ఏంటీ ఆప‌రేషన్ నుమ్ ఖోర్?

భూటాన్ భాష‌లో నుమ్ ఖోర్ అంటే వెహిక‌ల్. అచ్చ తెలుగులో చెప్పాలంటే వాహ‌నం అని అర్ధం. మ‌న దేశంలోకి విదేశీ వాహ‌నాల దిగుమ‌తిపై నిషేధం ఉండ‌టంతో, ఈ వాహ‌నాల‌ను మొద‌ట భూటాన్ కి  త‌ర‌లించి.. ఆపై వాటిని సెకెండ్ హ్యాండ్ పేరిట భార‌త్ లోకి తెస్తుంటార‌న్న‌మాట‌. ఇలాంటి వాహ‌నాలు భార‌త్ లో సుమారు 120 వ‌ర‌కూ ఉన్న‌ట్టు గుర్తించారు. అందునా కేర‌ళ‌లో ఇవి 30కి పైగా ఉన్న‌ట్టు క‌నుగొన్నారు. ఇక బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఒక నిషేధిత ల‌గ్జ‌రీ కార్లో తిరుగుతున్న‌ట్టు గుర్తించారు. మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, పృధ్వీరాజ్ సుకుమార‌న్ వంటి సినీ న‌టుల ఇళ్ల‌లో విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు అధికారులు. వీరితో పాటు మ‌రికొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌లు, ఇత‌ర సంప‌న్నుల ద‌గ్గ‌ర కూడా ఈ ల‌గ్జ‌రీ కార్లున్న‌ట్టు గుర్తించారు అధికారులు. తిరువ‌నంత‌పురం, కొజికోడ్, మ‌ల‌ప్పురం, కుట్టిపురం, త్రిసూర్ వంటి ప్రాంతాల్లో.. సోదాలు నిర్వ‌హించిన అధికారులు.. ఎవ‌రెవ‌రి ద‌గ్గ‌ర ఎన్నేసి ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. వీటిని ఎక్క‌డి నుంచి త‌ర‌లించారు? ఆ వివ‌రాలేంట‌న్న ఆరా తీస్తూ  సోదాలు నిర్వ‌హించారు. దుల్క‌ర్ స‌ల్మాన్ నుంచి 2 కార్లు, అమిత్ చ‌ల‌క్క‌ల్ నుంచి 8 కార్ల‌తో స‌హా మొత్తం 36 కార్లు స్వాధీనం చేస్కున్నారు. ఈ లగ్జ‌రీ కార్ల‌కు విన్ అనే ఒక డిఫ‌రెంట్ కోడ్ ఉంటుంది. దీనిలో ఆ కారు చాసిస్ నెంబ‌ర్ ఉంటుంది. ఈ ప‌ద‌హారు అక్ష‌రాల కోడ్ లో కారు ఎక్క‌డ త‌యారైంది? దాని ఇత‌ర డీటైల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఈ కార్ల‌ను సీజ్ చేశారు క‌స్ట‌మ్స్ అధికారులు. తెలంగాణ విష‌యానికి వ‌స్తే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ కోవ‌లోకి వ‌చ్చే ల్యాండ్ క్రూయిజ‌ర్ కార్లో తిరుగుతున్న‌ట్టు ఆరోపిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. లగ్జ‌రీ కార్ స్కామ్ నిందితుడు బ‌స‌ర‌త్ ఖాన్ అక్ర‌మంగా దిగుమ‌తి చేసుకున్న కారు కేటీఆర్ కుటుంబ కంపెనీ పేరిట ఎందుకు రిజిస్ట‌ర‌య్యిందో చెప్పాల‌న్నారు బండి సంజ‌య్. దీని కొనుగోలులో మార్కెట్ ధ‌ర చెల్లించారా?  లేదంటే త‌క్కువ ధ‌ర‌కే కొన్నారా? బినామీల పేరిట కొన్నారా? వంటి అంశాల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు బండి సంజ‌య్. ఎక్స్ వేదిక‌గా ఈ అంశానికి సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు బండి సంజ‌య్. బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎనిమిది కార్లను స్మగ్లింగ్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాల స్మగ్లర్‌ బసరత్‌ ఖాన్‌ అంగీకరించారు. ఆ వాహనాల నంబర్లనూ అధికారులకు బసరత్‌ ఖాన్‌ అందజేశారు. ఆ నంబర్లలో టీజీ00డి 6666 నంబరు గల ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాన్ని తన కాన్వాయిలో కేటీఆర్‌ ఉపయోగిస్తున్నట్లుగా అధికారుల ఎదుట బసరత్‌ఖాన్‌ చెప్పారు. ఇలా దేశ వ్యాప్తంగా ల‌గ్జ‌రీ కార్ల స్కామ్ కి సంబంధించి ఒకేసారి బ‌య‌ట ప‌డ్డంతో.. ఇపుడీ వ్య‌వ‌హారం హాట్ టాపిగ్గా మారింది.

వంశీ ఇలా కనిపించారు.. అలా మాయమయ్యారు!

