చైనా మాంజా విక్రయించినా...నిల్వ ఉంచినా కఠిన చర్యలు : సీపీ
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవ్యాప్తంగా గాలిపటాల పండుగ ఉత్సాహం వెల్లివిరుస్తున్న వేళ, ప్రాణాంతకంగా మారిన నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. చైనీస్ మాంజా విక్రయాలు, వినియోగం, నిల్వపై ఎలాంటి ఉపేక్ష ఉండదని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
పక్షుల ప్రాణాలకు, అమాయక వాహనదారుల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతున్న ప్రమాదకరమైన ఈ మాంజాను పూర్తిగా అరికట్టేందుకు నగర పోలీసు యంత్రాంగం సమాయత్త మైందని సీపీ వెల్లడించారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కచైనీస్ మాంజా నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు సీపీ సజ్జనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని అన్ని జోన్లలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తం గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కైట్స్ విక్రయ కేంద్రాలు, చిన్న కిరాణా దుకాణాలు, అనుమానిత గోదాములు, గుట్టుగా నిల్వ చేసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే వెంటనే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయను న్నట్లు పేర్కొన్నారు.అంతే కాకుండా నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా చైనీస్ మాంజా రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసుల పైనా కూడా నిఘా పెంచి నట్లు సీపీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాలో ఏజెన్సీ యజమానుల ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చైనీస్ మాంజా కేవలం మానవ ప్రాణాలకు మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర హాని కలిగిస్తోం దని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాంజా మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతూ భూమిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందని గుర్తుచేశారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకులు, మెటాలిక్ పదార్థాల పూత ఉండటం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడం, పిల్లల వేళ్లు కోసుకుపోవడం వంటి దుర్ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. విద్యుత్ తీగలకు తగిలినప్పుడు మెటాలిక్ మాంజా కారణంగా విద్యుత్ షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయ నూలు దారా లతో చేసిన మాంజానే ఇచ్చి, సురక్షితంగా గాలిపటాలు ఎగురవేయాలని కోరారు.నగర పౌరులు సామాజిక బాధ్యతతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని సీపీ పిలుపునిచ్చారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిషేధిత చైనీస్ మాంజాను గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నా, నిల్వ ఉంచినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని, లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 94906 16555కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచు తామని సీపీ స్పష్టం చేశారు.