స్థానిక సంస్థలకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

  స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.  ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది.తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో  భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు చేసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు క్యాబినెట్ సిఫార్సు చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంతోపాటు, ఇటీవలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా క్యేబినెట్ నిర్ణయం తీసుకుంది.  

దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ వార్షిక సమావేశం

  ఆగస్టు 29 నుండి పుదుచ్చేరిలోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ 24వ వార్షిక సమావేశం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్లు, పరిశోధకులు, యువ వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ఆర్థోపెడిక్ రంగంలో తాజా ఆవిష్కరణలు, కొత్త చికిత్సా పద్ధతులు, అధునాతన శస్త్రచికిత్సా సాంకేతికతలపై చర్చించారు. 5 వేల మందికి పైగా సభ్యులున్న ఈ అసోసియేషన్ ఆహ్వానం మేరకు తిరుపతి బర్డ్ హాస్పిటల్ సంచాలకులు డా. గుడారు జగదీష్ ఈ సమావేశంలో పాల్గొని ప్రధాన ప్రసంగం చేశారు. “యువ రోగులకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు” అనే అంశంపై ఆయన విస్తృతంగా వివరించారు. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయసున్న రోగులకు దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే మోకాలి సమస్యల సందర్భాల్లో మోకాలి మార్పిడి అవసరం అవుతుందని వివరించారు. చిన్న వయసులో ఇలాంటి శస్త్రచికిత్సలలో ఎదురయ్యే సవాళ్లు, ఆపరేషన్ అనంతర జీవిత నాణ్యతలో వచ్చే మార్పులను విశ్లేషించారు. అదేవిధంగా చిన్న వయసులో జాయింట్ రీప్లేస్‌మెంట్ అవసరమా? ఆపరేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై లోతైన అవగాహన కల్పించారు. “ఉద్యోగం చేయలేక, ఇంటికే పరిమితం అయిన రోగుల జీవితాన్ని మార్చడంలో మోకాలి మార్పిడి ఆపరేషన్ కీలకం” అని డా. జగదీష్ అన్నారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడానికి సర్జన్ నైపుణ్యం, ఆపరేషన్ సమయంలో తీసుకునే జాగ్రత్తలు, నాణ్యమైన ఇంప్లాంట్ల ఎంపిక ప్రధానమని ఆయన పేర్కొన్నారు. తన అనుభవాలు, పరిశోధనల ఆధారంగా యువ రోగులకు ఈ శస్త్రచికిత్సలో పరిగణించాల్సిన అంశాలను వివరించారు. 1999లో బర్డ్ హాస్పిటల్‌లో 21 ఏళ్ల యువతికి చేసిన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఉదాహరణను ఆయన గుర్తుచేశారు. 26 సంవత్సరాల తర్వాత కూడా ఆ మహిళ ఆరోగ్యవంతంగా, చురుకుగా జీవిస్తున్నారని వివరించారు. ఈ తరహా ఉదాహరణల ద్వారా సరైన ఆర్థోపెడిక్ చికిత్సలతో యువ రోగులు కూడా పూర్తిగా కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరని ఆయన స్పష్టం చేశారు. డా. జగదీష్ ప్రసంగం యువ వైద్యులు, పరిశోధకులకు ఎంతో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఈ సమావేశం ఆర్థోపెడిక్ వైద్య రంగంలో కొత్త పరిశోధనలకు, మెరుగైన చికిత్సా విధానాలకు మార్గం సుగమం చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

మోడీ చైనా టూర్ మేట‌రేంటి?

  ఆగ‌స్ట్ 29 నుంచి సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కూ మోడీ జ‌పాన్, చైనా ప‌ర్య‌టిస్తున్నారు. జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఆర్ధికాంశాలు ప్ర‌ధాన  పాత్ర పోషిస్తున్న‌ట్టు చెబుతున్నారు విదేశాంగ శాఖ అధికారులు. ప‌ది ట్రిలియ‌న్ జపాన్ ఎన్లు వ‌చ్చే ప‌దేళ్ల‌లో భార‌త్ లో పెట్టుబడుల వ‌ర్షం కురిసేలా తెలుస్తోంది. అస‌లీ యాత్ర మొత్తంలో చైనా షాంఘై కోప‌రేటివ్ స‌మ్మిట్ లోనే అస‌లు మేట‌ర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. పుతిన్ తో స‌హా మొత్తం ఇర‌వై మందికి పైగా ప్ర‌పంచ నాయ‌కులు ఈ వేదిక మీద ఎక్కి ఒకేసారి క‌నిపించ‌నున్నారు. గ‌తంలో ర‌ష్యాలో జ‌రిగిన బ్రిక్స్ స‌మావేశాల త‌ర్వాత మోడీ.. పుతిన్, జిన్ పింగ్ ని క‌ల‌వ‌డం ఇదే. ఇప్ప‌టికే మోడీ చైనా ప‌ర్య‌టించి ఏడేళ్లు పూర్తి కావ‌స్తోంది. ఇప్ప‌టికే ట్రంప్ మోడీ స‌ర్కార్ పై గ‌రం గ‌రంగా ఉండ‌టం తెలిసిందే. అమెరికా అప్పీళ్ల కోర్టు.. ఇలాంటి సుంకాల విధింపు అక్ర‌మం అని కోర్టు తీర్పునిచ్చినా ఆయ‌న సుప్రీం కెళ్లి త‌ద్వారా.. తాను అనుకున్న‌ది సాధించాల‌నుకుంటున్నారు. దీంతో మోడీ స‌ర్కార్ కూడా రూట్ మార్చింది. మ‌న వ‌స్త్ర ఉత్ప‌త్తులు దిగుమ‌తి పొందే 40 దేశాల్లో మేళాలు పెట్టి మార్కెటింగ్ పెంచి.. అమెరికా  నుంచి ఎదురు  కానున్న‌.. నష్టాన్ని పూడ్చే య‌త్నం చేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే మోడీ ప్ర‌స్తుతం ఇటు పుతిన్ తో పాటు అటు జిన్ పింగ్ ని సైతం క‌ల‌సి కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకునేలా తెలుస్తోంది. 2001లో ఆరు యురేషియా దేశాలతో మొద‌లైన ఎస్. సీ. ఓ.. ప్ర‌స్తుతం ఇర‌వైకి పైగా దేశాలతో పెద్ద కూట‌మిగా అవ‌త‌రించింది. ఇదిలా ఉంటే ఈ స‌మ్మిట్ ద్వారా గ్లోబ‌ల్ సౌత్ అనే కాన్సెప్ట్ ని కూడా తెర‌పైకి తెచ్చేలా తెలుస్తోంది. వీరంతా క‌ల‌సి వ‌చ్చే రోజుల్లో అమెరికా వ్య‌తిరేకంగా తీర్మానాలు తీస్కుంటే అదో గేమ్ ఛేంజ‌ర్ కానుంది. ఇప్ప‌టికే యూరోలా బ్రిక్స్ దేశాలు సైతం ఒక క‌రెన్సీని ఎంపిక చేసుకుని త‌ద్వారా.. చెల్లింపులు మొద‌లు పెడితే డాల‌ర్ ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా స‌గం ప‌డిపోతుంది. ఆపై ఈ బ్లాక్ మెయిల్ డ్రామాలకు ఇక కాలం చెల్లిపోతుంది. ఇలాంటి కీల‌క‌మైన నిర్ణ‌యంగానీ ఈ స‌మ్మిట్ ద్వారా ఒక్క‌టి బ‌య‌ట‌కొచ్చినా చాలు ట్రంప్ ఖేల్ ఖ‌తం దుక‌ణం బందేనంటున్నారు. ఇవే కాకుండా ఆర్ధిక- ర‌క్ష‌ణ- సైనిక ప‌ర‌మైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కూడా ఈ దేశాలుగానీ చేసుకోవ‌డం మొద‌లైతే అమెరికా, దాని వెన‌కున్న యురోపియ‌న్ దేశాలు దాదాపు ఒంట‌రిగా మిగిలిపోతాయి. వీట‌న్నిటిలోకీ యూఎస్ పెద్ద‌న్న పాత్ర దారుణంగా  ప‌డిపోయి బ‌ల‌హీన  ప‌డుతుంది. ఇలాంటిదేదో ప్లాన్ చేయ‌డానికే భార‌త్, 2020 నాటి స‌రిహ‌ద్దు గొడ‌వ‌ల‌ను మ‌ర‌చిపోయి చైనాతో చెలిమి చేయ‌డాన‌కి ముందుకొస్తోంది. దానికి తోడు ఇటు పాకిస్తాన్,  అమెరికా పంచ‌న చేర‌డంతో చైనా కూడా భార‌త్ వైపే మొగ్గు చూపించేందుకు ముందుకొస్తోంది. అందుకే ఆగ‌స్ట్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భార‌త్ ప‌ర్య‌టించి.. చైనా రావ‌ల్సిందిగా మోదీకి జింగ్ పింగ్ పంపిన ఆహ్వాన ప‌త్రం అందించారు. అందులో భాగంగా మోడీ ఇటు జ‌పాన్ తో ఆర్ధిక అటు చైనాతో దౌత్య ప‌ర‌మైన స‌ర్దుబాట్ల కోసం ఈ గ్రాండ్ టూర్ వేశార‌ని అంచ‌నా వేస్తున్నారు దౌత్య వ్య‌వ‌హారాల నిపుణులు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వామపక్షాలు కలిసి రావాలి : సీఎం రేవంత్‌ రెడ్డి

  ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వామపక్షాలు కలిసి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో  ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మా పాలమూరు బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి కడదాకా పోరాటం చేశారని కొనియాడారు. విద్యార్థి ఉద్యమాల నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎదిగారని అన్నారు. దాదాపు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడనే ఉన్నారని చెప్పారు. సామాజిక చైతన్యం ఉన్న నాయకుడు అని అన్నారు.  పేదల జీవితాల్లో మార్పు రావాలని నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోయేలా తాము కూడా ప్రయత్నం చేస్తామని.. త్వరలోనే క్యాబినేట్‌లో చర్చించి  ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం అని చెప్పుకొచ్చారు. వారి కంటే గొప్పగా ఆ పాత్రను ఇంకెవరూ పోషించలేరని అన్నారు. కొందరు రాజ్యాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు. బిహార్‌లో ఐదు లక్షల ఓట్లు మాయమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో విపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది అని కోరారు.  

