చిన్నారెడ్డి రాజకీయ సన్యాసం! రేవంత్‌రెడ్డి సహకారం..
posted on Mar 20, 2021 @ 1:06PM
ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి చేతులెత్తేశారు. పనిలో పనిగా మిగతా వారికీ ఓ సలహా కూడా ఇచ్చేశారు. డబ్బులు లేకపోతే ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని హితవు పలికారు. పట్టభద్రులు సైతం అధికార టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోందని అన్నారు.
కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారెడ్డి. డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్‌ను భవిష్యత్‌లో ఎవరు తట్టుకోలేరన్నారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు తట్టుకోగలరన్నారు. పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని పొగిడారు. తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పునఃనిర్మాణం కోసం పనిచేస్తానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న చిన్నారెడ్డి తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అందుకే, ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించేశారు.