ఏపీ సహా 10 రాష్ట్రాలు యమ డేంజర్ 

దేశంలో కరోనా  మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజుకు 3 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం 4 లక్షల కేసులకు పెరిగి. తర్వాత కొంత తగ్గినా అదుపులోనికి మాత్రం రావడం లేదు. రికార్డ్ స్థాయిలో రోజు 4 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం మరణాల సంఖ్య భారీగా ఉంటుందని చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 10 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.  దేశంలోని 12 రాష్ట్రాల్లో ఒక్కోచోట లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండగా.. 8 రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష వరకూ ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కర్ణాటకలో అత్యధికంగా క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, యూపీ, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2,01,042 మంది చికిత్స  పొందుతున్నారు. 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. పది రాష్ట్రాల్లో 25శాతానికి పైగా కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తెలిపారు. ఇందులో కూడా ఏపీ పైనే ఉంది. పాజిటివిటి రేటు 20 శాతం కన్నా ఎక్కువగా ఉండటం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోవాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 48.1శాతంగా ఉండగా.. పుదుచ్చేరిలో 42.5, పశ్చిమబెంగాల్‌లో 34.3శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పాజిటివిటీ రేటు 25.3 శాతంగా ఉందియ 15శాతం పాజిటివిటీ రేటు కలిగిన రాష్ట్రాలు 14 ఉన్నట్టు కేంద్రం తెలిపింది.  గత రెండు వారాలుగా 125 జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గగా.. గత వారం అంటే మే 6 నుంచి 13 వరకు 338 జిల్లాల్లో తగ్గుదల నమోదైనట్టు కేంద్రం తెలిపింది. మే 3 నుంచి దేశంలో రికవరీ రేటు పెరుగుదల నమోదవుతోందని కేంద్రం వెల్లడించింది. కేరళ, తమిళనాడు, బెంగాల్‌లో ప్రమాదకర స్థాయిలో  కొత్త కేసులు నమోదవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.  ఇప్పటివరకు 17.72కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. తొలి డోసును 13.76కోట్ల మందికి వేయగా.. రెండో డోసును 3.96కోట్ల మందికి వేసినట్టు తెలిపారు. 17 కోట్ల డోసుల పంపిణీకి భారత్‌లో 114 రోజుల సమయం పట్టినట్టు కేంద్రం తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర వేగంగా టీకా పంపిణీ పంపిణీ జరుగుతోందని వెల్లడించింది. 17 కోట్ల మార్కును దాటేందుకు భారత్‌కు 114 రోజులు పట్టగా.. అమెరికాకు 115 రోజులు, చైనాకు 119 రోజుల సమయం పట్టిందని కేంద్రం వెల్లడించింది. 

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సి ఉన్న శాసనమండలి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఏపీలో మూడు, తెలంగాణలో ఆరు  ఎమ్మెల్యే కోటా మండలి సీట్లు జూన్ తొలి వారంలో ఖాళీ అవుతున్నాయి. ఆ సీట్ల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కొవిడ్ వైరస్‌ తీవ్రత దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గేవరకు ఏపీ, తెలంగాణలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరపలేమని వెల్లడించింది. ఈ మేరకు ఈసీ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  తెలంగాణలో శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్​ 3న ముగియనుంది. శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. గవర్నర్​కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్కరి పదవీకాలం  జూన్‌ 16న ముగియనుంది. అయితే ఆ ఎన్నికపై మాత్రం సీఈసీ క్లారిటీ ఇవ్వలేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ఉండదు కాబట్టి.. నిర్వహిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీలపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ లేఖపై చర్చించిన ఈసీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించరాదనే అభిప్రాయానికి వచ్చింది.  భారత ఎన్నికల సంఘంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ముంచుకొస్తుంటే.... ఎన్నికల ప్రచార ర్యాలీలకు అనుమతినివ్వడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలకు అనుమతినిస్తూ...కోవిడ్‌ నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన ఇసిపై మర్డర్‌ కేసు పెట్టాలని మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఇన్ని కేసులు పెరిగిపోవడానికి నైతిక, ఏకైక బాధ్యతంతా ఇసిదేనని ఆయన మండిపడ్డారు.  ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల వల్లే అక్కడ కరోనా కేసులు పెరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఈసీ కూడా  కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుపడే వరకు ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు కారణాల వల్ల మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫై చేసింది. ఐతే ప్రస్తుతం  కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉపఎన్నికలను వాయిదా వేసింది ఈసీ.అందులో భాగంగానే ఏపీ, తెలంగాణలో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. 

కరోనాకు జీవించే హక్కుంది.. బీజేపీ నేత తిక్క మాట 

దేశంలో కొవిడ్ కల్లోలం రేపుతుంటే కొందరు నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ జనాలను మరింత గందరగోళంలో పడేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు చేయడంతో బీజేపీ నేతలు ముందున్నారు. కొందరు గోమూత్రంతో కరోనా పోతుందని చెబుతుండగా.. మరికొందరు యజ్ఞం చేస్తే వైరస్ మాయమవుతుందని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా వైరస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా మనుషుల్లాంటి జీవేనని అన్నారు. మనలాగే కరోనా కూడా బ్రతకడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మార్చుతోందని వివరించారు. మనందరిలాగే కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉందని త్రివేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.  త్రివేంద్ర సింగ్ రావత్ గత మార్చిలో ఉత్తరాఖం్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వరదల సమయంలో సరిగా స్పందించలేదనే కారణంతోనే ఆయన తొలగించారనే వార్తులు వచ్చాయి. సొంత పార్టీ బీజేపీ నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఉత్తరాఖండ్ సీఎంగా తీర్థ్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు.సీఎం పదవి పోయినా త్రివేంద్ర సింగ్ రావత్ తీరు మాత్రం మారలేదు. తరుచూ కాంట్రవర్శీ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉందంటూ రావత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రావత్ ఏం చెప్పదలుచుకున్నారో అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

దాడులు చేశారు.. గుడిసెలు కాల్చారు.. 

అది న‌ర్సంపేట. కాక‌తీయ న‌గ‌ర్. సుమారు 300 కుటుంబాలు.  ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో నిరుపేదలు గత నెల రోజుల నుంచి గుడిసెల‌ు వేసుకుని  జీవిస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఉండడం కొందరు బడాబాబులకు నచ్చలేదు. ఆ  భూమిపై వారి కన్ను పడింది.  అంత బాడా బాబులు పధకం వేశారు. వారి అనుచరులతో పేదల గుడిసెలపై దాడి చేయించారు. దాడిచేయడం అంటే కర్రలతో కొట్టడం కాదు ఆ ఆ నిరుపేదల గుడిసెలకు నిప్పు అంటించారు. ఒక్కసారిగా ఆ గుడిసెలు అన్ని  కాలి బుగ్గి అయిపోయాయి. దీంతో ఇదంతా చూస్తున్న వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుడిసెలకు నిప్పు పెడుతుండగా కొంతమంది స్థానిక మహిళలు అడ్డుకోగా వారిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. మహిళలతో పాటు చిన్నారులకు కూడా దారుణంగా చితకబాదారు. సుమారు 40 మంది దుండగులు మారణాయుధాలతో వచ్చి బీభత్సం సృష్టించారు. పడుకున్నవారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతోపాటు వాడి గుడిసెలు దగ్ధం చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అన్న తేడా లేకుండా అందరిపై పాశవికంగా దాడి చేశారు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తులు, మహిళలు వారిలో కొంతమందిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి మహిళలు పట్టుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడటం వెనుక ఎవరున్నారో తేల్చి వారిని కఠినంగా శిక్షించాలని మహిళలు పోలీసులను కన్నీటితో వేడుకున్నారు. తమ జీవితాలను నివసించడానికి నిలువనీడ లేకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వారు డిమాండ్ చేశారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని పరిశీలించిన పోలీసులు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లాలోని కాకతీయ నగర్ లోని 601 సర్వే నంబర్ లోని అసైన్డ్ భూముల్లో నిరుపేదలు నెల రోజుల కిందట గుడిసెలు వేసుకున్నారు. అక్కడ మొత్తం 300 గుడిసెలు వేసుకొని పేదలు నివస్థున్నారు. ఇంకేముంది.. బడాబాబుల కళ్లు వారిపై పడింది. అంతే పేదలను గుడిసెలను ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగారు. ఎప్పటికప్పుడు సంఘటనా స్థలానికి వెళ్లి మర్యాదగా ఖాళీ చేసి వెళ్లి పోవాలని.. లేకపోతే మీరే నష్టపోతారని బెదిరింపులకు దిగినట్లు బాధితులు తెలిపారు. కానీ పేదలు ఇవి ఎవరి సొంత భూములు కాదనీ.. మేమెందుకు ఖాళీ చేయాలని ప్రశ్నించారు. దీంతో అదే రోజు రాత్రి అందరు పడుకున్న సమయంలో గుడిసెలకు నిప్పు పెట్టారని తెలుస్తోంది. అడ్డు వచ్చిన మహిళలను, చిన్నారులను, వృద్ధులను అని కూడా చూడకుండా దారుణంగా చితక బాదారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలకు చెందిన భూ కబ్జాదారులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని.. తమకు న్యాయం చేయాలని అక్కడకు వచ్చిన పోలీసులను బాధితులు వేడుకున్నారు.ఇంకా మనం ఇలాంటి సమాజం లో బతుకుతున్నామా అని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది. అప్పుడప్పుడు పేదలు బతకడానికి అవకాశం లేదా అనిపిస్తుంది. 