కుప్పానికి కృష్ణ‌మ్మ‌...అప‌ర‌భ‌గీర‌థుడు చంద్ర‌బాబు

  అస‌లేంటి హంద్రీనీవా ప్రాజెక్టు దీని పూర్వాప‌రాలు ఎలాంటివి అని చూస్తే.. రాయలసీమలోని నాలుగు కరువు ప్రభావిత మాజీ జిల్లాలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. హంద్రి–నీవా మెయిన్ కెనాల్, కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట జలాశయం నుంచి ప్రారంభమవుతుంది. 120 వరద రోజులలో 40 టీఎంసీల కృష్ణా వరదనీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన. మెయిన్ కెనాల్ వెంట 12 చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేశారు. సుమారు 6,02,500 ఎకరాలకు అంటే 2.438 లక్షల హెక్టార్లు  ఖరీఫ్‌ సాగునీరు, అలాగే 33 లక్షల మందికి 4 టీఎంసీలు  త్రాగునీటి సదుపాయం కల్పన. ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద రిజర్వాయరు లెవెల్ +244.700 మీటర్లు అంటే 802.821 అడుగుల ద‌గ్గ‌ర‌ ఉన్నప్పుడు నీటిని తీసుకుంటారు. మెయిన్ కెనాల్ మొత్తం పొడవు 554.175 కి.మీ. ఉంది. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అన్నమయ్య జిల్లాలోని అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుంది. గరిష్ట డిమాండ్ తీర్చడానికి 9.05 టీఎంసీల సామర్థ్యం గల 8 రిజర్వాయర్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్‌ సుమారు 672 మెగావాట్లుగా ఉంది. ప్రాజెక్టు దశల విష‌యానికి వ‌స్తే.. ఫేజ్–I: జీడిపల్లె రిజర్వాయరు వరకు వెళ్తుంది. ఇది 1,98,000 ఎకరాలకు సాగునీరు, 14 టీఎంసీల నీరందిస్తుంది. ఇక ఫేజ్–II: జీడిపల్లె నుంచి అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుండ‌గా..  4,04,500 ఎకరాలకు సాగునీరు, 26 టీఎంసీల మేర అందిస్తుంది. మెయిన్ కెనాల్‌పై రిజర్వాయర్ల విష‌యానికి వ‌స్తే..  కృష్ణగిరి – 0.161 TMC కాగా,  పాతికొండ – 1.126 TMC,  జీడిపల్లె – 1.631 TMC, కాగా మరాల – 0.465 TMC,  శ్రీ ఎం.ఆర్. శ్రీనివాసపురం – 1.020 TMCగా ఉంది. అదవిపల్లె – 1.814 TMCలుగా ఉంది.  బ్రాంచ్ కెనాల్‌పై రిజర్వాయర్ల విష‌యానికి వ‌స్తే.. గోల్లపల్లె – 1.913 TMC మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌పై, చెర్లపల్లె – 1.608 TMC పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌పై బ్రాంచ్‌ కెనాళ్లు, ఇక‌  డిస్ట్రిబ్యూటరీలు, మడకశిర బ్రాంచ్ కెనాల్  235.435 Km – 61,557 ఎకరాలు, పేరూరు బ్రాంచ్ కెనాల్: 6.07 Km – 80,600 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్: 220 Km – 37,300 ఎకరాలు, తంబళ్లపల్లె బ్రాంచ్ కెనాల్: 29.43 Km – 15,000 ఎకరాలు, నీవా బ్రాంచ్ కెనాల్: 132.35 Km – 57,500 ఎకరాలు, వాయలపాడు బ్రాంచ్ కెనాల్: 23.5 Km – 17,200 ఎకరాలు, చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ..  42.30 Km – 22,400 ఎకరాలు, ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ: 25.17 Km – 15,400 ఎకరాలు, సదుము డిస్ట్రిబ్యూటరీ: 39.28 Km – 5,400 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, మెయిన్ కెనాల్‌ @ కిమీ 400.500, పట్టణం గ్రామం, కదిరి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా నుండి ప్రారంభం కానుంది. దీని పొడవు: 220.350 Km. జ్యూరిస్డిక్షన్: గుద్దంపల్లె (అన్నమయ్య జిల్లా) నుండి కలగటూరు  అంటూ చిత్తూరు జిల్లా  వరకు ఉంటుంది.  ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్  పుంగనూరు బ్రాంచ్ కెనాల్ @ Km 207.800, అప్పినపల్లె, పెద్దపంజాణి మండలం, చిత్తూరు జిల్లా వద్ద ప్రారంభం కానుంది. 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరందించడం, 6,300 ఎకరాల సాగునీరు స్థిరీకరించడం, అలాగే పాలమనేరు & కుప్పం నియోజకవర్గాల 8 మండలాల్లో 4.02 లక్షల మందికి త్రాగునీరు అందించడం. పొడవు వివరాలు : 131.200/143.900 Km, 3 లిఫ్టులు ఏర్పాటు చేశారు. కుప్పం చివ‌ర్లోని కెనాల్ చివర పరమసముద్రం చెరువుకు ఈ నీరు చేరుతుంది. దీన్నిబ‌ట్టీ చూస్తే.. చిత్తూరు జిల్లా చివ‌రి ఆయ‌క‌ట్ట వ‌ర‌కూ కృష్ణాజ‌లాలు ప్ర‌వ‌హించడం ఒక చ‌రిత్ర‌, 2014 నుంచి 2019 మ‌ధ్య వ‌ర‌కూ నాలుగు వేల కోట్ల వ‌ర‌కూ వెచ్చించిన చంద్ర‌బాబు 2024 లో తిరిగి పీఠ‌మెక్కాక‌.. నెల‌లో మెయిన్ కెనాల్ పూర్తి చేసి.. కృష్ణా జ‌లాల‌ను ఎట్ట‌కేల‌కు కుప్పం చేర్చారు. ఈ విష‌యంలో ఆయ‌న్ను అప‌ర భ‌గీర‌థుడ‌ని అన‌డంలో ఎలాంటి సందేహం లేదంటారు ఈ ప్రాంత వాసులు.  

అపర భగీరథుడు చంద్రబాబు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దార్శనికుడు!

గంగానదిని భూమికి తీసుకువచ్చిన పౌరాణిక రాజు భగీరథుడైతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంకు ఆధునిక భగీరథుడిగా మారారు. రాయలసీమలోని   తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గతంలో కృష్ణాజలాలు అన్నది ఎన్నటికీ నెరవేరని కలలా అనిపించినది.. ఇప్పడు వాస్తవంగా మారింది. ఇది చంద్రబాబు దార్శనికతకు, ఆయన పట్టుదలకు, అనుకున్నది సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా  ముందుకు సాగే తీరుకు కుప్పం చేరుకున్న కృష్ణాజలాలే ప్రత్యక్ష, సజీవ నిదర్శనంగా చెప్పవచ్చు.  ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణా జలాల్లో పడవ ప్రయాణం చేస్తున్న దృశ్యాలు తెగ వైరల్ అయ్యాయి. కృష్ణా జలాలు కుప్పం చేరుకున్న క్షణాలు స్థానికులను ఉద్విగ్నతకు గురి చేశాయి.    శ్రీశైలం నుండి హంద్రీ-నీవా  కాలువ ద్వారా కుప్పంకు చేరుకున్నాయి.  కేప్పం చేరుకున్న కృష్ణా జలాలను పూజలు చేసి, జలహారతి ఇచ్చిన అనంతరం సీఎం మాట్లాడుతూ..  రాయలసీమకు నీటిని తరలించడం అన్నది తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు లక్ష్యం, కల అని చెప్పారు.    శ్రీకృష్ణదేవరాయలు ఏలిన రాయలసీమ ఒకప్పుడు  రత్నాల సీమ.. అయితే ఇప్పుడది రాళ్ల సీమగా, కరవు సీమగా మారిపోయింది. ఈ పరిస్థితి మార్చాలన్న చంద్రబాబు కృతనిశ్చయమే ఇప్పుడు ఈ జలసిరి. 1999లో  చంద్రబాబు హంద్రీనీవాకు పునాది వేశారు.  2025 నాటికి  కృష్ణ జలాలను  తీసుకురావగలిగారు.  భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, ఈ విజయాన్ని, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కృష్ణా జలాలలో పడవ ప్రయాణం చేశారు.   

కేటీఆర్, హరీష్ అరెస్ట్

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు  శనివారం  ప్రారంభమైన సంగతి  తెలిసిందే. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు సంతాపతీర్మానాలకే పరిమితమయ్యాయి. సంతాప తీర్మానాలను ఆమోదించిన తరువాత సభ వాయిదా పడింది.  అసెంబ్లీ నుంచి నేరుగా  సెక్ర‌టేరియ‌ట్‌కు చేరుకున్నకేటీఆర్, హరీష్ రావులు  రైతుల స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి సెక్రటేరియెట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసు వాహనం లోంచే మీడియాతో మాట్లాడారు. యూరియా దొరకక రైతులు ఆత్మహత్యలే గతి అనుకునే పరిస్థితికి వచ్చారనన్నారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన కేటీఆర్, హరీష్ రావులను ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ ను తరలించారు.  

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే : మంత్రి కోమటిరెడ్డి

  మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలిని మంత్రి తెలిపారు. కాళేశ్వరం కేసిఆర్ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు..ఆయన హయంలోనే కూలిందన్నారు. కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి..సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేశారు..మంచి పేరున్న న్యాయ మూర్తి ఆయన అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.  కమిషన్ కమిటీ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని దానికి భయపడే కేసీఆర్, హరీష్ రావు కోర్టుకు పోయారని మంత్రి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు తీసుకుంటున్నాడు..బాధ్యత ఆయనపై ఉంటదని  వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం పై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌంట్ చేయకుండా.. మా మీద పూలు చల్లుతారా.? తప్పించుకుని పారిపోతారు. కాళేశ్వరం పూర్తి నివేదిక, కంప్లీట్ గా చర్చ ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్న..కేసీఆర్ శాసన సభకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన తెలిపారు. కాళేశ్వరం పై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా.?ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు...వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు  

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్

  గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ పేర్లను క్యాబినెట్ ఖరారు చేసింది. ఇవాళ జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వీరిద్దరి పేర్లను  ఆమోదించి గవర్నర్‌కి  సిఫార్సు చేస్తూ కేబినెట్ తీర్మానం తీసుకుంది. గతంలో కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.  అమీర్‌ అలీఖాన్‌ స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం కల్పించారు.ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ నియామకాలను బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీం.. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది.  మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సర్వోన్న న్యాయస్ధానం అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17ను నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో తానేకే  కాంగ్రెస్ టిక్కెట్ ఖాయమని భావించాడు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కట్టబెట్టాలనే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్‌ హస్తం పార్టీ అభ్యర్థి ఎవరై అనేది సస్పెన్స్‌ గా మారింది

సుంకాల ‘ట్రంప్’ కు కోర్టులో ఎదురు దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఏది చేసిన అదొక సంచలనమే. నిజానికి.. కొన్ని కొన్ని నిర్ణయాలు కేవలం సంచలన సృష్టించడం కోసమే చేస్తుంటారా? అని కూడా అనిపిస్తుంది. అందుకే.. అగ్ర రాజ్యం అధినేత, అనే విషయం మరిచి పోయి ఆయన చేసే వ్యాఖ్యలు, తీసుకునే  నిర్ణయాలు అనేక సందర్భాలలో నవ్వుల పాలవుతున్నాయి. అమెరికా ప్రజలనూ నవ్వుల పాలు చేస్తున్నాయి. అందుకే, అమెరికా ప్రజలు కూడా  ట్రంప్ సెకండ్ టర్మ్ మొదలైనప్పటి నుంచే రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. అదలా ఉంటే.. గత కొంత కాలంగా ‘ట్రంప్’ కోతికి కొబ్బరికాయ దొరికింది అన్నట్లుగా, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు, ఇతర దేశాల విషయంలో అనవసర జోక్యం చేసుకోవడమే కాకుండాజజ  అన్నిటికీ  నేనే..నేనే అంటూ ప్రగల్బాలకు పోతున్నారు. సొంత డబ్బా గట్టిగా కొట్టు కుంటున్నారు. అంతే కాదు  భారత్ సహా ఆయన ప్రగాల్బాలకు జై కొట్టని దేశాలపై  పిచ్చివాడి చేతిలో రాయి చందంగా  సుంకాలను పెంచుకుంటూ పోతున్నారు.   అయితే..   సుంకాల ట్రంప్  నెత్తిన అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు మరో మారు మొట్టికాయ వేసింది. ట్రంప్  విధించిన సుంకాలు చట్ట విరుద్ధం అని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన ఎమర్జెన్సీ అధికారాలను అతిక్రమించి భారీగా టారిఫ్ లు విధించారని పేర్కొంది. అయితే పెంచిన టారిఫ్ లను అక్టోబర్ వరకు కొనసాగించడానికి, అదే విధంగా తమ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది.కాగా.. అప్పీల్ కోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడతామని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. అయితే కోర్టుల వ్యవహారం ఎలా ఉన్న ట్రంప్  ఎడాపెడా సుంకాలు విధించడం అమెరికా ప్రజల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే !

  ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కార్యకలాపాలు త్వరలో విశాఖలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఋషికొండ ఐటీ హిల్ లోని మిలీనియం టవర్స్ లో ఈ సంస్థ కార్యకలాపాలకు అనువుగా భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ మిలీనియం టవర్ లోని 16 17 బ్లాక్ లకు తీసేసి కంపెనీ పేరుతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తొలిదశలో రెండు షిఫ్ట్ లలో 2000 మంది ఉద్యోగులతో కార్యకర్తల అప్పాలు ప్రారంభించనున్నారు. ఈ సంఖ్యను క్రమంగా 6000కు పైగా పెంచే అవకాశాలు ఉన్నాయి.  అందుకు తగ్గ భవనాలను మిలీనియం టవర్స్ లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఒప్పందం చేసుకున్న ఐటీ కంపెనీ ఇదే . తాత్కాలికంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తూనే శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు టిసిఎస్ ప్రయత్నిస్తుంది. 1370 కోట్ల పెట్టుబడితో 12000 మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళిక దిశగా ఐటి హిల్ 3 పై 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది.  

బాబుపై నమ్మకంతో పెట్టుబడుల వరద.. ఏపీలో పారిశ్రామిక రంగానికి పూర్వ వైభవం!

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే బిజినెస్ ఎక్స్ పర్ట్స్ ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది.  ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసే వారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు రాష్ట్రంలో  పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.  కియా అయితే కార్యకలాపాలు ప్రారంభించేసింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి. అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.  జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్  ఐదేళ్ల  హయాంను రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా చెప్పవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం కుక్కలు చింపిన విస్తరిలా తయా రైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి తరలిపోయాయి. అంతకు ముందు అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకున్న సంస్థలు  మొహం చాటేశాయి.  ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఇందు కోసం చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక వధానాన్ని రూపొందించారు.  2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ  తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.  ఆయన కృషి ఫలిస్తోందనడానికి స్పష్టమైన తార్కాణంగా  జగన్ హయాంలో ఆయన విధానాలతో విసిగిపోయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదంటూ వెళ్లిపోయిన   లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మళ్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్ని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ కొలువు దీరిన తరువాత రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారడం ప్రారం భమైంది.   ఇందుకు తాజా తార్కానంగా ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ఏకం గా 30 పరిశ్రమలు,  53 వేల922 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ పరిశ్ర మల ద్వారా 83 వేల437 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.   

కుప్పం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది : సీఎం చంద్రబాబు

  2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసగించారు. కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయిని కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని సీఎం తెలిపారు. నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు.. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారని చంద్రబాబు తెలిపారు.  కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను.. నా ఆనందం మాటల్లో చెప్పలేను.. నా సంకల్పం నిజమైందని ఆయన తెలిపారు. 738 కిలో మీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చామని దీంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారిందని సీఎం తెలిపారు. అందుకే శతాబ్దాలు గడిచినా... కాటన్ దొరను గోదావరి ప్రజలు ఇంకా మరువలేదని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పం తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పశువులను కాపాడుకోవడానికి రైళ్లల్లో నీళ్లు తెప్పించాల్సిన దారుణమైన కరవు రాయలసీమలో ఉండేది.. అప్పుడే చాలా బాధపడ్డాను.. ఈ పరిస్థితి మార్చాలనుకున్నాని ఆయన తెలిపారు. 1999లో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశాను. శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు చేర్చామని తెలిపారు. కుప్పం ప్రజల ఆనందంలో పాలుపంచుకునేందుకు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి పరమసముద్రం చెరువులో బోటులో పర్యటించాని సీఎం తెలిపారు. రాయలసీమను రాళ్ల సీమ కానివ్వను... రతనాల సీమ చేస్తానమని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టితే..గత వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య కాలంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ. 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. సెట్టింగులు వేశారు.. గేట్లు తెచ్చారు.. నీళ్లు కూడా బయట నుంచే తెచ్చి.. విడుదల చేసినట్టు మభ్య పెట్టారు. విమానం ఎక్కేలోగానే నాడు విడుదల చేసిన నీరు ఆవిరైపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు  

తాడిపత్రిలో పెద్దారెడ్డికి జేసీతోనే కాదు.. సొంత పార్టీ నేతలతోనూ తలనొప్పే!

అనంతపురంలో జిల్లాలోని తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించగా..  పోలీసులు భద్రత కల్పించాలని సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అనంతపురం ఎస్పీ సవాల్‌ చేశారు. ఆ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కేతిరెరడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో  ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతకాలానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లడానికి లైన్ క్లియర్ అయింది. అధికారం అటు,ఇటు మారడం, తాడిపత్రి సెగ్మెంట్లలో  గెలుపోటములు సాధారణమే అయినా టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి, జేసీ వర్గంపై 2019 ఎన్నికల్లో మొదటి సారి వైసీపీ నుంచి గెలిచి ఆధిపత్యం చెలాయించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు మాత్రం మొదటి నుంచి తమ వైఖరి మారదంటున్నారు.  తాడిపత్రిలో ఫ్యాక్షన్ వాతావరణం స‌ృష్టిస్తూ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని టెన్షన్ పెడుతూనే వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు. ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కూర్చుని సవాల్ విసిరారు.  ఆ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రి రాకుండా అనేక సందర్భాల్లో అడ్డుకున్నారు 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. పొజిషన్స్ ఛేంజ్ అయ్యాయి. కేతిరెడ్డి అపోజిషన్‌లోకి వచ్చేశారు. ఇంకేముంది అందరూ అనుకున్నదే జరుగుతోంది. కేతిరెడ్డి ఘోరీ మహమ్మద్‌లా అనేక మార్లు తాడిపత్రి లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం.. దాన్నిజేసీ వర్గం అడ్డుకోవడం షరా మాములు అయింది...ఆ క్రమంలో ఇటీవల తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు తీసుకొచ్చారు పెద్దారెడ్డి.  హైకోర్ట్ ఆదేశాలతో ఇక తనకు లైన్ క్లియరైందని పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి రెడీ అయినా, ఎప్పటికప్పుడు జేసీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో  పోలీసులు  లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ పెద్దారెడ్డిని అడ్డుకున్నారు . పైగా కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీలుకు వెళ్లారు. దీంతో మూడు వారాల పాటు స్టే విధించింది హైకోర్ట్. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేకపోయారు. ఒకవేళ  బలవంతంగా అడుగు పెట్టగలిగినా అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  తాడిపత్రిలో పెద్దారెడ్డి తప్ప,  వైసీపీ తరపున ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని స్పష్టంగా చెబు తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతే తప్ప మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి  కొడుకులు, కోడళ్లను కూడా రానివ్వబోనని ప్రతిజ్ఞ చేశారాయన. దీంతో ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు కొంత మంది తహతహలాడుతున్నారు. తాడిపత్రి స్థానిక వైసీపీ నేత, ఇంజనీరింగ్ కాలేజీ అధినేత రమేష్ రెడ్డి తాను పెద్దారెడ్డి ప్లేస్ లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారట. అలా పెద్దారెడ్డి స్థానాన్న భర్తీ చేయాలని రమేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారో లేదో అప్పుడే ఆ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు మరో వైసీపీ నాయకుడు వీఆర్ రామిరెడ్డి. 2014 ఎన్నికల్లో జేసీప్రభాకరరెడ్డికి మంచి పోటీనే ఇచ్చిన వీఆర్ రామిరెడ్డి చాలాకాలం తర్వాత తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపుతున్నారు. రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్లు ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు.  అధిష్టానం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించగా వైసీపీ కార్యకర్తలు తాడిపత్రి వైసీపీ ఇన్చార్జిగా విఆర్ రామిరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారంట.  ఎప్పుడో పాలిటిక్స్ నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న రామిరెడ్డి సడెన్ గా ఇప్పుడు తాడిపత్రికి రావడం అందులోనూ కార్యకర్తలతో సమావేశం అవడం తాడిపత్రి పాలిటిక్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఇన్నాళ్లు ఇద్దరు కృష్ణులే అనుకుంటే ఇప్పుడు మూడో కృష్ణుడు రూపంలో వీఆర్ రామిరెడ్డి రావడంతో తాడిపత్రి  వైసీపీ లో తీవ్ర గంగదరగోళం ఏర్పడింది.  అటు విపక్షం నుంచి, ఇటు స్వపక్షం నుంచి తలనొప్పులు ఎదుర్కొంటున్న పెద్దారెడ్డి ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి.

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని కేబినేట్ నిర్ణయం

  రాష్ట్రంలో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని  తెలంగాణ కేబినేట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్ మార్చనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో  42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు శాసన సభలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేసే అవకాశముంది. మరోవైపు సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనా కీలక చర్చ జరిగే అవకాశముంది. 

బెస్ట్ సీఎంస్ ఇన్ ఇండియా.. చంద్రబాబు@3

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 16 నెలలు అయ్యింది. అంతకు ముందు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో అభివృద్ధి ఆనవాలే కనిపించలేదు. సంక్షేమం పేరిట అరకొర పందేరాలు వినా ప్రజలను ఇసుమంతైనా ప్రయోజనం కలిగే పథకాలూ లేవు, రాష్ట్ర ప్రగతికి దోహదపడేలా ప్రాజెక్టులూ లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. కొత్తవి రాలేదు. జగన్ హయాంలో అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగింది. ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలింది. అప్పులు వినా, రాష్ట్రానికి ఆదాయమన్నదే లేకుండా పోయింది. ప్రభుత్వోద్యోగుల వేతనాలు కూడా విడతల వారీగా చెప్పించే పరిస్థితి ఉండేది.  2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఘండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచీ రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పరుచుకున్నాయి. సంక్షేమానికి సముచిత ప్రాథాన్యతా లభించింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అన్నట్లుగా పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ 16 నెలల కాలంలో రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు తరలి వస్తున్నాయి. పారిశ్రామిక రంగానికి కొత్త జవజీవాలు వచ్చాయి. అలాగే గత జగన్ ప్రభుత్వ హయాంకు భిన్నంగా ఇప్పుడు పాలనలో  పారదర్శకత పెరిగింది. ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రజామోదం లభించింది.   ఇప్పుడు విషయానికి వస్తే.. దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రులు అంటూ ఇండియా టుడే తాజాగా జారీ చేసిన బాబితాలో చంద్రబాబు  నాలుగో స్థానంలో ఉన్నారు. ఇదే ఇండియా టుడే గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన ఉత్తమ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్న చంద్రబాబు ఏడాది తిరిగే సరికి మూడో స్థానానికి ఎగబాకారు. తాజా జాబితాలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలోనూ, పశ్చిమబెంగాల్ సీం రెండోస్థానంలోనూ ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. అధికారం చేపట్టిన 16 నెలలలోనూ ఈ స్థానంలోకి దూసుకురావడం అంటే ఆయన పనితీరుకు లభించిన ప్రజామోదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా.. సంకేతం అదేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖరరావు గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ  పరాజయం తరువాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన రాజకీయంగా ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పార్టీ వ్యవహారాలలోనూ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతనూ విస్మరించారు. పార్టీ పరాజయం తరువాత ఆయన కేవలం రెండంటే రెండు సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. అయితే.. ఈసారి మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి హాజరౌతారని అంతా భావించారు. ఎందుకంటే.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకే  అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంది. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరం అవకతవకలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సభకు హాజరై తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తారని అంతా భావించారు. దివంగత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మాగంటి మృతి పట్ల సభ సంతాపం తెలిపే కార్యక్రమానికీ డుమ్మా కొట్టిన కేసీఆర్..  రానున్న రోజులలో కూడా వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో కేసీఆర్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా? అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. సభకు గైర్హాజరైనా కేసీఆర్  సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రం  మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లతో  శుక్రవారం (ఆగస్టు 29) సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల మేరకే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని పరిశీలకులు అంటున్నారు. సభలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తామంటే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందంటూ ఎదురుదాడికి దిగడం, సభ కాదు కాళేశ్వరంపై వాస్తవాలు ఏంటన్నది తేల్చాల్సింది కోర్టులే అంటూ అసెంబ్లీ ప్రాధాన్యతను తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. 

కొందరు నేతల వల్లే తెలంగాణ బీజేపీలో సంక్షోభం.. మరోసారి కమలం పార్టీపై రాజాసింగ్ ఫైర్

రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ మాజీ నాయకుడు. బీజేపీ టికెట్ పై గోషామహల్ నుంచి విజయం సాధించినా, పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుతో  అసహనానికి గురై పార్టీకి రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యే గా కావాలంటే అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ను  పార్టీ రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి కోరాలని సవాల్ చేశారు. జంటనగరాలకు ఇంత కాలం బీజేపీ ఫేస్ గా గుర్తింపు పొందిన రాజాసింగ్ కమల బంధనాలను తెంచుకుని బయటకు వచ్చిన తరువాత తాను గతంలో ఎన్నడూ లేనంత స్వేచ్ఛగా తన భావాలను, అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నాన్నారు. తాజాగా ఆయన తెలంగాణ బీజేపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోవడానికి రాష్ట్రంలోని కొందరు కమలం నాయకుల తీరే కారణమని విమర్శించారు. తాను ఇప్పుడు బీజేపీలో లేనని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు ఏ విషయంపైనైనా స్వేచ్ఛగా మాట్లాడగలనన్నారు. తెలంగాణలో బీజేపీని కొందరు నాయకులు సంక్షోభంలోకి నెట్టే స్తున్నారని ఫైర్ అయ్యారు.  చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ.. ఇది ఇక్కడితో ఆగదనీ, రాబోయే రోజుల్లో మరింత మంది తెలంగాణ బీజేపీ నేతలు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశం లేకపోలేదన్నారు.    తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నాయకులు పదవులు పోతాయన్న భయంతో మౌనం వహిస్తు న్నారన్న రాజా సింగ్,  రాష్ట్ర నాయకత్వ నిర్ణయాల  కారణంగా నే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని జారవిడు చుకుందన్నారు.  పార్టీ బాస్‌ల అనుమతి కోసం వేచి ఉండకుండా అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను లేవనెత్తే స్వేచ్ఛ తనకు ఇప్పుడు ఉందనీ, గతంలో అంటే తాను బీజేపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో గళ మెత్తే అవకాశం ఇవ్వలేదని చెప్పారు.  తెలంగాణ బిజెపిలోని అంతర్గత సమస్యలను కూడా బయటపెడతానన్నారు.  

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పరిశీలనకు మంత్రుల కమిటీ

జగన్ హయాంలో విశాఖలోని రుషి కొండకు బోడిగుండు కొట్టింది.. వేల కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత విలాసవంతమైన ప్యాలస్ భవనాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రజాధనాన్ని వృధా చేసి మరీ నిర్మించిన ఆ ప్యాలెస్ భవనాలు ఎందుకూ పనికి రాకుండా నిరుపుయోగంగా పడి ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా రుషికొండ  ప్యాలెస్ వినియోగంపై పరిశీలనకు మంత్రుల కమిటీని వేసింది.   మంత్రు లు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామిలతో ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ శుక్రవారం (ఆగస్టు 29) ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ కమిటీ రుషికొండ ప్యాలెస్, భవనాలను వినియోగించే మార్గాలు, అవకాశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి  నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ నివేదిక అనంతరం రుషికొండ ప్యాలెస్, భవనాల వినియోగం విషయంలో కూటమి సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంటుంది.