మావోయిస్టు అగ్రనేత గణపతికి గ్రీన్ సిగ్నల్!!
posted on Sep 1, 2020 @ 6:40PM
మావోయిస్ట్ అగ్రనేత గణపతి(ముప్పాల లక్ష్మణరావ్) లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసులు స్పందించారు. గణపతి లొంగిపోవాలనుకుంటే స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. బంధువులు, మిత్రుల ద్వారా లొంగిపోవాలనుకున్నా లేదా వేరే ఎవరి ద్వారా లొంగిపోయినా పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. గతంలో లొంగిపోయిన జంపన్న, సుధాకర్ లాంటి వారికి ఏ విధంగా సహకరించామో గణపతికి కూడా అలాగే వ్యవహరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
పునరావాస ప్రక్రియ కింద ఇప్పటి వరకు 1,137 మంది లొంగిపోయారని తెలిపారు. లొంగుబాటు ప్రక్రియకు పూర్తిస్థాయిలో ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్పారు. గణపతికి మానవతా ధృక్పథంతో తాము పూర్తిగా సహాయ, సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు. గణపతితో పాటు వేణుగోపాల్ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. ఇతర మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే సంప్రదించవచ్చని తెలంగాణ పోలీస్ శాఖ భరోసా ఇచ్చింది.