ఏపీ శాసనమండలి సోమవారానికి వాయిదా

  వైసీపీ నేతల గందరగోళం మధ్య శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యకళాశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్మించారు. బీఏసీ సమావేశంలో వైద్యకళాశాలపై చర్చిస్తామని ఛైర్మన్‌ చెప్పారు. మరోవైపు జీఎస్టీ సంస్కరణల అంశంపై  స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను మండలి ఛైర్మన్‌ కోరారు. సభలో ఆర్డర్‌లో ఉంచాలని పయ్యావుల విజ్ఞప్తి చేశారు. వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో మండలి ఛైర్మన్‌ మోషేనురాజు సభను సోమవారానికి వాయిదా వేశారు.  వైద్యశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి ఛైర్మన్‌ మోషేనురాజు ప్రశ్నోత్తరాలు చేపడుతున్న సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు టీడీపీ సభ్యులు కూడా వైసీపీకు పోటీగా నినాదాలు చేశారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. వైద్యకళాశాలలపై స్వల్ప చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని.. సభ సజావుగా జరిగేలా సహకరించాలని వైసీపీ సభ్యులను ఆయన కోరారు. 

అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా : కడియం శ్రీహరి

  స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఇద్దరిని మంత్రులను కూడా చేశారు. అప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదు. ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతలకు విలువలు గుర్తుకొచ్చాయా? సభాపతి నోటీసు ఇచ్చారు, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను’’ అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.  ఈ ప్రాంత ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు. హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు గోదావరి జలాలను అందించామని చెప్పారు. చెరువులు నిండిపోయాయని, కాలువల్లో పూడిక తీయించి మరమ్మతులు చేసి సాగునీరు చేరేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి సహకారంతోనే అనేక అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రజలతోనే ఉంటాను, వారి కోసం కృషి చేస్తాను. 

మధ్యతరగతి కారు కలలకు రెక్కలు!

జీఎస్టీ రేట్ల దెబ్బ‌కు కారు క‌ల‌ల‌కు రెక్క‌లొచ్చిన‌ట్టే ఉన్నాయ్.  ఏమో గుర్రం ఎగురా వ‌చ్చ‌న్న‌ట్టు.. ఏమో సాదా సీదా సామాన్యుడు కూడా ఓ పాతిక వేలు చేతిలో ఉంటే కొత్త కారు బుక్ చేయవచ్చన్నట్లుగా అన్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి. అంత‌గా జ‌న‌సామాన్యానికి జీఎస్టీ 2. 0 తో ద‌స‌రా, దీపావ‌ళి, సంక్రాంతి పండుగలు ఒక్కసారే  వ‌చ్చేసిన‌ట్లైంది. ఇలాంటి బంప‌రాఫ‌ర్లు ప్ర‌కటించ‌డంలో ముందుండే మారుతీ సుజుకీ అయితే.. తన కార్ల ధరలను భారీ ఎత్తున తగ్గిస్తూ ముందుగానే ప్రకటించేసింది.  వాటిలో ల‌క్ష‌కు పైగా డిస్కౌంట్ ఇచ్చే కార్ల మోడ‌ళ్లు   అర‌డ‌జ‌ను వ‌ర‌కూ ఉన్నాయి.  ఉదాహ‌ర‌ణ‌కు ఎస్ ప్రెసో ధ‌ర ఏకంగా ల‌క్షా ముప్పై వేల వ‌ర‌కూ త‌గ్గుతోందంటే ప‌రిస్థితి  అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఇదే కోవ‌లోకి వ‌చ్చే కార్ల వివ‌రాలేంటో చూస్తే..  ఆల్టో కే 10, గ్రాండ్ విటారా-  ల‌క్షా 7 వేలు,  ఫ్రాంక్స్, బ్రెజ్జా- ల‌క్షా 12 వేలు.. ఇక సెలేరియో 97 వేలు, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, వంటివి 80 వేల నుంచి 90 వేల మ‌ధ్య‌.. వ్యాగ‌నార్, ఇగ్నిస్ ధ‌ర‌లు 70 వేలు- 80 వేల మ‌ధ్య త‌గ్గ‌నున్నాయి. టూర్ ఎస్, జిమ్నీ, ఎక్స్ ఎల్ 6, ఇన్విక్టో, ఎకో, క్యారీ ఎల్పీజీ వంటివి   50 వేల నుంచి 70 వేల రూపాయ‌ల వరకూ తక్కువ ధరలకు లభించనున్నాయి. ఒక్క ఎర్టిగా మాత్ర‌మే కేవ‌లం 46 వేలు మాత్ర‌మే త‌గ్గే వేరియంట్. మిగిలిన మోడ‌ళ్ల‌న్నీ యాభై వేల నుంచి ల‌క్షా ముప్పై వేల మ‌ధ్య  ధ‌ర‌లు తగ్గనున్నాయి.  ఇందులో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత లాభ‌దాయ‌క‌మైన విష‌య‌మేంటంటే బేసిగ్గానే మారుతీ.. డిస్కౌంట్లు ఎక్కువ‌, డౌన్ పేమెంట్లు త‌క్కువ‌గా ఇచ్చే కంపెనీ.. ఒక వేళ జీఎస్టీ త‌గ్గుద‌ల ద్వారా కూడా క‌స్ట‌మ‌ర్లు క్యూ క‌ట్ట‌కుంటే మ‌రింత డిస్కౌంట్లు ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేదు. కాబ‌ట్టి మ‌ధ్య త‌ర‌గ‌తి వారి కారు క‌ల‌కు ఇక రెక్క‌లొచ్చిన‌ట్టే.. అన్న‌ది మార్కెట్లో గ‌ట్టిగా వినిపిస్తోన్న మాట‌! మ‌రి మీ కారు బుక్ చేస్కోడానికి మీరు రెడీయేనా?

సిట్, ఈడీల సమన్వయం.. ఏపీ లిక్కర్ స్కాం నిందితుల్లో భయం భయం!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌ లో సిట్, ఈడీలు ఏకకాలంలో దూకుడు పెంచడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఖంగారు పెరిగిపోతున్నది. ఒక వైపు సిట్ ఈ కేసు దర్యాప్తులో మద్యం కుంభకోణం సొమ్ము అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చే దిశగా దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ   ఈ మద్యం స్కాంకు సబంధించిన మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగిందో తేల్చే పనిలో పడింది. అందులో భాగంగానే ఈడీ గురువారం (సెప్టెంబర్ 18) ఏకకాలంలో పలు రాష్ట్రాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో  వైసీపీ పెద్దల్లో ఒక్కసారిగా కంగారు మొదలైంది.   ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని భావించిన ఈ కేసులో నిందితులు.. ఈడీ ఎంట్రీతో స్కాం చెయిన్ గుట్టు మొత్తం రట్టౌంతుందన్న ఆందోళనలో పడ్డారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఇంకా సమన్లు అందుకోని వారూ, సిట్ రాడార్ లోకి రాలేదని సంబరపడుతున్నవారు ఉలిక్కి పడుతున్నారు. దర్యాప్తు తమ దాకా రావడానికి ఇంకెంతో కాలం పట్టదన్న ఆందోళనలో పడ్డారు.  అన్నిటికంటే ముఖ్యంగా ఈడీ పక్కా సమాచారంతో, అంతకు మించి పక్కా ప్రణాళికతో సోదాలు నిర్వహిస్తున్నట్లు గురువారం (సెప్టెబర్ 18) సోదాలను గమనిస్తే అర్ధమౌతోంది.  లిక్కర్ స్కాము సొమ్ములు ఎవరెవరికి చేరాయి. బ్లాక్ ను వైట్ ఎలా చేశారు. అందుకోసం ఎవరెవరు ఎన్నెన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టారు. వంటి మొత్తం సమాచారం దగ్గరుంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.  ఈ తరహాలో ముందుకు వెడుతున్న ఈడీ మద్యం స్కాం సూత్రధారి ఎవరు అన్నది గుర్తించడానికి ఎంతో కాలం పట్టదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  సిట్, ఈడీలు పూర్తి సమన్వయంతో  దర్యాప్తు చేస్తున్నాయని అవగతమౌతోందని అంటున్నారు.  మనీలాం డరింగ్ ద్వారా విదేశాలకు నగదు ఎలా వెళ్లింది అన్న విషయంపై దర్యాప్తు చేసిన ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పుడు అలా విదేశాలకు వెళ్లిన సొమ్ము వైట్ గా మారి ఎక్కడికి ఎలా చేరిందన్న విషయంపై దృష్టిసారిస్తుందని అంటున్నారు.  

ఏపీలో దసరా సెలవులు రెండు రోజులు అదనం

ఆంధ్రప్రదేశ్ లో  స్కూళ్లకు ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు. అంటే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందు నుంచే ఏపీలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు.  ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ణప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన చేసిన ఓ పోస్టులో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ రాష్ట్రంలో దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.  వాస్తవానికి విద్యాశాఖ ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ మేరకు రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా సెలవులు ఉండాలి. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దసరా సెలవురు రెండు రోజులు పెరిగాయి.  అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలుహర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్!

తిరుమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభమైది. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు సీఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ను పరిశీలించారు. రిక్లైమ్ ఏస్ యంత్రం పనితీరును పరిశీలించారు. ఈ యూనిట్ ప్రారంభంతో ఇకపై కొండ మీద ట్రెట్రా ప్యాక్స్, స్నాక్ ప్యాకెట్ల వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదని అంటున్నారు. ప్లాస్టిక్ కంటెంట్ ను భక్తులు ఈ యూనిట్ లో వేసేయవచ్చు. ఇందు కోసం యూపీఐ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయల్సి ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ వేసిన వారికి ఐదు రూపాయలు ఇస్తారు.  

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు.. మాజీ ఆర్డీవో మురళి అరెస్టు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.    తిరుపతిలోని ఆయన నివాసంలో మురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఫైళ్ల దగ్ధం కేసులో ఆయనకు గతంలో ఇచ్చిన   బెయిలును సుప్రీం కోర్టు రద్దు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.  గత ఏడాది జులై 21న మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో మురళి నిందితుడు.  మురళీ 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీవోగా పనిచేశారు. అయితే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో  అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్ధం కావడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ అక్రమాల ఆధారాలను చెరిపివేయాలన్న కుట్ర ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న కేసు కూడా నమోదైంది. దీంతో ఈ కార్యాలయంలో అంతకు ముందు పని చేసిన ఆర్డీవో మురళి సహా ఇతర అధికారులను అప్పట్లో పోలీసులు విచారించారు. ఆ విచారణలో ప్రాథమిక ఆధారాల లభ్యం కావడంతో ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది.   సీఐడీ దర్యాప్తులో ఫైళ్ల దగ్ధం కేసులో పలువురు వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అప్పట్లో పలువురిపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు అయ్యాయి.   వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్‌ ఛైర్మన్‌ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై అప్పట్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.  అప్పట్లో నిందితుల నివాసాలలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భూములకు సంబధించిన ఫైళ్లు లభ్యమయ్యాయి.  దాదాపు కోటి రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేశారు. అప్పటి మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పది ఫైళ్లలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్‌ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్‌ లు లభ్యమయ్యాయి. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులైన   మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం లో  124 ఫైళ్లు  లభ్యమయ్యాయి. సరే ఇప్పుడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఈ కేసులో నిందితుడైన మాజీ ఆర్డీవో మురళిని పోలీసులు అరెస్టు చేశారు.  సుప్రీం కోర్టు ఆయనకు గతంలో మంజూరు చేసిన బెయిలు రద్దు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు.  దీంతో ఇప్పుడీ కేసులో ఫైళ్ల దగ్ధం కుట్ర వెనుక ఉన్న పెద్దతలకాయలు బయటపడే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. 

ప్రతిపక్ష హోదాపై జగన్ వెనక్కు.. కానీ..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై మంకుపట్టు వీడారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 18) ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశాల్లో తాను సభకు రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. హోదా కోసం ఇంత కాలం మంకుపట్టు పట్టి, కోర్టును కూడా ఆశ్రయించిన జగన్.. ఇప్పుడు బేషరతుగా  అసెంబ్లీకి హాజరు కావడానికి రెడీ అని ప్రకటించడం విస్మ యం గొలుపుతోంది. కాగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన భేటీలో అసెంబ్లీ, మండలిలో  పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అదే విధంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా తాను సభకు వస్తాననీ, అయితే సభలో తనకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని అన్నారు. అయితే స్పీకర్ మాత్రం సభలో ఒక ఎమ్మెల్యేకు మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో అంతే సమయం ఇస్తానని అంటున్నారనీ, అలా అయితే..  అలా అయితే ప్రజా సమస్యలను వివరంగా చెప్పడం ఎలా సాధ్యమౌతుందని అన్నారు. దీంతో అసలు జగన్ ఏం చెప్పారు? ఆయన అసెంబ్లీకి వస్తారా? రారా? కనీసం ఆయన పార్టీ ఎమ్మెల్యేలనైనా సభకు పంపుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ప్రతిపక్ష హోదా విషయంలో వెనకడుగు వేసిన జగన్.. సభలో మాట్లాడే సమయం విషయంలో మాత్రం పట్టుబడుతున్నారు. సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అయిన జగన్ సభలో మాట్లాడే సమయం విషయంలో పట్టుబట్టడాన్ని చూస్తుంటే.. ఆయన సభకు హాజరయ్యే అవకాశాలు లేవనే అంటున్నారు. 

చినుకు పడితే.. విశ్వనగరం విశ్వనరకం

హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి విశ్వనగరం చిగురుటాకులా వణికింది.  నగరం మొత్తం అతలాకుతలం అయ్యింది. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ చెరువులో తండ్రీ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.  పోలీసుల ప్రాధమిక దర్యాప్తు లో మృతులను బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీ కి చెందిన అశోక్ (50)  అతని కుమార్తె దివ్య (5) గా గుర్తించారు.  భార్య సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా   హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్మశాన వాటిక గోడ కూలిపోయి మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.  ఇక వర్షం పడితే డేంజర్ జోన్ గా మారిపోయే  అసిఫ్ నగర్ లో పెద్ద ఎత్తున వరద నీరు పొంగిపొర్లతో పరిస ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి చేరుకున్నాయి.  గత రెండు రోజులుగా దోమల్ గూడ ప్రాంతంలో వరద నీరు నిలిచిపోయి ఉంది.  ఏవీ కాలేజ్ ,గగన్ మహల్  ఎగువ ప్రాంతం నుండి దిగువన ఉన్న దోమల గూడ, సూరజ్ నగర్ కాలనీ, రాజ్ మహల్ ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మోటార్ ద్వారా స్టాగింగ్ అయిన  వరద నీరు  పంపించేటట్లు చూస్తామని అధికారులు చెబుతున్నారు.   ఇక భారీ వర్షానికి రెండు రోజులుగా హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇది విశ్వనగరం కాదు విశ్వ నరకం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చినుకు పడితే హైదరాబాద్ వాసులకు యమయాతన తప్పడం లేదని అంటున్నారు. వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఇక నగరంలో ఎక్కడ చూసినా గంటలతరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం మామూలైపోయిందని అంటున్నారు. 

అమెరికాలో పోలీసు కాల్పులు.. పాలమూరు యువకుడి మృతి

అమెరికాలో మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు పోలీసు కాల్పులలో మరణించాడు. మహబూబ్ నగర్  రామయ్యబౌలికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ తొమ్మిదేళ్ల కిందట అంటే 2016లో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాంటాకార్లలో ఉంటున్నాడు.   ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, నిజాముద్దీన్  ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత, పదోన్నతి పొందిన అతను కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ ఈ నెల 3వ తేదీన తన రూమ్ మేట్ తో గొడవపడిన నిజాముద్దీన్ ను అదే రోజు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అక్కడి పోలీసుల కథనం ప్రకారం సెప్టెంబర్ 3 తెల్లవారుజామున ఇరుగుపోరుగు వారి నుంచి ఫోన్ లో అందిన ఫిర్యాదు మేరకు శాంతాక్లారా పోలీసులు నిజాముద్దీన్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంట్లో గొడవపడుతున్న శబ్దాలు వినిపించడంతో పోలీసులు లోనికి వెళ్లారు. అక్కడ నిజాముద్దీన్ అతడి రూమ్మేట్ పై కత్తితో దాడి చేస్తుండటం గమనించిన పోలీసులు వారించారు. అయినా వినకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ మరణించాడు.   ఇక నిజాముద్దీన్ తల్లిదండ్రులైతే  తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ ను  పోలీసులు కాల్చి చంపారని, ఆ విషయం నిజాముద్దీన్ రూమ్మేట్ ద్వారా తమకు తెలిసిందని అంటున్నారు.  ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవ తీసుకుని వీలైనంత త్వరగా తమ కొడుకు మృతదే హాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరిం చాలని కోరారు. 

కాటేసిన పామును కొరికి చంపేశాడు!

ఎవరైనా పాము కాటేస్తే.. ప్రాణభయంతో వణికి పోతారు. వెంటనే వైద్య సాయం కోసం పరుగులు తీస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం నన్నే కరుస్తావా అంటూ పాముపై పగబట్టి దానినే కొరికి చంపేశారు. ఆ తరువాత విషం తలకెక్కి ప్రాణాపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయమేంటంటే.. తొట్టంబేడు మండలం చియ్యవరంకు చెందిన వెంకటేష్ బుధవారం (సెప్టెంబర్ 17) రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వెడుతుండగా అతడిని ఓ  తాచుపాము కాటేసింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ కు తనను కాటేసిన పాముపై పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆ పామును పట్టుకుని దాని తల కొరికి చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆ చచ్చిన పామును తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి పక్కన పెట్టుకుని పడుకున్నాడు. గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం ఇంట్లో వారు గమనించారు. విషం తలకెక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంకటేష్ ను శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారు అతడిని తిరుపతి రుయాఆస్పత్రికి రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు అతడిని రుయాకు తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు.  

జూబ్లీ ఉప ఎన్నిక చుట్టూ పరిభ్రమిస్తున్న తెలంగాణ రాజకీయం!

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థాన‌మేంటో తేలిపోనున్నదా?  మంత్రి పొంగులేటి కామెంట్ల‌  అర్ధ‌మేంటి?  వ‌చ్చే మూడున్న‌రేళ్ల‌లో అస‌లు పార్టీయే ఉండ‌ద‌నీ.. బీజేపీలో క‌లిపేసి.. విదేశాల‌కు వెళ్లినా వెళ్తార‌నీ కామెంట్ చేశారు మినిస్ట‌ర్ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి.  ఈ స‌రికే కేటీఆర్ పెట్టేబేడా స‌ర్దుకుని పేక‌ప్ చెప్ప‌ డానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్య చేశారు. పొంగులేటి మాట‌ల‌ను అటుంచితే.. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక మాత్రం మ‌హా రంజుగా సాగేలా క‌నిపిస్తోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఉన్న ర‌స‌వ‌త్త‌ర పోరుకు తోడు ఇటు క‌విత జాగృతి తరఫున అభ్య‌ర్ధి బ‌రిలోకి దిగేలా తెలుస్తోంది.  అలాగే ఎన్డీయే కూట‌మి అభ్యర్థి కూడా పోరులో ఉండటం తథ్యం.  అంటే ఎటు నుంచి ఎటు చూసినా గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై  అన్ని పార్టీలూ దృష్టి పెట్టారన్నది స్పష్టమౌతోంది.   అన్నిటికీ మించి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సినీ ప్రముఖులు, సినీమా పరిశ్రమకు చెందిన వారు అధికంగా ఉండే ప్రాంతం. ఒక  స‌మ‌యంలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత  దిల్ రాజు రంగంలోకి దిగుతారని కూడా వినిపించింది.  స‌రిగ్గా అదే స‌మ‌యంలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ స‌తీమ‌ణి  శైలిమ‌ను బ‌రిలోకి దింపినా దింపుతారనే మాట కూడా గట్టిగా వినిపించింది.  శైలిమ‌గానీ బరిలోకి దిగితే.. జాగృతి అధ్యక్షురాలు క‌విత త‌న వ‌దిన‌పై పోటీ చేస్తార‌న్న టాకూ వచ్చింది.  అదలా ఉంటే ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాకు ఆమోదం లభించలేదు.  ఒక వేళ ఆమె రాజీనామాను  మండలి చైర్మన్ఆమోదిస్తే.. అప్పుడు కవిత అనివార్యంగా  ఏదో ఒక ప‌ద‌వి కోసం పోటీ ప‌డాల్సి ఉంది. ఇటు సోద‌రితో పాటు అటు సోద‌రుడికి కూడా ఈ సీటు సో- సో- సో ఇంపార్టెంట్.  ఎందుకంటే అధికార ప‌క్షం, పొంగులేటి వంటి వారి రూపంలో ఎప్పుడూ ఏదో ఒ ప‌రీక్ష ఎదుర‌వుతూనే ఉంది. ఈ అవ‌మానాల‌న్నిటి నుంచి బ‌య‌ట ప‌డాలంటే కేటీర్ సైతం ఇక్క‌డ త‌న స‌త్తా చాటాల్సి ఉంటుంది. బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, పార్టీకి భవిష్యత్ అధినేతగా  కేటీఆర్ కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక పరీక్ష అనే చెప్పాలి. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటితేనే.. ఆయన నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో విశ్వాసం ఇనుమడిస్తుంది. త‌న స‌త్తా చాటాల్సి ఉంటుంది.   వీట‌న్నిటితో పాటు.. కాంగ్రెస్ కి కూడా జూబ్లీ ఉప పోరు అత్యంత ప్రతిష్ఠాత్మకం అనడంలో సందేహం లేదు.   అధికారంలో ఉన్న  పార్టీ ఉప ఎన్నిక‌లో గెల‌వ‌కుంటే అది ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడానికి దోహదపడుతుంది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ కవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. 

16 నెలల చిన్నారికి టెలీ సర్జరీ

భారత వైద్య చరిత్రలోనే ప్రప్రథమంగా ఓ 16 నెలల చిన్నారికి విజయవంతంగా టెలీ సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసిన వైద్యడు హైదరాబాద్ వాసి కావడం మనకందరికీ గర్వకారణం.  హైదరాబాద్ నుంచి డాక్టర్ వి. చంద్రమోహన్ గుర్గావ్ లోని చిన్నారికి విజయవంతంగా టెలీ సర్జరీ చేశారు. పుట్టుకతోనే మూత్రనాళంలో సమస్య ఉన్నగుర్గావ్ కు చెందిన బాలికకు డాక్టర్ చంద్రమోహన్ హైదరాబాద్ లోనే ఉండి ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబో సిస్టమ్ సహాయంతో దాదాపు గంట పాటు శస్త్రచికిత్స చేశారు. ఆ ఆపరేషన్ విజయవంతమైంది. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజునే ఆ చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యింది. అంతే కాదు అతి చిన్న వయస్సులోనే టెలీ సర్జరీ చేయించుకున్న బాలికగా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది.  కాగా ఈ టెలీ సర్జరీ భారత్ లో వైద్య సేవల విస్తరణకు, అందరికీ అత్యధునిక వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని అంటున్నారు.    మారుమూల ప్రాంతాలకు కూడా కూడా అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదనడానికి ఈ టెలీ సర్జరీని ఉదాహరణగా చూపుతున్నారు వైద్య నిపుణులు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండి ఉన్నాయి. భక్తుల క్యూలైన్ శిలా తోరణం వరకూ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  20 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం(సెప్టెంబర్ 18) శ్రీవారిని మొత్తం 68 వేల 95మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 032 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 70 లక్షల  రూపాయలు వచ్చింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కుదింపు

  ఏపీ అసెంబ్లీ వర్షాకాల పనిదినాలు 8 రోజులకు ప్రభుత్వం కుదించారు. దీంతో ఈనెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. శాసన సభ  వర్షాకాల సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని సభాపతి అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో తొలుత నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత 8 రోజులకు కుదించారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరగనుంది.  సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ, 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రేపు మధ్యాహ్నం రూ. 1.30 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.  

జ్యుస్ తాగుతుండగా హార్ట్ ఎటాక్‌తో యువకుడి మృతి

  కరోనా అనంతరం చాలామంది యువ కులు ఉన్నట్లుండి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ కు గురవు తున్నారు. గతంలో ఓ యువకుడు జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ.... మరొకరు కాలేజీలో... ఇంకొకరు బస్ స్టాప్ లో ఇలా పలువురు  యువకులు మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మరొకటి చోటు చేసుకుంది. జ్యుస్ తాగుతూ హార్ట్ ఏటాక్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా లోని పల్లి పాడు గ్రామానికి చెందిన మేడ ఏకలవ్య(30) అనే యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాదు నగరానికి వచ్చి ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఒక రూమ్ లో ఉంటూ ... ఉద్యోగం కోసం వేట కొనసాగించాడు. అయితే ఏకలవ్య బుధవారం రాత్రి 8.30గంటల సమయంలో రిలయన్స్ ట్రెండ్స్ ముందు జ్యుస్ పాయింట్ వద్ద జ్యుస్ త్రాగుతూ.. అకస్మాత్తుగా కిందపడిపోయాడు.  అది గమనించిన స్థానికులు అతని వద్దకు వెళ్లి అతనికి  సిపిఆర్ చేశారు... కానీ అప్పటికే అతను మృతి చెందాడు.  దింతో  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని  మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంప ట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు వాటిని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు  

అదానీకి సెబీ క్లీన్‌చిట్

  సెబీ తాజాగా గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2023లో వచ్చిన హిండెన్‌బర్గ్‌ నివేదికలో స్టాక్‌ అవకతవకలు, నిధుల మళ్లింపులు, అకౌంటింగ్‌ మోసాలు జరిగాయంటూ ఆరోపించినా, విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ కూడా ఇలాంటి ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. ఈ నిర్ణయంతో అదానీ షేర్లకు ఊరట లభించింది. హిండెన్‌బర్గ్‌ తప్పుదోవ పట్టించినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని గౌతమ్‌ అదానీ డిమాండ్‌ చేశారు. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ వెలువడిన తర్వాత అదానీ షేర్లు క్షీణించి, 150 బిలియన్‌ డాలర్ల విలువ చెరిపేశాయి. తరువాత సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా ఆధారాలు లేవని తెలిపింది. ఇప్పుడు సెబీ క్లీన్‌చిట్‌తో గ్రూప్‌ షేర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ పరిణామంపై గౌతమ్‌ అదానీ స్పందిస్తూ, తమపై వేసిన తప్పుడు ఆరోపణలు పెట్టుబడిదారులను నష్టపరిచాయని, దేశానికి క్షమాపణ చెప్పాలని హిండెన్‌బర్గ్‌ను డిమాండ్‌ చేశారు. “సత్యమేవ జయతే… జైహింద్!” అంటూ ఆయన పోస్ట్‌ ముగించారు.  

హైదరాబాద్‌లో భారీ వర్షానికి కూలిన గోడ... కార్ల ధ్వంసం

  హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లుతుండగా, లోతట్టు కాలనీలు వరద నీటితో మునిగిపోయాయి.   * మైసమ్మగూడ చెరువులో దుర్ఘటన ఈ ఉదయం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు తేలియాడుతున్నాయని స్థానికులు గమనించి 100 డయల్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. ప్రాధమిక దర్యాప్తులో అవి బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీకి చెందిన అశోక్‌ (50), అతని కుమార్తె దివ్య (5)గా గుర్తించారు. ఈ ఘటనపై అశోక్ భార్య సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   * హబీబ్‌నగర్‌లో గోడ కూలి కార్లు ధ్వంసం మరోవైపు హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలిపోయింది. గోడకు ఆనుకొని పార్క్ చేసిన మూడు కార్లపై అది పడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా, పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కూలిన గోడను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. * అసిఫ్‌నగర్ – తల్లగడ్డ ప్రాంతాల్లో వరద ఉధృతి అసిఫ్‌నగర్, తల్లగడ్డ ప్రాంతాల్లో వరదనీరు రోడ్లమీద పొంగిపొర్లుతోంది. లోతట్టు ఇళ్లలోకి కూడా నీరు చొచ్చుకెళ్తోంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించకుండా వరద మధ్యలో ప్రయాణించడంతో వాహనాలు నీటిలో ఇరుక్కుంటున్నాయి. ఒక బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వరద గల్లీలో చిక్కుకుపోగా, గోడపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. హైడ్రా, ఫైర్ శాఖ సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.   * దోమలగూడలో నీటిముగ్గు నిన్నటి నుండి దోమలగూడ స్ట్రీట్ నంబర్ 7 ప్రాంతంలో వరద నీరు అలాగే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా & హైదరాబాద్ జిల్లా ఫైర్ శాఖ అధికారి నారాయణ అక్కడికి చేరుకొని పరిసరాలను పర్యవేక్షించారు. ఏవీ కాలేజ్, గగన్‌మహల్ ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వర్షపు నీరు దోమలగూడ, సూరజ్‌నగర్ కాలనీ, రాజ్‌మహల్ ప్రాంతాల్లో చేరి నిల్వ అయింది. మోటార్ పంపుల సహాయంతో నీటిని తరలించేందుకు టీములు రంగంలోకి దిగాయి. వాటర్ లాగింగ్ తొలగించే వరకు ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.   * అధికారులు జాగ్రత్త సూచనలు హైడ్రా, ఫైర్ శాఖ, మున్సిపల్ అధికారుల బృందాలు నగరంలోని కీలక ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. ప్రజలు వరద ప్రాంతాల్లోకి వెళ్లరాదని, అవసరమైతే సహాయక బృందాలను సంప్రదించాలని సూచించారు.