మావోయిస్టు నాయకుడు మల్లోజుల సంచలన ప్రకటన
posted on Oct 6, 2025 @ 8:30PM
మావోయిస్టు పోలీస్ బ్యూరో సభ్యుడు మల్లోజుల సంచలన ప్రకటన చేశారు. తాను ఇకపై పార్టీలో కొనసాగబోనని, అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆయుధాలను విడిచి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మరోసారి ప్రకటించారు.
ఈ మేరకు ఆయన 22 పేజీల లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మల్లోజుల మాట్లాడుతూ – “చేసిన తప్పులకు, ఉద్యమాన్ని ఓటమి పాలవకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ మీ అందరికి క్షమాపణలు చెబుతున్నాను. ఇంతటి నష్టాలకు దారి తీసిన విప్లవోద్యమానికి నేను నాయకత్వం వహించాను. ఇకపై ఈ బాధ్యతల్లో కొనసాగడానికి నేను అర్హుడిని కాను” అని పేర్కొన్నారు.
“పార్టీ అత్యంత క్లిష్టమైన సమయంలో ఈ నిర్ణయం సరైంది కాదని మీరు భావించవచ్చు. కానీ పార్టీని కాపాడుకోవడానికి, సరైన నాయకత్వాన్ని కేడర్లు ఎంచుకోవడానికి ఇది అవసరం. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను,” అని పేర్కొన్నారు.
మల్లోజుల తన లేఖలో పార్టీ కేంద్ర కమిటీలోని అంతర్గత విషయాలను కూడా ప్రస్తావించారు. “సుదీర్ఘకాల విప్లవాచరణలో చేసిన తప్పుల మూలంగా మన ఉద్యమం దెబ్బతింది. ఇప్పటివరకు నేను క్రమశిక్షణతోనే పార్టీ చర్చల్లో పాల్గొన్నాను, కానీ ఇప్పుడు నా నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు వెల్లడించక తప్పదు,” అని తెలిపారు.
– “విప్లవోద్యమం ఏండ్ల తరబడి తప్పిదాల వల్ల దెబ్బతింటోంది. మన పంథా సరిగా ఉందని చెప్పుకుంటున్నప్పటికీ, అది ఉద్యమ పురోగతికి ఎందుకు దోహదం కావడంలేదని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడమే విప్లవ చైతన్యానికి మార్గం. గతపు తప్పులనుంచి పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తులో విజయాలు సాధించగలుగుతాం,” అని మల్లోజుల పేర్కొన్నారు.
“ఇప్పుడైనా మనకు సానుకూల మార్పు అవసరం. ఉద్యమాన్ని కాపాడుకోవడం, కేడర్లను రక్షించుకోవడం మన మొదటి కర్తవ్యం. అనవసర త్యాగాలకు ముగింపు పలుకుదాం. కొత్త దారుల్లో ముందుకు సాగుదాం. చివరికి విజయం ప్రజలదే,” అని తన లేఖను ముగించారు.