బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖ టీడీపీలో ఫుల్ జోష్
posted on Mar 6, 2021 @ 11:51AM
బొబ్బిలి పులిలా గాండ్రించాలి. అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి. ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడాలి. విశాఖలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన పిలుపు ఇది. ఆయన కూడా అదే పని చేశారు. విశాఖ వీధుల్లో జగన్ సర్కారుపై బొబ్బిలి పులిలా గాండ్రించారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అల్లాూరి సీతారామరాజులా ఉద్యమించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడారు. విశాఖలో ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై టీడీపీ, జై చంద్రన్న, జై విశాఖ ఉక్కు నినాదాలతో స్టీల్ సిటీ మారుమోగిపోయింది.
అనూహ్యం. అద్భుతం. చంద్రబాబు విశాఖ టూర్ ఆసాంతం సూపర్ హిట్. ప్రభుత్వంపై ప్రజలు ఎంత అసహనంతో ఉన్నారనే దానికి చంద్రబాబు పర్యటన విజయవంతం అవడమే నిదర్శనం. చంద్రబాబు వెళ్లిన చోటల్లా అభిమానులు భారీగా తరలివచ్చారు. బాబు మాటలను ఆసక్తిగా విన్నారు. చంద్రబాబు స్పీచ్ సైతం ఇదివరకులా చప్పగా సాగలేదు. మాంచి ఫైర్ మీదున్నారు బాబు. బాంబుల్లాంటి మాటలతో జనాల్లో జోష్ నింపారు. "విశాఖకు రౌడీలు వచ్చారు. భూములు లాక్కొంటున్నారు. ఇంకొన్నాళ్లు పోతే ప్రజల ఆస్తులు కొట్టేస్తారు." ఇలా సర్కారుపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ప్రతిపక్ష నేత ఫుల్ ఫైర్ రాజేశారు.
హుద్ హుద్ తుఫాను తర్వాత విశాఖ ఎలా మార్పు చెందిందో.. ప్రస్తుత నగరం ఎలా ఉందో పోల్చి చెబుతూ.. ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు చంద్రబాబు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోస్కోతో చీకటి డీల్.. ఇలా ప్రభుత్వ లోటుపాట్లను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో సక్సెస్ అయ్యారు. నెల రోజులుగా జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి చంద్రబాబు పర్యటనతో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
మార్చి 10న విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు. అధికార పార్టీ ఏడాది నుంచి నగరంపై కన్నేసింది. ఎంపీ విజయసాయిరెడ్డిని ఇంఛార్జిగా నియమించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తూ వచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించాక, వైసీపీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. విశాఖలో తమకిక తిరుగులేదనుకున్నారు. అంతలోనే.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం తెరపైకి రావడం.. పోస్కో వెనుక వైసీపీ పెద్దల మంత్రాంగం ఉందని తెలుస్తుండటంతో అధికార పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు విశాఖ ఓటర్లు. అదే సమయంలో విశాఖ ఉక్కు కోసం టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండటం, టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు నిరవధిక నిరాహార దీక్ష దిగడంతో.. విశాఖలో పొలిటికల్ ఈక్వేషన్ ఒక్కసారిగా టీడీపీ వైపు టర్న్ అయింది.
చంద్రబాబు విశాఖలో పర్యటించడంతో ఉత్సాహం రెట్టింపు అయింది. చంద్రబాబు స్పీచ్ అదిరిపోయేలా, ఆకట్టుకునేలా, ఆలోచన కలిగించేలా ఉండటంతో ప్రజల్లో చైతన్యం మరింత పెరిగింది. గతంలో హుద్ హుద్ సమయంలో చంద్రబాబు నగరంలోనే మకాం వేసి తుఫాను సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షించిన తీరు.. విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించడం.. పలు అంతర్జాతీయ సంస్థలను విశాఖకు తీసుకురావడం.. ఇలా సీఎంగా చంద్రబాబు హయాంలో జరిగిన నగర అభివృద్ధి ఆసాంతం ప్రజల కళ్లముందు సాక్షాత్కరించింది. టీడీపీ పాలన, వైసీపీ ప్రభుత్వ విధానాలను పోల్చి చూసుకుంటూ.. బాబు గారు ఎంతో బెటర్ అనే అభిప్రాయానికి వస్తున్నారు విశాఖ ప్రజలు. ఆ ప్రజాభిమానం మార్చి 10న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిఫలించడం ఖాయం. చంద్రబాబు విశాఖ టూర్ తో బాస్ ఈజ్ బ్యాక్ నినాదం హోరెత్తుతోంది.