మోడీ రిటైర్మెంట్ చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లేనా?

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో 75వ పడిలో అడుగుపెట్టనున్నారు. బీజేపీ తనంతట తానే విధించుకున్న నిబంధన మేరకు మోడీ ఇక రిటైర్ కావలసిందే. మోడీ ప్రధానిగా తొలి సారి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ పార్టీలోని సీనియర్లను వయస్సు కారణంగా చూపుతూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంచే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు.. చేసి చూపించారు కూడా. బీజేపీలో సీనియర్ మోస్ట్ నాయకులైన ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు వారికి 75 ఏళ్లు వచ్చాయన్న ఒకే ఒక కారణంతో పార్టీలో క్రియాశీలక పాత్ర లేకుండా చేశారు. వారికి కనీసం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. బీజేపీ అంగీకరించకపోవచ్చు కానీ ఆ సీనియర్లిద్దరినీ అత్యంత అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు.  ఇప్పుడు అదే పరిస్థితి మోడీకి వస్తుందని చాలా మంది భావించారు. కానీ ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టిన ఈ దశాబ్దంపైగా కాలంలో మోడీ పార్టీపైనా, ప్రభుత్వంపైనా కూడా పూర్తి పట్టు సాధించారు. మోడీ కాకపోతే మరెవరు? అన్న పరిస్థితి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏర్పడేలా చేశారు. ఈ నేపథ్యంలోనే మోడీ 75 ఏళ్ల వయస్సు వచ్చినా ప్రధానిగానే కొనసాగే పరిస్థితి కల్పించుకున్నారు. కానీ అనుకోని విధంగా మోడీ ఓవర్ డూయింగ్స్ పార్టీ మెంటార్ గా భావించే ఆర్ఎస్ఎస్ ఒకింత ఆగ్రహంగా ఉందన్న వార్తలు గుప్పుమనడం.. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొంత కాలం కిందట 75 ఏళ్లకే రిటైర్మెంట్ అంటూ నొక్కి వక్కాణించడంతో మోడీ కొనసాగింపు ఎండమావే అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఇందుకు తోడు అంతకు ముందు అంటే మోడీ ముచ్చటగా మూడొ సారి ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత హుటాహుటిన నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్ సహా సంఘ్ ప్రముఖులతో భేటీ అవ్వడం కూడా ఆర్ఎస్ఎస్, మోడీల మధ్య కుచ్ కుచ్ హోతా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత మోహన్ భగవత్ 75 ఏళ్ల నిబంధన గురించి లేవనెత్తడం కూడా మోడీ పదవికి ఇక ఎసరు వచ్చినట్లేనన్న వార్తలు గుప్పుమన్నాయి. దేశ వ్యాప్తంగా మోడీ వారసుడెవరన్న చర్చ సైతం జోరుగా సాగింది. అయితే ఈ వ్యవహారం అంతా టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. 75 ఏళ్ల వయస్సు నిబంధనపై అంత గట్టిగా మాట్లాడిన మోహన్ భగవత్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. వయస్సు పైబడినా ఉత్సాహంగా పని చేసే వారికి ఆ నిబంధన వర్తించదంటూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ మోడీ పదవీ కాలం ఇక నెలలే అంటూ జరిగిన చర్చకు తెరపడింది. మరో సారి కూడా మోడీయే అన్న భావన బలపడింది. ఆర్ఎస్ఎస్ ను కూడా తన దారికి తెచ్చుకున్న మహాలుడిగా మోడీని కమలం శ్రేణులు కీర్తిస్తున్నాయి. మోడీ ముందు ఆర్ఎస్ఎస్ తలవంచినట్లైందంటూ పరిశీలకులు విశ్లేషణలకు పదును పెడుతున్నారు. 

గురువింద సామెతను గుర్తు చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి తీరు

జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అనాచారాలకు అంతే లేదు. జగన్ మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకా, కాదా అన్నది పక్కన పెడితే ఆయన హిందువు అయితే కాదు. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావు లేదు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవుళ్లకు, ఆలయాలకు, హిందూ ధర్మానికి జరిగిన అపచారాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సంఘటనలే ఆయన హిందూ వ్యతిరేకా అన్న అనుమానాలు బలపడేలా చేశాయి.   ఒక విధంగా చెప్పాలంటే హిందూ సమాజం వ్యక్తం చేసిన ధర్మాగ్రహమే ఆయనను అధికారం నుంచి దించేసిందని చెప్పవచ్చే. హైందవ ధర్మం పట్ల , మరీ ముఖ్యంగా తిరుమల విషయంలో ఆయన హయాంలో జరిగిన అనాచారాలు, అపచారాలు   జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ  శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీకి సైతం ఆగ్రహం తెప్పించాయి.  జగన్ హయాంలో సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై ఆయన మీడియా ముఖంగా వ్యక్తం చేసిన ఆగ్రహమే అందుకు నిదర్శనం.   జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటనకోకొల్లలు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరిగాయో తెలియంది కాదు.  అంతెందుకు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామిని నల్లరాతితో పోల్చిన నాస్తికుడు భూమన కరుణాకరరెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నియమించడం ద్వారా జగన్ తన తీరు ఏమిటో? వైఖరి ఏమిటో ఎటువంటి దాపరికం లేకుండా చాటుకున్నారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న కాలంలో వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురి చేశాయి.   ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారింద విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు భూమన టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా  మారిపోయిందన్న ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.   గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం  ఇచ్చాయి.   ఇంతగా తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డి ఇప్పుడు హైందవ ధర్మపరిరక్షకుడి అవతారం ఎత్తినట్లుగా...టీటీడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉండగా మొదలై, ఆ తరువాత కూడా కొనసాగిన అవకతవకలు, అక్రమాలు, అధర్మాలను... రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత బాధ్యతలు చేపట్టిన తిరుమల తిరు పతి దేవస్థానం బోర్డు సభ్యులు సరిదిద్దుతూ, తిరుమల పవిత్రత పెంచేలా చర్యలు తీసుకుంటుంటే.. భూమన విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఆరోపణలతో రెచ్చిపోతున్నారు.  తప్పులన్నీ తాను చేసి.. ఇప్పుడు భూమన టీటీపై ఆరోపణలతో ఎందుకింతగా రెచ్చిపోతున్నారు? జనం విశ్వసిస్తారని ఎలా భావిస్తున్నారు? అంటే తిరుమలలో వర్షం పడితే... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు తడిసి ముద్దౌతారు. తిరుమలలో జరిగే ఏ చిన్న సంఘటన అయినా భక్తులు, హిందూ ధార్మిక సంస్థల దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే.. తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భూమన ఈ రకంగా టీటీడీపై విమర్శల దాడికి దిగుతున్నారు. తద్వారా తాను తిరుమల పవిత్రతను కాపాడటానికి కంకణం కట్టుకున్న వ్యక్తిగా జనం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమలకు సంబంధించిన అంశం అంటే మీడియా వాస్తవమా? అవాస్తవమా? అన్న శోధనలోకి పోకుండా ప్రాధాన్యత ఇచ్చి ప్రాచుర్యం కల్పిస్తుందన్న భావనతో భూమన ఇలా రెచ్చిపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి జనం మెమరీ చాలా తక్కువ అన్నభ్రమల్లో భూమన తన హయాంలో జరిగిన అపచా రాలను ప్రజలు మరిచిపోయి ఉంటారనుకుంటున్నారు.  ఇపుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల ప్రతిష్టను దెబ్బతీయాలంటే ఇలాంటి ఎదురుదాడే శరణ్యమని భ్రమిస్తున్నారు.  అయితే భూమన రీతి గురివింద చందంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. భూమన ప్రతి విమర్శపైనా మీ హయాంలో చేసిందేమిటి? అంటూ జనం చర్చించుకుంటున్నారు. 

ఏపీకి బుల్లెట్ ట్రైన్ : సీఎం చంద్రబాబు

  అమరావతి మీదగా ఆంధ్రప్రదేశ్‌‌కి బుల్లెట్ రైలు రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ఏపీ నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతి గంటకు ఫ్లైట్ ఉండేలా ఎయిర్ ఫోర్టులు తీర్చిదిద్దబోతున్నామని పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాదిని కలిపే మార్గాలన్నీ  ఏపీ నుంచే వెళ్తుంటాయి. అమరావతి- చెన్త్నె- బెంగళూరు నగరాల మధ్య బుల్లె రైళ్లు రానున్నాయి సీఎం తెలిపారు.ఇందుకోసం హైదరాబాద్ – చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి  మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్‌డీఏ గుండా వెళ్తుంది.