జర్నలిస్టులకు సుప్రీం ప్రత్యేక యాప్‌

కరోనా పరిస్థితుల నేపథ్యంలో జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రారంభించారు. జస్టిస్‌ కన్విల్‌కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ధనుంజయ్‌ల కమిటీ ఈ యాప్‌నకు రూపకల్పన చేసినట్లు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు సాంకేతిక బృందం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్‌ను సుప్రీంకోర్టు సాంకేతిక బృందం రూపొందించిందని చెప్పారు. సుప్రీంకోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే పొందవచ్చని అన్నారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు.. పారదర్శకంగా ఉండేదుకు గాను సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తానన్నారు. రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలు అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయన్నారు. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు తమకు తెలుసన్నారు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.  సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇక నుంచి జర్నలిస్టులు కోర్టు కార్యకలాపాల కోసం ఎటువంటి సమస్యను ఎదుర్కోకూడదన్నారు. ఆ దృష్టితోనే ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు చెప్పారు. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికి అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవరించేలా.. చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి సిజేఐ, ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు. 

కొవిడ్ తో కొలువులు ఖాళీ.. ఆల్ టైమ్ గరిష్టానికి నిరుద్యోగం

కొవిడ్’తో సంబంధం లేకుండానే దేశంలో నిరుద్యోగం రేటు పతాక స్థాయికి చేరుకుంది. రేడు సంవత్సరాల ముందు 2019 లోనే, దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. అదలా ఉంటే, మూలిగే నక్కపై తాటికాయ అన్నట్లుగా, కొవిడ్ మహమ్మారి విరుచుకు పడడంతో ఉన్న ఉద్యోగాలు పోయి, ఉద్యోగులు నిరుద్యోగులుగా మారడంతో పరిస్థితి మరింతగా విషమించింది.అలాగే, కరోనా కారణంగా ఒకదాని వెంబడి ఒకటిగా అనేక  రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం లేదా ఇతర అక్షలు విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా కుంట పడ్డాయి. ఫలితంగా పట్టణ నిరుద్యోగం ఒకసారిగా  12 శాతానికి చేరింది.  దేశంలో చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ లేదా ఇతర ఆంక్షలు విధిస్తున్న నేపధ్యంలో ఉద్యోగ మార్కెట్’పై మ‌రింత ఒత్తిడి పెరిగింద‌ని ఆర్థిక‌వేత్త‌లు భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పాటుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడి పోతున్నాయి.  సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ)డేటా ప్రకారం, ప‌ట్ట‌ణ నిరుద్యోగం ఏప్రిల్ 25తో ముగిసిన వారంలో 9.55% నుండి మే 9 వ‌ర‌కు వారంలో 11.72 శాతానికి చేరుకుంది. ఇది ఏప్రిల్ నెల‌వారీ సగటు 9.78% కంటే దాదాపు రెండు శాతం ఎక్కువ‌. జాతీయ స్థాయిలో మే 9తో ముగిసిన వారంలో నిరుద్యోగం రేటు 8.67 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో గ్రామీణ నిరుద్యోగం కూడా 6.37% నుండి 7.29%కి పెరిగింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జాతీయ, గ్రామీణ నిరుద్యోగం  రేట్లు కూడా ఏప్రిల్ నెల‌వారీ నిరుద్యోగ రేటు కంటే ఎక్కువగానే ఉన్నాయి. అయితే, దేశంలో నిరుద్యోగం పెరగడానికి, కరోనా, లాక్ డౌన్ మాత్రమే కారణం కాదని, దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి పేరున  కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు కూడా ఉద్యోగ, ఉపాధి  రంగంపై వ్యతిరేక ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే సారి లాక్ ద్వోన్ విధించింది. అయితే సంవత్సరం ఆరంభంలో ప్రారంభమైన సెకండ్ వేవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో రాష్ట్రాలకు నిరనయదికారం ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితుల ఆధారంగా లాక్ డౌన్ లేదా ఆంక్షలు విధిస్తున్నాయి.  దీంతో ఆర్థిక కార్యకలాపాలు సక్రమంగా సాగక, అనేక కంపెనీలు, పరిశ్రమలు పాక్షికంగా మూత పడుతున్నాయి. నిరుద్యోగం రేటు పెరుగుతోంది.  నిరుద్యోగం ప్రభావం ఆర్థిక వ్యవస్థ అంతటా ప్రభావం చూపుతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ ఎదుర్కుంటున్న ఆటుపోట్ల ప్రభవంతో జీడీపీ ఇతర ఆర్ధిక ప్రమాణాలు తీవ్ర వడిదుడుకులకు గురవుతున్నాయి. కార్మిక‌, ఉపాధి మార్కెట్ మ‌న మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ  ప‌నిత‌నం తెల‌ప‌డానికి ప్ర‌త్య‌క్ష సంబంధం క‌లిగి ఉంది. అనేక బ్రోక‌రేజ్ మ‌రియు ఆర్థిక సంస్థ‌లు జీడీపీ అంచ‌నాను త‌గ్గించాయి. బ‌ల‌మైన ఆర్థిక పున‌ర్‌జ్జీవ‌నానికి భార‌త్ ఎంత త్వ‌ర‌గా ఈ వైర‌స్‌ను అరిక‌ట్ట‌గ‌ల‌దో అన్న‌దానిపై ఆధార‌ప‌డి ఉన్న‌ట్లుగా క‌న‌ప‌డుతుంద‌ని ఇండియ‌న్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త సునీల్ కుమార్ సిన్హా అన్నారు.

రూల్ ఈజ్ రూల్.. కొడుక్కి ఫైన్ వేసిన సీఐ

రూల్ ఈజ్ రూల్  రూల్ ఫర్ ఆల్.. చట్టం ముందు అందరూ సమానులే.. అది ఎప్పుడో విన్న మాట అని అనుకుంటున్నారా..? అయినా ఎప్పుడు ఎవరు ఆ ఆర్టికల్ ని ఫాలో అవుతున్నదని అనుకుంటున్నారా..? అలా అనుకుంటే అదే పొరపాటే. అలా చట్టాన్ని ఫాలో అయ్యేవాళ్లు, ఆ చట్టాన్ని అమలు చేసేవాళ్ళు ఇంకా లేకపోలేదు. అక్కడక్కడా మానవత్వం మనుషులు బతికి ఉన్నట్లు, ఇలా చట్టానికి గౌరవించేవాళ్ళు కూడా ఉన్నారు. నమ్మడం లేదు కదా..! అయితే మీరే చూడండి.  ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి కఠినమైన కర్ఫ్యూ అమలవుతోంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రజలు రోడ్లపై తిరగకుండా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేవలం అత్యవసర వాహనాలు, వైద్య సేవల నిమిత్తం వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. అయినా సరే కొందరు చిన్నచిన్న పనులపై బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది సిల్లీ రీజన్స్  చెప్పి రోడ్లపై జులాయిగా తిరిగేస్తున్నారు. వీరిలో కొందరు కరోనా పేషెంట్లు కూడా ఉంటున్నారు. ఇదిలా ఉంటే కర్ఫ్యూ సమయంలో తమ పలుకుబడి ఉపయోగించి బయటతిరిగేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలు రూల్స్ పాటించకుండా బయట తిరగడం పోలీసుల తనిఖీల్లో తమ కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖుల పేర్లు చెపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వారిపట్న పోలీసులు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఐతే ఓ పోలీస్ అధికారి మాత్రం కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న తన సొంత కుమారుడికి ఫైన్ వేశారు. బయటతిరిగితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరులో కర్ఫ్యూ సందర్భంగా జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలమనేరు సీఐ జయరామయ్య కూడా రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ బయట తిరుగుతున్న ఓ కుర్రాడిని సీఐ జయరామయ్య వద్దకు తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆ అబ్బాయి... సీఐ జయరామయ్య కుమారుడు, బీటెక్ స్టూడెంట్ రాహుల్. ఇది తెలిసిన కానిస్టేబుల్ సారీ సర్.. మీ అబ్బాయి అని తెలియక తీసుకొచ్చా అని బదులిచ్చాడు. దీనిపై స్పందించిన సీఐ జయరామయ్య.. చట్టం ముందు అందరూ సమానమేనని.. కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్నందుకు రూ.125 జరిమానా విధించారు. బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన మన అనే బేధం లేదని.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇంట్లోనే ఉండాలని ఆయన అన్నారు. ఈ రోజుల్లో కొందరు ప్రముఖులు తమ పిల్లలు తప్పులు చేసినా చూసీచూడనట్లు వదిలేస్తుంటారు. అంతేకాదు వారిని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ సీఐ జయరామయ్య మాత్రం.. చట్టంముందు అందరూ ఒకటేనని నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు. కర్ఫ్యూ అమలులో ఉండగా ప్రజలు బయటకురాకుండా కరోనాను అరికట్టాలని పిలుపునిస్తున్నారు.    సీఐ జయరామయ్య చేసిన పనికి డిపార్ట్మెంట్ లో అందరూ షాక్ అయ్యారు. స్థానికులు సైతం ఎస్ఐ జయరామయ్య ని జై అంటున్నారు. నిజంగా గ్రేట్ కాదా.. అలా అందరూ ఉండలేరూ.. ఆకాశం లో చుక్క తెగిపడేట్లు ఎక్కడో అక్కడ అక్కడ కొందరు మాత్రమే సిన్సియర్ గా ఉంటారు.                

చనిపోయిన HMకి కొవిడ్ డ్యూటీ.. జగన్ సర్కార్ నిర్వాకం 

కొవిడ్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా రోగులకు సరైన చికిత్స కూడా అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విజయనగరం, హిందూపురం, తిరుపతి రుయా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం కలకలం రేపింది. అయినా ఏపీ అధికారులు నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు. ఉన్నతాధికారులు ఏం చెప్తే అది గుడ్డిగా చేసేస్తున్నారు. ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి కోవిడ్ విధులు వేయడం వివాదాస్పదం అవుతుండగా... కొందరు అధికారుల తీరు మరీ ఘోరంగా ఉంటోంది. చనిపోయిన టీచర్ కు కొవిడ్ డ్యూటీ వేసిన అధికారులు.., విధులకు రాలేదన్న పేరుతో మెమో కూడా జారీ చేశారు. అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో టీచర్లకు కొవిడ్ డ్యూటీలు వేశారు. నిత్యం వందలాది మంది టీచర్లకు కోవిడ్ విధులు కేటాయిస్తున్నారు. అందులో కొందరు హాజరవుతుండగా.. మరికొందరు రావడం లేదు. దీంతో ఉన్నతాధికారులు వారికి మెమోలు జారీ చేస్తున్నారు.  రొద్దం మండలం పెద్దగువ్వలపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్లో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుడిగా విజయభాస్కర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.  కరోనాతో పోరాడిన ఆయన.. మే 7వ మృతి చెందారు. ఈ నేపథ్యంలో కొవిడ్-19 పై అవగాహన కల్పించాలని విజయభాస్కర్ రెడ్డికి ఈనెల 9న డ్యూటీ వేశారు. డ్యూటీ ఛార్ట్ వేసే ముందు మనిషి ఉన్నారా లేదా..? అనే సమాచారం సేకరించకుండానే విధులు కేటాయించారు. అంతేకాదు ఆయన డ్యూటీకి రాలేదంటూ.., రొద్దం తహసీల్దార్ సురేష్ కుమార్ ఈనెల 11వ తేదీ చార్జ్ మెమో జారీ చేశారు. చనిపోయిన వ్యక్తికీ డ్యూటీలు వేసి...ఆపై మెమో జారీ చేయడం చూసి అంతా షాకయ్యారు.  అనంతపురం జిల్లాలో  వందలాది మంది టీచర్లకు కొవిడ్ డ్యూటీ వేశారు. కొవిడ్ బాధితులకు అవగాహన కల్పించేందుకు టీచర్లతోపాటు గ్రామస్థాయి కమిటీలను నియమించారు. సర్కార్ తీరుపై ఉపాధ్యాయులు,సంఘాల నాయకులు, ఎమ్మెల్సీల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  పెనుకొండలో ఇటీవల విధులను టీచర్లు బహిష్కరించారు. తమకు వ్యాక్సిన్లు వేయకుండా, ఎలాంటి ముందస్తు భరోసా కల్పించకుండా తాము డ్యూటీలకు ఎలా హాజరు అవుతామంటూ  మండిపడుతున్నారు. పైగా డ్యూటీకి రాలేదంటూ మెమోలుజారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. భౌతికంగా పాజిటివ్ వ్యక్తుల వద్దకు వెళితే.. మరికొందరు టీచర్లు కరోనా సోకి మృత్యువాతపడే ప్రమాదం ఉందంటున్నారు టీచర్లు.  

రైతుల ఖాతాల్లోకి నగదు.. కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్ 

రైతులకు ప్రధానమంత్రి కార్యాలయం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం క్రింద రైతులకు ఎనిమిదో విడత ఆర్థిక సహాయాన్ని చేస్తారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. సుమారు 9.5 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.19 వేల కోట్లకు పైగా అందజేస్తారు. ఈ వివరాలను గురువారం ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.  పీఎం కిసాన్ పథకం క్రింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున శుక్రవారం విడుదల చేస్తారు. ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ సందర్భంగా మోడీ శుక్రవారం ఉదయం 11 గంటలకు రైతులతో మాట్లాడతారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.   పీఎం కిసాన్ పథకం క్రింద చిన్నకారు, సన్నకారు రైతులు లబ్ధి పొందవచ్చు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ సొమ్మును రూ.2,000 చొప్పున మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. మొదటి విడత సహాయాన్ని ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో, రెండో విడత సహాయాన్ని ఆగస్టు 1 నుంచి నవంబరు 30 మధ్య కాలంలో, మూడో విడత సహాయాన్ని డిసెంబరు 1 నుంచి మార్చి 31 మధ్య కాలంలో ఇస్తారు.   

కరోనాతో సహజీవనమేనట.. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పంజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొవిడ్ రోగులకు బెడ్లు దొరకడం లేదు, ఆక్సిజన్ అందడం లేదు, వ్యాక్సిన్ ఇవ్వడం లేదనే ఆరోపణలపై ఆయన స్పందించారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్నారు జగన్. దేశంలో వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటో అందరికి తెలుసన్నారు. వ్యాక్సిన్ల కొరత ఉన్నందున... కరోనాతో సహజీవనం చేయడం తప్ప మారో మార్గం లేదని కామెంట్ చేశారు ఏపీ సీఎం జగన్.  భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ కోసం మొత్తం 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాల్సి ఉంటుంద‌ని చెప్పారు జగన్.ఇప్ప‌టివ‌ర‌కు 18 కోట్ల డోసుల‌ను మాత్ర‌మే ఇవ్వ‌గ‌లిగార‌ని  తెలిపారు.  ఏపీకి మొత్తం 7 కోట్ల డోసులు కావాల్సి ఉంద‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 73 ల‌క్ష‌ల డోసుల‌ను మాత్ర‌మే ఇచ్చార‌ని వివ‌రించారు. భార‌త్‌లో సీరం, భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లు వ్యాక్సిన్లను త‌యారు చేస్తున్నాయ‌న్నారు. భార‌త్ బ‌యోటెక్ నెల‌‌కు కోటి వ్యాక్సిన్లు త‌యారు చేస్తోంద‌ని, అలాగే, సీరం ఇన్‌స్టిట్యూట్ కు నెల‌కు 6 కోట్ల వ్యాక్సిన్ల త‌యారీ సామ‌ర్థ్యం ఉంటుంద‌ని తెలిపారు. అంటే దేశంలో నెల‌కు కేవ‌లం 7 కోట్ల వ్యాక్సిన్ల సామ‌ర్థ్యం మాత్ర‌మే ఉందని చెప్పారు. కాబ‌ట్టి దేశ ప్ర‌జ‌లు కరోనాతో స‌హ‌జీవ‌నం చేస్తూనే మరోపక్క దానితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంద‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు కరోనా జాగ్ర‌త్తలు పాటించాలని సీఎం జగన్ కోరారు.  

ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు పాతర వేశాయా ?

ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు పాతర వేశాయా ? అన్న ప్రశ్నకు అవుననే అంటున్నారు నిపుణులు. . ఇక వివరాల లోకి వెళితే  కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 19 7౦ - 198౦ లో ప్రజా ఆరోగ్యానికి కీలక అంశం గా పరిగనించారు. ఆ క్రమంలో ప్రజా ఆరోగ్యానికి  గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రజా ఆరోగ్యంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటి ఇంటికీ వెళ్లి అటు గర్భిణి బాలింత, చూలింత, బిడ్డ ఆరోగ్యానికి  ఆరోగ్య కార్యకర్తలు  ఆరోగ్యం పై అవగాహన కల్పించడం వారిబాధ్యతగా భావించే వారు. అప్పటికీ ప్రాధమిక స్థాయిలో వచ్చే అనారోగ్యానికి  పాట శాలాలో వ్యాక్సిన్ వేయడానికి కుటుంబ నియంత్రణ వంటి సమస్యలకు డాక్టర్ అవసరం లేకుండానే  ప్రజల ఆరోగ్యానికి సహకారం అందించిన ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థ కా ల క్రమేణా  తెరమరుగు అయ్యింది ప్రజా ఆరోగ్య వ్యవస్థని గాడి లో పెట్టాలంటే ఒక వ్యవస్థ ఉండాలన్న ఆలోచన ప్రభుత్వాలు విస్మరించయన్నది వాస్తవం. గ్రామాలు పట్టణాల లో ఆరోగ్యం కొంత మేర చక్కబెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి ఆక్రమం లో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వాలు 1౦౦ పడకల ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా వృద్ధి చేసాయి.ఈ పరిస్థితి ఎలా ఉందంటే జిల్లాలు పట్టణాలు కాస్త పరవాలేదు అనుకున్న గిరిజన వెనక బడ్డ ప్రాంతాలలో ఇప్పటికీ  అక్కడ ఆరోగ్య కేంద్రాలు లేవు కనీసం ఇప్పటికీ ఆయా ప్రాంతాలలో రోగింకి చికిత్చ చేయాలంటే అత్యవసరంగా  అమ్బ్యులేన్స్ కూడా వెళ్ళ లేని స్థితి ఇదే కొన్నిఏ ళ్ళుగా  కొనసాగుతున్న ఆయా వెనుక బడ్డ ప్రాంతాలలో నెగ్గిన శాసన సభ్యులు, పార్ల మెంట్ సభ్యుల  నిధులు అక్కడి పరిస్థితిని చక్క బెట్టలేక పోయాయి. రాజ కీయ పార్టీలు తమ రాజకీయ మ్యానిఫెస్టో లో ఆర్ధిక పద కాల వెల్లువ తప్ప తమ ఆర్ధిక ప్రణాళిక లోనిధులు కేటాయించక పోగా తీవ్ర నిర్లక్ష్యం చేసారు. ఆ నిర్లక్ష్యం  నేటికీ కనపడుతోంది ఆనిర్లక్ష్యానికి ప్రజలు తమ ప్రాణాలు మూల్యం చెల్లించుకుం టున్నారు . ఇప్పటికీ పట్టణ ప్రాంతాలలో ఆధునిక వైద్య సామగ్రి ఇప్పటికీ అందు బాటులో లేకపోవడం మన దౌర్భాగ్యం. ఒక వేళ ఉన్న అవి ఎప్పటికీ పని చేయవు బయటి ఉన్న  ప్రైవేట్  సెంటర్లలో పరీక్షలు, ఎక్స్ రే లు చేయించాలి ఇంకొంచం ముందుకు వెళితే  జిల్లా ఆసుపత్రిలో  దొరకని మందులు  దగ్గరలో ఉన్న మందుల దుకాణాలలో దొరుకు తాయి. ఒకప్పుడు జిల్లా ఆసుపత్రికి ధైర్యంగా వెళ్ళిన రోగులు ఇప్పుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళా లంటే తిరిగి వస్తామో లేదో అన్న సందేహం తో  రోగులలో బలంగా మారి పోయింది. కోవిడ్19 సమయంలో పరిస్థితి పూర్తిగా మారి పోయింది మొదటి విడత  మన ఆరోగ్య సేవల డొల్ల తనాన్ని బయట పెట్టింది. కనీసం అత్యవసర సమయంలో చికిత్చ చేద్దామన్న సరిపడా లేని సర్జరీ సామాగ్రి, ఒకే డాక్టర్ ఇద్దరు నర్సింగ్ సిబ్బంది , పురుడు పోయడానికి కూడా సరిగ్గా లేని లేబర్ రూమ్స్ మందుల కొరత ఇలా  ఆన్ని సమస్యలు  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్నాయని ఐ ఎం హెచ్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది ఈ సమస్య కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు. మహా రాష్ట్రా,కేరళ, గుజరాత్ తమిళ నాడు ,అస్సాం , కల కత్తా,  ఒడిస్సా రాష్ట్రాలలో సైతం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల స్థితి నిర్లక్ష్యానికి  అడ్డం పడతాయి .కోవిడ్  తొలి ప్రభావం తో అయినా ప్రజా ఆరోగ్యానికి  ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తాయి అని అందరు అనుకున్న ఫర్ ది పీపుల్  బై ది పీపుల్ అన్నవిషయం పూర్తిగా మర్చి పోయి కనీసం ప్రజా ఆరోగ్యం పట్ల కనీసం ఒక్క  ప్రణాళిక సిద్ధం చేయక పోగా ఆరోగ్య కార్యకార్తలు సహకారం తో విజయవంతం అయినప్పటికీ ఆవిజయాని మర్చిపోయాయి ప్రభుత్వాలు. ఆర్ధిక ప్రణాళికలో సైతం పెద్ద కేటాయింపులు చేసామంటూ చెప్పుకున్న ప్రభుత్వాలు రాష్ట్రాలు ఈసారి ఆర్ధికంగా పెద్ద  పీట వేశామని చెప్పుకున్నాయి వాటికీ భారీ ప్రచారం కల్పించాయి.  ప్రపంచ శాస్త్రజ్ఞులు రెండవ విడత ప్రమాదకరమని సాక్షాతూ బ్రిటన్ ప్రధాని బోరిస్  జాన్సన్ హెచ్చరించినా పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికైనా  కోరోనా రెండవ విడత తీవ్రతను అంచనా వేయక పోగా కనీసం కోరోనా  ను ఎదుర్కోడానికి అవసర మైన ఏర్పాట్లు చేయక పోగా రానున్న ముప్పు కు తగ్గట్టు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం  చేసిన దాఖ లాలు లేవు , కోరోనా కట్టడికి అవసరమైన వ్యాక్సిన్ ను అందించడంలో ప్రభుత్వాలు చూపిస్తున్న అనాశక్తి  తేట తెల్ల మౌ తోంది. అటు ప్రభుత్వ ఆసుపత్రులు ,ఇటు ప్రై వేటు ఆసుపత్రి లో బెద్స్ ఆక్సిజన్ దొరకక ప్రాణాలు పోతుంటే కోరో నా చుట్టూ ముట్టినా నోట్లు కోట్లు ఓట్లు మత్తులో అధికారం కోసం ఎన్నికల్లో మునిగి పోయిన  ప్రజా ప్రభుత్వాలు ప్రాధ మిక స్థాయిలో కనీస అవసరాలు  ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించిన మీకు ప్రజా ఆరోగ్యం కన్నా అధికారమే లక్ష్యమని  మీ చేతలు చెపుతున్నాయి . నన్నుఅంటకు నామాల కాకి అన్న చందాన ప్రజా ఆరోగ్యం మాదికదని అది రాష్ట్ర ప్రరిదిలో ఉన్న అంశ మని చెప్పి తప్పించుకు నే ప్రయత్నం చేయడం చూస్తే ప్రజా ఆరోగ్యం పానులు మాకు సమాస్యలు మీకు అధికారం మాది పెత్తనం మాది మేము అన్నీ ఇస్తున్నాం రాష్ట్రాలు పనిచేయడం లేదతూ ఆరోపణలు చేస్తూ తమ బాధ్యత తీరిపోయింది అన్నట్టుగా ప్రయత్నిస్తుంది. ఇలా ప్రభుత్వాలు గత ప్రభుత్వాల నిర్వాకమంటూ ఆరోపించే మీకు ప్రభుత్వాలు గతంలో అమలు చేసిన ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థ ను ఎందుకు అమలు చేయలేదు? అన్నది ఒక  ప్రశ్న. రాజకీయాలు ఓటు బ్యాంకు పధకాలు పక్కన పెట్టి ప్రజా ఆరోగ్యాన్ని పట్టీ పట్ట నట్టుగా వ్యవహరించడం మాని మీరజకీయలకు ప్రజల ప్రాణాలు పెట్టి ఎన్నికాల్లో గెలవాలన్న పద్దతిని పక్కన పెట్టండి . ప్రజా ఆరోగ్యాన్ని అందించే బాధ్యతను చేపదతాయని ఆశిద్దాం. ఈసమస్య అన్నిటికీ కారణం ముందు చూపు లేని ప్రణాళిక వ్యాక్సిన్ పంపిణీ లో ను సంసిద్ధతలేకపోగా వ్యక్సింకు సైతం మీ రాజకీయ కుట్ర కోణాన్ని ఆపాదించడం చూస్తే ప్రజలను చులకనగా చూడడం మానుకోవాలని  వ్యాక్సిన్ లోను కుట్ర రాజకీయాలు మానుకుంటే మంచిది. అని రాజకీయ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారి ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేయకుంటే మరిన్ని మరణాలు ఆపడం కాష్టం. దేశం శవాల దిబ్బగా మారక ముందే మేల్కొండి.సత్వర వ్యాక్సిన్ , మరిన్ని ప్రజా ఆసుపత్రులు , కనీస సౌకర్యాలు అందించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు మీకు ఓటేసిన జనం . ప్రజా విజ్ఞప్తిని అమలు చేయండి ప్లీజ్.                                  

ఆ జిల్లాల్లో మరణ మృదంగం

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద ఈ ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గృహప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరానికి తొమ్మిది మంది కుటుంబసభ్యులు ఓ కారులో బయలుదేరారు. పెద్దాపురంలోని ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్దకు చేరుకునేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉంది. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘ‌ట‌నపై కేసు  న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.    ప్రకాశం లో మరో ఇద్దరు కూలీలు  ప్ర‌కాశం జిల్లా అద్దంకి స‌మీపంలోని గ‌రిట‌య్య కాల‌నీ వ‌ద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెంద‌గా మ‌రో ప‌ది మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. అద్దంకి నుంచి ఇంకొల్లు మండ‌లం కొనంకికి కూలీలు మిర‌ప‌కాయ‌ల కోత‌కు వెళుతుండ‌గా.. ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. మృతులు అద్దంకి మౌలా న‌గ‌ర్‌కు చెందిన అన‌సూయ‌మ్మ‌, షేక్ క‌రీమూన్‌గా గుర్తించారు. గాయ‌ప‌డిన వారిని అద్దంకి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.      మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఒకే కుటుంబం లో నలుగురు.. మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని క‌రోనా మ‌హమ్మారి క‌బ‌లించింది. 11 రోజుల వ్యవధిలో ఇద్ద‌రు కుమారుల‌తో పాటు త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు.    ఈ నెల 2న తండ్రి, నాలుగో తేదీ పెద్ద కుమారుడు మృతిచెంద‌గా.. 11న చిన్న‌కుమారుడు చ‌నిపోయారు. హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ త‌ల్లి(60) మ‌ర‌ణించారు. ఒక కుటుంబానికే చెందిన న‌లుగురు చ‌నిపోవడంతో నెల్లికుదురులో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.   జగిత్యాలలో మరో ఇద్దరు  జగిత్యాల పట్టణంలో కరోనా కాటుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల బలయ్యారు. ఎల్జీ రామ్ లాడ్జి వద్ద గల రాఘవేంద్ర మ్యూజిక్ సెంటర్ నిర్వహిస్తున్న రవి నిన్న మృతి చెందగా.. అతని సోదరుడు ఈరోజు కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మరణిచారు. అన్నదమ్ముల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.            

చిన్న పిల్లలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్! క్లీనికల్ ట్రయల్స్ కు పర్మిషన్ 

కరోనా కల్లోలంతో అల్లాడుతున్న దేశానికి ఇదో గుడ్ న్యూస్. చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన `కోవాగ్జిన్` టీకా 2-18 ఏళ్ల మధ్య వయసు గల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. 2-18 ఏళ్ల మధ్య వయసు గల వారిపై కోవాగ్జిన్ రెండు, మూడు దశల పరీక్షలు ప్రయోగాలు నిర్వహించాలని నిపుణులు కమిటీ చేసిన సిఫారసు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  2-18 ఏళ్ల మధ్య వయసు గల 525 మంది వాలంటీర్లపై భారత్ బయోటెక్ ఈ ప్రయోగాలు జరపనుంది. అయితే మూడో దశ ప్రయోగాలు ప్రారంభించడానికి ముందే రెండో దశ క్లినికల్ ట్రయల్స్ భద్రత డేటా, డీఎస్‌ఎంబీ సిఫారసులను సీడీఎస్‌సీవోకు సమర్పించాలని భారత్ బయోటిక్‌కు డీసీజీఐ సూచించింది. ఢిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ ప్రయోగాలు జరగనున్నాయి. వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులను ఇచ్చి ఫలితాలను విశ్లేషించనున్నారు.  ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఫస్ట్ వేవ్ లో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపగా... సెకండ్ వేవ్ లో యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు నెలలుగా యువకులే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. సెప్టెంబర్ లో భారత్ లో థర్డ్ వేవ్ రావొచ్చని వైద్య నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. థర్డ్ వేవ్ లో చిన్నారులపై కరోనా పంజా విసిరే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేలా కొవాగ్జిన్ క్లీనికల్ ట్రయల్స్ జరుగుతుండటం ఊరట కల్గిస్తోందియ చిన్న పిల్లల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలోపు.. 18 ఏండ్ల పైబడిన వారందరికి టీకాలు వేసేలా భారత సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. 

అమిత్ షా మిస్సింగ్ ?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తప్పి పోయారా? ఆయన ఎవరికీ కనిపించకుండా పోయారా? అలాంటిదేమీ లేదు న్క్షేపంగా అయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ట్విట్టర్’లో మాత్రం, ‘ అమిత్ షా మిస్సింగ్’ అనే యాష్‌ట్యాగ్‌తో 500కు పైగా ట్వీట్లు గురువారం ఉదయం చక్కర్లు కొట్టాయి. అంతే కాదు, ఎన్ఎస్‌యూఐ కార్యదర్శి నగేష్ కరియప్ప, కేంద్ర హోమేమంత్రి కనిపించడం లేదని, ఏకంగా పోలీసుకే ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్’లి కరియప్ప, దేశం కరోనా కోరల్లో చిక్కుకున్న సమయంలో, ప్రజలకు అందుబాటులో ఉండి  సేవ చేయవలసిన హోం మంత్రి అమిత్ షా, బాధ్యతల నుంచి తప్పించుకుని పలాయనం చిత్తగించారని కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి నాయకుడు తమ ఫిర్యాదులలో  పేర్కొన్నారు.   అలాగే, కాంగ్రెస్ యువ నేత రాజకీయనేతలు జవాబుదారీతనంతో ఉండాలని, జవాబుదారీతనం కేవలం భారత ప్రభుత్వానికి, బీజేపీకి మాత్రమే కాదని, దేశ ప్రజల పట్ల తప్పనిసరిగా ఉండితీరాలని అన్నారు. చివరిసారిగా అమిత్‌షా బెంగాల్ ప్రచారంలో కనిపించారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కరియప్ప ఫిర్యాదుపై విచారించేందుకు. ఎన్ఎస్‌యూఐ కార్యాలయానికి వెళ్ళిన పోలీసులకు కరియప్ప కనిపించలేదు. ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో కూడా తెలియదని సిబ్బంది చెప్పడంతో పోలీసులు ఆకక్దినుంచి వేణు తిరగారు.. ఇంతకీ కనిపించనిది అమిస్త్ షానా, కరియప్ప?

25 మంది కరోనా రోగులు పరార్

25 మంది కరోనా రోగులు తప్పించుకుని వెళ్లారు. కేవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న రోగులు... అర్ధరాత్రి సమయంలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. కరోనా రోగులు పారిపోయారన్న వార్తలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పారిపోయిన కొవిడ్ రోగుల కోసం స్థానిక అధికారులు, పోలీసులు గాలిస్తున్నారు. త్రిపుర రాష్ట్రంలోని అంబస్సాలో ఈ ఘటన జరిగింది.  త్రిపుర రాష్ట్రంలోని అంబస్సా పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ భవనంలో తాత్కాలికంగా కొవిడ్ కేర్ సెంటరును ఏర్పాటు చేసి అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉంచారు. వంద మందికి వరకు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ సెంటర్ నుంటే 25 మంది కరోనా రోగులు పారిపోయారు. కరోనా రోగులు పారిపోయారన్న సమాచారంతో స్థానికంగా ఉన్న అన్ని పోలీసుస్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశారు. పారిపోయిన కొవిడ్ రోగుల కోసం పోలీసులు గాలించగా వారిలో ఏడుగురిని రైల్వేస్టేషనులో పట్టుకున్నారు. మరో 18 మంది కరోనా రోగులు రైలు ఎక్కి త్రిపుర రాష్ట్రం విడిచి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఏప్రిల్ నెల 22వతేదీన 31 వతేదీన అగర్తలాలోని అరుంధతీనగర్ కొవిడ్ కేర్ సెంటరు నుంచి కరోనా రోగులు తప్పించుకొని పారిపోయారు. త్రిపుర స్టేట్ రైఫిల్స్ లో నియమకాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడటంతో కొవిడ్ కేర్ కేంద్రంలో చేర్చగా పారిపోయారు.పారిపోయిన వారిని ఇంకా గుర్తించలేదు. దీంతో తమ రాష్ట్రానికి వచ్చే వారందరూ కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని త్రిపుర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విపక్ష నేతలతో చర్చలు.. ఈటల రాజేందర్ దారెటు?

రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటల భవిష్యత్ వ్యూహం ఏమిటి? ఆయన ఏమి చేయ బోతున్నారు? ఈటల పై వేటుపడి, పదిరోజుల పైనే అవుతోంది, అయినా ఇంతవరకు ఆయన తమ రాజకీయ భవిష్యత్ ‘వ్యూహం’ ఏమిటో మాత్రం బయట పెట్టలేదు. ఆయన మనసులో ఏముందో, ఏమి చేయాలనుకుంటున్నారో, ఎక్కడా చెప్పలేదు. నిజానికి, ఈవిషయంలో ఆయనకే స్పష్టత లేదేమో అని పిస్తోంది. అందుకే కావచ్చు, కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవి వదులుకుంటానని అంటూనే, ఎన్నికలలో పోటీ చేసేందుకు బీ’ ఫారం ఇచ్చింది పార్టీనే అయినా, గెలిపించింది మాత్రం ప్రజలే అని అంటున్నారు. అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలోనూ ఈటల ఒక నిర్ణయానికి  రాలేక పోతున్నారు అనిపిస్తుంది.  అందుకే, కావచ్చు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా అనేక మంది నాయకులను కలుస్తున్నారు. అయితే, ఎందుకు కలుస్తున్నారు,ఏమి మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఎవరికీ అంటూ చిక్కడం లేదు. మొత్తానికి ఈటల ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు అన్నది మాత్రం ఆయన మాటలు, చేతలే స్పష్టం చేస్తున్నాయి.   ఒక సందర్భంలో ఆయనే, అన్నట్లుగా ఆయనకు అన్ని పార్టీలలోనూ మిత్రులున్నారు. అయినా, ఇంతకాలం  రాజకీయ కట్టుబాట్ల కారణంగా కొందమంది సీనియర్ రాజకీయ నాయకులను కలవలేక పోయారు.  అలా  కలవాలని ఉన్నా, కలవలేక పోయిన పాత మిత్రులను కలుస్తున్నారు. ఈ కలయికలు, ఎదో ఒక వ్యూహం ఆధారంగా సాగుతున్నాయని మాత్రం చెప్పలేము. అఫ్’ కోర్స్, ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు సహజంగానే రాజకీయాలు చర్చకు వస్తాయి, అందులోనూ ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితులలో రాజకీయాలు చర్చకు రాకుండా ఉండవు. అయితే, ఈ చర్చల పర్యవసానం ఏమిటి,  ఎలా ఉంటుంది  అన్నది ఎవరికీ తెలియదు. అయితే అయన ఎవరిని కలిసినా, అందుకు అనుగుణంగా కథలు, కదానాలు అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులను కలిస్తే, ఆ పార్టీలో చేరిపోతున్నారని, మరో నేతను కలిస్తే ఆయన, ఈయన కలిసి కొత్త పార్టీ పెడుతున్నారని, ఇలా మీడియాలో కధనాలు వస్తున్నాయి. అంటే కానీ, ఆయనగా  ఆయన తమ మనసులో ఏముందో మాత్రం చెప్పడం లేదు.  అయితే, అక్కడక్కడా, అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన ఒకటి రెండు మాటలు, మర్మ గర్భంగా ఆయన వ్యక్త పరిచిన అభిప్రాయాలను గమనిస్తే, ఆయన తెరాస కొండను ‘ఢీ’ కొనేందుకు సిద్దంగా లేరేమో అని పిస్తుంది. నిజానికి, ముఖ్యమంత్రి, తెరాస అధినేత కీసీఅర్ అంటే ఏమిటో, ఆయన ‘పగ - ప్రేమ’ ఎలా ఉంటుందో అందరికంటే ఈటలకే బాగా తెలుసు. ఆ ఇద్దరి మధ్య ఉన్నది, ఒకటా రెండా 19 ఏళ్ల బంధం. అందుకే, తనపై వేటుపడిన తర్వాత ఈటల ఒక సందర్భంలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్’తో ఒకసారి తెగిన బంధం మళ్ళీ ముడి పడదని అన్నారు. అలాగే, గతంలో ఇతర నాయకులను, ఇంతకంటే అన్యాయంగా బయటకు పంపినప్పుడు, కేసీఆర్ చర్యను సమర్ధించి తప్పు చేసామన్న బాధను వ్యక్త పరిచారు. అదే సమయంలో, గతంలో పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా ఈటల చేశారు. ఎదో ఒక చానల్’కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో పార్టీని, ప్రభుత్వాన్ని తానెప్పుడు ఉద్దేసపూర్వకంగా విమర్శించలేదని, కొన్ని సందర్భాలలో ప్రజల నుంచి వచ్చిన వత్తిళ్ళు, అభ్యర్ధనలకు బదులుగా, అలాంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయవలసి వచ్చిందని అన్నారు.  మరో వంక ముఖ్యమంత్రి కేసీఆర్’ మంగళ వారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో, ఈటల తప్పు చేశారని, చేసిన తప్పును స్వయంగా  ఒప్పుకున్నారని,  అందుకనే ఆయన మీద చర్యలు తీసుకున్నామని మంత్రులకు వివరించినట్లు వార్త లొచ్చాయి. అయితే ఆయన చేసిన, ఒప్పుకున్న తప్పేమిటి, అనేది చెప్పలేదు. రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు తపప్ని ఒప్పుకున్నారా, లేక అసైన్డ్ భూముల వ్యహరంలో నేరాన్ని అంగీకరించారా, అన్నవిషయంలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు.  అంతే కాదు ఈటల విషయంలో  ఎవరూ ఏమీ మాట్లాడవద్దని గాగ్ ఆర్డర్స్ పాస్ చేశారు. అంటే కేసీఆర్’కు సంబందిచినంత వరకు ఈటల ఎపిసోడ్ ముగిసిన అధ్యాయం.  ఇక ఈటల ఏమి చేస్తారు అన్నది ఆయన ఇష్టం. అయితే, స్వభావరీత్యా మెతక వైఖరి అవలంబించే ఈటల, ఎంత వరకు కేసీఅర్’ను ‘ఢీ’ కొంటారు అనేది ఇప్పుడేచెప్పడం కష్టం. అంతేకాకుండా, అసైన్డ్ భూముల వ్యవహారం, ఒకటే కాకుండా ఈటలకు సంబదించిన ఇంకేదో రహస్యం కూడా కేసీఆర్ గుప్పిట్లో ఉందని, అందుకే ఇద్దరూ ఒక విధంగా దాగుడు మూతలు ఆడుతున్నారని కొందరు లోపలి వ్యక్తుల సమాచారం.  బర్తరఫ్’కు గురైన తర్వాత అధికార తెరాస పార్టీలో ఎమ్మెల్ల్యేలు, ఎంపీలే కాదు  ఏ స్థాయి నాయకుడు కూడా ఈటలను సమర్ధిస్తూ, ఒక ప్రకటన చేయలేదు. సొంత నియోజక వర్గంలో కొంత మంది పార్టీ అనయకులు, కార్యకర్తలువచ్చి పోయినా, రాష్ట్ర స్థాయిలో ఎటు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఈటల వ్యవహారానికి సంబంధించి స్పందించిన ఒకరిద్దరు మంత్రులు, ఇతర నాయకులు కూడా ఆయన్ని తప్పు పట్టారే గానీ, ఈటలఫై కూసింత సానుభూతి కూడా చూపించలేదు. సో, ఈటల ఎపిసోడ్ శుభం  కార్డ్ ఎలా పడుతుంది అన్నది ఉహించడం కూడా ప్రస్తుతానికి కష్టమే అనిపిస్తోంది.

వామ్మో దేశంలో కరోనా డెత్ బెల్స్ .. 

దేశంలో రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది.వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,120 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది. ఇక కొత్త కేసులు 4లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ క్రితం రోజు కంటే స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18.64లక్షల మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. 3,62,727 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతక్రితం రోజుతో పోలిస్తే దాదాపు 15వేలు ఎక్కువ. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2.37కోట్లకు చేరింది.   ఇదే సమయంలో 4,120 మంది వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,58,317 మందిని బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది.  ఇక కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా భారీగా ఉంటుండటం కాస్త సానుకూలాంశం. 24 గంటల్లో మరో 3,52,181 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 1.97కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 83.26శాతానికి చేరింది.    మరోవైపు బుధవారం నాటితో పోలిస్తే దేశంలో యాక్టివ్‌ కేసులు స్వల్పంగా 6వేలు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,10,525 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. క్రియాశీల రేటు 15.65శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. నిన్న 18.94లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు 17.72కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు.    తెలంగాణాలో టీకాలు..  క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా నిన్న‌టి వ‌ర‌కు 43,74,351 మందికి మొదటి డోస్.. 10,65,362 మందికి రెండో డోస్ టీకా ఇచ్చిన‌ట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న ఒక్క రోజు 657 మందికి తొలి డోస్, 33,438 మందికి రెండో డోస్ టీకా వేసిన‌ట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 55,52,360 వ్యాక్సిన్ డోస్‌లు రాగా..  54,39,713 డోస్‌ల‌ వ్యాక్సిన్‌ను వినియోగించారు.  

కుక్కను పట్టుకోండి.. లక్ష పట్టుకోండి.. 

ఆలస్యం చేయకండి  బాబు ఆలోచిస్తే ఆశ భంగం. మంచి తరుణం మించిన దొరకదు. కుక్కను పట్టుకోండి. రూ లక్ష కొల్లగొట్టండి. అది అలాంటిలాంటి కుక్క కాదు బాబు సాక్షాత్తు హీరోయిన్ కుక్క. ఆ కుక్క అంటే ఆమెకు ప్రాణం అందుకే ఈ బంఫర్ ఆఫర్. అదేంటి కుక్క పట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తారా అని అనుకుంటున్నారా..? నేను చెప్పింది నిజం. మీరు విన్నది నిజం. అదేంటో మీరే చూడండి..  హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ తాజాగా ఓ పోస్ట్ చేస్తూ త‌మ కుక్క త‌ప్పిపోయింద‌ని, దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.ల‌క్ష ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ కుక్క ఫొటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు ఫోను చేయాల్సిన నంబ‌రును ఆమె పోస్ట్ చేసింది. కుక్క ఆచూకీ చెబితే ఏకంగా ల‌క్ష రూపాయ‌లు ఇస్తామ‌ని ఆమె చేసిన పోస్టు వైర‌ల్ అవుతోంది. పూరీ జ‌గ‌న్నాథ్‌-రామ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో న‌టించి మెప్పించిన‌ నిధి అగ‌ర్వాల్ కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. టాలీవుడ్‌లోనే కాకుండా తమిళంలోనూ నిధి అగర్వాల్ ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. త‌మిళంలో ఆమె న‌టించిన‌ రెండు సినిమాలు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆమె చేతిలో గల్లా అశోక్ హీరోగా న‌టిస్తోన్న సినిమాతో పాటు, పవన్ కల్యాణ్ న‌టిస్తోన్న 'హరి హర వీర మల్లు' సినిమా కూడా ఉంది.    

క‌మ్మ‌..క‌మ్మ‌.. జ‌గ‌న్‌రెడ్డీ ఏమిటీ కుల జాడ్యం?

వీచే గాలిది ఏ కులం? పారే నీటిది ఏ కులం? కాసే ఎండ‌ది ఏ కులం? మ‌నుషుల్లోనే ఎందుకీ కులం? అంటే, అదేం మాట‌.. కులంతో ఎన్నో రాజ‌కీయ‌ ప్ర‌యోజ‌నాలు. ఎన్నో వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునే సౌక‌ర్యాలు. కులం పేరుతో స‌మాజాన్ని చీల్చ‌వ‌చ్చు. కులం పేరుతో ఓట్ల‌ను దండుకోవ‌చ్చు. కులం పేరుతో ఎన్నో స్వార్థ‌ రాజ‌కీయాలు నెర‌ప‌వ‌చ్చు. ఏంటి? న‌మ్మ‌ట్లేదా? డౌట్ ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని అడ‌గండి తెలుస్తుంది.. కులం పేరుతో రాజ‌కీయం ఎంత క‌మ్మ‌గుంటుందో చెబుతారు. ఆయ‌న చెప్ప‌డ‌మెందుకు.. జ‌గ‌న్ తీరును ఓ సారి ప‌రిశీలిస్తే చాలు.. కులంతో గంద‌ర‌గోళం సృష్టించి.. ఏ మేర‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందారో అర్థం అవుతుంది. తాజా ఎపిసోడ్ నుంచే మొద‌లుపెడితే.. కొవాగ్జిన్‌కూ కులం మ‌కిలి అంట‌గ‌ట్టిన మ‌హానుభావుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. క‌మ్మ కులంలో కొవాగ్జిన్ పుట్టిన‌ట్టు మాట్లాడుతున్నారు. ఆ వ్యాక్సిన్‌కు స‌మీప బంధువులు ఇద్ద‌రట‌. ఒక‌రు ఈనాడు గ్రూప్ ఛైర్మ‌న్ రామోజీరావు.. మ‌రొక‌రు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఇక్క‌డ మ‌రో అక్ర‌మ సంబంధమూ అంట‌గట్టారు సీఎం గారు. రామోజీరావుకు చంద్ర‌బాబుకు మ‌ధ్య ఎలాంటి బంధుత్వం లేద‌నేది జ‌గ‌మెరిగిన విష‌యమే. అయినా.. జ‌గ‌న్‌రెడ్డి వారిద్ద‌రికీ బ‌ల‌వంతంగా బంధం క‌లిపేశారు. కొవాగ్జిన్ త‌యారు చేస్తున్న‌ భార‌త్ బ‌యోటెక్ య‌జ‌మాని.. రామోజీరావు కొడుకు వియ్యంకుడు కాబ‌ట్టి.. ఆయ‌న‌ చంద్ర‌బాబుకూ బంధువే అవుతార‌ట‌. అదెలాంటి చుట్ట‌రిక‌మో ఆయ‌న‌కే తెలియాలి. చంద్ర‌బాబుతో వారికి ఎలాంటి బంధుత్వం లేకున్నా.. బ‌ట్ట కాల్చి మీద వేయ‌డ‌మే జ‌గ‌న్‌రెడ్డి తీరులా ఉంది.  కృష్ణా ఎల్లా, రామోజీరావు, చంద్ర‌బాబులు క‌మ్మ కులంలో పుట్ట‌డ‌మే వారు చేసిన త‌ప్పిదం. అందుకే, వ్యాక్సిన్లు కొన‌డానికి క‌నీసం ఆర్డ‌ర్లు కూడా పెట్ట‌కుండా.. అడ్వాన్సులు చెల్లించ‌కుండా.. కొవాగ్జిన్ కోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేయ‌కుండా.. ఆ ముగ్గురు క‌మ్మ కుల‌స్తులు కాబ‌ట్టే.. ఏపీకి వ్యాక్సిన్ ఇవ్వ‌టం లేదంటూ నోటికొచ్చిన కూత‌లు కూస్తున్నారు గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు. న‌వ్వి పోదురు గాక నాకేంటి అన్న‌ట్టు ఉంది ఆయ‌న తీరు. జ‌గ‌న్ నోట ఇలాంటి క‌మ్మ‌టి మాట‌లు రావ‌డం ఇదే మొద‌టిసారి ఏమీ కాదు. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ విష‌యంలో అనేక‌మార్లు ఇలా కుల గ‌జ్జిని గోకుతూనే ఉండేవారు. నిమ్మ‌గ‌డ్డ‌, చంద్ర‌బాబులు ఒకే సామాజిక వ‌ర్గం కాబ‌ట్టి.. బాబు చెప్పిన‌ట్టు నిమ్మ‌గ‌డ్డ ఆడుతున్నాడంటూ రాజ్యాంగ‌బ‌ద్ద ప‌ద‌విలో ఉన్న ర‌మేశ్ కుమార్‌పై బ‌హిరంగంగా, నిస్సిగ్గుగా ఆరోప‌ణ‌లు చేయ‌డం అప్ప‌ట్లో తీవ్ర వివాదాస్ప‌దం అయింది. అప్ప‌టి ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు అడుగ‌డుగునా మోకాలొడ్డే ప్ర‌య‌త్నం చేసినా.. కోర్టుల పుణ్యాన ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్కారు చ‌ర్య‌ల‌కు చెక్ పెడుతూ.. ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను స‌జావుగా పూర్తి చేసి.. చ‌రిత్ర‌లో నిలిచిపోయారు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌. క‌మ్మ కులం పేరుతో ఆనాడు జ‌గ‌న్‌రెడ్డి చేసిన దిగ‌జారుడు ఆరోప‌ణ‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగినా.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. విమ‌ర్శ‌ల‌ను దులిపేసుకుంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త అంశాల్లో.. కొత్త కొత్త‌ వారి విష‌యంలో.. కులం కార్డు ప్ర‌యోగిస్తూ.. జ‌గ‌న్‌రెడ్డి రాజ‌కీయ ప‌బ్బం గడుపుకుంటున్నారనేది ఆరోప‌ణ‌ . ఏకంగా సుప్రీంకోర్టు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ విష‌యంలోనూ ఇలాంటి క్యాస్ట్ పాలిటిక్స్‌ చేసేందుకు ట్రై చేసి.. ఏకంగా న్యాయ‌స్థానాల‌నే వివాదంలోకి లాగాల‌ని చూశారు జ‌గ‌న్‌రెడ్డి. క‌మ్మ కులం అయితే చాలు.. వెన‌కా ముందు చూసే ప్ర‌స‌క్తే లేద‌న్న‌ట్టు.. ఎదుటి వారు ఎలాంటి వారైనా.. వారి మెడ‌లో కులం కార్డు వేసేసి.. చంద్ర‌బాబు మ‌నిషంటూ ముద్రేసి.. రాజ‌కీయ కులం క్రీడ ఆడేస్తున్నారు. సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉంటూ.. ఎన్వీ ర‌మ‌ణ ఏపీ హైకోర్టు తీర్పుల‌ను ప్ర‌భావితం చేస్తున్నారంటూ.. అప్ప‌టి ఎస్‌సీజేకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ రేసులో ఉన్న ర‌మ‌ణ‌కు ఆ అత్యున్న‌త హోదా రాకుండా అడ్డుకునేందుకే అలా కుట్ర చేశారని అంటారు. జ‌గ‌న్ చెప్పింద‌ల్లా న‌మ్మ‌డానికి వాళ్లేమీ ఏపీ ఓట‌ర్లు కాదు క‌దా. అందుకే, జ‌స్టిస్‌ ర‌మ‌ణ‌పై సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేసిన‌ ఆరోప‌ణ‌ల‌కు కొట్టేసింది సుప్రీంకోర్టు. జ‌గ‌న్ కుతంత్రాల‌ను కూల‌దోసి.. ఎన్వీ ర‌మ‌ణ‌నే సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ అయ్యారు. అయితే, ఆ విష‌యంలో అసంబ‌ద్ధ ఫిర్యాదు చేసిన సీఎం జ‌గ‌న్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు ఎందుకోగానీ క్ష‌మించి వ‌దిలేసింది.  కొవాగ్జిన్‌, ఎస్ఈసీ, సుప్రీంకోర్టు జ‌స్టిస్‌.. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే. క‌మ్మ కులం, చంద్ర‌బాబు టార్గెట్‌గా జ‌గ‌న్ రేపిన కుల గ‌జ్జి.. రాచ‌పుండులా ఏపీని వేధిస్తూనే ఉంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు కూడా ఇలానే కుల ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయంగా లాభం పొందేవారు. సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ పోలీస్ శాఖ‌లో బ‌దిలీలు జ‌రిగితే.. క‌మ్మ కుల‌స్తుల‌కే ప్ర‌మోష‌న్లు, స‌ముచిత స్థానాలు క‌ల్పించారంటూ విష ప్ర‌చారం చేశారు. తీరా ప‌క్కాగా లెక్క‌లు తీస్తే.. అందులో క‌మ్మ వారు అతి త‌క్కువ మందే. కానీ, అప్ప‌టికే రాజ‌కీయంగా పొందాల్సినంత లాభం పొందేశారు జ‌గ‌న్‌రెడ్డి. ప్ర‌జ‌లూ ఆయ‌న ఆరోప‌ణ‌లను ఎప్ప‌టిక‌ప్పుడూ ఫ్రెష్‌గా న‌మ్ముతుండ‌టం శోచ‌నీయం. ఇక‌, చంద్రబాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌ని చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును క‌మ్మ కుల‌స్తుడిగా, చంద్ర‌బాబు మ‌నిషిగా ఫిక్స్ చేసి.. ఆయ‌న్ను ఎంత‌లా వేధిస్తున్నారో అంద‌రికీ తెలిసిందే.  ఇలా.. క‌మ్మ కులాన్ని ఎంత‌లా అబాసుపాలు చేయాలో అంత‌కంటే ఎక్కువే చేస్తున్నారు జ‌గ‌న్‌రెడ్డి. త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోడానికి, తాను రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొంద‌టానికి.. క‌మ్మ కులం ఆయ‌న‌కి ఆట బొమ్మ‌లా మారిందంటున్నారు. లేక‌పోతే ఏంటి.. దేశానికి కొవాగ్జిన్‌-క‌రోనా టీకా అందిస్తున్న‌ మ‌న తెలుగు వాడిని అభినందించాల్సింది పోయి.. వ్యాక్సిన్ పైనా క‌మ్మ ముద్ర వేసి.. రామోజీరావు, చంద్ర‌బాబుతో ముడిపెట్టి.. కుల రాజకీయం చేయ‌డం.. హేయ‌మైన, నీతిబాహ్య‌మైన‌, నీచ‌, దిగ‌జారుడు రాజ‌కీయం కాక మ‌రొక‌టి కాదనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  రాగ‌ధ్వేషాల‌కు అతీతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తానంటూ ప్ర‌మాణం చేసిన ముఖ్య‌మంత్రి.. గ‌ద్దె నెక్కాక‌.. క‌మ్మ కులంపై కేవ‌లం ధ్వేషం మాత్ర‌మే చూపిస్తూ.. ప‌రిపాలిస్తుండ‌టం.. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగే అర్హ‌త అస‌లే మాత్రం లేదని తప్పుబ‌డుతున్నారు. రాష్ట్రంలోని ప్ర‌తీ ఒక్క‌రినీ ఒకేలా చూడాల్సిన ముఖ్య‌మంత్రి.. ఇలా ఒక కులంపై క‌క్ష కట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం.. ఒక కులానికి చెందిన‌ కొంద‌రు వ్య‌క్తుల‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేయ‌డం సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఏమాత్రం త‌గ‌దు. కాలం.. రంగుల రాట్నం లాంటిది. ఎప్పుడూ ఒకరి ద‌గ్గ‌రే ఆగిపోదు. కాలం గిర్రున తిరిగి.. అధికార‌మూ తారుమారు కావొచ్చు. అందుకే, కాస్త‌.. త‌గ్గు..త‌గ్గు. ఇలాంటి కుల రాజ‌కీయం వ‌ద్దు..వ‌ద్దు.