ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే... ఎందుకంటే?

  ములుగు జిల్లా మంగపేట మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గిరిజనేతరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని వాదనలు వినిపించారు.  అయితే 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేయగా, నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పెట్టి నిజాం ఆదేశాలను అనుసరించడం సరైంది కాదని గిరిజనేతరులు అభ్యంతరం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న వేళ, తమ హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎన్నికలపై స్టే విధించింది.

డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్

  తెలంగాణతో పాటు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. తెలంగాణ కోసం 22 మంది పరిశీలకులను ప్రకటించింది. ఈ బాధ్యతలను సీనియర్‌ నేతలకు అప్పగించినట్టు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. డీసీసీల నియామకాన్ని పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకునేలా సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. భవిష్యత్‌లో అధిక ప్రాధాన్యం కలిగే అవకాశం ఉన్నందున డీసీసీ పదవులపై డిమాండ్ పెరిగినట్లు సమాచారం.  

హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్

  కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్ట్ లో తన పేరును తొలగించాలని తెలంగాణ హై కోర్టు లో  ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్మిత సబర్వాల్ చర్యలను.. పీసీ ఘోష్  కమిషన్ రిపోర్టులో పేర్కొ న్నారు. కాళేశ్వ రం నిర్మాణా లపై స్మితా సభర్వాల్ రివ్యూ చేసిందని కమిషన్ తెలపడమే కాకుండా బ్యారేజ్ లను సందర్శించిన  పలు ఫోటోలను, సైతం రిపోర్ట్ లో పొందుపరిచింది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్‌బ్యాక్ ను ఎప్పటి కప్పుడు అప్పటి సీఎంకు  స్మిత సభర్వాల్ చేరవేసిందని పీసీ ఘోష్ కమిషన్ తెలిపారు.  చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మిత సభర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించింది. కాళేశ్వరం పై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సభర్వాల్ కీలక పాత్ర పోషించింది. నిజా నిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సభర్వాల్ పై చర్యలు తీసుకో వాలని కమిషన్ రిపోర్ట్ లో పేర్కొ న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు స్మితా సబర్వాల్ వివరణ ఇచ్చేందుకు తనకు 8b,  8c నోటీసులు ఇవ్వలేదని పిటిషన్  దాఖలు చేశారు. పీసీ గోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని  స్మితా సభర్వాల్ తెలంగాణ హైకోర్టును కోరారు.  

శాసన మండలిలో కొణిదెల మొదటి ప్రశ్న

  గత ప్రభుత్వం అమలు చేసిన తప్పుడు, అక్రమ కేసులపై శాసన మండలిలో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడితే వందలాది మందిపై కేసులు పెట్టారని, తన పైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంతో కడప కోర్టుకు నేను హాజరయ్యానని అన్నారు.  గత ప్రభుత్వ చీకటి జీవోలు తెచ్చే సంస్కృతిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగించదని స్పష్టం చేశారు. అన్ని కేసులను లా ప్రకారం పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యమించిన టీచర్లపై నమోదైన కేసుల్లో 80 శాతం ఎత్తివేశామని, మిగిలిన కేసుల పరిష్కారానికి కూడా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె వెల్లడించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019 నుండి 2024 మధ్యకాలంలో మొత్తం 3,116 తప్పుడు కేసులు పెట్టిందని హోంమంత్రి  అనిత శాసనమండలిలో వెల్లడించారు. ఈ కేసుల్లో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన సాధారణ ప్రజలపై కూడా కేసులు పెట్టారని ఆమె చెప్పారు.కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే లేదా ఫార్వార్డ్ చేసినందుకే ప్రజలపై కేసులు పెట్టారు అని ఆమె విమర్శించారు.  అమరావతి రైతులు రాజధాని కోసం చేసిన ఉద్యమంలో వందలాది కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో కొన్ని విచారణ దశలో ఉండగా, మరికొన్ని ట్రయల్ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని కేసులు కోర్టుల పరిధిలో విచారణలో ఉన్నాయి అని వివరించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని హోంమంత్రి తెలిపారు.  పోలీస్ శాఖ, న్యాయ శాఖలతో సమన్వయంగా సమావేశమై కేసుల పరిష్కారంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. అంతేకాకుండా ఇటీవల జగన్ పత్రికలో ఎన్డీయే కూటమి సభ్యుల్లో 94 శాతం మందిపై కేసులున్నాయన్న వార్తలపై స్పందిస్తూ, వారు గుర్తించాల్సింది ఒక్కటే – మా నాయకులపై కోడి కత్తి కేసులు, గొడ్డలి వేటు కేసులు, లేదా తల్లి, చెల్లెలు పేరుతో పెట్టిన పర్సనల్ కేసులు లేవు. ఇవన్నీ రాజకీయ కేసులే. గత ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎత్తిచూపినందుకు మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయి అని హోంమంత్రి స్పష్టం చేశారు.  

రాజకీయ నాయకుల విగ్రహాల కోసం ప్రజల సొమ్ము వాడొద్దు : సుప్రీంకోర్టు

  తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ నేతల విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజాధనాన్ని వినియోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. "మీ మాజీ నాయకుల గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారు? దీనికి మేం అనుమతి ఇవ్వలేం" అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసి, కొన్ని నెలల క్రితమే పనులు కూడా ప్రారంభించింది. అయితే, ప్రభుత్వ స్థలంలో విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రజా ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కొన్నిసార్లు ఈ విగ్రహాల వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని పేర్కొంటూ, విగ్రహ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు సరైనదేనని సమర్థించింది. ప్రజాధనాన్ని ఇలాంటి పనుల కోసం దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. వెంటనే పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ ఊరట కావాలనుకుంటే హైకోర్టునే ఆశ్రయించాలని ప్రభుత్వానికి సూచించింది.

శ్రీవారి సేవలకు టీటీడీ శుభవార్త

  తిరుమల శ్రీవారి సేవలకు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు శుభవార్త చెప్పారు.  సేవలకు సేవా కాలం అనంతరం వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. శ్రీవారి సేవకులతో ఆస్థాన మండపంలో బీఆర్‌ నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భాంధవులు అని అన్నారు. శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ప్రతిసారి టీటీడీ సేవకుల గురించే ప్రస్తావిస్తుంటానని వెల్లడించారు.దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని అన్నారు. వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో టీటీడీ సేవను మరింత బలోపేతం చేస్తామని వ్యాఖ్యానించారు. శ్రీవారి సేవా విభాగం పదింతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

నార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టాలి : సీఎం చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌లో  90 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి  పరిస్థితిని ప్రభుత్వం సహించదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ, “ఎప్పుడైనా సరే ఆపరేషన్‌ అంటే శరీరాన్ని కోయడమే. సహజసిద్ధమైన ప్రసవాన్ని ప్రోత్సహించాలి.  సిజేరియన్‌లలో అగ్రస్థానంలో ఉండటం సరికాదు. దీన్ని నియంత్రించే మార్గాలపై ఆలోచించాలి” అన్నారు. దేశంలో అత్యధికంగా ఏపీలో  సిజేరియన్‌ డెలివరీలు (56.62%) జరుగుతున్నాయి. ఇది డేంజరస్ ట్రెండ్ అన్నారు. గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని, యోగా వంటి సాధనాలను నేర్పే పరిస్థితి రావాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను పిలిచి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మన అందరి లక్ష్యం. వచ్చే ఏడాదికే రాష్ట్ర జనాభా 5.37 కోట్లకు చేరుకోనుంది. దేశ జనాభా 2047 నాటికి 162 కోట్లకు చేరుతుందని అంచనా. యూపీ, బిహార్ వల్లే భారత్‌లో జనాభా సమతుల్యం అవుతోంది. ఏపీలో పీహెచ్‌సీలు జాతీయ సగటు కంటే ఎక్కువే ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మన రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు” అని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నారని, దేశ సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉందని సీఎం తెలిపారు. “ఇమ్యూనైజేషన్‌లో 97 శాతం విజయాన్ని సాధించాం. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో 78 శాతం పురోగతి ఉంది, త్వరలోనే వందశాతం సాధిస్తాం. గర్భిణీల్లో అనీమియా 32 శాతం ఉన్నా, దీన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నాం” అని సీఎం చంద్రబాబు వివరించారు.

గ్రూపు-1 పరీక్షపై... హైకోర్టులో మరో అప్పీలు

  తెలంగాణ గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణ, ఫలితాలను సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మరో అప్పీల్ దాఖలైంది. జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని గ్రూప్‌-1 అభ్యర్ధి విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అభ్యర్థి అప్పీల్‌ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. టీజీపీఎస్సీ కూడా అప్పీల్‌ దాఖలు చేశారని న్యాయవాది పేర్కొనగా.. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.  పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఈ ఏడాది మార్చి 10న గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. ఆ ఫలితాల్లో అవకతవకలు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు అధ్యక్షతన, ఈ నెల 9వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేస్తూ, కమిషన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్

  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ఆలోచనే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ కోసం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ప్యాకేజీతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, కర్మాగారం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ ప్రయత్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినా కూడా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. వాస్తవాలు తెలియకుండా విమర్శించడం ప్రతిపక్షానికి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అనేక పెద్ద పరిశ్రమలు వచ్చినట్లు గుర్తుచేస్తూ, అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ స్థాపనతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. కియా రాకముందు అక్కడ తలసరి ఆదాయం రూ.70 వేల కంటే తక్కువగా ఉండగా, పరిశ్రమతో పాటు అనుబంధ యూనిట్లు రావడంతో ఉపాధి అవకాశాలు పెరిగి తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి పెట్టుబడులు అత్యంత కీలకమని లోకేశ్ స్పష్టం చేశారు.

అమరావతిలో సీఆర్డీయే నూతన భనవం ప్రారంభం ఎప్పుడో తెలుసా?

అమరావతిలో సీఆర్డీయే కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. విజయదశమి రోజున ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.  4.23 ఎకరాల్లో 2.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో   ఎనిమిది అంతస్తులలో ఈ భవన నిర్మాణం జరిగింది. వాస్తవానికి ఈ భవనాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని భావించినప్పటికీ భారీ వర్షాల కారణంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో  వాయిదా పడింది. ఈ సీఆర్డీయే భవనంలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భవనలో సీసీటీవీలు, డ్రోన్లతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్, సెక్రటేరియెట్, రాజ్ బవన్ నమూనాలు ప్రదర్శించే ఎక్స్ పీరియెన్స్ సెంటర్ ఉన్నాయి. అలాగే పైకప్పుపై ఈవెంట్ స్పేస్, జాతీయ జెండా ఉంటాయి.   కాగా భవనం ఇనాగ్యురేషన్ కు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో మంత్రి నారాయణ ఈ భవనాన్ని మంగళవారం (సెప్టెంబర్ 23) పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు.  మూమూలుగా అయితే ఈ సీఆర్డీయే భవనం 2019 నాటికే రెడీ అవ్వాలనీ, అయితే గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిలిచిపోయిందని నారాయణ తెలిపారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత టెండర్లు పిలిచి సీఆర్డీయే భవన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.  

నవంబర్ లోగా బెంగళూరులో గుంతలు లేని రోడ్లు!

కర్నాటక రాజధాని బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. నవంబర్ నాటికల్లా బెంగళూరు నగరంలో రోడ్లపై గుంతలనేవే ఉండవని చెప్పారు. ఆ విధంగా కాంట్రాక్టర్లకు స్పష్టమైన గవుడు విధించినట్లు చెప్పారు. అయినా దేశ రాజథాని నగరం ఢిల్లీలో ఏకంగా ప్రధాని నివాసం ముందు రోడ్డుపైనా గుంతలు ఉన్నాయన్నారు. అంతెందుకు.. రోడ్లపై గుంతలు ఉండటం అన్నది దేశ వ్యాప్త సమస్య అన్న డీకే శివకుమార్.. వాటిని వేటినీ పట్టించుకోకుండా మీడియా కేవలం బెంగళూరునే లక్ష్యం చేసుకుందని విమర్శించారు.  గతంలో కర్నాటకలో అధికారంలో ఉన్న  బీజేపీ ప్రభుత్వం సరిగ్గా పనిచేసి ఉంటే రోడ్లు ఎందుకిలా ఉంటాయని ప్రశ్నించారు.   బెంగళూరు రోడ్లు గుంతలమయంగామారిపోయాయంటూ  కేంద్ర మంత్రి హెచ్ డీ కుమార స్వామి విమర్శించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఒక టెక్ కంపెనీ సీఈవో కూడా బెంగళూరు రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమ వేదికగాచేసిన పోస్టు వైరల్ అవ్వడమే కాకుండా, బెంగళూరు నుంచి సదరు కంపెనీని తరలించాలని భావిస్తున్నట్లుగా ఆ సీఈవో ఆ పోస్టులో పేర్కొన్నారు. దానికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆ కంపెనీని విశాఖకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ ప్రిజం పబ్ ఫైరింగ్ కేసులో నిందితుడు పరార్

  హైదరాబాద్ ప్రిజం పబ్ ఫైరింగ్ కేసులో నిందితుడు పారిపోయాడు.. ఆంధ్ర పోలీసుల కస్టడీ నుంచి బత్తుల  ప్రభాకర్ తప్పించుకొని పోయాడు.. హైదరాబాద్ నుంచి పిటి వారింటిపై తీసుకెళ్లి విజయవాడ కోర్టులో హాజరు పరిచి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొని వెళుతుండగా పోలీసుల కళ్ళు కప్పి పరారైన బత్తుల ప్రభాకర్  కోసం రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు..  హైదరాబాదు నగ రంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రిజం పబ్ లో బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపి నానా హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  అయితే రాజ మహేంద్రవరం పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి పిటి వారంటి మీద ఈ బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి తీసు కొని రాజమండ్రి కి తీసుకెళ్లారు అనంతరం నిన్న సోమవారం రాత్రి సమయంలో  విజయవాడ కోర్టులో బత్తుల ప్రభాకర్ను హాజరు పరిచి తిరిగి రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొని వెళ్తుండగా... తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామ సమీపంలో ఉన్న  ఒక దాబాలో విందు కోసమని పోలీసులు వాహనాన్ని ఆపారు  అదే అదనుగా  భావిం చిన నిందితుడు  బత్తుల ప్రభాకర్ పోలీసుల కళ్ళు కప్పి అక్కడి నుండి పారిపో యాడని పోలీసులు తెలి పారు. ప్రభాకర్ ఒక చేతిలో సంకెళ్లు వేసి ఉన్నాయి .. తెల్లటి టీ షర్టు మరియు నల్ల ట్రాక్  ధరించి ఉన్నాడని పోలీ సులు తెలి పారు. ఈ కరుడు గట్టిన నేరస్థుడు తప్పించు కొని పారిపోవడం వల్ల ప్రజలు అప్రమ త్తం గా ఉండాలని రాజమహేంద్రవరం పోలీసులు కోరారు.  ఎవరికైనా బత్తుల ప్రభాకర్ కనిపించి నచో 94407 96584 లేదా 9440 796624 కు ఈ నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బత్తుల ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి.  హైటెక్ దొంగగా పేరుగాంచిన బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండా లంటూ పోలీసులు సూచించారు..  

శ్రీవారికి విలువైన కానుక సమర్పించిన తెలంగాణ బీజేపీ ఎంపీ

  తిరుమల శ్రీవారికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం నాడు భారీ విరాళం సమర్పించారు. సుమారు రూ.60 లక్షల విలువైన అత్యంత అపురూపమైన స్వర్ణాభరణాన్ని ఆయన స్వామివారికి కానుకగా అందించారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి 535 గ్రాముల బరువున్న అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి అనే స్వర్ణ కంఠాభరణాన్ని శ్రీవారికి సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తాము ఈ విరాళాన్ని స్వీకరించినట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ ఏడాది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు రోజు, అంటే సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆలయ యాగశాలలో అంకురార్పణ ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడుతుంది. అంకురార్పణలో నవధాన్యాలను మొలకెత్తించి భూమి పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ విష్వక్సేనులవారి ఊరేగింపు ఉంటుంది. ఇది బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించే ఆధ్యాత్మిక సూచనగా భావిస్తారు.నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా మేదినిపూజ నిర్వహించి భూదేవిని ప్రసన్నం చేసుకుంటారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తూ ప్రత్యేక వేదకార్యక్రమాలు చేస్తారు.

విజయవాడ ఉత్సవ్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

శరన్నవరాత్రులను పురస్కరించుకుని బెజవాడలో దసరా ఉత్సవ్ నిర్వమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. మైసూరు ఉత్సవాలను తలదన్నేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలలని తలపెట్టింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఘనంగా చేసింది. అయితే ఈ ఉత్సవాల నిర్వహణకు ఎంపిక చేసిన స్థలాలలో ఒకటి దుర్గగుడికి చెందినదని పేర్కొంటూ ఆలయ భూమిలో వ్యాపార  కార్యక్రమాల నిర్వహణ ఏమిటంటూ వైసీపీ సీనియర్వి నేత పేర్నినాని విమర్శలు గుప్పించారు. ఆయన విమర్శలను ఆధారం చేసుకుని కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హై కోర్టు  సింగిల్ బెంచ్ ఆలయభూమిలో వ్యాపార కార్యక్రమాలను వీల్లేదంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఆ స్టేను సవాల్ చేస్తూ కొన్ని హిందూ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్ సుప్రీం కోర్టు సోమవారం (సెప్టెంబర్ 22) విచారించి విజయవాడ ఉత్సవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఉత్సవాల నిర్వహణను నిలిపివేయాలంటూ కొన్ని సంఘాల దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో విజయవాడ ఉత్సవ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. 

ఆర్జీవీ ‘మెగా’ భజన.. మేటర్ ఏంటి?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవిలపై పొగడ్తల వర్షం కురిపించేవారు. రాజును సైతం మించిన రాజభక్తిని ప్రదర్శించినట్లుగా ఆ మెగా బ్రదర్స్ సైతం టూమచ్ అనుకునే లెవెల్లో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు ఉండేవి. అయితే ఎప్పుడైతే ఆయన వైసీపీ ఫోల్డ్ లోకి వెళ్లారో.. అప్పటి నుంచీ ఆయన అదే మెగా బ్రదర్స్ పై అనుచిత రీతిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా ఆయన ట్వీట్ లు, సోషల్ మీడియా పోస్టులు ఉండేవి. జగన్ కోసం ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాలో పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా పాత్రను సృష్టించారు.  అయితే ఆ విమర్శలట్వీట్లు అటు వైసీపీ ఏ మాత్రం ఉపయోగం లేకపోగా.. స్వయంగా ఆర్జీవీ కూడా భ్రష్టుపట్టిపోయారు. ఆయన క్రెడిబులిటీ పూర్తిగా పోయింది.  సరే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని దయనీయ స్థితికి దిగజారిపోయింది. ఇక వైసీపీ అధికారంలో ఉండగా హద్దుల్లేకుండా అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఆర్జీవీని కేసులు చుట్టుముట్టాయి. దీంతో ఆయనకు తత్వం బోధపడి రాజకీయాల జోలికి పోను అంటూ చెంపలేసుకున్నారు. చెంపలైతే వేసుకున్నారు కానీ, అటు సినీ పరిశ్రమలో, ఇటు ప్రజలలో కోల్పోయిన క్రెడిబులిటీని మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయారు.  ఇప్పుడు ఇక ఆ క్రెడిబులిటీ కోసం గతంలో విమర్శలు గుప్పించిన వారినే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడానికి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా వర్మ మెగా బ్రదర్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.   అదే సమయంలో నెటిజన్లు ఆర్జీవీని ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి తావిచ్చింది.  ఇంతకీ  ఆర్జీవీ చేసిన ట్వీట్  ఏమిటంటే..   మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా వస్తే.. అది ఈ శతాబ్దానికే మెగా పవర్ ఫిల్మ్ అవుతుంది అన్నది.   కొన్నేళ్ల కిందట పవన్ కు వ్యతిరేకంగా అనుచిత ట్వీట్లు చేసిన ఆర్జీవీ ఇప్పుడు పవర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారంటే కామెంట్లు చేస్తున్నారు. ఎన్ని రంగులు మార్చినా.. ఆర్జీవీని నమ్మేవారెవరూ ఉండరంటూ పోస్టులు పెడుతున్నారు.

మేడారంలో తులభారం సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

    సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.  అనంతరం ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతోపాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించనున్నారు ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని సీఎం అన్నారు. మేడారం పర్యటనలో భాగంగా ఆయన సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోరాటం, పౌరుషానికి ప్రతీకలైన సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే అమ్మవార్లను దర్శించుకుంటున్నానని, 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే తన పాదయాత్ర ప్రారంభమైందని తెలిపారు. ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, సంప్రదాయంలో ఏ మార్పు రాకుండా ప్రజల అభిప్రాయాలతో ముందుకు వెళ్తామన్నారు. భక్తి డబ్బులతో కొలవలేనిదని, నమ్మకమే నిజమైన కొలమానం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా సూచించారు. ప్రకృతి ఒడిలో నిలిచిన ఈ ఆలయం ప్రత్యేకమని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జన్మ చరితార్థమని, ఇది ఒక వరమని అన్నారు. ఆదాయం కోసం కాదు, భక్తితో సేవ చేయాలని అధికారులకు సూచించారు. జంపన్న వాగులో నీటి నిల్వ కోసం చెక్‌డ్యాంలు నిర్మించాలని ఆదేశించారు. ప్రత్యేక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

దిక్కులేని వైసీపీకి శాసనమండలే దిక్కు!

ఏ మొగుడు లేని వారికి అక్క మొగుడే దిక్కు అని ఉత్తరాంధ్రలో  ఓ పాతకాలపు సామెత ఉంది.  ఇప్పుడు వైసీపీని చూసి అదే మాట అనుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. అధికారంలో ఉన్నప్పుడు రద్దు చేస్తామన్న శాసనమండలే ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి దిక్కుగా మారిందంటున్నారు.  ఈ పరిస్థితి జగన్ ముందు చూపులేని నిర్ణయాలకు నిలువెత్తు నిదర్శనంగా వైసీపీ నేతలే అంటున్నారు.    ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఉద్యమకారులను అన్ని రకాలుగా అణచివేశారు.  వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కానీ 2024 లో జరిగిన ఎన్నికల్లో  మూడు ప్రాంతాల ప్రజలు కూడా ఫ్యాన్ పార్టీకి మొట్టికాయ వేశారు. రాష్ట్రం అంతా కలిసి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు.  అయితే అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుల ఆమోదానికి మండలిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న మెజారిటీ అవరోధంగా మారడంతో అప్పట్లో  శాసనమండలని  రద్దు చేయాలని జగన్ భావించారు. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారు.  కానీ శాసనమండలి రద్దు ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ దశలో 11 మంది సభ్యులతో అసెంబ్లీకి వెళ్లడం అవమానంగా భావించి జగన్మోహన్ రెడ్డి  అసెంబ్లీకి గైరాజరవుతున్నారు. దీనిపై స్పీకర్ అయిన పాత్రుడు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పలుమార్లు విమర్శలు చేసినప్పటికీ ఫ్యాన్ పార్టీ  తన వైఖరిని మార్చుకోలేదు. అయితే ఒకవైపు అసెంబ్లీకి వెళ్ళక అధికారంలో లేక తమ వాదన వినిపించే పరిస్థితి ఉండక ఫ్యాన్ పార్టీ ఇబ్బంది పడుతున్నది. ఈ దశలో ప్రతిపక్ష నాయకుని హోదా తో శాసనమండలిలో ఫ్యాన్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాత్రం తన గళాన్ని వినిపిస్తున్నారు . దీన్ని కూటమి నాయకులు బలంగా తిప్పి కొట్టినప్పటికీ ఎంతో కొంత బొత్స తన గొంతును వైసీపీ పక్షాన వినిపిస్తున్నారు.  దీన్ని చూసిన ఉత్తరాంధ్రవాసులు జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా శాసనమండలిని రద్దు చేయాలని భావించినా ఇప్పుడు అదే ఆ పార్టీకి దిక్కుగా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.    ఫ్యాన్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక తరహాలో  వ్యవహరిస్తే బొత్స సత్యనారాయణ మరోలా ప్రవర్తిస్తున్నారు . కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి బాయ్ కాట్ చేస్తే..  బొత్స సత్యనారాయణ మాత్రం విధిగా శాసనమండలికి హాజరవుతున్నారు. ఇది ఒకరకంగా ఆ పార్టీలో భిన్న ఆలోచనలకు తెర తీస్తోంది. అధినాయకుని తీరును లెక్కచేయకుండా బొత్స హాజరవుతున్నారా లేక ప్రజాపక్షంలో నాయకునిగా తన గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అన్న అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి దశ నుంచి ఏకపక్ష నిర్ణయాలతో..  రాచరికం మాదిరిగా తన నిర్ణయమే అమలు కావాలనే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి తాజాగా బొత్స ప్రవర్తన పై గుర్రు గా ఉన్నట్టు కూడా ఫ్యాన్ పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి వై ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న బొత్స తొలి  నుంచి  వైసీపీలో  ఉన్నా ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా బొత్స వైఖరి అదే తరహాలో ఉంటుంది. అయితే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు బొత్సకు జగన్... జగన్ కు బొత్స  గత్యంతరం లేని దిక్కులుగా మారారు. ఇంకా రంగులు మారుతున్న రాజకీయ పరిణామాలతో ఈ నాయకుల తీరు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.