ను ఏపీ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'హోమ్ ఐసోలేషన్ కిట్' ను తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో 17 రోజులకు సరిపడే మెడిసిన్ ఉంటుంది.  అలాగే, మాస్కులు, శానిటైజర్లతో పాటుగా కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను గురించి వివరించే ఓ చిన్న బుక్ కూడా అందులో ఉంటుందట.

కరోనాను అదుపు చేయడంలో శక్తి, యుక్తిని ప్రదర్శించిన మహిళా నేతలు

విఫలమైన అగ్రదేశాల అధినేతలు ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలను అతలాకుతలం చేసింది కోవిద్ 19 వైరస్. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి అత్యంత ఆధునిక దేశాలుగా ప్రపంచపటంలో గుర్తింపు పొందిన దేశాలు ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేస్తోంది. అగ్రదేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాలను, అతి తక్కువ సమయంలో కోవిద్ 19ను అదుపు చేసిన దేశాలను పరిశీలిస్తే ఒక వాస్తవం స్పష్టమవుతోంది. కోవిద్ 19 బారిన పడుతున్న వారిలో మగవారి సంఖ్యనే ఎక్కువగా ఉన్నది ఒక సర్వే . అంతేకాదు పురుషాహంకార అధిపత్యధోరణి కనబరిచే వారి ఎలుబడిలో ఉన్న దేశాల్లో ఉగ్రరూపం దాల్చింది.  కోవిద్ 19ను అరికట్టడంలో విఫలమైన ఏడు దేశాలు.. ఆ దేశాల అధ్యక్ష, ప్రధానులు గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. కరోనా విజృంభణలో అమెరికాదే ప్రథమ స్థానం. ఆ దేశంలో కోవిద్ 19 కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య1,36,671. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధిపత్యభావజాలం ప్రపంచ ప్రజలకు సుపరిచితమే. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో ఈ వైరస్ వ్యాప్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని జైర్ బోల్సోనారో కోవిడ్ బారిన పడ్డారంటే అక్కడ నియంత్రణ చర్యలు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  బ్రెజిల్లో కరోనా కోరల్లో చిక్కిన వారి సంఖ్య  1,804,338 అయితే మరణించిన వారి సంఖ్య 70,524. మాస్క్ కూడా ధరించను అంటూ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన బోల్పోనారో అందుకు ప్రతిఫలంగా కోవిడ్ బారిన పడి క్వారంటైన్ లో ఉన్నారు. రాకెట్ వేగంతో మూడోస్థానంలోకి వచ్చిన మనదేశంలోనూ నిరంకుశ ధోరణిలో వ్యవహరించే దేశప్రధాని కనిపిస్తారు. ప్రజా సంక్షేమం కంటే కార్పోరేట్ సంస్థల ఖజానా నిండటమే ముఖ్యమన్న ధోరణితో వ్యవహరిస్తూ దేశంలో కరోనా కేసులు ఎనిమిది లక్షల 22వేలు దాటేలా చేశారు. మరణాలు 22వేలు దాటాయి. ప్రతిరోజూ వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా సరైన వైద్యసదుపాయాలు అందించడంలో విఫలం అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఆ దేశంలో కోవిద్ 19బారిన పడిన వారి సంఖ్య 713,936 ఉండగా పదివేలకు పైగా మరణాలు సంభవించాయి. పెరూ, చిలీ, స్పెయిన్, ఇటలీ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ముంచుకొస్తున్న ముప్పును ఆయా దేశాల అధినేతలు సరైన అంచనా వేయలేకపోయారు. లక్షలాది మంది కరోనా బారిన పడేందుకు, వేలాది మంది ఈ వైరస్ కారణంగా మృత్యవాత పడేందుకు కారణమయ్యారు. విజృంభిస్తున్న కోవిడ్ 19ను సమర్థవంతగా ఎదుర్కొన్న దేశాలు మహిళాధినేతల పరిపాలనలో ఉండటం గమనించదగిన విషయం. విపత్కర పరిస్థితులను సరిగ్గా అంచన వేయగలగడం, ప్రజల ప్రాణాలుకు ముప్పు రాకుండా తగిన చర్యలు తీసుకోవడం ఇందుకు కారణం అని చెప్పవచ్చు. డెన్మార్క్ లోనూ కరోనా వ్యాప్తి చెందినప్పటికీ చాలా తక్కువ సమయంలో నియంత్రించారు. ఆ దేశ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రజలందరికీ కోవిద్ వైరస్ పరీక్షల నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా చోట్ల కోవిద్ 19 నెగిటివ్ రిపోర్ట్స్ చూయించిన వారికే అనుమతించారు. దాంతో కరోనాను కట్టడి చేయగలిగారు. ఆ దేశంలో 13,117 మంది ఈ వైరస్ బారిన పడగా 609 మంది మరణించారు. వైరస్ తమ దేశంలోకి రాకముందే వస్తే ఎలా ఎదుర్కోవాలో అన్న అంశంపై పటిష్టమైన విధానాన్ని రూపొందించారు ఐస్లాండ్ ప్రధాని కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్. ఆమె తీసుకున్న ముందస్తు చర్యలతో ఆ దేశంలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయడంతో పాటు వైద్యపరీక్షలను పెంచుతూ కరోనా వ్యాప్తిని అరికట్టారు ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్. ఇప్పటికీ ఆ దేశంలో లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు 7,279మంది కరోనా బారిన పడితే వారిలో 6,800మంది కోలుకున్నారు.  329మంది మరణించారు.   యూరప్ మొత్తంలో అత్యధిక పరీక్షలు నిర్వహించిన దేశం జర్మనీ. ఆ దేశ ప్రధాని ఏంజెలా మెర్కెల్ కోవిద్ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ దేశంలో అధికంగా ఉన్న వృద్ధులకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఏప్రిల్ నుంచే దశలవారిగా లాక్ డౌన్ ఎత్తేశారు. దేశ జిడిపిలో 11శాతం ప్రజల ఆరోగ్యం కోసమే వినియోగిస్తారు. కరోనా బారిన పడిన వారి సంఖ్య లక్షల్లో ఉన్నా మరణాల రేటు ఎక్కువగా లేకుండా చర్యలు తీసుకున్నారు. న్యూజిలాండ్కు మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జాకిందా ఆర్డెర్స్ పరిపాలనా దక్షతను ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. 2017లో న్యూజిలాండ్ 40వ ప్రధానిగా పదవి చేప్పటిన ఆమె ఉగ్రదాడులను, ప్రకృతివైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. కరోనా వ్యాప్తిని ముందుగా గుర్తించారు. ఫిబ్రవరి 2న చైనా బయటి దేశంలో మొదటి కరోనా మరణం సంభవించిన అంశాన్ని గుర్తించి చైనా నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు. తమ దేశస్తులు వచ్చినా వారిని కచ్ఛితంగా క్వారంటైన్ లో ఉంచారు. జనాభా 80శాతం మంది ప్రభుత్వం నిబంధనలు వందశాతం పాటించేలా ప్రజలకు పరిస్థితులను వివరించారు. ఇప్పటివరకు 1,543 మంది కరోనా బారిన పడగా 1497మంది కోలుకున్నారు. 22మంది మరణించారు. కచ్ఛితమైన నిబంధనలతో నార్వేలో మార్చి 12 నుంచి పూర్తిగా లాక్ డౌన్ పాటించారు. నార్వేప్రధాని ఎర్నా సోల్బెర్గ్ తీసుకున్న కఠినమైన చర్యలే  ఆ దేశంలో కోవిద్ ను అరికట్టింది. ఫిబ్రవరి 27 తర్వాత  తమ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ లక్షణాలతో సంబంధం లేకుండా క్వారంటైన్ లో ఉంచారు. 8974 మంది కరోనా బారిన పడగా 252 మరణించారు. తాయ్ ఇవాన్-వెన్, తైవాన్ అధక్షురాలు తాయ్ ఇవాన్ వెన్ తీసుకున్న పటిష్టమైన నిర్ణయాలతో ఆ దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించారు. 17ఏండ్ల కిందట సార్స్ ప్రబలినప్పుడు ఎదురైన తీవ్రమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠినమైన చర్యలు తీసుకున్నారు. జనవరి నుంచే చైనా నుంచి వచ్చేవారందరినీ క్యారంటైన్ చేశారు.  విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో మహిళలు తమ శక్తినే కాదు యుక్తి  ని ప్రదర్శిస్తారు అన్నది మరోసారి స్పష్టమైంది. ఆడవారికి అధికారం ఇవ్వడం అనవసరం అనుకునేవారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అదుపుచేసిన  ఈ మహిళానేతల గురించి తెలుసుకుని వారి అభిప్రాయాలు మార్చుకోవాలి.

భారత్ లో కరోనాకు మరో కొత్త మందును ఓకే చేసిన డిసిజిఐ

భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కరోనా రోగులకు ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు ఇటోలిజుమాబ్ అనే ఇంజెక్షన్ కు అనుమతులు మంజూరు చేసింది. సొరియాసిస్ (psoriasis) అనే చర్మ వ్యాధిని తగ్గించేందుకు దీనిని ఇప్పటికే వాడుతున్నారు. ఐతే తాజాగా కరోనా పేషెంట్లపై ఈ మందును ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. బెంగళూరులోని బయోకాన్ ఇండియా లిమిటెడ్ ఈ మందును సొరియాసిస్ ట్రీట్ మెంట్ కోసం వాడేందుకు చాలా ఏళ్ల కిందట అనుమతి పొందింది. ఈ ఇటోలిజుమాబ్ అనే మందు చాలా పవర్‌ఫుల్. దీంతో కరోనా చాలా తీవ్రంగా ఉండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషంట్లకు మాత్రమే దీన్ని ఇస్తారు. కరోనా వైరస్ అంతు చూసే యాంటీబాడీల ఉత్పత్తికి ఉపయోగపడే సైటోకిన్ల ను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఎయిమ్స్‌కు చెందిన కొందరు నిపుణులు ఈ మందుతో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఐతే ఇది చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ మందును తీసుకోవాలనుకునేవారు ముందుగా తమ అంగీకారం తెలుపుతూ పేపర్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇటోలిజుమాబ్‌ని మే నెలలో కరోనా ఉధృతంగా ఉన్న ముంబైలోని నాయిర్‌ హాస్పిటల్ వాడి చూసింది. వెంటిలేటర్‌తో ఉన్న ఇద్దరు రోగులకు ఇవ్వగా వాళ్లు కోలుకొన్నారు. ఈ మందు ఒక డోస్ ఇవ్వగానే రోగులు కోలుకుంటున్నారని ఐతే కొంత మందికి మాత్రం 3 డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని సమాచారం.

ఏపీ సీఎం జగన్ పై కోట శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్స్ 

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు తన పుట్టిన రోజు సందర్బంగా కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా తాను గతంలో బిజెపి తరుఫున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మాజీ ప్రధాని వాజ్ పేయికి అభిమానిని అని, అందుకే తనను బిజెపిలోకి తీసుకున్నారని అన్నారు. ఇదే సమయంలో అనేక విషయాల పై మాట్లాడిన కోటా రాజకీయాల పై మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భం లో ఆయన ఏపీ సీఎం జగన్ పై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను పాత సామెతలను నమ్ముతానని, అందులో ఒక సామెత ప్రకారం ఇప్పుడు ఆంధ్రలో పరిస్థితి ఎలా ఉందంటే "నిద్రపోయేవాడిని లేపవచ్చు గానీ నిద్ర నటించేవాడిని లేపలేమని కోట శ్రీనివాస రావు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలన్నీ సీఎం జగన్ కు తెలియకుండానే జరగుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఐతే అలా ఎందుకు జరుగుతుందో మాత్రం తెలియడం లేదని ఆయన అన్నారు. ఐతే అంతకు మించి మాట్లాడడానికి మాత్రం కోట ఇష్ట పడలేదు. అదే సమయంలో తాను తెలంగాణ గురించి మాట్లాడబోనని, ఐతే ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మాట్లాడుతానని ఎందుకంటే తనకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత ఉందని, అక్కడ తాను గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశానని ఆయన అన్నారు. తన స్వగ్రామం కంకిపాడు విజయవాడ పక్కనే ఉందని అక్కడ తనకు ఇప్పటికి ఆస్తులు ఉన్నాయని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతానని ఆయన అన్నారు. అది కూడా ఒకే ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంభవిస్తున్న పరిస్థితిపై మాట్లాడుతానని అంటూ ఆయన స్పష్టం చేశారు.

సుప్రీంకు చేరిన తెలంగాణ సచివాలయం వ్యవహారం

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సచివాలయం నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌ రెడ్డి పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.  మరోవైపు, సచివాలయ భవనాల కూల్చివేత పనులను తాత్కాలిక బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. నూతన సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో.. ప్రభుత్వం చకచక ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేత మొదలుపెట్టింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కరోనా కష్టకాలంలో పాత భవనాల్ని కూల్చి రూ.500 కోట్లతో కొత్త భవనాలు కట్టడం అవసరమా అని ప్రశ్నించాయి. ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో, సోమవారం వరకు కూల్చివేత చేపట్టొద్దని హైకోర్టు అదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత పనులు 50 శాతం పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో కూల్చివేత ఆపాలని హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్లు ధాఖలు కావడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ అంశంపై కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

800కోట్లకు చేరువలో ప్రపంచ జనాభా.. లాక్ డౌన్ కారణంగా ఏడు లక్షల అవాంఛిత గర్భాలు

800కోట్లకు చేరువలో ప్రపంచ జనాభా.. 33ఏండ్లలో మూడు వందల కోట్లు జనాభా పెరిగింది.. మానవవనరులు, ప్రకృతి వనరుల మధ్య సమతుల్యత చర్చించేందుకు వీలుగా ప్రపంచ జనాభా దినోత్సవం.. కరోనా కారణంగా 47లక్షల మంది మహిళలకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులోలేవు - యుఎన్ఎఫ్ పిఎ పరిశోధన.. లాక్ డౌన్ కారణంగా ఏడు లక్షల అవాంఛిత గర్భాలు.. మహిళలకు కరువైన వైద్యసేవలు.. లైంగిక హింస, బాల్యవివాహాలు తగ్గించే లక్ష్యంగా 2020 థీమ్.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులు, అభివృద్ధి అంశాలను చర్చించేందుకు ప్రతిఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి  నిర్ణయించింది. 11జూలై, 1987 నాటికి ప్రపంచ జనాభా ఐదువందల కోట్లకు చేరింది. పెరుగుతున్న జనాభాను నియంత్రించే అంశాలపై చర్చించేందుకు ప్రతి ఏటా 11 జూలై ను ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించాలన్న ప్రతిపాదన 1989లో వచ్చింది. అన్ని దేశాల ప్రతినిధులతో చర్చించిన తర్వాత ప్రతి ఏటా ఒక అంశంతో జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. ఈ ఏడాది లైంగిక హింస అరికట్టడం, మహిళల సంతానోత్పత్తి సమస్యలను నివారించడం, బాల్యవివాహాలు అడ్డుకోవడం అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. 2020ని మహిళలు, బాలికల ఆరోగ్యం, వారి హక్కుల రక్షణ సంవత్సరంగా ప్రకటించారు. లాక్ డౌన్ కొత్త సమస్యలను.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ సరికొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.  కొన్ని దేశాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొన్ని దేశాల్లో సరైన వైద్యసదుపాయాలు, మందులు అందుబాటులో అనారోగ్య సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.  ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై, అవాంఛిత గర్భధారణపై లాక్ డౌన్ ప్రభావం చాలా ఉందని,  47లక్షల మంది మహిళలకు  గర్భనిరోధక మాత్రలు అందుబాటులో లేకపోవడంతో అవాంఛిత గర్భం దాల్చుతున్నారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యుఎన్ఎఫ్ పిఎ) పరిశోధనల్లో స్పష్టమైంది.  ఆరునెలల పాటు దశవారీగా లాక్ డౌన్ విధించిన కొన్ని దేశాల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరికొన్ని దేశాల్లో మహిళలు పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితి కారణంగా విభిన్న ప్రాంతాల్లో భిన్నమైన హెచ్చుతగ్గులు ఉంటాయని యుఎన్ఎఫ్ పిఎ పేర్కొంది.  ప్రపంచ జనాభాలో 36శాతం రెండు దేశాల్లోనే.. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రపంచ జనాభా  ఎనిమిది వందల కోట్లకు చేరువలో ఉంది. 2023 నాటికి 800కోట్లు దాటవచ్చని అంచనా.  అత్యధిక జనాభా కలిగిన ఆసియా ఖండంలోని రెండు దేశాలు చైనా, భారత్ లోనే ప్రపంచ జనాభాలో 36శాతం జనాభా ఉంది. అయితే కోవిడ్ 19 వైరస్ విసిరిన పంజాలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ  ప్రణాళిక లేని గర్భాల కారణంగా జననాల రేటు పెరిగే ప్రమాదం ఉందని అంచనా. కొన్ని దేశాల్లో లక్షల్లో మరణాలు సంభవించడంతో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. 2050 నుంచీ ... ప్రపంచ జనాభా 2050 తర్వాత  తగ్గుతుందనే అంచనాలున్నాయి. అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ లో జననాల రేటు తగ్గుతుందని అంచనా. గతంతో పోలిస్తే ఈ తేడా స్పష్టమవుతుంది.

ఒకే ముహూర్తానికి ప్రియురాలిని, పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లాడిన యువకుడు

