పర్మిషన్ ఉంటేనే హైదరాబాద్‌కు.. పోలీసుల క్లారిటీ..
posted on May 10, 2021 @ 4:32PM
కొవిడ్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. ఏపీకి చెందిన కరోనా పేషెంట్స్‌ను తెలంగాణలోకి అనుమతించడం లేదు పోలీసులు. రాష్ట్ర సరిహద్దుల దగ్గరే రోగులను, వారి వాహనాలను ఆపేస్తున్నారు. ఎంతగా బతిమిలాడుకున్నా తెలంగాణ పోలీసులు తమ రాష్ట్రంలోకి నో ఎంట్రీ అంటున్నారు. హాస్పిటల్‌లో తమకు బెడ్ రిజర్వ్ అయిందని చెప్పినా ఖాకీలు వినడం లేదు. సోమవారం ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇదే ఆందోళన. దీంతో.. తాజాగా, ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లే వారికి పలు సూచనలు చేశారు.
ప్రైవేట్ అంబులెన్స్‌లలో వచ్చేవారికి షరతులతో అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా వీలు కానిపక్షంలో రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. సదరు వ్యక్తికి తమ ఆస్పత్రిలో పడక సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆస్పత్రి యాజమాన్యం నుంచి ముందస్తు అంగీకార పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. అలాంటి వారికి తెలంగాణలోకి అనుమతి ఉంటుందన్నారు.
ఉదయం నుంచీ ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు.. కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ దగ్గర కూడా.. తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్ రోగులకు తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు.
అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో అందులోని కరోనా పేషెంట్ పరిస్థితి విషమంగా మారడం ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చికిత్స కోసం తెలంగాణకు వెళ్తున్న వారిని ఆపడం బాధాకరణమని అన్నారు. ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా ఇరు రాష్ట్రాలు శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు తాజాగా పలు సూచనలు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలంటే.. ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రకటించారు.