వైసీసీ అధికారంలో ఉన్నంత కాలం.. అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు,  ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మాటల దాడి చేసిన వల్లభనేని వంశీ.. 2024 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మౌనం వహించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం టికెట్ పై ఎన్నికలలో విజయం సాధించి.. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలు కావడంతో  జగన్ పార్టీ గూటికి చేరిన వల్లభనేని వంశీ.. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం సహా.. తెలుగుదేశం కార్యకర్తలపై దౌర్జన్యాలకు తెగబడ్డారు. అయితే చేసిన పాపం ఊరికే పోదన్నట్లుగా అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిన వంశీ పరిస్థితి ఆ తరువాత దయనీయంగా మారింది. 2024 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలవ్వడమే కాకుండా వంశీ స్వయంగా గన్నవరంలో ఓడిపోయారు. గతంలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, దాడులతో కేసులలో ఇరుక్కుని జైలు పాలయ్యారు. విజయవాడ జిల్లా జైలులో నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తరువాత బెయిలుపై విడుదలైనా క్రియాశీల రాజకీయాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని పరిశీలకులే కాదు.. వైసీపీ వర్గాలు కూడా భావించారు.  అయితే హఠాత్తుగా వంశీ బుధవారం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులతో భేటీ అయ్యారు.  అది కూడా అతి తక్కువ సమయం మాత్రమే. ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లుగా ఆయన భేటీ సాగింది. మొత్తం మీద వంశీ నియోజకవర్గంలో కొందరు వైసీపీయులను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి నుంచి జగన్ వంశీని పీకేస్తారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆయన బయటకు రావడంతో మళ్లీ పోలిటికల్ గా వంశీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే నియోజకవర్గ పార్టీ నేతలు మాత్రం వంశీకి మద్దతుగా నిలిచే ప్రశక్తే లేదని అంటున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. చూడాలి మరి వంశీ ముందు ముందు ఏ నిర్ణయం తీసుకుంటారో? 

ఉచిత బస్సుల్లో సచివాలయానికి వచ్చిన అంగన్వాడీలు.. ఎందుకో తెలుసా?

అంగన్వాడీ టీచర్లు తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన చేపట్టేందుకు వారు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని  వాడుకుని వచ్చారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సులలో సచివాలయానికి వచ్చిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. డిమాండ్లను నెరవేర్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకు దిగిన అంగన్వాడీ టీచర్చను అదుపులోనికి తీసుకుని వారు వచ్చిన ఫ్రీ బస్సుల్లోనే పోలీసు స్టేషన్లకు తరలించారు.  

జగన్ ప్రలోభాలకు లొంగిన శంకరయ్య!

సీఐ శంకరయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి లీగల్ నోటీసులు పంపడం వెనుక జగన్ ప్రలోభాలు ఉన్నాయా? వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని ప్రలోభపెట్టే జగన్ శంకరయ్యను పావుగా వాడుకుంటున్నారా? అంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాటలను బట్టి ఔననే సమాధానం వస్తున్నది. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జగన్ కొత్త నాటకానికి తెరలేపారని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపడం వెనుక కుట్ర ఉందన్నారు.  ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్న రాంగోపాల్ రెడ్డి..  ఇందకు బాధ్యులైన వారు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య విధుల్లో ఉన్నారని గుర్తు చేసిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి..  ఆ రోజున నిందితులు సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తుంటే, వారికి శంకరయ్య పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు.  అప్పట్లో ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు పలు సెటిల్‌మెంట్లు చేసుకున్న తర్వాతే..  ఆయన నిందితులకు అనుకూలంగా మారారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ హైకోర్టును ప్రభావితం చేసే ఉద్దేశంతో.. వివేకా హత్య కేసులోని నిందితులకు మేలు చేకూర్చడానికే శంకరయ్య ఈ కొత్త డ్రామా ఆడుతున్నారని రాంగోపాల్‌రెడ్డి అన్నారు. దీని వెనుక జగన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రికి నోటీసులు పంపడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

తిరుమలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, చంద్రబాబు

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలిసి తిరుమలలో పలు కీలక అభివృద్ధి పనులను గురువారం (సెప్టెంబర్ 25) ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన 'వేంకటాద్రి నిలయం' యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి, సీఎం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు, శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విజన్ బేస్డ్ స్టోరింగ్ మెషిన్‌కు ప్రారంభించారు.  అంతకుముందు వెంకటాద్రి నియలం  ప్రాంగణానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి, ముఖ్య మంత్రికి టీటీడీ అధికారులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసిన అనంతరం వారు భవనాన్ని కలియతిరిగి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం, తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను (ఐసీసీసీ) కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ ఆయన వెంట ఉన్నారు.  రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై బయలుదేరి వెళ్లారు. గురువారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకి బయలుదేరారు. అదే రోజు సాయంత్రం చెన్నైలో  తమిళనాడు ప్రభుత్వం మహా విద్యా చైతన్య ఉత్సవ్‌ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.ఆ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా  బుధవారం (సెప్టెంబర్ 24) బిహార్ రాజధాని పాట్నా వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన వెంటనే చెన్నైకు బయలుదేరారు.  త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండి కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అచితూచి అడుగులు వేస్తోంది. ఇక తమిళనాడులోని డీఏంకే ప్రభుత్వం సైతం ఇండి కూటమిలో భాగస్వామి అన్న సంగతి అందరికి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల తో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ సహా ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ లో రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

వాలంటీర్ల‌కు జ‌గ‌న్ హ్యాండ్

పుట్టింటోళ్లు త‌రిమేశారు.. క‌ట్టుకున్నోళ్లూ వ‌దిలేశార‌న్న‌ట్టుగా మారింది  పాపం వాలంటీర్ల ప‌రిస్థితి.  ఫైన‌ల్ గా మేమొచ్చాక మీకంటూ ఒక భ‌రోసా ఇస్తామ‌న్న కోణంలో వీరికి ఊర‌ట క‌ల్పించాల్సిన వీరి సృష్టిక‌ర్త జ‌గ‌న్.. కాస్తా.. వీరికి మొండి చేయి చూపించేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ నేను చేసిన అతి పెద్ద త‌ప్పిదం వాలంటీర్ల‌ను న‌మ్మ‌డం అన్న ఒక  నిర్ణ‌యానికి వ‌చ్చి ఆ దిశ‌గా కొన్ని కీల‌క కామెంట్లు చేశారు. అవేంటో చూస్తే..  వైసీపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన జ‌గ‌న్ త‌న ఐదేళ్ల పాల‌న‌లో వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే న‌ష్ట‌పోయిన‌ట్టు అభిప్రాయ ప‌డ్డారాయ‌న‌. గ‌తంలో వాలంటీర్ల‌కు అవ‌స‌రానికి మించి ప్ర‌యారిటీ ఇవ్వ‌డ‌మే కొంప  ముంచిన‌ట్టు తేల్చి చెప్పేశారు. వీరి కార‌ణంగా గ్రామ‌, మండ‌ల స్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను విస్మ‌రించామ‌ని.. ఇదే త‌మ పార్టీ ఓట‌మికి ప్ర‌ధాన‌కార‌ణంగా చెప్పుకొచ్చారు జ‌గ‌న్. ఈ సారికి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తాననీ,   ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ల ద్వారానే ప్రజలకు చేరవేసేలా చేస్తామ‌నీ కార్య‌క‌ర్త‌ల‌ను ఊర‌డించేలా మాట్లాడారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. కార్య‌క‌ర్త‌లే అన్నింటా  క్రియాశీల‌కంగా ప‌ని చేస్తార‌ని అన్నారు జ‌గ‌న్. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కోవ‌ల్సి ఉంద‌ని అన్నారు. లోక‌ల్ ఫైట్ కి అంద‌రూ సన్న‌ద్ధం కావాల‌ని కూడా పిలుపునిచ్చారాయ‌న‌. దీన్ని బ‌ట్టి చూస్తుంటే.. జ‌గ‌న్ త‌న కార్య‌క‌ర్త‌ల‌ను బిస్కెట్ వేయ‌డంలో భాగంగానే ఈ కామెంట్లు చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాదు వాలంటీర్ల‌కు హ్యాండ్ ఇవ్వ‌డాన్ని బ‌ట్టీ చూస్తే జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పం, మాట త‌ప్పం అనే ప‌దాలు కేవ‌లం వైసీపీ సోష‌ల్ మీడియా వింగులు రాసుకోడానికి త‌ప్ప ఎందుకూ ప‌నికి  రావ‌న్న కామెంట్లు ఒకింత జోరుగానే వినిపిస్తున్నాయ్.

నక్సల్ విముక్త భారత్ దిశగా వేగంగా అడుగులు?

మావోయిస్టుల‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. నిన్న ఇద్ద‌రు కేంద్ర క‌మిటీ స‌భ్యుల హ‌తం కాగా.. నేడు ఏకంగా 71 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  తాజాగా దంతెవాడ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టుల‌లో ఇర‌వై మందికి పైగా 64 ల‌క్ష‌ల రూపాయ‌ల రివార్డు ఉంది. లోంగిపోయిన వారిలో 21 మంది మ‌హిళ‌లు కాగా.. ఒక బాలుడు, ఇరువురు బాలికలు సైతం ఉన్నారు. మావోయిస్టులకు వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు చూస్తుంటే.. మావోయిస్టు ఉద్య‌మం ఉనికి ప్ర‌శ్నార్ధంలా క‌నిపిస్తోంది. ఒక స‌మ‌యంలో మావోయిస్టు నేత‌ జ‌గ‌న్ అన్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే..  ఇక‌పై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న వారి ప్రాబ‌ల్యం బాగా త‌గ్గి.. కేవ‌లం గిరిజ‌నులు మాత్ర‌మే మావోయిస్టుల్లో ఉంటార‌ని అన్నారాయ‌న‌. దీనంత‌టికీ కార‌ణ‌మేంటంటే.. తుపాకీ గొట్టం ద్వారా సాధార‌ణ యువ‌త ప్ర‌భుత్వాల‌తో తేల్చుకునే ప‌రిస్థితి బొత్తిగా క‌నుమ‌రుగవ్వడమే అంటున్నారు. వీరంతా స్టార్ట‌ప్ ల ద్వారా ఉద్యోగిత‌ను పెంచ‌డంలో బాగా బిజీగా ఉన్నారు. దీంతో నాగ‌రిక యువ‌త అడ‌వుల బాట ఇక‌పై క‌నిపించ‌క పోవ‌చ్చు. కొంద‌రు అమెరికా హెచ్ 1 బీ వీసా ఎంత క‌ష్ట‌త‌ర‌మైనా స‌రే సాధించ‌డానికి ముందుకొస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. బెంగ‌ళూరుకు చెందిన త‌నూశ్ శ‌ర‌ణార్ధి అనే యువ‌కుడు మూడు సార్లు ట్రై చేసి ఎట్ట‌కేల‌కు అనుకున్న వీసా పొందాడు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి.. ఏఐపై ప‌ట్టు సాధించాన‌ని.. దీంతో త‌న‌కు 0- 1 వీసా అప్రూవ్ అయింద‌ని అంటున్నాడు శ‌ర‌ణార్ది. దీన్నే ఐన్ స్టీన్ వీసా అంటారు. ఇది ఎంతో టాలెంట్ ఉన్న వారికి త‌ప్ప సాధ్యంకాదు. ఇక పోతే.. ఈ ప్రపంచ గ‌తిని మార్చిన మూడు సీలు ఏంటంటే క్రీస్ట్, క‌మ్యూనిజం, కంప్యూట‌ర్. ప్ర‌స్తుతం క‌మ్యూనిజాన్నిక్రాస్ చేసి కంప్యూట‌ర్ జ‌మానాలో ఉన్నాం. వ‌చ్చే రోజుల్లో అది క్వాంటం కంప్యూటింగ్ లోకి వెళ్ల‌నుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ సిట్యువేష‌న్స్ లో.. యువ‌త అడ‌వుల్లోకి వెళ్లి త‌మ భ‌విష్య‌త్తును వెతుక్కోవాల‌ని భావించ‌డం లేదు. స‌రిక‌దా విండోస్ లోంచి క్లౌడ్ లోకి వెళ్లి స‌మ‌స్తం అక్క‌డి నుంచే పుట్టించేయ‌త్నం చేస్తున్నారు. దీంతో వారికి ఫ‌లానా అని ప్ర‌భుత్వాల‌తో గొడ‌వే లేదు. అస‌లు మావోయిజం బేసిక్ థియ‌రీ.. ప్ర‌భుత్వాల నుంచి అధికారం లాక్కుని.. దాని ఫ‌లాలు అంద‌ని వారికి అందించ‌డం. ఇటు ప్ర‌భుత్వం కూడా ఆ ఫ‌లాల‌ను అడ‌వుల్లోకి కూడా అందేలా చేస్తూ.. అక్క‌డా బ‌డి, రోడ్డు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తూ.. వారి వారి జీవితాల్లోనూ మార్పు వ‌చ్చేలా చేస్తోంది. కాబ‌ట్టి.. ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీల్లోనూ ప్ర‌స్తుతం విప్ల‌వంలోకి దిగాల‌న్న ఆలోచ‌న ఏమంత‌గా రావ‌డం లేదు. వారు సైతం జ‌న జీవ‌నంలోకి సులువుగా క‌ల‌గ‌ల‌సి పోతున్నారు. ఇక మిగిలింది అడ‌వుల్లోని మావోయిస్టు అవ‌శేషం మాత్ర‌మే. ఇదిగో ఇప్పుడు ఈ యువ‌త కూడా జ‌న‌జీవ‌నంలోకి అడుగు పెడుతుండ‌టంతో.. ఇక మిగిలింది చాలా  త‌క్కువ మొత్తంలోని వృద్ధ, కొస‌రు మాత్ర‌మే. వార్ని కూడా 2026 మార్చినాటికి ఏరి పారేయ‌నుంది.. కేంద్రం. దీంతో జీరో మావోయిజం ఇన్ భార‌త్ అన్న కేంద్ర ల‌క్ష్యం సాకారం కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే మావోయిస్టుల్లోనే చీలిక వచ్చింది. ఆయుధం వ‌దిలేద్దామ‌ని కొంద‌రు.. లేదు కొన‌సాగిస్తామ‌ని మరి కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాద‌న‌లు కూడా ఎక్కువ కాలం నిలిచేలా లేవు. దీంతో.. వ‌చ్చే రోజుల్లో రెండో సీల్లోని క‌మ్యూనిజం దాదాపు త‌న ఉనికి కోల్పోయేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జ‌న బాహుళ్యంలోని క‌మ్యూనిస్టు పార్టీలు జాతీయ హోదా కోల్పోయి రాష్ట్ర హోదాలోకి.. వ‌చ్చేసిన  రోజుల్లో అందులోంచి కూడా బ‌య‌ట‌కు రానున్న క్ర‌మంలో.. ఇక సెకండ్ సీ యొక్క ప్ర‌భావం పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యేలా తెలుస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు సామాజిక వేత్త‌లు. ఫైన‌ల్ గా మిగిలిన అర్బ‌న్ న‌క్సల్స్ పై కూడా ప్ర‌భుత్వం ఉక్కు పాదం మోప‌డంతో ఇక‌పై ఇటు న‌గ‌రంలో అటు అడ‌వుల్లో అన్న‌ల ప్ర‌స్తావ‌నే లేకుండా పోయేలా తెలుస్తోంది.

సృష్టి పై ఈడీ కేసు నమోదు

తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ పై ఈడి కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కు పాల్పడిన సృష్టి..  ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేద కుటుంబాలను టార్గెట్  చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి వారి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో పిల్లలు లేని వేరే దంపతులకు విక్రయిస్తూ కోట్లలో డబ్బులు సంపాదించారు. ఇలా దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లను పెట్టి సరోగసి పేరు తో వ్యాపారం కొనసాగించారు. డాక్టర్ డాక్టర్ నమ్రత  మరి కొంతమందితో కలిసి ఈ నయా దందాకు తెరలేపారు. గాంధీ హాస్పిటల్ లో అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడా వీరితో కలిసి పని చేశాడు. అయితే డాక్టర్ డాక్టర్ నమ్రత కేవలం నిరుపేద గ్రామీణ దంపతులను ట్రాక్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి ఐదు లక్షల రూపాయలు వారికి ఇచ్చి వారి పిల్లల్ని కొనుగోలు చేసి.... సరోగసి పేరుతో పిల్లలు లేని దంపతులకు 50 లక్షల రూపాయలకు  విక్రయించేవారు. ఎవరైనా దంప తులు ఎదురు తిరిగితే... లాయర్ అయిన తన కొడు కుతో డాక్టర్ డాక్టర్ నమ్రత వారిని బెదిరింపులకు గురి చేసేవారు. అయితే ఇతర రాష్ట్రానికి చెందిన ఓ దంపతులు సరోగసి తో పిల్లలు కావాలంటూ డాక్టర్ డాక్టర్ నమ్రతను ఆశ్రయిం చారు. దీంతో డాక్టర్ నమ్రత ఆ దంప తుల వద్ద నుండి 50 లక్షల రూపా యలు వసూలు చేసి... వేరే దంపతులకు పుట్టిన శిశువును తీసుకు వచ్చి... సరోగసితో పుట్టిన శిశువు అంటూ సదరు దంపతులకు ఇచ్చారు. దంపతులకు అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించారు. దీంతో సరోగసి పేరుతో డాక్టర్ డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు నిర్ధారించుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిం చగా ఈ సరోగసి దందా అక్రమాలు మొత్తం బయట పడ్డాయి. పోలీ సులు వెంటనే డాక్టర్ డాక్టర్ నమ్రతతో పాటు ఈ దందాలో పాల్గొన్న డాక్టర్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే గత నాలుగు ఏళ్లలో దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లను పెట్టి సరోగసి పేరుతో దాదాపు 500 కోట్ల రూపా యల వరకు లావా దేవీలు జరిపినట్లు గా గుర్తించిన ఈడీ రంగంలోకి దిగింది.  సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఈడి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు మొత్తం తొమ్మిది ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి క్లినిక్ లతోపాటు నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.   డాక్టర్ అతలూరి నమ్రత ఆధ్వర్యంలో నడిచిన యూనివ ర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌, పిల్లలు లేని దంపతులను మోసం చేయడం, నకిలీ ఐవీఎఫ్ లు, సరోగసి ప్యాకేజీలు చూపించడం, శిశువుల అక్రమ రవాణా, ఫోర్జరీ  రికార్డులు తయారు చేయడం వంటి అక్రమాలను గుర్తించింది. అలాగే 2021లో లైసెన్స్ రద్దయిన తరువాత కూడా అక్రమంగా ఈ దందా  కొనసా గించినట్లు ఈడి దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం డాక్టర్ నమ్రత (64)తో పాటు వైద్యులు, ఏజెంట్లు, టెక్నీషియన్లు సహా కనీసం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కేసులో క్రిమినల్ అంశాలను  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారస్తుండగా,   మనీ లాండరింగ్ కోణంలో ఆర్థిక లావాదేవీలను ఈడీ విచారిస్తోంది.  

ఏపీ లిక్కర్ స్కాం.. డిఫాల్ట్ బెయిలు రద్దు కోసం హైకోర్టుకు సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించడమే కాకుండా, రాజకీయంగా కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న మద్యం కుంభకోణం కేసులో  మద్యం కుంభకోణం కేసులో నలుగురు నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిలు మంజురు చేయాడాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం హైకోర్టులో సవాల్ చేసింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్‌లకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిట్  హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో గురువారం(సెప్టెంబర్ 25) వాడీ వేడి వాదనలు జరిగాయి.   సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా, నిందితుల తరఫున మరో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. కాగా సిట్ తరఫున వాదించిన సిద్ధార్థ్ లూత్రా.. నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఆగస్టు 11నే తాము అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసి, అందులో ఈ నలుగురు నిందితుల పాత్రను స్పష్టంగా వివరించామని కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌లోని అభ్యంతరాలను సెప్టెంబర్ 1లోపే సరిదిద్దామని.. అయినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఆగస్టు 18న నిందితుల్లో ఒకరైన బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు..  కేవలం రోజుల వ్యవధిలోనే అంటే.. సెప్టెంబర్ 5న డిఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అందువల్ల నలుగురి బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సిద్ధార్థ్ లూద్రా  వాదించారు. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ..  రెగ్యులర్ బెయిల్ ఆదేశాలకు, డిఫాల్ట్ బెయిల్ ఆదేశాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అప్పటి పరిస్థితులు, సాక్ష్యాధారాల ఆధారంగా రెగ్యులర్ బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత ఇచ్చే డిఫాల్ట్ బెయిల్‌పై దాని ప్రభావం ఉండదన్నారు. చట్టప్రకారం 90 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, తమ వాదనలను లిఖితపూర్వకంగా శుక్రవారంలోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

కాళేశ్వరంపై సీబీఐ విచారణ షురూ

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలుపెట్టింది. ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రాజెక్ట్ జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారించనుంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యాక ఎఫ్ఎఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకల విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.  ఈ విషయాన్ని  సీఎం అసెంబ్లీలోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీబీఐ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ముందుకు వచ్చింది. కాళేశ్వరంపై గురువారం (సెప్టెంబర్ 25) నుంచి సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది.  కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణలో భాగంగా   జస్టిస్  ఘోష్‌ నివేదికలను సీబీఐ పధికారులు పరిశీలించడంప్రారంభించారు. రికార్డుల పరిశీలన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

తెలుగు రాష్ట్రాలలో వానలే వానలు.. భయపెడుతున్న వాయుగుండం!

తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు బెంబేలెత్తించనున్నాయి.  తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి శుక్రవారం (సెప్టెంబర్ 27) నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  ఈ వాయుగుండం ప్రభావం ఈ నెల 30 వరకూ ఉంటుందని పేర్కొన్న వాతావరణ శాఖ అప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శుక్ర, శని (సెప్టెంబర్ 26, 27) వారాల్లో  తెలంగాణ, కోస్తాంధ్రల్లో  భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఉండగా గురువారం (సెప్టెంబర్ 25) కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాయలసీమలో ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  అలాగే  తెలంగాణ వ్యాప్తంగా గురువారం (సెప్టెంబర్ 25) సాయంత్రం నుంచీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.  నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  శుక్ర, శని వారాల్లో (సెప్టెంబర్ 26, 27) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలా ఉండగా గురువారం దేశ వ్యాప్తంగా దాదాపు పది జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, "ఆంధ్రప్రదేశ్", జార్ఖండ్, కేరళ, గోవా , మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ.. ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

జగన్ పట్టిన కుందేలుకి మూడే..!

జ‌గ‌న్ చిన్న‌పిల్లాడో లేక, తానొచ్చిన ఫ్యాక్ష‌న్ కుటుంబ‌మే అలాంటిదో తెలీదు కానీ.. , ఆయ‌న అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగిపోవాలి. అందుకు నిబంధనలు,  పాటింపులేం ఉండ‌క్క‌ర్లేదు. ఏదైనా అంతే..  తిరుమ‌ల డిక్ల‌రేస‌న్ నుంచి మొదలు పెడితే.. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా వ‌ర‌కూ స‌రిగ్గా ఇలాగే క‌నిపిస్తుంది జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి. జ‌గ‌న్ కి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు. జ‌గ‌న్ కి ఆ హోదా ఇవ్వ‌డానికి త‌న‌కు రూల్స్ బుక్ లో ఎలాంటి  క్లాజు క‌నిపించ‌డం లేద‌న్నారాయ‌న‌. అయితే సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ, ఢిల్లీకి సంబంధించి ఒక ఉదాహ‌ర‌ణ గుర్తు చేశారు. అప్ప‌ట్లో అంటే 2015 ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ క్లీన్ స్వీప్ చేసిందీ.. ఆ టైంలో బీజేపీకి వ‌చ్చింది కేవ‌లం మూడు సీట్లే.. కానీ ఢిల్లీ స్పీక‌ర్.. బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తాను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అంగీక‌రించార‌న్న వార్త తెర‌పైకి తెచ్చారు.  ఇదిలా ఉంటే మ‌రో వార్త ఏంటంటే.. తాము స‌భ‌లోకి వ‌స్తాము. కానీ మాట్లాడ్డానికి కావ‌ల్సినంత స‌మ‌యం ఇవ్వాల‌ని కోరుతున్నారు జ‌గ‌న్ అని. రాకుండానే టైం ఇవ్వ‌ర‌న్న గ్యారంటీ ఏంటి? వ‌స్తే క‌దా తెలిసేది?  ఇదెలా ఉందంటే జ‌గ‌న్ టెన్త్ త‌ప్పిన పిల్ల‌లు ఆ కాసిన్ని మార్కులేసి మ‌మ్మ‌ల్ని  పాస్ చేసేయ‌వ‌చ్చు క‌దా? అని అడిగిన‌ట్టుంద‌ని అంటారు కొంద‌రు. ఇంకా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే కొంద‌రు చెప్పేదాన్నిబ‌ట్టి చూస్తే అస‌లు జ‌గ‌న్ కి ఉన్న ఆ ఎమ్మెల్యే ప‌ద‌వి కూడా ఊడిపోయేలా ఉంది. భార‌త రాజ్యాంగం ఆర్టిక‌ల్ 190(4) ప్ర‌కారం.. అర‌వై రోజుల పాటు వ‌రుస‌గా ఎవ‌రైనా స‌భ్యుడు రాకుంటే.. ఆ సీటు ఖాళీగా ప్ర‌క‌టించ‌వ‌చ్చు. ఇప్పుడు జ‌గ‌న్ కు ముందు గొయ్య‌- వెన‌క నుయ్య‌గా ఉంద‌ట ప‌రిస్థితి. ఎంత మాత్రం ఆయ‌న హ్యాపీగా లేరు. ఒక స‌మ‌యంలో జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యే సీటుకు రిజైన్ చేసీ ఎంపీగా పోటీ చేయాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగైనా త‌న‌కీ త‌ల‌వంపులు త‌ప్పుతాయ‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. మిగిలిన వారి చేత కూడా రిజైన్ చేయించి.. ఉప ఎన్నిక‌ల‌కు పోవాల‌న్న‌ది జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌. మ‌రి వారిలో అంద‌రూ ఓడిపోతే పరిస్థితేంట‌న్న‌ది ఎవ్వ‌రికీ అంతు చిక్క‌డం లేదు.  ఎందుకంటే అ చివ‌రికి పులివెందుల‌లో త‌న స్థానంలో పోటీ చేసే అవినాష్ కూడా ఓడిపోతే.. త‌ర్వాత జ‌గ‌న్ పార్టీ   ఉనికే ప్ర‌శ్నార్ధ‌కం కాగ‌ల‌ద‌న్న మాట వినిపిస్తోంది రాజ‌కీయ వ‌ర్గాల్లో.

జ‌గ‌న్ కాపీ పేస్ట్ క‌హానీ!

జ‌గ‌న్ డిజిట‌ల్ బుక్ తెర‌వ‌డంతో   ఆయ‌న‌కు ఏదీ స్వ‌యంగా త‌యారు చేయ‌డం రాద‌ని క్రిస్ట‌ల్ క్లియ‌ర్ గా అర్ధ‌మై పోయింది.  ఆయ‌న పెద్ద సంక్షేమ రూప‌శిల్పి కూడా ఏమీ కాదు. గ‌తంలో త‌న తండ్రి ప్ర‌వేశ పెట్టిన వాటికే కాస్త సొబ‌గులు అద్దారాయ‌న‌.  అది కూడా ఏమంత ఒరిజిన‌ల్ కాదు. ఇదంతా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రండ్. ఇప్పుడు చూస్తే జ‌గ‌న్ త‌న వెల్ఫేర్ ఇత‌ర‌త్రా ప‌థ‌కాల‌ సోర్స్ మొత్తం లోకేషే అన‌డంలో ఎలాంటి అనుమాన‌మే లేదు..  ఔను నిజమే.. మీరు చ‌దువుతున్నది నిజం. జ‌గ‌న్ కి  కొత్త ఆలోచ‌న ఏదీ రాదు. ఒక‌ప్పుడు లోకేష్ కార్య‌క‌ర్త‌ల‌కు జీతాలు అనే కాన్సెప్ట్ నే త‌ర్వాత జ‌గ‌న్ మ‌క్కీకి మ‌క్కీ కాపీ కొట్టి దాన్ని వాలంటీర్లుగా మార్చారు.  కావాలంటే చూడండి.. ఆయ‌న అపాయింట్  చేసిన చాలా మంది వాలంటీర్ల‌లో అత్య‌ధిక శాతం మంది రెడ్లే క‌నిపిస్తారు. ఇప్పుడు వాళ్ల‌కు కూడా మొండి చేయి ఇచ్చారు. అదే లోకేష్ ఒక వైసీపీ కార్య‌క‌ర్త‌ను కూడా ఆదుకుంటూ.. ఆయ‌న ఆరోగ్య ఖ‌ర్చులు మొత్తం తాము భ‌రిస్తామ‌న్న భ‌రోసా ఇచ్చారు. మాన‌వ‌త్వం చాటుకున్నారు. త‌ర్వాత డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్. ఇవి స్టాన్ ఫ‌ర్డ్ లో చ‌దివి, వ‌ర‌ల్డ్ బ్యాంక్ లో ప‌ని చేసిన అనుభ‌వజ్ఞుడైన లోకేష్ బ్రైన్ చైల్డ్. ఈ కాన్సెప్ట్ ద్వారానే జ‌గ‌న్ చాలా వ‌ర‌కూ నేరుగా జ‌నం ఖాతాల్లో డ‌బ్బు జమ చేశారు. ఈ విష‌యం చాలా మందికి తెలీదు. లోకేష్ కూడా ఇదంతా నాది అన్న కోణంలో ఏదీ చెప్పుకోరు.  ఇప్పుడు చూస్తే రెడ్ బుక్. మాములుగా ఒక మాట అంటుంటారు. నువ్వు చేసిన ప‌నిని ఇత‌రులు కాపీ కొడితే నువ్వొక ట్రెండ్ సెట్ట‌ర్ అని. ఎగ్జాట్ గా లోకేష్ కూడా అంతే. ట్రెండ్ ఫాలో కాడాయ‌న- సెట్ చేస్తారని అంటారు చాలా మంది. మీరు కావాలంటే చూడండి.. లోకేష్ రెడ్ బుక్ ఎంత ఫేమ‌స్ అంటే, పొరుగు రాష్ట్రం నుంచి క‌విత కూడా తాము పింక్ బుక్ రాస్తామ‌ని అన్నారు. ఇక జ‌గ‌న్ అయితే ఓడిపోయిన తొలి నాళ్ల‌లోనే తాము బ్లూ బుక్ రాస్తామ‌న్నారు. ఇప్పుడు చూస్తే బ్లూ అంటే తనను కాపీ క్యాట్ అంటారని భావించారేమో.. దాన్ని డిజిట‌ల్ బుక్ గా మార్చారు. కానీ కాపీ కాపీ కాకుండా  పోతుందా? జ‌గ‌న్  ఏదీ ఒరిజిన‌ల్ కాదు. అంతా డూపే అన్న ముద్ర   ప‌డే తీరుతుంద‌ని అంటున్నారు చాలా మంది వైసీపీ వ‌ర్గాల వారు.

బుచ్చయ్య తాతా.. అసెంబ్లీలో లోకేష్ సరదా సంబోధన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజాసమస్యలపై చర్చతో పాటు సరదా మాటలు కూడా పేలుతున్నాయి. మండలిలో వైసీపీ, తెలుగుదేశం సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. అసెంబ్లీలో.. అధికారపక్ష సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు. మంత్రులను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజాగొంతుకు వినిపించడంలో తెలుగుదేశం కూటమి సభ్యులు ఏ మాత్రం వెనుకాడటం లేదు.  ఈ నేపథ్యంలోనే బుధవారం అసెంబ్లీలో ఓ సరదా సంభాషణ జరిగింది. తెలుగుదేశం సీనియర్ సభ్యుడు  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏళ్లతరబడి  ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యత లేని యూనిఫాంలు, బెల్టులు లభిస్తున్నాయన్నారు. అయితే  ప్రస్తతం విద్యా మంత్రి నారా లోకేష్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశారనీ అభినందించారు.  ఇప్పడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నాణ్యత ఉన్న యూనిఫారాలు, బెల్టులు అందాయన్నారు.  ఇది తన విధుల పట్ల లోకేష్ కు ఉన్న బాధ్యతకు నిదర్శనమని అభినందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆప్యాయంగా బుచ్చయ్య తాత అని సంబోధించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.. లోకేష్ ను వారిస్తూ తాతా అని కాకుండా అంకుల్ అని సంబోధిస్తే బాగుంటుందేమో అన్నారు. దీనిపై లోకేష్  ఎన్టీఆర్ హయాం నుంచి బుచ్చయ్య ఉన్నారనీ, ఆయనంటే తనకు గౌరవమనీ చెప్పారు. తాను ఆయనను చిన్నప్పటి నుంచీ తాత అనే పిలుస్తున్నానన్నారు.   

చంద్రబాబు చేతుల మీదుగా డీఎస్సీ అభ్యర్థులకు నియామకపత్రాలు

మెగా డీఎస్సీలో  ఎంపికైన అభ్యర్థులకు గురువారం (సెప్టెంబర్ 25) ప్రభుత్వం నియామక పత్రాలను అందజేయనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలను అందుకోనున్నారు. ఇందు కోసం అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వాస్తవానికి డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు అందజేయాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది.   సరే.. ఇప్పుడు గురువారం (సెప్టెంబర్ 25) సీఎం డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు పాల్గొంటారు.  డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న 15,941 మందికి నియామక పత్రాలు అందజేస్తారు.  సభలో జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 22 మందికి నియామకపత్రాలను స్వయంగా అందజేస్తారు. మిగిలిన వారికి అధికారులు అందజేస్తారు.  

పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలు!?

బంగారం ధరల పెరుగుదలకు అడ్డూ ఆపూ లేకుండా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో రానున్న రోజులలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరు అవకాశం ఉందని స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు ప్రస్తుతమున్న ధర కంటే 77 శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి.  

తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత

తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్వాల సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం  రంగనాయకుల మండపం నుండి భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు.. సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశాన్ని ఆ వేంకటేశ్వర స్వామి తనను పలుమార్లు కల్పించారన్నారు.  అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం కూడా ఆ స్వామి వారి సంకల్పమేనని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.   దాదాపు నాలుగు దశాబ్దాల కిందట  ఎన్‌.టి.రామారావు ప్రారంభించిన అన్నప్రసాద వితరణ సత్కార్యం నేడు అనేక రెట్లు విస్తరించి..  ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ సేవను అన్ని టిటిడి ఆలయాలకు విస్తరించాలని టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులను ఆయన కోరారు. శ్రీవాణి ట్రస్ట్ కు  ఇప్పటివరకు రూ.2,038 కోట్ల విరాళాలు అందాయన్న ఆయన..  అందులో రూ.837 కోట్లు ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారన్నారు. దేశలోని 29 రాష్ట్రాల రాజధానులలోనూ   శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, వివిధ దేశాల్లో శ్రీవారి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించాలని చంద్రబాబు టీటీడీకి సూచించారు.   తనకు ప్రాణభిక్ష పెట్టిన రోజునే ఎస్‌వి ప్రాణదాన ట్రస్టును తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభించామని గుర్తు చేసిన ఆయన ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.709 కోట్లు  విరాళంగా వచ్చాయన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు  వైద్య సహాయంఅందజేస్తున్నట్లు తెలిపారు.  స్వామివారి సేవకుల సేవలను చంద్రబాబు ప్రస్తుతించారు. స్వామివారి సేవకులు  స్వామివారి నిజమైన సంపద అన్నారు. 

కూష్మాండ అవతారంలో భ్రమరాంబికాదేవి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో  శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నాలుగో రోజు అంటే గురువారం (సెప్టెంబర్ 25) అమ్మవారు కూష్మాండ దుర్గ రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ కూష్మాండ మాత విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తగా, తేజోమయిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.   ఇక మూడో రోజు బుధవారం (సెప్టెంబర్ 24) అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.  అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు,వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీభ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవార్లను రావణవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు, కేరళ చండిమేళం, కొమ్మ కోయ నృత్యం, స్వాగత నృత్యం,రాజ బటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాలు,చెంచు గిరిజనుల నృత్యాలు, జానపద పగటి వేషాల ప్రదర్శన వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవంగా కదలివస్తున్న శ్రీస్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు.