కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు..లోకేష్
posted on Dec 1, 2022 @ 10:23PM
వైసీపీ నేతల బెదరింపులు, హెచ్చరికలు, విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో తెలుగుదేశం దూకుడు పెంచింది. ఇప్పటి వరకూ చిన్న పాటి విమర్శకు కూడా వైసీపీ నేతలు రెచ్చిపోయి బూతుల పంచాంగంతో విరుచుకుపడి ఎదురుదాడికి దిగేవారు. అయితే గత కొన్ని రోజుల నుంచీ సీన్ మారిపోయింది. వైసీపీ నేతల విమర్శలపై తెలుగుదేశం నాయకులు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. భాష మర్యాద దాటకుండానే పంచ్ లతో, సెటైర్లతో దుమ్ము దులిపేస్తున్నారు.
ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై చేసిన వ్యాఖ్యలకు తాజాగా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఓ ఎమ్మెల్యే అన్నో, తమ్ముడో నన్ను చంపేస్తాడంట..కానీ మేం కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు అని అన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటంలో రాజీ ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. బెదిరింపులకు, కేసులకు భయపడే బెదిరింపులకు, కేసులకు మేం పారిపోయే రకం కాదు జగన్ రెడ్డీ.. నేను నీలాగా కాదు అంటూ లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై జగన్ సర్కార్ హత్యాయత్నం, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ సహా 15 కేసులు పెట్టిందన్నారు. మేం సవాల్ చేస్తే నోరెత్తని వైసీపీ నేతలు చంపేస్తామంటూ బెదరించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.