హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త, గుంతలు కనిపించొద్దు : సీఎం రేవంత్
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కోర్-అర్బన్ రీజియన్‌ను సమగ్రంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని హైదరాబాద్ నగర జోనల్ కమిషనర్లను సీఎం ఆదేశించారు. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో అతి సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. ఈ విషయంలో అలసత్వం వద్దని జోనల్ కమిషనర్లు దీనికి బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నగర పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నగరంలో చెత్త నిర్వహణ అత్యంత క్లిష్టమైన సమస్యగా మారింది. ఈ అంశంపై జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చెత్త నిర్వహణతో పాటు జోన్ల వారీగా ప్రజల సమస్యల పరిష్కారం జోనల్ కమిషనర్ల ప్రధాన బాధ్యత. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పరిశీలనలు తప్పనిసరిగా చేయాలి.నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వ లక్ష్యం. దశలవారీగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిదీ” అని సీఎం స్పష్టం చేశారు.
ఎక్కడా చెత్త, గుంతలు కనిపించకూడదునెలకు మూడు రోజులు శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.ప్రతి పది రోజులకు ఒకసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలి. దోమల నివారణతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్-అర్బన్ ఏరియాలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర పౌరసేవలకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. మీసేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి సీఎం తెలిపారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలని తెలిపారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు సమన్వయంతో పని చేయాలి. జనవరిలో నాలాల పూడిక తీత పనులు మొదలు పెట్టాలి.
నగరంలో వీధి దీపాల నిర్వహణలో లోపం ఉండొద్దు. CURE ఏరియాలో వివిధ విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకోవాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్లు వారి పరిధిలో చర్యలు చేపట్టాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వీలయినంత వేగంగా స్పందించాలి. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు