తెలంగాణ కాంగ్రెస్ నుంచి మరో వికెట్ డౌన్?

తెలంగాణ కాంగ్రెస్ కు ఏదో అయ్యింది. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా.. ఆ మేరకు కాంగ్రెస్ పుంజుకోవాల్సి ఉన్నా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు.. సరికదా ఉన్న పట్టును కూడా కోల్పోయి రోజు రోజుకూ మరింత బలహీనమౌతోంది. పార్టీ  నాయకులు ఒక్కరొక్కరుగా దూరమౌతున్నారు. ఉన్న వారు కూడా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు అవకాశాలున్నప్పటికీ, పరిస్థితులు కూడా కలిసివచ్చేలా ఉన్నప్పటికీ  నాయకత్వంలో ఐక్యతా లోపం ఆ అవకాశాలను వినియోగించు కోలేక పోవడమే కాకుండా చేజార్చుకుని రోజు రోజుకూ బలహీనమైపోతోంది.  ఇక ఇప్పటి దాకా గట్టి పట్టు ఉందని అంతా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. గ్రేటర్ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. అలా దూరం కావడమే కాదు.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని చెప్పుకుం టున్న కమలం గూటికి చేరుతున్నారు. అసలు గ్రేటర్ కాంగ్రెస్ అనగానే గుర్తుకు వచ్చేది పిజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి వీరిద్దరికీ అప్పట్లో హైదరాబాద్ బ్రదర్స్ గా విశేష గుర్తింపు ఉండేది. సరే పీజేఆర్ ఇప్పుడు లేరు. కానీ ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా నిన్న కాక మొన్న కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి కూడా తన తండ్రికి స్నేహితుడైన మర్రి శశిథర్ రెడ్డి వెంటే కమలం గూటికి చేరనున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కూడా మర్రిశశిథర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి చూసుకున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు అందుకున్న తరువాత పార్టీలో ముఖ్యంగా గ్రేటర్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందన్న భావన అందరిలోనూ ఉంది. అన్నిటికీ మించి తన సోదరి విజయారెడ్డిని తన అభీష్ఠానికి వ్యతిరేకంగా, కనీసం తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అప్పట్లోనే తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయనలో అదే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే పీజేఆర్ వారసుడిగా ఆయనను తమ గూటికి చేర్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోందంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి ద్వారానే ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతోందంటున్నారు. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. 

కేసీఆర్ చెక్కులు చెల్లలేదా!?

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు తెలంగాణ సీఎం ఆర్థిక సహాయం అంటూ పంపిణీ చేసిన చెక్కులు బౌన్స్ అయ్యాయా? ఆ చెక్కులు చెల్లలేదా? అంటే ఔననే అంటున్నాయి ఆ చెక్కులు తీసుకున్న రైతు కుటుంబాలు.      కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదంటూ అక్కడి రైతులు కొందరు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దీంతో కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేసి మరీ పంపిణీ చేసిన చెక్కులు చెల్లనివా అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఆరంభమైంది. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో కేసీఆర్ రైతు బాంధువుడిగా తనను తాను అభివర్ణించుకుంటూ చేసిన ఆర్థిక సహాయం ప్రచారార్భాటం కోసమేనా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.   మేలో కేసీఆర్ ఉద్యమంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అంటూ 1010 చెక్కులను పంపిణీ చేశారు. అవే ఇప్పుడు చెల్లలేదంటూ కొందరు మీడియాకు తెలిపారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేసీఆర్ పంపిణీ చేసిన 1010 చెక్కులలో 814 చెక్కులకు నగదు చెల్లింపులు పూర్తయ్యాయని స్పష్టం చేసింది. అంటే మిగిలిన చెక్కులు చెల్లలేదని ప్రభుత్వమే అంగీకరించినట్లైంది. అయితే ఆ చెక్కులు చెల్లక పోవడానికి ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని టీఆర్ఎస్ వివరణ ఇస్తోంది.  బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను ఆ యా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనీ, అలా చేయకపోవడం వల్లనే  కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదనీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి చెక్కులకు కూడా చెల్లింపులుచేయాలని తాము ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇంకా ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే   ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ రాంసింగ్ ను సంప్రదించాలని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే అయినా.. పరాయి రాష్ట్రంలో వారికి ఆర్థిక సహాయం కింద చెల్లని చెక్కులిచ్చేంత దుర్భర స్థితిలో మాత్రం లేదని ప్రభుత్వం చెబుతోంది.  మొత్తం మీద కేసీఆర్ చెక్కులు చెల్లలేదంటూ వచ్చిన వార్తలు కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టాయి. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ సర్కారు ఇచ్చిన చెక్కులన్నీ చెల్లుబాటు అవుతాయని  ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సాంకేతిక పొరపాటుతోనే కొన్ని చెల్లుబాటు కాలేదని సర్కారు చెప్పుకుంది. రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ ఏడాది మే 22న 1010 చెక్కులను పంపిణీ చేసిన సంగతి విదితమే.  ఈ చెక్కులు నగదు రూపంలోకి మారడం లేదని తాజాగా మీడియాలో వార్తలు రావడంతో   తెలంగాణ ప్రభుత్వం తక్షణం   విచారణ జరిపించింది. ఆ విచారణలో  బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం   చెక్కులను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్  చేయకపోవడం వల్ల  కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదని తేలింది.  వాటిని రీవాలిడేట్ చేసి నగదు చెల్లింపులు పరపాలని  ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. . 

గోదావరి జిల్లాల్లో సైకిల్ స్పీడ్.. బాబు పర్యటనకు జన సునామీ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందా అంటే తెలుగుదేశం శ్రేణులు సహజంగానే ఔనని అంటాయి. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలకు వస్తున్న జన సందోహాన్ని చూసి పరిశీలకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కర్నూలు పర్యటనలోనైనా, గత రెండు రోజులుగా గోదావరి జిల్లాలలో పర్యటనకైనా జనం తండోపతండాలుగా వస్తున్నారు. వారేమీ తరలిస్తే వచ్చిన జనం కాదు. చంద్రబాబు పర్యటన ఐదారు షెడ్యూల్ కంటే ఐదారు గంటలు ఆలస్యమైనా జనం ఓపికగా వేచి చూస్తున్నారు. ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. వైసీపీపై ఆయన విమర్శలకు చప్పట్లతో మద్దతు తెలుపుతున్నారు. గతంలో అంటే తన హయాంలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తుంటే ఔను నిజమే అని ఆమోదం తెలుపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ వాతావరణమే పరిశీలకులు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం తధ్యమన్నఅంచనాకు వచ్చేలా చేశాయి. అన్నిటికీ మించి  గోదావరి జిల్లాల దీవెన ఏ పార్టీకి లభిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. గత ఎన్నికలలో వైకాపీ అధికారంలోకి వచ్చిందంటే గోదావరి జిల్లాలలో ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టడమే కారణం. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ  స్థానాలలో విజయం సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నది ఇప్పటి వరకూ రుజువౌతూ వస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత గోదావరి జిల్లాల పర్యటనకు జనం ప్రభంజనంలా తరలి వస్తుండటంతో వైసీపీలో కలవరం కనిపిస్తోంది. జనం చంద్రబాబు రాకకోసం గంటల తరబడి వేచి చూడటమే ప్రజలలో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో  ఎత్తి చూపుతోంది.  ఈ పరిస్థితి తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది. నిన్న మొన్నటి వరకూ పొత్తులు, పొడుపులుపై జరిగిన చర్చ ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది. జనం తెలుగుదేశం అధినేత పర్యటనలకు పోటెత్తుతున్న తీరు చూస్తుంటే.. రాష్ట్రం పురోగమించాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరం అన్న నిర్ణయానికి వారు వచ్చేశారా అనిపించక మానదు. తెలుగుదేశంలో కూడా అదే ధీమా కనిపిస్తోంది.  పొత్తులతో సంబంధం లేకుండానే  అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో విజయం ఖాయమన్న భావన తెలుగుదేశం శ్రేణుల్లో కనిపిస్తోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు జనం నీరాజనాలు పలుకుతుండటంతో తిరుగులేదన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 2019 ఎన్నికల వరకూ తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలు పెట్టని కోటగా ఉండేవి. అయితే 2019 ఎన్నికలలో ఇక్కడ వైసీపీ పై చేయి సాధించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ 29 స్థానాలలో విజయం సాధించింది. తెలుగుదేశం కేవలం ఐదు స్థానాలలో మాత్రమే గెలుపొందింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆ ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబూ అంటూ జనం బాధపడేలా చేశారని అంటున్నారు.   ఈ పరిస్థితి ఒక్క గోదావరి జిల్లాల్లోనే  కాదు రాష్ట్రమంతటా ఉందని కూడా చెబుతున్నారు. ఆఖరికి రాయలసీమలో కూడా ఈ సారి అధికార పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని చెబుతున్నారు. పరిశీలకులు సైతం ప్రభుత్వంపై వ్యక్తమౌతున్న రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్ల సునామీగా మారుతుందని అంచనా వేస్తున్నారు. రంగంలో జనసేన వంటి పార్టీలు ఉన్నా..ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి అనుభవం, దార్శనికత ఉన్న చంద్రబాబే గట్టెక్కించగలరని ప్రజలు భావిస్తున్నారని రాజకీయవర్గాలలో సైతం చర్చ నడుస్తోంది. 

పిల్లల స్కూలు బ్యాగుల్లో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు

సమాజం ఎటుపోతోంది. పిల్లల్లో పెడపోకడలు పెచ్చరిల్లుతున్నాయి. సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగులలో ఏం ఉంటాయి. పెన్నులు, పెన్సిళ్లు, చిరు తిండ్లు, ఇంకా చెప్పుకోవాలంటే పుస్తకాల పేజీల మధ్యలో నెమలీకలు. కర్నాటక రాజధాని బెంగళూరులో పిల్లల స్కూలు బ్యాగుల్లో గర్భ నిరోధక మాత్రలు, సిగరెట్లు దొరికాయి. అంతేనా వారి వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇటీవల పాఠశాల విద్యార్థులు స్కూళ్లకు స్మార్ట్ ఫోన్ లు తీసుకువస్తున్నారన్న సమాచారంతో కర్నాటక  ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (కేఏఎంఎస్‌) పిల్లల బ్యాగులను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు   పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేసిన టీచర్ల షాక్ అయ్యారు. 8,9,10 తరగతులు చదివే పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, వైట్ నర్లు, అధిక మొత్తంలో నగదు కనిపించాయి. కొందరు విద్యార్థుల వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఒక విద్యార్థి బ్యాగ్ లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ-పిల్‌) లభించాయి.  దాంతో  స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చాయి. పిల్లల భవిష్యత్ కోసం సంపాదనలో పడి ప్రస్తుతం వాళ్లు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు పట్టించుకోకపోవడం వల్లే పిల్లలు పెడపోకడలకు పాల్పడుతున్నారని నిపుణులు అంటున్నారు. కాగా పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు ఉండటం కర్నాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  తమ పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు దొరికాయని తెలిసి తల్లిదండ్రులు సైతం నివ్వెరపోయారు. ఇవేవీ తమకు తెలీదన్నారు.  

కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు..లోకేష్

వైసీపీ నేతల బెదరింపులు, హెచ్చరికలు, విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో తెలుగుదేశం దూకుడు పెంచింది. ఇప్పటి వరకూ చిన్న పాటి విమర్శకు కూడా వైసీపీ నేతలు రెచ్చిపోయి బూతుల పంచాంగంతో విరుచుకుపడి ఎదురుదాడికి దిగేవారు. అయితే గత కొన్ని రోజుల నుంచీ సీన్ మారిపోయింది. వైసీపీ నేతల విమర్శలపై తెలుగుదేశం నాయకులు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. భాష మర్యాద దాటకుండానే పంచ్ లతో, సెటైర్లతో దుమ్ము దులిపేస్తున్నారు. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై చేసిన వ్యాఖ్యలకు తాజాగా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఓ ఎమ్మెల్యే అన్నో, తమ్ముడో నన్ను చంపేస్తాడంట..కానీ మేం కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో రాజీ ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. బెదిరింపులకు, కేసులకు భయపడే బెదిరింపులకు, కేసులకు మేం పారిపోయే రకం కాదు జగన్ రెడ్డీ.. నేను నీలాగా కాదు అంటూ లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై జగన్ సర్కార్ హత్యాయత్నం, ఎస్సీఎస్టీ  అట్రాసిటీస్ సహా 15 కేసులు పెట్టిందన్నారు.  మేం సవాల్ చేస్తే నోరెత్తని వైసీపీ నేతలు చంపేస్తామంటూ బెదరించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 

టెస్టు మ్యాచే..టి20 కాదు.. పాక్ తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ పరుగుల సునామీ

ఇంగ్లాండ్ వీర బాదుడు.. టెస్ట్ మ్యాచ్ లో టి20ని మించిన దూకుడుతో చెలరేగిపోయింది. ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్ లో ఒకే రోజులో 506 పరుగులు చేసింది. అసలు జరుగుతున్నది టెస్ట్ మ్యాచా టి20 మ్యాచ్చా అన్న అనుమానం కలిగేలా ఆడింది. ఇంగ్లాండ్ పాకిస్థాన్ మధ్య టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. అదీ పాకిస్థాన్ గడ్డపై. ఇంగ్లాండ్ పాకిస్థాన్ లో సిరిస్ ఆడి 17 ఏళ్లయ్యింది. అంటే 17 ఏళ్ల విరామం తరువాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్లు తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే సిరీస్ ఎలా ఉండబోతోందో రుచి చూపించేసింది. అసలు ఇటీవలి కాలంలో అంటే బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టు పగ్గాలు చేపట్టిన తరువాత ఆ జట్టు బ్యాటింగ్ దూకుడుకు అడ్డే లేదన్నట్లుగా చెలరేగిపోతోంది.   టీ20ల్లోనే కాదు టెస్టుల్లో కూడా ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు బాదుడే మంత్రంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా  సిక్స‌ర్లు, ఫోర్లు బాదేస్తూ ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన మ‌జాను అందిస్తున్నారు.  ఇక  రావ‌ల్పిండి వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు బెన్ డ‌కెట్‌(107; 110 బంతుల్లో 15 ఫోర్లు), జాక్ క్రాలే (122 ; 111బంతుల్లో 21 ఫోర్లు), వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ ఓలీపోప్‌(108; 104 బంతుల్లో 14 ఫోర్లు), హ్యారీ బ్యూక్‌(101 నాటౌట్; 81 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగారు, వీళ్ల వీర బాదుడుతో జరుగుతున్నది టెస్ట్ మ్యాచా లేక టి20 మ్యాచా అన్న అనుమానం కలిగింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల ధాటికి పాక్ బౌల‌ర్లు, ఫీల్డర్లు కూడా ప్రేక్షకుల్లా మారిపోయారు. ప్రేక్షక పాత్ర‌కే ప‌రిమితం అయ్యారు. సౌద్ ష‌కీల్ వేసిన 68 ఓవ‌ర్‌లో హ్యారీ బ్రూక్ 6 బంతుల‌ను ఫోర్లుగా మ‌లిచాడు. ఆట ఆఖ‌ర్లో కెప్టెన్ బెన్‌స్టోక్స్‌(34; నాటౌట్ 15 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) విరుచుకుప‌డ్డాడు. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో ఒక్క జో రూట్‌(23; 31 బంతుల్లో 3 ఫోర్లు) మిన‌హా అంద‌రూ రాణించారు.  

సిట్ డీలా.. ఈడీ దూకుడు

తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కంటే కూడా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మథ్య యుద్ధం జోరుగా సాగుతోంది. మద్యం కుంభకోణం, అవినీతి ఆరోపణలపై సీబీఐ, ఐటీ, ఈడీలు రాష్ట్రంలో దూకుడు పెంచితే.. వాటికి బ్రేక్ వేయడానికా అన్నట్లుగా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. ఈడీ, సీబీఐని మించి ఆరంభంలో సిట్ దూకుడుగా ముందుకు సాగింది. రాష్ట్రం దాటి వెళ్లి మళ్లీ కొనుగోలు బేరసారాల గుట్టుమట్టు ఛేదించేస్తున్నామన్నంత బిల్డప్ ఇచ్చింది. బీజేపీలో కీలక నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేసింది. ఏదో బ్రహ్మాండం బద్దలైపోతోందా అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సిట్ దూకుడు ముందు ఈడీ, సీబీఐల దూకుడు తేలిపోయిందా అన్న అభిప్రాయం ఏర్పడేలా చేసింది. అయితే రోజులు గడిచే కొద్దీ సిట్ ది ఆరంభ ఆర్భాటమేనని తేలిపోతే.. ఈడీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ ఎన్ని ఆరోపణలు వచ్చినా సీఎం కేసీఆర్ కుమార్తె జోలికి రాని ఈడీ తాజాగా అరోరా రిమాండ్ రిపోర్టులో వంద కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని పేర్కొంది. అదే సమయంలో సిట్ ఎన్ని నోటీసులు జారీ చేసినా, లుక్ ఔట్ నోటీసులంటూ హడావుడి చేసినా తెలంగాణ బయట వ్యక్తులను ఒక్కరిని కూడా విచారణకు రప్పించలేకపోయింది. లుకౌట్ నోటీసులతోనూ సిట్ ఏమీ సాధించలేకపోయింది. అయితే సిట్ హడావుడిపై నిందితులుగా చెప్పబడుతున్న వారే కాదు.. సామాన్య జనం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇలాంటి ఆరోపణలతోనే గతంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతిని ప్రస్తావిస్తూ.. అప్పట్లో పెద్ద మొత్తంలో సొమ్ము లభ్యమైందనీ, ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలంటూ చేబుతున్నా ఎక్కడా డబ్బు దొరకకపోవడమే ఈ స్టింగ్ ఆపరేషన్ అంటే కేసీఆర్ అండ్ కో చెబుతున్న కహానీలో చాలా లొసుగులున్నాయని పరిశీలకులు అంటున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య పోటీలో సిట్ వెనుకబడిపోయిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  సిట్ ఇంత వరకూ తెలంగాణ బయట వ్యక్తుల్ని ఒక్కర్ని కూడా రప్పించి ప్రశ్నించలేకపోయింది. ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీచేసినా… ప్రయోజనం లేకపోయింది. అరెస్టులు చేస్తామని హడావుడి చేస్తోంది కానీ.. వారు   కోర్టులకు వెళ్లి సిట్ తీరుపై అనుమానాలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. దీంతో సిట్ ముందరి కాళ్లకు  బంధాలు పడుతున్నాయి. బీఎల్ సంతోష్‌కు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే స్టే ఉంది. తుషార్‌నూ అరెస్ట్ చేయవద్ది హైకోర్టు చెప్పింది. సీబీఐకి ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ విచారణలో ఉంది. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ   ప్రణాళికాబద్దంగా మందుకెళ్తోంది. అమిత్ అరోరా ను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఫోన్లు మార్చిన వైనం… ఇతర వ్యవహారాలు చేర్చారు. ఆర్థిక లావాదేవీల అంశాన్నీ ప్రస్తావించారు. శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలే ప్రధానం అని చెబుతున్నారు. ఇప్పుడ వారికి అరెస్ట్ ముప్పు పొంచి ఉంది.  ఇక సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులకు అధికారం సరిపోదన్న కారణంతో… హైకోర్టు సీబీఐకి ఇస్తే.. మొదటికే మోసం తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

అరెస్టు చేసుకుంటారా చేసుకోండి.. భయపడేదే లే.. కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. తొలి నుంచీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ సీబీఐ, ఈడీ విచారణ్లలోనూ ఇప్పటి వరకూ కవిత పేరు బయటకు రాలేదు. దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయంగా కేసీఆర్ కుటుంబాన్ని అప్పతిష్టపాలు చేయడానికే నంటూ టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు వాస్తవమేనా అని అనుమానాలు సైతం రాజకీయ వర్గాలలో వ్యక్తం అయ్యాయి.   అయితే ఈడీ దర్యాప్తులో భాగంగా కవితకు సన్నిహితులుగా పేరొందిన అభిషేక్ రావు అరెస్టుతో మళ్లీ కవిత లక్ష్యంగా విమర్శలు గుప్పుమన్నాయి. ఆ తరువాత మళ్లీ చల్లబడ్డాయి. తొలుత ఈ స్కాంలో తనపై ఆరోపణలు చేయకుండా కవిత కోర్టుకు వెళ్లారు కూడా. అయితే ఇప్పుడు  ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి అందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు  ప్రస్తావించింది. . సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని, ఈ విషయాన్ని అరోరా అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది.. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవితలు ప్రధానంగా సూత్రధారులు కాగా.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కో ఆర్డినేట్ చేశారనీ ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.   ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు మార్చేశారనీ ఈడీ ఆరోపించింది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. అనంతరం వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఓ చార్జిషీటు.., ఈడీ ఓ చార్జిషీటు దాఖలు చేసింది. ఆ రెండు చార్జిషీట్లలోనూ కూడా   కవిత పేరు లేదు.  ఇప్పుడు.. దినేష్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇహనో ఇప్పుడో కవితకు నోటీసులు వస్తాయని పరిశీలకులు అంటున్నారు.  కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో  నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానిగా మోదీ అధికారంలో వచ్చాకా ఇప్పటి వరకూ   తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి, అడ్డదారిలో ఆయా రాష్ట్రాలలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారని కవిత అన్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు ఎన్నికల సంవత్సరంలో ఈడీ వెళుతుండటం ఈ ఎనిమిదేళ్ల కాలంలో మామూలైపోయిందన్నారు.  మోడీ దేశంలోని బీజేపీ యేతర ప్రభుత్వాల కూల్చివేతలకు కుట్రలు పన్నడమే పాలన అనుకుంటున్నారని కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రానికి ఈడీ వచ్చిందని కవిత అన్నారు.   తన మీద కానీ, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కానీ ఈడీ దాడులు జరగడం సహజమేనని... వాటికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని అన్నారు. జైల్లో పెడతామంటే ఇక చేసేదేముందని... పెట్టుకో అని కవిత అన్నారు. ఈడీ విచారణకు తాము సహకరిస్తామని చెప్పారు.  

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కారల్ మార్క్స్. అయితే ఆయన అన్నది ఒక అర్ధంలో అయితే అనుబంధాలకే అర్ధం మారిపోయిన ఈ కలికాలంలో ఆర్థిక ప్రయోజనాల కోసమే మానవ సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారా అన్నట్లుగా ఉంటోది కొందరి తీరు. రాజస్థాన్ లో కట్టకున్న భార్యను అత్యంత కిరాతకంగా కారుతో తొక్కించి హత్య చేశాడో మృగాడు. కారణమేమిటో తెలుస్తే ఇంత దారుణమా అనక మానరు ఎవరైనా. రాజస్థాన్ లో మహేష్ చంద్ అనే వ్యక్తి తన భార్య షాలును కారుతో తొక్కించి దారుణంగా హతమార్చాడు. కేవలం భార్యపేరున ఉన్న రూ. కోటి 90 లక్షల బీమా సోమ్ము కోసమే అతడీ దారుణానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 5వ తేదీన ఈ హత్య జరిగింది. తన కజిన్ తో కలిసి ఆలయానికి బైక్ పై వెళుతున్న షాలూను ఓ స్పోర్ట్స్ వెహికిల్ అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో షాలూ అక్కడికకడే మరణించింది. ఆమె కజిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. తొలుత అంతా ఇది యాక్సిడెంటే అనుకున్నారు. అయితే షాలూ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. భార్య పేరు మీద ఉన్న బీమా సొమ్ముల కోసం భర్తే ఈ యాక్సిడెంట్  చేశాడని తేలింది. భార్యను హత్య చేయడానికి మహేష్ చంద్ రౌడీ షీటర్ తో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.  2015లో మహేశ్-షాలు ల వివాహమవ్వగా.. ఒక కుమార్తె ఉంది. రెండేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో షాలు తన పుట్టింట్లోనే ఉంటోంది. 2019లో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఇటీవల షాలు పేరుపై ఇన్సూరెన్స్ చేయించిన చందు.. తానో కోరిక కోరుకున్నానని, అది నెరవేరాలంటే 11 రోజులపాటు ప్రతి రోజూ బైక్‌పై హనుమంతుడి గుడికి వెళ్లాలని భార్యకు చెప్పాడు. తన కోరిక నెరవేరిన వెంటనే ఇంటికి తీసుకొస్తానని భార్యకు చెప్పాడు. భర్త మాటలు నమ్మిన ఆమె ప్రతి రోజూ బైక్‌పై ఆంజనేయుడి గుడికి వెళ్లి రావడం మొదలుపెట్టింది. భర్తపై గుడ్డి  నమ్మకమే ఆమె ప్రాణాలు హరించింది. ఈ కేసులో రౌడీ షీటర్ రాథోడ్ తో పాటు, ఎస్ యూవీ యజమాని, సోనులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహేశ్, మరోకరి కోసం గాలిస్తున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ కు కరోనా

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందని ప్రపంచం అంతా ధీమాగా ఉంది. ప్రజలు కరోనా జాగ్రత్తలను గాలికి వదిలేశారు. ప్రయాణ ఆంక్షలు లేవు. భౌతిక దూరం పాటించడమన్న మాటే మర్చిపోయారు. శానిటైజన్ల వాడకం తగ్గిపోయింది. మాస్కుల మాట చెప్పనే అక్కర్లేదు. అయితే కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదనీ, ప్రపంచ వ్యాప్తంగా కేసులలో గణనీయ పెరుగుదల కనిపిస్తోందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పటికే చైనాలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పలు దేశాలలో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చాపకింద నీరులా ఉందని వార్తలు వస్తున్నాయి. మరో సారి కరోనా జాగ్రత్తల గురించి ప్రపంచ దేశాలు పట్టించుకోక తప్పని అనివార్యత ముందు ముందు ఎదురు కావచ్చునని అంటున్నారు.  ముఖ్యంగా కరోనా వ్యాప్తికి కారణమైన చైనాలో  ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు బయటపడుతుండటంతో.. అక్కడి ప్రజలు ముందు జాగ్రత్తగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషీన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని బిల్ క్లింటన్ తెలిపారు. వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వేయించుకోవడం వల్ల కరోనా తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచించారు.

ముందస్తే.. మరో మాటే లేదు.. సంకేతాలిచ్చిన మంత్రి

ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలు తధ్యమన్న మాట గట్టిగా వినిపిస్తోంది.. తెలంగాణలో   కేసీఆర్ గతంలో మాదిరి ఈసారి కూడా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు జై కొడతారంటున్నారు?  . తెలంగాణలో ముందస్తుకు ఛాన్స్ లేదంటూనే.. కేసీఆర్   ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయికి వెళ్ళబోతున్నాం కనుక ముందుగా ప్రచారం తెలంగాణ నుండే మొదలు పెట్టనున్నామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. మరోవైపు డిసెంబర్ లో ప్రణాళికలు మొదలు పెట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు వెళ్లనున్నారని ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక, ఏపీ విషయానికి వస్తే సీఎం జగన్ ముందస్తుకు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి స్పష్టతా లేకున్నా.. జగన్ సర్కార్ పై వ్యతిరేకత భావన మొదలైందన్న సర్వేల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనిపార్టీ శ్రేణుల్లోనే గట్టిగా వినిపిస్తోంది. గడప గడపకు కార్యక్రమంలో వ్యతిరేకత చూసిన నేతలు కూడా అధిష్టానానికి ముందస్తే బెటరని చెప్పారని అంటున్నారు.  వ్యతిరేకత మరింత ముదరక ముందే ముందస్తుకు వెళ్లాలని అధిష్టానం సిద్దమైపోయిందని అంటున్నారు. ఇప్పటికే  ఒకరిద్దరు   కీలక నేతలు ఇదే విషయంపై మాట్లాడినా కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు మాట్లాడారు.. తప్ప ముందస్తు కు వెళతామని కానీ, వెళ్లేది లేదని కానీ  చెప్పలేదు. కానీ మంత్రి అప్పలరాజు మాత్రం   ముందస్తు తథ్యం అనే స్థాయిలో మాట్లాడారు. పలాసలో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయి   సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.   ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని చెప్పారు. అంటే గడప గడపకూ మన ప్రభుత్వం ఎన్నికల ప్రచారమేనని ఆయన కుండ బద్దలు కొట్టేశారు.   ఆయన మాటలను బట్టి ఏపీలో ముందస్తు తధ్యమనే పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   నిజానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. పెరిగిన అప్పులకు తోడు వడ్డీలు భారమైపోతున్నాయి. పోనీ.. పరిశ్రమలు, ఇండస్ట్రీలు, కార్పొరేట్ ఆఫీసులు వస్తే ఆదాయం పెరుగుతుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. ఏ నెలకు ఆ నెల బొటాబొటీ ఆదాయం.. అప్పులతో ప్రభుత్వం నెట్టుకొస్తుందని ఆర్ధిక విశ్లేషకులు  చెప్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మరో ఏడాది పాటు ఇలాగే ప్రభుత్వాన్ని నడపడం అంటే అప్పటి పరిస్థితులలో ఏదైనా జరగొచ్చు. అందుకే ముందొస్తే ముద్దని వైసీపీ ఫిక్స్ అయిపోయిందని బలంగా వినిపిస్తుంది.

ఆ పెళ్లి కూతురుకు ముముము ముద్దంటే చేదే..

ప్రేమికులు, దంపతులు ఇలా ఎవరి మధ్య అయినా ముద్దు.. ముచ్చట ఉంటేనే వారి బాంధవ్యం కలకాలం నిలుస్తుందంటారు. అలాంటిది ఒక్క ముద్దు జస్ట్ ఒక్క ముద్దు పీటల మీదే  పెళ్లిని పెటాకులు చేసేసింది. ఎలాగూ మూడుముళ్లూ వేస్తాను కదా అన్న ధీమాతో దండలు మార్చుకున్న వెంటనే పెళ్లి పీటల మీదనే కొంటెగా చిరు ముద్దు పెట్టాడు. అంతే పెళ్ల కుమార్తెకు చిర్రెత్తుకొచ్చింది. ఈ మొగుడు నాకు వద్దంటే వద్దని పీటల మీద నుంచి లేచి చక్కా వెళ్లి పోయింది. సర్ది చెప్పడానికి పెళ్లి పెద్దలు, తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి పెళ్లి కొడుకు క్షమాపణలు చెప్పినా కాదు పొమ్మంది. దీంతో ఈ పంచాయతీ పోలీసుల వరకూ కూడా వెళ్లింది. ఒకింత ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంభల్ జిల్లాలో పరిగింది. బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్లీ గ్రామానికి చెందిన ఓ యువ‌కుడికి, సంభ‌ల్ జిల్లా ప‌వాస‌కు చెందిన ఓ యువ‌తితో వివాహం నిశ్చయించారు. న‌వంబ‌ర్ 26న ముహూర్తం ఫిక్స్ చేశారు. అంత వరకూ బానే ఉంది. దండ‌లు మార్చుకున్న త‌రువాత వ‌ధువుకు వ‌రుడు ముద్దు పెట్టాడు. ఆ ముద్దే వ‌ధువుకు కోపం తెప్పించింది. వెంట‌నే పెళ్లిపీట‌ల పై నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. పంచాయతీ పోలీసుల వరకూ వెళ్లింది. అందరి ముందూ ముద్దు పెడతాడా అని పెళ్లి కూతురు కోపగించింది. అతడు భర్తగా వద్దే వద్దని భీష్మించింది. చివరకు చేసేదేం లేక పెళ్లి రద్దు చేసుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. 

రాష్ట్రంలో పులివెందుల సంస్కృతి.. చంద్రబాబు మాటలు నిజమేనా?

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన స్థితికి చేరింది. రాష్ట్రంలో జగన్ పాలన కారణంగా అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతున్నారు. అందుకు విపక్ష నేత పర్యటనలకు ఆంక్షలను సైతం లెక్క చేయకుండా పోటేత్తుతున్న జనమే నిదర్శనం. అయితే విపక్ష నేతల భద్రతకు ముప్పు కలిగించేలా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయింది. ఇందుకు నెలల కిందటి నుంచే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ హఠాత్తుగా భద్రత పెంచడానికి కారణమేమిటో ఇప్పుడు మరింత స్పష్టంగా తెలిసిపోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన భద్రతకు ముప్పు పెరిగిందని ఎన్ఎస్టీ భావించివంది. జడ్ ప్లస్ క్యాటగరి సెక్యూరిటీ కవర్ లో ఉండే చంద్రబాబుపై ఆయన స్వంత నియోజకవర్గంలోనే దాడి యత్నం జరగడంతో ప్రమాదఘంటికలు మోగుతున్నాయని  ఎన్ఎస్జీ గత ఆగస్టులోనే గుర్తంచింది. అందుకే   గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ సిబ్బంది ఉండగా.. నేటి నుంచి అదనంగా నలుగుర్ని నియమించింది.  అంతే కాదు గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు పర్యవేక్షణ డీజీపీ రేంజ్ అధికారికి అప్పగించింది. ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ స్వయంగా టీడీపీ కార్యాలయం,  ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని పరిశీలించి మరీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఇక కుప్పంలో చంద్రబాబుకు  మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గత ఆగస్టు 24 నుంచి చంద్రబాబుకు 12 ప్లస్ 12 ఎన్ఎస్జీ బృందం రక్షణ కవచంగా నిలుస్తోంది. ఇప్పుడు స్వయంగా చంద్రబాబే తనను, తన కుమారుడు లోకేష్ ను ఎలిమినేట్ చేద్దామనుకుంటున్నారని చెప్పారు. తెలుగుదేశం చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించి చెప్పడమే కాకుండా రాష్ట్రంలో జగన్ సర్కార్ ను వ్యతిరేకించేవారు, విమర్శించే వారిని భౌతికంగా అంతం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అలాగే వైసీపీ నేతలు తననే బెదరిస్తున్నారనీ, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పి ఉంటే.. పరిటాల రవీంద్రను హత్య చేసినట్లే తననూ లేపేసి ఉండేవారమని వైసీపీ నేతలు బెదరిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఇఫ్పుడు లోకేష్ ను చంపేస్తామంటున్నారని అన్నారు. ఔను గత ఆగస్టులో చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత పెంచినప్పుడు ఎవరికీ ఆయనకు ఈ స్థాయి ముప్పు ఉందని అర్ధం కాలేదు కానీ వైసీపీ నేత అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి   వైఎస్ రాజశేఖర్రెడ్డి... మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును అప్పుడే ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని చేసిన వ్యాఖ్యలు... ఇటీవలి కాలంలో వరుసగా చంద్రబాబు పర్యటనలలో ఆయన లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు గమనిస్తే.. ఎన్ఎస్జీ చంద్రబాబుకు భద్రత ఎందుకు పెంచిందో అవగతమౌతుంది. ఇక ‘ఇదేం ఖర్మరా మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా తనను, తన కుమారుడిని టార్గెట్ చేశారని, బెదరిస్తున్నారనీ చెప్పారు. సొంత బాబాయిని చంపినంత తేలిగ్గా తననూ హత్య చేయాలని భావిస్తున్నారని అన్నారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు, సాక్షులకు, దర్యాప్తు అధికారులకు బెదరింపుల సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు రాష్ట్రం తరలి ఎందుకు వెళ్లిపోయిందో, కోడి కత్తి డ్రామా ఎవరు ఆడారో జగన్ చెప్పాలన్నారు. సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తు రాష్ట్రం బయట జరగాలని సుప్రీం కోర్టే ఆదేశించిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్రం మొత్తం పులివెందుల సంస్కృతి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారంటూ చంద్రబాబు ఇంత కాలంగా చేస్తున్న విమర్శలు కేవలం విమర్శలు కావని ఈ మూడేళ్లలో రుజువు అవుతూనే వస్తోంది.  వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చారని.. కోడి కత్తి డ్రామా ఆడారంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పోలీసుల మెడ మీద కత్తి పెట్టి పని చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా కేసు సుప్రీం కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు వెళ్లడం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి చంద్రబాబును, లోకేష్‌ను చంపుతామనే బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. నేర చరిత్ర ఉన్న నేతలు ఇలా ప్రకటనలు చేస్తూండటంతో టీడీపీ నేతల్లోనూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉండటంతోనే … కేంద్రం భద్రత పెంచిందని భావిస్తున్నారు. ఆషామాషీగా ఇలాంటి హెచ్చరికలు చేయరని.. రాజకీయ వర్గాలు సైతం భావిస్తున్నాయి. 

తెలంగాణలో ఇప్పుడు షర్మిల టైమ్

ఒకే ఒక్క ఘటన వైఎస్ షర్మిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేసిన కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం నివాసం ప్రగతి భవన్ కు వెళ్తున్న షర్మిలను కారులోనే ఉంచి, టోయింగ్ మిషన్ తో లాక్కెళ్లి, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి, రాత్రికి కోర్టులో ప్రవేశపెట్టే దాకా.. ఆపైన ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసేదాకా జరిగిన ఎపిసోడ్ తో షర్మిలకు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలు మొదలు రాష్ట్రస్థాయి నేతలు.. మరీ ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై నుంచి కూడా మద్దతు లభించింది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, టీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలే టార్గెట్ గా కొంత కాలంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తునా.. ఏడాది క్రితం నుంచి తెలంగాణ గ్రామాల్లో పాదయాత్రగా వెళ్తున్నా.. మంగళవారాల్లో ‘నిరుద్యోగ దీక్ష’లు చేస్తున్నా.. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ నిత్యం ఆరోపణలు చేస్తున్నా.. ఢిల్లీ వెళ్లి సీబీఐకి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు ఫిర్యాదు చేసినా రానంత మైలేజ్ ఈ ఒక్క ఘటనతోనే షర్మిలకు వచ్చింది. షర్మిల కారులో ఉండగానే.. టోయింగ్ వాహనానికి కట్టి ఆమెను తీసుకెళ్లిన పోలీసులపైన, టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పక్కన కోర్టు అనుమతితో నిర్మల్ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిష్టాత్మంగా చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర కన్నా వైఎస్ షర్మిలకే ఎక్కువ మైలేజ్ రావడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం. ఆ వెంటనే బండి సంజయ్ స్పందించారు. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన తీరు, ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి, పోలీస్ స్టేషన్ లో దురుసుగా తీసుకెళ్లిన తీరును తీవ్రంగా ఖండించారు. కేంద్రం మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తీరును, పోలీసుల వ్యవహార సరళిని తప్పుపట్టారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ లో విభేదాల కారణంగా కుతకుతలాడుతున్న గవర్నర్ తమిళిసై కూడా షర్మిలకు మద్దతుగా నిలిచారు. ఒక మహిళను, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. ఒక పార్టీ అధ్యక్షురాలు షర్మిల పట్ల పోలీసులు, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదంటూ ట్వీట్ చేస్తూ.. ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, కొండా సురేఖ కూడా షర్మిలకు మద్దతుగా నిలిచారు. షర్మిలను అరెస్ట్ చేసిన తీరును, టోయింగ్ వాహనం ద్వారా ఆమె లోపలే ఉండగా కారును టోయింగ్ చేసుకెళ్లిన వైనాన్ని జాతీయ స్థాయిలో కూడా మీడియా ప్రసారం అయింది. షర్మిల కారులో ఉండగానే లాగడంపైన ఇప్పుడు నేతలంతా స్పందిస్తున్నారు. వైఎస్ షర్మిలకు తెలంగాణలో ఆదరణ ఏ మేరకు ఉంది? ఆమెకు ఎంత మేరకు ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారని సమాచారం. తెలంగాణలో పాగా వేయాలనే టార్గెట్ తో శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ కేసీఆర్ పై పోరాటం చేసే ఎవరికైనా మద్దతిచ్చేందుక రెడీగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య తాజాగా ట్వీట్ల వార్ జరుగుతోంది. ‘తాము వదిలిన బాణం.. తాన అంటే తందాన అంటున్న తామరపువ్వులు’ అంటూ కవిత ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ ను షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. ‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’ ట్వీట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల కారవాన్ కు నిప్పంటించడంతో పాటు ఆమె కాన్వాయ్ లోని వాహనాలను టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేయడం.. శాంతి భద్రతల సమస్య పేరుతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి, ఆపైన హైదరాబాద్ తీసుకురావడం, ఆ తర్వాతి రోజు షర్మిల ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతి భవన్ వైపు రావడం, కారులోనే షర్మిల ఉండగా కారుతో సహా టోయింగ్ వాహనంతో పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఒక్కసారిగా షర్మిలకు మైలేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక కోర్టు అనుమతి ఇవ్వడంతో పాదయాత్ర ఆగిన చోటు నుంచే మళ్లీ యాత్ర ప్రారంభిస్తానని షర్మిల ప్రకటించడం గమనార్హం.