ఒక పక్క కరోనా కలకలం. మరో పక్క లాక్ డౌన్ కష్టాలు. ఈ పరిస్థితుల్లో కూడా ఆ ఊళ్ళో మాత్రం పెళ్లి చాలా హ్యాపీగా సాఫీగా సాగిపోయింది. ఐతే ఇక్కడ సాఫీగా అని ఎందుకంటున్నాం అంటే పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు తో పాటు ఇద్దరు పెళ్లి కుమార్తెలు కూడా ఉన్నారు. అవును మీరు చదువుతున్నది నిజంగా నిజమే. అది కూడా అటు పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కుమార్తెలు అందరు కూడా హ్యాపీగా ఉండడం ఇక్కడ విశేషం.  ఐతే ఈ పెళ్లి కథా కమామిషు ఏంటంటే మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాకు చెందిన కేరియా గ్రామంలో సందీప్ అనే గిరిజన యువకుడు ఒకే మండపం లో అదే పెళ్లి పీటల పై ఒకే సారి ఇద్దరు అమ్మాయిల తో కలిసి ఏడడుగులు నడిచాడు. దీనికి కారణం సందీప్ భోపాల్ లో చదువుకునే సమయంలో హోషంగాబాద్ కు చెందిన యువతి తో లవ్ లో పడ్డాడు. ఆ యువతి కూడా అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఐతే ఈ ప్రేమ దోమ నచ్చని పెద్దలు మరో అమ్మాయితో సందీప్ పెళ్లి డిసైడ్ చేసారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి ముహూర్తం టైం కు నా ప్రియుడు తొనే జీవితం అంటూ ప్రియురాలు ఫ్యామిలీ తో సహా ఎంట్రీ ఇచ్చింది. ఒక పక్క పెద్దలు కుదిర్చిన అమ్మాయి.. మరో పక్క ప్రేమించిన ప్రియురాలు. దీంతో మూడు కుటుంబాలు ఊరి పెద్దల వద్దకు పంచాయతీ తీర్చమని వెళ్లాయి. అక్కడ పంచాయతీ పెద్దలు ఇద్దరు అమ్మాయిలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. ఏదేమైనా సరే అతడినే పెళ్లి చేసుకుంటామని ఇద్దరు పట్టు పట్టారు. అంతే కాకుండా ఇద్దరు కలిసి అతనితో కాపురం చేస్తామని చెప్పడంతో అటు కుటుంబ పెద్దలు ఇటు పంచాయతీలోని పెద్దలు కూడా దీని వల్ల ముందు ముందు ఇబ్బందులు ఎదురవుతాయని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో ఇక చేసేది ఏమిలేక పెద్దలందరూ రాజీ పడడంతో అదే మండపంలో ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే ఇద్దరు యువతులతో సందీప్ కు పెళ్లి చేశారు.

ఈఎస్‌ఐ స్కామ్ లో మరో ట్విస్ట్.. యాంటిసిపేటరీ బెయిల్ కోరిన పితాని కుమారుడు

ఏపీలో ఈఎస్‌ఐ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మ్నాత్రి అచ్చెన్నాయుడు తో సహా తొమ్మిది మందిని ఎసిబి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ స్కామ్ లో మాజీ మంత్రి పితాని పేరు కూడా వినిపించింది. ఐతే తాజాగా పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై విచారణ సందర్భంగా అయన తరుఫు లాయర్ ఏపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వాదించారు. ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి పితాని వద్ద అప్పట్లో పీఎస్ గా ఉన్న మురళి మోహన్ ను ఈ రోజు ఉదయం సెక్రటేరియట్ వద్ద ఎసిబి అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పితాని కుమారుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

సీఎం కేసీఆర్ ను చర్లపల్లి జైల్లో పెట్టాలి: రేవంత్‌రెడ్డి

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల్లో అక్కడ ఉన్న నల్లపోచమ్మ దేవాలయం, మసీదు ధ్వంసం కావడంపై ప్రతిపక్ష నేతలు కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మసీదులను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామన్నారు. మసీదు, దేవాలయాన్ని కూలగొట్టిన సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్‌కుమార్‌ కు బేడీలు వేసి.. చర్లపల్లి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని, కేసీఆర్ వేసే మెతుకుల కోసం కక్కుర్తిపడుతున్నారని మండిపడ్డారు. దేవాలయం కూల్చివేతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు.

ఆ కేసులనుండి నన్ను కాపాడండి.. హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ 

ఏపీలో వైసీపీ నేతలు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఇరు పక్షాల నాయకుల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ నాయకులు, మంత్రి శ్రీరంగనాథరాజు పోడూరు స్టేషన్‌లో, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు. తనను తన తోటి ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడారని ఎమ్మెల్యే గ్రంధి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయన తమ పార్టీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా చేశారని గ్రంధి శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు . అయితే ఈ కేసులకు సంబంధించి తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీని కోసం అయన హైకోర్టులో వేరు వేరుగా రెండు క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి తన పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లలో అయన న్యాయస్థానాన్ని కోరారు. ఐతే న్యాయస్థానం ఈ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.

వైఎస్ఆర్‌సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి బదులుగా వైయస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు.  ఇదిలా ఉంటే, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా పార్టీ పేరుపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనది 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' అయితే 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ' పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి, ఉన్నతాధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇతర ముఖ్య అధికారులతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్ట్ పై IAS లు,  ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ లతో మంత్రి పువ్వాడ, స్మిత సబర్వాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌ పనులను వీరు పరిశీలించారు. పనుల పురోగతిపై ఎస్‌ఈ, సీఈ లను వివరాలడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం పనులు వేగంగా చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులు, కాట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు.

కరోనా తోనే సతమతమౌతుంటే.. కొత్తగా ప్రమాదకర న్యుమోనియా..!

ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తితో తల్లడిల్లుతోంది. ఈ వ్యాధి వ్యాప్తి మొదలై ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు దీనిని ఎదుర్కొనేందుకు సరైన మందు  రాలేదు. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ట్రయల్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం మానవాళి కరోనా తో సతమతమవుతుంటే మరో పక్క కొత్త కొత్త వైరస్‌లు దాడులు చేస్తున్నాయి. ఇంకా కరోనా కథ కంచికి చేరక ముందే చైనాలో జీ-4 వైరస్, బ్యూబానిక్ ప్లేగ్ వ్యాధులు ప్రబలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా మరో కొత్త వ్యాధి కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కజఖ్‌స్థాన్ దేశం ‌లో గుర్తు తెలియని కొత్త న్యుమోనియా ఒకటి అలజడి సృష్టిస్తున్నట్లు ఆ దేశంలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. అంతే కాకుండా కజఖ్‌స్థాన్‌లో ఉన్న చైనా దేశస్తులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసినట్లు చైనా లోని ప్రముఖ పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. గ్లోబల్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం కజఖ్‌స్థాన్‌లో గుర్తుతెలియని న్యుమోనియాతో ఈ సంవత్సరం లో ఇప్పటివరకు 1,772 మంది మరణించారు. గడచిన జూన్‌ నెలలోనే 628 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో చైనా వారు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ వివరాలను కజఖ్‌స్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం వీచాట్‌ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కజఖ్‌స్థాన్‌లోని షిమ్కెంట్, అతిరో, అక్టోబ్ నగరాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఆ పత్రిక తెలిపింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇది కరోనావైరస్ కంటే ప్రమాదకరమని, దీనిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. ఐతే చైనా మీడియాలో వచ్చిన ఈ వార్తలను కజఖ్‌స్థాన్ వైద్యఆరోగ్యశాఖ తీవ్రంగా ఖండించింది. మా దేశంలో కొత్త న్యూమోనియా వచ్చిందన్న వార్తలు నిరాధారమైనవని అవి కేవలం తప్పుడు కథనాలు అని కొట్టిపారేసింది. ఇది కేవలం సాధారణ న్యుమోనియాగా మాత్రమేనని ఐతే గత ఏడాది జూన్‌తో పోల్చితే ఈ సంవత్సరం న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అక్కడి ప్రముఖ న్యూస్ ఏజన్సీ కజిన్‌ఫామ్ తెలిపింది.

జగన్ తలపెట్టిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ అనేక వాదనలు, వివాదాలు

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. దానికి శంకుస్థాపన కూడా చేశారు. 2022 నాటికి దీన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, గతంలోనే అమరావతిలో కృష్ణా నది వద్ద 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు తలచారు. కానీ అది కార్యరూపం దాల్చకుండానే ఆయన సీఎం కుర్చీ దిగారు. ఇక ఇప్పుడు ప్రస్తుత సీఎం జగన్ కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, విగ్రహ ఏర్పాటుకు అమరావతి కాదని విజయవాడను ఎంచుకున్నారు. దీంతో విగ్రహ ఏర్పాటుపై కొన్ని పక్షాల నుంచి వివాదాలు మొదలయ్యాయి.  స్వరాజ్ మైదానం విజయవాడ లోని అతి పెద్ద మైదానం. రాజకీయ పార్టీల మీటింగులకైనా, ఎగ్జిబిషన్ల కైనా, విజయవాడ నగరానికి సంబంధించి ఏ పెద్ద కార్యక్రమం నిర్వహించాలన్నా స్వరాజ్య మైదానంలోనే ఇప్పటి వరకు జరుగుతుండేవి. ఆ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేస్తే.. పెద్ద మైదానం పోతుందని దాని అవసరం వస్తే ఎక్కడికి వెళ్లాలని విజయవాడలో కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఈ మేరకు మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు కూడా సీఎం జగన్ కి లేఖ రాశారు. ఈ విగ్రహ ఏర్పాటు అమరావతిలోనే చేయాలని, రాజధాని సంకల్పం బాగుంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను గతంలోనే ఈ స్వరాజ్ మైదాన్ (పిడబ్ల్యుడి గ్రౌండ్స్) విషయమై కోర్టుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే పరోక్షంగా ఈ నిర్ణయంపై మళ్లీ తాను కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా సీఎంకు ఒక హెచ్చరిక జారీ చేశారు. మరో వైపు, ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 200 కోట్లు నిధులు కేటాయించింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇలా 200 కోట్లు కేటాయించి విగ్రహం నెలకొల్పడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక టీడీపీ అయితే తాము తలపెట్టినట్లు కృష్ణానది మధ్యలో ఇలా అంబేద్కర్ విగ్రహం పెద్దది నెలకొల్పితే ఆకర్షణీయంగా ఉంటుందని, రాజధాని అమరావతికి కూడా అద్భుతమైన కట్టడంగా నిలుస్తుందని చెబుతోంది. ఇలా జగన్ తలపెట్టిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ అనేక రకమైన వాదనలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కలేదు కానీ ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కితే మళ్లీ ఎప్పటిలాగానే వ్యతిరేక తీర్పు వస్తుందా లేక అనుకూల తీర్పు వస్తుందా అనేది చర్చగా మారుతుంది.

అరగంటలోనే ఫలితాలు..

యాంటీ జెన్ పరీక్షలు.. పిహెచ్ సిలోనూ అందుబాటులో.. ప్రసవానికి పదిరోజుల ముందు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలను వైద్యఆరోగ్య శాఖ చేస్తోంది. అరగంటలోనే ఫలితాలిచ్చే యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ రోగులను త్వరగా గుర్తించేందుకు సన్నద్దమైంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఒక్కోక్క సెంటర్ లో 25మందికి మాత్రమే పరీక్షలు చేస్తారు. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లోని జిహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానల్లో ఈ పరీక్షలు చేస్తున్నారు. తర్వలోనే రాష్ట్రవ్యాప్తంగా యాంటీజన్ పరీక్షలు నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. అరగంటలోనే.. మామూలుగా కరోనా నిర్ధారణ కోసం రియల్టైం ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్) పరీక్ష చేస్తారు. అదే మాదిరిగా యాంటీ జెన్ పరీక్షల్లోనూ ముక్కు, గొంతు కలిసే చోట (నాసో ఫారింజియల్ రీజియన్) నుంచి స్వాబ్లతో శాంపిళ్లను తీసుకుంటారు. సేకరించిన శాంపిళ్లను అక్కడిక్కడే పరీక్షించి అరగంటలోనే ఫలితం చెప్పారు. అయితే ఆర్టీపీసీఆర్‌లో వైరస్ జీన్ను గుర్తిస్తే.. ఈ యాంటీజెన్ టెస్టులో వైరస్ ప్రొటీన్ను గుర్తిస్తారు. ఈ పరీక్షలో పాజిటీవ్ వస్తే 84 నుంచి 99శాతం వారి శరీరంలో వైరస్ ఉన్నట్లే నిర్ధారిస్తారు. నెగిటివ్ వచ్చిన వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉంటే అప్పుడు ఆర్టీపీసీఆర్ పద్దతిలో పరీక్షలు చేస్తారు. శరీరంలో 14 రోజులు యాంటీజెన్ ప్రోటీన్.. కోవిద్ వైరస్ సోకిన తర్వాత పది నుంచి 14 రోజుల పాటు యాంటీజెన్  ప్రొటీన్ ఆ వ్యక్తి శరీరంలో ఉంటుంది. లక్షణాల్లేని పేషెంట్లలో పది రోజుల వరకు, లక్షణాలు కనిపించే వారిలో 14 రోజుల వరకూ యాంటీజెన్ ప్రోటీన్ ఉంటుందని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ వివరిస్తున్నాయి. అన్నీ హాస్సిటల్స్ లో.. కరోనా తీవ్రతను అరికట్టాలంటే పరీక్షలు ఎక్కువగా చేస్తూ పాటిజివ్ వ్యక్తులను గుర్తించి వారిని క్వారంటైన్ చేయాలి. వైరస్ వ్యాప్తిని ఈ విధంగా అరికట్టడం సాధ్యమవుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేటెడ్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్) అన్నింటికీ ఈ టెస్టులు చేసే అవకాశం ఇవ్వాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రసవానికి పదిరోజుల ముందు.. కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ అవసరమే. అయితే ముందుగా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారికి, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీలకు ప్రసవానికి పదిరోజుల ముందు ఈ పరీక్ష తప్పనిసరిగా చేయాలి. ఈ పరీక్షతో పాజిటివ్ వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది.

ప్రత్యేక అజెండాతో ధర్మాన.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెనుమార్పు రానుందా?

2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం పీఠంపై కూర్చున్న వైఎస్ జగన్ కి ఒక్క ఏడాదిలోనే తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ అధినేతగా, సీఎం గా రెండు కీలక బాధ్యతల్లో ఉన్న జగన్ కి సొంత పార్టీ నాయకుల ధిక్కార వ్యాఖ్యలు కొంత తలనొప్పిగా మారాయి. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఇది ఇలా ఉండగానే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా జగన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ ధిక్కార స్వరం పెంచుతున్నారు. వీళ్ళను కట్టడి చేయడం జగన్ కి ఇప్పుడు కీలక పనిగా మారింది. వైసీపీలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకుడు. ఆయన రెండున్నర దశాబ్దాల నుండి రాజకీయాల్లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పట్టున్న నేత. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనకు మంత్రి పదవి పక్కా అనుకున్నారు. కానీ ఆయన సోదరుడైన కృష్ణదాస్ కి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో, జిల్లాలో ప్రసాదరావు మాట సాగడం లేదు. చిన్న చిన్న పనుల నుంచి ఇసుక వ్యవహారం వరకు ఏ విషయంలో కూడా ఈయన మాట నెగ్గడం లేదు. అందుకే ఈ మధ్య ఆయన ధిక్కార స్వరం పెంచారు.  తాజాగా "రాష్ట్రంలో జిల్లాలు విభజించుకుంటే చేసుకోండి. శ్రీకాకుళం జిల్లాను మాత్రం విభజించవద్దు. ఇది మాది, మా ప్రజలు అంగీకరించరు. మా జిల్లా ఇలాగే ఉండాలి, సీఎం జగన్ కి మేము ఇదే చెప్తాము. మిగిలిన 12 జిల్లాలను ఏమైనా చేసుకోండి, కానీ మా జిల్లాని వదిలేయండి" అన్నారు. మా ప్రాంతం, మా ప్రజలు అనే భావన వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే, గత నెల కూడా ఆయన ప్రభుత్వంలో పాలన అనుకున్నంత సవ్యంగా లేదని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వని కారణంగానే ధర్మాన ఇలా మాట్లాడుతున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే, ధర్మాన ప్రసాదరావు భవిష్యత్తులో ఓ ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మూడు నెలల కిందట శ్రీకాకుళం లో ఉత్తరాంధ్ర సాధన సమితి సమావేశం జరిగింది. దీనిలో ధర్మాన అనుచరగణం అందరూ పాల్గొన్నారు. దీనికి ధర్మాన పరోక్షంగా పూర్తి మద్దతు పలికారు. దీంతో, ధర్మాన 'ప్రత్యేక ఉత్తరాంధ్ర' అనే ఉద్యమానికి ప్రణాళికలు వేశారని, వచ్చే ఎన్నికలకు ఆయన సొంతంగా ఇదే అజెండాతో వెళ్తారని శ్రీకాకుళంలో చర్చ జరుగుతుంది. ఒకవేళ తనకి పార్టీలో అనుకున్న హోదా దక్కకపోతే, జగన్ నుండి ఇదే తరహా ట్రీట్మెంట్ ఎదురైతే మాత్రం.. వచ్చే ఎన్నికల నాటికి ధర్మాన వైసీపీ తరఫున పోటీ విషయంలో పునరాలోచనలో పడతారని, కొన్ని అజెండాల ఆధారంగా వెళ్తారని అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా మంచి వాగ్ధాటి, వ్యూహాలు ఉన్న ధర్మాన ఇప్పుడు అన్న కృష్ణదాస్ పెత్తనంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ మంత్రిగా గతంలో ఎన్నో ఏళ్ళు జిల్లాలో చక్రం తిప్పిన ఈయనకు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉండడం ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారని అంటున్నారు. మరి భవిష్యత్ లో ఆయన ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

ఇలా జరగడం పట్ల చింతిస్తున్నాను: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రస్తుత సెక్రటేరియట్ భవనాలను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూల్చివేత పనుల వల్ల అక్కడ ఉన్న దేవాలయం, మసీదులకు ఇబ్బంది కలిగింది. సెక్రటేరియట్ భవనాలను కూల్చేస్తున్న సందర్భంగా శిథిలాలు పక్కనున్న దేవాలయం, మసీదులపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. పాత భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రార్థనా స్థలాలను చెడగొట్టడం కాదని తెలిపారు. సచివాలయం ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో ఇంతకన్నా పెద్ద దేవాలయం, మసీదులను నిర్మిస్తామని చెప్పారు. దేవాలయం, మసీదు నిర్వాహకులతో తానే స్వయంగా సమావేశమవుతానని వెల్లడించారు. నిర్మాణాల విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. ఇదిలా ఉంటే, సచివాలయం కూల్చివేతకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని ప్రొఫెసర్ విశ్వేశర్ రావు హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు ఉల్లంగిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని, భవనాలు కూల్చివేయడం వలన వాతావరణం కాలుష్యం అవుతుంద‌ని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, సాలీడ్ వెస్ట్ మ్యానేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని ఆయన అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో సోమ‌వారం వ‌ర‌కు కూల్చివేత ప‌నులు నిలిపివేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.

సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతలను సోమవారం వరకు ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కట్టడాన్ని కూల్చడం సరికాదంటూ హైకోర్డులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవానాల కూల్చివేత వల్ల వచ్చే కాలుష్యం ప్రజలకు ఇబ్బందికరంగా ఉందంటూ పిటిషనర్లు పేర్కొన్నారు. న్యాయవాది చిక్కడు ప్రభాకర్, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన న్యాయ స్థానం సోమ‌వారం వ‌ర‌కు భ‌వ‌నాల కూల్చివేత‌ను ఆపాలంటూ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. సోమవారం మరోసారి విచారణ జరగనుంది. అయితే సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు కూడా సోమవారం విచారణకు రానుంది.