ఏపీ మంత్రి మాటలతో మహిళా డాక్టర్ కంటతడి..
posted on Mar 15, 2021 @ 4:42PM
అనంతపురం జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ హడావుడి చేశారు. పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. సిబ్బందిపై విరుచుకుపడ్డారు. సస్పెండ్ చేయిస్తానంటూ కేకలు వేశారు. మంత్రి తీరుతో ఆసుపత్రి వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. సరిపడా సిబ్బంది లేకున్నా... విధులు నిర్వహిస్తూ.. రాష్ట్రంలోనే మంచి ర్యాంకు సాధించిన తమపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని వైద్యులు తప్పుబడుతున్నారు. తమపై సస్పెన్షన్ వేటు వేసినా తాము సిద్ధమేనని అంటున్నారు.
ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో నీళ్ల సమస్యతో ఇరుగు పొరుగు వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన వెంకటేశ్, తరుణ్ గాయాలపాలయ్యారు. వీరు అదే రాత్రి 11.30 కు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వీరిని పరామర్శించేందుకు మంత్రి శంకర్ నారాయణ ఆసుపత్రికి సోమవారం వచ్చారువైద్యుల విధులు, ఆసుపత్రి సౌకర్యాలపై ఆరా తీశారు. ఇప్పటివరకు బాగానే... తర్వాతే మంత్రి గారు రెచ్చిపోయారు. అక్కడున్న వైద్యులపై తన ప్రతాపం చూపించారు. వైద్యులు సకాలంలో స్పందించడం లేదని, ప్రైవేటు క్లినిక్ లు పెట్టుకొని ఉన్నారని మండిపడ్డారు. వెంటనే మెమోలు జారీ చేయాలంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఫోన్‌లో ఆదేశించారు. సస్పెండ్ చేయాలని డీసీఎస్‌హెచ్ రమేశ్ నాథ్‌తో మాట్లాడారు.
మంత్రి మాటలకు అక్కడే ఉన్న వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. నిజాయితీగా పని చేస్తున్న తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుని మంత్రి మాట్లాడితే బాగుడేందని చెప్పారు. మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బుడం సాహెబ్... ఆరు మంది సిబ్బంది ఉండాల్సిన చోట ఇద్దరు వైద్యులు 24 గంటలు పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసిన తాము సిద్ధమేనన్నారు. ఆసుపత్రుల ర్యాంకింగులో ఎక్కడో ఉన్న తమ ఆసుపత్రిని... ఉన్నతమైన స్థితికి తీసుకు వచ్చామని.. రికార్డులు కూడా పరిశీలించొచ్చు అని తెలిపారు. ఎనిమిది గంటల చేయాల్సిన విధులను ... సిబ్బంది కొరత కారణంగా 24 గంటలు చేస్తున్నామని అన్నారు.