కాళేశ్వరంపై సీబీఐ విచారణ షురూ

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలుపెట్టింది. ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రాజెక్ట్ జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారించనుంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యాక ఎఫ్ఎఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకల విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.  ఈ విషయాన్ని  సీఎం అసెంబ్లీలోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీబీఐ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ముందుకు వచ్చింది. కాళేశ్వరంపై గురువారం (సెప్టెంబర్ 25) నుంచి సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణలో భాగంగా   జస్టిస్  ఘోష్‌ నివేదికలను సీబీఐ పధికారులు పరిశీలించడంప్రారంభించారు. రికార్డుల పరిశీలన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్.. పారిశ్రామిక ప్రగతిలోనూ గణనీయ పురోగతి

దేశంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్  అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన సంవత్సరంలో దేశంలో నమోదైన మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా పాతిక శాతానికి మించి ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. గడిచిన ఏడాదిలో దేశం మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతమని పేర్కొన్నా ఆయన ఇది దేశంలో ఏ ఇతర రాష్ట్రం కన్నా అధికమని పేర్కొన్నారు. ఇక పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీ ఒడిషా, మహారాష్ట్రాలను దాటి ముందంజలో ఉందన్నారు.  పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించిన విధానాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనీ, రానున్న రోజులలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయనీ లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు. గడిచిన  ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో  దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా  ఏపీ దక్కించు కోగా,  ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో  13.1 శాతం వాటాతో ఒడిశా రెండో స్థానంలో  12.8 శాతం వాటాతో మహారాష్ట్ర మూడో స్థానంలోనూ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలూ కలిసి దేశ వ్యాప్తంగా పెట్టుబడులలో 51.2 శాతం వాటా దక్కించుకున్నాయి.  

ఒక్క బ్రిడ్జి.. నాలుగు జిల్లాల ప్రయాణ కష్టాలు హుష్ కాకీ!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కష్టాలను తీర్చే విషయంపై దృష్టి పెట్టింది. ఇందుకు తాజా తార్కానం విశాఖపట్నం, రాజాం రోడ్డులో నాలుగేళ్ల కిందట శిథిలావస్థకు చేరి రాకపోకలకు అనువుగా లేని బ్రిడ్జిని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే. ఈ ఒక్క బ్రిడ్జితో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఔను ఎప్పుడో నాలుగేళ్ల కిందట విశాఖపట్నం, రాజాం రోడ్డులో చీపురుపల్లి సమీపంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అది శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలను కలిపే ఈ కీలక బ్రిడ్జి మూతపడటంతో  వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గమ్యస్థానాలకు చేరడానికి నిత్యం 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ బ్రిడ్జి మూత వల్ల పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. రాజాం విశాఖల మధ్య దూరం కేవలం వంద కిలోమీటర్లే అయినప్పటికీ.. అదనంగా ఐదు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి.  మూతపడిన బ్రిడ్జికి బదులుగా కొత్త బ్రిడ్జి నిర్మాణం ఆరంభమైనప్పటికీ పనులు చాలా చాలా నెమ్మదిగా సాగాయి. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రైల్వే శాఖతో సమన్వయం కారణంగా నిధుల సమస్య లేకుండా పోయింది. అంతే నిర్మాణం ఏడాది కాలంలో పూర్తయ్యింది. ఈ కొత్త బ్రిడ్జిని సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రారంభం కానుంది.  ఈ ఒక్క బ్రిడ్జితో  నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు హుష్ కానీ అన్నట్లుగా ఎగిరిపోనున్నాయి.  

గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు  గుంటూరు లో  శనివారం (జనవరి 3) ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరిగే  ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో  తెలుగు భాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.   తెలుగు ప్రపంచ మహా సభలకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తెలుగు భాషాభిమానులు, విద్యావేత్తలూ తరలి వస్తున్నారు.  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు శనివారం (జనవరి 3) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస కల్యాణంలో ప్రపంచ తెలుగు మహా సభలకు అంకురార్పణ జరిగింది.   మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, సన్మానాలతో పాటు  తెలుగు చలన చిత్ర గీతాలాపనలు జరగనున్నాయి. ఇక ప్రపంచ తెలుగుమహాసభల ముగింపు కార్యక్రమం సోమవారం  ( జనవరి 5) జరగనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంటారు.  

సిర్గాపూర్ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్

విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా, అన్నంలో విషం పెట్టి వారిని చంపేయాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ ను సస్సెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. సిర్గాపూర్ ఎస్సీ బీలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి వేధిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం (జనవరి 1) రాత్రి కడ్పల్, సిర్గాపూర్ రహదారిపై బైఠాయించారు. దీంతో అధికారులు హాస్టల్ కు వచ్చి విచారణ జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్ కిషన్ నాయక్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.    దీంతో  విద్యార్థులపై కక్ష పెంచుకున్న వార్డెన్ శుక్రవారం (జనవరి 2) పూటుగా మద్యం సేవించి హాస్టల్ కు వచ్చి విద్యార్థులను దుర్భాషలాడారు.  హాస్ల్ సిబ్బందికి పోన్ చేసి తన మీద ఫిర్యాదు చేసిన విద్యార్థులకు అన్నంలో విషం కలిపి చంపేయమంటూ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కిషన్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక నుంచి తెలంగాణలో రహదారి భద్రతా సెస్సు

తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం  రహదారి భద్రతా సెస్సు ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. నూతన నిబంధనల ప్రకారం, ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున రహదారి భద్రతా సెస్సెను వసూలు చేస్తారు. అయితే  ఈ సెస్సు నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు  మినహాయింపునిచ్చారు. ఇక పోతే  సరుకు రవాణా వాహనాలకు ఇప్పటివరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం    లైఫ్ ట్యాక్స్ అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా  4  నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుందని ఆయన చెప్పారు.  

మెక్సికోలో కంపించిన భూమి

మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. దక్షిణ మెక్సికోలోని గెరెరో రాష్ట్రంలో  సంభవించిన ఈ భూకంప కేంద్రం  భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు వెల్లడించారు. పసిఫిక్ తీరప్రాంతంలోని ప్రముఖ రిసార్ట్ నగరం అకాపుల్కో సమీపంలో ఉన్న గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ పట్టణం వద్ద భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నారు. భూమి కంపించడంతో  జనం తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పందించారు. గెరెరో రాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆమె 'ఎక్స్' వేదికగా తెలిపారు. రాజధాని మెక్సికో సిటీలో ఎలాంటి నష్టం జరగలేదని  పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంప తీవ్రతకు భారీ భవనాలు సైతం చిగురుటాకుల్లా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

లేగదూడకు నామకరణ మహోత్సవం!

కన్నబిడ్డగా పెంచుకున్న ఆవు లేగదూడకు జన్మనిస్తే.. ఆ లేగదూడను తన మనవరాలిగా భావించి ఘనంగా నామకరణ మహోత్సవం చేసిన రైతు ఉదంతమిది. తనకు ఆడపిల్లలు లేరన్న చింత తీర్చుకోవడానికి ఓ ఆవును తీసుకువచ్చి, దానికి గౌరి అని నామకరణం చేసి పెంచుకున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లె గ్రామానికి చెందిన పెండ్యాల సురేందర్, ఆ ఆవుకు పుట్టిన లేగ దూడకు శుక్రవారం (జనవరి 2) ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు. వివరాల్లోకి వెడితే.. పెండ్యాల సురేందర్ స్వరూప దంపతులు ఐదేళ్ల కిందట  వరంగల్‌లోని మహారుషి గోశాల నుండి ఓ ఆవును తెచ్చుకుని  దానికి గౌరి అని నామకరణ చేసారు. దానిని నిత్యం పూజిస్తూ కన్నబిడ్డలా సాకారు. ఆ ఆవు  గత నెల 19న ఓ లేగదూడకు జన్మనిచ్చింది. లేగదూడ పుట్టి 13 రోజులు పూర్తి కావడంతో ఆ లేగదూడకు ఘనంగా నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఇందు కోసం శుక్రవారం (జనవరి 2)  దానికి తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులను గ్రామస్తులను ఆహ్వానంచి అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇళ్లల్లో పిల్లలకు ఏ విధంగా అయితే బాల సారె నిర్వహిస్తారో సరిగ్గా అలాగే ఈ నామకరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి దానికి నందీశ్వరుడు అని పేరు పెట్టారు.  ఈ నామకరణ మహోత్సవాన్ని గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి తిలకించి ఇలాంటి తంతు ఎక్కడా చూడలేదని ఇదే మొదటి సారి అని ఇంత మంచి కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.   

గోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకి ఎక్కి హల్ చల్

 మద్యం మత్తులో ఓ వ్యక్తి తిరుపతి  గోవిందరాజస్వామి ఆలయంలో హల్ చల్ చేశాడు.  మద్యం తాగి ఆలయంలోకి చొరబడిన ఆ వ్యక్తి  ఆలయ గోపురంపైకి ఎక్కి హంగామా చేశాడు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అతడిని కిందకు దించి అదుపులోనికి తీసుకున్నారు.   ఈ ఘటనతో ఆలయం వద్ద కొద్దిసేపు కలకలం రేగింది.    తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏకాంత సేవ అనంతరం గుడి మూసివేసిన  విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయం గోపురంపైకి ఎక్కిన నినాదాలు చేశాడు.. వెంటనే గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతడ్ని కిందకు దిగమని అడిగారు.. అతడు మాత్రం కిందకు దిగేందుకు నిరాకరించాడు. దాదాపు మూడు గంటల పాటూ శ్రమించి అతడ్ని కిందకు దించి అరెస్ట్ చేశారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఆలయం గోపురంపైకి ఎక్కి హల్ చల్ చేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని.. మానసిక స్థితి కూడా సరిగా లేదని చెబుతున్నారు. అతడు ఆలయంపైకి తనకు మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని  అరుస్తూ నానా హంగామా చేశాడు.  విజిలెన్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. దీంతో గోవిందరాజస్వామి ఆలయం దగ్గర కొద్దిసేపు హైడ్రామా నడిచింది. అంతేకాదు ఆలయంపై ఉన్న కలశాలను కూడా లాగేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.  సీసీకెమెరాలు తనిఖీ చేసి ఆలయంలోకి ఎలా ప్రవేశించాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై సభా తీర్మానం

  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ గ్రామీణ్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ చట్టం (వీబీజీ రామ్ జీ) ను తీసుకొచ్చింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. అత్యంత పేద ప్రజల కోసం రూపొందించిన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  నరేగా ద్వారా ఇన్నేళ్లుగా పేదలకు ఉపాధి ఒక హక్కుగా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క చిట్ చాట్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పై మాట్లాడాల్సి వస్తుందనే బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసిందని ఆమె తెలిపారు. బీజేపీ కి బిఆర్ఎస్ సహాకరిస్తుందనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ- బిఆర్ఎస్ ఎజెండా ఓక్కటే.. కార్పోరేట్ ల కోసమే బీజేపీ, బిఆర్ఎస్ పనిచేస్తున్నాయిని సీతక్క తెలిపారు.  అందుకే ఈరోజు చర్చలో బీఆర్ఎస్ పాల్గొనలేదు. ప్రధాని మోడీ మెప్పు కోసం బీఆర్ఎస్ పెద్దలు సభ ను బైకాట్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేసినా ఆ పార్టీ నోరు మెదపడం లేదు” అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామిక వర్గాల దోపిడీ,  స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలున్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్ధి పొందారు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందారు.   ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం  VB G RAM G -2025  పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు,  బలహీన వర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి.    ఆ కారణంగా ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానిస్తోంది: 1. కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి.  2. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న MGNREGAలో దాదాపు 62 శాతం మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత (నార్మేటివ్) కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి.  3. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టం ద్వారా కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా 60:40గా మార్చటం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది. ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. పాత నిధుల వాటా  నమూనాను పునరుద్ధరించాలి. 4. మహాత్మాగాంధీ గారి పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో గాంధీ గారి స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది.    5. వ్యవసాయ సీజన్ లో 60 రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. 6. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలిగించటంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి.  ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని, MGNREGA చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మగాంధీ NREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానిస్తుంది.

జనవరి 3 నుంచి రాష్ట్రపతి నిలయంలో రెండో ఉద్యాన్ ఉత్సవ్

  ప్రజా భాగస్వామ్యం, పర్యావరణ స్పృహను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా భారత రాష్ట్రపతి శీతాకాల నివాసమైన  రాష్ట్రపతి భవన్‌లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ‘ఉద్యాన్ ఉత్సవ్’ రెండవ ప్రదర్శన జరగనుంది. రాష్ట్రపతి నిలయాలను పౌర భాగస్వామ్యానికి, పర్యావరణ స్పృహకు కేంద్రాలుగా మార్చాలనే గౌరవ భారత రాష్ట్రపతి ఆకాంక్ష మేరకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. దీనిని రాష్ట్రపతి నిలయం ఆధ్వర్యంలో  వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుండగా.. ‘మేనేజ్’ సహకారం అందిస్తోంది.‘ఉద్యాన్ ఉత్సవ్ 2026’లో సుమారు 120 ప్రదర్శకులతో 50 నేపథ్య స్టాళ్లను ఏర్పాటు చేశారు.  ఇవి వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులకు వేదికగా నిలుస్తాయి. ఇక్కడ సందర్శకులు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే గ్రీన్‌ నాలెడ్జ్‌ హబ్‌..  పోషక విలువలున్న చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రొత్సహించే మిల్లెట్ మండి, స్టార్టప్ హబ్.. సేంద్రీయ ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, గిరిజన హస్తకళల ప్రదర్శనకు ఎకో బజార్.. బయో ఇన్‌పుట్స్‌, నర్సరీ మొక్కల విక్రయానికి ప్లాంట్ అండ్ ప్రొడ్యూస్.. 59 రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు జోన్,ఫామ్-2-ఎంటర్‌ప్రైజ్ వంటి వివిధ విభాగాలను చూడవచ్చు. ఈ ఉత్సవంలో భాగంగా  ప్రతిరోజూ వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.  వీటిలో  భరతనాట్యం, కథక్,  కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు..పేరిణి శివతాండవం, ఒగ్గు డోలు, మాధురి నృత్యం వంటి ప్రాంతీయ కళారూపాలు.. సంగీత కచేరీలు, హరికథ, బుర్రకథ వంటి వారసత్వ కళలు,  వివిధ రకాల సంగీత కచేరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రదర్శనలో సమాజ భాగస్వామ్య ముఖ్య ఆకర్షణగా నిలవనుంది. కుండల తయారీ, కూరగాయలపై చెక్కడాలు, విత్తన బంతుల తయారీ వంటి నేర్చుకుంటూ చేసే పనులు ద్వారా యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంపొందించేందుకు రూపొందించారు.  ఆధునిక వ్యవసాయ పద్ధతులైన హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, సహజ రంగుల వెలికితీతపై ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. క్విజ్ పోటీ, ‘‘విష్‌ ట్రీ-మై ప్రామిస్‌ టు ఇండియా’’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ ఉత్సవం జ్ఞానాన్ని పంచుకునే వేదికగా కూడా నిలవనుంది. ఇందులో భాగంగా నిపుణుల ఆధ్వర్యంలో సహజ, సేంద్రీయ వ్యవసాయం, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ సాంకేతికతలు, చిరు ధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి అంశాలపై ఐఐఎంఆర్‌, ఐఐఓఆర్‌ ఏపీఈడీఏ వంటి ప్రముఖ సంస్థలతో వర్క్‌షాప్‌లు, పరస్పర చర్చా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చామంతి, సెలోసియా, బంతిపూలు, పాయిన్‌సెట్టియాలు ఇతర కాలానుగుణ పూలతో రూపొందించిన విభిన్న నేపథ్య పుష్ప అలంకరణలు ఏర్పాటు చేశారు. సృజనాత్మకంగా అలంకరించిన  పుష్ప ప్రదర్శనలు ఉత్సాహభరితమైన పండుగ వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ ఉద్యాన్ ఉత్సవ్ అందరికీ ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు రాష్ట్రపతి నిలయం ప్రధాన పచ్చిక బయళ్లలో జరుగుతుంది. ప్రజలకు  గేట్ నంబర్ 2 ద్వారా ప్రవేశం కల్పించారు. సందర్శకులు తమ ప్రవేశాన్ని రాష్ట్రపతి భవన్ విజిట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా విజిటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద నమోదు చేసుకోవచ్చు.   11 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవానికి సంబంధించిన వివరాలను  రాష్ట్రపతి నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో   నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్  జస్బీర్ సింగ్, మేనేజ్‌ డైరెక్టర్ డాక్టర్ శైలేంద్ర, రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కే రజనీ ప్రియ మీడియాకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ అనుగు నరసింహారెడ్డి, రాష్ట్రపతి నిలయం ప్రజా సంబంధాల అధికారి  కుమార్ సమ్రేష్ కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.