కరోనా లక్షణాలు లేని వారి వల్లే
posted on Sep 1, 2020 @ 10:03AM
రోజురోజుకు విజృంభిస్తున్న కోవిద్ 19 వైరస్ వ్యాప్తి వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇందుకు కారణాలు అన్వేషిస్తున్న వైద్యబృందం, పరిశోధకులు సరికొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. వైద్యపరీక్షల సంఖ్య పెంచడంతో బయటకు వచ్చిన అంశాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
తెలంగాణలో కరోనా పాజిటివ్ గా నమోదు అయినవారిలో 69శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైద్యాధికారులు వెల్లడించారు. కేవలం 31శాతం మందిలో మాత్రమే కరోనా లక్షణాలు కనిపించాయంటున్నారు. అయితే లక్షణాలు లేనంత మాత్రాన వారి నుంచి ఇతరులకు వైరస్ సోకదు అని కచ్ఛితంగా చెప్పలేమని అంటున్నారు. లక్షణాలు కనిపించని వారి వల్ల కూడా వైరస్ వ్యాపిస్తోందని స్పష్టం చేశారు. లక్షణాలు లేని వారు తమకు తెలియకుండానే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని వైద్యాధికారుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే కుటుంబంలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండడానికి ఇదే కారణమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,24,963 మంది కరోనా బారినపడగా వారిలో 86,225 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని వెల్లడించారు.
తెలంగాణలో ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులుంటే అందులో 24,216 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మిగతావారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.