జగన్ లా వీడియో గేమ్స్ ఆడట్లే! బూతులు మాట్లాడితే తట్టుకోలేరు..
posted on Mar 6, 2021 @ 1:10PM
హిందూపురం మున్సిపాలిటీలో సుడిగాలిలా ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. వైసీపీ సర్కార్, జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. తనకు ఎన్నో పనులు ఉన్నాయని... ఎంతో బిజీగా ఉంటూ కూడా తాను ప్రజాసేవ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరికో సేవ చేస్తున్నాని తెలిపారు. ఇదే సమయంలో సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని కూడా పంచుతున్నానని చెప్పారు. తాను తిడితే తనకన్నా ఎక్కువ బూతులు తిట్టేవారు ఎవరూ ఉండరని అన్నారు. అయితే తనకు సంస్కారం ఉందని... సంస్కారానికి కట్టుబడే తాను పద్ధతిగా వ్యవహరిస్తున్నాని చెప్పారు. వైసీపీ నేతలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైసీపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అభివృద్ధిని పక్కనపెట్టి వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నారని బాలకృష్ణ విమర్శించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మూసివేసి వైసీపీ సర్కారు ప్రజల నోట్లో మట్టి కొట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడింది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. నలుగురు మంత్రులు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు.