తిరుపతి జూపార్క్ లో జాగ్వార్ మృతి

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో వన్య ప్రాణుల మృత్యుఘోష ఆడగం లేదు. అసలు ఈ జూపార్క్ లో తరచూ వన్యమృగాలు ఎందుకు మృత్యువాత పడుతున్నాయన్న ప్రశ్నలు వినవస్తున్నాయి. తాజాగా ఇదే జూపార్క్ లో  మంగళవారం (అక్టోబర్ 7) ఒక జాగ్వార్ ప్రమాదవశాత్తూ మరణించింది.  15 సంవత్సరాల వయస్సున ఈ జాగ్వార్ పేరు కుశ.  తిరుపతి శ్రీవేంకటేశ్వర జూపార్క్ కు మంగళవారం సెలవు. దీంతో ఈ పార్క్ లో ఆ రోజు కేవలం జూపార్క్ సిబ్బంది, వణ్యప్రాణుల సంరక్షకులు ఉంటారు. జాగ్వార్ మరణించిందన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ విబాగం అధికారులు జూపార్క్ కు వచ్చి పరిశీలించారు. అనంతరం పశువైద్య విద్యాలయం డాక్టర్లు మరణించిన జాగ్వార్ కు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.  2019లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి ఈ జాగ్వర్ ను తీసుకు వచ్చారు. మంగళవారం (అక్టోబర్ 7) యథావిధిగా జాగ్వార్ ను   విశాల మైదానంలో తిరగడానికి వదిలారు. అయితే కొద్ది సేపటి తరువాత  ఏం జరిగిందో ఏమో కానీ.. ఓ చెట్టుకు చిక్కుకుని మరణించి ఉండటం కనిపించింది.  పోస్టుమార్టం నివేదికలో హైపర్ షాక్, ఆస్పిసియాతో మరణించినట్లు తేలింది.  

ఏ క్షణంలోనైనా మోహిత్ రెడ్డి అరెస్ట్?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో ఏ 39గా ఉన్న మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.  మద్యం డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా కంపెనీల నుంచి అక్రమంగా వసూలు చేసిన ముడుపులను ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడంలో మోహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తున్నది.  ముడుపుల నుంచి వచ్చిన అక్రమ డబ్బును రవాణా చేయడంలో మోహిత్ రెడ్డి పాలుపంచుకున్నారనీ,  తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వాహనాలను ఉపయోగించి ఈ డబ్బును రవాణా చేశారనీ సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. అలాగే  తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు ద్వారా సొమ్మును వైట్  మనీగా మార్చినట్లు గుర్తించింది.  మోహిత్ రెడ్డి రూ. 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పత్రాలు సృష్టించి మనీ లాండరింగ్ చేశారని సిట్ తన దర్యాప్తులో తేల్చింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోసం మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా ఇంత కాలం మోహిత్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఉన్న సిట్.. ఇప్పుడు కోర్టు ఆ యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ రద్దు చేయడంతో ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్ సైంటిస్టులకు భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.  జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైఖేల్ హెచ్ డెవోరెట్‌లకు ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ వరించింది.  క్వాంటం మెకానిక్స్‌పై పరిశోధనలకు గాను ఈ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మైక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణ చేసినందుకు గానూ  జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లను నోబెల్ పురస్కారం వరించింది.  డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారాల ప్రదానం జరగనుంది. అన్ని డిజిటల్ టెక్నాలజీలకు క్వాంటం మెకానిక్సే పునాది  కనుక వీరి పరిశోధనలు క్వాంటం కంప్యూటర్లు, క్వాంటం సెన్సార్లు, క్వాంటం క్రిప్టోగ్రఫీ వంటి భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు.

కర్నూలులో డ్రోన్ సిటీకి 16న ప్రధాని శంకుస్థాపన

ప్రాజెక్టులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నది. అదే సమయంలో ఎన్డీయేలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం ఉండటంతో కేంద్రం నుంచి కూడా ఇతోధిక ప్రోత్సాహం, మద్దతు లభిస్తున్నది. అందుకు తిరుగులేని తార్కానం ఏమిటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఏపీలో పర్యటిస్తూ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉండటమే. ఇప్పుడు ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 16న ఆయన ఏపీ పర్యటనలో భాగంగా కర్నూలులో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ డ్రోన్ సిటీ అన్నది  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కలల ప్రాజెక్ట్. రాష్ట్రాన్ని  డ్రోన్ల హబ్ గా  మార్చాలని చంద్రబాబు సంకల్పించిన సంగతి విదితమే. అందులో భాగంగానే  కర్నూలులో డ్రోన్ల సిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆఘమేఘాల మీద అవసరమైన పనులన్నీ పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కర్నూలులో డ్రోన్ సిటీకి ప్రదాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నారు.   అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరగాలని.. ఆ దిశగా ప్రోత్సహించాలని భావిస్తున్న చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణాన్ని సంకల్పించారు. ఆ డ్రీమ్ ప్రాజెక్టుకే ఈ నెల 16న ప్రధాని మోడీ భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   కర్నూలులో రోడ్ షోలో పాల్గొననున్నారు.  కాగా ఈ సారి ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు.

పీఎంఓ అధికారిగా నమ్మించి మోసం.. కేసు నమోదుచేసిన సీబీఐ

హైదరాబాద్‌లో మరో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయంలో సీనియర్ అధికారి నంటూ నమ్మింది, ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంస్థలను మోసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిపై  సీబీఐ కేసు నమోదు చేసింది. పీఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ ఎ.కె.శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 2న  కేసు నమోదైంది. కాగా పీఎంవో డైరెక్టర్ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో పీఎంఓ డిప్యూటీ  కార్యదర్శిగా పేర్కొంటూ ఈ లేఖను తిరుమల తిరుపతి దేవస్థానాల  కార్యనిర్వాహక అధికారికి వచ్చింది. పీఎంఓ లెటర్‌హెడ్‌పై ఉన్న ఈ లేఖలో  మే 10న తిరుమలలో మూడు ఎసీ డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయించడంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత దర్శనం కల్పించా లని కోరారు. తీర్థ దర్శనం కోసం వచ్చిన ఈ లేఖను టిటిడి అధికారులు పీఎంఓకి ధృవీకరణ కోసం పంపగా, పీఎంఓలో రామారావు అనే డిప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరనే విషయం  బయటపడింది. అయితే అధికారుల దర్యాప్తులో అదే వ్యక్తి, అదే మొబైల్ నంబర్ ఉపయో గించి ఆగస్టు 21న పూణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ  వైస్ ఛాన్స లర్‌ను సంప్రదించినట్లు తేలింది. ఈసారి అతను పీఎంఓ జాయింట్ సెక్రటరీగా పరిచ యం చేసుకొని ఎంబీఏ అడ్మిషన్‌ కావాలని సిఫార్సు చేశాడు.. అంతేకాకుండా ఆగస్టు 29న మరో నకిలీ లేఖ వెలుగులోకి వచ్చింది. పీఎంఓ జాయింట్ సెక్రటరీ సి.శ్రీధర్ పేరుతో మైసూరు తహసీల్దార్ కార్యాలయానికి లేఖ పంపించి, భూమి రికార్డులు ఇవ్వాలని అభ్యర్థించాడు. విచారణలో ఈ లేఖలో కూడా అదే మొబైల్ నంబర్ ఉపయోగించబడినట్లు పీఎంఓ గుర్తించింది. ఈ ఘటనలపై పీఎంఓ సమర్పించిన ఆధారాల మేరకు  సీబీఐ నిందితునిపై  మోసం, ఫోర్జరీ తో పాటు  ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66డి  కింద కేసు నమోదు చేసింది. నిందితుడి పూర్తి వివరాలు, అతని కార్యకలా పాల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వెలికితీయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఓటీపీతో పని లేకుండానే ఖాతాలు ఖాళీ!

బిగ్ బ్యాస్కెట్ పేరుతో బడా మోసం ఆన్ లైన్ మోసాలు మితిమీరి పోతున్నాయి. ఏది అస‌లో ఏది న‌కిలీయో తెలియనంతగా ఈ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి.  మీ బ్యాంకులో డ‌బ్బులుంటే చాలు అవి ఖాళీ చేయడానికి సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో దండెత్తుతున్నారు.   తాజాగా యూస‌ఫ్ గూడాలో ఓ వ్యక్తి  బిగ్ బాస్కెట్ పేరిట మోస పోయిన విధం దిగ్భ్రమగొల్పేలా ఉంది. అదెలాంటిదంటే మార్కెట్ రేట్ క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు కిరాణా స‌రుకులు. ఆల‌సించిన ఆశా భంగం. మంచి త‌రుణం మించిపోతోంద‌న్న ప్ర‌క‌ట‌న చూసి.. నిజంగానే ఇదంతా ద‌స‌రా, దీపావ‌ళి ఢ‌మాకా ఆఫ‌ర్ అనుకున్నాడు. దానికి తోడు అది షారూఖ్ ఖాన్ వంటి బడా స్టార్స్ ప్రమేట్  సేసే బిగ్ బాస్కెట్ కావ‌డంతో.. క్షణం ఆలోచించకుండా ఆ యాడ్ కు రెస్పాండ్ అయ్యాడు.  వాట్స‌ప్ ద్వారా వాళ్లు పంపిన‌ ఏపీకే లింక్  క్లిక్ చేశాడు. ఇలా క్లిక్ చేశాడో లేదో.. అలా కనీసం ఓటీపీ నంబర్ కూడా అడగకుండానే  ల‌క్షా 97 వేల రూపాయ‌ల‌ను అతడి బ్యాంక్ అక్కౌంట్ నుంచి ఖాళీ అయిపోయాయి. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించిందా వ్య‌క్తికి. ఇదేంటి? చౌక ద‌ర‌ల‌కు కిరాణా సామాన్లు వ‌స్తాయ‌నుకుంటే.. మ‌న  ద‌గ్గ‌ర నుంచి ఎలాంటి ఓటీపీ అడ‌క్కుండానే డ‌బ్బులాగేశారంటూ ల‌బోదిబోమ‌న‌డం అత‌డి వంత‌య్యింది. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న స్కాముల్లో ఓటీపీలు అడ‌గ‌టంతో డౌట్ వ‌చ్చేది. ఆ దిశ‌గా అందరూ చాలా వరకూ  అలెర్ట్ గా ఉంటున్నారు. ఇప్పుడు ఓటీపీ నంబర్ తో పని లేకుండా సొమ్ము ఖాతాల నుంచి ఖాళీ చేయడమనే కొత్త ట్రిక్ తో సైబర్ నేరగాళ్లు ఆరితేరిపోయారు.  అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆ లింక్  ఎక్క‌డి  నుంచి వ‌చ్చింది.. ఏంట‌న్న‌ది? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఇలాంటి లింకుల ప‌ట్ల అప్ర‌మత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. కాబ‌ట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటోంది సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్ మెంట్.

విమర్శనాత్మక కథనాలపై జర్నలిస్టులపై కేసులు సరికాదు.. సుప్రీం

విమర్శనాత్మక వార్తలు రాసే జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరైనది కాదని దేశ సర్వోత్తమ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలా కేసులు పెట్టడం భావ ప్రకటనాస్వేచ్ఛకు విఖాతం కిందకే వస్తుందని పేర్కొంది.  తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఓ జర్నలిస్టు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే సదరు జర్నలిస్టుపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి  ఆ జర్నలిస్టుకు అండగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి...  ఉత్తర్‌ప్రదేశ్‌లోని అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్ ప్రభుత్వ పాలనా విభాగంలో కుల సమీకరణాలకు సంబంధించి ఓ కథనం రాశారు. ఈ  వార్తా కథనం రాసినందుకు అభిషేక్ ఉపాధ్యాయపై  యూపీ సహా పలు ప్రాంతాలలో పోలీసు కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టివేయాలని కోరుతూ అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అభిషేక్ ఉపాధ్యాయ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం  ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని పేర్కొంది.  ప్రజాస్వామ్య దేశాల్లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలనీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉందని పేర్కొంది.  కేవలం జర్నలిస్టులు రాసిన కథనాలను విమర్శలుగా భావించి.. వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని కుండబద్దలు కొట్టింది.   తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.

లోకేష్.. బ్రేకింగ్ బౌండరీస్!

మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా క్రికెటర్లలో స్ఫూర్తి నింపే లక్ష్యంతో విశాఖలోని క్రికెట్ స్టేడియంలో రెండు స్టాండ్ లకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆయన ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ కు చెప్పారు. దీంతో ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ ఆ మేరకు నిర్ణయం తీసుకుని ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నంలోని వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రెండు స్టాండ్లకు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెటర్ రవికల్పన పేర్లు పెట్టనున్నట్లు ప్రకటించింది.  ఇప్పటి వరకూ ఒక స్టేడియంలో స్టాండ్ లకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టిన సందర్భం లేదు. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ తొలి సారిగా ముందుకు అడుగు వేసి ఇద్దరు మహిళా క్రికెటర్ల పేర్లను విశాఖ స్టేడియంలోని స్టాండ్ లకు పెట్టింది. ఇందుకు చొరవ చూపి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆ మేరకు ప్రకటించేలా చర్యలు తీసుకోవడం ద్వారా లోకేష్ తాను బౌండరీలను బ్రేక్ చేయడానికి సదా సిద్ధంగా ఉంటానని నిరూపించుకున్నారు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక లోకేష్ ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో బ్రేకింగ్ బౌండరీస్ అనే చర్చా కార్యక్రమంలో లోకేష్ కు స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా దేశంలోని క్రికెట్ స్టేడియంలలో స్టాండ్ లకు పురుష దిగ్గజ క్రికెటర్ల పేర్లే ఎందుకు ఉంటాయి, మహిళలకు గుర్తింపు ఎందుకు లేదు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మాటల్లో కాకుండా చేతల్లో సమాధానం చెప్పారు లోకేష్. ఆగస్టులో స్మృతి మంధానా దేశంలో మహిళా క్రికెటర్లకు గుర్తింపు ఏది? అన్న ప్రశ్నకు నెల తిరగకుండా లోకేష్ సమాధానం ఇచ్చారు. మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 12న విశాఖ స్టేడియంలో  భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ సందర్భంగా విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్ లకు మిథాలీరాజ్, రవి కల్పనల పేర్లు పెడుతూ ఆ ఇద్దరు క్రికెటర్లనూ ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ సన్మానించనుంది. స్టేడియంలో  ఒక స్టాండ్ కు మిథాలీరాజ్, ఒక గేటుకు రవి కల్పనల పేర్లు పెట్టడం భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే ఒక గొప్ప సంఘటనగా చెప్పవచ్చు.  ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్  లో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉంది. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లలో వరుస విజయాలతో జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్ చొరవతో ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత మహిళా క్రికెటర్లలో జోష్ మరింత పెరిగే అవకాశం ఉందని క్రీడా పండితులు చెబుతున్నారు.  భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే  అత్యంత విజయవంతమైన బ్యాట్స్ విమెన్ మిథాలీ రాజ్ ఆమె   తన కెరీర్ లో  సాధించిన విజయాలు భారత్ లో మహిళా క్రికెట్ కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయనడంలో సందేహంలేదు. తన కెరీర్ లో  మిథాలీ భారత్ తరపున 300 పైచిలుకు మ్యాచ్ లు ఆడి, పది వేల పరుగులకు పైగా సాధించారు. ఇక భారత మహిళా క్రికెట్ జట్టుకు సౌకర్యాలు, ప్రాధాన్యత, పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ పీజు వంటివి సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  ఇక రవి కల్పన ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్. ఆమె రాష్ట్ర క్రికెట్ నుండి భారత జట్టు వరకు ఎదిగిన ప్రయాణం అనేక మంది యువ మహిళా క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఇరువురినీ ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ సన్మానించి, గౌరవించడం ముదావహం. 

వివేకా హత్య కేసు.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత

వివేకా హత్య కేసు విచారణ కొనసాగించాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు ఇంకా బయటకు రావాల్సి ఉందని, విచారణ కొనసాగిస్తేనే అది జరుగుతుందని ఆమె సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి పిటిషన్ కాపీలను నిందితులకు అందేలా చూడాలన్నారు.  గతంలో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వంలో ఆటంకాలు కలిగించారని, అధికార దుర్వినియోగం జరిగిందని ధర్మాసనం వ్యాఖ్యా నించింది. దర్యాప్తును కొనసాగించాలని కోర్టు ఆదేశాసిస్తే కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. అయితే దర్యాప్తు కొనసాగింపుపై సుప్రీంకోర్టు.. నిర్ణయం తీసుకోకుండా,  ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎనిమిది వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం పేర్కొంది. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం  సూచనలతో వైఎస్ సునీత హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేసు విచారణ కొనసాగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.  

పిల్లల పంచాయతీకి ఓ తండ్రి బలి

పిల్లల పంచాయతీకి ఓ తండ్రి బలి అయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ ఔషపూర్ లో నివాసం ఉంటున్న అమీర్ అనే వ్యక్తి ఇద్దరు చిన్నారులు గొడవ పడుతూ ఉంటే వారిని గట్టిగా మందలించాడు. అదే ప్రాంతానికి చెందిన ఆలీ అనే వ్యక్తి  నా కొడుకునే మందలిస్తావా అంటూ ఆగ్రహంతో  ఊగిపోయాడు. అమీర్ ఇంటికి వెళ్లి  దాడికి పాల్పడ్డాడు.  ఇరు కుటుంబ సభ్యులు వచ్చి అలీని అడ్డుకున్నారు.   నచ్చచెప్పి ఇంట్లోకి తీసుకు వెళ్లారు.. అయితే ఈ దాడి తరువాత  అమీర్ తనకు  ఛాతీ లో  బాగా నొప్పిగా ఉందని భార్యతో చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై అమీర్ ను హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గంలోనే  మరణించాడు.  విషయం తెలుసు కున్న వెంటనే దాడికి పాల్పడ్డ అలీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అలీ దాడి చేయడం వల్లనే అమీర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఆందో ళన చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ చిన్న గొడవ కారణంగా ఓ తండ్రి మరణించగా... మరో తండ్రి జైలు పాలు అవ్వాల్సి వచ్చింది. అలా రెండు కుటుంబాలూ శోకంలో మునిగిపోయిన పరిస్థతి ఏర్పడింది. 

స‌నాత‌న ధ‌ర్మం ఎంత ప‌ని చేసిందో చూశారా!?

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ అన్న‌ది నేడు ఒక జాతీయ హీరోయిజం కింద మారిపోయింద‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. సుప్రీం చీఫ్ జ‌స్టిస్ గ‌వాయ్ పై సీనియ‌ర్ లాయ‌ర్ రాకేశ్ కిశోర్ దాడి యత్నం ఘ‌ట‌న‌  ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా  చ‌ర్చ‌కు దారి తీసింది. సాధార‌ణంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, న్యాయ‌వాది మ‌ధ్య ఎంతో ప్ర‌త్యేక అనుబంధం ఉంటుంది. మాములుగా  న్యాయ‌మూర్తి ప‌ట్ల‌ న్యాయ‌వాదులు ఎంతో గౌర‌వ భావంతో, భ‌య‌భ‌క్తుల‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అలాంటిది ఒక న్యాయ‌వాది.. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ పై ఇలా దాడికి ప్రయత్నించడం వెనుక ఉన్న వెన్ను ద‌న్ను.. స‌నాత‌న ధ‌ర్మ‌మేనంటారు పరిశీలకులు. ఇంత‌కీ ఈ లాయర్ ఎందుక‌ని ఒక చీఫ్ జ‌స్టిస్ దాడి చేయాలనుకున్నారంటే.. ఇటీవ‌ల జ‌స్టిస్ గ‌వాయ్ విష్ణుమూర్తిపై చేసిన కామెంట్లే కారణమని  భావిస్తున్నారు. మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ఖ‌జ‌ర‌హో- జ‌వారీ ఆల‌యంలోని విష్ణుమూర్తి విగ్ర‌హం మొఘ‌లాయిల‌ కాలంలో ధ్వంసమైంది.  ఈ విగ్ర‌హాన్ని పునః ప్ర‌తిష్ట‌ చేయాలంటూ  పిటిష‌న్ దాఖలైంది. ఆ కేసు విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ గ‌వాయ్.. మీరు విష్ణు భ‌క్తులు క‌దా? అయితే ఆ విష్ణుమూర్తినే వేడుకోండి! అంటూ  కామెంట్ చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా ఇది ప్ర‌జా వాజ్యం కాదు.. ప‌బ్లిసిటీ స్టంట్ లో భాగం అంటూ ప‌రుషంగా మాట్లాడ్డం  లాయ‌ర్ రాకేశ్ కిశోర్ కోపానికి కారణమైంది. ఆ కారణంగానే లాయర్ రాకేష్ కిషోర్   జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి ప్రయత్నించాడని అంటున్నారు. ఈ దాడి యత్నం తరువాత న్యాయవాది రాకేష్ కిషోర్ ను అరెస్టు చేయలేదు..   మూడు గంట‌ల పాటు విచారించి ఆయ‌న గవాయ్ పైకి విసరబోయిన బూటు ఆయ‌న‌కిచ్చి వ‌దిలేశారు.  అయితే బార్ కౌన్సిల్ స‌భ్య‌త్వం తాత్కాలికంగా ర‌ద్దు చేసి, ఆపై దేశంలో ఎక్క‌డా వాదించ‌కుండా ఆదేశాలు జారీ  చేశారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే ఒక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిపై దాడి చేయబోయిన లాయర్ రాకేష్ కిషోర్ పై   కేసు న‌మోదు చేయ‌డానికి రిజిస్ట్రార్ సైతం ఒప్పుకోక పోవ‌డం. గ‌తంలో ప్ర‌శాంత్ భూష‌ణ్ అనే లాయ‌ర్ పై కూడా సుప్రీం కోర్టు ఇలాగే ఒక్క రూపాయ ఫైన్ వేసింది. అది భావ‌ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన విష‌యం కాగా, ఇది సీజేఐపైనే  దాడి య‌త్నం చేసిన ఘ‌ట‌న‌.  వీట‌న్నిటిని బ‌ట్టి చూస్తుంటే స‌నాత‌న ధ‌ర్మం అండ‌తో సుప్రీం చీఫ్ జ‌స్టిస్ అని కూడా చూడ‌కుండా దాడియత్నానికి తెగ‌బ‌డుతున్నారంటే దేశంలో సనాత‌న ధ‌ర్మం ఇస్తోన్న దైర్యం ఏపాటిదో అర్ధం చేసుకోవ‌చ్చంటున్నారు సామాజిక‌వేత్త‌లు.

బీహార్ ఫ‌లితాల‌తో ఓట్ చోరీ.. ఆరోపణల నిగ్గు తేలనుందా?

అటు బీహార్  ఎన్నిక‌తో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  షెడ్యూల్ కూడా విడుద‌లైంది. న‌వంబ‌ర్ 6, 11వ తేదీల్లో బీహార్ లో రెండు విడ‌త‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. అదే నెల 14న ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. బీహార్ సీట్ల సంఖ్య 243 కాగా, ఓట‌ర్ల సంఖ్య 7. 43 కోట్లుగా ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంగ‌తేంట‌ని చూస్తే.. న‌వంబ‌ర్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 13 నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నుండ‌గా.. 21 తుదిగ‌డువు. 22వ తేదీ ప‌రిశీల‌న‌, 24వ తేదీ ఉప‌సంహ‌ర‌ణ‌. కాగా న‌వంబ‌ర్ 14న ఈ ఉప‌ ఎన్నిక ఫ‌లితం కూడా తేల‌నుంది.  ఈ రెండు ఎన్నిక‌లు కాంగ్రెస్ కి ఎంత కీల‌క‌మంటే.. ఒక ప‌క్క దేశ వ్యాప్తంగా రాహుల్ ఓట్ల చోరీ ప్ర‌చారం చేయ‌డంతో పాటు బీహార్ లో ప్ర‌త్యేకించి ఆయ‌న యాత్ర నిర్వ‌హించారు. ఎందుకంటే బీహార్ లో సుమారు 45 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించ‌డంతో.. రాహుల్ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ పై ప్రెజంటేష‌న్లిచ్చి.. ఈసీ ని ఇరుకున పెట్టే య‌త్నం చేశారు. ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మ‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై  రియాక్ట‌యిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాల‌తో స‌హా కంప్ల‌యింట్  చేయాల‌ని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని  వారించారు. తాను ప్ర‌త్యేకించీ ఆధారాలు చూపించ‌న‌క్క‌ర్లేద‌నీ.. త‌న ప్రెజంటేష‌న్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్.  ఏది ఏమైనా రాహుల్ ఓట్ల చోరీ ప్ర‌చార‌మంతా కూడా బీహార్ ఎన్నిక‌ల‌ను  దృష్టిలో పెట్టుకుని చేసిందే. దానికి తోడు ఆయ‌న ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసిన యాత్ర కూడా ఇదే చెబుతోంది. ఇప్పుడు రాహుల్ ఓట్ చోరీ ప్ర‌చారం జ‌నం న‌మ్మారా లేదా? అన్న‌ది ఈ ఎన్నిక‌ల ఫ‌లితం తేల్చేస్తుందంటున్నారు పరిశీలకులు.  కాబ‌ట్టి ఈ రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలను బ‌టి కాంగ్రెస్  ఎలిగేష‌న్లు జ‌నం సీరియ‌స్ గా తీస్కుంటున్నారా లేదా? అన్నదానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.  ఇక చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్ధిగా మాగంటి స‌తీమ‌ణి సునీత‌ను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ బై పోల్ కూడా  కాంగ్రెస్ కి అగ్ని ప‌రీక్షేనని చెప్పాలి. రేవంత్ స‌ర్కార్ హైద‌రాబాద్ లో హైడ్రా ప్ర‌యోగం ద్వారా చేసిన మేలు ఎలాంటిదో చెప్పలేం కానీ..  జ‌నం మాత్రం బ్యాడ్ గా ఫీల‌వుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి  తోడు హ‌రీష్ రావ్ ఇక్క‌డ ఎక్కువ‌గా ఉన్న మైనార్టీ  ఓటు బ్యాంకును టార్గెట్ చేస్కుని..  ఈ క‌మ్యూనిటీకి ఒక్క మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.  ఆపై ఇక్క‌డ అధికంగా ఉండే  సినీ జ‌నం, అందునా  ఎక్కువ‌గా ఉండే క‌మ్మ సామాజిక వ‌ర్గం. వీట‌న్నిటినీ  క‌వ‌ర్ చేయ‌డానికి మాగంటి సామాజిక వ‌ర్గం స‌రిపోతుంద‌ని భావిస్తోంది కారు పార్టీ. దీంతో ఈ గెలుపు త‌మ‌కు న‌ల్లేరు  న‌డకే అన్న ఊహ‌ల్లో ఉంది గులాబీ దండు.  అయితే కాంగ్రెస్ మాత్రం ఎట్ట‌కేల‌కు జూబ్లీహిల్స్  ద్వారా మ‌రో కంటోన్మెంట్ రిజ‌ల్ట్ రిపీట్ చేయాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది. ఇక ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ న‌ట‌రాజ‌న్ అయితే ఈ సీటు ఎలాగైనా స‌రే కైవ‌సం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా బీహార్ పోల్, జూబ్లీ బై పోల్ కాంగ్రెస్ కి రెఫ‌రండంగా మార‌నున్నాయ‌నే అంటున్నారంతా. మ‌రి చూడాలి.. ఈ ఫ‌లితాలు కాంగ్రెస్ కి ఎంత అనుకూలంగా వ‌స్తాయో తెలియాలంటే మ‌నం న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

దేశం అభ్యంతరాలు బేఖాతర్.. మిథున్ రెడ్డికే కేంద్రం ఇంపార్టెన్స్!

తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత సరే.. అసలు వైసీపీ విషయంలో కేంద్రం పెద్దలకు ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా? ఆ పార్టీ నేతలకు కేంద్రం పెద్దల వద్ద ప్రాముఖ్యత ఇసుమంతైనా తగ్గలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔనని అనక తప్పదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన మిథున్ రెడ్డికి ఐరాస (ఐక్యరాజ్యసమితి) జనరల్ అసెంబ్లీకి వెళ్లే భారత ప్రతినిథుల బృందంలో చోటు కల్పించింది. తనకీ అరుదైన గౌరవం ఇచ్చినందుకు మిథున్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ణతలు తెలిపారు. అంతే కాదు.. ఆ బృందంలో ఇటా చోటు దక్కగానే, అలా  పాస్ పోర్టు కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసేశారు. ఈ నెల 27 నుంచి న్యూయార్క్ లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి హాజరయ్యే భారత ఎంపీల బృందాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వం వహించే ఈ బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు దక్కింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.   ప్రపంచ దేశాలు శాంతి, భద్రత, మానవ హక్కులు, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి అత్యంత కీలకమైనఅంశాలపై చర్చించే వేదిక అయిన ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉండి, ఇటివలే బెయిలుపై బయటకు వచ్చిన మిథున్ రెడ్డికి  చోటు కల్పించడంపై తెలుగుదేశం వర్గాలలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మిథున్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా.  అదలా ఉంటే ఐరాసా జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలక మద్దతు దారుగా ఉన్న తెలుగుదేశం నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.  చోటు దక్కకపోవడం అటుంచి.. మిథున్ రెడ్డి ఎంపికను తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కూడా కేంద్రం పెద్దలు లెక్క చేయలేదు. నిందితుడు మాత్రమే కదా.. నేరం రుజువు కాలేదుగా అంటూ తేలిగ్గా తీసుకున్నారు.  గతంలో అంటే 2014లో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ లో భాగస్వామ్య పార్టీగా ఉంది. అప్పట్లో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కంటే.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకే కేంద్రం ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. మంగళవారం (అక్టోబర్ 7) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్  గంగమ్మ ఆలయం వరకూ సాగింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.  300 రూపాయల  ప్రత్యేక దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 76 వేల 733 మంది దర్శించుకున్ు. వారిలో 29,100 మంది భక్తులు  తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  రూ.4.16 కోట్లు వచ్చింది. 

అమెరికాకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి... ఎందుకంటే?

  ఏపీ లిక్కర్ స్కామ్‌లో  బెయిల్ పొందిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితి  సమావేశాలకు వెళ్లే భారత పార్లమెంట్ సభ్యుల బృందంలో మిథున్ రెడ్డికీ అవకాశం లభించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన తన పాస్‌పోర్టు విడుదల కోసం కోర్టును ఆశ్రయించారు. ఐక్యరాజ్య సమాఖ్య జనరల్ అసెంబ్లీ  80వ సెషన్ అక్టోబర్ 27 నుంచి న్యూయార్క్‌లో ప్రారంభమవనుంది. ఈ సమావేశానికి భారత్ తరపున మొత్తం 16 మంది ఎంపీలు హాజరుకానున్నారు. వీరిలో తెలుగు దేశం పార్టీ నుంచి ఎవరూ లేరు, కానీ వైసీపీకి చెందిన మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు. ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పురందేశ్వరి ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. అందుకే మరో ఎంపీకి అవకాశం ఇవ్వలేదని సమాచారం. UNGA సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమవుతాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ సెప్టెంబర్ 27న ప్రధాన ప్రసంగం చేస్తారు. అక్టోబర్ 27 నుంచి జరిగే పార్లమెంటరియన్ల స్పెషల్ డెలిగేషన్‌లో మిథున్ రెడ్డి కూడా ఉంటారు. ఈ బృందం పోస్ట్-హై లెవల్ ఈవెంట్స్‌, సైడ్‌లైన్ మీటింగ్స్‌, దౌత్య చర్చల్లో పాల్గొంటుంది. ఇదే సమయంలో, మిథున్ రెడ్డి తన పాస్‌పోర్టు విడుదల కోసం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు

హైదరాబాద్‌లో ఎకరం రూ.177 కోట్లు

  హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ  నిర్వ హించిన రాయదుర్గం భూవేలంలో ఎకరానికి రూ.177 కోట్లు పలకడంతో కొత్త రికార్డు నమోదైంది. మొత్తం 7.67 ఎకరాల భూమిరూ.1357.59 కోట్లకు అమ్ము డైంది.ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రికార్డు స్థాయి ధర. గతంలో కోకాపేట నియో పోలిస్‌ ప్రాంతంలో హెచ్‌ఎండీఎ నిర్వహించిన వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికిన రికార్డును రాయదుర్గం భూ వేలం పాట బద్దలు కొట్టింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసానికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు..ఈ వేలంలో ప్రముఖ జాతీయ, ప్రాంతీయ డెవలపర్లు భారీగా పాల్గొన్నారు. ఇది హైదరాబాద్ స్థిరమైన వృద్ధి, ప్రభుత్వ పారదర్శక విధానాలు, నాలెడ్జ్ సిటీ మధ్యలో ఉన్న రాయదుర్గం వ్యూహాత్మక ప్రాధాన్యం — అన్నీ కలిపి పెట్టుబడి దారుల విశ్వాసాన్ని ప్రతిబింబించింది.ఈ సందర్భంగా TGIIC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక, IAS మాట్లాడుతూ...రాయదుర్గం వేలం విజయం తెలంగాణ కు గర్వకారణమని అన్నారు. ఎకరానికి రూ.177 కోట్ల రికార్డు ధర పలకడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. .. హైదరా బాద్ యొక్క దీర్ఘకా లిక సామర్థ్యాన్ని, తెలంగాణ రైజింగ్–2047 దిశగా రాష్ట్రం సాగుతున్న దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మద్దతుతో, పారదర్శకమైన, వ్యాపారానుకూల వాతావరణాన్ని సృష్టించాలనే ప్రభుత్వ దార్శనికత కు ఇది నిదర్శన మని పేర్కొన్నారు. భూమి విలువ పెరుగుదలలో ఇది ఒక కొత్త మైలు రాయి అని అన్నారు.  2017లో రాయదుర్గం 2.84 ఎకరాలు ఎకరానికి రూ.42.59 కోట్లు పలికాయి. 2022లో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికాయి.2025లో రాయదుర్గం ఎకరానికి రూ.177 కోట్లు పలకడం ద్వారా నాలుగు రెట్ల వృద్ధి సాధించింది. వేలం విజయ వంతం కావడంలో కీలక పాత్ర పోషించిన TGIIC బృందం, JLL మరియు MSTC సభ్యులకు శశాంక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహకారం, బిడ్డర్లు చూపిన విశ్వాసమే ఈ చారిత్రాత్మక ఫలితానికి కారణమని ఆయన పేర్కొన్నారు.  

హైడ్రాను అభినందించిన హైకోర్టు

  భూ కబ్జాదారులపై కొరడా ఝళిపిస్తూ చెరువులను రక్షించ డమే కాకుండా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించడం, వరదల్లో చిక్కు కున్న వారిని రక్షించడం ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్న హైడ్రాను హైకోర్టు ప్రశంసిం చింది. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధి ని ఓ య‌జ్ఞంలా చేస్తోంద‌ని కితా బిచ్చింది. అందుకు న‌గ‌రంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్య మ‌ని పేర్కొంది.  మ‌రీ ముఖ్యంగా బ‌తుక‌మ్మ‌కుంట అభివృద్ధిని చూస్తే ముచ్చ‌టేస్తోందని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్‌సేన్‌రెడ్డి ప్రశంసించారు. ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై చెత్త‌కుప్ప‌లా, పిచ్చిమొక్క‌ల‌తో అటువైపు చూడాలంటేనే భ‌యంగా ఉన్న ప్రాంతాన్ని సైతం చెరువుగా అభివృద్ధి చేసిన తీరు హ‌ర్ష‌ణీయం అంటూ అభినందించారు.  బ‌తుక‌మ్మ‌కుంట స‌ర్వాంగ సుంద‌రంగా మారి.. ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో నివసించే ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోంది. బతుకమ్మ కుంట ను అభివృద్ధి చేయడంతో అక్కడ నివసించే ప్రజలు ఆనందం అంతా ఇంతా కాదు... ఆ ప‌రిస‌ర ప్రాంతా ల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పించ‌డ‌మే కాకుండా.. భూగ‌ర్భ జ‌లాల‌ను కూడా పెంచింది. గ‌చ్చిబౌలి లోని మ‌ల్కం చెరువును చూసినా కూడా  ఎంతో ఆహ్లా దంగా క‌నిపిస్తోంది.న‌గ‌రంలో ఇలాగే మ‌రో 5 చెరువుల అభివృద్ధి జ‌రుగుతోంది. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల ప‌రిధిలో ఎవ‌రివైనా ఇంటి స్థ‌లాలు, భూములు ఉంటే టీడీఆర్ (ట్రాన్స‌ఫ‌ర‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్స్‌) కింద వారికి స‌రైన న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి. ప్ర‌భుత్వం ఇందుకోసం స‌రైన విధానాన్ని తీసుకురావాలని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్‌ సేన్‌రెడ్డి సూచించారు. మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట చెరువు ప‌రిధిలోని రెండు ఎక‌రాల‌కు సంబంధించిన టీడీఆర్ కేసు విచార‌ణ‌లో హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్ సేన్ రెడ్డి ఈరోజు సోమ‌వారం ఈ వ్యాఖ్య‌లు చేశారు.  టీడీఆర్ విష‌ యంలో ప్ర‌భుత్వం స‌రైన విధానాన్ని పాటిస్తే.. చెరువుల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం ఏర్ప‌డ‌దని అన్నారు. టీడీఆర్ కేసును వాదిస్తున్న సీనియ‌ర్ న్యాయ‌వాది ఎస్ శ్రీ‌ధ‌ర్  కూడా జ‌స్టిస్ విజ‌య్‌సేన్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఏకీభావించారు. బ‌తుక‌మ్మ కుంట ప్ర‌స్తావ‌న తీసుకు వ‌చ్చి హైడ్రా ప‌నితీరుకు ఇది నిద‌ర్శ‌న‌మంటూ న్యాయవాది శ్రీ‌ధ‌ర్ కితాబు ఇచ్చారు. త‌మ్మిడికుంట‌లో భూములు కోల్పోయిన వారికి స‌రైన టీడీఆర్ అందించాలంటూ న్యాయవాది శ్రీధ‌ర్‌ విజ్ఞ‌ప్తి  చేశారు. హైడ్రా ఒకవైపు చెరువులను అభివృద్ధి చేస్తూనే ఆపదలో ఉన్న వారిని రక్షిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్‌ సేన్‌రెడ్డి అన్నారు.

భారత రక్షణ రంగంలో మరో యాంటి సబ్ మెరైన్ యుద్ధ నౌక

  భారత రక్షణ రంగంలో మరో శక్తివంతమైన యుద్ధనౌక చేరింది.  80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ యద్ద నౌక శత్రు దేశాల సబ్ మెరైన్లను సమర్ధవంతంగా ఎదుర్కోగల సాంకేతిక సామర్థ్యంతో రూపొందించారు . వార్ ఫేర్ సబ్మెరైన్ హంటర్ వాటర్ క్రాఫ్ట్ సిరీస్ రెండు  తరహా కు చెందిన ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనే ఈ యుద్ధ నౌకను తూర్పు నౌకాదళ  కేంద్రం విశాఖలో ప్రారంభించడం జరిగింది. తూర్పునౌకదల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెన్దర్కర్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 77 మీటర్ల పొడవు 1500  బరువుతో రూపొందించిన ఈ యాంటి సబ్మెరైన్ షిప్ కు లక్షద్వీప్ లోని ఒక ఐలాండ్ పేరు ఆండ్రోత్ గా పెట్టారు. ఈ యుద్ధనౌక జల ప్రవేశంతో తూర్పు తీరంతో పాటు భారత రక్షణ రంగం మరింత సమర్థవంతంగా మారినట్టు అయింది

మావోయిస్టు నాయకుడు మల్లోజుల సంచలన ప్రకటన

  మావోయిస్టు పోలీస్ బ్యూరో సభ్యుడు మల్లోజుల సంచలన ప్రకటన చేశారు. తాను ఇకపై పార్టీలో కొనసాగబోనని, అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆయుధాలను విడిచి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మరోసారి ప్రకటించారు. ఈ మేరకు ఆయన 22 పేజీల లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మల్లోజుల మాట్లాడుతూ – “చేసిన తప్పులకు, ఉద్యమాన్ని ఓటమి పాలవకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ మీ అందరికి క్షమాపణలు చెబుతున్నాను. ఇంతటి నష్టాలకు దారి తీసిన విప్లవోద్యమానికి నేను నాయకత్వం వహించాను. ఇకపై ఈ బాధ్యతల్లో కొనసాగడానికి నేను అర్హుడిని కాను” అని పేర్కొన్నారు.  “పార్టీ అత్యంత క్లిష్టమైన సమయంలో ఈ నిర్ణయం సరైంది కాదని మీరు భావించవచ్చు. కానీ పార్టీని కాపాడుకోవడానికి, సరైన నాయకత్వాన్ని కేడర్లు ఎంచుకోవడానికి ఇది అవసరం. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను,” అని పేర్కొన్నారు. మల్లోజుల తన లేఖలో పార్టీ కేంద్ర కమిటీలోని అంతర్గత విషయాలను కూడా ప్రస్తావించారు. “సుదీర్ఘకాల విప్లవాచరణలో చేసిన తప్పుల మూలంగా మన ఉద్యమం దెబ్బతింది. ఇప్పటివరకు నేను క్రమశిక్షణతోనే పార్టీ చర్చల్లో పాల్గొన్నాను, కానీ ఇప్పుడు నా నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు వెల్లడించక తప్పదు,” అని తెలిపారు.   – “విప్లవోద్యమం ఏండ్ల తరబడి తప్పిదాల వల్ల దెబ్బతింటోంది. మన పంథా సరిగా ఉందని చెప్పుకుంటున్నప్పటికీ, అది ఉద్యమ పురోగతికి ఎందుకు దోహదం కావడంలేదని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడమే విప్లవ చైతన్యానికి మార్గం. గతపు తప్పులనుంచి పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తులో విజయాలు సాధించగలుగుతాం,” అని మల్లోజుల పేర్కొన్నారు. “ఇప్పుడైనా మనకు సానుకూల మార్పు అవసరం. ఉద్యమాన్ని కాపాడుకోవడం, కేడర్లను రక్షించుకోవడం మన మొదటి కర్తవ్యం. అనవసర త్యాగాలకు ముగింపు పలుకుదాం. కొత్త దారుల్లో ముందుకు సాగుదాం. చివరికి విజయం ప్రజలదే,” అని తన లేఖను ముగించారు.