ఆ ప్రతిష్టాత్మక పథకం టీఆర్ఎస్ పరువు తీసే పథకంలా మారిపోతోందా!!

టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం.. ఆ పార్టీ పరువు తీసే పథకంలా మారిపోతోంది. రెండున్నర లక్షల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి ఐదేండ్లు పూర్తైయినా.. అందులో ఐదు శాతం మాత్రమే పంపిణి చేశారు. ఇండ్ల నిర్మాణంలో ఆలస్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు ఉద్యమాలు కూడా చేస్తున్నాయి. ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ప్రారంభానికి ముందే డబుల్ బెడ్ రూం ఇండ్ల స్లాబ్స్ పెచ్చులూడుతుండడం దుమారం రేపుతోంది. రామకృష్ణా పురం పంచాయతీ పరిధి హరిచంద్రపురం గ్రామం గుట్టల సమీపంలో 50 డబుల్బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి ఐటీడీఏ రూ.5.40 లక్షలు కేటాయించింది. ఇండ్ల నిర్మాణాన్ని ఆర్వీఎం ఇంజనీరింగ్ ఆఫీసర్లకు అప్పజెప్పింది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు పూర్తి చేశాడు. ఇండ్ల నిర్మాణం పూర్తయినా ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. బిల్డింగ్ స్లాబ్ మీద చేతితో తీస్తుంటే పెచ్చులూడుతోంది. లోపల అర ఇంచు మందం సిమెంట్ లేకుండా పూర్తిగా ఇసుక మాత్రమే తేలుతుంది.   స్లాబ్ పెచ్చులూడిపోయిన విజువల్స్ ను .. కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. సీఎం కేసీఆర్ పనితీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. బంగారు తెలంగాణలో ఇండ్లు ఇలాగే నిర్మిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాణ్యతపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎలా ఉండాలంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ తో పాటు స్థానికులు  డబుల్బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఆందోళన చేశారు. నాణ్యతా లోపంతో నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పంపిణి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాసిరకంగా ఉన్నాయని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో  వరద నీరు ఇండ్లలోకి చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షానికి నీరు గోడలపై కారింది. మరికొన్ని చోట్ల స్లాబు, గోడలకు పగుళ్లు వచ్చాయి.    కామేపల్లి  ఘటనతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర ఇండ్ల నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బిల్లులు సమయానికి రాకపోవడం కారణమంటున్నారు. బిల్లులు రాకపోవడంతో విసిగిపోతున్న కాంట్రాక్టర్లు.. నాసిరకంగా నిర్మాణాలు చేసి చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లు.. అడ్డగోలుగా ఇండ్లు నిర్మిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.

కరోనా జాతి వైరస్ లన్నీంటికీ చెక్

వ్యాక్సిన్ రెడీ చేస్తున్న కేంబ్రిడ్జీ వర్సిటీ   కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం. వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా కోవిద్ 19 పేరు పెట్టారు. ఇది కరోనాకుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. ఈ కొత్త జాతి వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.  పనిలో పనిగా కరోనా జాతిలోని అన్ని వైరస్ లకు చెక్ పెట్టేందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధనలు నిర్వహిస్తోంది.   కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్ ల జన్యువులను ఉపయోగించి డీఐవోఎస్‌-కోవాక్స్‌2 అనే వ్యాక్సిన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని కేంబ్రిడ్జి పరిశోధనబృందం తెలిపింది. ఈ వ్యాక్సిన్ పై ప్రయోగాలు పూర్తి అయ్యాయని క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే నిర్వహించాల్సి ఉన్నదని వెల్లడించారు. ట్రయల్స్‌ విజయవంతమైన తర్వాత రోగులకు ఏ మాత్రం నొప్పి కలుగకుండా ‘స్ప్రింగ్‌ పవర్డ్‌ జెట్‌ ఇంజిక్షన్‌' (సూది లేకుండా టీకాను శరీరంలోకి ఎక్కించడం) ద్వారా వ్యాక్సిన్ ఇస్తామంటున్నారు ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జోనథాన్ హీనే.   కరోనా వైరస్ శ్వాసవ్యవస్థపై  తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 1960ల్లో ఈ వైరస్ ని కనుగొన్నారు. ఇప్పటి వరకూ  ఆరు రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. హ్యూమన్‌ కరోనావైరస్‌ 229ఈ, హ్యూమన్‌ కరోనావైరస్‌ ఓసీ 43, సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌-సీఓవీ), హ్యూమన్‌ కరోనావైరస్‌ ఎన్‌ఎల్‌ 63, హ్యూమన్‌ కరోనావైరస్‌ హెచ్‌కేయూ 1, మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌ (మెర్స్‌-సీఓవీ).  ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపిస్తాయి.   అయితే కొత్తగా వచ్చిన కోవిద్ 19 వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ సోకినప్పుడు తేలికపాటి లక్షణాలతో ప్రారంభమై వ్యాధి తీవ్రరూపం దాల్చి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ రకమైన వైరస్ సోకిన వారిలో 10 నుంచి 20శాతం మందికి చికిత్స అవసరం అయితే రెండు నుంచి మూడు శాతం మంది మరణిస్తారు. అలాంటి కొత్త వైరస్ కొవిడ్‌-19 నిర్మాణాన్ని 3డీ కంప్యూటర్‌ మోడలింగ్‌ ద్వారా  విశ్లేషించి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ఇప్పడు ప్రపంచమానవాళి ఎదుర్కోంటున్న సమస్యనే కాకుండా భవిష్యత్‌లో జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశమున్న సార్స్‌, మెర్స్‌ వంటి కరోనా జాతి వైరస్‌ రకాలను కూడా కట్టడి చేసేలా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు కేంబ్రిడ్జి పరిశోధనకులు. ఇందుకోసం కరోనా జాతి వైరస్‌ జన్యు క్రమాలను కూడా విశ్లేషించారు. సింథటిక్‌ డీఎన్‌ఏ, 3డీ కంప్యూటింగ్‌ సాంకేతికత సాయంతో అభివృద్ధి చేసిన తమ వ్యాక్సిన్‌ అన్ని రకాల కరోనా వైరస్‌లను కట్టడి చేయగలుగుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త డాక్టర్‌ రెబెకా కిన్స్‌లే వెల్లడించారు. ప్రపంచ మానవళికి కరోనా వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండేలా అత్యంత తక్కువ ధరలోనే తీసుకువస్తామంటున్నారు.

అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు శుక్రవారం మంజూరు చేసింది.    ఈఎస్ఐ అవకతవకల కేసులో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. గత 70 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోజుల వ్యవధిలో రెండుసార్లు శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇటీవల ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. ప్రస్తుతం ఆయన మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని  దరఖాస్తు చేయగా గతంలో న్యాయస్థానం తిరస్కరించింది. మరోసారి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.    మూడు రోజుల క్రితమే వాదనలు జరగగా.. తీర్పు ఇవాళ ఇస్తామని హైకోర్టు పేర్కొంది. కొద్ది సేపటి క్రితమే అచ్చెన్నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ. 2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ మంత్రి సొంత ఊళ్ళో పేకాట క్లబ్ పై పోలీసుల దాడి.. మంత్రి సోదరుడి పై కేసు

అది ఓ ఏపీ మంత్రి స్వగ్రామం. దాని పేరు గుమ్మనూరు. ఇది కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియాజకవర్గంలో ఉంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది సాక్షాత్తు మంత్రి గుమ్మనూరు జయరాం. ఇక్కడ గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా పేకాట క్లబ్ నడుస్తోంది. అయితే తాజాగా కర్నూలు జిల్లా పోలీసులు ఏఎస్పీ గౌతమి ఆధ్వర్యంలో ఆ పేకాట క్లబ్ గుట్టు రట్టు చేశారు. మూడు ఆటోల్లో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు జరిపిన ఈ దాడిలో.. డజన్లకొద్దీ కార్లు, టూవీలర్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పేకాట క్లబ్ పై దాడి చేసిన పోలీసులపై గూండాలు ఎదురు దాడి చేసి వారు ఎక్కి వచ్చిన ఆటోలను ధ్వంసం చేశారు.   అయితే పోలీసుల పై గుండాలు దాడి చేసిన సమాచారంతో అక్కడికి మరి కొన్ని పొలిసు బలగాలు చేరుకుని లాఠీ ఛార్జ్ చేయడంతో గుండాలు పరారయ్యారు. అయితే పేకాట నిర్వహిస్తున్న షెడ్ దగ్గరలో పేకాటరాయుళ్లు మధ్యలో వదిలేసిన రూ.5.34 లక్షలు న‌గ‌దును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ పేకాట షెడ్ లో ఏపీలో నిషేధించిన ఖరీదైన లిక్కర్ బ్రాండ్లన్నీ దొరికాయి. ఈ లిక్కర్ ను ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక లోని బళ్లారి నుండి లారీలలో తెస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్న మంత్రి జయరాం కు సోదరుడు నారాయణ పై.. అలాగే మంత్రి అనుచరులు శ్రీధర్, జగన్ లపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దాడికి పాల్పడ్డ ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారని ఏఎస్పీ గౌతమి తెలిపారు.

ఆ టీడీపీ ముఖ్య నేతకు కరోనా... త్వరలో కరోనాను జయించి వస్తా అంటూ ట్వీట్

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజల నుండి ముఖ్య నేతల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కూడా వైరస్ సోకుతోంది. తాజాగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్న కరోనా బారిన పడ్డారు. అనుమానంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉంటూ ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో కొన్ని రోజుల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటానని కూడా ఆయన తెలిపారు.    "నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్లు సూచించారు. ఈ 14 రోజులు రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను' అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేసారు.   ఎపుడు ఉప్పు నిప్పులాగా ట్విటర్ వేదికగా ఫైట్ చేసుకునే వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి కొద్దీ రోజుల క్రితం కరోనా సోకి హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ తో కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో విజయసాయి త్వరగా కోలుకోవాలని బుద్ధా వెంకన్న ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా అయన ట్విట్టర్ ప్రత్యర్థి టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా కరోనా బారిన పడ్డారు.

అండమాన్ ఆదిమవాసులను వదలని కరోనా..

ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన కరోనా మన దేశంలోను విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా పల్లెటూళ్లను, నగరాలను కూడా చుట్టబెడుతోంది. అయితే తాజాగా ఈ వైరస్ సుదూర అటవీ ప్రాంతం లోనూ విస్తరిస్తోంది. సామాన్య మానవులకు అందనంత దూరంలో ఉండే ఆదిమ జాతి తెగలోనూ కరోనా తన పంజా విసురుతోంది. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లోని ఆదిమ మానవులకు కరోనా సోకిందని అక్కడి అధికారులు తెలిపారు. అక్కడి గ్రేటర్ అండమానిస్ తెగలోని 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.    ఈ కరోనా బాధితులంతా స్ట్రెయిట్ దీవి వాసులే. ఈ తెగలోని కొందరు రాజధాని పోర్ట్ బ్లెయిర్ వెళ్లడంతో అక్కడి అధికారులు వారికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో ఆరుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారు నివాసం ఉంటున్న స్ట్రెయిట్ దీవికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించగా మరో నలుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. అయితే మొత్తం కలిపి 50 మంది జనాభా ఉన్న ఆ దీవిలో ఏకంగా పది మందికి కరోనా సోకడంతో అక్కడి వారిలో ఆందోళన నెలకొంది.  

టీడీపీ కార్యాలయం పై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ  

గుంటూరు లో కొత్తగా నిర్మించిన టీడీపీ ప్రధాన కార్యాలయం అక్రమ నిర్మాణం అంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆఫీసు కోసం వాగు పోరంబోకుకు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబరు 228ని సవాలు చేస్తూ ఆళ్ల ఈ పిటిషన్‌ వేశారు.    మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం 99 సంవత్సరాల లీజు కింద భూమిని కేటాయించిందని.. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని అయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో నీటి వనరులకు సంబంధం ఉన్న భూములను కేటాయించడంపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించారని పిటిషన్‌లో అయన ప్రస్తావించారు. అక్కడ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినందున చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని... అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలని అయన కోర్టును కోరారు.    అయితే గతంలో కూడా దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టేసిన సంగతి తెలిసిందే.

నవంబర్ 15 నుంచి రామగుండం ఎరువుల ఉత్పత్తి ప్రారంభం

అతిత్వరలో రామగుండం ఎరువులు అందుబాటులోకి   నవంబర్ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభం   కిసాన్ పేరుతో విడుదల   99.5 శాతం పనులు పూర్తి   వెయ్యిమందికి ఉపాధి   తెలంగాణ రైతుల ఎరువుల వేతలు ఇక మాయం   తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎరువుల వెతలు అతి త్వరలో తీరనున్నాయి. ఎరువుల కొరత తీర్చే ప్రతిష్టాత్మక రామగుండం ఫ్యాక్టరీ అతి త్వరలో ప్రారంభం కానుంది.   ఇప్పటికే 99.5శాతం పనులు పూర్తి కాగా పాయింట్ ఐదుశాతం పనులు పూర్తి కావడానికి రెండునెలల సమయం పట్టనుంది. నవంబర్ 15 నుంచి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులు కిసాన్ బ్రాండ్ పేరుతో మార్కెటులోకి రానున్నాయి.రూ.6,120.55 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కర్మాగారంలో ప్రతిరోజూ 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుంది.   గతంలో మూతపడిన ఎరువుల కర్మాగారం స్థానంలోనే గ్యాస్‌ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్ఎల్‌), ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌), ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌సీఐల్‌)తో జాయింట్‌ వెంచర్‌గా ఈ ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారు.  ఈ ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారా, నీటి వనరులను గోదావరి నది పై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుండి అందిస్తారు.   రాష్ట్ర అవసరాలకే  మొదటి ప్రాధాన్యత రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన యూరియా సగం తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు వినియోగిస్తారు. ప్రాజెక్ట్ ల్లో నీరు  సమృద్ధిగా ఉండటం, చెరువులు జలకళతో కళకళలాడటంతో తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం 10లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర అవసరాల మేరకు కావల్సిన  యూరియాను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దాంతో ఎరువుల కొరత ప్రతిఏడు రైతులను ఇబ్బంది పెడుతోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీరనుంది.   నాలుగు దశాబ్దాల కిందట .. రామగుండం 1980లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం మొదటి నుంచి  అనేక సమస్యలను ఎదుర్కోంటూ 18 సంవత్సరాలు ఎరువులను అందించింది. మూడువెల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రారంభమైనప్పటికీ బొగ్గు కొరత కారణంగా రోజుకు 1500 టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది.  నష్టాలభారం, కార్మిక సమస్యల కారణంగా ఎక్కువ రోజులు ఈ పరిశ్రమ మనుగడ సాగలేదు. ఆ తర్వాత క్రమేణా 750 టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలగడంతో  నష్టాల భారం పెరిగింది. ఆసియాలోనే ప్రయోగాత్మకంగా బొగ్గు ఆధారంగా ఎరువులు తయారు చేసే ఈ కర్మాగారాన్ని  1992లో బీఐఎఫ్ఆర్‌ ఖాయిలా పరిశ్రమగా ప్రకటించి,  1999 లో మూసివేశారు.   మూతపడ్డ 20ఏండ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దానికి సాంకేతికతను అందించి గ్యాస్‌ ఆధారిత ఫ్యాక్టరీగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో కంపెనీని ప్రారంభించారు. బొగ్గు గనులతోపాటు వెలుగులు నింపే ఎన్టీపీసీవంటి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉండడంతో రామగుండానికి మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు వచ్చింది. మూతపడ్డ 20 ఏళ్ళ తర్వాత ‘రామగుండం ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ స్థానంలో కొత్తగా ‘రామగుండం ఫర్టిలైజర్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌’ పేరుతో 2016లో కొత్త యూనిట్‌ నిర్మాణ పనులు చేపట్టారు. గ్యాస్‌ సరఫరా చేసేందుకుగాను ఏపీలోని కుంచనపల్లి నుంచి 360 కిలోమీటర్ల మేర గ్యాస్‌ పైపులైన్లు వేశారు. గ్యాస్‌ సరఫరాలో ఏదైనా అంతరాయం గానీ, ప్రమాదాలు గానీ జరిగినప్పుడు నియంత్రించేందుకు 15 చోట్ల ఎస్‌వీ స్టేషన్ల (గ్యాస్‌ నియంత్రణ ప్రదేశాలు) నిర్మించారు.   వచ్చే నెలలో ఫ్యాక్టరీని సందర్శించనున్న కేంద్రమంత్రి రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటులో జరుగుతున్న పనులపై అధికారులతో  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గురువాతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 99.5శాతం పనులు పూర్తి అయ్యాయని మరో రెండునెలల్లో మిగతా పనులు పూర్తి అవుతాయని అధికారులు వివరించారు. సెప్టెంబర్ నెలలో ఫ్యాక్టరీని సందర్శిస్తానని మంత్రి చెప్పారు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో సగం తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తామని, మిగతా సగం ఇతర రాష్ట్రాల రైతులకు అందిస్తామని ఆయన అన్నారు.

గ్రేటర్ లో కేటీఆర్ దూకుడు.. బల్దియా పీఠమే టార్గెట్?

గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెంచారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. కొన్ని రోజులుగా వరుస సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. కరోనా భయపెడుతున్నా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జోరుగా చేస్తున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయిస్తూ.. ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీపలే పలు ఫ్లైఓవర్లు, స్లిప్ రోడ్లను ప్రారంభించారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్ పై పెద్దగా దృష్టి సారించని కేటీఆర్.. సడెన్ గా స్పీడ్ పెంచడానికి త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికలే కారణమంటున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి కాల పరిమితి జనవరిలో ముగియనుంది. అంటే మరో నాలుగు నెలల్లో గ్రేటర్ బల్దియా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మళ్లీ గ్రేటర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేటీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే సిటీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్నా... జోరుగా జనంలోకి వెళుతున్నారు మంత్రి. స్థానిక సమస్యలపై ఫోకస్ చేయాలని గ్రేటర్ నేతలను అలెర్ట్ చేశారు.   గ్రేటర్ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులకు టార్గెట్ పెడుతున్నారు కేటీఆర్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. బాలాపూర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ల పనులను వేగంవంతం చేసేలా చర్యలు చేపట్టారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపైనా కేటీఆర్ ఫోకస్ చేశారు. గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీనే గులాబీ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. రెండేళ్లలో లక్షన్నర ఇండ్లు కట్టిస్తామని కేటీఆర్ చెప్పడంతో జనాలు నమ్మారు. ఏకపక్షంగా కారు పార్టీకి జై కొట్టారు. దీంతో  జీహెచ్ ఎంసీలో గతంలో ఎప్పుడు లేనంతగా, ఎవరూ అంచనా వేయనంతగా 99 డివిజన్లు గెలిచింది టీఆర్ఎస్. అయితే ఐదేండ్లు కావస్తున్నా ఇండ్ల హామీని అమలు చేయలేకపోయింది. ఇప్పటివరకు నాలుగు వేల ఇండ్లు మాత్రమే పంపిణి చేశారు. మరో లక్ష వరకు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే నిధులు లేక కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో ఇండ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొన్ని బస్తీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామంటూ ఉన్న ఇండ్లను కూల్చేశారు. దీంతో వారంతా రోడ్డున పడ్డారు. ఐదేండ్లైనా ఇళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా తమకు ఇండ్లు ఇవ్వాలంటూ బల్దియా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.   గ్రేటర్ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అంశం తమకు నష్టం కలిగిస్తుందని ఊహించిన కేటీఆర్ ముందే అప్రమత్తమయ్యారు. గ్రేటర్ పరిధిలోని ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయించారు. అధికారులకు టార్గెట్ పెట్టి మరీ పనులు పరుగులు పెట్టిస్తున్నారు. డిసెంబర్ లోగా 85 వేల ఇళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రేటర్‌ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల ఇళ్ల చొప్పున పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. విపక్షాలు మాత్రం కేటీఆర్ తీరుపై మండిపడుతున్నాయి. తప్పుడు హామీలతో పేదలను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఐదేండ్లు పట్టించుకోకుండా మళ్లీ ఎన్నికల వేల హడావుడి చేస్తూ మరోసారి గ్రేటర్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.

విశాఖలో గెస్ట్ హౌస్ పై ఒక పక్క హైకోర్టులో విచారణ.. మరో పక్క భూమి కేటాయింపు జీవో జారీ

విశాఖలో నిర్మించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ కోసం ఏపీ సర్కారు 30 ఎకరాలు జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ జీవో జారీ చేసింది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాపులుప్పాడ గ్రేహౌండ్ భూముల్లో ఈ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను రద్దును సవాల్ చేస్తూ అమరావతి రైతులతో పాటు పలు సంఘాలు హైకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెల్సిందే. దీంతో హైకోర్టు ఈ అంశం పై స్టేటస్ కో విధించింది.    మరో వైపు స్టేటస్ కో ఉన్న సమయంలో కూడ విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం శంకుస్థాపన చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఒక న్యాయవాది ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటలలోనే విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కాపులుప్పాడ కొండపై 30 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ ఏపీ ప్రభుత్వం 1353 జీవో జారీ చేస్తూ.. దీన్ని అత్యవసరంగా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంది.

విజయసాయి వెన్నుపోటు కామెంట్ల పై బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్

కరోనా నుండి కోలుకున్న తరువాత విజయ సాయిరెడ్డి మరింత రెచ్చిపోయి చంద్రబాబు పైన దాడిని తీవ్రం చేసారు. తాజాగా వెన్నుపోటు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. "బాబు గారి వెన్నుపోటు మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మోగింది అంటూ ట్వీట్ చేశారు. పాపం పండి బాబు పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే రాజకీయాల నుంచి కూడా నిష్క్రమణ తప్పదని హస్తినలో అనుకుంటున్నారని" పేర్కొన్నారు. "వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబూ, కానీ మీరు ఆంధ్రా ఔరంగజేబ్ గా కలకాలం గుర్తుండిపోతారు... పెద్దాయన సాక్షిగా!" అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అయితే ఈ ట్వీట్ కు కౌంటర్ గా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసారు. "వెన్నుపోట్లలో బాత్ రూమ్ పోట్లు వేరయా! సోనియమ్మకు వెన్నుపోటు, వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు అంటూ విమర్శించారు. అంతేకాకుండా "తండ్రీకొడుకులకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే భక్షించిన వెన్నుపోటుదారుడు జగన్ ను నమ్మితే అంతేనంటూ ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారట!" అంటూ బుద్ధా వెంకన్న ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి శత మొట్టికాయ ఉత్సవం!!

అమరావతి రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరుగుతుందని నర్సాపురం వైసీపీ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కళ్లుండి మనసులేని ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను కళ్లు లేని మనసున్న న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. న్యాయం పూర్తిగా అమరాతి రైతుల పక్షాన నిలుస్తుందన్నారు. న్యాయం జరుగుతుందన్న మనోధైర్యంతో మహిళలు, రైతులు ముందుకువెళుతున్నారని అన్నారు. గాంధేయమార్గంలో న్యాయంకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.   అన్యాయంపై అమరావతి రైతులు పాక్షికంగా విజయం సాధించారన్నారు. స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి పూనుకోవడం దుస్సాహసమేనని వ్యాఖ్యానించారు. ప్రముఖ న్యాయవాదులు తమవైపు వాదించడానికే కాదు.. వాదించకుండా ఉండటానికీ జగన్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయాలు వెచ్చిస్తోందని రఘురామరాజు ఆరోపించారు. ప్రజాధనం వృథా చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు.    పనికిరాని వారిని అందరినీ తెచ్చి సలహాదారులుగా పెట్టుకున్నారని రఘురామరాజు ఎద్దేవా చేశారు. న్యాయపరమైన విషయాల్లో సీఎం జగన్‌కు సలహాలు ఇచ్చేవారు లేరనుకుంటానని, సీఎం అనవసరంగా పడి ఉన్న సలహాలదారులును తప్పించి.. మంచి వారిని న్యాయ సలహాదారులగా పెట్టుకోవాలని రఘురామరాజు సూచించారు.   త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి శత మొట్టికాయ ఉత్సవం జరుగుతుందని ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోర్టుల్లో 70కి పైగా మొట్టికాయలు పడినప్పుడు తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరముందని అన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శత మొట్టికాయ ఉత్సవం ఎంతో దూరంలో లేదనిపిస్తుందని పేర్కొన్నారు. నీలం సంజీవరెడ్డి, ఎన్‌ జనార్థన్‌రెడ్డి హయాంలో కోర్టులు చిన్న కామెంట్‌ చేశాయని రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.   ఈ భూమ్మీద ఎక్కడా లేని చిత్రవిచిత్ర బ్రాండ్లన్నీ ఏపీలోనే అమ్ముతున్నారని మండిపడ్డారు. గోల్డ్ మెడల్ లు, ప్రెసిడెంట్ మెడల్స్, నోబెల్ ప్రైజ్ వంటివి అమ్ముతున్నారని, ప్రజలు ఈ మెడల్స్ స్వీకరించవద్దు అని ఆయన కోరారు. ఎస్పీ వై రెడ్డి ఫ్యాక్టరీ లీజుకి తీసుకుని ఇలాంటి బ్రాండ్లను తయారు చేస్తున్నారన్నారని ఆరోపణలు చేశారు. ఇలాంటి బ్రాండ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని రఘురామరాజు వ్యాఖ్యానించారు.

జగన్ సర్కార్ కు మరో షాక్.. టీడీపీ నేతలకు ఊరట

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. టీడీపీ నేతలకు సంబంధించిన గ్రానైట్ క్వారీల లీజుల రద్దు విషయంలో.. లీజ్ రద్దు నోటీసును హైకోర్టు ఏకంగా డిస్మిస్ చేసింది.   ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే పోతుల రామారావులకు సంబంధించిన గ్రానైట్ క్వారీల లీజులు రద్దు చేస్తూ ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్వారీయింగ్‌లో లోపాలు ఉన్నాయని ఇద్దరు నేతల క్వారీల లీజు రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాలపై టీడీపీ నేత పోతుల రామారావు హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షతోనే లీజులు రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగా లేవని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు రాజధానుల కేసులో సీఎం జగన్ తో పాటు ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు 

సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఏపీ సర్కార్ ఈ విషయంలో అడుగు ముందుకు వేయడం అటుంచి.. రోజూ తన పరువును పోగొట్టుకుంటోంది. తాజాగా మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఈ కేసులో ఏకంగా సీఎం జగన్ తో పాటు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.    ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తోందంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లాగా, అధికారంలోకి రాగానే మరో లాగా జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. దీని పై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదే విషయం పై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు దాఖలు చేసారు. ఈ పిటిషన్ల పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మొత్తం పిటిషన్లన్నిటికి కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ప్రతి పిటిషన్ కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ, బీజేపీలకు కూడా కోర్టు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సెప్టెంబర్ 21వ తేదీ వరకు స్టేటస్ కోను పొడిగిస్తున్నామని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ పిటిషన్ పై ప్రతి రోజూ విచారణ జరుపుతామని కూడా చెప్పింది. అయితే ఈ విచారణను ప్రత్యక్షంగా నిర్వహించాలా? లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలా? అనే విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.

మానవతావాది సర్ డోరాబ్జీ టాటా

సర్ డోరాబ్జీ టాటా ( 27 ఆగస్టు 1859 - 3 జూన్ 1932)   టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల విస్తరణలో కీలక వ్యక్తి సర్ డోరాబ్జీ టాటా. భారతీయ పరిశ్రమ పితామహుడుగా పేరుగాంచిన తన తండ్రి ఆశయాల మేరకు  టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలను అభివృద్ధి చేశారు. పారిశ్రామిక రంగంలో చేసిన కృషికి గాను బ్రిటిష్ ప్రభుత్వం 1910లో సర్ బిరుదు ఇచ్చింది.   డోరాబ్జీ టాటా 27 ఆగస్టు 1859 న ముంబయిలో జన్మించాడు. తల్లిదండ్రులు హీరాబాయి, జమ్సెట్టీ టాటా. పెద్దకుమారుడైన డోరాబ్జీ తన ప్రాథమిక విద్యను ముంబయిలో పూర్తి చేసి 1875లో ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిధిలోని గోన్విల్లే, కైస్ కాలేజీ లో చేరాడు. ఆ తర్వాత ఇండియా తిరిగివచ్చి ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిగ్రీ పట్టా అందు కున్నాడు.   జర్నలిస్టుగా.. రచనరంగంపై ఆసక్తి, సమాకాలీన అంశాలపై అనురక్తితో జర్నలిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. బొంబాయి గెజిట్ లో రెండు సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1884లో తన తండ్రి సూచనల మేరకు వ్యాపారరంగంలోకి వచ్చారు. మొదట కాటన్ పరిశ్రమ విభాగంలో చేరాడు. దేశంలో కాటన్ పరిశ్రమల ఏర్పాటు ఎక్కడ లాభసాటిగా ఉంటుందో తెలుసుకోవడానికి పాండిచ్చేరి, ఫ్రెంచ్ కాలనీ, నాగ్ పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు.   టాటా, భాభా కుటుంబాల మధ్య బంధుత్వం వ్యాపార విస్తరణలో భాగంగా అనేక నగరాలను సందర్శించిన డోరాబ్జీ మైసూర్ పట్టణానికి వెళ్లారు. ఆ రాష్ట్ర మొదటి ఇండియన్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ హోర్మస్టీ భాభాను కలిశారు. ఆ తర్వాత ఆయన ఏకైక కుమార్తె మెహర్ బాయితో డోరాబ్జీ పెండ్లి జరగడంతో టాటా, భాభా కుటుంబాల మధ్య వారధి ఏర్పడింది. ప్రముఖ శాస్త్రవేత్త హోమి జె. భాభా మెహర్ బాయి మేనల్లుడు. భాభా పరిశోధనా సంస్థలకు టాటా గ్రూప్ నిధులను కేటాయించడానికి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వమే కారణం.   తండ్రి ఆశలకు అనుగుణంగా.. భారతదేశంలో "స్వదేశీ ఉద్యమానికి  జమ్సెట్టీ టాటా ఎంతో కృషి చేశారు. దేశీయ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించేలా తన కాటన్ మిల్లుకు “స్వదేశీ మిల్” అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇనుము, ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ఎంతగానో శ్రమించారు. అయితే ఆయన కృషి ఫలించలేదు. తండ్రి ఆశయం గురించి తెలిసిన డోరాబ్జీ ఇనుము పరిశ్రమ స్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. 1903లో శపూర్ జీ షక్లత్ వాలాతో కలిసి ఇనుము పరిశ్రమ ఏర్పాటుకోసం సరైన ప్రదేశం కోసం వెతికారు. ఒకవైపు ఇనుము పరిశ్రమ కోసం కృషి చేస్తున్న సమయంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించారు. ఇది డోరాబ్జీని బాగా కృంగ దీసింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా పరిశ్రమ స్థాపన కోసం పెట్టుబడులను సేకరించడానికి అనేక సంస్థలను పెట్టుబడుల కోసం సంప్రదించారు. 1906లో లండన్ సంస్థలను కూడా పెట్టుబడులు పెట్టాలని కోరారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వదేశీ పెట్టుబడులతోనే పరిశ్రమను స్థాపించే ప్రయత్నం చేశారు. ఆయన సంకల్పం ఫలించి మూడువారాల్లోనే పరిశ్రమ స్థాపనకు కావల్సిన పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం జార్ఘండ్ లో జంషేడ్ పూర్ లో ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ ను సింబల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియాగా మార్చే ప్రయత్నం చేశారు. 1911లో ఇక్కడి నుంచి ఇనుము ఉత్తత్పి ప్రారంభం అయ్యింది.   ఈ తర్వాత మరోసారి  1924లో పరిశ్రమ ను కొనసాగించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.  డోరాబ్జీ తన ఆస్తులన్నీ పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టి పరిశ్రమను నిలబెట్టారు. ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వేతనాలు కట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈనాడు ఈ పరిశ్రమలో వేలాది మంది పనిచేస్తున్నారు. స్వదేశీ ఇనుము తయారు చేయాలన్న తండ్రి ఆశయాలను డోరాబ్జీ నిజం చేశారు.   ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. డోరాబ్జీ టాటాకు క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. టాటా గ్రూప్ సంస్థల నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేవారు. అంతేకాదు భారతీయ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1924లో ఎన్నికైయ్యారు.  పారిస్ లో జరిగిన ఒలంపిక్స్ వెళ్లేందుకు భారత బృందానికి ఆర్థిక సహాయం అందించారు.   మెహర్ బాయి మెమోరియల్ గా.. డోరాబ్జీకి భార్య అంటే చాలా ప్రేమ. 1931లో మెహర్ లుకేమియా బారిన బడి మరణించారు. వారికి పిల్లలు లేరు. భార్యపై ఉన్న ప్రేమతో లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించారు. పరిశోధనలు, ప్రకృతి వైపరీత్యాల కోసం ఈ ట్రస్ట్ ఫండ్ ఇస్తుంది. భారతదేశంలోని అనేక విద్యాసంస్థలకు ఈ ట్రస్ట్ నుంచి నిధులు కేటాయిస్తారు. మానవాతావాదిగా, పారిశ్రామిక వేత్తగా పేరుగాంచిన డోరాబ్జీ 3 జూన్ 1932లో జర్మనీలోని బాడ్ కిస్సింగెన్‌లో మరణించాడు.

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ.. తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు రానుందా?

వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. వివిధ రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకుంటూ దూసుకుపోతుంటే.. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో రోజురోజుకి ప్రభ కోల్పోతుంది. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ఆ పార్టీని బాగా దెబ్బ తీస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతని దూరం చేసుకొని.. రాష్ట్రంలో అధికారంతో పాటు, కొంత బలాన్ని కూడా కోల్పోయింది. ఇక, రాజస్థాన్ లో కూడా కీలక నేత సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనని తిరిగి దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ నానా తంటాలు పడాల్సి వచ్చింది.   నిజానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీని ఢీ కొట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ కీలక పాత్ర పోషించారు. అయితే యువనాయకులైన వీరిని కాదని రెండు రాష్ట్రాల్లోనూ సీనియర్లకు సీఎంలుగా అవకాశమిచ్చింది హైకమాండ్. ఈ నిర్ణయంపై సింధియా, సచిన్ వర్గాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. సీనియర్లతో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. అయితే సీనియర్లు మాత్రం వీరి మార్క్ కనిపించకుండా చేయడం, వీరి వర్గాలను ఎదగనివ్వకుండా చేయడంతో.. యువ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో సింధియాని కోల్పోయిన కాంగ్రెస్ సచిన్ ని మాత్రం కాపాడుకోగలిగింది.   అయితే, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ తీరు మారట్లేదు. ఇప్పుడు ఈ సీనియర్ల, జూనియర్ల  పోరు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే పార్టీలో కొనసాగాలని, లేదంటే ప్రాంతీయ పార్టీని స్థాపించి ముందుకు సాగాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.    రేవంత్ రెడ్డిని తెలంగాణలోని సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వి. హనుమంతరావు, జగ్గారెడ్డి వంటివాళ్లు బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాలో పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా ఓకే కానీ, రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే అంగీకరించబోమని పలువురు సీనియర్లు చెబుతున్నారు.    ఒక రకంగా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి అంత అనుకూల వాతావరణం లేదు. తనతో పాటు పార్టీలో చేరినవారికి కూడా తగిన ప్రాధాన్యం లేదనే ఆసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు సాగాలనే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఆయన కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి నేతలు తగిన సహకారం అందించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.    ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ సర్వే పూర్తిగా క్షేత్ర స్థాయికి వెళ్లి చేయలేదు.15 మందితో ఆ సర్వే చేయించారని సమాచారం. రేవంత్ రెడ్డి ఆలోచనకు దక్షిణ తెలంగాణ నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ఉత్తర తెలంగాణ నుంచి అంతగా మద్దతు లభించడం లేదని సర్వేలో తేలినట్లు సమాచారం. గతంలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి అనుకూల వాతావరణం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అనుకూల వాతావరణం ఉందని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో విస్తృత స్థాయి సర్వేకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 150 మందితో సర్వే చేయించాలని, ఒక్కొక్కరికి పది మంది చొప్పున కేటాయించాలని 15 మందితో కూడిన బృందం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. దానికి రేవంత్ రెడ్డి నుంచి ఆమోదం లభించాల్సి ఉందని సమాచారం.   అసలే, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని కాంగ్రెస్ బలంగా ఎదుర్కోలేకపోతోంది. దానికితోడు బీజేపీ తెలంగాణలో బలపడటానికి పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో సీనియర్లు, జూనియర్ల విభేదాలు ముదిరి రేవంత్ కాంగ్రెస్ ని వీడితే ఆ పార్టీకి మరింత దెబ్బనే చెప్పాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సింధియా, సచిన్ ల వ్యవహారాలలోలాగా లేట్ గా రియాక్ట్ అవుతుందో లేక వాళ్ళలాగా రేవంత్ తిరుగుబాటు జెండా ఎగరవేయకముందే మేలుకుంటుందో చూడాలి.

మరోసారి స్టేటస్‌ కో పొడిగింపు.. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ధిక్కార పిటిషన్

ఏపీలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుపై స్టేటస్‌ కోను హైకోర్టు మరోసారి పొడిగించింది. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగగా, స్టేటస్ కోను సెప్టెంబరు 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసిన హైకోర్టు.. ఈ విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు, అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు  ధర్మాసనం గడువు ఇచ్చింది.   మరోవైపు, విశాఖపట్నంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైంది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగింది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఏపీ సర్కారు అతిథి గృహాన్ని నిర్మించనుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి భవనం ఐదు ఎకరాల్లో ఉండగా.. కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను ఎలా కడతారని నితీష్ గుప్తా ప్రశ్నించారు. ఒక వైపు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో అమల్లో ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజధాని తరలింపులో ఇది కూడా ఒక భాగమేనని ఆయన తెలిపారు. వాదనలు విన్న అనంతరం.. దీనిపై కూడా వచ్చేనెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

పదిశాతం పోలీసుల్లో కరోనా

కరోనా పై పోరులో ముందువరుసలో ఉన్న వైద్యసిబ్బందిని, పోలీసులను కరోనా కలవరపెడుతోంది. లాక్ డౌన్ సమయంలో సమర్థవంతంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ లో ఇప్పుడు కరోనా భయబ్రాంతాలకు గురిచేస్తుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర పోలీసు ల్లో దాదాపు పదిశాతం మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. పోలీస్ శాఖలో ఇప్పటివరకు మొత్తం 5,684 మందికి కోరోనా వచ్చింది. వారిలో 2,384మంది కోలుకున్నారు. 3,357మందిలో చాలామంది హోంఐసోలేషన్ లో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఇప్పటివరకు 44మంది పోలీసులు కరోనాతో చనిపోయారని పోలీస్ శాఖ చెప్తోంది. వీరిలో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు వివిధ స్థాయిలో పనిచేసే పోలీసులు ఉన్నారు.   హైదరాబాద్ కమిషనరేట్ లో దాదాపు 1,967మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,053మంది కోలుకోగా 891 చికిత్స తీసుకుంటున్నారు. 23మంది మరణించారు. ఇక జిల్లాల విషయానికి వస్తే  వరంగల్ లో 526మంది పోలీసులు కరోనా పాజిటివ్ గా నమోదు అయ్యారు. వారిలో 163మంది కోలుకున్నారు. 361మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పోలీసులు చనిపోయారు. కరోనా పాజిటివ్ గా నమోదు అయిన పోలీసులకు 17రోజుల సెలవుతో పాటు ఐదువేల రూపాయల ఆర్థిక సాయం పోలీసు శాఖ అందిస్తోంది. పోలీసు శాఖలోని అన్ని విభాగాలలోను కలుపుకుని మొత్తం 54 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు.   కరోనా ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న వారిలో వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు ఉన్నారు. మరి వీరిలో ఎంతశాతం మంది కరోనా కోరల్లో చిక్కారో లెక్కలు తీస్తే ఎక్కువ సంఖ్యే బయటకు వస్తుందేమో ..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి ప్రత్యేక సహాయం అందించాలని కోరుతున్నారు. 

కరోనా చికిత్సలో ఓజోన్.. జపాన్ లో పరిశోధనలు

ప్రపంచమంతా జరుగుతున్న పరిశోధనలకు మూలం కరోనాగా మారింది. కరోనా వైరస్ కు ఎన్ని కిరీటాలు ఉన్నాయో అంతకుమించి దాన్ని కొమ్ములు వంచడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఒకవైపు అనేక మార్గాలను అన్వేషిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్ తయారిలో తలమునకలై శ్రమిస్తున్నారు. ఇంకో వైపు  పాజిటివ్ వ్యక్తులు తర్వగా కోలుకునేలా చికిత్స అందించడంలో కొత్త విధానాలను కనుగొంటున్నారు.    తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఓజోన్ వాయువుతో వైరస్‌కు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఓజోన్ పొర భూమిని రక్షించినట్లే కరోనా వ్యాధి బారిన పడినవారిని త్వరగా కోలుకునేలా చేస్తుందట. ఓజోన్ వాయువును అతి తక్కువగా సాంద్రతలో ఉపయోగిస్తే  వైరస్‌ను చంపడం సాధ్యమవుతుందని జపాన్ లోని పుజిటా హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 0.05 నుంచి 0.1 పీపీఎం స్థాయిలో ఓజోన్ వాయువును ఉపయోగించి వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చని వారి పరిశోధనల్లో వెల్లడైంది. చికిత్సలోనే కాదు ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో దీనిని డిస్‌ఇన్‌పెక్టెంట్‌గా కూడా ఉపయోగించవచ్చని వారు వెల్లడించారు. ఇప్పటికే ఓజోన్ జనరేటర్లను ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు జపాన్ లో జరుగుతున్నాయి. ఓజోన్ జనరేటర్‌ ద్వారా దాదాపు 10 గంటలపాటు తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును ఉపయోగిస్తే వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్టు గుర్తించారు.   ఓజోన్ అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుందని పుజిటా హెల్త్ యూనివర్సిటీ చీఫ్ సైంటిస్ట్ మురాఠా వెల్లడించారు. అధిక తేమ ఉన్న పరిస్థితుల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.