టీచర్ కు ప్రేమ వల.. రూ. 2.3 కోట్ల టోకరా

ప్రేమ పేరుతో  అమాయక మహిళలు ఎలా మోసపోతారనడానికి తార్కానంగా నిలుస్తుందీ సంఘటన. మంచి మాటలు, సానుభూతి వ్యాఖ్యలకు మోసపోయి కొత్తవారిని గుడ్డిగా నమ్మకూడదనడానికి నిదర్శనంగా నిలుస్తుందీ ఉదంతం.  ఆన్‌లైన్ పరిచయాల్లో వ్యక్తిగత వివరాలను పంచుకునే సమయంలో జాగ్రత్త వహించాలని విషయాన్ని తెలియజేస్తుందీ ఘటన.. ఇంతకీ విషయమేంటంటే.. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల నుండి మనం తీసుకోవలసిన పాఠం ఏంటంటే, నమ్మకంతోపాటు జాగ్రత్త కూడా అవసరం. ఇలాంటి సంఘటనలకు గురి కాకుండా, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.ఒంటరి తనం భరించలేక తోడు కావాలని ఆశపడటమే ఆ టీచర్ చేసిన పాపం. లేటు వయసులో తోడు కోసం ఆరాటపడిన ఆ టీచరమ్మ మాట్రిమోనియల్ సైట్ లో తన వివరాలు నమోదు చేశారు. ఆమో వయస్సు 59 ఏళ్లు. భర్త మరణంతో ఒంటరిగా జీవించడం కష్టంగా ఉండటంతో ఆమె మాట్రిమోనియల్ సైట్ ను ఆశ్రయించారు. ఆ సైట్ లో ఆమె వివరాలు చూసిన అహాన్ కుమార్ అనే వ్యక్తి తాను అట్లాంటాలో ఇంజినీర్ గా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. తన ఐడీ కార్డు కూడా చూపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలోకి దింపాడు.  అప్పటి నుంచి అంటే 2020 నుంచి 2024 వరకూ నాలుగేళ్ల పాటు వివిధ కారణాలు చెప్పి ఆ టీచరమ్మ నుంచి సొమ్ములు దండుకున్నాడు. నాలుగేళ్లలో ఆ టీచర్ నుంచి దాదాపు 2.3 కోట్లు రాబట్టిన అహాన్ కుమార్ ఆ తరువాత మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ టీచర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేసింది.   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో 9పై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం (అక్టోబర్ 9)న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ..  57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలిందనీ,  బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు నివేదిక ఎందుకని వాదించారు. అలాగే రిజర్వేషన్ల బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదన్నారు. అలాగే నిర్ణీత గడువులోగా గవర్నర్‌  ఆమోదించకపోతే దానిని చట్టంగా భావించాల్సి ఉంటుందని వాదించారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చిన  సుదర్శన్‌ రెడ్డి, నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుందని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్‌ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరని వాదించారు. తెలంగాణ ప్రభుత్వం  రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో  తెచ్చిందని వాదించారు. 

బీహార్‌లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం : తేజస్వి యాదవ్

  బీహార్ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు దీనికి సంబంధించి చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు. 20 నెలల్లోపు నిరుద్యోగం లేని బీహార్‌ను చూపిస్తామని స్పష్టం చేశారు.  యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్డీఏ సర్కార్ నిరుద్యోగ భృతి ఇస్తోందని తేజస్వి విమర్శించారు. మరోవైపు బీహార్‌లో 2.9కోట్ల కుటుంబాలున్నాయని హామీ ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల వేళ కొండ మీది కోతినైనా తెస్తామని నేతలు చెబుతారని పలువురు విమర్శిస్తున్నారు. ఉద్యోగాలు వేలల్లో భర్తీకే ఏళ్లు పడతాయి. అలాంటిది తాము ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.  బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది సాధ్యమయ్యే విషయమే కానీ, దానికి బలమైన సంకల్పం అవసరమని అన్నారు. తమ హామీలను ఎన్డీఏ కూటమి నకలు చేస్తోందని విమర్శించారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఒక వైపు ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, మరో వైపు ఎన్నికల వ్యూహకర్త మరియు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా తన పార్టీ తరఫున పోరాటానికి సిద్ధమవుతున్నారు.

స్థానిక ఎన్నికలకు బ్రేక్.. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

  స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్, జీవోలపై స్టే ఇస్తూ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు విచారణకు మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ నాలుగు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.  

జగన్ కు నర్సీపట్నంలో నిరసనల సెగ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం పర్యటన రసాబాసగా మారింది. ఆయన   పర్యటన సందర్భంగా నర్సీపట్నం వ్యాప్తంగా దివంగత డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు ఆయనకు స్వాగతం పలికాయి. కరోసా సమయంలో డాక్టర్లకు కనీసం మాస్కు కూడా ఇవ్వలేకపోయిందంటూ అప్పటి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన కారణంగా దళితుడైన  డాక్టర్ సుధాకర్ పై  అప్పటి జగన్ సర్కార్ అత్యంత అమానుషంగా వ్యవహరించింది. ఆయన విమర్శలను సాకుగా చూపుతూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిది. అంతటితో ఆగకుండా సుధాకర్ ను విశాఖలోని పోర్టు ఆస్పత్రి జంక్షన్ వద్ద మండుటెండలో అర్థనగ్నంగా మోకాళ్లపై కూర్చోపెట్టి చేతులు, కాళ్లకు తాళ్లు కట్టి మరీ పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతే కాకుండా ఆయనపై పిచ్చివాడన్న ముద్ర వేశారు. దీనిపై అప్పట్లో ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అనంతరం డాక్టర్ సుధాకర్ మరణించారు. వైసీపీ వేధింపుల కారణంగానే సుధాకర్ మరణించినట్లు ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశాయి.  ఇప్పుడు ఇన్నేళ్లకు జగన్ మెడికల్ కాలేజీ సందర్శన అంటూ నర్సీపట్నం పర్యటనకు వచ్చిన సందర్భంగా దళిత సంఘాలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ గోబ్యాక్ అని నినదిస్తూ నర్నీపట్నంలో మానవహారంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాయి. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను అన్యాయంగా చంపేశారంటూ విమర్శలు గుప్పించాయి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పి నర్సీపట్నంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశాయి.  ఓ వైపు నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు, మరో వైపు దళిత సంఘాల నిరసనలతో వైసీపీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి. మరో వైపు నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు వెలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  అప్పట్లో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చోపెట్టిన దృశ్యాలను మరో సారి నెట్టింట పోస్టు చేస్తూ నెటిజనులు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు... 9 దుంగలు స్వాధీనం

  అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ ఒక స్మగ్లరును అరెస్టు చేసింది. టాస్క్ ఫోర్స్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్  ఆధ్వర్యంలో డీఎస్పీ  ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ వినోద్ కుమార్ టీమ్ బుధవారం అన్నమయ్య జిల్లా పుల్లంపేట నుంచి కూంబింగ్ చేపట్టింది.  అక్కడ ఏం.బావి పారెస్టు బీటు పరిధిలోని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఒక వ్యక్తి కనిపించాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా, వెంబడించి పట్టుకున్నారు. అతనిని విచారించగా పొదల్లో దాచిన ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిలో ఉపయోగించినవి 6 ఉండగా, మూడు కొత్తవి ఉన్నాయి. అతనిని దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇతనిని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి గా గుర్తించారు. అతనిని డీఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ లు విచారించారు. సీ ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభం

  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ పునఃప్రారంభమైంది. నిన్న జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ పిటిషనర్ల వాదనలు విని కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టుకు మంత్రి వాకిటి శ్రీహరి  హాజరైరు.  బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిన్న వాదనలు సాగాయి.  ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.ఈ సందర్భంగా సీజే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకే ఉందని, ఈ విషయమై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే డిస్మిస్‌ చేసిందని అడ్వకేట్‌ జనరల్‌ గుర్తు చేశారు.ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌లు సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే.    

పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు.. తప్పేంటన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధం, చట్టబద్ధంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలను పీపీపీ విధాంలో అభివృద్ధి చేసేందుకు గత నెల 9న ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వసుంధర దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన హైకోర్టు థర్మాసనం గురువారం విచారణ జరిపింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల టెండర్ల ఖారారుపై స్టే ఇవ్వడానికి  నిరాకరించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, రాజ్యాంగం లేదా చట్టాన్ని ఉల్లంఘించే నిర్ణయాల్లో తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. అయినా పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం కాకుండా  ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకొని ఉండవచ్చనీ, అది తప్పెలా అవుతుందని ప్రశ్నించింది.  గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు 5వేల 800 కోట్ల రూపాయల అంచనాతో పాలనపరమైన అనుమతులు ఇచ్చారన్న పిటిషనర్ తరఫున్యాయవాది మాటలపై స్పందించిన ధర్మాసనం.. పాలనపరమైన అనుమతులిస్తే సరిపోతుందా? నిధులు విడుదల చేయాలి కదా అని నిలదీసింది. నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, అది తప్పెలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.   నిధుల కొరత వల్ల జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలూ నిలిచిపోయాయని గుర్తు చేసింది. నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఎస్,  వైద్యఆరోగ్య ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్యసేవలు, మౌలికాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్య, పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీచేసింది. త దుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

విజయ్ నివాసానికి బాంబు బెదరింపు

ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం  అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది.  ఇటీవల కరూర్‌లో విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట సంభవించి 41 మంది మరణించిన విషాద ఘటన తర్వాత ఈ బెదిరింపు రావడం ఆందోళన రేకెత్తించింది. విజయ్ భవిష్యత్తులో మరోసారి బహిరంగ సభలు పెడితే ఆయన ఇంటిని బాంబుతో పేల్చివేస్తామంటూ  ఓఆగంతుకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ కాల్  కన్యాకుమారి నుంచి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ బెదరింపు కాల్ తో అప్రమత్తమైన పోలీసులు చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ నివాసం వద్ద బందోబస్తును పటిష్టం చేశారు. విజయ్ నివాసంలో అణువణువూ తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు.   ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి గుర్తింపు కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా ఉండగావిజయ్ నివాసంలో బాంబు పెట్టామంటూ బెదరింపు కాల్ రావడం ఇదిరెండో సారి.  

బీసీసీఐ అంటే.. బీజేపీ కంట్రోల్డ్ క్రికెట్ ఇన్ ఇండియా అనాలా?

బీసీసీఐ అంటే మామూలుగా బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. కానీ ఇప్పుడు బీసీసీఐని బీజేపీ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా అని పిలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రాల క్రికెట్ సంఘాలన్నీ బీజేపీ అగ్రనేతలు, కీలక నేతల పుత్రరత్నాల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఒక సారి ఆ వివరాలేంటని పరిశీలిస్తే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుత్రర‌త్నం జై షా ఐసీసీ చైర్మ‌న్ గా ఉన్నారు? ఇక డిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ  కుమారుడు రోహ‌న్ జైట్లీ. అంతే కాదు.. మధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే ఆయన కూడా బీజేపీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కుమారరత్నం మహార్యమాన్ సింధియా. ఈ జాబితా ఇక్కడితో ఆగలేదు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే.. బీజేపీ నాయకుడు రాకేష్ తివారీ కుమారుడు  హర్షవర్ధన్  తివారీ. ఈయన అతి పిన్న వయస్సులోనే..అంటే 24 ఏళ్లకే బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. ఇది బీసీఏ చరిత్రలోనే ఓ రికార్డ్.  అలాగే  రాజ‌స్థాన్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు ధ‌నంజ‌య్ సింగ్   రాజ‌స్థాన్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసిన గ‌జేంద్ర సింగ్ త‌న‌యుడు. రాజ‌వంశీయుడు. ఈయ‌న కూడా బీజేపీ లీడ‌రే. గ‌త మూడు ప‌ర్యాయాలుగా బీజేపీ కేంద్రంతో పాటు ప‌లు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో.. క్రికెట్ లోనూ వంశ‌పారంప‌ర్య ఆధిప‌త్యం అమ‌ల‌వుతూ వ‌స్తోంది. అందుకే  బీసీసీఐని బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అని అన‌డం క‌న్నా బీజేపీ  కంట్రోల్డ్ క్రికెట్ అసోసియేష‌న్ గానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. అంత‌గా బీసీసీఐని బీజేపీ నేత‌లు, వారి కుమారులు ఆక్ర‌మించేశారంటున్నారు పరిశీలకులు

జూబ్లిహిల్స్ బైపోల్.. న‌వీన్ యాద‌వ్ గెలుపు అవకాశాలెంత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా న‌వీన్ యాద‌వ్ ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.  న‌వీన్ యాదవ్ బ‌ల‌మైన నేత కావ‌డం వ‌ల్లే.. ఆయ‌న‌పై కేసులు పెడుతున్నార‌ని  టీపీసీసీ చీఫ్‌ మ‌హేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్క‌డ కాంగ్రెస్ కి, న‌వీన్ కి ఉన్న గెలుపు అవ‌కాశాలెన్ని అన్న చర్చ అయితే ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో నవీన్ యాదవ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇది నిన్నా, మొన్నా అని కాదు.. గత కొన్నేళ్లుగా ఆయనీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.  పండ‌గేదైనా స‌రే ఈ సెగ్మెంట్ లో గ‌త కొన్నాళ్లుగా నవీన్ యాదవ్  హ‌డావిడి హంగామా కనిపిస్తోంది.  ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సామూహిక శీమంతాలు జ‌రిపించారు న‌వీన్ యాదవ్.  నవీన్ యాదవ్  విద్యావంతుడైన యువ‌కుడు కూడా కావ‌డంతో యూత్ ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కనిపిస్తోంది. ఎంత పలుకుబడి, ఫాలోయింగ్ ఉన్నా కూడా నవీన్ యాదవ్ కు రెండుమూడు అంశాల్లో  మాత్రం  సవాళ్లు ఎదురౌతున్నాయి.  ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇక్క‌డ ముస్లిం మైనార్టీలు ఎక్కువ‌. అందుకే ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గోపీనాథ్ పై అజారుద్దీన్ ను నిలబెట్టింది  కాంగ్రెస్. కానీ ఎందుక‌నో తెలీదు గ‌త కొంత కాలంగా ఇక్క‌డి ఓట‌ర్లు బీఆర్ఎస్ కే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నారు. దానికి తోడు కాంగ్రెస్ సైతం మైనార్టీల్లో ఎవ‌రికీ ఇంత వ‌ర‌కూ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అజ‌ర్ ని ఎమ్మెల్సీ చేసి ఆపై హోం మంత్రిత్వం ఆయ‌న‌కు క‌ట్ట‌బెడ‌తార‌న్న మాట వినిపించింది. ఈ ఎన్నిక‌ల‌క‌న్నా ముందే కాంగ్రెస్ ఆప‌ని చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ అలా చేయలేదు. ఇక రేవంత్ కేబినెట్ లో  ఒక్క ముస్లింకి కూడా చోటు దక్కలేదన్న అంశంపై   బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ని ఎండ‌గ‌డుతోంది. దానికి తోడు సిటీలో బీఆర్ఎస్ ప్ర‌భావం  ఎక్కువ‌. ఆ ప్రభావాన్ని ఎదుర్కొని  న‌వీన్ యాద‌వ్ జూబ్లిహిల్స్ లో నెగ్గుకు రావ‌డం సాధ్య‌మేనా? అని రాజకీయవర్గాలు అంటున్న పరిస్థితి. వీటికి తోడు సిటీలో హైడ్రా ఎఫెక్ట్ కూడా ఎక్కువే. ప్ర‌త్యేకించి జూబ్లిహిల్స్ సెగ్మెంట్లో హైడ్రా పెద్ద న‌ష్టం క‌లిగించ లేదు. కానీ హైడ్రా ఫ‌స్ట్ ఆప‌రేష‌న్ ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత ఘ‌ట్టం జ‌రిగింది ఇక్క‌డే.  దీంతో ఒక ర‌క‌మైన కాంగ్రెస్ వ్య‌తిరేక‌త అంత‌ర్లీనంగా ఉందీ ప్రాంతంలో. ఆ త‌ర్వాత బీఆర్ఎస్ గ‌తంలో ప్ర‌వేశ పెట్టిన బ‌స్తీద‌వాఖాన వంటి వాటిని కాంగ్రెస్ స‌రిగా నిర్వ‌హించ‌డం లేద‌న్న టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతోంది. ఇలాంటి వాటి ద్వారా కూడా న‌వీన్ యాద‌వ్ కి వ్య‌తిరేక‌త ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది. ఆపై అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా ఎదుర్కోబోతున్న‌ మాగంటి సునీత‌ గోపినాథ్ స‌తీమ‌ణి. దీంతో నవీన్ యాదవ్   సెంటిమెంటును   జ‌యించాల్సి ఉంటుంది. మ‌హిళా ఓట‌ర్లు  ఎప్ప‌టిలాగానే అటు వైపు మ‌ళ్లితే న‌వీన్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కూ లేడీ సెంటిమెంట్ గ్రాబ్ చేయ‌డం కోసం చేసిన ప్ర‌య‌త్నమంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. ఇక ఫైన‌ల్ గా కంటోన్మెంట్ రిజ‌ల్ట్ రిపీట్. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచిన మాట వాస్త‌వ‌మే. కానీ అదంటే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌. అదే ఇప్పుడు పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చి సుమారు రెండేళ్లు. ఈ కాలంలో కొంత వ్య‌తిరేక‌త వ‌చ్చిన మాట వాస్త‌వం. వీట‌న్నిటినీ త‌ట్టుకుని న‌వీన్ యాద‌వ్ జూబ్లి కింగ్ కావ‌ల్సి ఉంది. మ‌రి ఆయ‌న ఓన్ చ‌రిష్మాతో ఇన్ని వ్య‌తిరేకతలను ప‌రిస్థితుల‌ను నెగ్గుకు రాగ‌ల‌రా? అన్న‌ది తేలాలంటే న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆ రోజే ఈ ఉప ఎన్నిక ఫ‌లితాలు వ‌స్తాయి కాబ‌ట్టి.

ఇదెక్కడి చోద్యం?.. విమర్శల్లోనూ వివక్షా?

ఈ యాక్టివిస్టులున్నారే! త‌న మ‌న బేధాలు పాటించ‌డం వీరికి పెన్నుతో పెట్టిన విద్య‌. వివ‌క్ష చూప‌డం అన్న‌ది వీరికి మైకుతో వ‌చ్చిన ఆర్టు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు కేంద్రంగా రెండు ప్ర‌ధాన దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వాటిలో మొద‌టిది.. క‌రూర్ లో జ‌రిగిన‌  తొక్కిస‌లాట కాగా.. మ‌రొక‌టి  త‌మిళ‌నాడులో త‌యారు చేసిన దగ్గుమందు కార‌ణంగా మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ లో కొంద‌రు పిల్ల‌లు చ‌నిపోవ‌డం. వీటిపై మ‌న ద‌గ్గ‌రున్న యాక్టివిస్ట్ బ్యాచ్ క‌నీపం స్పందించలేదు.  అదే   బీజేపీ  కూట‌మి పార్టీ నేత‌లు చేసే త‌ప్పొప్పుల మీద వీళ్ల బాదుడు.. ఒక రేంజ్ లో ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైర‌ల్ జ్వ‌రాన్ని కూడా వ‌ద‌ల‌కుండా వాయించేస్తారు. అదే విజ‌య్ కరూర్ రోడ్ షో కారణంగా  41 మంది చ‌నిపోయారు. అయితే ఈ సంఘటనపై సోకాల్డ్ యాక్టివిస్టులు కనీసం స్పందించను కూడా స్పందించలేదు.  అదే బీజేపీ కేంద్రంగా ఏదైనా చీమ చిటుక్కుమ‌న్నా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తుమ్మినా ద‌గ్గినా కూడా వీరి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయినింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ మాట‌కొస్తే మొన్న మోడీ మ‌ణిపూర్ కి వెళ్లిన‌పుడు కూడా ఘ‌ట‌న జ‌రిగిన ఇన్ని రోజుల‌కు, ఇన్ని గంట‌ల‌కు, ఇన్ని గ‌డియ‌ల‌కు ఆయ‌న‌క్క‌డ‌కు వెళ్ల‌డ‌మా అంటూ సెక‌న్ల‌తో స‌హా లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీసి మ‌రీ పోస్టులు పెట్టారీ పెద్ద మ‌నుషులు. అలాంటిది విజ‌య్ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించడంపై ఎందుకు స్పందించడంలేదు?  అంటే ఇక్క‌డే ఉంది అస‌లు లాజిక్కు.. ఇక్క‌డ విజ‌య్ కూడా సేమ్ టూ సేమ్ వీరిలాగానే బీజేపీని వ్య‌తిరేకిస్తారు కాబట్టి.  త‌న సినిమాలో సీన్లు పెట్టిమ‌రీ ఆయ‌న యాంటీ బీజేపీ వాయిస్ వినిపిస్తారు కనుక.  తాజాగా త‌మిళ‌నాడు కు చెందిన ఒక కంపెనీ త‌యారు చేసిన విష‌పూరిత ద‌గ్గుమందు ద్వారా పిల్ల‌లు చ‌నిపోతే.. అదేంటో తెలీదు జ‌స్ట్ ఆస్కింగ్ ప్ర‌కాష్ రాజ్ ప‌త్తా లేరు. ఇక డీఎంకే ద్వారా ఎంపీ అయిన క‌మ‌ల్ హాస‌న్ క‌నిపించ‌రు. ఇక స‌నాత‌న ధ‌ర్మం అంటే విరుచుకుప‌డే స‌త్య‌రాజ్ మాట పెగ‌ల‌దు. అంటే ఇక్క‌డ వివ‌క్ష‌పై పోరాటం చేసే ఈ యోధాను యోధుల గ‌ళం, క‌లం కొన్నిసార్లంతే అదేంటో తెలీదు.. ఆటోమేటిగ్గా మూగ‌పోతాయి. వీరి దృష్టిలో కరూర్ తొక్కిసలాట అయినా, దగ్గుమందు వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అయినా  య‌ధాలాపంగా జరిగినవే. గ‌ట్టిగా నిల‌దీస్తే.. వీటి వెనుక కూడా  బీజేపీ కుట్ర అంటూ బుకాయించినా ఆశ్చ‌ర్యం లేదు. ఇదే ప్ర‌కాష్ రాజ్ అయోధ్య‌లో బాబ్రీ మ‌సీదు కూల‌దోసి మ‌రీ అక్క‌డ రామ మందిరం నిర్మించారని తీవ్రఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తారుగానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ కూలిన దేవాల‌యాల సంఖ్య అస్స‌లు ప‌రిగ‌ణ‌లోకి తీస్కోరు.  ఇక దేవుడు లేనే లేడ‌నే క‌మ‌ల్ హాస‌న్ కి విజ‌య్ పార్టీ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిస‌లాట కార‌ణంగా పోయిన ప్రాణాల‌కు విలువ లేన‌ట్టే బిహేవ్ చేస్తారు. ఆపై త‌మ రాష్ట్రంలో త‌యారైన ద‌గ్గు మందు కార‌ణంగా చ‌నిపోయిన పిల్ల‌ల విషయంలో అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నట్లుగా  స‌త్య‌రాజ్ సైలెంటైపోతారు. ఇక్క‌డ కూడా అంతే తెలుగులో కొంద‌రు యాక్టివిస్టులుంటారు. వీరు కూడా కేవ‌లం హిందుత్వ‌, ఎన్డీయే, కూట‌మి ద్వారా జ‌రిగే త‌ప్పొప్పుల మీద మాత్ర‌మే దృష్టి సారిస్తారు. మిగిలింది ఏమైనా  కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తారు. ఇదెక్క‌డి విడ్డూర‌మో అర్ధం  కాదంటారు కొంద‌రు సామాజిక‌వేత్త‌లు.

మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ కే!

జూబ్లీహిల్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరివైపు అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా జూబ్లీ బైపోల్ లో పోటీ అంటూ లీకులిచ్చిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు పోటీలో లేదు. కాంగ్రెస్ జూబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించడంతోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా విజయం సాధించడం కష్టమే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఒకింత ఎక్కువే. బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో నిలబడే పార్టీ అభ్యర్థి పేరు అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారం ప్రారంభించేయడం, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించుకోలేక మల్లగుల్లాలు పడుతుండటంతో.. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. అయితే అందరూ ఊహించినట్లుగానే.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు అయ్యారు. ఈయన ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా, ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ వినా మరెవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మజ్లిస్ మద్దతు లభించే అవకాశాలు లేవు. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం అంత తేలిక కాదు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అజారుద్దీన్ మొదలకుని ఈ నియోజకవర్గ టికెట్ కోసం రేసులో ఉన్న ఒక్కొక్కరినీ పక్కకు తప్పించి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారయ్యేలా చూశారు. ఇందుకోసం ఆయన అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఎవరినీ నొప్పించకుండానే.. పక్కకు తప్పించి తాను కోరుకున్నట్లు నవీన్ యాదవ్ కు పార్టీ హైకమాండ్  టికెట్ కన్ ఫర్మ్ చేసేలా చూశారు.   అయితే జూబ్లీ బైపోల్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ పై కేసు నమోదు కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పునరాలోచనలో పడుతుందా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమయ్యాయి. అయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్ నే అభ్యర్థిగా ఖరారు చేసింది.  ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే..  ఆయనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. పైగా మజ్లిస్ పార్టీలో అనుబంధం ఉంది. తొలి నుంచీ కూడా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉంటే మద్దతు ఇస్తామని మజ్లిస్ లోపాయికారీగా చెబుతూ వస్తున్నది. మజ్లిస్ మద్దతు ఉంటే నియోజకవర్గ పరిధిలో దాదాపు 90 వేల పైచిలుకు ఉన్న మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడతాయి. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వమే ఖరారయ్యేలా పావులు కదిపారు. ఇక ఇప్పుడు సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ తన ఆశ నెరవేరాలంటే చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  

జగన్ విశాఖ పర్యటనకు పోలీసుల రూట్ మ్యాప్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నారు.  ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఆయనీ పర్యటన చేపట్టారు. అయితే నేడు విశాఖలో మహిళల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున కాన్వాయ్ లో 10కి మించి వాహనాలు ఉండకూడదని, రోడ్ షో నిర్వహించడం, కూడళ్ల వద్ద ప్రసంగాలు చేయకూడదని ఆయన పర్యటనకు పోలీసులు షరతులు విధించారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ ఇచ్చి, దాని ప్రకారమే పర్యటన సాగాలని కండీషన్ పెట్టారు. పోలీసులు నిర్దేశించిన మార్గం ప్రకారం  విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.  నిర్దేశించిన మార్గంలో, నిబంధనలకు లోబడే జగన్ పర్యటన సాగాలని పోలీసులు స్పష్టంగా ఆదేశించారు. 

పిఠాపురంలో పవన్ పర్యటన నేడు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం (అక్టోబర్ 9)న తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  ఈ సందర్భంగా ఆయన భాగంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకుంటారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు చాలా కాలంగా సముద్ర కాలుష్యం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు పవన్ కల్యాణ్ దృష్టికి కూడా తీసుకువచ్చారు. దీంతో ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు  పవన్ కల్యాణ్, అధికారులతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించి కాలుష్య ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.   తరువాత ఆయన ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్యంపై మత్స్య కారుల ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ  పర్యటనలో ఆయన  పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  

ఆరులేన్లుగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ

ఉభయ తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకమైన  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 విస్తరణ పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా విస్తరించేందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)  నవంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ ముగించి నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.  తెలంగాణలోని దండుమల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరణ జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.10,391.53 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తంలో  నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు, భూసేకరణ తదితర అవసరాలకు రూ.3,616.06 కోట్లుగా చెబుతున్నారు.    ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొత్తగా 162 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనికి సుమారు రూ.1,414 కోట్లు అవసరమని అధికారులు అంచనావేశారు. భూసేకరణ, ఇతర అడ్డంకులపై చర్చించేందుకు   ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్లు-భవనాల శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. డీపీఆర్‌ను ఖరారు చేసేందుకు వీలుగా రహదారి మార్గంలోని విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర నిర్మాణాల వివరాలను ఈ నెలాఖరు నాటికి  సేకరించి..  తుది డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. 

రంజీ ట్రోఫీకి హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ

ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మను హైదరాబాద్ రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్ గా నియమిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఈ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నారు. సిరాజ్ కు దేశవాళీ క్రికెట్ నుంచి విశ్రాంతి ఇచ్చారు.   ఆస్ట్రేలియా పర్యటన, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో సిరాజ్ కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దీంతో సిరాజ్ రంజీట్రోఫీకి అందుబాటులో  ఉండడు. దీంతో తిలక్ వర్మకు హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రంజీ ట్రోఫీకి 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. హైదరాబాద్ జట్టులో సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమ‌తేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ తమ స్థానాలను తిరిగి నిలబెట్టుకున్నారు. గత సీజన్‌లో ఎలైట్ గ్రూప్-బిలో ఆడిన హైదరాబాద్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ లలో కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది.  దీంతో లీగ్  దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.  ఈ సారి తిలక్ వర్మ కెప్టెన్సీలో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందన్న ఆశాభావం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.  

కేటీఆర్, హరీష్ రావు హౌస్ అరెస్టు

హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ సీటీ బస్సు చార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ గురువారం (అక్టోబర్ 9) చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు సిటీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను పోలీసులు నిలువరిస్తున్నారు. కాగా  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  కోకాపేట‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులను మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.హరీష్ రావు మెహదీపట్నం బస్టాప్ నుంచి, కేటీఆర్ రేతిఫైల్ బస్టాప్ నుంచి బస్ భవన్ కు చేరుకోవాల్సి ఉండగా పోలీసులు వారిని వారి వారి ఇళ్లల్లోంది బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. గురువారం (అక్టోబర్ 9) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.   ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 8)  శ్రీవారిని మొత్తం 74,861 మంది దర్శించున్నారు. వారిలో 31,802 మంది    తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  3కోట్ల 93 లక్షల రూపాయలు వచ్చింది.