అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో మంత్రి లోకేష్ భేటీ
posted on Sep 22, 2025 @ 3:32PM
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా కలిశారు. శాసనసభ కార్యక్రమాలకు విరామం ఇచ్చిన సమయంలో వీరిద్దరూ భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన టీచర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎంను మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. ఈ నెల 25వ తేదీన డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.
ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థుల వివరాలు విద్యాశాఖ వెబ్‌సైట్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్, విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో, అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.
మొత్తం 16,347 టీచర్ల పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను సెప్టెంబర్ 15న విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, పురపాలక, గిరిజన సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీల భర్తీ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. అనంతరం టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తూ, ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి తుది జాబితాను రూపొందించారు.