తునిలో తుస్సుమన్న యనుమల.. పుట్టాను చూసి నేర్చుకోవయ్య!
posted on Mar 15, 2021 @ 4:45PM
ఆంధ్రప్రదేశ్ లో అతనో సీనియర్ రాజకీయ నాయకుడు.. అసెంబ్లీ స్పీకర్ గా, పలుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం.. తెలుగు దేశం పార్టీలోనూ ఆయనే సీనియర్. అధినేత చంద్రబాబు తర్వాత పార్టీలోని కీలక నేతల్లో టాప్ లో ఉంటారు. అలాంటి నేత సొంత నియోజకవర్గంలో టీడీపీ తుస్సుమంది. కనీసం ఖాతా తెరవలేకపోయింది. జిల్లా మొత్తాన్ని శాసించాల్సిన స్థితిలో ఉన్న సీనియర్ నేత సొంత గడ్డలో టీడీపీకి జీరోగా మిలిగిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
టీడీపీ ఖాతా తెరవని ఆ మున్సిపాలిటీ తుని. తూర్పుగోదావరి జిల్లాలోని తుని.. మాజీ మంత్రి యనముల రామకృష్ణడు సొంత గడ్డ. ఇక్కడి నుంచే యనుమల పలు సార్లు గెలుపొందారు. కాని ఇటీవల మాత్రం తునిలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అదివారం ఫలితాలు వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనూ చావు దెబ్బ తిన్నది. తునిలో మొత్తం 30 వార్డులు ఉండగా.. 15 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగానే గెలిచారు. మిగిలిన 15 వార్డులకు పోలింగ్ జరగగా.. అన్ని వార్డుల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో తునిలో టీడీపీ జీరోగా మిగిలింది. తునిలో 15 వార్డుల్లో టీడీపీ పోటీలో నిలవకపోవడమే షాకింగ్. తలపండిన రాజకీయ నేతగా ఉన్న యనమల.. అన్ని వార్డుల్లో అభ్యర్థులను పెట్టకపోవడం ఏంటన్న చర్చ టీడీపీలోనే జరుగుతోంది. మీడియా ముందు గొప్పగా ప్రకటనలు చేసే నేతలు.. సొంత కేడర్ ను నిలుపుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు యనుమల వియ్యంకుడు.. పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపించాడు. ఫ్యాక్షన్ గడ్డ, సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డ కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీలో అద్భుత ఫలితాలు సాధించి వైసీపీకి షాకిచ్చారు. నిజానికి కడప జిల్లాలో ప్రస్తుతం టీడీపీ ఉనికే ప్రశ్నార్దకంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా టీడీపీ ప్రభావం పెద్దగా కనిపించ లేదు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగులో పోటీ ఏకపక్షంగానే జరిగింది. కొన్ని వార్డులు ఏకగ్రీవం కాగా.. పోటీ జరిగిన చోట వైసీపీనే గెలిచింది. కాని మైదుకూరులో మాత్రం పుట్టా సుధాకర్ యాదవ్ .. అధికార వైసీపీని ధైర్యంగా ఢీకొట్టారు. వైసీపీ రాజకీయ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. తన సత్తా చాటారు. మైదుకూరులో 24 వార్డులు ఉండగా.. టీడీపీ 12 వార్డులు గెలిచింది. వైసీపీ 11 వార్డులు గెలవగా.. జనసేన ఒక వార్డులో గెలిచింది . మైదుకూరు ఫలితాలతో షాకైన వైసీపీ నేతలు.. ఎలాగైనా ఆ చైర్మెన్ సీటును కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .
మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు నామినేషన ఘట్టం నుంచే ఆసక్తిగా మారాయి. గత ఏడాది మార్చి 11 నుంచి 13వ వరకు నామినేషన్లు ప్రక్రియ జరిగింది. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికార అండతో వైసీపీ అడ్డుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా.. మొత్తం 24 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయించడంతో పుట్టా సుధాకర్‌యాదవ్ సక్సెస్ అయ్యారు. ఏడాది తరువాత పురపోరు ప్రక్రియ మొదలైనా టీడీపీ అభ్యర్థులను వితడ్రా చేయించి మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం చేసుకోవడానికి వైసీపీ నాయకుల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ 24 మంది అభ్యర్థులను క్యాంపునకు పంపి ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకుండా అడ్డుకట్ట వేశారు. విత్ డ్రా చివరిరోజు సాయంత్రం 4 గంటల తరువాత టీడీపీ అభ్యర్థి ఒకరి చేత వితడ్రాకు అధికార వైసీపీ నేతలు విఫల ప్రయత్నం చేస్తే పుట్టా అడ్డుకున్నారు. వైసీపీ నేతలు ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా రాజకీయ ఎత్తులతో అధిగమిస్తూ పట్టణ పోరులో 12 వార్డులు గెలుచుకుని పెద్దపార్టీగా అవతరించారు.
ఫ్యాక్షన్ సీమలో, సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని పుట్టా సుధాకర్ యాదవ్ హీరోగా నిలిచారు. కాని సీనియర్ రాజకీయ నేతగా ఉన్న యనమల మాత్రం తునిలో తుస్సుమనిపించారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి మైదుకూరు లాంటి రాజకీయాలు తునిలో ఉండవు. బెదిరింపులకు అంతగా అవకాశం ఉండదు. అయినా 15 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో నిలపలేకపోయారంటే యనుమల పరిస్థితి ఎంతగా దిగజారిందో ఊహించవచ్చు. దీంతో తుని ఫలితాలను.. మైదుకూరుతో పోల్చుతూ కొందరు యనములపై విమర్శలు చేస్తున్నారు. వియ్యంకుడినైనా చూసి రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోవాలని యనమలకు సూచిస్తున్నారు. మీడియాలో కనిపిస్తూ షో చేయడం కాదు.. కేడర్ కు అండగా నిలవాలని చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.