ఇక షర్మిల ఒంటరి ప్రయాణమేనా..?
posted on Mar 15, 2021 @ 4:57PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణాలో ఒక కొత్త పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో రాజన్న రాజ్యం తేవడమే తన లక్ష్యంగా ఆమె ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఆమె పార్టీ పెట్టడం ఆమె అన్న అయిన ఎపి సీఎం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని వైసిపి నేతలు స్పష్టం చేసారు. అయితే ఏపీలో జగన్ రాజకీయం ఆయన దారిలో రాజకీయం చేస్తున్నారని.. అలాగే తెలంగాణాలో తన రాజకీయం తనదేనని ఆమె తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా షర్మిల ఇడుపులపాయ పర్యటనలో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇడుపులపాయలో ఆమె తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద షర్మిల ఒంటరిగా కూర్చున్న ఫొటోపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా ఆమె అక్కడ పర్యటనకు వచ్చినపుడు ఆమె వెంట వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు స్థానిక నాయకులు అనుసరించి ఉండేవారు.
కానీ తాజాగ వచ్చిన ఫోటోలో షర్మిల తన తండ్రి సమాధి వద్ద ఒంటరిగా కూర్చొని ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా షర్మిల తో ఎపుడూ వెంట ఉండే వైఎస్ బంధువులు కానీ కేడర్ కానీ ఎవ్వరూ లేకపోవడంతో అన్న చెల్లెళ్లకు నిజంగానే గ్యాప్ పెరిగిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరోపక్క షర్మిల వెంట పార్టీ కేడర్ కానీ, బంధువులు కానీ ఎవరూ వెళ్లవద్దని వైసీపీ అధిష్టానం ఆదేశించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో షర్మిల వైఎస్ ఘాట్ పర్యటనకు వైసిపి శ్రేణులు దూరంగా ఉన్నాయని తెలుస్తోంది. షర్మిల తాజా ఇడుపులపాయ పర్యటనతో అన్నా చెల్లెళ్ళ మధ్య గ్యాప్ పెరిగిందన్న విషయం స్పష్టమవుతోందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.