అవంతి, గంటాకు షాక్! జంపింగ్ ఎమ్మెల్యేకు ఝలక్
posted on Mar 15, 2021 @ 2:59PM
విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు విలక్షమైన తీర్పు ఇచ్చారు. అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజక వర్గాల్లో టీడీపీకి మెజారిటీ వార్డులు దక్కగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నార్త్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో వైసీపీకి ఆధిక్యం వచ్చింది. మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటర్లు షాకిచ్చారు. టీడీపీలో గెలిచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాసుపల్లి గణేశ్‌కుమార్ కు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. దాదాపుగా 18 నెలలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీకి కేకే రాజు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ 17 డివిజన్లు వుండగా అందులో వైసీపీకి 15, టీడీపీకి 1, బీజేపీకి 1 వచ్చాయి. ఇక్కడ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది.గంటా సైలెంట్ గా ఉండటంతో టీడీపీ కేడర్ చెదిరిపోయిందని చెబుతున్నారు.
భీమిలి నియోజకవర్గానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సబ్బం హరి ఇన్‌చార్జిగా ఉన్నారు. భీమిలి నియోజకవర్గం పరిధిలో జీవీఎంసీ పరిధిలో తొమ్మిది వార్డులు ఉన్నాయి. టీడీపీ 5 గెలుచుకోగా, వైసీపీ నాలుగు డివిజన్లు మాత్రమే దక్కించుకుంది. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు పట్టు నిలుపుకోకపోవడం చర్చగా మారింది.
విశాఖ దక్షిణం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేశ్‌కుమార్ ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వాసు.. కొన్ని నెలల క్రితం వైసీపీలో చేరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వ్యవహారాలన్ని ఆయన చూశారు. ఇక్కడ టీడీపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన శ్రీభరత్ ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకున్నారు. విశాఖ సౌత్ లో 13 వార్డులు వుండగా.. అధికార వైసీపీకి కేవలం 5 మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశానికి 4 డివిజన్లు దక్కగా.. జనసేన నుంచి ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు వైసీపీ రెబెల్స్ గెలిచారు.
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ తూర్పులో 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ టీడీపీకి 3, వైసీపీకి 9, వార్డులు దక్కాయి. జనసేన ఒకటి గెలుచుకోగా, మరొకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ 14 వార్డులు ఉండగా టీడీపీకి 5, వైసీపీకి 9 వార్డులు లభించాయి. వైసీపీ ఎమ్మెల్యే ఉన్న గాజువాకలో 17 వార్డులకు గాను..వైసీపీకి కేవలం 7 మాత్రమే వచ్చాయి. టీడీపీకి ఏడు, టీడీపీ బలపరిచిన సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి గెలుచుకోగా, జనసేన ఒక వార్డులో విజయం సాధించింది.
పెందుర్తికి వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సారథ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ జీవీఎంసీలో ఆరు వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీ 5 గెలుచుకోగా, వైసీపీకి కేవలం ఒకే ఒక్క వార్డు వచ్చింది. ఇక్కడ నుంచి టీడీపీ మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు 96వ వార్డులో భారీ ఆధిక్యంతో గెలిచారు. జీవీఎంసీలో అనకాపల్లికి చెందిన 5 వార్డులు ఉన్నాయి. వాటిలో వైసీపీ నాలుగు గెలుచుకోగా, టీడీపీ ఒకటి దక్కించుకుంది.