వార్డెన్ చొరవ..హాస్టల్ విద్యార్థుల సంరక్షణకు భరోసా
posted on Aug 28, 2025 @ 7:45PM
హాస్టల్ కు వచ్చామా.. అటెండెన్స్ వేసామా మెనూ ఇచ్చామా ఇందులో ఏమైనా మిగులుతాయా ..ఇంటికి వెళ్ళామా అనే ధోరణితో పని చేసే వార్డెన్లు చాలా చోట్ల కనపడుతుంటారు. అయితే ఈ వార్డెన్ అందుకు భిన్నమైన ధోరణితో విద్యార్థుల పట్ల, విధుల పట్ల అంకితభావంతో పని చేస్తూ విద్యార్థుల పరిశుభ్రతకు ,ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ సొంత బిడ్డలకు ఎలా కేర్ తీసుకుంటారో అలా హాస్టల్ లో కూడా కేర్ తీసుకుంటూ సంరక్షణ చేస్తున్నారు. వైయస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఈ వార్డెన్ (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) పనిచేస్తూ విద్యార్థుల సంరక్షణకు, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు
హాస్టల్ భవనం 45 సంవత్సరాల క్రితం నిర్మించినది అయినా కూడా అందులో వార్డెన్ గుప్తా విద్యార్థులకు చేసిన ఏర్పాట్లు శభాష్ అనేలా ఉన్నాయి.ఆ హాస్టల్లో బెడ్ సీట్లు పెట్టుకోవడానికి దాత ద్వారా చెక్కతోచేసిన బీరువా ఏర్పాటు చేయించారు.పిల్లలు తేమతో కూడిన ప్లేటు పెట్టేలో పెట్టుకుంటే క్రిములుచేరడం, దుర్వాసన రావడం జరుగుతుందని ప్లేట్లు బయటే పెట్టుకునేందుకు ఒక స్టాండ్ ను ఏర్పాటు చేశారు. పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు తగిన మందులను సూచిస్తూ మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ టాబ్లెట్ అందుబాటులో ఉంచారు.అవసరమైనప్పుడు వారికి అందజేస్తారు. ఇంగ్లీష్ మందులే కాకుండా దగ్గుకు కరక్కాయ లాంటి ఆయుర్వేద గుణం కలిగిన వాటిని కూడా అందుబాటులో ఉంచారు.
పిల్లలు చదువుకునేందుకు లైబ్రరీ కూడా అందులో ఉంచి పుస్తకాలు సమకూర్చి పెట్టారు. గ్లాసులు, కప్పులు విద్యార్థి ఎవరిది వారు పెట్టుకునేలా స్టాండ్లు ఏర్పాటు చేశారు. స్టోర్ రూమ్ లో వస్తువులు పురుగులు ,చీమలు చేరకుండా బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా విద్యార్థులను తన చేతనైనంత వరకు సొంత బిడ్డల్లా ఆలోచించి, వసతులు ఏర్పాటు చేసిన వార్డెన్ గుప్తాను పలువురు అభినందిస్తున్నారు. అయితే అన్నీ ఆయన బాగా చేస్తున్నా పిల్లలు తాగేందుకు సురక్షిత మంచినీరు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం దురదృష్టకరంగా చెప్పవచ్చు. సురక్షిత మంచి నీటి ప్లాంట్ అనేక సంవత్సరాలనుండి పని చేయక పోయినా అధికారులు మారమ్మత్తు చేయకకపోవడం హాస్టల్ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది.