పీవోకే దానంతట అదే భారత్ లో భాగం అవుతుంది.. రాజ్ నాథ్ సింగ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్ దేనని  కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనంన చేసుకోవడానికి యుద్ధాలు చేయవలసిన అవసరం లేదన్న ఆయన ఆ ప్రాంత ప్రజలే పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు. వారే స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేస్తారని పేర్కొన్నారు. మొరాకోలో పర్యటిస్తున్న రాజ్ నాథ్ సింగ్ అక్కడి భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. పాక్ఆక్రమిత కాశ్మీర్ భారత్ దేనని తాను ఐదేళ్ల కిందటే చెప్పిన విషయాన్ని ఆయనీ సందర్బంగా గుర్తు చేశారు. దాడి చేసో, యుద్ధం చేసో పీవోకేను స్వీధీనం చేసుకోవలసిన అవసరం లేదన్న ఆయన దానంతట అదే భారత్ తో భాగమౌతుందనీ, ఆ రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.  

కోల్ కతాలో వర్ష విలయం.. ఐదుగురు మృతి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో భారీ వర్షం జల విలయాన్ని సృష్టించింది. దసరా శరన్నవరాత్రులలో భాగంగా  నగరమంతా దసరావేడుకలకు ముస్తాబైన వేళ భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. సోమవారం (సెప్టెంబర్ 22) అర్థరాత్రి దాటిన తరువాత మొదలై మంగళవారం (సెప్టెంబర్ 23)ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కోల్ కతా నగరం చిగురుటాకులా వణికింది. ఈ భారీ వర్షానికి నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నగరం మొత్తం జల దిగ్భంధంలో చిక్కుకుంది. గడిచిన 24 గంటలలో  కోల్ కతాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమో దైంది.కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్  సమాచారం మేరకు నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్ష తీవ్రత చాలా చాలా అధికంగా ఉంది.   గరియా కమ్‌దహరిలో కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా 332 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  జోధ్‌పూర్ పార్క్‌లో 285, కాళీఘాట్‌లో 280.2,  అలీపూర్‌లో 247.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.   

బొత్స తెలిసే మాట్లాడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పార్టీ అధినేత.. బెంగళూరు ప్యాలస్ కే ఎక్కువగా పరిమితమై.. అడపాతడపా తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి చేతులు దులిపేసుకుంటున్నారు. జిల్లాల పర్యటనలు, కార్యకర్తలకు సమయం కేటాయింపు, ఆందోళనలు, ఉద్యామాలు అంటూ అప్పడప్పుడు ప్రసంగాలు చేసినా ఆయన ప్యాలెస్ ల గడపదాటి ప్రజలలోకి మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి దిశ, దశ లేకుండా పోయిందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషణలు చేస్తున్నారు.  తాజాగా మండలిలో బొత్స సత్యనారాయణ ప్రసంగం వింటే.. ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమౌతుందది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీలో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మండలిలో వైసీపీ పక్ష నాయకుడు కూడా. అసెంబ్లీలో లేకపోయినా, మండలిలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంది. అంటే బొత్స సత్యనారాయణ మండలిలో ప్రతిపక్ష నేత కూడా.  అలాంటి బొత్స సత్యనారాయణ తన తీరుతో స్వయంగా నవ్వుల పాలు కావడమే కాకుండా వైసీపీని కూడా నవ్వుల పాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలపై, వైఫల్యాలపై విమర్శలు చేయాల్సిందే. అయితే బొత్స సత్యనారాయణ విమర్శలు మాత్రం ప్రభుత్వాన్ని కాకుండా సొంత పార్టీనే చిక్కుల్లో పడేసేవిగా ఉంటున్నాయి. అవగాహనా రాహిత్యమో, మరోటో కానీ ఆయన కార్మిక చట్టాల మార్పు కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుపై మండలిలో చేసిన విమర్శలు సొంత పార్టీ వారే తలలు బాదుకోవలసిన పరిస్థితి తీసుకువచ్చింది.   ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందంటూ ఆయన ఫైరయ్యారు. కార్మికులు రోజుకు పన్నెండు గంటలు పని చేయాలనడమేంటి? అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీ సభ్యులకే దిమ్మతిరిగింది. అధికార పక్ష సభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. తెలుగుదేశం కూటమి సర్కార్ తీసుకు వచ్చిన బిల్లు కార్మికులు, ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడంతో పాటు..పరిశ్రమలు నిరంతరం పని చేయడానికి దోహదం చేస్తుంది. ఎక్కడా కార్మికుల పని గంటలను పెంచలేదు. గతంలో కార్మికులు వారానికి 48 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ బిల్లుతో కూడా కార్మికుల పనిగంటలు పెరగడం లేదు. కావాలనుకుంటే.. కార్మికులు రోజుకు పది గంటలు పని చేసుకోవచ్చు.. కానీ వారం మొత్తానికి కలిపి వారి పనిగంటలు 48కి మించకూడదు. అలా మించినట్లైతే కంపెనీలు ఓవర్ టైమ్ చెల్లించాలి. ఇదీ తెలుగుదేశం కూటమి సర్కార్ కార్మిక చట్టాలలో చేసిన మార్పు.   ఈ మార్పు  కార్మికులకు అనుకూలంగా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే బొత్స మాత్రం ప్రభుత్వంపై విమర్శ చేస్తే చాలు.. ఆ విమర్శకు హేతువు ఉండాల్సిన అవసరం లేదన్నట్లు.. కార్మికులు రోజుకు పన్నెండు గంటలు పని చేయాలా? ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఓ ప్రసంగొం చేసేసి నవ్వులపాలయ్యారు. 

కేటీఆర్ నోట స్థానిక ఎన్నికల బహిష్కరణ మాట.. సంకేతమేంటి?

స్థానిక ఎన్నికలలోఓటమి భయం  బీఆర్ఎస్ ను  వెంటాడుతోందా? ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తే ఆబోరు దక్కదని భయపడుతోందా? ఏదో ఒక సాకు చెప్పి స్థానిక ఎన్నికలను బహిష్కరించాలన్న వ్యూహంతో ఉందా? అన్న ప్రశ్నలకు తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ప్రకటనను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికలకు బహిష్కరించాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.   నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన ఆర్ఆర్ఆర్ బాధితులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ బాధితులంతా ఐక్యంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే మీ సమస్య ఢిల్లీ వరరూ వెడుతుందన్నారు.   సమస్యలపై మాట్లాడటానికి తమకు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని  ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  కత్తి వాళ్ల చేతిలో పెట్టి యుద్ధం బీఆర్ఎస్‌ను చేయమంటే ఎలా అని కేటీఆర్ ప్రజలను నిలదీశారు. మొత్తం మీద కేటీఆర్ మాటలు ఆయనను కలిసిన బాధితులకు ఎలాంటి ఊరటను ఇవ్వలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కత్తి వాళ్ల చేతుల్లో పెట్టి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను గెలిపించిన మీ తరఫున బీఆర్ఎస్ ఎందుకు పోరాడుతుంది అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద కేటీఆర్ నోట.. బహిష్కరణ మాట రావడమే ఆయనలోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. 

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 26 నాటికి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ఈ అల్పపీడనం 27వ తేదీన దక్షిణ ఒడిసా, ఉత్త కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇలా ఉండగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణలో  భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు అన్న సమచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక పోతే మంగళవారం తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.  

బీచ్ ఫెస్టివల్ వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బాపట్ల జిల్లా సూర్యలంకలో ఈ నెల 26 నుంచి 28 వరకూ మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించాల్సి ఉంది. ఈ బీచ్ ఫెస్టివల్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సి ఉంది. అ యితే ప్రతికూల వాతావరణం కారణంగా బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బీచ్ ఫెస్టివల్ ను వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తారు.  

శ్రీశైలంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు

శ్రైశైలం క్షేత్రంలో దసరామహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ మొదటిరోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రీ అలంకారంలో ఉన్న అమ్మవారికి, పలురకాల పూలతో అలంకరించి  బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతు లిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవార్లను భృంగివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, కేరళ నృత్యాలు వాయిద్యాలు, గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు   విహారించగా  భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు.  

జగన్ పై తిరుగుబాటేనా?.. బొత్స ఏం చేస్తున్నారు?

వైసీపీలో పై నుంచి కింది దాకా గందరగోళం నెలకొంది. అధినేత జగన్ ఒకటి చెబితే.. ఆ పార్టీలోని కీలక నేతలు మరొకటి చేస్తున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. మొత్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నేడు బొత్స సత్యనారాయణ ఇరువురూ కూడా జగన్ ఆదేశాలను భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేల హాజరు విషయంలో జగన్ చెప్పిన మాట ఆయనకు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖాతరు చేయలేదు.. సరికదా, జగన్ రాకుండా తాను అసెంబ్లీకి వెళ్లడమేంటి? అంటూ పార్టీ నేతల వద్ద ఒకింత అసహనంతో వ్యాఖ్యలు చేశారు.  అదలా ఉంచితే.. తాజాగా వైసీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ జీఎస్టీ రిఫార్మ్స్ విషయంలో జగన్ కు పూర్తి విరుద్ధమైన స్టాండ్ తీసుకున్నారు. దీంతో బొత్స తీరుపై జగన్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోందని పార్టీ నేతలే అంటున్నారు. అసలు జగన్ పై బొత్స తిరుగుబాటు చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇందుకు బొత్స మండలిలో వ్యవహరిస్తున్న తీరే కారణమని అంటున్నారు.  కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ విషయంలో వైసీపీ స్టాండ్ కు పూర్తి భిన్నంగా మండలిలో బొత్స మాట్లాడడమే ఇందుకు కారణం. జీఎస్టీ సంస్కరణలను ప్రశంసిస్తూ జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బొత్స మాత్రం మండలిలో కేంద్రాన్ని ప్రశంసిస్తూ ప్రభుత్వ తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని  చెప్పారు. బీఏసీ సమావేశంలో మండలిలో ప్రభుత్వం చేసేజీఎస్టీ అనుకూల తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని చెప్పడంతో వైసీపీ నేతలు, శ్రేణులు కంగుతిన్నారు. అయితే మండలిలో వైసీపీ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదనుకోండి అది వేరే సంగతి. కానీ బొత్స ఏకపక్షంగా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా బీఏసీలో చేసిన వ్యాఖ్యలు మాత్రం జగన్  తీవ్ర అసంతృప్తి వ్యక్తి చే సినట్లు తెలిసింది.   జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఆయన ఎదుర్కొంటున్న కేసులలో అరెస్టు నుంచి రక్షణ కావాలంటే బీజేపీ సహకారం, అండ చాలా అవసరం. ఆ విషయం తెలిసి కూడా బొత్స సత్యనారాయణ జీఎస్టీ సంస్కరణలను వైసీపీ వ్యతిరేకిస్తుంది అని అన్నారంటే.. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి.  మొత్తం మీద బొత్స తీరు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన ఏపీసీసీ అధినేత వైఎస్ షర్మిలతో ఆత్మీయంగా ముచ్చటించడం, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుతో సన్నిహితంగా వ్యవహరించడం జగన్ ను కంగారు పెడుతున్నాయి. మొత్తం మీద వైసీపీలో పరిస్థితి జగన్ వర్సెస్ బొత్స అన్నట్లుగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్పూర్ బ్రిడ్జి కింద ఓ మహిళా మృతదేహం లభ్యం కావడం తీవ్ర సంచ లనాన్ని సృష్టించింది.  అయితే ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకొని చెరసాలలో వేశారు. ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం సమయంలో యాకత్పురా నుండి హైదర్‌గూడకు వచ్చింది... హైదర్ గూడా లో ఉన్న కల్లు కాంపౌండ్ లో కూర్చుని ఫుల్లుగా కల్లు సేవించింది. ఆ మద్యం మత్తులో కల్లు కాంపౌండ్ నుండి బయటికి వచ్చి రోడ్డు మీద పడిపోయింది. టోలిచౌకి కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు అదే సమయానికి కల్లు కంపౌండ్ కు వచ్చారు. ఈ  మానవ మృగాలు మహిళ కదలికలు గమనించి ఆమెపై కన్ను వేశారు.  మద్యం మత్తులో పడి ఉన్న మహిళ ను బలవంతంగా ఆటోలో ఎక్కించు కొని... రాజేంద్రనగర్ కిస్మత్పూర్ బ్రిడ్జి కిందకు తీసుకువెళ్లి ఆమెకి ఫుల్లుగా మద్యం తాగిం చారు... వారు కూడా ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం ఈ మృగాలు మద్యం మత్తులో ఉన్న ఆ మహిళపై ఒకరి తర్వాత ఒకరు కామవాంఛ తీర్చుకున్నారు. అయినా కూడా ఈ మృగాలు ఆ మహి ళను వదిలిపెట్ట లేదు. ఈ కామాంధులు తమకు సరైన రీతిలో సహకరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాల్లా ప్రవర్తిస్తూ మహిళను పూర్తిగా వివస్థగా చేసి దిగంబరంగా మార్చి వేసి అత్యంత క్రూరంగా హత్య చేసి అనంతరం అక్కడి నుండి పారిపోయారు. రాజేంద్రనగర్ ఎస్ఓటి బృందం గత ఐదు రోజుల పాటు ఈ మృగాల కోసం వేట కొన సాగించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నాంపల్లి నుండి రాజేంద్ర నగర్, హైదర్‌గూడ వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఈ కామాంధుల గురించి తెలిసింది. దీంతో పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్

  విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆరాధ్య దేవతగా కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. నేటి నుంచి ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆలయానికి చేరుకోగా, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆలయ ఈవో, వేదపండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  అనంతరం డిప్యూటీ సీఎం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ఉప ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించగా, ఆలయ ప్రాంగణం “జయ జయ దుర్గ” నినాదాలతో మారుమ్రోగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  

కడప టీడీపీలో అసమ్మతి సెగలు

  కడప అసెంబ్లీ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బహిరంగమయ్యాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్ల ఆమె భర్త,  టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్ల దేశం నాయకులు పలువురు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వారిని,ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి వైసిపి నుంచి వచ్చిన వారికి  ప్రాధాన్యమిస్తున్నారు అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ దేవుని కడపలోంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారికి మంచి బుద్ది ప్రసాదించాలని అక్కడి దేవుని కడప ఆలయంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం సమర్పించారు.  ఈ కార్యక్రమం కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలను బట్టబయలు చేసింది. స్థానిక ఎన్నికలు జరుగనున్న  నేపథ్యంలో ఎమ్మెల్యే పట్ల, శ్రీనివాస్ రెడ్డి పట్ల వ్యతిరేకత తెలియజేస్తూ అసమ్మతి నాయకులు గుంపు కట్టడం నియోజకవర్గ తెలుగుదేశం రాజకీయాల్లో  రచ్చగా మారింది. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా సీనియర్ కార్యకర్తలు,నాయకుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అది నుండి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు. ఇటీవల పార్టీల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను తొక్కేస్తుందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.  కార్యక్రమం అనంతరం కమలాపురం సీనియర్ నాయకుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిశారు. కడప నియోజవర్గ టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మురళి, కొండాసుబ్బయ్య, మహిళా నేతలు, యువ కార్యకర్తలు, నాయకులు పుత్తా నరసింహ రెడ్డి వద్ద వారి ఆవేదన వ్యక్తం చేస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆగడాలకు తట్టుకోలేకపోతున్నామని,అంబేద్కర్ రాజ్యాంగం కడపలో నడవడం లేది శ్రీనివాసరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.  ఎమ్మెల్యే గెలుపు కోసం పోరాటం చేస్తే గెలిచాక మమ్మల్నివెలివేసిందని, వైసీపీ కార్పోరేటర్లను పార్టీలో చేర్చుకొని వారికి పెద్దపీట వేస్తున్నారని,వారి కాళ్ల దగ్గర ఉన్న వారికే పార్టీ పదవులు, ఇన్‌ఛార్జులు, పనులు కట్టబెడుతున్నారని అన్నారు.ఇంత సీనియార్టీ ఉన్న మమ్మల్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని, మా సమస్యలను  అధిష్టానం దృష్టికి తీసుకెళ్లండి అంటూ ఆయన్ను కోరారు. ఈ మేరకు పుత్తాకు వినతి పత్రం సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడును ,లోకేష్ బాబును కలిసే విధంగా ఏర్పాట్లు చేయాని కోరారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్...ఇద్దరు అగ్రనేతలు హతం

  ఛత్తీస్‌గఢ్‌లో నారాయణపూర్‌ జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతిచెందారు. మృతులను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్‌ కోసాగా గుర్తించారు.  ఘటనా స్థలిలో ఏకే 47, ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ ధ్రువీకరించారు. ఒక్కొక్కరి తలపై రూ.40లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.పార్టీ వారోత్సవాల సమయంలో కీలక నేత హతమయ్యాడన్న వార్త మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతోంది. 

నళినికి సీఎం రేవంత్‌రెడ్డి భరోసా

  సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాజీ డీఎస్పీ నళినిని కలిశారు. సర్వీసు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని త్వరలోనే పరిష్కరస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కలెక్టర్.  వివరించారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి సందేశాన్ని ఆమెకు అందజేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందుతుందని కలెక్టర్ ఆమె భరోసా కల్పించారు.  నళిని ఫేస్‌బుక్‌లో పంచుకున్న బహిరంగ లేఖపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆమె “ఇక నా ప్రయాణం ముగియనుంది” అంటూ రాసిన ఈ లేఖ సీఎం దృష్టికి రాగానే వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళిని, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆదివారం ఫేస్‌బుక్‌లో ఓ బహిరంగ లేఖను పోస్టు చేశారు. మరణ వాంగ్మూలంలా కనిపించిన ఆ లేఖలో తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. నళిని పేర్కొన్నదాని ప్రకారం ఒక అధికారిణి, ఉద్యమకారిణి, రాజకీయవేత్త, ఆయుర్వేద ఆరోగ్యసేవకురాలు, ఆధ్యాత్మిక సాధకురాలిగా సాగిన నా జీవితం ముగింపు దశలో ఉంది. గత ఎనిమిదేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. రెండు నెలలుగా వైరల్ ఫీవర్ వల్ల పరిస్థితి మరింత దిగజారింది. 2018లో ఈ వ్యాధి మొదటగా సోకినప్పుడు హరిద్వార్‌లో రాందేవ్ బాబా పంచకర్మ కేంద్రంలో చికిత్స పొంది కొంత మెరుగయ్యాను. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్లే శక్తి, వనరులు లేవు” అని ఆమె రాసుకున్నారు.ఈ లేఖ బయటకు రావడంతో అధికారులు ఆమెకు తక్షణ వైద్య సహాయం అందించే దిశగా చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.

రోడ్డుపై పడుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

  అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి సంచలనానికి తెరలేపారు. నిత్యం ఏదో అంశంతో వార్తల్లో నిలిచే జేసీ, ఈసారి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. సోమవారం ఉదయం తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం ఎదుటకు వచ్చి రోడ్డుపై పడ్డారు. దృశ్యం ఈ  చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులు చేరుకుని చర్చలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన పోలీస్‌ రక్షణపై ప్రశ్నలు లేవనెత్తిన ప్రభాకర్‌ రెడ్డి “ఆ రక్షణకు ఆయన డబ్బు చెల్లించారా? చెల్లించి ఉంటే రసీదు చూపించండి” అని డిమాండ్‌ చేశారు. అదనంగా, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, తమ అనుచరులపై కేసులు పెట్టారని, వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. పోలీసులు ఈ డిమాండ్లను అంగీకరించకపోవడంతో, ఆయన డీఎస్పీ కార్యాలయం వద్ద నుంచి అశోక్‌ పిల్లర్‌ సర్కిల్‌కు వెళ్లి అక్కడ కూర్చుని ధర్నా కొనసాగించారు. దీనికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో  డీఎస్సీ ఆఫీస్ వద్ద నుండి అశోక్ పిల్లర్ సర్కిల్ వద్దకు చేరుకొని అక్కడ సర్కిల్లో కూర్చుని నిరసన తెలిపారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందేనంటూ జేసీ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం...వాహనదారుల ఇబ్బందులు

  హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, పెద్దఅంబర్‌పేట ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట,  హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెంట్, ఎర్రగడ్డ, బోరబండ  తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్ల జలమయం అయ్యాయి. వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  ఖైరతాబాద్‌-రాజ్‌భవన్‌ రోడ్డులో మోకాలి లోతు వరద నీరు నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తర–ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని సూచించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే విధంగా, ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 26న అది వాయుగుండంగా బలపడవచ్చని తెలిపింది. 27న ఆ వాయుగుండం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

కేసీఆర్ లో జూబ్లీ గాభరా?

బీఆర్ఎస్ ను జూబ్లీ ఉప ఎన్నికలు గాభరా పెడుతున్నాయా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ కవిత విషయంలో పునరాలోచిస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్నసమాధానమే వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయ్యింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. దీంతో తమ సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవశం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ కు కవిత వ్యవహారం ఇబ్బంది పెడుతున్నది. జూబ్లీ ఉప ఎన్నికలో కవిత తెలంగాణ  జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉండటంతో బీఆర్ఎస్ లో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  అధికారంలో ఉన్నంత కాలం విపక్షాలను నానా ఇబ్బందులకూ గురి చేసి ఆ పార్టీల్లో చీలికలకు ప్రోత్సహించిన బీఆర్ఎస్.. ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తులు పెచ్చరిల్లడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరీ ముఖ్యంగా కవిత తిరుగుబావుటా ఆ పార్టీని ఊపిరితీసుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాజకీయాలలో గత కొంత కాలంగా కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అయిన సంగతి విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలకు హరీష్ బాధ్యుడంటూ ఆమె చేసిన ఆరోపణలు, విమర్శలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసి తప్పుచేశామా అన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సస్పెన్షన్ కు గురైన కవిత ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముందుకు సాగడమే కాకుండా జూబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ జాగృతి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత  అలీఖాన్ ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. తమ ఓటమి ఖాయమన్న భయం బీఆర్ఎస్ లో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో కేసీఆర్ కవితను తన ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.   ఆమెతో చర్చించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి అభ్యర్థిని నిలబెట్టకుండా బుజ్జగించే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఆ వర్గాలు అంటున్నాయి.  ఒక వేళ జూబ్లీ ఉప ఎన్నికలో కవిత కనుక జాగృతి అభ్యర్థిని నిలబెట్టడమంటూ జరిగితే బీఆర్ఎస్ ఓట్లు చీలి ఓటమి పాలవుతామన్న భయంతో పాటు   అది అధికార పార్టీకి లాభం చేసే అవకాశం ఉంటుందన్న భావనతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితతో చర్చించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  

తెలుగు వన్‌లో సౌందర్యలహరి

    తెలుగు వన్ ఆధ్వర్యంలో భక్తివన్ ద్వారా ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి భక్తుల కోసం సరికొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. వంద సంస్కృత శ్లోకాలను సులభంగా అర్థమయ్యేలా తెలుగులో తాత్పర్యంతో వివరించిన ఈ ప్రత్యేక వీడియోను సోమవారం ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సీఎస్ మాట్లాడుతూ  “సౌందర్యలహరి శ్లోకాలు ఆధ్యాత్మిక తాత్పర్యాన్ని మాత్రమే కాక, మానవ జీవనానికి అందమైన దారిదీపమవుతాయి.  తెలుగు వన్ తీసుకున్న ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక వనరుగా నిలుస్తుంది” అన్నారు. కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ మాట్లాడుతూ, “ఆది శంకరుల అమూల్య కృతిని కొత్త తరానికి అందించే అవకాశం లభించడం మా అదృష్టం” అన్నారు. భక్తివన్ బృందం రూపొందించిన ఈ వీడియోలో ప్రతి శ్లోకానికి భావార్థం, పఠనం, విశ్లేషణను సమగ్రంగా చేర్చారు. సాంకేతికతతో సంస్కృత సంపదను సమ్మిళితం చేసిన ఈ కృషి, భక్తుల హృదయాలలో భక్తి, జ్ఞానం కలగలిపే వంతెనగా నిలుస్తోంది.