జగన్ పాలనలో ఏపీలో కడప రెడ్ల రాజ్యం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంలోకొంత ముందు వెనక అయినా, చివరకు అందరూ అనుకున్నదే,అనుమానించిందే,జరిగింది.మొదటినుంచి అందరూ అనుకున్నట్లుగానే 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి కెఎస్‌ జవహర్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎంఓలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్‌రెడ్డి, సీఎస్‌గా 2024 జూన్‌ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ఆ ప్రకారంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయనే సీఎస్‌గా ఉండబోతున్నారు. కాగా ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ బుధవారం (నవంబర్ 30) రిటైర్‌ అయ్యారు. ఆయన స్థానంలో జవహర్‌రెడ్డి గురువారం(డిసెంబర్‌ 1) నుంచి కొత్త సీఎస్‌గా పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతవరకు అయితే ఓకే. అయితే, జవహర్‌రెడ్డి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం. సీనియారిటీ ప్రాధాన్యతా క్రమాన్ని తీసి  పక్కన పెట్టింది. ముందున్న మూడు బ్యాచ్‌ల అధికారులను కాదని, 1990 బ్యాచ్‌కు చెందిన జవహర్‌రెడ్డిని ముందు వరసలోకి తీసుకొచ్చింది. ఇలా, సీనియారిటీ పక్కన పెట్టి జూనియర్ అధికారిని ఎంపిక చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.  నిజానికి 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, 188 క్యాడర్‌కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్‌కు చెందిన కరికల్‌ వలెవన్‌ను కాదని, జవహర్‌రెడ్డిని సీఎస్‌గా ఎంపిక చేయడం అనేక అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. జవహర్‌ ‘రెడ్డి’ కోసం జగన్ ‘రెడ్డి’ రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారాలను వినియోగించుకుని ఆయన్ను వెనక నుంచి ముందుకు తీసుకురావడం, ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే, జవహర్ రెడ్డికి ఉన్నప్రత్యేక అర్హత ఏమిటంటే, అది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. జవహర్ ‘రెడ్డి’ పేరులోనే పెన్నిది ఉందని,  ఆయన పేరులోని చివరి రెండు అక్షరాలే, ఆయనకున్న ప్రత్యేక అర్హతని, అటున్నారు.  అయితే, ఇలా  జరగడం ఇదే మొదటిసారా, అంటే, లేదు. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు సీనియర్లను కాదని.. తమకు నచ్చిన వారిని సీఎస్‌లుగా నియమించిన సందర్భాలు లేక పోలేదు. నిజానికి, ఈ సంప్రదాయం ఒక్క ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాలలో చివరకు కేంద్రంలోనూ ఉన్నదే. ప్రధాని కార్యాలయం (పీఎంఓ) లో పేర్లను గమనిస్తే, కీలక పదవుల్లో గుజరాతీ బాబులే ఉంటారు. నిజానికి ఒక పీఎంఓలో కాదు, సీబీఐ, ఈడీ,సీఈసీ వంటి కీలక పదవుల్లో గుజరాతీలు కాదంటే నాగపూర్ వాసనలున్న అధికారులే ఉంటారు. అంతే కాదు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పదవుల్లో కొనసాగుతున్న అధికారులు అనేక మంది ఉన్నారు. అలాగే ఇతర మత్రుల కార్యాలయాల్లోను ఆయా మంత్రుల స్వరాష్ట్రానికి చెందిన, అందులోనూ అస్మదీయలే అధికంగా ఉంటారు. అలాగే, పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎస్ మొదలు ప్రధాన శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధిరులు అంతా బీహార్ నుంచే దిగుమతి అవుతారు.   అయినా, ఇలా ముఖ్యమంత్రులు తమకు ఇష్టమైన, అనుకూలమైన అధికారులను నియమించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే అయినా ఇప్పటికే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్,రాష్ట్ర ప్రభుత్వం ‘అధికారు’ల పరిధిని రెండు అక్షరాలకు, కడప జిల్లాకు పరిమితం చేయడం చుట్టూ విమర్శలు వినిపిస్తున్నాయి.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరో, ఏ జిల్లా వాసో వేరే చెప్పనక్కరలేదు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ముఖ్యమంత్రి స్వగ్రామం. ఇక అధికారుల విషయానికి వస్తే, తాజాగా సీఎస్ గా నియమితులైన జవహర్ రెడ్డి కడప జిల్లా వాసే. అలాగే రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ  కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి అదే కడప జిల్లా వాసి. అంటే రాష్ట్రంలో  సీఎం, ప్రభుత్వ వ్యవహారాలలో డిఫాక్టో సీఎంగా అభివర్ణించే సీఎస్, అలాగే అత్యంత కీలకమైన పోలీస్ బాస్ ముగ్గురూ ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లాకు చెందిన వారు. ఒక  వైసీపీ ప్రభుత్వంలో ఆయన తర్వాత ఆయనంతటి వాడు, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్దులైన ప్రభుత్వ ప్రధాన సహదారు, సజ్జల రామ కృష్ణా ‘రెడ్డి’, కడప ‘జాతి’ రత్నమే.  గత ఫిబ్రవరిలో జగన్ రెడ్డి ప్రభుత్వం, అంతవరకు రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌’ను తప్పించి, కసి’రెడ్డి’ని పోలీస్ బాస్ ను  చేసింది. ఆయన కున్న ప్రత్యేక అర్హత కూడా ఆ రెండు అక్షరాలు ప్లస్ మీది తెనాలి ..మాది తెనాలి అన్నట్లుగా కడప రిలేషన్, అంటారు.  అయితే ఎవరు ఏమనుకున్నా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు మత పరంగా, ఆయన విశ్వసించే క్రైస్తవ మతానికి, కులం పరంగా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఆవి ఆరోపణలు ఆరోపణలు కాదు అక్షర సత్యాలని తేలిపోయింది.

షర్మిల వర్సెస్ కవిత ఇద్దరికిద్దరు తగ్గేదేలే

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ ఉదంతం, చిలికి చిలికి గాలివానగా మారుతోందా? అంటే, జరుగుతన్న పరిణామాలు అలాంటి  సంకేతాలే ఇస్తున్నాయని విశ్లేషకులు  అంటున్నారు. అయితే  ఒక మంచి చేయి తిరిగిన స్క్రిప్ట్ రచయిత రాసి  తెర కెక్కించిన సినిమా స్క్రిప్ట్ లా కొడుతున్న ఈ పొలిటికల్ డ్రామా  స్క్రిప్ట్ రచయిత ఎవరు? ఈ చిత్రానికి ఎవరు ఫైనాన్సు చేస్తున్నారు? అసలు షర్మిల సాగిస్తున్న పాదయాత్రకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు అనేక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షర్మిల పాదయాత్రకు  ఎంత లేదన్నా రోజుకు, పదిలక్షలకు పైగానే ఖర్చవుతుంది అని అంటున్నారు. ఇంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియని చిదంబర రహస్యంగా మిగిలిపోయింది.  ఒకప్పడు  వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కష్టమైందని  కేవీపీ రామచంద్ర రావు ఎంతో మంది మందు చేతులు కలిపితేనే గానీ, నిధులు సమకూరలేదని  కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎమెస్సార్,   నడిచింది వైఎస్సార్ అయినా అనడిపించింవాడు కేవీపీ అంటూ కేవీపీకి కితాబు నిచ్చారు. నిజానికి, పాదయాత్ర ప్రారంభించే సమయానికే రాజశేఖర రెడ్డి రాష్ట్ర టాలెస్ట్  లీడర్స్ లో ఒకరు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్  అప్పటికే అనేక మార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పెద్ద నాయకుడు. అలాంటి ఆయన పాదయాత్రకే నిధుల సమస్య ఎదురైనప్పుడు, అసలు ఇంత వరకు ఏమీ కానీ, అధికార పదవి వాసన అయినా తెలియని, షర్మిల పాదయాత్రకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఫండింగ్ చేస్తున్నారు?  అనేది ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్నగా చర్చకు వస్తోంది.  నిజానికి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో   ఆమె ఎవరు వదిలిన బాణం?  అనే మకుటం చుట్టూ చాలా చర్చ జరిగింది. ఒక దశలో ఆమెకు ఆమె భర్త  బ్రదర్ అనిల్ ద్వారా విదేశీ క్రైస్తవ సంస్థల నుంచి నిధులు అందుతున్నాయనే అనుమానాలు వినిపించాయి. అలాగే  ప్రభత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు తెరాస నాయకత్వమే ఆమెను రంగంలోకి దింపి ఫండింగ్ రిసోర్స్  కూడా క్రియేట్ చేశారనే ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా డబ్బుల గురిచి సుద్దులు చెప్పే ఓ ప్రముఖ నగల వ్యాపారి పేరుకు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఇవేవీ అధరాలు లేని ఊహాగానలే కావచ్చును గానీ, ఆమె సంవత్సరం పైగా పార్టీని నడుపుతున్నారు. డబ్బులు ఖర్చుచేస్తున్నారు. నడుస్తున్నారు. సో ... ఎక్కడో ఓక దగ్గర నుంచి నిధులు అందుతున్నాయి  అందులో సందేహం లేదు. అవి ఎక్కడి నుంచి అనేది తేలవలసి ఉంది. అలాగే షర్మిల బీజేపీ వదిలిన బాణమని మరో  ప్రచారం కూడా జరిగింది. ఇప్పడు కూడా తెరాస ఎమ్మెల్సీ కవిత, ట్వీటర్ వేదికగా, ‘తాము వదిలిన బాణం తామే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ  కవిత్వ బాణం బాణం సంధించారు.  అదలా ఉంటే, షర్మిల అరెస్ట్ ఉదంతం, చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా, షర్మిల స్టొరీ లోకి తెరాస ఎమ్మెల్సీ కవిత ఎంటర్ కావడంతో, ఆ ఇద్దరి మధ్య సాగుతున్న ట్వీట్స్ కాక రేపుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ. షర్మిలపై ఎమ్మెల్సీ ‘కవిత’  ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ కు ఎమ్మెల్సీ కవిత మరోసారి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ట్వీట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల బీజేపీ పార్టీ కోవర్టు అని, పొలిటికల్ టూరిస్ట్ అంటూ  కవిత ట్వీట్ చేశారు.   అయితే షర్మిల తగ్గేదేలే  అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఆమె రేపు (గురువారం) రాజ్ భవన్ కి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తో భేటీ కానున్నారు. తన అరెస్ట్ సహా టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడులపై గవర్నర్ కు వివరించనున్నారు. అలాగే తన పాదయాత్రకు సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా,వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్‌ షర్మిల అరెస్ట్ సహా అందుకు దారి తీసిన పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. షర్మిల భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు చెప్పారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్‌ పేర్కొన్నారు. అందుకే, షర్మిల అరెస్ట్ ఉదంతం చిలికి చిలికి గాలి వానగా మారుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బండి నోటా అదే మాట ..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిజంగా ఉంటాయో లేదో కానీ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అదే చర్చ జరుగుతోంది. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు  ధర్మాసనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించి, వ్యాఖ్యానించింది. ఇక రాజకీయ పార్టీలు, నాయకులు అయితే, ముందస్తు గురించి మాట్లాడని రోజంటూ ఉండదు. ఇక మీడియా సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. సెన్సేషన్ చేసేందుకు, ఏ వార్త చిక్కని రోజు, జాడిలోంచి ఊరగాయ పచ్చడి వచ్చినట్లు, ముందస్తు ఎన్నికల చర్చ తెర మీదకు వస్తుంది. అయితే నిజానికి, ముందస్తు వస్తే ముందుగా చెప్పి అయితే రాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే అదే అవుతుందని, ధైర్యంచేసి ముందడుగు వేస్తే, ఆగమన్నా ఆగదు. అయితే  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి అయితే అంత రిస్క్ తీసుకునే పరిస్థితి అయితే లేదని అంటున్నారు.  అదలా ఉంటే, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆరునెలల్లో తెలంగాణలో ప్రభుత్వం మారిపోతుందని, బీజేపీ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. బీజేపే ప్రభుత్వం రాబోతోందనే బండి  విశ్వాసాన్ని కాసేపు పక్కన పెడితే, అయన కూడా ముందస్తు ఎన్నికల తప్పవనే చెపుతున్నట్లుగా వుంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రం నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని గుండెగాం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత సభలో బండి సంజయ్  ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి  బండి సంజయ్ మాత్రమే కాదు, కొద్దిరోజుల కిందట తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఇంచు మించుగా ఇవే వ్యాఖ్యలు చేశారు. అందరూ ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉందని అనుకుంటున్నారు  కానీ, అంత సమయం లేదు  ఆరేడు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అలాగే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ముందస్తు తధ్యం  అంటూ ఎప్పటినుంచో కుండ బద్దలు కొడుతున్నారు. బీఎస్పీ అధ్యక్షడు ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని కడుపుతో ఉన్నమ కనక మానదు అన్నంత గట్టిగా చెపుతున్నారు.  సరే ముందస్తు వస్తుందా  షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అనే విషయాన్ని పక్కన పెడితే  ఓ వంక బండి సంజయ్ మరో వంక వైఎస్సార్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల పాద యాత్రలను అడ్డుకునేందుకు అధికార తెరాస  ముఖ్యమంత్రి కేసేఆర్ ప్రభుత్వం చేసినవిఫల ప్రయత్నాలు, తెరాస ఇమేజ్ ని మరింతగా దిగాజరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఒకే దెబ్బకు మూడు పిట్టలు కేసీఆర్ కొత్త వ్యూహం ..

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార తెరాస గెలిచింది.అయితే, ఈ గెలుపు ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు ముఖ్యమంతి కే.చంద్రశేఖర రావు సహా పార్టీ నాయకులు ఎవరికీ సంతృప్తి ఇవ్వలేదు.వంద మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు అందరినీ, నెలరోజులకు పైగా నియోజకవర్గానికి కట్టి పడేసి, ఇంటింటికీ తిప్పినా, పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని వరాల జల్లు కురిపించినా, ఇంకా చాలా చాల చేసినా చివరకు ఓటుకు ఐదారు వేల రూపాయల చొప్పున పంచినా, తెరాస అభ్యర్ధికి వచ్చింది, పదివేల మెజారిటీ. అందుకే మునుగోడులో తెరాస సాధించిన విజయం ముఖ్యమంత్రికి సంతృప్తిని ఇవ్వలేదని, పార్టీ వర్గాల సమాచారం. తెరాస పదివేల మెజారిటీ వచ్చినా, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్’లో ఉంటే , అదో ‘తుత్తి’ అన్నట్లుగా ఉండేది, కానీ, బీజేపీ సెకండ్ ప్లేస్ కి రావడమే కాదు, గెలిచినంత పనిచేయడం అసలే మింగుడు పడడం లేదని అంటున్నారు.   అందుకే, మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, ముఖ్యమంత్రికి సంతృప్తి ఇవ్వలేదు సరికదా, తెరాస రాజకీయ ఎత్తుగడలు,వ్యూహాలను పునరాలోచించుకోవలసిన అవసరాన్నిగుర్తు చేసిందని పరిశీలకులు అంటున్నారు. మునుగోడులో  తెరాస ఆశించిన మెజారిటీ సాధించలేక పోవడం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ అయినా రాక పోవడం, కాంగ్రెస్ నాయకుల కంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ఎన్నికల వ్యూహకర్తలను మరింత ఆందోళనకు గురి చేసిందని అంటున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి, రాష్ట్రంలో ముక్కోణపు పోటీ కోరుకుంటున్నారు. ముక్కోణపు పోటీ ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలి, తెరాస గెలుపు సునాయాసం అవుతుందని ఆశించారు. అందులో భాగంగానే, ఒక వ్యూహం ప్రకారం ఓ వంక కాంగ్రెస్ ను బలహీన పరుస్తూ, మరో వంక బీజేపే ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చారు. రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తే తెరాసకు ఇక తిరుగుందడనే లెక్కతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిటైల్ గా కొని టోకున పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడంలో కేసీఆర్ చాలా వరకు సక్సెస్ అయ్యారు, కానీ, అందుకోసమే కాచుకు కూర్చున్న బీజేపీ ముప్పును ఎందుకనో కేసీఆర్ గుర్తించలేక పోయారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  నిజానికి, మోడీ షాల బీజేపీ మొదటి నుంచి కూడా  తమకు ఏ మాత్రం పట్టులేని రాష్ట్రాలలో, ‘టార్గెట్ ద సెకండ్ ఫస్ట్’ ఫార్ములానే ఫాలో అవుతూ వస్తోంది. అంటే, ముందు సెకండ్ ప్లేస్ లో ఉన్న ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి, తప్పించి, ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అధికార పార్టీని టార్గెట్  చేయడం కమల దళం ఒక ఫిక్సెడ్ ఫార్ములాగా ఫాలో అవుతోంది. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర ఇలా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా బీజేపీ ఇదే ఫార్ములా అమలు చేస్తోంది. తెలంగాణలోనూ, బీజేపీది అదే వ్యూహం. అయితే, కాగల కార్యంలో  సగం గంధర్వులే తీర్చారు అన్నట్లుగా, బీజేపీ లక్ష్యాన్ని,చాలా వరకు తెరాస పూర్తి చేసింది. ఏకంగా 12మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించింది. అందుకు అదనంగా, కాంగ్రెస్ లో అంతర్గత కలహాలను కావలసిన ఇంధనం సైతం తెరాస అందించిందని అంటారు. ఈ నేపధ్యంలో బీజేపీ ఏకు మేకై కూర్చుంది. ఇదేమి కొత్త విషయం కాదు, అయితే మునుగోడు ఫలితాల తర్వాత కానీ  తెరాసకు చేసిన తప్పు తెలిసి రాలేదు. అయితే, ఇప్పడు తెలిసినా చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకున్న చందంగా పెద్దగా ప్రయోజనం ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, తెరాస నాయకులు మాత్రం ఇంకా సమయం మించి పోలేదని అంటున్నారు.అలాగే ముఖ్యమంత్రి కేసేఆర్   ఇంతవరకు ఫాలో అవుతూ వచ్చిన వ్యూహాన్ని ఇప్పడు రివర్స్ లో ముందుకు తీసుకుపోయే కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారని  అంటున్నారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాద యాత్రపై తెరాస కార్యకర్తల దాడి, హైదరాబాద్ లో మెగా డ్రామా మధ్య ఆమె అరెస్ట్ జనసేన అధినేత హటాత్తుగా తెలంగాణా రాజకీయాల్లో వేలు పెట్టి సెంటిమెంట్ ను రగిల్చే వివాదస్పద వ్యాఖ్యలు చేయడం,ఈ అన్నిటినీ మించి, మంత్రి హరీష్ రావు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చుకోవడం... ఇలా ఒకదానితో ఒకటికి సంబంధం లేనట్లు జరుగతున్న పరిణామాలను  కలిపి చూస్తే  ఈ పరిణామాలు కేసీఆర్ రివర్స్ వ్యూహానికి నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు.  అలాగే, ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా, కేసేఆర్ కొత్త వ్యూహం ఉందని అంటున్నారు. ఓ వంక ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చింది అన్నట్లుగా, ప్రజలు, పార్టీలు. పత్రికలు, మీడియా ఎవరూ అంతగా పట్టించుకోని, వైసీపీటీపీ నాయకురాలు షర్మిలను అరెస్ట్ చేయడం ద్వారా, ఆమెకు కొంత మైలేజి కల్పించడం, తద్వారా దీర్ఘకాలంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొంత ఆమె వైపుకు తిప్పేందుకు  తెరాస వ్యూహ కర్తలు షర్మిల అరెస్ట్ డ్రామాను పండించారని అంటున్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ ‘బియ్యం’ వ్యాఖ్యలతో తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తే, హరీష్ రావు రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం వెనక  ఇంకా చాలా లోతైన వ్యూహమే ఉండి ఉంటుందని అంటున్నారు. ఏమైనా, మునుగుగోడు తర్వాత తెరాస వ్యూహం మారిందనే మాత్రం అందరు అంగీకరిస్తున్న నిజం. అంటున్నారు.

బందరు వైసీపీలో పీక్స్ కు వర్గ పోరు

బందర్ వైసీపీలో వర్గ పోరు పీక్స్ కు చేరింది. ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నానిల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోయేంత స్థాయిలో వైరం కొనసాగుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా పేర్ని నాని, బాలశౌరి తమ మధ్య విభేదాల్ని పబ్లిగ్గానే బయటపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బందరు పోర్టు పనుల విషయంలో కూడా ఇరువురూ పోటాపోటీగా పరస్పర  విరుద్ధ ప్రకటనలు చేశారు. పేర్ని నాని, బాలశౌరి మధ్య ఆధిపత్య పోరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు   తీవ్ర అయోమయంలో, గందరగోళంలో పడిపోతున్నారు. 2022 డిసెంబర్ లోనే బందరు పోర్టు పనులు ప్రారంభం అవుతాయని స్థానిక ఎంపీ  బాలశౌరి గతంలో ప్రకటించారు. అయితే.. ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా   పేర్ని నాని బుధవారం(నవంబర్ 30)న మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారన్నది ఆ ప్రకటన సారాంశం. డిసెంబర్ 21న మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన అని ఎంపీ బాలశౌరి ఎందుకు అన్నారో తనకు తెలియదని నాని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో వారిరువురి మధ్యా పవర్ పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం ఆమోదం లభించిందనే ఆనందంలో బాలశౌరి ఉబ్బితబ్బిబ్బై పోర్టు పనుల ప్రారంభం గురించి తొందరపడిన కోయిలలా ముందే చెప్పేవారంటూ  సెటైర్ వేయడం గమనించదగ్గ అంశం. కొద్ది రోజుల క్రితం మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి పర్యటనను పేర్ని నాని ముఖ్య అనుచరుడైన కార్పొరేటర్ అస్ఘర్ అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇనకుదురుపేటలోని ముస్లిం శ్మశానవాటిక అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్థానికులు కోరడంతో అక్కడికి బాలశౌరి వెళ్లినప్పుడు.. తనకు చెప్పకుండా తన డివిజన్ లో ఎంపీ పర్యటించడం సరికాదని కార్పొరేటర్ అస్ఘర్ అడ్డుకునేందుకు యత్నించారు. బాలశౌరి వెనుదిరిగి వెళ్లిపోవాలంటూ తన అనుచరులను మోహరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్పొరేటర్ అస్ఘర్.. పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఆ ఆందోళన వెనుక పేర్ని నాని హస్తం ఉందని బాలశౌరి వర్గం అప్పట్లోనే విమర్శిలు చేసింది. ఆరోపణలు గుప్పించింది.  ఎంపీ బాలశౌరి కూడా పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి పార్టీ టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో వారానికోసారైనా మాట్లాడకపోతే పేర్ని నానికి నిద్రపట్టదని బాలశౌరి దుమ్మెత్తి పోశారు. సొంత పార్టీ ఎంపీ అయిన తననే మచిలీపట్నం రానివ్వకుండా పేర్ని నాని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు నీ జాగీరా? అని పేర్ని నానిని బాలశౌరి నిలదీశారు. ఇకపై బందరులోనే ఉంటా.. ఎవరేం చేస్తారో చూస్తా, ఎంపీ అంటే ఏంటో తెలిసివచ్చేలా చేస్తా అంటూ బాలశౌరి నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఒకప్పటి ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం బందరులో మ్యూజియం, ఆడిటోరియం నిర్మించేందుకు ఎంపీ బాలశౌరి ప్రయత్నించారు. అయితే.. ఆ రెండు పనులు జరిగితే బాలశౌరికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అనే భయంతో పేర్ని నాని అడ్డుపడ్డారనే ప్రచారం కూడా స్థానికంగా జరుగుతోంది. జగన్ కు పెద్ద పాలేరునని స్వయంగా ప్రకటించుకున్నా తన మంత్రి పదవి ఊడిపోవడానికి కారణం ఎంపీ వల్లభనేని బాలశౌరి అనే డౌట్ పేర్ని నానికి ఉందంటారు. సొంత సామాజికవర్గాన్ని హేళన చేసినా నానికి మంత్రి పదవి నిలబడలేదు. పేర్ని నానిని   సొంత సామాజికవర్గం కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఇలా రెండు విధాలా తనను భ్రష్టుపట్టించింది బాలశౌరి అనే ఆగ్రహం పేర్ని నానికి ఉందంటారు. బాలశౌరికి సీఎం జగన్ తో వ్యాపార భాగస్వామ్యం ఉందని పేర్ని నానికి తెలుసు. అందుకే బహిరంగంగా ఆయనను విమర్శించరు కాని ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ గా బాలశౌరిని బందరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించరు. అసలు బందరులో బాలశౌరి కాలు పెట్టనివ్వకుండా వెనక నుంచి అంతా చక్కబెట్టేస్తుంటారని పార్టీ శ్రేణులే అంటుంటాయి. వచ్చే ఎన్నికల్లో ఎంపీ బాలశౌరి బందరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే పేర్ని నానిని భయం వెంటాడుతోందని, ఆ క్రమంలోనే బాలశౌరికి వ్యతిరేకంగా నాని పావులు కదుపుతూనే.. మరో పక్కన ఎంపీకి వ్యతిరేకంగా స్థానికంగా ఆందోళనలు, ఆరోపణలు, విమర్శలు చేయిస్తున్నారని పార్టీ శ్రేణుల్లోనే ఒక చర్చ అయితే జరుగుతోంది. దాంతో పాటు నియోజకవర్గంలోని మొత్తం తన సొంత సామాజికవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారని, అది బాలశౌరికి నచ్చడం లేదని చెబుతున్నారు. మొత్తానికి పేర్ని నాని, బాలశౌరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, ఒకరు నంది అంటే ఇంకొకరు పంది అంటారనేది బందరులో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యంగా మారింది. ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే సామాజికవర్గానికి చెందినా.. పేర్ని నాని- వల్లభనేని బాలశౌరి మధ్య ఇంతలా వైరం కొనసాగుతుండడం గమనించదగ్గ విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.