సనాతన ధర్మం ఎంత పని చేసిందో చూశారా!?
posted on Oct 7, 2025 @ 10:21AM
సనాతన ధర్మ పరిరక్షణ అన్నది నేడు ఒక జాతీయ హీరోయిజం కింద మారిపోయిందనడానికి ఇదో ఉదాహరణ. సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్ పై సీనియర్ లాయర్ రాకేశ్ కిశోర్ దాడి యత్నం ఘటన ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాది మధ్య ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. మాములుగా న్యాయమూర్తి పట్ల న్యాయవాదులు ఎంతో గౌరవ భావంతో, భయభక్తులతో వ్యవహరిస్తుంటారు.
అలాంటిది ఒక న్యాయవాది.. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఇలా దాడికి ప్రయత్నించడం వెనుక ఉన్న వెన్ను దన్ను.. సనాతన ధర్మమేనంటారు పరిశీలకులు. ఇంతకీ ఈ లాయర్ ఎందుకని ఒక చీఫ్ జస్టిస్ దాడి చేయాలనుకున్నారంటే.. ఇటీవల జస్టిస్ గవాయ్ విష్ణుమూర్తిపై చేసిన కామెంట్లే కారణమని భావిస్తున్నారు. మధ్య ప్రదేశ్ లోని ఖజరహో- జవారీ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం మొఘలాయిల కాలంలో ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. ఆ కేసు విచారణ సమయంలో జస్టిస్ గవాయ్.. మీరు విష్ణు భక్తులు కదా? అయితే ఆ విష్ణుమూర్తినే వేడుకోండి! అంటూ కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా ఇది ప్రజా వాజ్యం కాదు.. పబ్లిసిటీ స్టంట్ లో భాగం అంటూ పరుషంగా మాట్లాడ్డం లాయర్ రాకేశ్ కిశోర్ కోపానికి కారణమైంది. ఆ కారణంగానే లాయర్ రాకేష్ కిషోర్ జస్టిస్ గవాయ్ పై దాడికి ప్రయత్నించాడని అంటున్నారు.
ఈ దాడి యత్నం తరువాత న్యాయవాది రాకేష్ కిషోర్ ను అరెస్టు చేయలేదు.. మూడు గంటల పాటు విచారించి ఆయన గవాయ్ పైకి విసరబోయిన బూటు ఆయనకిచ్చి వదిలేశారు. అయితే బార్ కౌన్సిల్ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు చేసి, ఆపై దేశంలో ఎక్కడా వాదించకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే ఒక ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయబోయిన లాయర్ రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేయడానికి రిజిస్ట్రార్ సైతం ఒప్పుకోక పోవడం.
గతంలో ప్రశాంత్ భూషణ్ అనే లాయర్ పై కూడా సుప్రీం కోర్టు ఇలాగే ఒక్క రూపాయ ఫైన్ వేసింది. అది భావప్రకటనకు సంబంధించిన విషయం కాగా, ఇది సీజేఐపైనే దాడి యత్నం చేసిన ఘటన. వీటన్నిటిని బట్టి చూస్తుంటే సనాతన ధర్మం అండతో సుప్రీం చీఫ్ జస్టిస్ అని కూడా చూడకుండా దాడియత్నానికి తెగబడుతున్నారంటే దేశంలో సనాతన ధర్మం ఇస్తోన్న దైర్యం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చంటున్నారు సామాజికవేత్తలు.