కరోనా విషయంలో ప్రజలెవరూ భయపడొద్దు: సీఎం కేసీఆర్
posted on Jul 17, 2020 @ 5:33PM
కరోనా మహమ్మారి విషయంలో ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా ఉండొద్దని, తగు జాగ్రత్తలను పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు ఇచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్లు వాడాలి. ప్రజలంతా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
కరోనా సోకిన వారు అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎంతమందికైనా చికిత్స అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని సీఎం చెప్పారు. హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్ లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 5 వేల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
తెలంగాణలో కరోనా రికవరీ రేటు 67 శాతంగా ఉందని చెప్పారు. తీవ్రమైన జబ్బులు ఉన్న 200 మంది మినహా మిగిలిన అందరూ కోలుకుంటున్నారని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్సలోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.