బీహార్‌లో జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

  బీహార్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా కొట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార్ యాత్రలో ఓ వ్యక్తి ప్రధాని మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసన బీజేపీ ర్యాలీ చేపట్టగా దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు ఎదురుపడిన సమయంలో పార్టీ జెండాలతో పరస్పరం దాడి చేసుకున్నారు.విపక్ష నేత రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ కలిసి నిర్వహించిన 'ఓటర్ అధికార యాత్ర' కార్యక్రమంలో కొందరు వ్యక్తులు.. నరేంద్ర మోదీ సహా ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కావాలనే ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఈ కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ సైతం.. మోఈ ఘటనపై స్పందించారు. ప్రధాని మోదీని క్షమించమని అడిగారు. తప్పుడు వ్యాఖ్యలను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ తెలిపారు  

అనుమానాస్పదస్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మరణించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగింది. కాటారం జాతీయ రహదారి పక్కన కమలాపూర్ క్రాస్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతి చెందిన యువతిని ఒడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు. ఆమె మృతదేహం పక్కనే ఆధార్ కార్డు, నిమ్మకాయలు, కుంకుమ ఉన్నాయి.    వర్షిణి తండ్రి చనిపోయిన బాధతో ఈ నెల 3 న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కోసం తల్లి వెతికి జాడ తెలియకపోవడంతో చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో  గురువారం కమలాపూర్ క్రాస్ అటవీ ప్రాంతంలో యువతి మృత దేహం ఉందన్న సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఆధార్ కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా యువతి చిట్యాల మండలానికి చెందిన వర్షిణిగా గుర్తించారు.  

టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష

టీవీ నటుడు లోబోకు ఏడాది  జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2018 టీవీ నటుడు లోబో,  అతని టీమ్  2018 లో వీడియో చిత్రీకరణలో భాగంగా వరంగల్ కు వెళ్లారు. అక్కడ రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు ప్రాంతాల్లో పర్య టించి వీడియోలు చిత్రీకరించారు. చిత్రీకరణ పూర్త యిన అనంతరం అదే సంవత్సరం మే 21వ తేదీన లోబో టీమ్ మొత్తం కారులో అత్యంత వేగంగా వరంగల్ నుండి హైదరాబాద్ కు వస్తుండగా యాక్సిడెంట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారు  రఘు నాథ్ పల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద  ఆటోని ఢీ కొంది. ఈ ప్రమా దంలో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన  రఘునాథపల్లి పోలీసులు ఈ కేసు విచారించిన జనగామ జిల్లా కోర్టుకు సక్ష్యాలు సమర్పించారు. కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్నతరువాత  లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

హైడ్రాపై హైకోర్టు ప్రశంసల వర్షం!

కోర్టుల నుంచి చీవాట్లు తినడమే పరిపాటి అన్నట్లుగా మారిన హైడ్రాకు తొలి సారిగా ప్రశంసలు లభించాయి. ఔను నిజమే తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇంత కాలం కోర్టులంటే లెక్కలేదా? మా ఆదేశాలను ఖాతరు చేయరా?  కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ హెచ్చరికలు, మొట్టికాయలతో తలబొప్పి కట్టేలా చీవాట్లు పెట్టిన హైకోర్టు తొలి సారిగా గురువారం (ఆగస్టు 28) హైడ్రాను ప్రశంసించింది.   హైదరాబాద్ నగరంలో రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడంలో  హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందంటూ పొగడ్తల వర్షం కురిపించింది. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా చేస్తున్న కృషిని అభినం దించింది. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో హైడ్రా సేవలు  భేష్ అంటూ జస్టిస్ బి. విజయ్‌ సేన్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసం పేర్కొంది.  విషయమేంటంటే.. రాంనగర్ మణెమ్మ వీధిలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య భవనాన్ని  స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్  ఫిర్యాదు మేరకు హైడ్రా తొలగించింది.  దీంతో తన భవనాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆ వాణిజ్య సముదాయ నిర్మాణదారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం (ఆగస్టు 28) విచారించిన హైకోర్టు  పై వ్యాఖ్యలు చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

లాంగ్ లీవ్ పై ఐఏఎస్ స్మితా సబర్వాల్

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు అమె సెలవు పెట్టారు. సెలవుకు ఆరోగ్య కారణాలు చూపినప్పటికీ.. గత ప్రభుత్వంలో సీఎంవో లో అడిషనల్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో కూడా స్మితా సబర్వాల్ పై చర్యలకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె లాంగ్ లీవ్ పై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆమె తన సెలవుకు కారణం గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆమె సెలవును ప్రభుత్వం మంజూరు చేసింది.  

కేసిరెడ్డి పీఏకి బెయిలొచ్చింది కానీ.. పాపం!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు గురువారం (ఆగస్టు 28) కొట్టివేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ఏ1 అన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోసం రాజ్ కాసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ విజయవాడ ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు పిటిషన్ల పై ఏసీబీ కోర్టు గురువారం (ఆగస్టు 28) తీర్పు వెలువరించింది. రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి లకు బెయిలు నిరాకరించిన కోర్టు, ఇదే కేసులో ఏ30 అయిన రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ రెడ్డికి మాత్రం బెయిలు మంజూరు చేసింది.  ఈ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న నిందితులలో దిలీప్ ఒకరు. అతడికి ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అయితే రాజ్ కరేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు మాత్రం కోర్టు బెయిలు నిరాకరించి, వారి పిటిషన్లను డిస్మిస్ చేసింది.  రాజ్ కేసిరెడ్డి గతంలో బెయిలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని  సూచిస్తూ ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.   

ఆధార్ తరహాలో ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్ లో  కుటుంబాలన్నిటికీ ఫ్యమిలీ బెనిఫిట్ కార్డు అందించే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డ్ తరహాలో ఈ కార్డు రాష్ట్ర పథకాల ప్రయోజనాలన్నిటికీ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇడింటిఫికేషన్ కింద ఉపయోగపడుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి అందుతున్న పథకాలు సహా  సమస్త వివరాలూ ఫ్యామిలీ కార్డులోనే నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసేందుకు కట్టుబడి ఉందనీ, అందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును తీసుకురానున్నట్లు చంద్రబాబు చెప్పారు.  ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థపై గురువారం (ఆగస్టు 28) సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఆ సందర్భంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు  నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ తరహాలోనే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన మొత్త సమాచారం అందు బాటులో ఉంటుందన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలను  ఫ్యామిలీ కార్డులో పొందుపరిచి, వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కుటుం బాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు, అందుకు అనుగుణంగా అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలను రీడిజైన్‌ చేసే విషయాన్ని పరిశీలించలని చంద్ర బాబు పేర్కొన్నారు.   

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఆరిఫ్ హుస్సేన్ అరెస్టు

బీహార్ కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసింది. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడైన ఆరిఫ్ హుస్సేన్  దేశం విడిచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎన్ఐఏ అడ్డుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అతడిని అదుపులోనికి తీసుకుంది. ఆరిఫ్ వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూరుస్తాడనీ, దేశంలో  జిహాదీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ అభియోగాలు ఉన్నాయి.  సిరాజ్ ,సమీర్ ల అరెస్టుల తర్వాత   అప్రమత్తమైన ఆరిఫ్ హుస్సేన్ విదేశాలకు పరారయ్యేందకు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఎన్ఐఏ ఆయనను ఢిల్లీ ఎయిర్ పోర్టులో గురువారం (ఆగస్టు 28) అదుపులోనికి తీసుకుంది. ఆరిఫ్ ను శుక్రవారం (ఆగస్టు 29) విశాఖ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ  ఆలయంలో శుక్రవారం (ఆగస్టు 29) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల మేరకు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాల్సి ఉంటుంది. భక్తులు మాత్రమే కాకుండా ఆలయ ఉద్యోగులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఆలయ ఉద్యోగులు కొలువులకు సంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ ల వినియోగంపై నిషేధం అమలులోనికి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఎవరూ కూడా సెల్ ఫోన్ లు వినియోగించకూడదు. ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు అమ్మవారి దర్శనానికి రావాలని దుర్గగుడి ఈవో తెలిపారు.   

