భద్రాచలం వద్ద మళ్లీ వరద ఉధృతి.. సాగర్ కూ వరద పోటు

తెలుగు రాష్ట్రాలలో వరద ముప్పు తొలగడం లేదు. గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో సర్వం కోల్పోయిన బాధితులు మరోసారి గోదావరి వరద ముంచుకు వస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కేవలం 20 రోజుల కిందట వరద ఉధృతికి కకావికలమైన పోవవరం ముంపు గ్రామాల ప్రజలు మరోసారి భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.8 అడుగులకు చేరింది. గత నాలుగు రోజులుగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 50.4 అడుగులకు పెరిగిన గోదావరి నీటి మట్టం రాత్రి అయ్యే సరికి 50.8 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో వైపు నాగార్జున సాగర్ వద్ద కృష్ణ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి భారీ ఎత్తున నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే సాగర్ నుంచి దిగువకు భారీ ఎత్తున నీటిని వివడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 584 అడుగులకు చేరింది. 

హలో అనొద్దు.. వందే మాతరం అనాలి.. ప్రభుత్వాధికారులకు మహా సర్కార్ ఆదేశం!

మహా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఫోన్ లో హలో అని కాదు.. వందే మాతరం అనాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వాధికారులందరూ సోమవారం (ఆగస్టు 15) నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకూ తమకు ఫోన్ వస్తే హలో అంటూ ఆన్సర్ చేయకూడదనీ, వందే మాతరం అంటూ ఆన్సర్ చేయాలని మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆ దేశాలను ఆయన మౌఖికంగానే ఇచ్చారు. కానీ అధికారిక ఉత్తర్వులు ఈ నెల 18లోగా జారీ చేస్తామని ప్రకటించారు. అధికారులందరూ ఈ ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మోడీ ఘర్ ఘర్ తిరంగా పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.  

కాటేసిన పామును కసిదీరా కొరికి చంపేసింది!

మనం చిన్పప్పుడు పాము నుంచి చిన్నారిని కాపాడిన ముంగీస కథ విన్నాం. అలాగే పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. అలాగే ఆడుకుంటున్న నన్ను డిస్ట్రబ్ చేస్తే ఊరుకుంటానా అంది టర్కీలోని చిన్నారి. హాయిగా ఆడుకుంటున్న తనను కాటేసిన పామును కసిదీరా కొరికి చంపేసిందా చిన్నారి.   ఎవరి సాయం అక్కర్లేకుండానే ఓ రెండేళ్ల చిన్నారి పాముని కొరికి చంపేసింది. ఔను నిజం. ఈ సంఘటన టర్కీలో జరిగింది. టర్కీలోని బింగోర్ నగరంలో తన ఇంటి ముందు హాయిగా ఆడుకుంటున్న ఓ చిన్నారిని పాము కాటేసింది. అదీ ఆ బాలిక కింది పెదవిపై. పాపం చురుక్కుమందేమో ఆ పాపకు పట్టలేనంత కోపం వచ్చేసింది. వెంటనే ఆ పామును ఒడిసి పట్టుకుని కసి దీరా కరిచి చంపేసింది. ఆ తరువాత పెదవి మంట తట్టకుకోలేక ఏడవడం మొదలెట్టింది. ఇంట్లోనించి వచ్చి చూసిన పాప తల్లిదండ్రులకు విషయం అర్ధమైంది. వెంటనే తమ చిన్నారిని ఆసుపత్రికి  తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి పెదవిపై పాము కాటేసిందని నిర్ధారించారు. సకాలంలో తీసుకురావడంతో గండం తప్పిందని చెప్పారు. ఇప్పుడా చిన్నారి కోలుకుంది. 

ఆర్ధిక ప్ర‌గ‌తిసాధ‌న‌లో ముంద‌డుగువేస్తున్నాం... రాష్ట్ర‌ప‌తి ముర్ము

మ‌హిళ‌లు అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించి అభివృద్ధి దిశ‌లోకి వెళుతున్నార‌ని భార‌త రాష్ట్ర‌ప‌తి ముర్ము అన్నారు. భార‌త 75వ స్వాతంత్య్ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. దేశంలో సామాజిక రాజ‌కీయ రంగాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం కీల‌కంగా మారింద‌ని, అస‌మాన‌త‌లు త‌గ్గుతున్నాయ‌ని అన్నారు. భార‌త ప్ర‌జాస్వామ్య‌వ్య‌వ‌స్థ ప్ర‌పంచానికే త‌ల మానికంగా ఉంద‌న్నారు. అనేక‌ సవాళ్లను అధిగమించిన భారతదేశం ఆర్థిక ప్రగతి సాధనలో స‌త్ఫ‌లితాల‌ను సాధించేదిశగా అడుగులు వేస్తోంద న్నారు. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విధానం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. కరోనా క్లిష్ట పరిస్థి తుల్ని అధిగమించడం, వ్యాక్సినేషన్‌లో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. స్వాతంత్య్ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ ప‌తి దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ, ఈ సంద‌ర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం స‌ర్వ‌స్వం త్యాగం చేసిన మ‌హ‌నీయు ల‌ను స్మ‌రించుకోవాల‌న్నారు.  దేశప్ర‌జ‌ల‌కు ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ,  దేశంలో ఘ‌ర్ ఘ‌ర్ తిరంగ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా జ‌రుగుతోం దన్నారు.  ఇటీవలి సంవత్సరాలలో,కోవిడ్ -19 వ్యాప్తి తర్వాత మరింత ఎక్కువగా, న‌వ‌ భారతదేశం అభివృద్ధిని  ప్రపంచం గ‌మనించింద‌ని అన్నారు. 1947 ఆగస్టు 15న వలస పాలన సంకెళ్లను తెంచుకుని, మన విధిని పునర్నిర్మించాలని నిర్ణయిం చుకున్నామ‌న్నారు. ఇతర, బాగా స్థిరపడిన ప్రజాస్వామ్య దేశాల్లో, మహిళలు ఓటు హక్కును పొందడానికి సుదీర్ఘ పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ భారతదేశం రిపబ్లిక్ ప్రారంభం నుండి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని స్వీకరించింది. ప్రజాస్వామ్యం నిజమైన సామర్థ్యా న్ని కనుగొనడంలో ప్రపంచానికి సహాయం చేసిన ఘనత భారతదేశానికి ఉంది. దేశంలోని ప్రతి మూలన భారత త్రివర్ణ పతా కాలు రెప రెపలాడుతున్నాయ‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు.  ఎందరో గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని, వారి వీరోచిత చర్యల చిన్న జాడను వదిలి మేల్కొ లుపు జ్యోతిని అందించార‌న్నారు.  నవంబర్ 15వ తేదీని 'జనజాతీయ గౌరవ్ దివస్'గా పాటించాలని గత సంవత్సరం ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది ఎందుకంటే మన గిరిజన వీరులు కేవలం స్థానిక లేదా ప్రాంతీయ చిహ్నాలు మాత్రమే కాదు, వారు యావత్ దేశానికి స్ఫూర్తినిస్తున్నార‌ని రాష్ట్ర‌ప‌తి ముర్ము అన్నారు.  ఆర్థిక విజయం కూడా జీవన సౌలభ్యానికి దారి తీస్తోంర‌ని, ఆర్థిక సంస్కరణలు వినూత్న సంక్షేమ కార్యక్రమాలతో సరిగ్గా కలిసి ఉంటాయ‌నీ అన్నారు. ఇదిలా ఉండగా, భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటి వద్ద తిరంగాను ఎగురవేసేందుకు ప్రజలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ప్రారంభించింది. ...

నాడు లంక క్రికెట్ స్టార్స్‌... నేడు ఆసీస్‌లో బ‌స్సు డ్రైవ‌ర్లు!

శ్రీలంక మాజీ క్రికెటర్లు సూరజ్ రందీవ్,  చింతక జయసింగ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో బస్సు డ్రైవర్‌లుగా పని చేస్తున్నారు. వారితో పాటు జింబాబ్వే మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వాడింగ్టన్ మవైంగా కూడా అదే నగరంలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నివేదిక ప్రకారం, వారు ముగ్గురూ 1,200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న ట్రాన్స్‌దేవ్ కంపెనీ లో పనిచేస్తున్నారు. నగరంలో నివసించే ప్రజలకు రవాణా సేవలను అందిస్తారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన చెన్నై సూపర్ కింగ్స్  ఆఫ్ స్పిన్నర్ రందీవ్, ఆట‌కు దూర‌మ య్యాక‌ తర్వాత ఆస్ట్రేలియాలో బస్ డ్రైవర్‌గా పనిచేశాడు. 36 ఏళ్ల రందీవ్ 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20ల్లో తన దేశానికి ప్రాతి నిధ్యం వహించాడు. టెస్టుల్లో 43 వికెట్లు, వన్డేల్లో 36 వికెట్లు, అతి తక్కువ ఫార్మాట్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. అతను టెస్టులు, వ‌న్డే లలో  ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో సిఎస్ కే కి ప్రాతినిధ్యం వహిస్తున్న రందీవ్ రెండు సీజన్లలో ధోనీ ఆర్మీ తర పున ఆడాడు, అక్కడ అతను ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. బస్సు నడపడం కాకుండా, మాజీ ఆటగాడు గతంలో పాట్ కమ్మిన్స్, పీటర్ సిడిల్  ఇలియట్ వంటి ప్రసిద్ధ పేర్లను చూసిన డాండె నాంగ్ క్రికెట్ క్లబ్ కోసం జిల్లా స్థాయిలో ఆడటం కొనసాగిస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ 2020-21కి ముందు స్పిన్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌ మెన్‌లకు సహా యం చేయడానికి సూరజ్ రందీవ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నెట్ బౌలర్‌గా కూడా పిలిచింది. శ్రీలంకకు చెందిన మరో ఆటగాడు  ఆల్‌రౌండర్ చింతక జయసింహ కూడా తన జీవ‌నం కోసం ఆస్ట్రేలియాలో బస్సు నడుపుతు న్నాడు. 42 ఏళ్ల అతను తన దేశం కోసం ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2009లో నాగ్‌పూర్‌లో ఆడిన టీ20 లో భారత దేశానికి వ్యతిరేకంగా క్రికెట్ అరంగేట్రం చేశాడు,  శ్రీలంక జట్టులో కూడా సభ్యుడు. 2005లో భారత్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్ వాడింగ్‌టన్ మవైంగా కూడా జీవనోపాధి కోసం ఆస్ట్రేలి యాలో బస్సు నడుపుతున్నాడు. తన అరం గేట్రం మ్యాచ్‌లో, అతను పదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాటౌట్ 14 పరు గులు చేశాడు. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ వికెట్ కూడా తీసుకున్నాడు. ఆసక్తికరంగా, వీరంతా ఇప్పటికీ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నారు. వీరంతా కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి మళ్లీ క్రికెట్ లో అవకాశం దక్కించుకోవడానికి సిద్ధ మయ్యారు. శ్రీ‌లంక‌లో ప్ర‌స్తుత ఆర్ధిక‌. రాజ‌కీయ ప‌రిస్థితులు చెప్పుకోద‌గ్గ స్థాయిలో లేవు. ముఖ్యంగా ఆ దేశ ఆర్ధిక ప‌రిస్థితి దారుణంగా ప‌డి పోయింది. చాలామంది జీవ‌నోపాధికి అనేక దేశాల‌కు వెళ్ల‌డానికి పూనుకున్నారు. కొంద‌రు అక్క‌డే ఉండి మంచి భ‌విష్య త్తుకు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రికెట‌ర్లు  జీవ‌నోపాధి కోరి ఆసీస్‌కు  ఎప్పుడు  వ‌చ్చింది తెలియ‌లేదు. 

మునుగోడు ముంచెత్త‌నున్న ప్ర‌చార హోరు

మునుగోడు అన్ని రాజ‌కీయ‌పార్టీల రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువుగా మారిన స‌మ‌యం. ఇక్క‌డ ఉప ఎన్నిక‌ ల‌కు పార్టీలు స‌మా య‌త్త‌మ‌వుతు న్నయి. ఈ నెల 20 న ల‌క్ష‌మందితో మునుగోడు ప్ర‌జా దీవెన పేరుతో టీఆర్ ఎస్ మ‌హాస‌భ నిర్వ‌హిం చ‌నుంది. దీని కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌చార ర‌థాలూ రూపొందించారు. అవి మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి చేరాయి. సీఎం కేసీఆర్‌ ఫొటోతో గులాబీ రథాలు గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక ఎన్నిక అయినం దున.. ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు తాను కొంతదూరంగా ఉండడంతో పార్టీకి నష్టం జరిగిందన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్‌.. మరోసారి దానిని పునరావృతం కానివ్వొద్దని పట్టుదలతో ఉన్నా రు. ఇందుకోసం అసంతృప్తులను బుజ్జగించడం నుంచి ప్రచార పర్వం దాకా అన్నింట్లోనూ ఆయనే ముందుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై వస్తున్న అసంతృప్తిని చల్లా ర్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. కాగా, మునుగోడు మండలానికి మంత్రి జగదీష్‌ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నారాయణపురానికి గాదరి కిషోర్‌, గొంగిడి సునీత, చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి నల్ల మోతు భాస్కర్‌రావు, ఎంపీ బడుగుల లింగయ్య, చౌటుప్పల్‌ రూరల్ కు శానం పూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, మర్రిగూడ మండలానికి పైళ్ల శేఖర్‌రెడ్డి, నాంపల్లి మండలానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ నాయక్‌, చండూరు మునిసి పాలిటీకి చిరుమర్తి లింగయ్య, చండూరు రూరల్‌ నోముల భగత్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్ రెడ్డికి బాధ్యతలు అప్పగిం చారు. బహిరంగ సభ 20న మునుగోడు ఎంపీడీవో కార్యాలయ సమీపం లోని 40 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ వ్యవహారాల జిల్లా ఇన్‌చార్జి ఎమ్మె ల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్‌రావుకు, సభ ఏర్పాట్ల బాధ్యతను గాదరి  బాలమల్లుకు అప్పగించారు. మండలాల వారీగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలు శని వారం(ఆగ‌ష్టు13) నుంచే పని ప్రారంభించా రు. చౌటుప్పల్‌ ముని సిపాలిటీ, రూరల్‌ మండలాల బాధ్యతలు చేపట్టిన ఎమ్మె ల్యేలు స్థానిక నేతలతో సమావేశమయ్యారు.  చండూరులో నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం సభను విజయ వంతం చేయాలని, పార్టీ అభ్యర్థి గా ఎవరిని ప్రకటించినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని, చిన్నచిన్న సమస్యలుంటే ఎన్నికల తర్వాత కూర్చోని పరిష్క రించుకుందామంటూ మండల సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు సందేశం ఇచ్చారు. అధికార పార్టీ నుంచి  టికెట్  ఆశిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కృష్ణా రెడ్డిని సీఎం కేసీఆర్‌ శని వారం ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు. అభ్యర్థి ఎవరనేది సర్వేలు చేయించాం, మీకు మునుగోడులో మంచి పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి, పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, టికెట్‌ ఆశిస్తున్న మిగిలిన వారిని పిలవకుండా మిమ్ముల్నే పిలిచి మాట్లాడడంలో ఆంతర్యం గ్రహించి జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి ప‌నిచేయాల‌ని సీఎం చెప్పినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పాదయాత్ర ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా డీసీసీ అధ్యక్షుడు అనీల్‌కుమార్‌రెడ్డి కొద్ది రోజులు గా పాదయాత్ర చేస్తు న్నారు.   కాగా, ఈనెల  16 నుంచి మండలాల వారీగా సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ సమావేశాలకు హాజరవుతానని రేవంత్‌రెడ్డి ప్రక టించారు. తాజాగా ఆయనకు అనారోగ్యంతో షెడ్యూల్‌ ఎలా ముందుకెళ్తుందో చూడాల్సిందే. అదేవిధంగా అభ్యర్థి విషయం లో పోటీలో ఉన్న నేతలతో సంప్రదింపుల విషయం సైతం వాయిదా పడింది. ఇక మునుగోడు వైపు వెళ్లేది లేదని ఎంపీ వెంకట్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి 16న సమావేశాలకు హాజరు విష‌యం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.  అయితే, మాటల తూటాలు పేలుస్తున్న రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో ఈనెల 21న చేరేందుకు నిర్ణయించుకోవడం, అదేరోజు మును గోడులో అమిత్‌షా సభ, భారీగా చేరికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతీ మండలంలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతూ వారితో కలిసి మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌ లపై ప్రజాప్రతినిధుల సమక్షంలో భారీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాజకీయంగా ఎదు ర్కోలేకే  తనపై  కుట్రలు చేస్తు న్నారని, అమ్ముడు పోయినట్లు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, అభివృద్ధి కోసమే రాజీ నామా చేశానని,  రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమొందించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, అమిత్‌షాతోనే సాధ్య మని, మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తార‌నీ ఆయన ప్రచారం చేస్తున్నారు. బరిలో పలు పార్టీలు ఉప ఎన్నిక నేపథ్యంలో పోటీ విషయమై సీపీఎం నేతలు వరుసగా రెండుసార్లు చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించారు. సీపీఐ నేతలు చండూరులో శుక్రవారం(ఆగ‌ష్టు 12) సమావేశం నిర్వహించారు. సీపీఐ బరిలో ఉంటే సీపీఎం మద్దతివ్వడం, వామపక్షాలు ఐక్యంగా ఒక అభ్యర్థిని ఖరారు చేయాలని ప్రా థమికంగా నిర్ణయించారు. బీజేపీ మొదటి స్థానానికి వెళ్లే పరిస్థితి ఉంటే టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. బీఎస్పీ ఎన్నిక బరిలో ఉంటుందని ప్రవీణ్ కుమార్‌ ప్రకటించగా, గోడలపై ప్రచార రాతలు సైతం ప్రారంభించారు. అదే విధంగా పోటీలో ఉంటామని ప్రజాశాంతి పార్టీ అధ్య క్షుడు కేఏపాల్‌, దళితశక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారధన్‌ మహారాజ్‌ ప్రకటించారు. 

ర‌గులుతున్న అస‌మ్మ‌తి సెగ‌

ఒకే ప్రాంతీయుల‌ యినా, మంచి స్నే హితులైనా సీరియ‌ స్‌గా విభేదాలు త‌లె త్తితే వారు క‌ల‌వ‌డం దుర్ల‌భం. అలాంటిది ఒక రాజకీయ‌ పార్టీ లో ఉండేవారికి అవ‌ మాన‌ ప‌డుతు న్నా మ‌న్న భావ‌న తొలి చేస్తే సాధార‌ణంగా పార్టీ నుంచి దూర‌మ‌ వుతారు. తెలంగా ణా కాంగ్రెస్‌పార్టీలో మాత్రం అన్న‌ ద‌మ్ములతో పార్టీలో అస‌మ్మ‌తి సెగ రేగుతూనే ఉంది. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోరి రాజీనామా చేస్తు న్నాన‌ని ఇటీవ‌లే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌ర‌యిన రాజ‌గోపాల్ రెడ్డి పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దాన్ని గురించి పార్టీలో నాయ‌కులు రాజ‌గోపాల్‌ను తిట్ట‌డం ఆరంభించారు. ఆర్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌రీ విరుచుకుప‌డ్డారు. క్ర‌మేపీ ఆ ఆగ్ర‌హం కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి మీద కూడా ప్ర‌ద‌ర్శిస్తూండ‌డంతో వెంక‌ట‌రెడ్డి అవ‌మాన ప‌రుస్తు న్నారంటూ ఆగ్ర‌హించారు.  కాగా రేవంత్ అయ్యో మిమ్మ‌ల్ని కాదు, మీరు మా స్టార్ కాంపెన‌ర్ అంటూ సారీ చెప్పారు. కానీ వెంక‌ట రెడ్డి ఆగ్ర‌హం చ‌ల్లార‌ లేదు. దీనికి తోడు అద్దంకి ద‌యాక‌ర్ కూడా విరుచుకుప‌డ‌టం కూడా ఎంపీ వెంక‌టరెడ్డిని మ‌రింత బాధ‌ పెట్టింది. వీరి వ్య‌వ‌ హారంపై  పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాన‌ని మొండి కేశారు.   ఎంపీ వెంకట్‌రెడ్డి బెట్టువీడక పోవడంపై  కాంగ్రెస్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు సీరియస్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఇంట్లో మల్లు రవి, బెల్లయ్య నాయక్‌, చరుణ్‌ కౌశిక్‌ భేటీ అయ్యారు. క్షమాపణలు చెప్పినా కూడా దయా కర్‌ను టార్గెట్‌ చేయడంపై అసంతృప్తి చేస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని నిర్ణయం తీసు కున్నారు. వెంకట్‌రెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తోంది.  ఎంపీ వెంకటరెడ్డి కి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మరోసారి క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో తాను చేసిన వాఖ్య లకు బాధ‌పడుతున్నట్లు తెలిపారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని అద్దంకి దయాకర్ కోరారు. కాగా... కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్‌లో రేవంత్ క్షమాపణ వీడియోను పోస్ట్ చేశారు. చుండూరులో జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బహిరంగంగా తిట్టడంపై బాధ్యత వహిస్తూ ఎంపీకి రేవంత్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదని, దీనిని మరోసారి క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని చిన్నారెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచించారు.

గోరంట్ల కు స్వాగతం ప‌లికిన కురుబ సంఘం

యుద్ధ‌భూమినుంచి విజేత‌లై వ‌చ్చేవారికి అధికా రులు, ప్ర‌జ‌లు వేయిక‌ళ్ల‌తో ఎదురు చూస్తారు, మ‌హాఘ‌న‌త సాధించిన‌వారిని స‌త్క‌రించ‌డానికి వేచి ఉంటారు. కానీ మ‌న దేశంలో ఎప్పుడైనా ఎవ‌రికోస‌మైనా స్వాగ‌తం ప‌ల‌క‌డానికి సిద్ధంగా ఉంటార‌న్న‌ది గోరంట్ల విష‌యంలోనే బ‌య‌ట‌ ప‌డింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో లోక‌మంతా చూసి నిర్ధారించిన త‌ర్వాత కూడా ఇంకా దానిపై విచార‌ణ జ‌ర‌గాలి, త్వ‌ర‌ప‌డి ఆయ‌న‌ మీద యాక్ష‌న్ తీసుకోలేమ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ మీన‌మేషాలు లెక్క‌వేస్తోంది. ఇది కేవ‌లం కాల‌ యాప‌న మార్గ‌మేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వీడియోలో గోరంట్ల మాధవ్‌ పూర్తి నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఈ దూమారానికి తాత్కాలి కంగా తెర పడిన తర్వాత ఆయన హిందూ పురానికి వస్తున్నారు.  పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు. ఈ  జిల్లాకు వస్తున మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఫేక్ వీడియోపై దుష్ప్రచారం సరి కాదన్నారు. పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. బీసీలను అనగదొక్కేందుకే తనపై దుష్ప్రచారం చేస్తు న్నా రని గోరంట్ల  విమర్శించారు.  గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో ఒక ఫోన్లో ప్లే అవుతుండగా మరో ఫోన్‌ ద్వారా రికార్డు చేశారని... సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది అదే కాబట్టి, దానిని ఒరిజినల్‌ అనలేమని పోలీసులు తేల్చేశారు. మాధవ్‌ ‘ఊహించిన విధంగానే’ భారీ ఊరట కల్పించారు. ‘ఆ వీడియో ఒరిజినల్‌ కాదని ఎస్పీ చెప్పేశారు’ అంటూ గోరంట్ల మాధవ్‌ కూడా తనకు క్లీన్‌చిట్‌ వచ్చేసినట్లుగా ప్ర‌చారం చేయించుకున్నారు. కానీ, ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా పోలీసులు చేసిన‌ నిర్వాక‌మ‌ని రాజ కీయ విశ్లేషకులు, ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్‌ గతంలో పోలీసు శాఖలో పని చేశారు. 1998లో ఆయన ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరారు. కడప జిల్లాలో ఐదేళ్లు పని చేశారు. అప్పట్లో వ్యక్తిగత ఆరోపణలు రావడంతో ఆయనను అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది... అనంతపురం, కదిరిలో పని చేశారు.  కదిరి సీఐగా పనిచేసినపుడే గోరంట్ల మాధవ్‌పై ‘రాసలీల’ ఆరోపణలు వెల్లు వెత్తా యి. ఎంపీ అయిన తర్వాత కూడా అవి కొనసాగాయి. నోట్ల రద్దు సమయంలో అనంతపురంలో బ్యాంకు వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని విచక్షణారహితంగా కొట్టి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎన్నికల ముందు టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డిపై మీసాలు దువ్వి సవాలు విసిరిన గోరంట్ల.. వైసీపీ దృష్టిని ఆకర్షించారు. ఎంపీ టికెట్‌ పొందారు.

గోరంట్ల‌, అనంత‌బాబుల మీద ఎందుకంత ప్రేమ‌?..  రామ‌కృష్ణ‌

పొర‌పాట్లు చేసినా మంచివారిని కాపాడ‌ల‌నుకుంటారు. దొంగ‌ల్ని, అత్యాచారాలు చేసేవారిని, మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా వ్య‌వ‌హ రించే వారిని ర‌క్షించాల‌నీ అనుకోరు. కానీ వైసీపీ స‌ర్కార్ మాత్రం త‌మ ఎంపీ గోరంట్ల భాగోతం లోక‌మంతా తెలిసినా ఇంకా ఏదో ద‌ర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదిక‌లు రావాలి.. అంటూ తాత్సారం చేస్తూ కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది. హత్య చేసిన ఎమ్మెల్సీ ని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ ని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ ధ్యేయమా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 90 రోజులలోపు ఛార్జ్ షీట్ వేయకుండా ఎమ్మెల్సీ అనంత బాబు కు పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు. అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు చేస్తున్న కుట్ర వెనక ఎవరు న్నార న్నారు.  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో అనంతపురం ఎస్పీ పకీరప్ప ఎటువంటి విచారణ లేకుండా ఫేక్ వీడియో అంటూ తేల్చారని రామకృష్ణ మండిపడ్డారు. మనిషిని చంపి, కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుపై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ? అని ప్రశ్నించారు. అనంతబాబు కేసులో పోలీసు, ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమి స్తామని రామ కృష్ణ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, అశ్లీల వీడియో కాల్ ఆరోపణలు ఎదుర్కొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఢిల్లీ నుంచి వస్తున్న నేపథ్యం లో అనంతపురంలో కాస్త గందరగోళం నెలకొంది. ఆరోపణలు నిరాధారమైనవని పోలీసులు తేల్చడంతో సొంత జిల్లాకి వస్తున్న ఎంపీకి భారీగా ఆహ్వానం పలికేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఆంధ్రా బార్డర్ నుంచి అనంతపురం వరకు వెహికల్స్‌తో ర్యాలీ చేపట్టేందుకు గోరంట్ల అభిమానులు సిద్ధమయ్యారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా అనంతపురంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా టీడీపీ నాయకు లను పోలీసులు ముందస్తు అరెస్టుల చేశారు. గోరంట్లకు వ్యతిరేకంగా చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయనకి నోటీసులు అందించారు. అతనితో పాటు అనంతపురం జిల్లా పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి రమణకు నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత లక్ష్మీ నరసింహను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే గఫూర్ మండిపడ్డారు.

హుస్సేన్‌.. ఇంత డ్రామా అవ‌స‌ర‌మా?

క్లాస్ ఫ‌స్ట్ రాలేదు, ఉద్యోగంలో ప్రమో ష‌న్ రాలేదు, పోనీ ఊరికేమైనా ఘ‌న‌ కార్యం చేశాడా అంటే అదీ లేదు. కానీ హుస్సేన్ని మాత్రం లెబ‌నీయులు హీరో అనే అంటున్నారు. కార‌ణం అత‌ ను త‌న బ్యాంక్ అకౌంట్లో కొంత డ‌బ్బు తీసుకోవ‌డానికి నానా హ‌డావుడీ చేయాల్సి వ‌చ్చింది. చాలామంది భ‌య‌ప‌డ్డారు కూడా. సినిమా క్రైమ్ సీన్స్‌ని త‌ల‌పిస్తుంది.  ఈమ‌ధ్య‌నే ఒక‌రోజు బ‌స్సాం అల్‌-షేక్ హుస్పేన్ అనే వ్య‌క్తి లెబ‌నాన్ బీరూట్‌కి చెందిన హామ్రా లో ఒక బ్యాంక్ కి వెళ్లాడు. అంద‌రూ డ‌బ్బులు తీసుకోవ‌ డానికి వెళ్ల‌న‌ట్టే వెళ్ల‌లేదు. చేతిలో ఏకం గా షాట్ గ‌న్ ప‌ట్టుకుని మ‌రీ వెళ్లాడు. లోప‌లికి వెళ్ల‌గానే అక్క‌ డున్న వారిని బెదిరించాడు. అంతే కాదు ఒక రౌండ్ కాల్పులూ జ‌రిపేడు. అయితే అక్క‌డున్న‌వారికేమీ కాకుండానే చేశాడా ప‌ని. నిజానికి అత‌ను బ్యాంక్‌ను మ‌రీ దోపిడీ చేసి పోవాల‌ని దొంగ‌లా చొర‌బ‌డ‌లేదుట‌. అత‌ని అకౌంట్‌లోంచి కొంత డ‌బ్బు తీసు కోవడానికే వ‌చ్చాన‌ని తీరిగ్గా చెప్పి డ‌బ్బు తీసుకున్నాడు.  బీరూట్ ఫెడ‌ర‌ల్ బ్యాంక్ అనే బ్యాంక్‌లో హుస్సేన్ అకౌంట్‌లో సుమారు 1.67 కోట్లు డ‌బ్బు ఉంది. అందులోంచి రూ.7,96 లక్ష‌లు తీసుకోవాల‌ని వెళ్లాడు. కానీ బ్యాంక్ వారు అంత మొత్తం ఒక్క‌సారిగా ఇవ్వ‌డానికి అంగీక‌రించిన‌ట్టు లేదు. అత‌ను అడిగాడు, ప్రాధేయ‌ప‌డ్డాడు. త‌న తండ్రి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్నాడు. ఆయ‌న మందులు, ఆస్ప‌త్రి బిల్లు క‌ట్ట‌డానికి చేతిలో చిల్లి గవ్వ లేదు, ఇపుడు బ్యాంక్ నుంచే తీసి ఇవ్వాల‌ని వేడుకున్నాడు. బ‌హుశా బ్యాంక్‌వారు తిర‌స్క‌రించి ఉంటారు. అత‌గాడికి కోపం వ‌చ్చి ఓ ప‌దిమందిని షాట్‌గ‌న్ చూపించి డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే చంపేస్తాన‌ని బెదిరించాడు. అంతే బ్యాంక్‌వారు భ‌య‌ప‌డి ఆయ‌న అడిగింది మూట‌గ‌ట్టి మ‌రీ ఇచ్చారు. వాస్త‌వానికి లెబ‌నాన్‌లో ఆర్ధికప‌రిస్థితులు ఈ మ‌ధ్య‌కాలం ఊహించ‌ని విధంగా మార్పు చెందాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  హుస్సేన్ న‌వ్వుతూ అవి తీసుకుని సిగెరెట్ వెలిగించుకుని మ‌రీ బ‌య‌ట‌కి వ‌చ్చాడు. కానీ మెట్లు దిగ్గానే పోలీసులు ఎదుర య్యారు. కానీ హుస్సేన్ సినిమాల్లోలా పారిపోలేదు.  వాళ్ల‌ద‌గ్గ‌రికే వెళ్లి లొంగ‌పోయాడు.  ఇంత ప‌నిచేసేవేంద్రా భ‌య్‌.. అంటూ. బేడీలే వేసారు. అయ్యా నా ప‌రిస్థితిల్లో ఎవ‌రున్నా ఇంతే ఆవేశ‌ప‌డ‌తార‌ని అన్నాడు హుస్సేన్. అస‌లే పోలీసులు, అత‌డి మాట ల్ని అస్స‌లు న‌మ్మ‌లేదు. పైగా ఇప్ప‌టికే ఒక‌సారి ఇలాంటి దోపిడీ జ‌రిగింద‌ని ఇత‌న్ని క‌ట్ట‌డి చేయ‌క‌పోతే మ‌రీ సంఖ్య పెంచు తాడ‌ని భ‌య‌ప‌డే పోలీసులు అరెస్టు చేశార‌ట‌. ట్విస్ట్ ఏమిటంటే,  హుస్సేన్ ధైర్య‌సాహ‌సా ల‌కు బీరూట్ ప్ర‌జ‌లు మాత్రం అత‌న్ని హీరోగానే పిలుస్తున్నారు. 

మ‌హిళ‌ల‌కు కేసీఆర్‌ న్యూట్రీష‌న్ కిట్‌

మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉంటేనే స‌మాజం ఆరోగ్యంగా ఉంటుంద‌న్న భావ‌న అనాదిగా ఉన్న‌ది. వారి ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య తనిస్తూ ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం సుమారు రూ.1,500 కోట్ల ఖ‌ర్చుతో పౌష్టికాహార కిట్‌ను తీసుకురానుంది. కేసీఆర్ న్యూట్రి ష‌న్ కిట్ అని పిలుస్తున్న ఈ కిట్‌ను ద‌స‌రాపండుగ‌ను పుర‌స్క‌రించుకుని బ‌తుక‌మ్మ కాను క‌గా ల‌బ్ధిదారుల‌కు అందిస్తున్న‌ట్టు   రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివరాలు వెల్ల డించారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడు తున్నారని ప్రభుత్వం గ్రహించింది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడు తున్న కొమురంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నాగర్‌ కర్నూలు, ములు గు జిల్లాల్లోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్‌ పోషకాహార కిట్‌ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం అమలుకు సుమా రు రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కిట్‌ వల్ల పేదలకు ఎంతో ప్రయో జనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వెల్లడించారు. తాజాగా ఈ న్యూట్రీషన్‌ కిట్‌తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. తొలుత 1.5లక్షల మందికి ఈ కిట్‌లు అందజేస్తామని, ఆ తర్వా త ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని హరీశ్​ తెలిపారు. పోషకాహార కిట్‌లో ఒక కేజీ న్యూట్రీషనల్‌ మిక్స్‌ పౌడర్‌ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్‌ సిరప్, ఒక అల్బెండజోల్‌ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్‌లో ఒక ప్లాస్టిక్‌ కప్‌ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా ఒక బాక్స్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బాక్స్‌ ఇవ్వాలా లేదా ఏదైనా బ్యాగ్‌ ఇవ్వాలా లేక కేసీఆర్‌ కిట్‌ మాదిరి ఇవ్వాలా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు తరహాలో బాక్స్‌ ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో అధికారులు తమిళనాడు నుంచి ఆ బాక్స్‌ను కూడా తెప్పించి పరిశీలించారు. కాగా, కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతం పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కిట్‌ ధర రూ.2 వేల వరకు ఉంటుందని మంత్రి హరీశ్‌ తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు ఈ కిట్‌లు ఇస్తామని, గర్భం దాల్చిన మూడు నెలలకోసారి, ఆర్నెల్లకోసారి ఈ కిట్‌ లబ్ధిదారుకు అందుతుందన్నారు. ప్రభుత్వా స్పత్రుల్లో మందులను మూడు నెలల ముందస్తు కోటాగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ–ఔషధీ, వైద్య పరిక రాల నిర్వహణకు ఈ–ఉపకరణ్‌ పోర్టళ్లను మంత్రి ఆవిష్కరించారు.

50 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రెడీ.. బండి సంజ‌య్‌

ఎదుటివారిని భ‌యాందోళ‌న‌కు గురిచేయ‌డానికి అనేక వ్యూహాలు అనుస‌రిస్తారు. రాజ‌కీయాల్లోనూ అంత‌కు మించే జ‌రుగుతుంటుంది. రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు, ప్ర‌చారాలు చేయ‌డంలో ఇటీవ‌ల బీజేపీ వారిని మించిన‌వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. తెలంగాణాలో ఎలా గైనా అధికారంలోకి రావాలన్న ఆతృత‌తో టీఆర్ ఎస్‌కు జంప్ జిలానీల సంఖ్య పెంచుతూ తెలంగాణా బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ లెక్క‌ను పెంచుతూ పోతున్నారు. టీఆర్ ఎస్ నుంచి ఏకంగా 50మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ నీడ‌లోకి రావ‌డానికి సిద్ధంగా ఉన్నారని సంజ‌య్ అన్నారు.  జ‌నాక‌ర్ష‌ణ వ‌దిలేసి ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలోనే బండి బాగా ఆస‌క్తి చూపుతున్నారు. దీనికి తోడు టీఆర్ ఎస్ ని చిన్న‌పిల్ల‌ల్ని భ‌య‌పెట్టిన‌ట్టు హెచ్చ‌రిక‌లు చేయ‌డంలో బాగా ప్రావీణ్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా కేసీఆర్‌ బొమ్మతో ఎన్ని క ల్లోకి వెళితే గెలవలేమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, ఆ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్‌ తెలిపారు.  గతంలో 12 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌కటించిన బండి ఇపుడు ఆ సంఖ్య‌ను ఏకంగా 50 కి పెంచారు. మూడో విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ఉత్సాహంతో ఆయ‌న అలా ఆ సంఖ్య పెంచుతూ పోతున్నార‌న్న అనుమానం అంద‌రికీ రాక పోదు. జ‌నాన్ని చూస్తే వెర్రెక్కిపోవ‌డంలా ఈ యాత్ర‌లో సంజ‌యునికి జ‌నాన్ని చూడ‌గానే వారికి లెక్క పెంచి చెబితే పార్టీ ఎంత శ‌క్తి వంతంగా ముంద‌డుగు వేస్తోందో వారికి తెలియ‌జేయాల‌న్నఆలోచ‌నా అందులో ఉంది. యాత్ర 11వ రోజు శనివారం (ఆగ‌ష్టు 13)యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కొనసాగింది. పొడిచేడు గ్రామంలో మలి ఉద్యమంలో తొలి అమ రుడైన కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  మోత్కూరు అంబేడ్కర్‌ చౌరస్తాలో సంజయ్‌ మాట్లా డుతూ, ఉప ఎన్నిక రావాలన్నది కేసీఆర్‌ కోరిక అని, మునుగోడులో టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఏకమై వచ్చినా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. సీఎం కుర్చీ కోసం కేసీఆర్‌ ఇంట్లో కొడుకు, బిడ్డ, అల్లుడి మధ్య లొల్లి మొదలైందని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నయా నిజాం పాలన సాగుతోందని, ప్రజలు తమ ఆకాంక్షల సాధనకు మరోసారి పోరాడా లని, ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి తమ పార్టీ ఉద్యమిస్తోందని, మేధావులు, కళాకారులు, అన్నివర్గాల ప్రజలు తమతో కలిసి రావాలని ఆయన కోరారు. 

 భార‌త్ వారెన్ బఫెట్  రాకేష్ జున్‌జున్‌వాలా మృతి

బిలియనీర్, బిజినెస్ మ్యాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(62) మృతి చెందారు.  ఆయన ముంబైలో ఆదివారం (ఆగ‌ష్టు 14) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం రెండు వారాల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయనను ఈ రోజు ఉదయం మరోసారి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.   ట్రేడర్‌గా చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఆయన ఎంతో పేరుగడించారు. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. ఇటీవలే ఈ వైమానిక సంస్థ సేవలను ప్రారంభించింది. మొదటి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్ ప్రయాణించింది. రాకేశ్ ను ‘బిగ్ బుల్’, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు. ఆయన వ్యాపార చిట్కాల ద్వారా ఈ పేర్లు అందుకు న్నారు.  రాకేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రపంచానికి ఆయన చెరగని సహకారాన్ని అందించారంటూ కొనియాడారు. దేశ పురోగతికి కృషి చేశాడన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. రాకేశ్ కుటుంబ సభ్యులకు, అభిమా నులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మోదీ.

మాణిక్యం స్థానంలో పైల‌ట్‌?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి కోమ‌టిరెడ్డి గోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన‌ప్ప‌టి నుంచి పార్టీలో అంతా ఖంగారుగానే ఉంది. తెలంగాణాలో టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొని నిల‌వ‌డానికి పార్టీ మ‌రింత ప‌టిష్ట చేయ‌డంలోనూ తెలంగాణా ఇన్ ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ ఆశించినంత ప‌టిష్ట వ్యూహాలేమీ వేయ‌డం లేదు. దీనికి తోడు ఆయ‌న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీ నాయ కుల‌ను అంద‌రినీ స‌మానంగా చూస్తూ, అంద‌రి అభిప్రాయాలు తెలుసుకుని ముంద‌డుగు వేయ‌ డంలోనూ వెన‌క‌బ‌డి పోతున్నార‌న్న అభిప్రాయాలే విన‌వ‌స్తున్నా య‌ ని విశ్లేష‌కులు మాట‌. ఆయ‌న మీద అనేక ఫిర్యాదులు ఇప్ప‌టికే కాంగ్రెస్ అధిష్టానానికి చేరాయి. ఆయ‌న కేవ‌లం పీసీసీ అధ్య‌క్షుడితో త‌ప్ప వేరే నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌న్న అభిప్రా యాలు ఉన్నాయి.  పార్టీ నాయ‌కుల్లో ఆయన ప‌ట్ల తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మునుగోడు కేంద్రందంగా  బీజేపీ వ్యూహ‌ర‌చ‌న‌తో ముంద డుగు వేస్తుంటే, తెలంగాణా కాంగ్రెస్ నాయ‌కుల‌కు స‌రైన సూచ‌న‌ల‌నిస్తూ ఉత్సాహ‌ప‌ర్చ‌కుండా, వారి అభిప్రాయాల‌ను లెక్క‌ లోకీ తీసుకో కుండా కేవ‌లం పీసీసీ అధ్య‌క్షుడితోనే చ‌ర్చిస్తూండ‌డం ప‌ట్ల నాయ‌కులు మండిప‌డుతున్నారు. మాణిక్యం ఠాగూర్ వ్య‌వ‌హార శైలి తో చాలామంది నాయ‌కులు విసిగెత్తి పార్టీని వదిలేసి వెళ్లే ఆవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని ఇప్పటికే కొంద‌రు సీనియ‌ర్లు ఢిల్లీకి ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తున్న‌ది.  ఈ సమయంలో మాణిక్కం ఠాగూర్‌ను మార్చి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు గానీ మరో నేతను గానీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి మాణిక్యం  వైఖరివల్ల పార్టీ మారాల్సివచ్చిందని తెలుస్తోంది. అనేకమంది నేతలు ఢిల్లీలో సీనియర్‌ నేతలకు ఫోన్లు చేస్తున్నా రని, దీనితో ఠాగూర్‌ ఏమి చేస్తున్నారని ఢిల్లీ పెద్దలు ప్రశ్నించి నట్లు తెలిసింది. కాగా ప్రియాంక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమిస్తారన్న వదంతులు ఉన్నాయి. అయితే అది ఎంత‌వ‌ర‌కూ సాకార‌మ‌వుతాయ‌న్న‌ది అనుమాన‌మే. 

రష్దీపై దాడి చేసింది ఎవరు?

 సల్మాన్ రష్దీపై దాడి చేసిన వ్యక్తి న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మటర్‌గా గుర్తించారు. న్యూయార్క్ పోలీసులు దాడి చేసిన వ్యక్తి పై ఇంకా అభియోగాలు మోపలేదని, రుష్దీ పరిస్థితిని బట్టి అభియోగాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ రష్దీ ప్రసంగించేందుకు వేదికపైకి వచ్చిన కొద్దిసేపటికే హాదీ మటర్ ర‌ష్దీ మెడపై ఒక్కసారైనా, పొత్తికడుపుపైనా ఒక్కసారైనా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: వేదికపై కత్తి పోట్లకు గురైన సల్మాన్ రష్దీ కి శస్త్రచికిత్స చేస్తున్నారు. సల్మాన్ రష్దీ  ఉపన్యాసానికి హాజరు కావడానికి హదీ మటర్ పాస్ సంపాదించాడు. అత‌ను మాన్‌హాటన్ నుండి హడ్సన్ నదికి అవత‌ల‌ ఉన్న ఫెయిర్‌వ్యూలో ఉంది. మాటర్ దాడికి గల ఉద్దేశ్యం అస్పష్టంగానే ఉందని పోలీసులు తెలిపారు. అతను ఒంటరి గానే ఉన్నాడ‌ని, అత‌నికి మ‌ద్ద‌తుదారులు, స‌హాయ‌కులూ  కూడా లేర‌ని తెలుస్తోంది.  తొలిద‌శ‌ దర్యాప్తులో ఎఫ్ బీ ఐ సహాయం చేస్తోందని న్యూయార్క్ స్టేట్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ బ్యాగు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు గుర్తించారు. రష్దీ మరణానికి పిలుపునిచ్చిన ఇరాన్ ప్రభుత్వం పట్ల హదీ మాతర్‌కు సాను భూతి ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అతని ఫేస్‌బుక్ ఖాతాలో 1989లో సల్మాన్ రష్దీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖొమేనీ ఫోటో ఉంది. ఎన్ బిసి వార్తల ప్రకారం, ఇరాన్, దాని రివల్యూషనరీ గార్డ్‌కు మద్దతుగా, షియా తీవ్రవాదానికి మద్దతుగా హాదీ మాటర్ సోషల్ మీడియా పోస్ట్‌లు చేసాడు. హదీ మటర్ నల్లటి దుస్తులు ధరించి, నల్లనిముసుగు ధరించి ఉన్నాడు, ఒక ప్రత్యక్ష సాక్షి మీడియా కు  తెలియ‌జేశారు.  దాడి చేసిన వ్యక్తి వేదికపైకి దూకినప్పుడు, సల్మాన్ రష్దీ వివాదాస్పద వ్యక్తి కాబట్టి ఇది కొట్లాట‌లా వారు భావించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, అయితే కొన్ని సెకన్ల తర్వాత, అది స్పష్టమైంది. దాదాపు 20 సెకన్ల పాటు దాడి జరిగింది. ఆ స‌భ‌లో ఉన్న మీడియా నివేదిక‌ల  ప్రకారం, సల్మాన్ రష్దీని వేదికపై 10 నుండి 15 గుద్దులు లేదా కత్తితో పొడిచారు. ఈవెంట్ నిర్వాహ‌కుడు  హెన్రీ రీస్‌కీ  తలకు స్వల్ప గాయమైంది. ప్రవాసంలో ఉన్న కళాకారులకు ఆశ్రయమీయ‌డం వంటి యునై టెడ్ స్టేట్స్ ప‌నుల‌ గురించి రీస్ రష్దీతో చర్చించవలసి ఉంది. ఆకస్మిక దాడి తర్వాత, సల్మాన్ రష్దీని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తర లించారు. ఇప్పు డు వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను ఒక కన్ను కోల్పోవచ్చని అతని ఏజెంట్ చెప్పాడు. ర‌ష్డీ కాలేయం దెబ్బ తింది  ర‌ష్డీ చేతి నరాలు తెగిపోయాయి.

తగునా ఇది మంత్రివర్యా

మంత్రి శ్రీనివాస గౌడ్ ఆజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి  శ్రీనివాస గౌడ్ అత్యుత్సాహం ప్రదర్శించి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధ్వర్యంలో జరుగుతున్న భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి   పాల్గొన్నారు. ఉన్నట్లుండి అందరూ చూస్తుండగానే పక్కన ఉన్న పోలీసు నుంచి తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు.  ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసు అధికారులు కనీసం మంత్రిని వారించను కూడా వారించలేదు. తాను గాలిలోకి కాల్పులు జరుపుతున్న ఫొటోలను తలసాని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు తగునా ఇది మంత్రిగారూ అంటూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇలా ఉండగా తాను చేసిన పనిని మంత్రి   సమర్ధించుకున్నారు.  భారీజ‌న సందోహం హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో పోలీసుల తుపాకీ తీసుకుని మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జ‌రుపుతారంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న నేపథ్యంలో  తాను కాల్చింది ర‌బ్బ‌ర్ బుల్లెట్ అని పేర్కొన్న శ్రీనివాస్ యాదవ్... తాను రైఫిల్ అసోసియేష‌న్ స‌భ్యుడిన‌ని,  క్రీడా శాఖ మంత్రిగా త‌న‌కు ఇలా గాల్లోకి కాల్పులు జ‌రిపే అర్హ‌త ఉంద‌ని మంత్రి చెప్పారు. అంతే కాకుండా తానేమీ పోలీసు చేతిలోంచి తుపాకీ లాక్కోలేదనీ, ఎస్పీయే స్వయంగా తనకు తుపాకీ అందించారని అన్నారు.  

సోనియా గాంధీకి మళ్లీ కరోనా పాజిటివ్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో సోనియా గాంధీ చికిత్స తీసుకున్న సంగతి విదితమే.  కాగా సోనియాగాంధీ కరోనా బారిన పడిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.  అంతకుముందు జూన్ మొదటివారంలో సోనియా గాంధీకి కరోనా సోకిన సంగతి విదితమే.  ఆ సమయంలో ఢిల్లీలోని సర్ గంగారామ్ హస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. కోవిడ్ కారణంగా ఆ సమయంలో ఈడీ విచారణకు హజరు కాలేదు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ జూన్ నెలలో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమయంలో సోనియా కరోనా బారినపడటంతో విచారణ వాయిదా పడింది. సోనియా గాంధీ పూర్తిగా కోలుకున్న తరువాత జూలైలో ఈడీ విచారించింది. అయితే నెల రోజులు గడవక ముందే సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడటం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా నెల రోజుల వ్యవధిలో రెండో సారి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రియాంకా గాంధీ కూడా ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల సోనియా గాంధీని ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఢిల్లీలోని ఆందోళనల్లో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ ఆందోళనల తరువాత నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. సోనియా, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కూడా కోవిడ్ బారిన పడ్దారు. ఈ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు కోవిడ్ సోకినట్లు.. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఆ నగ్న వీడియో కాల్ ఒరిజనలే!

ఎన్ని డ్రామాలాడినా, ఏకంగా ఎస్పీ చేతే ఆ వీడియోను ఫొరెన్సీక్ పరీక్ష కూడా ఒరిజనలో కాదో తేల్చలేదని చెప్పించినా, ఆ ఎస్పీ చెప్పిన దానిని పట్టుకుని గోరంట్ల మాధవ్ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నా.. దానిని పట్టుకుని మంత్రి రోజా వంటి వారు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించేసినా నిజం మాత్రం నిప్పులా బయటపడింది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనలేనని అమెకిరా ఫోరెనసిక్ ధృవీకరించింది. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకుడు పట్టాభి విలేకరుల సమావేశంలో చెప్పారు. అమెరికా ఫోరెన్సిక్ మాధవ్ పోర్న్ వీడియో కాల్ వీడియో ఒరిజనలేనని ధృవీకరిస్తూ ఇచ్చిన నివేదికను బయట పెట్టారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవడానికి ఈ ఆధారం సరిపోతుందా జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు.   అసలు ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే గోరంట్ల మాధవ్ కు క్లీన్ చిట్ ఎలా ఇస్తారని నిలదీసారు. అమెరికా ఫోరెన్సిక్ నివేదికే సాక్ష్యం గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వీడియో ఒరిజనలేననడానికి అని పట్టాభి అన్నారు. ఈ నివేదిక చాలు గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడి కావడానికి అని పేర్కొన్నారు. వైసీపీ సర్కార్ పోలీసులను అడ్డం పెట్టుకుని తమ ఎంపీని కాపాడడానికి చూస్తోందని, అందుకే అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ లో వీడియో టెస్ట్ చేయించి నివేదిక బయటపెడుతున్నానని పట్టాభి అన్నారు. గోరంట్ల వీడియో ఒరిజనల్ అని తేలితే చర్యలు తీసుకుంటానని మీడియా ముఖంగా చెప్పిన ప్రభుత్వ సలహాదారు సజ్జల దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించారు. ఇలాంటి ఛండాలపు పని చేసిన మాధవ్ సిగ్గూ ఎగ్గూ లేకుండా అనంతపురంలో హోర్డింగ్ లు ఎలా పెట్టించుకుంటారని పట్టాభి అన్నారు.  

బీజేపీ దృష్టి తెలంగాణ మీదనే ఎందుకు?

దక్షిణ భారతదేశం బీజేపీకి అంతు చిక్కని ప్రాంతం. క‌ర్ణాట‌క‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో  ఇంత వరకూ ఆ పార్టీకి   గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే బీజేపీ మాత్రం అందని ద్రాక్ష పుల్లన అని వదిలేయకుండా.. దక్షిణాది రాష్ట్రాలలో పాగాకు విశ్వ యత్నం చేస్తోంది.  బీజేపీ మిషన్‌ సౌత్‌కు తెలంగాణ ఇప్పుడు సారవంతమైన ప్రాంతంగా భావిస్తోంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బీజేపీకి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.  రెండు దఫాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ప్రబలుతోందనడానికి  నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె   కవిత ఓడిపోవడంతో ప్రస్ఫుటమైందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. దీంతో 2019 ఎన్నికలు పూర్తయిన క్షణం నుంచీ బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ప్రణాళికా బద్ధంగా పని చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.   లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో  17 స్థానాలకు గానూ బీజేపీ  కేవలం నాలుగింటిని గెలుచుకున్నప్పటికీ,   ఓట్ల శాతం 19 శాతానికి పైగా ఉంది. ప్రతిపక్షంగా బలమైన ప్రాంతీయ పార్టీ లేకపోవడంతో, బిజెపి ఆ గ్యాప్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు ఉధృతం చేసింది. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో కేవలం మూడు స్థానాలు మాత్రమే ఉన్నప్పటకీ, రాష్ట్రంలో ప్రధాన విపక్షాని దీటుగా ఎదిగింది.  తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కి సన్నిహితంగా  ఏఉండటం కూడా బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు.  అయితే బీజేపీ మాత్రం ప్రధానంగా తన విమర్శలకు కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపైనే కేంద్రీకరించడం ప్లస్ పాయింట్ అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు.   అన్నిటికీ మించి బీజేపీకి ఉన్న ప్రధాన ఆకర్షణ   ప్రధాన మంత్రి మోదీ. ఆయనకు ఉన్న జనాకర్షణ, వాగ్ధాటి. ఇటీవలి కాలంలో తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే బీజేపీ ప్రతిపాదించిన అభివృద్ధి నమూనా కూడా ప్రజలను ఆకర్షిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే  అర్బన్  ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత మెరుగైన అభివృద్ధి, ఉద్యోగావకాశాల వాగ్దానాలను ఉపయో గించి తమవైపు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికీ అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగలే దని తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాలను కేసీఆర్ విఫలం చేస్తున్నారని బీజేపీ చేస్తున్న ప్రచారం కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అన్నిటికీ మించి ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం, కాళేశ్వరం వైఫల్యం, వర్గీకరణ అంశం, హామీల అమలు పూర్తి కాకపోవడం వంటి అంశాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది.