ఏపీలో అండర్ గ్రౌండ్ మాఫియా
posted on Mar 20, 2021 @ 12:36PM
ఏపీలో అండర్ గ్రౌండ్ మాఫియా పెరగడం ఆందోళనకరం. రౌడీయిజాన్ని, గుండాలను అధికార వైసీపీ పెంచి పోషిస్తోంది. మాదక ద్రవ్యాలతో మత్తులో ముంచి యువతను పెడదారి పట్టిస్తున్నారు. వాటాల కోసం బెదిరించి పరిశ్రమలను తరిమేశారు. ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. అక్రమ వసూళ్లు, రౌడీదందాలతో సామాన్య వ్యాపారులు బెంబేలెత్తుతున్నారంటూ జగన్‌రెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు.
అధికార వైసీపీ మాఫియా గ్యాంగులకు రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. పొట్టకూటి కోసం మాఫియా ఉచ్చులో యువత చిక్కుకుంటోందని అన్నారు. అన్నా క్యాంటిన్ల మూత, పండుగ కానుకల రద్దుతో పేదల జీవితాలు దుర్భరమయ్యాయని తెలిపారు. మానవాభివృద్ది సూచిలో ఏపీ 27వ స్థానానికి దిగజారిందని మండిపడ్డారు యనమల. రాష్ట్రంలో నిరుద్యోగం 24% పెరిగిందని, పేదరికం 20%కు చేరిందని ఆరోపించారు.
మాఫియా గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపాలని, రౌడీయిజాన్ని అణిచేయాలని డిమాండ్ చేశారు యనమల. రాజకీయ కక్ష సాధింపులో మునిగితేలుతున్న సీఎం జగన్ ఇకనైనా పగలు, ప్రతీకారాలకు స్వస్తి చెప్పి పేదల సంక్షేమంపై శ్రద్ద పెట్టాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టాలని, ఉపాధి కల్పించి యువత భవిత కాపాడాలని యనమల రామకృష్ణుడు కోరారు.