పోలీసులపై బీహార్ కార్మికులు రాళ్ల దాడి

  సూర్యాపేట జిల్లాలో పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్న  ఓ కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేశారు.  అయితే ఆగ్రహించిన కార్మికులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కొందరు బీహార్ కార్మికులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకూ, పలువురు కార్మికులకూ గాయాలు అయ్యాయి. దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కార్మికులు రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్‌ ఫ్యాక్టరీ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

పుస్తక పఠనం ద్వారా క్రియేటివ్ థింకింగ్.. నారా లోకేష్

ఇటీవలి కాలంలో పుస్తక పఠనం అన్నది యువత, చిన్నారులలో బాగా తగ్గిపోయిందని ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 22) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే గణబాబు గ్రంథాలయాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు నారా దేవాంశ్ ను ప్రస్తావించారు. ఇటీవల తాను లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో తాను ఐదు పుస్తకాలను కొని తిరిగి వచ్చాకా దేవాంశ్ కు ఇచ్చాననీ, వాటిని అతడు ఐదు రజులలో చదివేశాడనీ చెప్పారు. తన కుమారుడికి పఠనాశక్తి ఎక్కువ అన్న లోకేష్.. పుస్తకాలు చదవడం అన్నది చాలా మంచి అలవాటని అన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయాలకు పెద్ద పీట వేయడం ద్వారా యువత, పిల్లలలో పఠనాశక్తి పెంపొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రపంచ స్థాయి గ్రంథాలయాల అభివృద్ధి కోసం షోబాబెవలపర్స్ సంస్థ వంద కోట్ల రూపాయలతో ముందుకు వచ్చిందన్నారు. రెండేళ్లలో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయనీ, వాటిని 26కు పెంచుతామనీ చెప్పారు. ఇక పోతే గ్రంధాలయాల్లో పుస్తకాల కొనుగోలు కూడా సరిగా జరగడంలేదన్న ఆయన.. అవసరమైన పుస్తకాల జాబితాను ఇస్తే ఆ మేరకు పుస్తకాలను కొనుగోలు చేసి వాటిని గ్రంధాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.  మొబైల్స్‌కి పిల్లలను దూరంగా ఉంచుతూ.. లైబ్రరీలకు దగ్గర చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేష్ చెప్పారు.  

దేశమంతటా ఎస్ఐఆర్.. కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం!

ఓట్ చోరీ ఆరోపణల విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల సంఘంపై ప్రజా విశ్వాసం దెబ్బతినేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనకు, ఆయన చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయానికి వచ్చింది. ఇందు కోసం ఓటర్ల జాబితాలోని అవకత వకలను సవరించాలన్న నిర్ణయం తీసుకుంది. అందు కోసం బీహార్  చేపట్టిన విధంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఓటర్ల జాబితాలను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేయాలని నిర్ణయించింది. బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐఆర్ పై వచ్చిన అన్ని ఆరోపణలకూ వివరణ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎస్ఐఆర్ ద్వారా మాత్రమే ఓటర్ల జాబితాలోని అవక తవకలు, లోపాలను సరిద్దిద్దడం సాధ్యమౌతుందని భావిస్తోంది. గత దశాబ్దాలలో జరిగిన పట్టణీకరణ, కార్మికుల వలసలు వంటి కారణాలతో  ఓటర్ల జాబితాలో చేరిన డూప్లికేట్ ఎంట్రీలు, దొంగ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టింది.  అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు అదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అములు చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే.. ఓటర్ల జాబితాల అంశం ప్రతి సారి వివాదాస్పదమవుతోంది. అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు.. కుట్రపూరితంగా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తప్పుడు మార్గాల్లో ఓటర్లను చేర్చించడానికి చేసిన ప్రయత్నాలు నకిలీ, దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో జాబితాలో చోటు చేసుకోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ హయాంలో అధికా రుల్ని సైతం బెదిరించి వేల దొంగ ఓట్లు చేర్పించడం.. అసలైన ఓటర్లను తొలగించడం వంటివి జరిగాయన్న ఆరోపణలు రావడం విదితమే. ఇలాంటి వాటినన్నిటినీ ఎస్ఐఆర్ ద్వారా సరిదిద్దడానికి అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. 

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో మంత్రి లోకేష్ భేటీ

  ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా కలిశారు. శాసనసభ కార్యక్రమాలకు విరామం ఇచ్చిన సమయంలో వీరిద్దరూ భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన టీచర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎంను మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. ఈ నెల 25వ తేదీన డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.  ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థుల వివరాలు విద్యాశాఖ వెబ్‌సైట్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్, విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో, అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్  అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది.  రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.  మొత్తం 16,347 టీచర్ల పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను సెప్టెంబర్ 15న విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, పురపాలక, గిరిజన సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీల భర్తీ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. అనంతరం టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తూ, ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి తుది జాబితాను రూపొందించారు.

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

    సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  కార్మికులకు సర్కార్ బోనస్‌ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్‌లో పలువురు మంత్రులతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. సింగరేణి సంస్థలోని 41 వేల శాశ్వత ఉద్యోగులకు మొత్తం రూ.819 కోట్లు బోనస్‌గా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.  అదనంగా, 30 వేల కాంట్రాక్ట్ కార్మికులకూ ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున బోనస్ అందజేస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారని డిప్యూటీ సీఎం ప్రకటించారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్‌ను దీపావళికి అందజేస్తామన్నారు. భవిష్యత్‌లోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే సమయంలో, జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయని ఆయన విమర్శించారు. కోల్పోయిన ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాలపై భారం వేయడం తగదని వ్యాఖ్యానించారు.  రాబోయే ఐదేళ్లపాటు కేంద్రం వైబిలిటీ గ్యాప్ ఫండ్‌ను అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. రూ. 2360 కోట్లు నికర లాభాలు వచ్చాయి. అందులో 34 శాతం… రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించామని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారు. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం తెలిపారు  

విమానం హైజాక్ యత్నం?

ఎయిర్ ఇండియా విమానాలలో ఇటీవలి కాలంలో తరచూ ఏదో ఒక లోపం బయటపడుతోంది. సాంకేతిక లోపాలతో పాటు భద్రతాపరమైన లొసుగులు కూడా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా బెంగళూరు నుంచి వారణాసి వెడుతున్న ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన సంఘటన ఈ విమానం హైజాక్ కు ప్రయత్నం జరిగిందా అన్న అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ విషయంపై ఎయిర్ ఇండియా నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రానప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విమానంలో ఒక ప్రయాణీకులు పైలట్ కాక్ పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అందుకు అవసరమైన పాస్ వర్డ్ ను కూడా యాక్యురేట్ గా ఎంటర్ చేశాడు. అయితే అనుమానంతో పైలట్ డోర్ తెరవడానికి అంగీకరించకపోవడంతో అతడి ప్రయాణం విఫలమైంది. అత్యంత రహస్యంగా ఉండే పాస్ వర్డ్ ఆ ప్రయాణీకుడికి ఎలా తెలిసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా ఆ ప్రయాణీకుడు ఎనిమిదది మందితో కలిసి ఆ విమానంలో ప్రయాణిస్తున్నాడు. దీంతో కాక్ పిట్ డోర్ తెరవడానికి చేసిన ప్రయత్నం హైజాక్ యత్నమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విమానం వారణాసిలో ల్యాండ్ కాగానే ఆ ఎనిమిది మంది ప్రయాణీకులను అదుపులోనికి తీసుకుని సీఐఎస్ఎఫ్ కు అప్పగించారు. సీఐఎస్ఎఫ్ అధికారులు వారిని విచారిస్తున్నారు. 

జీఎస్టీ రిఫార్మ్స్.. రెట్టింపు కానున్న జీలకర్ర, యాలకులు, లవంగాల ధరలు

జీఎస్టీ రిఫార్మ్స్ అంటూ స్లాబులను తగ్గించిన కేంద్రం దీని వల్ల పేదలకు ఆర్థికంగా గొప్ప వెసులుబాటు లభించిందని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. నిజంగానే ఈ సంస్కరణల వల్ల దాదాపు 400 వస్తువుల ధరలు తగ్గాయి. వాటిలో పేదలకు ఆర్థికంగా ఉపశమనం కలిగేందుకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి. అయితే దానికి మించిన భారం పడేలా కూడా ఈ సంస్కరణల వల్ల ధరలు పెరిగే వస్తువులు కూడా ఉన్నాయి. కానీ ఆ విషయంపై పెద్దగా ప్రచారం జరగకుండా, ఆ విషయం ఇప్పటికిప్పుడు జనాలకు తెలియకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుందనీ, ధరలు పెరిగే వస్తువులపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోందనీ పరిశీలకులు అంటున్నారు.  ఇప్పుడు జీఎస్టీ స్లాబులను రెండుకు దగ్గించామని ఘనంగా చెబుతున్న కేంద్రం, వీటి గురించి చెబుతున్నంత గట్టిగా సోమవారం నుంచే ఈ రెండు స్లాబులతో పాటు అమలులోకి వచ్చిన మూడో స్లాబు గురించి చెప్పడం లేదు. అది 40 శాతం శ్లాబు. ఆ శ్లాబులో పెరిగే వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి జనాలపై ఏమీ ప్రభావం చూపవు అన్నట్లుగా కలర్ ఇస్తున్నారు. కానీ వాస్తవంగా ఆ వస్తువుల ధరల పెరుగుదల వల్ల పేద మధ్యతరగతి ప్రజలపైనా పెను ప్రభావం పడుతోంది. ఎలా ఉంటే.. నిత్యం వంటల్లో పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యం వంటల్లో వినియోగించే జీలకర్ర, మిరియాల, గసగసాలు, దాల్చినచెక్క, ఇంగువ, యాలకులు, లవంగాల ధరలు ఈ 40శాతం శ్లాబులో ఉన్నాయి. అంటే వీటి ధరలు దాదాపు రెట్టింపు పెరగనున్నాయి.  

కాలినడకన ఇంద్రకీలాద్రిపైకి.. ఆపై క్యూలో వెళ్లి అమ్మవారి దర్శనం!

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ  అమ్మవారికి తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. శరన్నవరాత్రులు తొలి రోజైన సోమవారం (సెప్టెంబర్ 22) ఆయన కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని సాధారణ బక్తుడిలా క్యూలో నిలుచుని అమ్మవారిని దర్శించుకున్నారు.   గత రెండు దశాబ్దాలుగా దేవినేని ఉమ శరన్నవరాత్రులు ప్రారంభమైన తొలి రోజున కాలినడకన ఇంద్రకీలాద్రి కొండకు చేరుకుని దుర్గమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ లోని వినాయకుడి ఆలయం వద్ద నుంచి కాలినడకను ఇంద్రకీలాద్రి చేరుకుని క్యూలైన్ లో నిలుచుని సాధారణ భక్తుడిగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాదీ అదే చేశారు. అంతకు ముందు వినాయకుడి గుడిలో దేవినేని ఉమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బాబు బిజీబిజీ.. ఆ ఐదు రోజులూ నో అప్పాయింట్ మెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. నిత్యం ప్రజలతో మమేకమౌతూ, ప్రజా సమస్యలన తెలుసుకుంటూనే.. అధికారిక కార్యక్రమాలలో కూడా షెడ్యూల్ ప్రకారం పంక్చువల్ గా హాజరౌతై ఉంటారు. అలాగే పార్టీ వ్యవహారాలకూ సమయం కేటాయిస్తారు. వీటన్నిటినీ ఉటంకిస్తూ.. టైమ్ మేనేజ్ మెంట్ లో ఆయనను కొట్టే వారే లేరని అధికారులే కాదు.. పార్టీ శ్రేణులు కూడా చెబుతుంటాయి. అలాంటిది ఈ వారంలో ఓ ఐదు రోజుల పాటు చంద్రబాబు యమా బిజీగా గడపబోతున్నారు. ఎటువంటి అప్పాయింట్ మెంట్లూ ఇవ్వరు. వ్యక్తిగత సమావేశాలకు అసలే అవకాశం లేదు. విశాఖ, అమరావతి, తిరుమల, బాపట్ల, బెజవాడలలో వరుస కార్యక్రమాలలో పాల్గొనేలా ఆయన షెడ్యూల్ ఉంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు రోజుల పాటు ఆయన అప్పాయింట్ మెంట్ ఎవరికీ దొరకదు. ఇంతకీ విషయమేంటంటే.. మంగళవారం (సెప్టెంబర్ 22) నుంచీ రెండు రోజుల పాటు ఆయన విశాఖలో ఉంటారు. విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని దేశ, విదేశవీ పెట్టుబడి దారులతో చర్చిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తారు. ఇక సెప్టెంబర్ 24న అమరావతి వచ్చి అదే రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రం ఆయన తిరుమలలో ఉంటారు. తరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఈ నెల 26న ఆయన సూర్యలంకలో బీచ్ ఫఎస్టివల్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత 29వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.   

పరకామణి అవకతవకల కేసు.. సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి సొమ్ము అవకతవకల కేసును సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ పై అభియోగాలను కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసిన హైకోర్టు  ఈ కేసును విచారించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా సీఐడీని ఆదేశించింది.జగన్ హయాంలో  తిరుమల పరకామణిలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  పరకామణిలో చోరీచేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను టీటీడీకి విరాళంగా అందజేయించి మిగిలిన ఆస్తులను అప్పట్లో టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు వాటాలుగా పంచుకున్నారన్న ఆరోపణల నిగ్గు తేల్చడానికి రంగం సిద్ధమైంది.    కేసు వివరాల్లోకి వెడితే.. తిరుమల పరకామణిలో రవికుమార్‌ ఓ మఠం తరఫున పనిచేసేవారు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఆయనపై  ఉన్నాయి.   2023 ఏప్రిల్‌ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులలో దాచుకోగా, అనుమానంతో సిబ్బంది తనిఖీలు చేయగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  ఆయనపై అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్‌ ఫిర్యాదుతో రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆరోజు రవికుమార్ వద్ద లభ్యమైనవి 900 డాలర్లు వాటి విలువ అప్పట్లో అప్పట్లో  72 వేల రూపాయలుగా తేల్చారు. అంతకు ముందు చాలా కాలం నుంచీ కూడా రవికుమార్ పరకామణిలో  కోట్ల రూపాయలు కాజేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ దొరికిపోయిన తరువాత  కొందరు వైసీపీయులు, అప్పటి టీటీడీలో పని చేస్తున్న కొందరు అధికారులు, పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేసి తమ్మిని బమ్మిని చేసి కేసు నీరుగారిపోయేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పరకామణిలో కాజేసి రవికుమార్ సంపాదించిన ఆస్తులలో కొన్నిటిని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాయించి, మిగిలిన వాటిని బినామీల పేరిట స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆ కారణంగానే నిందితుడు రవికుమార్ ను అరెస్టు చేయకుండా ఆ కేసును లోక్ అదాలత్ లో పెట్టి రాజీ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాడు లోక్ అదాలత్ రవికుమార్ పై కేసు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేసి.. సీఐడీ విచారణకు ఆదేశించింది.  

వల్లభనేని వంశీ వైసీపీలో ఉన్నారా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైసీపీలో ఉన్నారా? కాదు కాదు అసలు రాజకీయాలలో ఉన్నారా? అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమౌతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ గన్నవరం సమీపంలోనే నివాసం ఉంటున్నారు. అయినా వైసీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఆయన ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. అలాగే వంశీ కూడా పార్టీ వారితో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన వంశీ.. తెలుగుదేశం అగ్రనాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే..  2024 లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ నోటికి తాళం వేసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో వంశీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమి తరువాత వంశీ నియోజకవర్గంలో పెద్దగా కనిపించింది లేదు.   ఆ తర్వాత  జైలు పాలయ్యారు. బెయిలుపై బయటకు వచ్చారు. అయినా రాజకీయాలలో కానీ, పార్టీ వ్యవహారాలలో కానీ కలుగజేసుకోవడం లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో గన్నవరం నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జిగా ఆయనను తప్పించి మరొకరిని నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలుత ఈ ఇన్ చార్జిగా వంశీ సతీమణి పంకజశ్రీ పేరు వినిపించినా, అందుకు పంకజశ్రీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో.. మరొకరి కోసం గాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.   మొత్తం మీద జగన్ చెప్పిన వైసీపీ అందగాడు వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారనీ, త్వరలోనే రాజీనామా ప్రకటన వెలువడినా ఆశ్చర్యంలేదనీ పరిశీలకులు అంటున్నారు. 

జగన్ పై అనర్హత వేటుపై యనమల ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు, అసెంబ్లీ వ్యవహారాలు, నిబంధనలపై అవగాహన ఉన్నవారు అందరూ కూడా జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే అంటున్నారు. అసెంబ్లీ నింబంధనల మేరకు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుందంటున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ అయితే.. గైర్హాజర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాదు.. తదుపరి ఎన్నికలలో పోటీకి అనర్హులుగా కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు ల్చాల్సి ఉందన్నారు.   వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయవచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్న యనమల రామకృష్ణుడు, తదుపరి ఎన్నికలలో వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే విషయంపై న్యాయస్థానాల అభిప్రాయం తీసుకోవలసి ఉందని చెప్పారు. 

తిరుమల శ్రీవారికి రూ.కోటి 80 లక్షల విలువైన పతకాల విరాళం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి భక్తుల భూరి విరాళాలు అందజేయడం కద్దు. నిత్యం పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ శక్తి కొద్దీ హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. అలాగే పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు కూడా స్వామి వారికి భారీగా విరాళాలు ఇస్తుంటారు. తాజాగా గోకర్ణకు చెందిన శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ స్వామివారికి4 బంగారు  పతకాలు విరాళంగా అందించారు. స్వామీజీ గోకర్ణ పర్తగాలి మఠం తరఫున 15 ఉత్సవర్ల బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను విరాళంగా సమర్పించారు. వీటి విలువ కోటీ 80 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ విరాళాన్ని ఆయన ఆలయ పేష్కార్ రామకృష్ణకు సోమవారం (సెప్టెంబర్ 22) అందజేశారు.  

దేశ ప్రగతికి ఇంధనం.. జీఎస్టీ రిఫార్మ్స్!

పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు జీఎస్టీ సంస్కరణలు ఎంతగానో దోహదం చేస్తాయి. కొత్త పన్నుల విదానం వల్ల పెట్టబడులకు రాచబాట పడింది. ఇక సామాన్యులకు తక్కువ ధరలలో నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయి. మేకిన్ ఇండియా మరింత మెరుగ్గా, మరింత చురుకుగా విస్తరిస్తుంది. సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి  జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలు జనలకు అందుబాటులోకి వచ్చాయి. జీఎస్టీ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దేశ ప్రగతికి ఇంధనం అని అభివర్ణించారు.   జీఎస్టీ సంస్కరణలు ప్రధాని నరేంద్రమోడీ దార్శనికతకు నిదర్శనమంటూ లోకేష్  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ప్రశంసలు కురిపించారు.  జీఎస్టీ 2.0 ద్వారా అమలులోకి వచ్చిన నూతన పన్ను విధానం పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ దేశీయ తయారీ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.  ఈ విధానం సామాన్యులకు తక్కువ ధరల్లో నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు.  

సామాన్యులకు కేంద్రం దసరా కానుక.. ధరల తగ్గింపు

సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి పలు వస్తువుల ధరలు తగ్గి గొప్ప ఉపశమనం సామాన్యుడికి  కలిగించ నున్నాయి. ఈ ధరల తగ్గింపు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమలులోకి వచ్చింది.  జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇటీవల కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ శ్లాబులను తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ తగ్గింపు ధరలు దరసరా కానుకగా నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఇలా తగ్గే ధరలలో సామాన్యులకు నిత్యావసరం అయిన పాల ధరలు దిగి వచ్చాయి.  పాలు, టీవీ, కారు.. ఇలా దాదాపు 400 వస్తువల ధరలు తగ్గాయి. పేదలు, సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త జీఎస్టీ స్లాబులను అమలులోకి తీసుకువచ్చింది. ఆ తగ్గింపు నేటి నుంచి జనాలకు అందుబాటులోకి వచ్చింది.  కారు, టీవీ-ఫ్రిడ్జ్, హోమ్ అప్లియన్సెస్, పాలు, నెయ్యి, వెన్న, జున్ను, బట్టలు, బూట్లు ఇలా పలు వస్తువులు ఇక చౌకగా లభిస్తాయి. మదర్ డైరీ, అమూల్, ఐటీసీ వంటి కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఇప్పటికే తగ్గించాయి.   కొత్త విధానం మేరకు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి జీఎస్టీ కేవలం రెండు శ్లాబ్‌ లలో  అంటే 5శాతం, 18% మాత్రమే ఉంటుంది. పాలు, పనీర్, నెయ్యి, సబ్బు, షాంపూ వంటి  నిత్య వస్తువులతో పాటు ఏసీలు, కార్లు వంటివి 5శాతంజీఎస్టీ పరిధిలోకి వస్తున్నాయి. దీనితో  సామాన్యులకు ఆర్థికంగా మంచి వెసులుబాటు లభిస్తుంది.   పాశ్చురైజెడ్ పాలు, వెన్న, నెయ్యి, వెన్న నూనె, పాల స్ప్రెడ్‌లు, పనీర్ (  పనీర్, రోటీ, చపాతీ, పాపడ్, పాస్తా, నూడుల్స్, కౌస్కాస్, పేస్ట్రీలు, కేకులు, బిస్కెట్లు, కార్న్ ఫ్లెక్స్, స్టీల్ గిన్నెలు, నమ్కీన్, భుజియా, మీక్షర్ (ప్యాకేజ్ చేసినవి), సాస్‌లు, మసాలాలు, మసాలా పొడి, టీ, కాఫీ పౌడర్, షికోరి కాఫీ గింజలు, జామ్, జెల్లీ, మార్మాలాడే, కొబ్బరి నీళ్లు (ప్యాక్ చేసినవి), కండెన్సడ్ పాలు, టూత్ బ్రష్, డెంటల్ ప్లేట్ బ్రష్, టూత్‌ పేస్ట్, పళ్ళ పొడి, టాయిలెట్ సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, షేవింగ్ లోషన్, ఆఫ్టర్ షేవ్, నేప్కిన్లు, పిజ్జా బ్రెడ్, పరాఠా, పరోటా బ్రెడ్, మట్టి గిన్నెలు, సిరామిక్ టేబుల్‌ వేర్, కిచెన్‌ వేర్, డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు, అంజూర పండ్లు, పైనాపిల్, అవకాడో, మామిడి,  నారింజ, మాండరిన్లు, ద్రాక్ష పండు, నిమ్మకాయలు , ఇతర డ్రై ఫ్రూట్స్, గింజల మిశ్రమాలు (చింత పండు తప్ప), బ్రెజిల్ గింజలు, చక్కెర స్వీట్స్, చాక్లెట్, ఇతర బేకరీ ఉత్పత్తులు, ఐస్ క్రీం, సూప్‌లు, రసం, టమోటా, పుట్టగొడుగుల నిల్వలు, వెనిగర్లో నాన పెట్టిన కూరగాయలు, ఈస్ట్, బేకింగ్ పౌడర్, టెక్స్చరైజ్డ్ వెజిటబుల్ ప్రోటీన్, ఎక్స్‌ట్రూడెడ్ నమ్‌కీన్, కొబ్బరి వెన్న, కొబ్బరి నూనె, కొబ్బరి పొడి, మాల్ట్-బార్లీ, కూరగాయల రసాలు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ కుక్కర్, రైస్ కుక్కర్, హీటర్, గ్రైండర్, మిక్సర్, జ్యూసర్, కుట్టు మెషిన్, వాక్యూమ్ క్లీనర్, ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రెయిట్నర్, ఎలక్ట్రిక్ షేవర్, రూ. 2500 లోపు ఉన్న చెప్పుల ధర, కార్పెట్, వెదురు, మెటల్ ఫర్నిచర్, చెక్క ఫర్నిచర్, ప్లాస్టిక్ మోల్డెడ్ ఫర్నిచర్, గ్లాస్ గాజులు, కొవ్వొత్తులు, గొడుగులు, హ్యాండ్‌ క్రాఫ్ట్ హ్యాండ్‌ బ్యాగులు, పౌచ్‌లు, పర్సులు, హ్యాండ్‌ బ్యాగులు, షాపింగ్ బ్యాగులు, చేతితో తయారు చేసిన శాలువాలు, టోపీలు, పెన్సిళ్లు, క్రేయాన్లు, పాస్టెల్లు, సుద్ద, రబ్బరు బ్యాండ్లు, ట్రైసైకిళ్లు, స్కూటర్లు, పెడల్ కార్లు, బొమ్మలు, ప్లేయింగ్ కార్డ్స్, చెస్ బోర్డు, క్యారమ్ బోర్డు, ఎడ్యుకేషనల్ టాయ్స్, పేపర్‌ బోర్డ్, వ్యక్తిగత ఉపయోగం కోసం అన్ని మందులు, డయాగ్నస్టిక్ కిట్లు, రియాజెంట్లు, ఫీడింగ్ బాటిళ్లు, సర్జికల్ చేతి గ్లవుజులు, కాంటాక్ట్ లెన్సులు, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, సిమెంట్, జనపనార, వరి పొట్టు, జిప్సం, సిసల్, బాగస్సే, పత్తి కాండాలు, సిరామిక్ బిల్డింగ్ బ్రిక్స్, బ్లాక్స్, టైల్స్, తబలా, మృదంగం, వీణ, సితార్, ఫ్లూట్, షెహనాయ్, ఢోలక్, సైకిల్, డిష్ వాషర్,350సీసీ వరకు ఉన్న బైక్ లు, స్కూటర్లు, మోపెడ్‌లు, ఆటో, ఈ-రిక్షా, కార్లు విద్యుత్ వాహనాలు, అంబులెన్స్, బస్సులు, ట్రక్కులు, టైర్లు, ట్రాక్టర్ విడి భాగాలు, అగ్గిపుల్లలు వంటి ధరలు తగ్గాయి.   

శ్రీశైలంలో నేటి నుంచి దసరామహోత్సవాలు

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం(సెప్టెంబర్ 22)  ప్రారంభమైన దసరామహోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకూ జరుగుతాయి. దసరా మహోత్సవాల సందర్భంగా మల్లన్న ఆలయాన్ని ముస్తాబు చేశారు. శ్రీశైలం క్షేత్రమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు.  శ్రీశైలం మల్లన్న ఆలయం లోపలి పరివార ఆలయాలు, ప్రధాన గోపురాలను కూడా కన్నుల పండువగా వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు.  దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయం బయట స్వామి అమ్మవారు వహనసేవలో గ్రామోత్సవంగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే ప్రధాన మాడవీధులు,రథశాలను  కూడా అంగరంగవైభవంగా అలంకరించి ముస్తాబు చేశారు.   సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అక్టోబర్ 2వరకు 11 రోజులు పాటు దసరా దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవారి యాగ శాల ప్రవేశంతో ఆలయ అర్చకులు, వేదపండితులు,ఈవో శ్రీనివాసరావు దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇక  సాయంత్రం అమ్మవారు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు. అలానే స్వామి అమ్మవారు భృంగివాహనంపై గ్రామోత్సవంగా క్షేత్రపురవిధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన మివ్వనున్నారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ భక్తులు తిరుమలకు వచ్చి వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. అలాంటి తిరుమలలో సోమవారం (సెప్టెంబర్ 22) భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంది. సోమవారం (సెప్టెంబర్ 22) ఉదయం  శ్రీవారి దర్శనం కోసం ఒక కంపార్ట్ మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.  ఇక ఆదివారం (సెప్టెంబర్ 21) శ్రీవారిని మొత్తం 67 వేల 408 మంది దర్శించుకున్నారు. వారిలో 16 వేల 597 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది. 

వన్ నేషన్...వన్ ట్యాక్స్ కల సాకరం : ప్రధాని

  దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. నవరాత్రుల తొలి రోజైన సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభమవుతుందని ప్రధాని తెలిపారు . కొత్తగా అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలతో వస్తువుల ధరలు గణనీయంగా తగ్గి, ప్రజలకు ఇది “పొదుపు పండగ” అవుతుందని మోదీ వివరించారు. దేశ ఆర్థిక చరిత్రలో కొత్త అధ్యాయానికి ఇదే నాంది అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లతో ప్రజలు తమకు ఇష్టమైన వస్తువులను మరింత చవక ధరల్లో సులభంగా కొనుగోలు చేయగలరని ప్రధాని తెలిపారు. “ఇది ప్రతి భారతీయుడికి జీఎస్టీ పొదుపు పండగలాంటిది” అని ఆయన అన్నారు. పన్ను తగ్గింపు ముఖ్యంగా పేదలు, నూతన మధ్యతరగతి వర్గాలకు రెండింతల ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ వెల్లడించారు. ఈ సంస్కరణలు రైతులు, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా మేలు చేస్తాయని ఆయన వివరించారు. “జీఎస్టీ 2.0” పేరుతో ప్రవేశపెట్టిన ఈ విధానంలో పన్ను నిర్మాణాన్ని సులభతరం చేశారు. ఇకపై 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉండగా, అత్యంత విలాసవంతమైన లేదా హానికరమైన వస్తువులపై అదనంగా 40% పన్ను విధించనున్నారు. సెప్టెంబర్ 4న ప్రకటించిన ఈ తగ్గింపులు, 2017 జూలైలో జీఎస్టీ అమలు తర్వాత పరోక్ష పన్నుల వ్యవస్థలో జరిగిన అతిపెద్ద సంస్కరణలుగా నిలిచాయి. కేంద్రం–రాష్ట్రాల సంపూర్ణ ఏకాభిప్రాయంతో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ సంస్కరణలు సహకార స్ఫూర్తికి నిదర్శనమని, వస్తువులు చౌక కావడంతో పాటు పరిశ్రమలకు ఉత్సాహం లభించి, భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

గురజాడ గృహం ఆధునీకరణకు పవన్ చర్యలు

  విద్యలనగరం సమున్నత కీర్తి శిఖరం గురజాడ వేంకట అప్పారావు గృహం స్థితిగతులపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కన్యాశుల్కం వంటి కీర్తిశేషం పుట్టిన ఆ ఇంటి గోడలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గురజాడ వారసులు ప్రసాద్, ఇందిర… తమ సొంత నిధులతో గోడలపై మట్టిని పూస్తూ, పైకప్పు వర్షం తడవకుండా కాపాడుతూ ఎంతకాలం లాగగలిగారో అంతవరకే సాగించారు. సహాయం కోసం కార్యాలయాల గడప తట్టినా, ఫలితం పెద్దగా రాలేదు. చివరికి పోస్టు కార్డు ఉద్యమం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఒక చొరబాటు సంఘటన ఆ ఇంటి అస్థిరతను మరింత రేగదీసింది.  అదే సమయంలో ఓ ప్రముఖ దిన పత్రికలో వచ్చిన న్యూస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంటపడింది. వెంటనే ఆయన స్పందించి గురజాడ ఇంటిని పూర్తిగా పునరుద్ధరిస్తాం, రచనలను డిజిటలైజ్ చేస్తాం, సమీపంలో ఆడిటోరియం కడతాం” అని హామీ ఇచ్చారు. విజయనగరంలో ఇప్పటికే సింహాచలం మేడ, మహారాజా ఆస్పత్రి, సంగీత కళాశాల వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు కాలం వలలో కనుమరుగయ్యాయి. గురజాడ గృహం కూడా అదే మార్గంలో పోవచ్చనే భయం అందరిలో ఉంది.  కానీ ఈసారి ఒక ఆశాకిరణం కనిపించింది. పవన్ కళ్యాణ్ మాటలకు కార్యరూపం వస్తే గురజాడ అప్పారావు స్మృతి, ఆయన స్ఫూర్తి మరింత బలపడతాయి. విజయనగరం ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటారు. పైడితల్లి జాతర నాటికి ఆ గృహం పూర్వ వైభవం తిరిగి తెచ్చి నిలబెట్టే రోజును అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రాగానే, గురజాడ ఇంటి చరిత్ర కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది.