సిగ్గు సిగ్గు.. టీకాపై వైసీపీ డర్టీ పాలిటిక్స్
posted on May 10, 2021 @ 9:35PM
నలుగురు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతల తీరు. కరోనా మహమ్మారితో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోని పాలకులు... కక్ష రాజకీయాల్లో మాత్రం బిజీగా ఉన్నారు. కోవిడ్ కట్డడిని గాలికొదిలేసి.. వ్యాక్సినేషన్ ను వదిలేసి.. జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వైసీపీ నేతల ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు మరింత జుగుప్సాకరంగా ఉంటున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్లకు కులం కంపు రుద్దుతూ.. దిగజారి వ్యవహరిస్తున్నారు. జనాలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేకుండా చిల్లర వేషాలు వేస్తున్నారు.
ఏపీలో ప్రస్తుతం కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రాష్ట్రంలో పావుగంటకో ప్రాణం పోతోంది. ఆక్సిజన్ కొరత, హాస్పిటల్స్‌లో బెడ్స్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్యలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్ యావత్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ అసమర్థత, చేతగాని తనం వల్లే కరోనా విజృంభిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తున్నా.. చేతులెత్తేస్తోంది జగన్‌రెడ్డి సర్కారు. ఆక్సిజన్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటే.. కేంద్రానికి లేఖలు రాస్తూ.. తప్పును ఢిల్లీపైన నెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన ట్వీట్.. జగన్ సర్కార్ నిర్లక్ష్యానికి, చేతగానితనానికి సాక్ష్యంగా నిలుస్తోంది.
డా:ఎల్లా - రామోజీ - బాబు
మీ మధ్య బాంధవ్యాలు
బంధుత్వాలు తెలియనివి కావు.
పిచ్చి రాతలు,పిచ్చి కూతలు మాని
రాష్ట్రానికి కావాల్సినన్ని కోవాక్సిన్
ఇప్పించండి!
ఇది అంబటి రాంబాబు చేసిన ట్వీట్. ఈ ట్వీట్ పైనే ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది. అంబటికి సోషల్ మీడియాలో జోరుగా కౌంటర్లు పడుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కోవిషీల్ట్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి చెందిన కృష్ణ ఎల్లాకు చెందిన హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థలోనే కోవాగ్జిన్ తయారవుతుంది. అయినా కొవాగ్జిన్ కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదు జగన్ రెడ్డి సర్కార్. అంతేకాదు కొవాగ్జిన్ పై వైసీపీ నేతలు మొదటి నుంచి పెద్ద ఎత్తున దుష్పప్రచారం చేశారు. కొవాగ్జిన్ ను ఉత్పత్పి చేస్తున్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా కమ్మ సామాజిక వర్గం కావడంతో.. ఆ సంస్థను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడే... సమర్ధవంతంగా పని చేయదంటూ పిచ్చి పోస్టులు పెట్టారు. ట్రయల్స్ అయిపోయాక కూడా ఏడుపు ఆపలేదు. కొవాగ్జిన్ కు అనుమతి ఇచ్చే ముందు ప్రధాని మోడీ ఆలోచించుకోవాలంటూ దిక్కుమాలిన రాతలు రాశారు.
ఇప్పుడు ట్రయల్స్ అన్ని పూర్తయ్యాయి. కొవాగ్జిన్ మార్కెట్ లోకి వచ్చింది. కొవాగ్జిన్ కావాలంటూ డిమాండ్ పెరిగింది. వేరే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. మరోవైపు వ్యాక్సిన్ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ సమకూర్చుకోవడంలో విఫలమైన జగన్ రెడ్డి సర్కార్.. జనాల దృష్టి మళ్ళించేందుకు కొవాగ్జిన్ పై మళ్లీ కొత్త నాటకాలకు తెర తీసిందని అంటున్నారు. అందులో భాగంగానే ఇలా.. డా ఎల్లాకు చంద్రబాబు, రామోజీకి లింక్ పెట్టి.. వ్యాక్సిన్లు ఇప్పించవచ్చు కదా అంటూ పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా కేంద్రం చేతుల్లో ఉందంటూనే ఎల్లాకు చంద్రబాబుకు లింకు పెడుతూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేయడంపై విపక్షాలతో పాటు వైద్య వర్గాలు, జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎట్టా... ఎల్లాతో రామోజీకి బంధుత్వం ఉంటే పద్దతి పాడు లేకుండా వ్యాక్సిన్ ఇవ్వాలా అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు ఏడ్చిన వాళ్లే.. ఇప్పుడు కావాలంటూ కథలు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే వాగినట్లు.. రామోజీతో బంధుత్వం ఉన్నందుకు కృష్ణా ఎల్లా కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే.. మరీ జగన్ అక్రమస్తుల కేసులతో లింకున్న హెటిరో సంస్థ నుంచి ఎందుకు రెమిడిసివర్ ఇంజక్షన్లు తెప్పించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో సంస్థ నుంచి కొవిడ్ మందులు ఫ్రీగా ఎందుకు ఇప్పించడం లేదో చెప్పాలంటున్నారు. రాంకీ సంస్థ ఆళ్ల ఫ్యామీలిది కదా.. పెద్దాయనకు రాజ్యసభ కూడా ఇచ్చారు కదా.. వాళ్లతో రాష్ట్రమంతో ఫ్రీగా మందులు జగన్ రెడ్డి.. ఎందుకు ఇప్పియ్యలేకపోయారని నెటిజన్లు నిలదీస్తున్నారు. వాళ్లను వ్యతిరేకించే వాళ్లకు ఒక రూల్.. సమర్ధించేవాళ్లకు ఒక రూలా అంటూ వైసీపీ నేతలను కడిగి పారేస్తున్నారు నెటిజన్లు.
కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మోడీ సర్కార్ కూడా మే1 నుంచి మూడో దశలో భాగంగా 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం టీకాలకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. కాని ఏపీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేయకుండా 18 ఏండ్లు పైబడిన వారికి ఇప్పుడే టీకాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. 13.5లక్షల వ్యాక్సిన్ల కోసం రూ.45 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. పొరుగున ఉన్న కేరళ కోటి వ్యాక్సిన్లు, తమిళనాడు కోటిన్నర, కర్ణాటక కోటి, మహారాష్ట్ర మొత్తం జనాభాకు సరిపోయేంత వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించి వనరులు సిద్ధం చేసుకొన్నాయి. తెలంగాణ సర్కార్ కూడా 2 వేల 5 వందల కోట్లను వ్యాక్సిన్ కోసం ఖర్చు చేస్తామని ప్రకటించింది. అయితే ఐదు కోట్లకు పైగా జనాలున్న ఏపీకి 13 లక్షల టీకాలు ఏ మూలకు వస్తాయి? మొత్తం వనరులన్నీ పోగుచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ చాలినన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇవ్వలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తొలి డోసు తీసుకున్నవారంతా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ల సెంటర్లకు క్యూ కడుతున్నారు. అర్ధరాత్రే వెళ్లి క్యూలైన్లలో నిల్చుకుంటున్నారు. గంటలకొద్ది అక్కడే ఉంటున్నారు. వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. అయినా సర్కార్ మాత్రం చోద్యం చూస్తోంది. దీంతో వ్యాక్సిన్ సెంటర్లే కోవిడ్ వ్యాప్తికి హాట్ స్పాట్లుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై జనాలు ఫైరవుతున్నారు. దీంతో నెపాన్ని కేంద్రంపై వేసి చేతులు దులుపుకునే యోచనలో జగన్ రెడ్డి సర్కార్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు, రామోజీకి.. కృష్ణ ఎల్లాతో బంధుత్వం కలుపుతూ కొత్త కుట్రలు చేస్తున్నారనే విమర్శలు ఏపీ జనాల నుంచి వస్తున్నాయి.