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 29) ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగేందుకు 3 గంటలకు పైగా సమయం పడుతోందిఇక గురువారం (ఆగస్టు 28) శ్రీవారిని మొత్తం 63 వేల 843 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.

విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్

  ఏపీకి మరో భారీ పెట్టుబడికి సిద్దమైంది. విశాఖలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ఈ సెంటర్‌ సాగర నగరం వైజాగ్‌లో నిర్మాణం కానుంది. మూడు సముద్రపు కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్ల ద్వారా వైజాగ్‌‌లో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ముంబయికి రెండు రెట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ రూపుదిద్దుకోనుంది. విశాఖలో 6 బిలియన్‌ డాలర్లతో డేటా సెంటర్‌ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్‌ ఇండియా ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా నిర్ధరించింది. ఇది గ్రీన్‌ ఎనర్జీ వినియోగంతో ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలవనుంది. హౌసింగ్‌ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (AI) హబ్‌ల ఏర్పాటుకు అందులో చోటు కల్పించనుంది.హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో విశాఖపట్నం మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో ఈ డేటా సిటీని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.   

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చింది భూమనే : ఓ.వి.రమణ

  భూమన హైందవ ధర్మ పరిరక్షకుడు కాదు..టీటీడీని దోచేసిన ఘనుడు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు ఓ.వి.రమణ విమర్శించారు. కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చిందే భూమన అని ఆరోపించారు.బిక్షగాళ్లను తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయించారని పేర్కొన్నారు. కలెక్టర్లకు టార్గెట్ లు ఇచ్చి ఎవరిని పడితే వారిని పట్టుకొచ్చి వివాహాలు చేయించారని ఆయన తెలిపారు. వైజాగ్ లో దళిత గోవిందం నిర్వహించి ఒక్క అగ్గిపెట్టెకు 12వేలు ఖర్చు చేశారు. ఆడిట్ రిపోర్టులో బయటపడిందని రమణ పేర్కొన్నారు.సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క కాటేజీ అయినా కట్టించావా భూమన అని ఆయన ప్రశ్నించారు. తిరుమల టీటీడీ ఛైర్మన్ గా రెండు సార్లు పనిచేసిన భూమన సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా..? ఆయన ప్రశ్నించారు. బుషికేష్ లో 20ఎకరాల స్థలాన్ని నొక్కేయాలని చూస్తే దాత ఆ స్థలాన్ని విరాళంగా ఇవ్వకుండా వెళ్లిపోయారని అన్నారు. వైసీపీ హయాంలో కొండపైన వ్యభిచారం జరిగిందని సాక్షాత్తు చిన్నజియ్యర్ స్వామే చెప్పారని ఆరోపించారు . దేవుడి సొమ్ములో కమిషన్ కు కక్కుర్తి పడిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని తెలిపారు.శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది వాస్తవం కాదని భూమన చెప్పగలడా..? అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికే క్రైస్తవుడే తెలిపారు.తాడేపల్లి, లోటస్ పాండేలలోని గోడలపై బైబిల్ సూక్తులే కనిపిస్తాయిని వెల్లడించారు. తిరుమల టీటీడీని రోడ్డుపై లాగొద్దు భూమనకు రమణ సూచించారు.  

వార్డెన్ చొరవ..హాస్టల్ విద్యార్థుల సంరక్షణకు భరోసా

  హాస్టల్ కు వచ్చామా..  అటెండెన్స్ వేసామా మెనూ ఇచ్చామా ఇందులో ఏమైనా మిగులుతాయా ..ఇంటికి వెళ్ళామా అనే ధోరణితో పని చేసే వార్డెన్లు చాలా చోట్ల కనపడుతుంటారు. అయితే ఈ  వార్డెన్ అందుకు భిన్నమైన ధోరణితో విద్యార్థుల పట్ల, విధుల పట్ల అంకితభావంతో పని చేస్తూ విద్యార్థుల పరిశుభ్రతకు ,ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ సొంత బిడ్డలకు ఎలా కేర్ తీసుకుంటారో అలా హాస్టల్ లో కూడా కేర్ తీసుకుంటూ సంరక్షణ చేస్తున్నారు. వైయస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో  సాంఘిక సంక్షేమ  హాస్టల్ లో ఈ వార్డెన్ (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) పనిచేస్తూ విద్యార్థుల సంరక్షణకు, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు హాస్టల్ భవనం 45 సంవత్సరాల క్రితం నిర్మించినది అయినా కూడా అందులో వార్డెన్ గుప్తా విద్యార్థులకు చేసిన ఏర్పాట్లు శభాష్  అనేలా ఉన్నాయి.ఆ హాస్టల్లో బెడ్ సీట్లు పెట్టుకోవడానికి దాత ద్వారా చెక్కతోచేసిన బీరువా ఏర్పాటు చేయించారు.పిల్లలు తేమతో కూడిన ప్లేటు పెట్టేలో పెట్టుకుంటే క్రిములుచేరడం, దుర్వాసన రావడం జరుగుతుందని ప్లేట్లు బయటే పెట్టుకునేందుకు ఒక స్టాండ్ ను ఏర్పాటు చేశారు. పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు తగిన మందులను సూచిస్తూ మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ టాబ్లెట్ అందుబాటులో ఉంచారు.అవసరమైనప్పుడు వారికి అందజేస్తారు. ఇంగ్లీష్ మందులే కాకుండా దగ్గుకు కరక్కాయ లాంటి ఆయుర్వేద గుణం కలిగిన వాటిని కూడా అందుబాటులో ఉంచారు. పిల్లలు చదువుకునేందుకు లైబ్రరీ కూడా అందులో ఉంచి పుస్తకాలు సమకూర్చి పెట్టారు. గ్లాసులు, కప్పులు విద్యార్థి ఎవరిది వారు పెట్టుకునేలా స్టాండ్లు ఏర్పాటు చేశారు. స్టోర్ రూమ్ లో వస్తువులు పురుగులు ,చీమలు చేరకుండా బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా విద్యార్థులను తన చేతనైనంత వరకు సొంత బిడ్డల్లా ఆలోచించి, వసతులు ఏర్పాటు చేసిన వార్డెన్ గుప్తాను పలువురు అభినందిస్తున్నారు. అయితే అన్నీ ఆయన బాగా చేస్తున్నా పిల్లలు తాగేందుకు సురక్షిత మంచినీరు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం దురదృష్టకరంగా చెప్పవచ్చు. సురక్షిత మంచి నీటి ప్లాంట్ అనేక సంవత్సరాలనుండి పని చేయక పోయినా  అధికారులు మారమ్మత్తు చేయకకపోవడం హాస్టల్ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది.

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు బెయిల్

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో జగన్ మోహన్‌ను రావును సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించటంతో పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.1 లక్ష, రెండు షూరిటీ సంతకాలతో సమర్పించాలని ఆదేశించింది. అవినీతి ఆరోపణలతో పాటు హెచ్ సీఏ ఎన్నికల్లో 2016లో జరిగిన శ్రీచక్రా క్లబ్ ఫోర్జరీకి సంబంధించి నిర్దిష్ట ఆధారాలు చూపడంలో సీఐడీ విఫలమైందని తెలిపారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది.  గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారని సీఐడీ తెలిపింది. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ చెబుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ టికెట్ల వివాదంలోనూ ఆయనపై ఆరోపణలున్నాయి.ఇటీవలే జగన్మోహనరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.   

ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు

  ఏపీలో ప్రతీ కుటుంబ సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు  అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఫ్యామ్లీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలి. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలి. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోరు కేటాయించాలి.  ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలి. దీని కోసం ఫ్యామిలీ కార్డును తీసుకురండి. ప్రతి కుటుంబానికి ఆ ఫ్యామిలీ కార్డు అందించాలి. ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపర్చడంతో పాటు... పూర్తి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  అంతే కాకుండా... కుటుంబంలో ఎంత మంది ఉంటే.. వారందరికీ ఆ కార్డును ఇస్తే.. ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి.” అని సీఎం సూచించారు.ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.