పార్టీల ఆస్తుల లెక్కలు..
posted on Mar 20, 2021 8:48AM
దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నాయి? అందులో ఎన్ని జాతీయ పార్టీలు, ఎన్ని ప్రాంతీయ పార్టీలు? అంటే లెక్క చెప్పడం కొంచెం చాలా కష్టమే. ముఖ్యంగా, అన్నతో చెడి చెల్లి, అయ్యతో చెడి కొడుకు ఎరికి వారు వేరు కుంపటి పెట్టుకోవడంతో కుక్క గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రాంతీయ పార్టీల లెక్క తేల్చడం, మరీ కష్టం కావచ్చును. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం లెక్క ప్రకారం దేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు, ఓ ఫిఫ్టీ దాకా గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలలో సిపిఐ,టీఎంసీ,ఎన్సీపీల జాతీయ హోదా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతోంది. ఈ మూడు పార్టీలకు జాతీయ హోదా ఉపసంహరిచుకోమని కేంద్ర ఎన్నికల సంఘం 2019లోనే నోటీసులు ఇచ్చింది. అయితే, ఇంకా అధికారికంగా ఆ పార్టీల జాతీయ హోదా రద్దు కాలేదు కాబట్టి వాటి హోదా ఇంకా కొనసాగుతోంది.
ఆప్ నుంచి ఎస్పీ దాకా, ఎంఐఎం నుంచి డీఎంకే, అన్నాడీఎంకే దాకా, బిజు జనతాదళ్ నుంచి జనతా దళ్ (ఎస్), జనతాదళ్ (యూ)వరకు టీడీపీ నుంచి తెరాస, వైసీపీ వరకు మొత్తం ఓ 48 గిర్తింపు పొందిన ప్రాతీయ పార్టీ లున్నాయి. ప్రాతీయ పార్టీలలో కాసుల పార్టీలు వేరయా అన్నట్లు, దేశం మొత్తంలో ఉన్న ప్రాంతీయ పార్టీల ఫైనాన్సు స్టేటస్ లెక్కలు తీస్తే, ఉభయ తెలుగు రాష్రాలలోని మూడు ప్రాంతీయ పార్టీలు,టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ ఫస్ట్ టెన్’ పార్టీలలో ప్లేస్ సంపాదించాయి.2018-19 సంవత్సరానికి దేశంలో టాప్ టెన్ పార్టీలతో కూడిన జాబితాను ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) విడుదల చేసింది. ఈ జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ రూ.572 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ రూ.232 కోట్లతో ఆ తర్వాత స్థానంలో ఉంది. ఏఐఏడీఎంకే రూ.206 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఇక తెలుగు పార్టీల విషయానికివస్తే రూ.193 కోట్ల ఆస్తులతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.188 కోట్ల ఆస్తులతో టీఆర్‌ఎస్ ఆరో స్థానంలో, రూ.93 కోట్ల ఆస్తులతో వైసీపీ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. టీడీపీకి రూ.115 కోట్లు, టీఆర్‌ఎ్‌సకు రూ.152 కోట్లు, వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. కాగా బీజేపీ 2,904.18 కోట్ల ఆస్తులను ప్రకటించింది. జాతీయ పార్టీలు వెల్లడించిన ఆస్తుల్లో ఇది 54.29 శాతం. కాంగ్రెస్ రూ.928.24 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించింది. ప్రాతీయ పార్టీలలో, తెలుగు పార్టీలు ‘గౌరవప్రద’ స్థానం ‘సంపాదించు’ కున్నాయి.